Pages

Monday 10 September 2012

జ్ఞాపకాల జడివాన జోరు తగ్గేదెలా.....!!



నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన...

చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన...

చూపులు, చేతులు కలిసి
ఒకటి రెండో భుజానికి ఆసరాగా
ఇరు మనసుల కలబోతలో
అంతేలేని మాటల జల్లులై కురిసేవేళ
ముసిముసి నవ్వుల ప్రేమవాన...

ప్రేమబంధం మాంగల్య బంధమై
మరుజన్మ ఎత్తితే
ఏకాంతపు లోగిలిలో
అనురాగపు ఆనందాల వెల్లువలో
సిగ్గుల మొగ్గ సింధూరపు వాన...

ముద్దు ముద్దు మాటలు
మురిపాల మూటలై
అమ్మానాన్నలని చేసిన
బుడి బుడి అడుగుల చప్పుడు
చిటపట చినుకుల నాట్యమైనప్పుడు
గుండెనిండా వాత్సల్యపు వాన...

రెక్కలొచ్చి ఎగురనేర్చి
గూడును, కన్నవారినొదిలి
కాలమనే కారుమబ్బులై
తుఫానులా తీరం చేర్చితే
జీవితపు మలిసంధ్య వాన...

మది గదిలో వాన...
చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది
వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...