Pages

Tuesday 5 March 2013

వందో టపా.... "నాన్న"కి....!!



ఎప్పుడు ఏం రాసినా...
ఆ అక్షరాలన్నీ ప్రేమగా
నీ చేతి స్పర్శలాగే
నువు ప్రేమగా తలనిమిరినట్లే
తడుముతుంటాయి

ఎప్పుడు ఎటు చూసినా...
ప్రతి దిక్కులోనా పలుకరించే
నీ నవ్వులాగే
నువు ఏనుగు అంబారీ ఎక్కించినట్లే
కళ్లు నిండుతుంటాయి

ఎప్పుడు ఏం చేసినా...
ప్రతి పనిలోనూ తోడునిలిచే
నీ వాత్సల్యంలాగే
నీ భుజంపై ఎక్కి కూర్చున్నట్లే
జ్ఞాపకాలు పులుముకుంటాయి

ఎప్పుడు ఏం తింటున్నా...
ప్రేమనంతా ముద్దలుచేసిచ్చే
నీ మమకారంలాగే
నువు తెచ్చిచ్చే అప్పచ్చుల్లాగే
కడుపు నింపుతుంటాయి

ఎప్పుడు నిదరోయినా
'అమ్మణ్ణీ' అనే నీ పిలుపులాగే
గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే
నీ ఆప్యాయతా పాటలాగే
చల్లని నీ ఒడిలో సేదదీర్చే
లాలిపాటలాగే
నీ బొజ్జపై అమాయకంగా బజ్జున్న
రోజుల్లాగే
జోల పాడుతుంటాయి...

[పుట్టినప్పటినుంచీ ప్రతి క్షణం తోడునీడగా, పెద్ద ఆసరాగా నిల్చిన నాన్న ఇవ్వాళ భౌతికంగా లేకపోయినా... నా ప్రతి పనిలోనూ మానసికంగా ఎప్పుడూ తోడుగా ఉంటున్నారు. నా వందో పోస్టును ఆయన అంకితం చేయటం అనేది ఈ లోకంలో నాకు లభించే గొప్ప గౌరవం.

నిజం చెప్పాలంటే ఇన్ని పోస్టులు రాస్తానని, రాయగలనని అనుకోలేదు. ఏం రాసినా చదివి, వెన్నుతట్టి, విమర్శించి, ప్రోత్సహించిన పాఠక దేవుళ్లందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు... ఇలాగే కలకాలం ఆదరిస్తారని ఆశిస్తూ... మీ కారుణ్య]