Pages

Friday 14 September 2012

ఇంతకీ నేనెవర్ని...??!!


పెద్దసైజు గోళీకాయల్లాంటి
కళ్లను అలా ఇలా తిప్పుతూ
జ్ఞాపకాల లోకానికి తీసుకెళ్తూ
నిన్ను నువ్వు మర్చి
నవ్వుతున్నావా, పలవరిస్తున్నావా
తెలీని నీ స్థితిని చూస్తే..
స్వచ్ఛమైన సెలయేరు
పరవళ్లు తొక్కుతున్నట్లనిపించేది

యేటి చెలిమలా, నీ జ్ఞాపకాల చెలిమలో
ఎన్నెన్ని తీపి ఊసులో, అనుభూతులో......

బాల్యం వాకిట్లో నువ్వు తచ్చాడుతుంటే
పసితనాన్నై పలుకరించా
మధురోహల యవ్వన విహారానికెళ్తే
సిగ్గులమొగ్గనై చిలిపిగా నవ్వా
మొగ్గలోనే చితికిన తొలిప్రేమ
కన్నీరై ప్రవహిస్తుంటే
ఓదార్పు ఆనకట్టనయ్యా...

తీపి ఊసులన్నీ ఉక్కిరిబిక్కిరిచేస్తే
ఆనందమై అక్కున చేర్చుకున్నా
జ్ఞాపకాల చెలిమ భారంగా నిండితే
ఒరిగిపోకుండా ఒంపుగా పట్టుకున్నా...
మనసు గాయాలు మళ్లీ రేపుతుంటే
మందునై మాన్పుతూ వచ్చా
కల్లోలపరిచే కాలం చీకట్టు కమ్ముకుంటే
వెలుగు దివ్యనై కాంతిని పంచా...

జీవితం ప్రతిదశలోనూ...
నీ వెంట నీడనై.. నేనే నువ్వై సాగుతుంటే

ఓ రోజున హఠాత్తుగా... నువ్వడిగిన ప్రశ్న....
"నువ్వెవరు అని"......?
పెద్ద చిక్కుప్రశ్నే వేశావు
అవును నేనెవర్ని....?

నేనెవర్నో, నీకు ఏమవుతానో...
పూర్తిగా మర్చిపోయా...
అంతా నువ్వే అయిన మనఃస్థితిలో
నన్ను నేనే మర్చిపోయిన దీనస్థితి అది

ఇంతకీ నేనెవర్ని...?
నువ్వు మాత్రం నేను కాను
నేను మాత్రం ముమ్మాటికీ నువ్వే....!
నేనున్నంతదాకా... నా ఊపిరి ఆగేంతదాకా.....!!

Monday 10 September 2012

జ్ఞాపకాల జడివాన జోరు తగ్గేదెలా.....!!



నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన...

చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన...

చూపులు, చేతులు కలిసి
ఒకటి రెండో భుజానికి ఆసరాగా
ఇరు మనసుల కలబోతలో
అంతేలేని మాటల జల్లులై కురిసేవేళ
ముసిముసి నవ్వుల ప్రేమవాన...

ప్రేమబంధం మాంగల్య బంధమై
మరుజన్మ ఎత్తితే
ఏకాంతపు లోగిలిలో
అనురాగపు ఆనందాల వెల్లువలో
సిగ్గుల మొగ్గ సింధూరపు వాన...

ముద్దు ముద్దు మాటలు
మురిపాల మూటలై
అమ్మానాన్నలని చేసిన
బుడి బుడి అడుగుల చప్పుడు
చిటపట చినుకుల నాట్యమైనప్పుడు
గుండెనిండా వాత్సల్యపు వాన...

రెక్కలొచ్చి ఎగురనేర్చి
గూడును, కన్నవారినొదిలి
కాలమనే కారుమబ్బులై
తుఫానులా తీరం చేర్చితే
జీవితపు మలిసంధ్య వాన...

మది గదిలో వాన...
చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది
వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...

Thursday 6 September 2012

ప్రేమ మేఘం వర్షించిందిలా..!!!



బాగా చిన్నప్పుడనుకుంటా
ఏదో కావాలని మారాం చేసేస్తుంటే
ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడాయన
అయినా వింటేగా..
అంతే.. లాగి చెంపపై ఒకటిచ్చుకున్నాడు

ఎప్పుడూ భుజంపై ఎక్కించుకుని
ఊరంతా తిప్పుతుండే ఆ వ్యక్తికి
ఆ రోజునుంచీ మనసు మనసులో లేదు
రాత్రీ పగలూ ఒకటే ఏడుపు
ఆ పసిదానిపైనా నా ప్రతాపం
తనలో తాను తిట్టుకోని, గొణుక్కోని రోజులేదు
ముద్ద ముడితే ఒట్టు

తనను ఎత్తుకుని ఆడించే ఆ మనిషి
ఇలా కొడతాడని ఊహించని ఆ పసిమనసు
చెంపమీద వేళ్లగుర్తులు అచ్చుగుద్దినట్టు
ఆ రోజునుంచీ అతడి దగ్గరికెళితే ఒట్టు
మామూలుగా అయితే...
చూడగానే మీదికెక్కే ఆ పసిది
ఆ మనిషిని చూస్తేనే జడుసుకునేది

వారిద్దరి సయోధ్యకు చాన్నాళ్లే పట్టింది
ఓ రోజున జాగ్రత్తగా దగ్గరికి తీసుకుని
తినేందుకు ఒడినిండా కొనిచ్చి
ముద్దులాడుతూ క్షమించమన్నాడు
ఏమనుకుందో ఏమో
క్షమించేసింది, ఇకపై ఇలా చేయకని
ముద్దుతో మరీ వార్నింగ్ ఇచ్చేసింది...

తాత మనవరాళ్ల ఫైటింగ్ ఇలా సమాప్తం.....

మళ్లీ చాన్నాళ్ల తరువాత
ఎందుకోగానీ అదే చెంపపై
మళ్లీ వేళ్ల గుర్తులు అచ్చుగుద్దినట్లు
అయితే ఈసారి తాతవి కావు, నాన్నవి...
ఆ పసిది ఇప్పుడు యుక్తవయసు అమ్మాయి

చిన్నప్పుడు తాతపై ప్రకటించిన యుద్దమే
ఇప్పుడు నాన్నపై....
నాన్న పరిస్థితీ తాత పరిస్థితికంటే దారుణం
అయ్యో నా తల్లిని ఇలా కొట్టేశానేంటి
ఏడ్వని రోజు లేదు...
ముద్ద ముడితే ఒట్టు...
అర్థం చేసుకుందో ఏమో
తాతలాగే నాన్ననీ ముద్దుతో క్షమించలేదు
మౌనంగా, కళ్లతో క్షమించేసింది

అదే పెళ్లై అత్తారింటికెళ్లాక...
రోజూ చెంపపై
మొగుడి ప్రేమ ముద్రలు 
కాదు కాదు
చేతి వేళ్ల ముద్రలను
మౌనంగా భరించటం నేర్చుకుంది
అయినా ఎంతకాలం అలా...?

చిన్న దెబ్బకే అల్లాడిపోయిన
తాత, తండ్రుల్లాగా
ఇక్కడ ప్రేమ పంచడానికి
బుజ్జగించడానికి ఎవరూ
లేరన్న సత్యం మెల్లిగా బోధపడిందే ఏమో
మానసిక, శారీరక గాయాలకు
మందు ఇక్కడ లేదనుకుందో ఏమో
ఓ రోజు పుట్టిల్లు చేరుకుంది

బ్రతికినంతకాలం నీ కూతురుగా
ఇక్కడే ఉంటా...
ఇంత తిండి పెట్టండి చాలని
బ్రతిమాలింది ఆ తండ్రిని
కన్నీటి వరదై కరిగిపోయాడా తండ్రి
కానీ... లోకం నోటికి భయపడి
చావైనా, బ్రతుకైనా కట్టుకున్నోడితోనే
ఇక్కడొద్దని బయల్దేరదీశాడు

మెట్టినింట్లో కూతురిని అప్పజెపుతూ
అల్లుడి మాటలు నమ్మి
ఆమెకు బుద్ధిమాటలు చెప్పాడు
బంగారు తల్లిని బలి ఇస్తున్నాడని
ఆయనకు తెలియదాయె..
చావైనా, బ్రతుకైనా ఇక్కడేనా
మరి బ్రతుకుతూ చావటమెందుకైతే
అందుకే ఓరోజున ఆమె నావ తీరం చేరింది
తాత, తండ్రులపై గర్జించిన ప్రేమ మేఘం
చివరికలా వర్షించింది....

(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో సామాన్యగారు రాసిన "మహిత" కథ చదివాక (నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలూ కాసిన్ని గుర్తుకురాగా) బాధను ఎలా వ్యక్తపరచాలో తెలీక ఇలా...!!)