Pages

Monday 23 December 2013

"నాన్న" కూతురు "శైలూ"కి హ్యాపీ బర్త్ డే.. !!


"వెన్నెల్లో గోదావరి" బ్లాగర్.. నా చెల్లాయి శైలబాలకి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

శైలూ.. నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరి ఎప్పడూ సంతోషంగా ఉండాలి...  




Friday 20 December 2013

మా బంగారుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. !!



నువ్వు ఎక్కడ ఉన్నా
ఎంత దూరంలో ఉన్నా
ఎంత పెద్దోడివి అయినా
తండ్రివయినా
తాతవు అయినా
ముత్తాతవు అయినా

ఎప్పుడూ నా బుజ్జి పాపాయివే
నా హీరోవే.. నా సూపర్‌స్టార్ వే...

పుట్టిన రోజు శుభాకాంక్షలు "చిన్నా"

నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి.

నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరి..
ఎప్పుడూ సుఖ సంతోషాలతో
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
విలసిల్లాలని దీవిస్తూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే... 


Wednesday 11 December 2013

అప్పుడు కుట్టీ... ఇప్పుడు జెస్సీ...!!



కుట్టీ అంటే... మేం పోగొట్టుకున్న బుజ్జి కుక్కపిల్ల అని నా బ్లాగ్ మిత్రులందరికీ తెలిసిందే. మరి ఈ కుట్టీ ఎవరని అనుకుంటున్నారా.. వచ్చేస్తున్నా అక్కడికే.

కుట్టీ జ్ఞాపకాలతో (కుట్టీ జ్ఞాపకాల్ని ఇక్కడ చూడండి) ఇక ఆ ఇంట్లో ఉండలేక.. కొన్నాళ్ల తరువాత పక్క వీధిలోని ఇంకో ఇంట్లోకి మారిపోయాం. ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్ వాళ్లు ఓవైపు, మేం మరోవైపు ఉండేవాళ్లం. బాల్కనీ మాత్రం ఇద్దరం ఉమ్మడిగా వాడుకునేవాళ్లం. తమిళం అంతంత మాత్రమే కాబట్టి.. ఓనర్ వాళ్లతో కాస్త దూరంగానే ఉండేదాన్ని. కానీ పాపం వాళ్లే ఆప్యాయంగా పలుకరించేవాళ్లు. మెల్లిగా వాళ్లతో స్నేహం మొదలైంది. నాకేం తెలుసు ఆ స్నేహం ఇంకో ఎడబాటుకు చేరువ అవుతోందని.

ఇంటి ఓనర్‌ మురుగేశన్ మేస్త్రీ. ఆయనకి ముగ్గురు పిల్లలు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుక్కి, పెద్ద కూతురికి పెళ్లిళ్లయ్యాయి. చిన్నమ్మాయి చదువుమానేసి ఇంట్లోనే ఉంటోంది. పెద్దమ్మాయి పేరు సరస్వతి. అందరూ సరసూ అనేవాళ్లు. చిన్నమ్మాయి విజయ... విజ్జీ. ఓనర్ కొడుకు బిడ్డ ప్రేమ్‌ని తమతోనే ఉంచుకుని చదివిస్తున్నారు.

సరసు నాకంటే పెద్దది కాబట్టి సరసక్క అనేదాన్ని. ఓనర్ దంపతుల్ని అమ్మా, అప్పా అని పిలిచేదాన్ని. విజ్జీని పేరుతోనే పిలిచేదాన్ని. కొన్నాళ్లకి వాళ్ల ఇంట్లో మనుషులుగా అందరికీ చేరువయ్యాం. ఎంతగా అంటే వాళ్ల బంధువులే కుళ్లుకునేంతగా.

నిజ్జంగా తమిళం ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే, అంతో ఇంతో చదవగలుగుతున్నానంటే.. ఇది వీళ్ల చలవే. తమిళం తప్పు తప్పుగా మాట్లాడుతుంటే వాళ్లు నవ్వుకుంటూ సరిదిద్దేవాళ్లు. ఆ ప్రేమ్ గాడైతే నన్ను ఎంతలా ఏడిపించేవాడో. కానీ పాపం వాడే నాకు అక్షరాలు నేర్పించాడు. ఒక్కోసారి వాళ్లు నవ్వుతుంటే ఉక్రోషంగా ఉండేది. ఆ ఉక్రోషంతోనే తమిళం బాగా నేర్చుకుని వాళ్లతో గడగడా మాట్లాడేయాలనే పట్టుదల కూడా వచ్చేసేది.

కాస్త తమాయించుకుని మళ్లీ నవ్వుతూ ఏదో మాట్లాడబోయి, మరేదో మాట్లాడి వాళ్ల ఇంట్లో నవ్వులు పూయించేదాన్ననుకోండి. కానీ నాకు లోలోపల వాళ్లు నాతో ఎంతగా ఆడేసుకుంటున్నారో చూడు అని ఏడుపొచ్చేది. అంతకంతకూ పట్టుదల పెరిగిపోయింది. ఎలాగైనా సరే నేర్చేసుకోవాలి అని.

తమిళం పిచ్చి ఎంతలా ముదిరిపోయిందంటే... ఎవరైనా తిట్టుకుంటుంటే, గొడవలు పడుతుంటే.. చాలా ఆసక్తిగా గమనించటం.. ఏం పదాలు వాడుతున్నారో నోట్ చేసుకోవడం.. తీరిగ్గా ఓనరమ్మ (అమ్మ) దగ్గర చేరిపోయి ఒక్కోటి ఆరాతీస్తూ అర్థాలు కనుక్కోవడం.. ఆమె నన్ను ఆటపట్టిస్తూనే తెలీని పదాలకి అర్థం చెప్పేది. అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే యాక్షన్ చేసి చూపించటమో, టీవీలో వస్తున్న సందర్భాల్ని చూపించటమో చేసేది.

కానీ అమ్మ దగ్గర నాకు అప్పుడు, ఇప్పుడూ నచ్చని ఒకే ఒక పదం.. నా పేరు. శోభ ఎంత అందమైన పేరు.. ఈ పేరుతో పిలవటం మీకు ఇష్టం లేదా అంటారేమో.. అలా పిలిస్తే నాకంటే సంతోషించేవాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా ఎప్పుడూ పిలవనే పిలవదు. నా పేరును ఎప్పటికప్పుడు ఖూనీ చేసేస్తూ... "సోఫా" అంటుంది. నన్ను పిలుస్తుందో సోఫాలో కూర్చోమంటోందో అర్థమయ్యేది కాదు నాకు. పిలుస్తోంటే పలకవేంటే అని తిట్టేది చాలాసార్లు.. అమ్మా నా పేరు సోఫా కాదు.. శోభ... అంటే ఆ.. అదుదా అనేది.

విషయం ఏంటంటే... తమిళంలో ప, ఫ, బ, భ... ఈ నాలుగు అక్షరాలకుగానూ ఒకే అక్షరం ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆ అక్షరాన్ని వాడుతుంటారు.. అలా నా అందమైన పేరు ఇలా ఖూనీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా సోఫా అంటే చాలు.. నాకు తెలీకుండా నేను పలికేస్తుంటాను చాలాసార్లు... తల్చుకుంటే నవ్వొస్తుంది.

ఆ కుటుంబంతో కలిసి ఉన్నన్ని రోజులు చెన్నై నగరం మొత్తం ఓ చుట్టు చుట్టేశానంటే నమ్మండి. గుళ్లు, గోపురాలు, చూడాల్సిన ప్రదేశాలు అన్నీ ఎడాపెడా తిరిగేశాను వాళ్లతో. మా ఆయన వీటన్నింటికీ దూరం సుమండీ. నేను మాత్రం ఆయన వచ్చినా, రాకపోయినా అమ్మావాళ్లతో కలిసి ఎగిరిపోయేదాన్ని.

అన్నట్టు చెప్పనేలేదు కదూ.. సరసు అక్క పుట్టింట్లోనే ఉంటోంది. తను గర్భవతి. కాన్పుకి రాలేదు తను.. భర్తతో ఏదో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. కొన్నాళ్లకి పండంటి బాబు పుట్టాడు తనకి. అప్పటిదాకా తమిళం నేర్చుకోవడం.. సిటీ మొత్తం తిరగడం నా వ్యాపకాలు. ఇక బాబుగాడు పుట్టాక ఇక వాడే లోకం. ఏ మాత్రం టైం దొరికినా వాడి దగ్గరే.

చిన్నచిన్ని చేతులు, కాళ్లు తాకుతూ... వాడి ప్రతి కదలికనూ ఆస్వాదిస్తూ ఎప్పుడూ వాడితోనే. ఎందుకో వాడిని చూస్తే నాకు కుట్టీ గుర్తొచ్చేది. అలా నాకు తెలీకుండానే నా మనసులో వాడికి "కుట్టీ" పేరును పెట్టుకున్నాను. వాడు కాస్త పెద్దయ్యాక ఆ పేరుతోనే పిలిచేదాన్ని.

వాడు పుట్టినా కూడా సరసు అక్క భర్త రాలేదు. ఆమె ఎప్పుడూ ఆ దిగులుతోనే పిల్లాడిని సరిగా పట్టించుకునేది కాదు. నాకా వేరే వ్యాపకం అంటూ ఏం లేదు వాడిని చూసుకోవడం తప్ప. అలా లేచింది మొదలు నిద్రపోయేదాకా వాడే లోకం. కుట్టీ అమ్మా, నాన్న ఎవరు అంటే మమ్మల్ని చూపించేవాళ్లు వీధిలో అందరూ. సరసు అక్క దగ్గర కంటే మా దగ్గర ఉండటమే వాడికి ఇష్టం.

ముఖ్యంగా మా ఆయన బొజ్జమీద పడుకోవడం వాడికి ఎంత ఇష్టమో. లెక్కలేనన్ని రోజులు వాడు అలా నిద్రపోయేవాడు. వాడు చేసే అల్లరిని భరించలేక ఒక్కోసారి ఏమైనా అంటే మా ఆయన నామీద ఇంతెత్తున లేచేవారు. అలా ఎన్నిసార్లు వాళ్లిద్దరూ ఒక పార్టీ అయిపోయేవారో... అయినా ఆ పార్టీ ఓట్లన్నీ ఎప్పటికీ నాకే కదా అనే ధీమాతో అస్సలు లెక్కపెడితే కదా నేను.

ఒకసారి వాడికి విరేచనాలు పట్టుకున్నాయి. ఎంతకీ తగ్గడం లేదు. ఆస్పత్రిలో వాడితోనే ఉండిపోయి బాగైన తరువాతే ఇంటికి వచ్చాం. అప్పటి మా ఆదుర్దా చూసి అమ్మావాళ్లు ఎంతగా ఫీలయ్యారో.. పిల్లాడంటే ఎంత ప్రేమ మీకు.. త్వరలో మీక్కూడా బోలెడుమంది పిల్లలు పుడతారులే సోఫా.. అంటూ అమ్మ తలనిమురుతూ ఉండిపోయింది.

వాడితో చాలా చాలా జ్ఞాపకాలు.. సరసు అక్కకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకని వాడికి వాళ్ల అన్న కూతురి గౌన్ వేసి నా దగ్గరికి పంపింది. నేను ఎంత సంబరపడిపోయానంటే.. ఉన్నఫళంగా ఫొటో స్టుడియోకి పరిగెత్తి వాడితో ఫొటో తీయించుకున్నాను. ఇప్పటికీ ఆ ఫొటో భద్రంగా ఉంది.. ఉందని అనుకున్నానుగానీ.. ఈ మధ్య కనిపించకుండా పోయింది. తల్చుకుంటే ఎంత ఏడుపు వస్తుందో.

రోజు రోజుకీ వాడితో విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. అలాగే ఉండనిస్తే కాలం గొప్పదనం ఏముంటుంది. అందుకే అది మరో ఎడబాటును మాకు రుచి చూపించింది.

ఇన్నాళ్లూ సరసు అక్కకి దూరంగా ఉన్న తన భర్త.. రాజీపడి రాకపోకలు సాగించాడు. కొన్నాళ్లు గడిచాక ఇక మనింటికి వెళ్దాం పదా అంటూ అక్కని బయల్దేరదీశాడు. ఇంట్లోవాళ్లు సరేనన్నారు. సరసు అక్క భర్తది పల్లెటూరు. చెన్నై నుంచి చాలా దూరంలో ఉంటుంది. ఒకరోజంతా ప్రయాణం చేయాలని చెబుతుండేవాళ్లు.

అమ్మ, సరసు అక్క ఒకరోజు నన్ను పిలిచి.. కుట్టీ ఇక వాళ్ల ఊరు వెళ్లిపోతున్నాడు.. సోఫా ఎలా ఉంటావో ఏంటో అని బాధపడ్డారు. నాకైతే నోట మాట రాలేదు. అంటే కుట్టీ ఇక ఇక్కడ ఉండడా అని ఏడుపు తన్నుకొస్తోంది. తమాయించుకుని వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నా.

ఏం చేయను సోఫా... ఎన్నాళ్లని పుట్టింట్లో ఉండను. ఎలాంటివాడైనా కానీ భర్తతో కలిసి ఉండటమే కదా నాకూ, అమ్మావాళ్లకు మంచిది అంది సరసక్క నా బాధని చూసి. బాధపడకు.. అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటుందిలే అని అమ్మ ఓదార్చింది.

వాడు రేపు ఊరెళ్తాడనంగా.. ముందు రోజు రాత్రి చూడాలి మా బాధ. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను నేను. మా ఆయన గుండెలమీద నిద్రపోతుండే వాడే గుర్తొచ్చేవాడు. ఆయనకి చాలా బాధగా ఉంది.. కానీ మౌనంగా ఉన్నాడు. నేను మాత్రం కంట్రోల్ చేసుకోలేక పోయాను.

వాడికేం తెలుసు.. హాయిగా నవ్వుతూ ఎప్పట్లా పరుగెత్తుకొస్తున్నాడు మా దగ్గరికి. వాళ్ల నాన్న దగ్గరికి అస్సలు పోతే కదా. అతను బలవంతంగా ఎత్తుకునేసరికి ఏడుపు అందుకున్నాడు. పిల్లాడిని ఏడిపిస్తూ తీసుకెళ్లటం ఎందుకు అనుకున్నాడో ఏంటో.. మళ్లీ మా దగ్గరికే ఇచ్చాడు. కాసేపు ఆడించి, సముదాయించి.. టాటా వెళ్తున్నారని చెప్పగానే వాడు సంతోషంతో వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లాడు.

చేతులు ఊపుతూ.. నవ్వుతూ వాళ్లూరికి వెళ్లిపోయాడు. తరువాత ఏవో పండగలు, పబ్బాలకి ఎప్పుడోగానీ వచ్చేవాళ్లు కాదు.

వాడు ఊరెళ్లిన తరువాత.. మేం ఇంట్లో ఉన్నామో, లేమో తెలీనంత మౌనంగా ఉండిపోయాం. వాడు గుర్తొస్తే ఏడ్చుకోవడం... బాధపడటం మినహా... ఒక్కోసారి మాపైన మాకే కోపం.. ఎవరికీ దగ్గర కాకూడదని.

"కుట్టీ" ఈ పేరుకి నాకూ చాలా దూరమేమో... ఆ విషయం తెలీక మళ్లీ వాడికి కుట్టీ అని పేరు పెట్టుకున్నాను. పేరు పెట్టుకున్నందుకో.. మరెందుకో... నాకు వాడు కూడా మిగలలేదు.. వాడి జ్ఞాపకాలు తప్ప.

అంతే ఇక ఆ ఇంట్లో ఉండలేకపోయాం... కాలం తన్నిన బంతిలా మళ్లీ ఇంకో మూలకి పడ్డాం.

కాలం అలా దొర్లిపోతోంది... మేమూ చెన్నె మూల మూలలకి దొర్లుకుంటూ వెళ్తూనే ఉన్నాం.. అలా ఓ మూలలో ఇప్పుడు...

కాలం గాయాలతో బండబారిపోయి.. అస్సలు ఎవ్వరినీ దగ్గరకి రానీయకుండా ఉండాలని బలంగా అనుకుంటూ... దగ్గర చేర్చుకోకుండా ఉండలేని బలహీనతతో మళ్లీ మళ్లీ కొన్ని బంధాలకి లోబడి పోవాల్సి వచ్చేది. అలా మావాడు "పిన్నీ, బాబాయ్" అంటూ మా జీవితాల్లోకి  చేరువయ్యాడు. ఈ బంధం బలహీనం అవకూడదనే ఆశతో బ్రతికేస్తున్నాం.. కానీ విధి వింత ఆటలో పావులం... ఆశ పడటమే మనవంతు.. అమలు చేయటం పైవాని వంతు. 



మావాడి ఆలనలో హాయిగా సేదదీరుతుంటే... ఇదుగో నేనున్నానంటూ అనుకోకుండా పలుకరించింది ఓ చిన్ని పిట్ట. తుర్రుమంటూ వచ్చేది, ఇల్లంతా నానా హంగామా చేసేసి మళ్లీ తుర్రుమనేది. ఉండేది కాసేపైనా ఆ అల్లరికి జీవితం అంతా ఫిదా అయిపోవాలనిపించేది. ఈ చిన్నిపిట్ట పేరు "జెస్సీ". పేరుకు తగ్గట్టే ఎంత ముద్దుగా ఉంటుందో... :)

పక్క పోర్షన్‌లో ఉండే లక్ష్మిగారు ఈ జెస్సీకి పెద్దమ్మ వరస. జెస్సీ అమ్మమ్మకి ఆపరేషన్ అయిన కారణంగా, జెస్సీ తల్లి డాక్టర్‌గా బిజీగా ఉన్న కారణంగా.. తనని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో.. రోజూ జెస్సీ నాన్న లక్ష్మిగారి దగ్గర వదిలి వెళ్లేవారు. రోజూ పొద్దున్నే రావడం.. రాత్రికి వెళ్లిపోవడం.. ఇదీ వరస. చాలా రోజులు నేను జెస్సీకి దగ్గర కాలేదు. కారణం తెలిసిందే.. దగ్గరైతే మళ్లీ బాధపడాల్సి వస్తుందనే.

ఒకరోజు బాల్కనీలోకి వెళ్తే పెద్దమ్మతో ఆ.. ఊ అంటూ కబుర్లు చెబుతోంది. నన్ను చూడగానే ఆంటీకి హాయ్ చెప్పమ్మా అంది లక్ష్మిగారు. హాయ్ చెప్పడమేకాదు నవ్వుతూ నామీదకి ఒంగిపోయింది. ఎత్తుకోకపోతే బాగుండదని అన్యమనస్కంగానే తీసుకున్నాను. నోట్లో రెండే రెండు పళ్లతో నవ్వుతూ హత్తుకుపోయింది జెస్సీ. అబ్బా... పాల వాసన గుప్పుమంది. కాసేపు అలాగే ఆడించి.. ఇచ్చేశాను. అంతటితో మనసు ఊరుకుంటేగా... కాసేపటి తరువాత కాళ్లు పక్కంటికే పరుగులు తీస్తుంటే.. ఇదీ వరస.. మళ్లీ పిచ్చి మొదలైంది.

నిజం చెప్పొద్దూ... నా కాళ్లు పక్కింటికి పరుగులు తీస్తే.. జెస్సీ వాళ్లింటో వదిలితే చాలు నేరుగా మా ఇంట్లోకి వచ్చేసేది. ఇక వచ్చినప్పటినుంచి ఇల్లంతా రణరంగమే. ఏ వస్తువూ ఒక చోట ఉండనీయదు. ఒకటే ఉరుకులు పరుగులు.. నాకైతే టైమే తెలిసేది కాదు. అది ఉన్నంతసేపు నాకు స్వర్గంలో ఉన్నట్టుండేది. ముద్దులు పెట్టేది.. కొరికేసేది. అలిగేది.. నువ్వు నాకు వద్దు పో అంటే ఏడుస్తూ హత్తుకుపోయేది.

కొన్నాళ్లకి ఎంత దగ్గరైపోయిందంటే.. అది ఒక రోజు రాకపోయినా నాకు పిచ్చి పట్టినట్టుగా ఉండేది. 14 నెలల ఆ పాప... ఇంట్లోకి వచ్చిందంటే చాలు సందడే సందడి. బెడ్ చూసిందంటే చాలు పైకి ఎక్కి.. అటూ ఇటూ పరిగెత్తేది. ముఖ్యంగా పల్టీలు కొట్టది. నాకైతే ఎంత భయం వేసేదో.. కానీ అది పల్టీలు కొట్టేసి హాయిగా నవ్వేసేది. తలమీదుగా ఒక్కసారిగా ఒళ్లంతా ఎత్తేసి అటువైపు పడేసేది.. ఎక్కడ మెడ పట్టేస్తుందో అని నా భయం.. కానీ అది అవేమైనా పట్టించుకుంటేగా...

రెడీ అయ్యి ఎక్కడికైనా బయల్దేరుతుంటే తనూ రావాలని మారాం చేసేది. బండి చూస్తే అస్సలు వదలదు. బండ్లో వెళ్లాలని ఒకటే గొడవ చేసేసేది. ఒక్కోసారి మంచి మూడ్‌లో ఉంటే... నవ్వుతూ టాటా చెప్పటం.. ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం చేస్తుంది. బాల్కనీలోంచి కింద ఎవరు కనిపించినా టాటా చెప్పటం మర్చిపోదు. ఇలాంటి పిల్లతో రోజూ ఎలా గడుస్తోందో తెలీకుండా గడిచిపోయేది.

ఈ ముచ్చటా మూన్నాళ్లే. అన్నీ సవ్యంగా జరిగిపోతే జీవితం ఎందుకు అవుతుంది. జెస్సీ అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడటంతో... ఆ పిల్లని ఇక్కడికి తీసుకురావడం లేదు. నాకేమో ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించేది. జెస్సీతో ఉన్న చనువు.. వాళ్ల అమ్మా,నాన్నలతో లేకపోవడం వల్ల ఆ పిల్ల కోసం వాళ్ల ఇంటికి వెళ్లలేని పరిస్థితి. వాళ్లు ఉండేది ఒకే ఊర్లో అయినా చాలా దూరంగా ఉండేవాళ్లు. పోనీ దాంతో ఫోన్లో మాట్లాడుదాం అనుకున్నా.. ఇంకా మాటలురాని పిల్లతో ఏం మాట్లాడతాం.

జెస్సీ గురించి గుర్తుకురాగానే... ఎప్పుడో తను ఆడుకుంటుంటే అనుకోకుండా మొబైల్లో తీసిన ఫొటోలను చూసుకుని తృప్తి పడటం మినహా ఇంకేం చేయలేకున్నా ప్రస్తుతానికి. అయితే ఈ చిన్నారి దేవీ గారి గురించి అప్పుడప్పుడు వాళ్ల పెద్దమ్మ చెబుతూ ఉంటుంది.. వాళ్ల అమ్మమ్మ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అన్నీ అమ్మాయిగారి కబుర్లేనట. బాగా అల్లరిదైపోయిందని... బొమ్మల్ని ఒళ్లోపెట్టుకుని జోల పాడుతోందని.. ఇలా కబుర్లే.. కబుర్లు..

చూడాలి.. దేవీగారూ ఎప్పటికి కరుణిస్తారో.. అప్పటిదాకా ఈ బాధ తప్పదు... అయినా వచ్చినా కాసేపే కదా.. మళ్లీ తనవాళ్లతో తను వెళ్లిపోతుంది... నేను ఇలాగే జ్ఞాపకాలతో ఉండక తప్పదు.. అంతే...

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడుగక...

వాన కురిసి కలిసేది వాగులో
వాగువంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో.......

వద్దు వద్దనుకున్నా దగ్గరవకుండా ఉండలేని ఓ పెద్ద బలహీనతతో వేగుతూ బ్రతుకీడుస్తున్న ఈ జీవికి.... కుట్టీ... మరో కుట్టీ... చిన్నా.... జెస్సీ... ఆ తరువాత ఇంకెవరో... ?????


Thursday 14 November 2013

తంగేడు పువ్వులు గుర్తొచ్చీ...!!



తంగేడు పువ్వుల గుత్తులతో ఆటలు
బంకమట్టితో చేసిన బుల్లి బుల్లి పాత్రల్లో వంటలు
సీతాఫలం చెట్లలో దాగుడుమూతలు
కానుగ చెట్లపై కోతి కొమ్మచ్చి గెంతులు
రేణిగాయలు పులుపులు
యలక్కాయ వెగటులు
ఉలింజకాయల తీపి వగరులు
మర్రిచెట్టు ఊయలలు
చింత చిగురు కష్టాలు
నేరేడుపండ్ల గుర్తులు
తాటికాయల కమ్మటి వాసనలు
పనసకాయల దొంగతనాలు
మామిడి తోటలపై మూకుమ్మడి దాడులు
యేటి నీళ్లలో జలకాలు
అమ్మ చీర చెంగుతో చేపలు పట్టడాలు
వెన్నెల రాత్రుల్లో ఆటలు

తిరిగిరాని పసితనానికి ఎన్ని తీపి జ్ఞాపకాలో...
తంగేడుపువ్వులు గుర్తురాగానే ఏవేవో గుర్తుకొచ్చి ఇలా....



Wednesday 6 November 2013

నాన్నా...!!

  

 గుండెని గుప్పిట పట్టి అమ్మని
జ్ఞాపకాల్ని దోసిటపట్టి నాన్నని
జీవితపు అక్షయపాత్రలో
చూస్తున్నా... చూస్తూ జీవిస్తున్నా
వాళ్ల కోసమే.. వాళ్లతోనే...!!


****

నాన్నా...!!

ఎలా ఉన్నావు?

నేను లేకుండా మీరంతా ఎలా ఉన్నారో.. నేనూ అంతేగా తల్లీ.. అంటున్నావా.. ఇది నీకూ, మాకూ తెలిసిన నిజమే కదా. కొత్తేం లేదుగా..

నువ్వు లేకుండా నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా ఎన్ని ముందున్నాయో. నువ్వు లేని రోజుల్ని భారంగా గడపటం అలవాటైపోయినా.. మా మనసులనిండా నువ్వే కదా.

ఈ మధ్య నీతో కబుర్లు చెప్పటం లేదని, నీ దగ్గర కాసేపు కూడా కూర్చోలేదని అలిగావా.. ఏం చేయను. నా పరిస్థితి నీకు తెలియంది కాదు. నువ్వే చెప్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ దగ్గర కూర్చొనేందుకు, కబుర్లు చెప్పేంత మానసిక ప్రశాంతత ఎక్కడిది.

కొన్నాళ్లుగా.. కాదు కాదు.. కొన్ని నెలలుగా ఎంత ఉరుకులు పరుగుల జీవితమో. ఇంతటికీ కారణం నువ్వే.

ఏం తల్లీ... నిందిస్తున్నావా అని అడుగుతున్నావా.. నింద కాదులే. నువ్వు అసంపూర్తిగా వదిలేసిన కొన్ని బాధ్యతల్ని. ఇంటికి పెద్దదాన్ని అయిన కారణాన నేను ఎత్తుకోవాల్సి వచ్చిందిగా.. అందుకే అలా అన్నాన్లే.

మొత్తానికి నీ చేతులమీద జరగాల్సిన పెద్దోడి పెళ్లి నా చేతులమీదుగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జరిగిపోయింది. పెళ్లి తంతు అంతా సంతోషంగా జరిగిపోయినా నువ్వు లేవన్న దిగులు అడుగడుగునా.. మా అందరి కన్నీళ్ల రూపంలో.

ఇంక అమ్మ మాట చెప్పనక్కరలేదు. పెళ్లి విషయాలు మాట్లాడిన దగ్గరి నుంచి పెళ్లి పూర్తయ్యేదాకా ఏ కార్యక్రమంలోనూ ఆమె ముందుకురాలేదు. ఏం అంటే మీ నాన్న లేని నేను, శుభకార్యంలో ఎలా ముందుకొస్తాను. మీ చిన్నాయన, చిన్నమ్మ ఉన్నారుగా వాళ్లనే కానీ... అని దూరంగా జరిగిపోయేది. మాకు నువ్వు ముఖ్యం... అలాంటి పట్టింపులేం మాకు లేవు నువ్వు రామ్మా అని ఎంత చెప్పినా అస్సలు వినలేదు. మీకు లేకపోయినా లోకం నోటికి ఉంది. వద్దు.. నా బిడ్డలు మంచిగా ఉండటమే కావాల్సింది అంటూ కళ్లనిండా నీటితో చాటుకి వెళ్లిపోయేది.

నువ్వు లేకపోవడంతో పువ్వూ, బొట్టుకే కాదు.. శుభకార్యాలకు కూడా అమ్మ దూరమైపోయింది. నువ్వు ఉన్నప్పుడు అమ్మ ఎదురొస్తే శుభం.. ఇప్పుడు అశుభం.. అమ్మ మాకు ఎప్పుడూ శుభమే.. లోకం నోళ్లకే అశుభం. అయినా లోకాన్నెప్పుడూ మేం ఖాతరు చేయలేదు. ఈ లోకంలో ఉన్న గొప్ప ఆస్తి మాకు మా అమ్మే కాబట్టి.

ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పెళ్లి జరిగిపోయింది. అటూ, ఇటూ రాకపోకలు జరుగుతున్నాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే...

అమ్మ వాళ్ల నాన్న.. తాత ఉన్నట్టుండి చనిపోయారు. పెళ్లయిన 20 రోజుల్లోపు ఇంట్లో అలా జరిగిపోయింది. నువ్వు పోయిన తరువాత అమ్మకి తోడూ, నీడగా ఉన్న తన నాన్న హఠాత్తుగా పోవడంతో అమ్మ పరిస్థితి వర్ణనాతీతం. నువ్వు లేని బాధనే దిగమింగుకునే సత్తాలేక రోజు రోజుకీ ఉడిగిపోతున్న ఆమె నెత్తిమీద అలా మరో పిడుగు. ఆరోగ్యంగా హాయిగా తిరుగులాడుతూ... చిన్నప్పుడు తను ఎత్తుకు తిరిగిన మనవడి పెళ్లిలో హుషారుగా పనులు చేసిన ఆయన... ఊహించని మరణం.. అందరికీ షాక్.

ఆ.. నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా.. మీ అమ్మ.. అదే మా నాన్నమ్మ గురించి...

ఆమెకేం హాయిగా తిరిగేస్తుంది కదా.. నేను ఒళ్లు బాలేక పోయానుగానీ.. ఆమె మంచి ఆరోగ్యంతో బాగుండేది కదా అంటావేమో... నేనూ ఆ మాటకే వస్తున్నా... బాగా ఆరోగ్యంగా తిరుగులాడుతూ పనులు చేస్తూ ఉండేది కదా..

ఒకరోజు కాలికి చిన్న పుల్ల గుచ్చుకుంది అంతే.. అదే ఆమె ప్రాణాలమీదికి తెచ్చేసింది. కాలు తీసేయాల్సినంతగా కుళ్లిపోయింది కొన్ని రోజుల్లోనే. ఏదో ఆపరేషన్ చేసి కాలు తీయకుండా కుళ్లిపోయిన చర్మం అంతా తీసేసారు. మెల్లిగా కోలుకుంటోంది. కానీ ప్రతిరోజూ భయమే ఎప్పుడు ఏమౌతుందో అని. అలాంటి పరిస్థితుల్లోనే పెద్దోడి పెళ్లి జరిగిపోయింది. మనవడి పెళ్లి కళ్లారా చూసుకుంది.

పెళ్లికి ముందో, తరువాతో ఆమె ఏమవుతుందో అని అందరం కంగారుపడ్డామేగానీ.. తాత విషయం మాత్రం అస్సలు ఊహించలేదు. అంత సునాయాసంగా ఈ లోకం వదిలి వెళ్లిపోయాడాయన. నిజం చెప్పొద్దూ... నువ్వు లేవు అంటే ఎంత ఏడుపు వస్తుందో.. ఆయన్ని తల్చుకున్నా అంతే.. ఏదో తెలీని అపరాధ భావం కమ్మేస్తుంటుంది నాలో. పిచ్చిగా ఏడ్చేస్తుంటాను.

తాత పోయిన సరిగా నెల రోజులకు... నాన్నమ్మ కూడా వెళ్లిపోయింది. ఎలా పోయింది అని అడగవేం.. మెల్లిగా కోలుకుంటోందిలే అనుకుంటే.. రాను రాను తినడమే మానేసింది. చివరికి నీళ్లు తాగడం కూడా.. డాక్టర్లకి చూపిస్తే చేతులెత్తేశారు. గ్లూకోజ్ నీళ్లతో కొన్ని రోజులు ఊపిరి పీల్చుకుంది. అంతే మంచంలో తీసుకుని తీసుకుని పోయింది. పెద్ద మనవరాల్ని కదా.. నా దుఃఖం సంగతి నీకు తెలిసిందే. దెబ్బలమీద దెబ్బలు... తట్టుకోవడం సాధ్యం కాలేదు. మౌనంగా రోదించటం తప్ప ఏం చేయలేను కూడా.

వరుసగా జరుగుతున్న పరిణామాలు మానసికంగా ఎంతగా కుంగదీశాయో చెప్పలేను. ఓ దశలో ఇంటినుంచి ఫోన్ వస్తేనే గడగడా వణికిపోయేదాన్ని. కూడదీసుకుని మాట్లాడేదాన్ని ఏమైంది.. ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశారు అంటూ.. విషయం ఏమీ లేదని తెలీగానే కాస్త ఊపిరి పీల్చుకునేదాన్ని అంతలా పిరికిదాన్ని అయిపోయాను అనుకో.

ఇక చెప్పబోయే విషయం విని నువ్వేం బాధపడకూడదు. బాధలేకుండా ఎలా ఉంటుంది. ఏదో చెప్పాలని చెప్పడం కాకపోతే. ఎవ్వరు బాధపడినా చేసేదేం లేదు... అందుకనే మనసు కాస్త ధైర్యం చేసుకో... నాకేం మా... ఎప్పుడో దాటుకునేశా... ధైర్యం చిక్కబట్టుకోవాల్సింది నువ్వే అంటున్నావా... చిక్కబట్టుకోవడం అటుంచు.. పై ప్రాణం పైనే పోయింది.. ఏదో అలా నెట్టుకొచ్చేస్తున్నానంతే..

ఇక విషయం ఏంటంటే... పెద్దోడి పెళ్లికి ముందునుంచే అమ్మ ఒంట్లో బాలేదని చెబుతోంది. నాలుగు అడుగులు కూడా వేయలేకపోయేది.. ఒకటే ఆయాసం.. ఏదైనా కాస్త పనిచేస్తే వదలకుండా జ్వరం వచ్చేసేది. తాతకి ఆస్త్మా ఉండేది కదా.. అమ్మకి కూడా అలా ఉందేమో అని హాస్పిటల్‌కి పంపించాం.

నేను మావూళ్లో ఉండటం.. తమ్ముళ్లకి వేరే పనులు ఉండటంతో అమ్మను ఒక్కదాన్నే హాస్పిటల్‌కి పంపించాం. ఆయాసంకి మందులు ఇస్తూనే.. ఎందుకో గుండె ఓవైపు సరిగా కొట్టుకోవట్లేదమ్మా టెస్ట్ చేయించుకో మంచిది అన్నాడట డాక్టర్. అమ్మ ఇంటికి వచ్చి విషయం చెబితే తమ్ముళ్లు, నేనూ నవ్వాం.. ఆ డాక్టర్‌కి తిక్కా.... ఆయాసం శ్వాసకి సంబంధించిన సమస్య అయితే గుండె సమస్య అంటాడేంటి అని. కానీ రెండోసారి వెళ్లినప్పుడు అదే విషయం చెప్పాడు అనటంతో.. భయపడి ఈసీజీ లాంటి టెస్ట్‌లు చేయిస్తే..

వచ్చిన రిజల్ట్స్ చూసి బిక్కచచ్చిపోయాం. గుండెలో రెండు వాల్వ్‌లకు సమస్య ఉందని వెంటనే "ఓపెన్ హార్ట్ సర్జరీ" చేయాలని డాక్టర్ చెప్పటంతో చిన్నోడు ఏడుస్తూ ఫోన్. సెకండ్ ఒపినీయన్ తీసుకుందాం. నువ్వేం బాధపడకు అని వాడికి ధైర్యం చెప్పానేగానీ.. ఆ క్షణం నుంచి దిగులు, ఏడుపు, బాధ.. అన్నీ మాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయని.

పెళ్లికే అప్పులు అయ్యాయి.. తరువాత నాన్నమ్మ, తాతల కార్యక్రమాలకు ఖర్చులయ్యాయి. ఇప్పుడేమో అమ్మకిలా. గుండెకు సంబంధించిన సమస్య అంటే తక్కువ ఖర్చేం కాదు. డబ్బులకి ఏం చేయాలన్న దిగులు. ఎవరిని అడగాలి.. ఏడుస్తూ రోజులు.. ఈలోగా గుండెకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చూస్తారని తెలిసింది. ఆ కార్డ్ ఉంది కాబట్టి అమ్మకి చూపించవచ్చులే అనుకుంటుండగా...

ఆరోగ్యశ్రీలో గుండె సంబంధిత ఆపరేషన్లను ఆపేస్తున్నాం అంటూ కొంతమంది వైద్యుల ప్రకటన. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా ఆపరేషన్లను ఆపేస్తున్నట్టు. ఆ న్యూస్ చూడగానే కాళ్లూ చేతులు వణకటం మొదలైంది నాకు. కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి తెలిసిన స్నేహితులను అడిగి కనుక్కుంటే ఒకటిన్నర రెండు లక్షల దాకా కావచ్చు అని అన్నారు. చేతిలో పదివేలు కూడా లేని స్థితిలో అంత డబ్బుకి ఎక్కడపోవాలి అని ఒకటే ఏడుపు.

ఇదే టైంలో సమైక్యాంధ్ర బంద్. ఉద్యోగులూ, జనాలూ ఉద్యమంలో జోరుగా ఉన్నారు. బస్సులు లేవు. స్కూల్లూ, ఆఫీసులూ అన్నీ బంద్. హాస్పిటల్లో అత్యవసర సేవలు కూడా ఆగిపోతే అమ్మ పరిస్థితి ఏంటి అని దుఃఖం. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ.. ఏడుస్తూ ఉన్న సమయంలో కొందరు మిత్రులు ఆర్థికంగా సాయపడతామని ముందుకొచ్చారు. కానీ దేవుడి దయవల్ల ఆరోగ్యశ్రీ కార్డుపై గుండె సంబంధిత ఆపరేషన్లు చేస్తున్నట్లు మళ్లీ న్యూస్ రావటంతో.. హాస్పిటల్లో కూడా ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుని.. వెంటనే అమ్మని అడ్మిట్ చేయించాం.

ముందుగా ఆంజియాప్లాస్టీ చేశారు. తరువాతి రోజు ఆగస్టు 31న ఉదయాన్నే పదిన్నరకి ఆపరేషన్ అన్నారు. అది కాస్తా 12 అయ్యింది. 12కి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30, 7 గంటలు అయినా డాక్టర్లనుంచి పిలుపేదీ రాలేదు. ఏమీ చెప్పటం లేదని.. ఆపరేషన్ ఎలా జరిగిందో ఏమో అని కంగారు. ఏదోమూల భయం.. కళ్లు తిరగటం మొదలైంది నాకు. అదే టైంలో అమ్మని ఆపరేషన్‌కి తీసుకెళ్లిన పెద్ద డాక్టర్, ఆమె అసిస్టెంట్లు ఎదురుగా రావటం కనిపించింది. పరుగెత్తికెళ్లి... మేడమ్ అని అన్నానో లేదో.. ఆపరేషన్ బాగా జరిగింది. ఐసీయూలోకి షిప్ట్ చేస్తున్నాం.. కాసేపటి తరువాత వెళ్లి చూడండి అని నవ్వుతూ వెళ్లిందామె. ఆమె నవ్వు చూడగానే పోయిన ప్రాణం లేచివచ్చినట్టయింది నాకు.

పొద్దుట్నుంచీ ఏమీ తినకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. దేవుళ్లందరికీ మొక్కుకుంటూ.. ఏడుస్తూ కూర్చున్నా.. కళ్లు తిరుగుతున్నాయి. కాళ్లు లాగేస్తున్నాయి. తమ్ముళ్లు, బంధువులు కాస్త ఎంగిలిపడమని ఎంత చెప్పినా వినలేదు అమ్మని చూస్తేగానీ ఏమీ తినలేనని. తీరా ఒక్కొక్కరే వెళ్లి చూడవచ్చని పిలుపు. తమ్ముళ్లని పంపించాను. వాళ్లిద్దరూ చూసివచ్చి నువ్వు ఇప్పుడు వద్దులే అక్కా.. రేపు చూస్తువులే అన్నారు. అమ్మను అలా చూస్తే నువ్వు తట్టుకోలేవు వద్దు అన్నారు. అసలే ఏ మాత్రం ధైర్యంలేకుండా ఉన్నానేమో సరే అని కూలబడ్డా.

ఆమెకి ఉదయందాకా స్పృహరాదు. అందర్నీ ఇక్కడ ఉండనీయరు. ఒక్కరు మాత్రం ఉండి అందరూ వెళ్లిపోండని సెక్యూరిటీవాళ్లు అనడంతో.. పెద్దోడు మేమిద్దరం ఉంటాం నువ్వు తమ్ముడు పెదనాన్నతో వెళ్లండక్కా అనటంతో చేసేదేంలేక ఆయనతో బయల్దేరాం. వాళ్ల బలవంతంమీద స్నానంచేసి నాలుగుమెతుకులు తిని పడుకున్నా నిద్రపడితే కదా. తెల్లవారుజామున అమ్మకి మెలకువ వచ్చిందా అని చిన్నోడు ఫోన్. ఏమో వాళ్లు రానీయటం లేదురా అని పెద్దోడు. ఇంకా స్పృహ రాకపోవడం ఏంటని ఆదుర్దా. చూసి వస్తా నువ్వు ఇక్కడే ఉండమని వెళ్లిపోయాడు చిన్నోడు.

 

అమ్మకి స్పృహ వచ్చింది. సైగలతో మాట్లాడుతోంది. మధ్యాహ్నం తరువాత మాట్లాడవచ్చట అని చిన్నోడి ఫోన్ వచ్చేదాకా మనసులో మనసు లేదు. గబగబా స్నానంచేసి దేవుడికి దణ్ణంపెట్టుకుని హాస్పిటల్‌కి పరుగెత్తా. మధ్యాహ్నం తరువాత నోట్లో పెట్టిన ట్యూబ్ తీసేస్తారట. పాలు తాపవచ్చట. వెంటవెంటనే చూసేందుకు పంపించరు. అలా వెళితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందట. ఒకేసారి పాలు తీసుకుని వెళ్దువులే అక్కా అని అన్నాడు. ఒంటిగంట ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నా. పాలు తీసుకుని గుండెచిక్కబట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లా.

నన్ను చూడగానే అమ్మ కళ్లలో వెలుగు. సన్నని కన్నీటి పొర. నా పరిస్థితి అంతకంటే ఘోరం. కానీ నేనూ అలా చేస్తే ఇక అంతే. ఎమోషనల్‌ అవకుండా చూసుకోమని డాక్టర్లు ముందే చెప్పారు. అందుకే ఆపరేషన్ బాగా జరిగింది. వారం రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చట. పిచ్చిదానా ఎందుకు ఏడుపు అంటూ నవ్వుతూ తల నిమిరాను. నువ్వు సరిగా తిని మందులు వేసుకున్నావంటే ఇంకా ముందుగానే ఇంటికి వెళ్లిపోతాం.. బాగయిపోతుంది బాధపడకూడదు. నువ్వు బాధపడుతున్నట్లు కనిపిస్తే డాక్టర్లు మమ్మల్ని లోపలికే రానీయరు అని మెల్లిగా నచ్చజెప్పా. కాసేపటికి సర్దుకుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదట. ఇదిగో ఈ పాలు తాగేస్తే నేను మళ్లీ సాయంత్రం వస్తా అని చెప్పి పాలు తాగించి, ధైర్యంచెప్పి బైటపడ్డా.

అమ్మకి ధైర్యం చెప్పానేగానీ అమ్మని ఆ పరిస్థితుల్లో.. ఒంటినిండా ట్యూబులు, ముక్కుకి ఆక్సిజన్‌.. వినీ వినిపించకుండా మాటలు.. మళ్లీ జన్మెత్తిన పసిబిడ్డలా ఉన్నట్టు... నావల్ల కాలేదు.. అప్పటిదాకా అణచిపెట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. హాస్పిటల్లో చుట్టూ ఉన్నారన్న స్పృహకూడా లేకుండా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. ఎవ్వరితరమూ కాలేదు ఓదార్చటం. కాసేపటికి నేనే సర్దుకున్నా. ఆపరేషన్ బాగా జరిగింది కదమ్మా ఎందుకు ఏడుస్తావు.. ఏడిస్తే అమ్మకి మంచిదికాదు అన్నారు అంతే.. ఇక అప్పటినుంచి అమ్మో అమ్మకి మంచిది కాదా అయితే ఇక ఏడవనే ఏడవను.. ఏడుపు ఆగిపోయింది. బాధ ఆగదు కదా..

ఆపరేషన్ జరిగేదాకా ఒక ఎత్తయితే.. ఆ తరువాత డిస్చార్జ్ అయ్యేదాకా మరో ఎత్తు అనేది అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. సాధారణంగా అయితే వారం పది రోజుల్లో ఇంటికెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కానీ రోగి ఆరోగ్య పరిస్థితి.. కోలుకునే శక్తి సామర్థ్యాలు అన్నీ దానిపై ఆధారపడి ఉంటాయి. గుండె ఆపరేషన్ తరువాత ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుందనీ.. కిడ్నీలు ఫెయిలవవచ్చని, స్ట్రోక్ రావచ్చని.. ఇలా ఏవేవో డాక్టర్లు ఆపరేషన్‌కి ముందే చెప్పారు. అయితే అందరికీ ఇలా అవ్వాల్సిన పరిస్థితి ఉండదనీ.. ఒకరిద్దరికి ఇలా జరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. దేవుడా అమ్మకి ఇలాంటివేమీ రాకూడదని మనసులో భయపడుతూ ఉన్నాం.

ఏదైతే రాకూడదని అనుకున్నామో సరిగ్గా అదే వచ్చింది. ఓసారి ఐసీయూనుంచి పిలుపు. రెండు మూడు రోజులుగా ఏం తిన్నా కడుపు విపరీతంగా ఉబ్బిపోతోంది. శ్వాస కూడా చాలా సమస్యగా ఉందని నేను సిస్టర్లకి అప్పటికే చెప్పి ఉన్నాను. డాక్టర్ రౌండ్స్ వచ్చినప్పుడు చెబుతాం అన్నారు. ఆ విషయమై డాక్టర్ పిలిచాడని అనుకున్నా కానీ.. ఊపిరితిత్తులు కొలాప్స్ అయ్యాయి మా.. ఊపిరితిత్తుల నిండా వాటర్ ఫాం అయ్యింది. దాన్నంతా తీసేందుకు ట్యూబులు వేయాల్సి ఉంటుంది అన్నాడు. అలా చేస్తే ఊపిరితిత్తులు బాగయిపోతాయా సర్ అడిగా. బాగవ్వాలనే మా ప్రయత్నం అన్నాడాయన.

అమ్మ భయపడుతుంటే ఏం కాదని చెప్పి అక్కడ్నించి కదిలా. ఓ అరగంట తరువాత మళ్లీ పిలుపు. షర్ట్, టవల్ తీసుకుని రమ్మని. వెళ్తే అమ్మ పరిస్థితి చూసి కాసేపు నోటమాట రాలేదు. ఏడుస్తోంది భయంకరంగా. అరగంట ముందువరకూ బాగున్న మనిషి ఏడుస్తోంది... నొప్పితో విలవిలలాడిపోతోంది. పక్కన చూస్తే తెల్లని చొక్కానిండా రక్తం.. టవల్ కూడా తడిచిపోయింది. ఏంటి సిస్టర్ ఎందుకింత రక్తం ఆశ్చర్యంతో తేరుకుంటూ కోపంగా అడిగాను. ఊపిరి తిత్తులలోని నీరు తీసేందుకు రెండువైపులా ట్యూబ్స్ పెట్టాం మా. ఆ ట్యూబ్స్ పెట్టేటప్పుడు మత్తుమందులాంటిదేం ఇవ్వలేదు. ఇవ్వకూడదు. ఇలా చేస్తుంటేనే బ్లీడింగ్ బాగా ఎక్కువైందని చెప్పుకొచ్చింది.

అమ్మని ఎంత ఓదార్చినా ఏడుపు ఆపటం లేదు. నన్ను చంపేందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు నమ్మకం లేదు తిరిగి ఇంటికి వస్తానని. ఎంతపని చేసారు అంటూ ఏడుస్తూ, గొణుగుతూ తిడుతోంది. ఇక ఓపికగా చెబితే వినదని.. కాస్త కోపంగా, నిన్ను చంపేందుకు కాదు.. ముందు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అనగానే.. ఏమనుకుందో ఏమో మెల్లిగా ఏడుపు ఆపింది. ఏడుపు ఆపిందేకానీ ఎక్కిళ్లు ఆగటం లేదు.. తనకి ఎంత నొప్పిగా ఉంటే అంతగా ఏడుస్తోందో.. అర్థం అవుతోంది. ఎక్కువ ఆవేశపడితే తన గుండెకి ఏమవుతుందో ఏమో అని నా కంగారు.

ఏడుపు ఆపిన తరువాత మెల్లిగా నచ్చజెప్పాను. డాక్టరుతో మాట్లాడానని.. ఊపిరితిత్తుల్లో బాగా నీరు చేరిపోవటంవల్లనే కడుపు ఉబ్బిపోతోంది.. ఏమీ తినలేకపోతున్నావని చెప్పాడు. ఆ నీరు రెండు మూడు రోజుల్లో బయటికి వచ్చేస్తుంది.. అప్పుడు నువ్వు మామాలుగా మా అందరిలాగే తినవచ్చు అని చెప్పాను. అయితే నొప్పి ఎక్కువగా ఉండటంవల్ల తను వినేస్థితిలో లేదు.. మాట్లాడే ఓపికా లేదు. చేసేదేంలేక సిస్టర్లను చూసుకోమని చెప్పి బయటకి వచ్చాను.

ఆపరేషన్ జరిగిన తరువాత దాదాపు 20 రోజులపాటు అమ్మ ఐసీయూలోనే ఉంది. ఆ 20 రోజుల్లో ప్రతిరోజూ ఆమె పడిన బాధ, ఆమె కోసం ఉన్న మా బాధలు మాటల్లో చెప్పలేనివి. 20 రోజుల ఐసీయూ అనుభవాల్ని నీకు ఇంకోసారి చెబుతాన్లే. ఒకటి మాత్రం నిజం "మనిషి జీవితం అంటే ఇంతేనా" అనిపించింది.

మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేశాం... వచ్చిన రోజునే ఇన్ఫెక్షన్ సోకిందో ఏమో ఒకటే జ్వరం.. సిస్టర్లకి ఫోన్ చేసి అడిగితే ఇన్నాళ్లూ ఐసీయూలో ఉంది కదా.. బయటి వాతావరణం సెట్ అయ్యేందుకు టైం పడుతుంది.. భయపడకండి అంటూ జ్వరం తగ్గేందుకు టాబ్లెట్స్ చెప్పారు.. అవి ఇవ్వటంతో జ్వరం తగ్గింది.. కానీ ప్రతిరోజూ ఏదో ఒక సమస్యే. సమస్యల్ని తట్టుకుంటూ, రోజుల్ని నెట్టుకుంటూ... మెల్లిగా తన ఆరోగ్యం బాగుపడుతోంది.


ఆసుపత్రి నుంచి వచ్చినప్పటినుంచీ నా దగ్గరికి వచ్చేయాలని ఒకటే ఆశ అమ్మకి. కానీ ఇంతదూరం ప్రయాణం చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని భయంతో ఇన్నాళ్లూ వద్దని చెప్పాను. ఇప్పుడు కాస్త కోలుకుంది కాబట్టి తీసుకువచ్చే ధైర్యం చేసి తీసుకురావాలని అనుకుంటున్నా. నవంబర్ 7న నువ్వు మాకు భౌతికంగా దూరమైన రోజు కదా.. ఆ రోజు నీ జ్ఞాపకంగా పదిమందికి అన్నంపెట్టి ఆ తరువాత నీ దగ్గరికి వస్తానమ్మా అని చెప్పింది. ఇక్కడికి వచ్చినా... మీరిద్దరూ నా దగ్గరకు వచ్చినప్పటి రోజుల జ్ఞాపకాలు ఆమెని మనశ్శాంతిగా ఉండనీయవు. అలాగని రాకుండా ఉండలేదు. అయినా ఆమె పిచ్చిగానీ ఆమె ఎక్కడున్నా నీ జ్ఞాపకాలు ఎలా లేకుండా ఉంటాయి.

ఇక చివరిగా... పిల్లలుగా మా భవిష్యత్తు ఆమెకి ఎంత ముఖ్యమో.. ఆమెని కాపాడుకోవటం మాకూ అంతే ముఖ్యం. "నాన్నని అర్థాంతరంగా తీసుకెళ్లినా అమ్మనైనా మిగుల్చు దేవుడా" అని రోజుకి లెక్కలేనన్నిసార్లు మొక్కుకుంటూనే ఉన్నాం. పైనుంచీ నువ్వు కూడా అమ్మని చల్లగా చూసి మా ముందు నవ్వుతూ తిరుగాడేలా చేయి.. ఇంతకంటే జీవితంలో మరే ఆశలూ లేవు. చేస్తావు కదూ...?!

నువ్వు లేవన్నది ఎంత నిజమో... మాతోనే ఉన్నావన్నది అంతే నిజం.. నీ చల్లని దీవెనలు కలకాలం మమ్మల్ని కాపాడాలని..
ఎప్పటికీ ప్రేమతో...


Tuesday 29 October 2013

పాయలుగా చీలిపోయి...!!



                                                 అనుకోకుండా ఎదురుపడ్డావ్
                                                 కళ్లముందు మసక చీకటి
                                                 అంతా అస్పష్టం
                                                 ఆకారాలకా.. మనసులకా
                                                 నిర్లిప్తపు పెదవులపై
                                                 ప్రాణంలేని నవ్వొకటి విసిరి
                                                 నిశ్శబ్దపు అడుగులతో
                                                 వర్తమానపు దారిలో
                                                 అటునువ్వు ఇటునేను

                                                                                 ఎప్పుడో పుష్కరం క్రితం
                                                                                 పెద్దరికపు ఆంక్షలకి
                                                                                 తెగిపడిన ఆశల శకలాల్ని
                                                                                 పైపైన వదల్చుకుంటూ
                                                                                లోలోన గుండెనిండా మోసుకెళ్తూ

                                                 జ్ఞాపకాల్ని గాలి తెరల్లోనూ
                                                 అనుభూతుల్ని కన్నీటి పొరల్లోనూ
                                                 బంధించేసి...
                                                 మౌనంగా రోదిస్తూ
                                                 మనసుని దహిస్తూ
                                                 మిగిలిన బూడిద కుప్పని
                                                 ఒంటినిండా పులుముకుని
                                                 గంభీరంగా, గుంభనంగా
                                                 సాగుతున్నాం
                                                 పాయలుగా చీలిపోయి...


 

Thursday 24 October 2013

ఓ "కాలమా".. !!

 

                                               ఎన్నింటినో మురిపిస్తుంది
                                               మరెన్నింటినో మరిపిస్తుంది
                                               దూరాల్ని చెరిపేస్తుంది
                                               తేడాల్ని చూపెడుతుంది

                                               నిజాల్ని నిందిస్తుంది
                                               అబద్ధాల్ని అందలం ఎక్కిస్తుంది
                                               మోసాల్ని శాశ్వతం చేసేస్తుంది
                                               సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

                                               ఆశల అందలం ఎక్కిస్తుంది
                                               దభాల్న కిందికి తోసేస్తుంది

                                               ఓ "కాలమా"

                                              ఎందుకు నీకు అంత "కసి"...???



Wednesday 16 October 2013

నీ నవ్వు...!!


నవ్వాలి నవ్వాలి
నీలా నవ్వాలి
అచ్చం నీలాగే నవ్వాలి
నీ అంత స్వచ్ఛంగా
నీ అంత అందంగా
నీ అంత నిర్మలంగా
మొత్తంగా నీలా మారిపోయి
నవ్వాలి... నవ్వుతూనే ఉండాలి

నేనూ..
ఎప్పుడో ఇలా నవ్వినట్టు గుర్తు
మళ్లీ ఇన్నాళ్లకి నీ నవ్వులు
మర్చిపోయిన నా నవ్వుల్ని
ఉబికి వస్తున్న ఊటలా
వెలికితెస్తున్నాయి

నిజం చెప్పనా...
అచ్చం నీలాగే నవ్వేందుకు
ప్రయత్నిస్తున్నా
మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ
ఓడిపోతూనే ఉన్నా
ఎంత ప్రయత్నించినా
నీ నవ్వులోని స్వచ్ఛత
నా నవ్వుకి రాలేదెందుకో...?!


Thursday 8 August 2013

వానొచ్చింది..!!



చెంప ఛెళ్లుమన్నప్పుడు
దెబ్బ.. దెబ్బతో వచ్చే నొప్పీ
రెండూ మర్చిపోయి
రెప్పపాటు క్షణంలో
అలా వచ్చి ఇలా వెళ్లిపోయే
కరెంట్ షాక్ లాంటి మెరుపులు
ఎంత ఆశ్చర్యంగా అనిపించేదో

వానొస్తే మెరుపుల్ని చూస్తే ఎంత భయమో
కానీ కళ్లలోంచి ఆ మెరుపులు వస్తుంటే
ఆశ్చర్యమే ఆశ్చర్యం
అంతపెద్ద ఆకాశానికీ మెరుపులు
ఇంత చిన్న కళ్లకీ మెరుపులే.....!
ఎక్కిళ్ల శబ్దం ఆశ్చర్యాన్ని బ్రేక్ చేసేదాక
షాక్ నుంచి తేరుకోలేని కళ్లు...

ఆకాశానికి చిల్లుపడి వానొస్తే...
మా గొడుగుకీ చిల్లుపడి
వానొచ్చింది
నా కళ్లకి....
టపా టపా హోరులో కలిసిపోతూ...
సాగరంలో మునిగితేలుతూ
గట్టు తెగేందుకు ఓ కన్ను
వద్దు వద్దంటూ మరో కన్ను...!!

Wednesday 10 July 2013

"ప్రియ జన్మం" శిరాకదంబంలో...!!



"ప్రియ జన్మం" కథ గురించి సాయిపద్మగారి పరిచయం...

ప్రతీ ప్రశ్నా అడిగేందుకు చిన్నదే.. అది రేపిన కలకలం మాత్రం జీవితాంతం ఉంటుంది . ఏ సమాధానం అయినా కేవలం రాజీ ప్రయత్నం అనిపించినపుడు, అది మరింత రెట్టింపు అవుతుంది.కొంత మంది మనుషులు, వాళ్ళ కధలు మనం మరచిపోయిన కొన్ని ఐడెంటిటీ ప్రశ్నలని వెలికి తీస్తాయి. ఒక చిన్న మనసులో , తన జన్మ మీద , జన్మదినం గుర్తుపెట్టుకోలేని తల్లి తండ్రుల మీద రేగిన ఒక గారాల అసహనం .. శోభారాజు గారి "ప్రియ జన్మం" ఈ శిరాకదంబం సంచికలో...

చిన్నపిల్లల్లో ఉండే స్వచ్చత మనసు నిండా నింపుకున్న వ్యక్తి శోభ. ఇలాగే మరిన్ని మంచి కధలు రాయాలని ఆశిస్తూ ..!! వీలు చేసుకొని తప్పకుండా చదవండి ..!

శోభారాజు కథ 'ప్రియజన్మము' www.sirakadambam.com 02_033 సంచిక 37వ పేజీలో...

***********************************************************

సూర్యుడు ఒంటినిండా ముదురు ఎర్రని రంగు పులుముకుని కొండలమాటుకెళ్తూ వెళ్తూ చిక్కని చీకటిని లోకానికిచ్చి మళ్లీ పొద్దున్నే వస్తాగా అన్నట్టు వెళ్లిపోయాడు.

చీకటమ్మ రాకముందే గూళ్లకు చేరుకోవాలని పక్షులన్నీ గబగబా బారులు తీరాయి.

పొద్దుట్నుంచీ అలుపూ సొలుపూ లేకుండా పనిచేస్తున్నప్పటికీ... పిల్లలేం చేస్తున్నారన్న దిగులు వీడని శీనయ్య దంపతులు అంతే వడి వడిగా పరుగులాంటి నడకతో ఇంటికి చేరుకున్నారు.

వచ్చీ రాంగానే... అమ్మా, నాయినా అంటూ కాళ్లకు చుట్టుకున్న పిల్లల్ని చూడగానే పొద్దుట్నుంచీ పడ్డ కష్టం అంతా చిటికెలో మర్చిపోయారు. అదే ఊపులో పిల్లలకి కబుర్లు చెబుతూ నాయనా... వంటచేస్తూ అమ్మ....

కబుర్లు సాల్లే..

అమ్మ వంట చేసేలోపు కాసేపు సదువుకోండర్రా... అన్న నాయిన మాటతో బుద్ధిగా పుస్తకాలు పట్టుకుని కిరోసిన్ బుడ్డీ వెలుగులో కూర్చుని చదువసాగారు.

కాసేపట్లోనే పెద్దోడు, సిన్నోడు గురక పెడుతుంటే... వాళ్లకి తాళం వేస్తున్నట్టు నాయినా గురక రాగం తీస్తుంటే...

పాపం చిన్నారి ప్రియ మాత్రం బుడ్డీ వెలుతుర్లో ఊగీ ఊగీ చదువుతోంది. వాళ్లమ్మ కట్టెల పొయ్యి ఊదీ ఊదీ వంట చేస్తోంది.

ఊరి చివరి ఇల్లు కావడంతో... ప్రియ గొంతు తప్ప మరేం వినిపించటం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది.

చదివీ చదివీ నిద్ర ముంచుకొస్తుంటే ఆవులిస్తున్న ప్రియ... అయ్యో అని కాస్త గట్టిగానే అంది. ఉలిక్కిపడిన తల్లి.. ఏమ్మా... ఏమైందంటే ఏం లేదని మళ్లీ ఊగటం మొదలెట్టింది.

కిరోసిన్ బుడ్డీ వెలుతురికి చుట్టూ చేరి వేడి తట్టుకోలేక చచ్చి పడుతున్న చిన్న చిన్న పురుగుల్ని చూసి అయ్యో అన్నానంటే.. ఏం పిచ్చిపిల్లవే నువ్వు అని అమ్మ నవ్వుతుందని ఇందాక చెప్పలేదు.

ఆ పురుగులు చచ్చిపోవటం ఇష్టంలేని ఆ అమ్మాయి తన చిన్ని చేతితో పురుగుల్ని తోలుతూ, ఆవులిస్తూ బలవంతంగా నిద్రను ఆపుకుంటూ కూర్చుంది.

ఈ లోగా వంట పూర్తికాగానే తండ్రీ కొడుకుల్ని నిద్రలేపిన తల్లి అందరికీ వడ్డించి, తాను తిని.. అందరికీ పక్కలేసి పడుకోబెట్టింది.

నిద్ర రాని ప్రియ.. అమ్మ ఇంకా పడుకోలేదేం అని చూస్తే.. నిద్ర పోకుండా బుడ్డీ వెలుతుర్లో చిరిగిన బట్టలకి చాలా జాగ్రత్తగా కుట్లు వేసి... కుట్టిన బట్టల్ని జాగ్రత్తగా మడిచి దిండుకింద పెట్టుకుని పడుకుంటోంది.. అమ్మెందుకిలా చేస్తోందబ్బా... ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది.

పొద్దున్నే లేచి బడికి తయారవుతున్నప్పుడు అమ్మ ఇచ్చిన యూనిఫాం జత చూడగానే.. చిరుగులు కనిపించకుండా జాగ్రత్తగా కుట్టి.. చక్కగా ఇస్త్రీ చేసినట్లున్నాయి. అమ్మ బట్టలు మడిచి తలకింద ఎందుకు పెట్టుకుందో అప్పుడు అర్థమైంది. హుషారుగా తమ్ముళ్లతోపాటు బడికి బయల్దేరింది. 
తమ్ముళ్లను వాళ్ల క్లాసుల్లో వదిలిపెట్టి తన క్లాసుకు వెళ్లిపోయింది.

ఆ రోజు శుక్రవారం. తెలుగు పీరియడ్ జరుగుతోంది. రోజూ అందరూ యూనిఫారాలు వేసుకుని వచ్చేవాళ్లు. ఇవ్వాళ కూడా అందరూ యూనిఫారంలో ఉన్నా.. దివ్య మాత్రం కొత్త బట్టలతో వెలిగిపోతోంది. చూడగానే ప్రియకి అర్థమైంది. ఓహో ఇవ్వాళ తన పుట్టిన రోజన్నమాట. చిన్నప్పటినుంచీ ప్రతి క్లాసులోనూ చాలామంది పుట్టినరోజులంటూ కొత్త బట్టలు వేసుకుని, చాక్లెట్లూ, స్వీట్లూ పంచిపెడుతున్నది చూస్తోంది కాబట్టి ఇవ్వాళ కూడా చూడగానే అర్థం చేసుకుంది.

మనసంతా దిగులు నిండిపోగా... వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పాఠం వినసాగింది. దివ్య పుట్టిన రోజు చేసుకుంటే తనకెందుకు ఏడుపు...? ఏదో కారణం ఉండే ఉంటుంది.. ఏంటది..?

ఒకటో తరగతి నుంచీ 5వ తరగతికి వచ్చినా ప్రియ ఒక్కసారి కూడా పుట్టిన రోజు చేసుకోలేదు. క్లాసులోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున... పుట్టిన రోజు అంటూ చాక్లెట్లు, కొత్త బట్టలతో వచ్చేవాళ్లు.

ఏయ్ ప్రియా.... నీ పుట్టిన రోజు ఎప్పుడు అని అడిగేవాళ్లు. ఏం చెప్పాలో తెలీక, ఎప్పట్లాగే ఓ నవ్వు నవ్వి... మేం పుట్టిన రోజులు అవీ చేసుకోం అనేసేది.

కానీ నిజం తనకి మాత్రమే తెలుసు. ఏంటా నిజం... నీ పుట్టిన రోజు ఎప్పుడు అని ఎవరు ఎంతగా అడిగినా ఆమె చెప్పలేదు. ఎందుకంటే తన పుట్టిన రోజు ఎప్పుడో తనకి తెలీదు కాబట్టి. అసలు తన పుట్టిన రోజే కాదు.. తన తమ్ముళ్లిద్దరి పుట్టిన రోజులు కూడా తనకి తెలీవు. తనకే కాదు ఎవరికీ తెలీవు. అమ్మా నాన్నలకి కూడా తెలీదా అయితే అని అడిగారంటే.. వాళ్లకి కూడా తెలీదు.. అదేంటి అంటే.. అదంతే...

ఇవ్వాళ ఎలాగైనా సరే అమ్మని, నాయన్ని అడగాలి. అందరూ పుట్టిన రోజులు చేసుకుంటున్నారు.. మా పుట్టిన రోజులు ఎప్పుడని..

ఇంతకుముందు ఎన్నోసార్లు అడిగినా చెప్పలేనివాళ్లు ఇప్పుడు చెబుతారా అన్న సందేహం ఆ చిన్ని మనసులో లేకపోలేదు.. అయినా సరే అడగాలి. గట్టిగా నిర్ణయించేసుకుంది.

వాడిపోయిన ముఖాలతో ఉస్సూరని ఇంటికి వచ్చిన అమ్మానాన్నలు... పిల్లల్ని చూడగానే ఒక్కసారిగా ముఖమంతా సంతోషం పులుముకుని పొదివి పట్టుకున్నారు. ఎప్పట్లా అలసట పారిపోగా... ఉత్సాహంతో పిల్లలకి కథలు చెబుతూ నాయినా, వంటచేస్తూ అమ్మ...

కథ వింటూ వింటూ మధ్యలో ఏదో గుర్తొచ్చినదానిలా మెల్లిగా లేచి అమ్మ దగ్గరికి చేరింది ప్రియ.

మా.. మా... అంది.

ఏం తల్లీ.. ఏం కావాలి...

మరీ.. మరీ... అంటూ గొణుక్కుంటూ కూర్చుంది.

గొణుగుడు ఏంటే... ఏంకావాలమ్మా...?

మా క్లాసులో అందరూ పుట్టిన రోజులు చేసుకుంటున్నారు.. మేమూ చేసుకోవాలి కదమ్మా... మేము ఎప్పుడు పుట్టాం... అమ్మ కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగింది.

ఓస్.. ఇదా.. ఎప్పుడూ ఇలాగే అడుగుతావ్. మాకేం తెలుసు తల్లీ. ముగ్గురూ శనివారం రోజే పుట్టారు. నువ్వు సాయంత్రం 4 గంటలకు, పెద్దోడు పొద్దున్నే 6 గంటలకు, చిన్నోడు మధ్యాహ్నం 2 గంటలకు పుట్టారు అంది.

అది కాదమ్మా.. ఏ సంవత్సరంలో, ఏ తేదీలో పుట్టాం...?

అవన్నీ నాకేం తెలుసు తల్లీ. సమత్సరము, తేదీ అంటే ఏంది... ప్రియనే ఎదురు ప్రశ్నించటంతో... ఏం చేయాలో తెలీక బిక్కమొహం వేసింది.

అమ్మా, నాయనా చదువుకోలేదు కాబట్టి వాళ్లకి తెలీదని అర్థం చేసుకుంది. ఇప్పుడెలా అందరికీ పుట్టిన రోజులున్నాయి. మాకు ఉన్నాయి.. కానీ తెలీదు. చాలా బాధగా అనిపించింది... ఏడుస్తూనే నిద్రపోయింది.

పొద్దున్నే బడికి వెళ్తుంటే మళ్లీ పుట్టిన రోజు సంగతి గుర్తుకొచ్చింది ప్రియకి. అమ్మా, నాయినా చదువుకోలేదు సరే... మామ చదువుకున్నాడు కదా.. మామ రాసి ఉంటాడేమో....?!!

ఆ ఆలోచన రాగానే సంతోషం పట్టలేకపోయింది. ఆ రోజు ఉత్సాహంగా బడికి వెళ్లింది. బళ్లో అందరికీ... నేను కూడా పుట్టిన రోజు చేసుకుంటాను తెలుసా...?! అంటూ చెప్పుకుంది. అలాగా... నీ పుట్టిన రోజు ఎప్పుడు ప్రియా... అని ఫ్రెండ్స్ అడిగితే... మా మామని అడిగి చెబుతానే..! కళ్లింతవి చేసుకుంటూ చెప్పి తుర్రుమంది.

ఆర్నెల్లకో, సంవత్సరానికో ఓసారి ఇలా కనిపించి అలా మాయమయ్యే మామ కోసం... ఆ రోజు నుంచీ ఎదురుచూపులు... ఓ రోజు అనుకోకుండా ఇంటికి వచ్చాడు. 

ఉద్యోగం చేసే మామ అంటే అమ్మకీ, నాయనకీ... బంధువులందరికీ కాస్త భయం. ఉజ్జోగస్తుడనో, లేకపోతే తనకంటే పెద్దవాడనో అమ్మ ఆయనతో ఏం చెప్పాలన్నా, ఏం మాట్లాడాలన్నా భయపడేది.

ఎంతగా భయమున్నా సరే... పుట్టిన రోజు సంగతి అడగకపోతే ఊరుకునేది లేదని అమ్మకి హెచ్చరిక చేసి... రెడీ చేసి పెట్టింది ప్రియ.

అమ్మ వాళ్లన్నని చూడగానే.. కుశల ప్రశ్నలు అడిగాక... కాస్తంత భయం భయంగానే... నా... ఓన్నా... అంది.

ఏంది మే... ఏం మాట్లాడాలా...

మరీ.. మరీ... పిల్లోళ్ల పుట్టిన రోజులు అంట... నువ్వేమైనా రాసి పెట్టావా...?

ఏమ్మే.. ఇప్పుడేం వాటికి అవసరమొచ్చింది. రాసి పెట్టాలే....ఎక్కడో ఉన్నాయి.

అది కాదన్నా... పిల్లలు బల్లో అందరూ పుట్టిన రోజులు చేసుకుంటున్నారట... వాళ్ల పుట్టిన రోజులు ఎప్పుడని ఒకటే సతాయింపు.

ఆ ఏడ్చార్లే.. తినేదానికి తిండి లేదుగానీ.. పుట్టిన రోజులు వచ్చాయి....

కోపంగా మాట్లాడుతున్న మామపై అమ్మ కొంగు చాటునుంచి భయంగా చూస్తున్న ప్రియకి ఆ రోజు నుంచి ద్వేషం, కోపం మొదలయ్యాయి.

మామ చెప్పేస్తాడనే నమ్మకంతో బల్లో అందరికీ చెప్పేశానే... ఇప్పుడేమో ఈయన చెప్పటం లే.. పుట్టిన రోజు ఇంగ తెలుసుకోనేలేనా...

నాయినమ్మ, అమ్మమ్మ, తాతలు, చిన్నాయిన, చిన్నమ్మ, అత్త, మామ... ఎవరిని అడిగినా ఒకటే మాట.. ఇయ్యన్నీ మాకెలా తెలుసుమే... మీ మామనే అడగ్గూడదూ... అని..

అందాసుగా నీకు ఇన్నేళ్లు అని చెబుతున్నారేగానీ.. ఖచ్చితమైన తేదీ, సంవత్సరం చెప్పలేకపోతున్నారు.

నా పుట్టిన రోజు ఎప్పుడో తెలుసుకోవడం ఇంత కష్టమా... కంట్లో నీళ్లు చిప్పిలుతుండగా, ఎలాగైనా సరే తెలుసుకుని తీరాలి... ఎప్పట్లా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది.

ప్రతి యేడూ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాసులోకి మారుతున్నా.. కావాల్సిన సమాచారాన్నంతా టీచర్లే పూర్తి చేసి నాన్నతో వేలిముద్ర వేయించుకోడం తనకి తెలుసు. అందుకే టీచర్లను ఎవరినైనా అడగాలంటే చచ్చేంత భయం. ఇది కూడా తెలీదా నీకు అని వాళ్లూ, తోటి పిల్లలూ నవ్వుతారన్న బెరుకు...

కాలం అలాగే గడవసాగింది... ఒక్కో క్లాస్ దాటుకుంటూ పదోక్లాసులోకి వచ్చేసింది...

మొత్తానికి హాల్ టికెట్లోనో లేదా మార్కుల లిస్టులోనో తన పుట్టిన రోజు, సంవత్సరం ఉండటం గమనించింది. అంతే ప్రియ సంతోషానికి అవధులు లేకపోయింది.

హమ్మయ్యా... ఇన్నాళ్లకు కాదు కాదు ఇన్నేళ్లకు తన పుట్టిన రోజు తెలుసుకోగలిగానని అనుకోగానే.. ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్. భద్రంగా రాసి పెట్టుకుంది.. తమ్ముళ్లవీ అలాగే రాసి పెట్టుకోవచ్చు అనుకుంది.

అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.

మా అమ్మా, నాన్నలకే తెలీని పుట్టిన రోజు, సంవత్సరం.. టీచర్లకు ఎలా తెలిసింది..? రిజస్టర్లలోకి ఆ వివరాలన్నీ ఎలా వచ్చాయి..?

అంతే కుదురుగా ఉండలేకపోయింది. ఎవరిని అడగాలి.. ఎలా తెలుసుకోవాలి...

తనతో కాస్తంత చనువుగా ఉండే రాజమ్మ మేడమ్ గుర్తుకొచ్చిందా క్షణంలో.. మరుక్షణం ఆమె ముందు ప్రత్యక్షమై... పదానికి పదానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా గడగడా అడిగింది.

బడిలో చేర్చుకునేటప్పుడు అక్కడి టీచర్లు నీ వివరాలన్నీ మీ పెద్దోళ్లను అడిగి ఉంటారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం అందాసుగా వాళ్లు రాసుకుని ఉంటారు. అంతేగానీ ఇవే ఖచ్చితమైన పుట్టినరోజు, సంవత్సరం కాకపోవచ్చని చావు కబురు చల్లగా చెప్పింది మేడమ్.

అయ్యో.. అంటూ చతికిలబడిన ప్రియ సమస్య మళ్లీ మొదటికి...

తెలుసుకునే మార్గం ఎలా...? అందాసుగా అని మేడమ్ అన్న సంగతి గుర్తుకొచ్చింది. అంటే నేను పుట్టినప్పుడు జరిగినవి ఏమైనా అమ్మానాన్నలకి గుర్తు ఉంటే... అవెప్పుడు, ఏ సంవత్సరంలో జరిగాయో తెలుసుకోవచ్చుగా... ఆలోచన రాగానే మెల్లిగా పెదవులపై చిరునవ్వు దోబూచులాడింది.

ఇంటికెళ్లగానే... మ్మా... ఓమ్మా....

పిలుపూ, ఆ పిలుపులోని వేగం గమనించిన తల్లి నవ్వుతూ... "ఏమ్మా మళ్లీ పుట్టిన రోజు గొడవేనా..?!"

అమ్మ నవ్వుతూ అన్నా.. అదేం పట్టించుకోని ప్రియ చాలా సీరియస్‌గా.. "అదేం లేదు మా... మా స్కూళ్లో సార్‌లకి కూడా తెలీదంట.. పోనీలే.. ఇది చెప్పు.. నేను పుట్టినప్పుడుగానీ, పుట్టకముందుగానీ... ఏమైనా జరిగాయా...?"

మళ్లీ తనే అందుకుంటూ.. "పెద్ద పెద్ద విషయాలు.. మీరు బాగా భయపడి, బాధపడిపోయినవి" గుర్తుకు తెచ్చుకుని చెబుతావా...?!

ఏం జరిగాయబ్బా.... గుర్తుకు రావట్లేదే...

ఏమయ్యో.. ఇట్రా... నీకేమైనా గుర్తుకొస్తుందేమో కాసేపు ఆలోచించరాదూ...?!.. ఇద్దరూ చెరోవైపు ఆలోచనలో పడిపోయారు.

ఆ గుర్తొచ్చింది తల్లీ... నువ్వు సమత్సరం బిడ్డగా ఉన్నప్పుడు అదేదో స్కైలాబ్ పడుతుందనీ... ఈ పెపంచకం అంతా నాశనమైపోతుందని.. అందరూ చచ్చిపోతామని... ఏంటేంటో సెప్పారు... వణికిపోయాం.. పెపంచకమే ఉండకపోతే ఇంకెలా.. అమ్మో.. మాకేమైనా అవనీ... నా బిడ్డకేం కాకూడదు.. ఎట్లా ఏడ్చామో.. ఇదేమీ తెలీని నువ్వు బోసినవ్వులు నవ్వుతుంటే ఇంకా దుఃఖం ముంచుకొచ్చేది.

తెల్లారితే ఈ పెపంచకమే ఉండదని... మాకేమైనాగానీ.. నీకు ఏమీ కాకూడదని మా ఇద్దరి మధ్యలో నిన్ను పడుకోబెట్టుకుని...నిన్ను గట్టిగా పట్టుకుని మీయమ్మా నేనూ రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. పొద్దున్నే లేవగానే.. స్కైలాబ్ అదేదో సముద్రంలో పడిపోయిందని ప్రమాదం తప్పిందని రేడియో వార్తల్లో తెలిసాకగానీ.. మా పాణం కుదటపడలేదు తల్లీ... భారంగా ఊపిరితీసుకుంటూ నాన్న.

ఈ విషయం చెబుతున్న అమ్మానాన్నల బాధ, ఆరాటం వారి కళ్లలోనూ, మాటల్లో కనిపిస్తుంటే... మాటల్లేక మూగబోయింది. కాసేపటికిగానీ తేరుకోలేని ప్రియ..

స్కైలాబ్... ఇది ఎప్పుడు పడిందో తెల్సుకోవాలి. ఎలా..? మళ్లీ రాజమ్మ మేడమ్ ముందు ప్రత్యక్షమైంది.

స్కైలాబ్...... 1979, జూలై 11న కూలిపోయింది ప్రియా. నాకు బాగా గుర్తుంది.. స్కైలాబ్ కూలిపోతుందని తెలియగానే ఇక భూమిపై నూకలు లేవనుకున్నారు. గొర్రెలు, మేకలు, ఆస్తులు లాంటివి అమ్మేసుకున్నారు. పిల్లల్ని బడికి పంపలేదు. పిల్లా, జెల్లా అందరూ కలిసి చివరి క్షణాల కోసం భయం భయంగా ఎదురుచూశారు. చివరికి ఎలాంటి ఉపద్రవం లేకుండా.. దక్షిణ హిందూ మహా సముద్రంలో.. ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో స్కైలాబ్ కూలిపోయిందనే వార్త తెలిసింది. 2,310 కిలోల బరువున్న స్కైలాబ్ 500 ముక్కలుగా పేలిపోయిందట. 1973 మే 14న అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్ ఆరు సంవత్సరాల పాటు కక్ష్యలో ఉండిందని రేడియో వార్తల్లో, వార్తా పత్రికల్లో చదివాము... చెప్పుకుంటూ పోతోంది మేడమ్.

సో.. మార్కుల లిస్టులో ఉన్నట్లుగా నువ్వు 1978లో పుట్టావన్నది ఖచ్చితంగా అర్థమవుతోంది.. ఇక పుట్టిన రోజే తెలియాలి. అది రాసి పెట్టిన మీ మామ చెబితేగానీ తెలీదు. ఆయన్నే అడిగి తెలుసుకో... పుట్టిన రోజు కోసం మరీ ఇంతగా పట్టుబట్టి తెలుసుకోవాలా పిచ్చిపిల్లా.. చనువుకొద్దీ నవ్వుతూ అందామె. ఆమెతో జతకలిపిన ప్రియ భారంగా అక్కడ్నించీ కదిలింది.

పుట్టిన రోజు తెలుసుకోవడం ఇంత కష్టమా... చాలా బాధగా, ఎవరిపైనో కోపంగా ఉంది ప్రియకి.

తన కోపం ఎవరిపైన...? చదువుకోని అమ్మా,నాన్నల మీదనా.. లేక చదువుకుని... రాసిపెట్టి కూడా చెప్పకుండా ఉన్న ఆ పెద్ద మనిషిపైనా... తెలీదు కాని.. బాగా కోపంగా ఉంది.

చదువుకుని ఉద్యోగస్తుడిగా ఉన్నా.. చదువుల్లో ఎలాంటి గైడెన్సూ ఇవ్వకలేకపోయిన మామ పెద్దరికం, గాంభీర్యానికి ఇక తామందరం భయపడటంలో అర్థం లేదనిపించింది. ఇప్పుడు చిన్నపిల్లనేంకాను.. పెద్దదాన్ని అయ్యాగా.. ఈసారి రానీ మామని అడిగేస్తాను గట్టిగా నిర్ణయించుకుంది.

కొన్నాళ్లకే... గంగమ్మ జాతరకి కుటుంబంతో సహా దిగిన మామని గట్టిగా నిలదీసింది ప్రియ. మీ పిల్లలకైతే పుట్టిన రోజులు రాసిపెట్టి.. సంవత్సరం సంవత్సరం పుట్టిన రోజులు చేస్తారు. మా పుట్టిన రోజులు మాత్రం చెప్పరు. మాయమ్మా, నాయనకి చదువొచ్చింటే మాకీ పరిస్థితి వచ్చేది కాదు. రాసిపెట్టినా నువ్వెందుకు చెప్పటంలేదు. ఎప్పడు అడిగినా ఏదో ఒకటి చెప్పి మా నోరు మూస్తావేగానీ చెప్పవెందుకు మామా.... వసపిట్టలా ఆగకుండా మాట్లాడుతున్న ప్రియని చూసి నోరెళ్లబెట్టాడాయన.

అది ఎన్నేళ్లనుంచీ అడుగుతోంది.. ఇప్పడైనా సెప్పున్నా.... అమ్మ ప్రియకి జతకలిసింది.

అది కాదు మే..... మరీ.. మరీ... రాసిపెట్టానుగానీ... ఏదో పుస్తకంలో రాశాను.. అదెక్కడపోయిందో కనిపించటంలేదు..... తేదీ గుర్తులేదుగానీ... సంవత్సరం మాత్రం గుర్తుంది... 78 అనుకుంటా..... పేద్ద రహస్యాన్ని బద్ధలుకొట్టినట్లు నిశ్శబ్దం ఆ ఇంట్లో కాసేపు.

ప్రియకు ఏడుపు ఆగలేదు. మేమూ తన పిల్లల్లా కాదా.. మేమంటే అంత నిర్లక్ష్యమా... అదే మా అమ్మా, నాన్నా చదువుకుని ఉంటే... అంతే కళ్లు నిండిపోయాయి... మామపై ఓ చూపు విసిరేసి అక్కడ్నించీ కదిలింది.

మొత్తానికి తన పుట్టినరోజు ఓ పెద్ద సమస్యై కూర్చుంది. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. మొత్తానికి ఖచ్చితమైన తేదీ తెలీకపోయినా.. స్కైలాబ్ సంఘటనతో సంవత్సరం మాత్రం తెలుస్తోంది. ఇది చాలదా...?!

ఈ ప్రపంచం అంతా నాశనమైపోతుందని భయపడి.. ఎలాంటి ఉపద్రవాలూ లేకుండా అందరూ ప్రాణాలతో బయటపడిన ఆ రోజునే పుట్టిన రోజుగా నేను ఎందుకు చేసుకోకూడదు..?!.. ఇలా చేసుకుంటే ఏం... కాసేపటికిగానీ ఆలోచనల్లోంచి తేరుకోలేని ప్రియ..

ఓ స్థిరమైన అభిప్రాయంతో... మామనే కాదు.. ఇంకెవరినీ ఈ విషయంలో అడగాల్సిన పనిలేదు... మనసులోనే అనుకుంది.

కోట్లాది మందికి పునర్జర్మ లభించిన ఆరోజునే నా పుట్టిన రోజు.. ఇందులో మార్పేమీ లేదు.

నిద్రలోంచి హాయిగా మేల్కొంటూ కళ్లు తెరిచిన ప్రతిరోజూ ఓ పుట్టిన రోజే కదా.. ఈ సత్యం తెలిసేందుకు నాకు ఇన్నాళ్లు పట్టిందా...?! ఇప్పటికైనా తెలిసిందిగా.

చాన్నాళ్ల తర్వాత హాయిగా నిద్రపోయిందామె...

మరో పుట్టినరోజుకు సిద్ధమౌతూ....

జీవితం నాకు ఏమిచ్చింది అనేకన్నా... జీవితం నాకు జీవించడం నేర్పింది... ఇంతకంటే ఇంకేం కావాలి... తృప్తిగా సాగిపోవడం మినహా...!!


Monday 24 June 2013

సాగిపో... నిన్ను నీవు మల్చుకుంటూ...!!



                             తనువంతా నెర్రెలతో
                             తడిలేని గొంతుకతో
                             తడబడే మాటలతో
                             నిట్టూర్పు ఆవిర్లతో
                             జాలిలేని మేఘాల్ని
                             శపించలేని అశక్తతతో
                             నీటిబొట్టుకోసం తపించే "నేలమ్మ"లా...

                             అసహనపు నిట్టూర్పుతో
                             బాధ్యతల బరువుతో
                             నిగ్రహపు నిరసనలతో
                             ఆగ్రహపు ఆక్రందనతో
                             పలవరిస్తున్న "మనసమ్మ"ని
                             ఊరడించమంటూ......
                             ఘనీభవించిన దుఃఖ మేఘాల్ని
                             ఒడిసి పట్టుకున్న నయనాల్ని
                             ఎంత వేడుకున్నా...
                             జాలిలేని ఆ మేఘాలకు మల్లే
                             ఎంతకీ వర్షించేవేం...?

                             ఛిద్రమైన బ్రతుకు ఆశల్ని గుదిగుచ్చి
                             జీవితపు గుడ్డకు అతుకులేస్తూ
                             జ్ఞాపకాల కొలిమిలో కాలి కాలి
                             రాటుదేలిన నిజానివై
                             నిబ్బరంగా సాగిపోవాలేగానీ

                             బేల అవకు మిత్రమా...?

                             కన్నీళ్లే కత్తులై ప్రశ్నిస్తుంటే...
                             ఇక కన్నీళ్లకి చోటెక్కడ
                             
                             జీవన సమరంలో సిపాయినై
                             అలుపెరుగని సమరానికి
                             సై అనటం తప్ప...!!!


Sunday 16 June 2013

అదంతే... నాన్నా....!!



ఆయన ఎక్కడున్నాడు
ఎప్పుడో పోయాడుగా
నాకైతే నమ్మబుద్ధే కాదు
నమ్మనంటే నమ్మనని
ఉన్నావని వాదిస్తాను

కాసిన్ని విచిత్ర నవ్వుల్ని
మరికొన్ని చిత్రమైన మాటల్ని
ఇంకొన్ని జాలి చూపుల్ని
నా ముందు విసిరేస్తుంటారు
పిచ్చిది కాబోలు అనుకుంటూ...

ఇంట్లో అడుగుపెట్టింది మొదలు
నాన్నా... నాన్నా.. అంటూ
నీ ముందు ప్రత్యక్షమై
వసపిట్టలా వాగి వాగి
ఆనక ఆకలి గుర్తొచ్చి
అమ్మ దగ్గరికి పరిగెడితే...
ఏంటో దీని పిచ్చిగానీ
తనలో తాను గొణుక్కుంటూ
కంటినిండా నీటితో..... అమ్మ

ఇంట్లో ఉన్నన్నాళ్లూ
నీ చుట్టూ తిరుగుతూ
అల్లర్లు, అలకలు, ఫిర్యాదులు, కబుర్లు
ఒకటేమిటి..
ఇద్దరం మాటాడేసుకుంటుంటే
కుళ్లు సంగతి పక్కనబెట్టి
అందరూ హాశ్చర్యంతో
నోర్లు వెళ్లబెడుతుంటే
ఎంతగా నవ్వుకుంటామో
కదా నాన్నా...!

లేని నిన్ను తల్చుకుంటూ
ఉన్న ఫొటోను నిమురుతూ
నాలో నేను మాట్లాడుతుంటే
జనానికి హాశ్చర్యమూ
అమ్మకి కంటినిండా నీరూ...

ఏం చేయను..
నువ్ లేవంటారు
కాదు...
మాతోనే ఉన్నావంటాను
ఎవ్వరూ ఒప్పుకోరు
నేను అస్సలే ఒప్పుకోను...
అదంతే... నాన్నా....!!

ఇన్నాళ్లూ నీ చేతుల్లో నేను...
ఇప్పుడు నా గుండెల్లో నీవు...
అదంతే... నాన్నా....!!


Friday 14 June 2013

క్షణాలే యుగాలైనా..!!



పగలయితే క్షణాల్ని
రాత్రయితే నక్షత్రాల్నీ... లెక్కపెడుతూ
తనువంతా కళ్లతో
నీ కోసం చూస్తుంటానా

ఓ క్షణం మెరుపులా
అలా వచ్చి ఇలా మాయవుతుంటావు
అయినా
ఆ క్షణకాలపు నీ సాన్నిధ్యం
గుండె లోతుల్లోంచి వస్తోందా
అన్నట్టుండే నీ పిలుపూ
ఎంత బాగుంటాయో

అందుకే.....
క్షణకాలపు మెరుపువైనా
క్షణాలు యుగాల్ని సైతం లెక్క చేయకుండా
కళ్లలో వత్తులేసుకుని మరీ
నీ కోసం ఎదురు చూస్తుంటా...!!


Thursday 9 May 2013

అక్షర "అభిషేకం"....!



నువ్వెవరో నాకు తెలీనప్పుడు....

బాగానే ఉండేది. రోజులు ఎప్పట్లా వాటికవే దొర్లిపోతుండేవి

జీవితంలో ఏదో తెలీని వెలితి ఉంది అని అనుకోడానికేం లేదు

నాకేం బానే ఉన్నానుగా అనుకునేస్తూ.. ఎంచక్కా ధీమాగా గడిచిపోతుండేది.

ఓ మనిషి ఆనందంగా ఉండేందుకు ఏం కావాలో అన్నీ దొరుకుతున్నప్పుడు విచారానికి టైం ఎక్కడుంటుంది. అందుకే నాకేంటి అన్నీ ఉన్నాయిగా అదే ధీమా

రోజువారీ వ్యాపకాల్లో మునిగి తేలుతూ.. బంధాల బాధ్యతల్లో తలమునకలవుతూ.. తప్పనిసరి పెద్దరికాన్ని ముఖానికి తగిలించుకుని...

రోజు ఎలా గడిచిపోతోందో తెలీనంత బిజ్జీగా బిజ్జీగా జీవితం.... ఇంతకంటే ఇంకేం కావాలనే ధీమా......

ఓ రోజున అనుకోకుండా నువ్వొచ్చావు...

నువ్వొచ్చాక కూడా బాగానే ఉండేది.. అంతకుముందు ఎలానో అలానే ధీమాగా.....

నేను తగిలించుకున్న ధీమా... ఒట్టి గాంభీర్యమే అని అర్థం చేయించేందుకు నీకు చాలా కాలం పట్టలేదు

నా ధీమా వెనుక అసలు కథను ఒక్కోటిగా విడమర్చావు

ఇన్నాళ్లూ చీకట్లోనే ఉంటూ వెలుగులో ఉన్నాననుకుని భ్రమపడుతున్నావన్నావు

నిజమైన వెలుగును నే చూపిస్తా పదపదమన్నావు

ఇల్లు, కుటుంబం, బంధాలు, బాధ్యతలనే రెండు మూడు రంగులే లోకమంతా నిండిపోయానుకునే నాకు...

"సాహిత్య" మనే ఇంధ్రధనుస్సు రంగుల హరివిల్లును కళ్లముందు పరిచావు...

బావిలో కప్పలా ఉంటూ.. నా ప్రపంచం నిండుగా, హాయిగా ఉందనుకునే నా భ్రమను పటాపంచలు చేస్తూ......

నిజమైన ప్రపంచం ఇదే.. ఇటు చూడు అంటూ విశాల ప్రపంచంలోకి లాక్కొచ్చావు

"నిన్ను నీవు తెలుసుకో
నిన్ను నీవు ప్రేమించుకో
నిన్ను నీవు గౌరవించుకో
నిన్ను నీవు ఆదరించుకో
నిన్ను నీవు మార్చుకో
నిన్ను నీవు మలచుకో" మంటూ....

నన్ను నాకే కొత్తగా, సరికొత్తగా పరిచయం చేసిన

ఓ "సాహితీ" మిత్రమా...!
నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను
నా "అక్షరాలతో" నిన్ను అభిషేకిస్తూనే ఉంటాను


Monday 29 April 2013

జాజిమల్లిగారి బ్లాగులో కారుణ్య.......!!





జాజిమల్లి గారి బ్లాగులో.... నా అక్షరాల్లో నేను...... :)


మొదటినుంచీ మనసుకి తోచినవి రాయటం అలవాటు. నచ్చినవి, నచ్చనివి.. స్పందింపజేసినవి.. ఆలోచింపజేసినవి.. బాధపెట్టినవి, భయపెట్టినవి, బాధ్యతల్ని నేర్పినవి ఇలా ఒకటేమిటి అన్నీ మనసు చెప్పిన కథలు, కథనాలే నా బ్లాగునిండా. ఎక్కువగా స్వానుభవాలే. మొదట్లో ఏం రాయాలన్నా ఇది బాగుండదేమో, ఎవరికీ నచ్చదేమో… ఇలా రాయకూడదేమో…… ఇలా ఎన్నో రకాల సందేహాలు.


చాలామందికిలా చిన్నప్పటినుంచి చందమామ సాహిత్యం చదువుతూ పెరగలేదు నేను. అస్సలు అదొక పత్రిక ఉందన్న సంగతి కూడా నా పెళ్లి అయిన రెండు మూడేళ్లదాకా కూడా తెలీదు. మీకు ముందే చెప్పాను కదండీ అమ్మా నాన్నలు నిరక్షరాస్యులు. ఓ పూట తింటే రెండు పూటలు పస్తులుండే పరిస్థితుల్లో నా చిన్ననాటి జీవనం సాగింది. ఇక్కడ పస్తులు అంటే అమ్మానాన్నలకేనండీ. మాకు మాత్రం మూడుపూటలా కడుపునిండేది.. మరి అమ్మానాన్నలంటే అంతే కదండీ.

అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బడికి పంపటమే గొప్ప విషయం. పుస్తకాలు, బట్టల్లాంటి కనీస అవసరాల్ని తీర్చేందుకే నానా అగచాట్లు పడేవాళ్లు. నేను 8వ తరగతిలోకి వచ్చేదాకా ఇదే పరిస్థితి. తరువాత క్రమంగా మారటం మొదలైంది. ఉన్నంతలో కాస్త బాగా బ్రతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. బాల సాహిత్యం లాంటివి ఉంటాయన్న సంగతి నాకు అస్సలు తెలీదు. దినపత్రిక, వార పత్రికల సంగతి ఇక సరేసరి. అయితే ఒక్కటి మాత్రం నిజం. పుస్తక రూపంలోని కథలు.. సాహిత్యం చదవకపోయినా… అద్భుతమైన బాల్యాన్ని అనుభవించాననే చెప్పవచ్చు. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్యల ప్రేమ, లాలన… వాళ్ల ఒళ్లో పడుకుని, భుజాలపై వాలిపోయి మరీ లెక్కలేనని కథల్ని విన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను.


ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో....

http://jajimalli.wordpress.com/2013/04/29/%E0%B0%A7%E0%B1%80%E0%B0%B0%E0%B0%97%E0%B1%81%E0%B0%A3-%E0%B0%B6%E0%B1%8B%E0%B0%AD/