Pages

Thursday 15 September 2011

అవిసె పువ్వుల వేపుడు ఎప్పుడైనా తిన్నారా..?

 

కావలసిన పదార్థాలు :
అవిసె పువ్వులు... పావుకేజీ
ఉల్లిపాయలు.. మీడియం సైజువి రెండు
పచ్చిమిర్చి... రెండు
కరివేపాకు... సరిపడా
కొత్తిమీర... తగినంత
వేయించిన వేరుశెనగ గింజలు... వంద గ్రాములు
వెల్లుల్లి.. కాసిన్ని
కారంపొడి... ఒక టీస్పూన్
ధనియాలపొడి... ఒక టీస్పూన్
నూనె... తగినంత
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి... పోపుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా అవిసె పువ్వులను తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని మూడు లేదా నాలుగు ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయలను నిలువుగా సన్నంగా తరగాలి. పచ్చిమిర్చిని నిలువుగా కోయాలి.

వేయించిన వేరుశెనగ గింజలకు, కాస్తంత ఉప్పు, పసుపు, కారంపొడి, ధనియాలపొడి కలిపి మెత్తగా పొడి కొట్టాలి. చివర్లో వెల్లుల్లి పాయలను కూడా వేసి తిప్పాలి. ఈ పొడిని తీసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు బాణలిపెట్టి అందులో తగినంత నూనె పోసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి. నచ్చినవాళ్లు కాస్తంత మినప్పప్పును కూడా పోపులో వేసుకోవచ్చు. కాసేపటి తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి మరి కాసేపు వేయించాలి. అందులోనే కాస్త పసుపును కూడా చేర్చాలి.

ఇప్పుడు తరిగి ఉంచుకున్న అవిసె పువ్వులను వేసి కలియదిప్పి ఆవిరిపై ఉడికించాలి. పువ్వులు కాసేపటికే మగ్గిపోతాయి. తరువాత పొడి కొట్టి ఉంచుకున్న వేరుశెనగ గింజల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలియదిప్పి, ఉప్పు సరిజూసి మరికాసేపు సిమ్‌లోనే ఉడికించాలి. ఉడికింది అనిపించగానే దించేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అవిసె పువ్వుల వేపుడు రెడీ.

దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్బ్‌గా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!

(మా అమ్మమ్మ, తాతయ్య గురించి రాసిన పోస్టులో అమ్మమ్మ చేసే అవిసె పువ్వుల వేపుడు భలే ఇష్టం అని రాశాను. దాన్ని చదివిన శైలూ (http://kallurisailabala.blogspot.com/) ఎలా చేస్తారో చెప్పమని అడిగింది. అంతేకాదు, ఎలా చేయాలో రాసి బ్లాగులో పోస్ట్ చేస్తే దాన్ని చూసి నేనూ ఎంచక్కా చేసేస్తాను అంది. నేను తొలిసారిగా నా బ్లాగులో వంటల గురించి రాశాను. ప్రేమతో రాసిన ఈ తొలి పోస్టు, మళ్లీ ఇంకా ఏవైనా రాస్తే అవి కూడా శైలూకే అంకితం..... )