Pages

Friday 12 November 2010

కాస్త ఆలోచించరూ..? ప్లీజ్..!!

రోజూ నడిచే దారే అయినా ఏదో తేడాగా, చాలా అసౌకర్యంగా, దిగాలుగా ఉంది. నాకే అర్థం కావడం లేదు. ఎందుకలా ఉందో, ఆలోచించేందుకు నేను మరోలా ఉండాల్సి వచ్చింది. అయినా ఫర్వాలేదు, దీన్నేదో చేధించాల్సిందే అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను.

ఇంతలో కాలికి చల్లగా తగిలింది. హమ్మయ్య... గుర్తొచ్చేసింది, గుర్తొచ్చేసింది. ఇందాకటి నా అసౌకర్యానికి, దిగులుకు కారణమేంటో కనిపెట్టేశాను. దీన్ని కనిపెట్టేందుకు కుస్తీలేం పడలేదండీ... బురదలో నా కాళ్లు కూరుకుపోయేసరికి బాగా గుర్తొచ్చేసింది. వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండటం, రోడ్లన్నీ బురద శోభను సంతరించుకోవటమే ఇందాకటి దిగులు వెనుకనున్న ఓ గొప్ప కారణం.

అబ్బా... వర్షం, బురద గురించి ఈమె ఇంతగా బాధపడాలా... అనుకుంటున్నారు కదూ... నాకు తెలుసు. మీకేంటండీ ఎలాగైనా అనుకుంటారు. బాధలు పడుతుండేది మేమే కదా..! అసలే వర్షాలు పడక, నీటి కొరతతో నానా అవస్థలు పడుతుంటే... వర్షం వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా...? అంటూ తీసిపారేయకండి.

 అక్కడే ఉంది అసలు విషయమంతా... వర్షం వస్తే.. సంతోషపడనివారు ఎవరుంటారు చెప్పండి. నాకు కూడా వర్షం అంటే చాలా ఇష్టం... కానీ ఈ వర్షంలో, చాంతాడులా నిలిచిపోయిన ట్రాఫిక్‌లో ఆఫీసుకు వెళ్ళటమంటేనే కష్టం. ఈ గండాలను ఎలాగోలా దాటుకుని ఆఫీసుకు చేరుకునేటప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోయే వాహనదారులంటేనే పరమ చిరాకు.

వాళ్ల మానాన వాళ్లు వెళ్ళిపోతే.. మీకొచ్చిన కష్టమేంటి అంటారేమో... వాళ్లు అలా వెళ్తే నాకు మాత్రం చిరాకెందుకు వస్తుంది చెప్పండి. కానీ అలా జరగలేదే... ఈరోజు ఉదయం టైమయిపోయిందని, అసలే హడావిడిగా ఆఫీసుకు బయల్దేరి నడుస్తుంటే... పక్కగా ఓ వాహనం వెళ్లింది. రోడ్డునిండా నీళ్లే... కాస్తంత నెమ్మదిగా వెళ్తే వాళ్ల సొమ్మేం పోతుంది. ఒక్కసారిగా వేగంగా రావడం, నీళ్లన్నీ నాపైన పడటం జరిగిపోయింది.

అలాంటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. నా అదృష్టం కొద్దీ ఆ నీళ్లలో బురద అంతగా లేకపోవడం వల్ల కాసేపటికి ఎలాగోలా డ్రస్సు ఆరిపోయింది. అదే బురదనీళ్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అనుభవం నా ఒక్కదానికి మాత్రమే కాదు, మీలో చాలామందికి కలిగే ఉంటుందని అనుకుంటున్నాను.

వర్షాలప్పుడు నీళ్లలో వాహనాలను నడపటం వల్ల వచ్చే చిక్కులు కొన్నయితే... బస్సులో వెళ్తూ, వెళ్తూ రోడ్డుకు అటూ ఇటూ వెళ్లేవారిని పట్టించుకోకుండా, బస్సుల్లోంచి ఉమ్మటం లాంటివి మరికొన్ని.

ఈ మధ్యే నేనో పేపర్లో చదివానండి. పాపం ఓ కొత్త దంపతులు, కొత్త బట్టలు కట్టుకుని పవిత్రంగా గుడికెళ్లి అర్చన చేయించుకుని బైక్‌లో వస్తోంటే... బస్సులోంచి పాన్ పరాగ్ వేసుకున్న వ్యక్తి ఎవరో తుపుక్కున ఉమ్మేశాడట. పాపం నోట్లో ఎంత సేపటి నుండి ఉమ్మి ఉంచుకున్నాడో ఆ మహానుభావుడు... గాలిలో తేలుతూ ఉమ్మి పక్కనే ఉన్న ఆ కొత్త దంపతులను పావనం చేసేసిందట.

మీ జీవితంలో మరిచిపోలేని అనుభవాలను మాతో పంచుకోండి అనే శీర్షికలో ఆ కొత్త దంపతులు రాసిన పై విషయాన్ని చదవగానే నాకు చాలా బాధేసింది. పవిత్రంగా గుడికెళ్లి వస్తోన్న మాకు కాసేపట్లోనే ఆ పవిత్రత దూరమై, ఆ స్థానంలో ఉమ్మినవాడిపై అసహ్యం పుట్టుకొచ్చిందని రాశారు వారు.

వర్షాలప్పుడు వాహనాలు ఎగజిమ్మిన నీటితో పావనమైనవారు కొందరైతే, పైన చెప్పుకున్నట్లుగా బస్సుల్లోంచి ఉమ్మి పడి పావనమైనవారు మరికొందరు... ఇలా ఎందరో ఉన్నారు... కాబట్టి...

ప్రియమైన వాహనదారుల్లారా...! పాన్‌పరాగ్ లాంటివి ఉమ్మివేసే ప్రబుద్ధుల్లారా...! కాసేపు ఆలోచించండి. వేగంగా వెళ్తున్న మీరు కాసేపు మెల్లగా బండిని నడపటం వల్ల మీకొచ్చిన నష్టమేమీ లేదు. అలాగే పాన్‌పరాగ్ మహానుభావుల్లారా... కాస్త అటూ, ఇటూగా చూసి, ఎవరూ లేనప్పుడు ఉమ్మడం వల్ల మీకు కూడా నష్టం లేదు. మీరు ఇలా చేయడం వల్ల మాలాంటి వారికి వచ్చే నష్టాలు ఏమీ ఉండవు. అప్పుడందరం హ్యాపీగా ఉండొచ్చు. "అందరం హ్యాపీగా ఉన్నప్పుడే... ఆల్ హ్యాపీస్..." ఏమంటారు...?