Pages

Friday 23 November 2012

అలకమానవే కులుకుల చిలకా...!!



రోజూ ఆరింటికి కాకపోయినా ఏడింటికైనా నిద్రలేచేసే బుద్ధిమంతురాలినైన నేను....

ఆ రోజు తెల్లారి... టైం ఎనిమిది అవుతోందన్న స్పృహ కూడా లేకుండా... గాఢనిద్రలో... కలల సలపరంతో విలవిలలాడుతుంటే... తలుపులు దబదబా బాదుతున్న చప్పుడు....

ఉలిక్కిపడి లేచి కూర్చొని టైం చూసి బావురుమంటూ లేచి తలుపుతీస్తే.. ఎదురుగా ముఖంనిండా నవ్వులు పులుముకుని... పక్కింటావిడ.

ఏంటండీ.. ఏమయ్యింది.. ఇంత టైం అయినా లేవలేదు. గుమ్మం బయటే పాలు, పేపర్.... కాకులు పాల కవర్‌ని ముక్కుతో పొడుస్తుంటే మిమ్మల్ని లేపాల్సి వచ్చిందని..... అడక్కుండానే గడగడా వివరణ ఇచ్చేసింది.

చాలా చాలా థ్యాంక్స్ అండీ.. మీరు లేపకపోతే కవర్ చిరిగిపోయి పాలన్నీ నేలపాలు అయ్యుండేవి. రాత్రి సరిగా నిద్రపోలేదు.. తెల్లారుజామున ఎందుకో బాగా నిద్రపట్టేసింది... అందుకే లేవలేకపోయానండీ.. పాలు కాకులపాలు కాకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా నా వివరణ ఇచ్చేశాను.

అలాగా.. ఇప్పటికే లేటయ్యింది పనులు చూసుకోండి అయితే.. నేనూ బాబును స్కూలుకి తయారు చేయాలి అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.

పాలు, పేపర్ తెచ్చి టేబుల్‌పై పెట్టి... సోఫాలో కూలబడుతూ.. నిద్ర లేవలేకపోయినందుకు కాసేపు నన్ను నేను తిట్టుకునే ప్రోగ్రాం పెట్టేసుకున్నా.....

పిచ్చిమొద్దూ అంత నిద్ర ఏంటే.... అయినా హాయిగా నిద్రపోయావా అంటే అదీ లేదు..... ఏవేవో పిచ్చి కలలు...

పిచ్చి కలలు.. గుర్తుకురాగానే..... అన్నట్టు హాయిగా మంచి కలల్లో జోగాడుతూ నిద్రపోయే పరిస్థితి కాస్తా పిచ్చి కలల్లోకి మారిపోడానికి కారణం ఏంటి చెప్మా.... ఆలోచనలో పడ్డాను.

ఇంకెవరు... ఉన్నారుగా మహానుభావులు.... అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్తే....

దిండును గట్టిగా కౌగలించేకుని నిద్రలో కలవరిస్తూ, పలవరిస్తూ వయ్యారాలు పోతున్న అతగాడ్ని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. చూడు ఎంత అమాయకంగా, ఏమీ ఎరగనట్టు ఎలా నిద్రపోతున్నాడో...

ఉన్నఫళంగా ఓ బకెటెడు నీళ్లు తెచ్చి మీద కుమ్మరించేయాలన్న ఆత్రం వచ్చేసింది. ఆవేశంతో అలా ఊగిపోతుంటే... నిద్రలో నన్నే కలవరిస్తున్న తనని చూడగానే చప్పున చల్లారిపోయి కూలబడ్డా. పాపం కదా అనిపించింది.

మళ్లీ అంతలోనే ఓ సందేహం. మెలకువగానే ఉండి తను నన్ను కూల్ చేయాలని వేసిన ఎత్తుగడ కాదుకదా అది అనిపించింది. మెల్లిగా దగ్గరికి వెళ్లి చూశా. లేదు నిజంగా నిద్రపోతున్నాడు. అరెరే నిజంగా కలవరిస్తున్నాడు. అయ్యో.. సందేహపడ్డాను కదా....

పోన్లే బంగారూ.. నువ్వు అలాగే కలవరిస్తుండమ్మా.... నే మళ్లీ వస్తాలే... (మనసులో ప్రేమ పొంగుతుంటే...) కోపంగా ఉన్నాను కాబట్టి నా ప్రేమని అప్పుడు తనపై వ్యక్తం చేయలేక భారంగా అక్కడ్నించి కదిలా.

ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు ముగించుకుని వంటగదిలోకెళ్లి, పాలు స్ట‌వ్‌పై పెట్టి.. టిఫిన్‌కి ఏం చేయాలి, లంచ్ ఎలా... అనుకుంటుంటే.. ఆ రోజు సెలవు కాదన్న విషయం అప్పటికిగానీ బోధపడలేదు.

అయ్యో... ఈ రోజు ఆఫీసు ఉంది కదా.. ఆదివారం అన్న మాయలో ఉన్నానేమో... అయినా వారాలు కూడా గుర్తెట్టుకోలేకపోతే ఎలానే తల్లీ... నా పరిస్థితికి నాకే చాలా కోపం వచ్చేసింది. అంతలోనే తనకి కూడా ఆఫీస్ ఉందన్న విషయం గుర్తొచ్చింది. 

రోజూ అయితే నే ముందు లేచేసి, పాలు, టిఫిన్, స్నానం లాంటి పనులు చూసుకుని తనని లేపితే... 

తనేమో తీరిగ్గా లేచి బెడ్ కాఫీ తాగి, పేపర్ చదివి, సిస్టమ్ ఆన్ చేసి మెయిల్స్ గట్రా చెక్ చేసుకుని ఆ తరువాత ఆరామ్‌గా బాత్రూంలోకి దూరిపోయి.. ఆపై టైం చూసుకుని ఉరుకులు పరుగులతో రెడీ అయి నన్ను తొందరచేసి ఎలాగోలా మా ఆఫీసులో నన్ను దించేసి, తను వెళ్లేవారు.

ఇవ్వాళ మేడంగారు.. అంటే నేనే... అలకలో ఉన్నాను కదా... అందుకే తనని లేపలేదు. లేకపోతే నన్ను అంతగా బాధపెడితే నేను అలకమానేసి ప్రేమగా వెళ్లి నిద్ర లేపుతానా..? అస్సలు కుదరదు. నేను లేపేది లేదు అంతే... ఇవేమీ తెలీని తను హాయిగా నిద్రోతున్నాడు. ఎప్పట్లా నేను వెళ్లి నిద్ర లేపుతాననే భ్రమలో ఉన్నాడేమో... నే వెళ్ల.. లేస్తే లేవనీ.. లేకపోతే లేదు..

కోపంగా ఉన్నా కదా.. అందుకే మా ఆఫీసుకి మాత్రమే ఫోన్ చేసి లేటుగా వస్తానని ఫర్మిషన్ తీసుకున్నా. మామూలు స్థితిలో అయితే తను లేవలేని సమయంలో నేనే వాళ్లాఫీసుకు ఫోన్ చేసి ఫర్మిషన్ చెప్పేసేదాన్ని. కానీ ఇవ్వాళ అలా చేయలేదు.

పనులన్నీ చక్కబెట్టేసి ఇద్దరికీ క్యారియర్లు సర్దేసి, కసికొద్దీ కాఫీ, టిఫిన్ లాగించేసి.... తీరిగ్గా పేపర్ ముందేసుకుని కూర్చున్నా.... కాసేపయ్యాక

టైం అవుతున్నా ఇంకా లేవడేం అనుకుంటూ బెడ్రూంలోకెళ్తే.. మళ్లీ సేమ్ కండీషన్‌లో తను.. ఈసారి మరీ చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు (అన్నీ చెప్పుకోలేం కదా- పరువు పోతుంది..). చిర్రెత్తుకొచ్చింది. ఇలా కాదు. ఉండు నీ పని చెబుతా అని బయటికి వచ్చి.. ఫోన్ రింగ్ చేస్తూ కూర్చున్నా. అటువైపు ఉలుకూ, పలుకూ లేదు. ఇహ ఇలా కాదు అనుకుని ల్యాండ్‌లైన్‌కి రింగ్ ఇచ్చా. అంతే ఒక్క కాల్‌కే గురుడు మేలుకున్నాడు.

ఏమీ ఎరగనట్లు ఎప్పట్లా... నా పేరును చాలా ప్రేమగా, తియ్యగా, గోముగా పిలుస్తున్నాడు (మామూలుగా అయితే మురిసిపోతూ తన ఒడిలో వాలిపోయుండేదాన్నేమో..) ఇప్పుడు అలక, కోపం కదా... లోపల్నించి పొంగుకొస్తున్న ప్రేమకు అన్యాయంగా అడ్డుకట్ట వేస్తూ.. భింకంగా, ఏమీ వినపడనట్లుగా పేపర్లో తలపెట్టి కూర్చున్నా...



పిలిచి, పిలిచి.. నేను రాకపోయేసరికి కళ్లు నులుముకుంటూ మెల్లిగా హాల్లోకి వచ్చాడు. సోఫాలో నా పక్కన కూలబడుతూ.. ఏంట్రా బంగారూ.. పిలుస్తుంటే పలకవేం అంటూ దగ్గరికి జరగబోయాడు. (పాపం ఎంత ప్రేమగా దగ్గరికి వస్తున్నాడో చూడు... అలక తీసి గట్టుమీద పెట్టెయ్యవే అని మనసు రొద పెడుతున్నా.. దానికి బుద్ధి చెబుతూ..) ఏదో షాక్ కొట్టినట్లుగా లేచి నిలబడి...

ఇదుగో ఈ బంగారూ, గింగారూ ఏమీ వద్దు... నే అలిగానంతే... నువ్వేం దగ్గరికి రానక్కర్లే... వెళ్లి ప్లాస్క్‌లో కాఫీ ఉంది తాగేసి, హాట్‌బాక్స్‌లో టిఫిన్ ఉంది తినేసి, ఇదుగో నీ క్యారియర్ పట్టుకుని ఆఫీసుకెళ్లు... ఇవ్వాళ నేనే వెళ్తాలే.. అన్నా కోపంగా....

మా బంగారు కదూ, బుజ్జి కదూ... ఎందుకే అంత కోపం... నేను ఏమన్నానని... ఇంతలా సాధిస్తున్నావు అన్నాడు..

ఇదుగో.. నాకు ఇంకాస్త కోపం తెప్పించకు... ఏం అన్నాను అని అంత చిన్నగా అడుగుతావా... (ఇంతకీ ఏమన్నాడు.. అలకలో అసలు విషయం మర్చిపోయా)

ఏమన్నాను బంగారూ.. చెప్పు.. నాకు సరిగా గుర్తు లేదు.. అంటున్నాడు..

మామూలుగా అయితే అలా నిద్ర మత్తులో జోగుతున్న తనని బుజ్జగిస్తూ, ముఖాన్ని ముద్దుల వర్షంలో తడిపేస్తూ.. తన ముఖంలోని పసితనాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇవ్వాళ అలక అనే బెట్టుతో ఉన్నా కదా... తనని అస్సలు పట్టించుకోవట్లేదు.. పాపం ముఖం దీనంగా పెట్టి బ్రతిమలాడుతున్నాడు.

ఇంతలో "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే" అంటూ తన ఫోన్ గట్టిగా పాడుతోంది. బెడ్రూంలో ఉన్న సెల్ కోసం నిద్రమత్తు వదలని నా పతిదేవుడు పరుగున వెళ్లబోయి తూలిపడబోయాడు. అంతే ఒక్కసారిగా నా గుండె జారిపోయింది.

పరుగున వెళ్లి పడిపోకుండా పట్టుకున్నా. తన ముఖం చూడాలి అప్పుడు. ముసిముసి నవ్వులు కలబోసిన ప్రేమతో... విచ్చుకున్న పువ్వులాంటి స్వచ్ఛమైన ఆ ముఖంలో ఓ వెలుగు.. ఆ క్షణంలో నాకు నచ్చిన ఆ బుజ్జి ముఖంలో ఓ గొప్ప నిశ్చింత. నన్ను పడిపోనీయకుండా నువ్వు ఎప్పుడూ నా పక్కన ఉంటావు అనే నిశ్చింతేమో అది.

తనని పడిపోనీయకుండా పట్టుకున్నానన్న అదే నిశ్చింత నాలో కూడా. అంతే ఒక్కసారిగా తనని అల్లుకుపోయా. ముద్దులతో ముంచెత్తేశా.. నా అలక ఇంత త్వరగా తీరుతుందని ఊహించని తను కూడా...  ఓసి నా పిచ్చి బంగారూ... అంటూ నుదుటిపై వెచ్చని ముద్దొకటి ఇయ్యగానే సిగ్గులమొగ్గనైపోయా....

నిజం చెప్పొద్దూ...

అసలు నేను ఎందుకు అలిగానో ఎంత గుర్తు చేసుకుందామన్నా.. ఇప్పటికీ అస్సలు గుర్తుకు రావడం లేదు.....     

(ఓ చిన్న చిలిపి ఊహకు అక్షర రూపమే ఈ పోస్టు..)


Monday 5 November 2012

నాయన తోడులేని, తోడురాని సుదూర ప్రయాణం....!!!



"నాన్న అంటే...
ఒక జ్ఞాపకమా..?
కాదు.. నా జీవితం...!"

"మా నాయన ఉండి ఉంటే నాకు ఇలాగ జరిగేదా...?" కళ్లలోంచి నీళ్లు ఉబుకుతుంటే దాచుకోలేక అనేశాను.

"ఈ మాట నువ్వు అనకుండా ఉండాలని, మీ నాన్న లేని లోటు కనిపించకూడదని.. ఆడ బాధ, మగ బాధ అన్నీ నేనే అయి భరిస్తూ నెట్టుకొస్తున్నా... అయినా అననే అనేశావు కదా...!!" తనకీ కళ్లలో నీళ్లు...

ఆరోజు ఏమైందో ఏమో.. ఒకటే బాధ.. ప్రతిదాంట్లోనూ, ప్రతి విషయంలోనూ... మా నాయినే ఉండి ఉంటే.. ఇలా ఉండేదా, అలా ఉండేదా అనిపిస్తోంది. ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఏదో విషయంలో ఆ లోటు మరీ ఎక్కువగా అనిపించింది (సరిగా గుర్తులేదు) అంతే ఒక్కసారిగా అమ్మపై కేకలు వేసేశాను...

నేనోవైపూ, ఆమె ఓ వైపూ... కళ్లు కన్నీటి సంద్రాలు... బిక్క చచ్చిపోయి పక్కనే తమ్ముళ్లు... కాసేపటికిగానీ తేరుకోలేదు. వెంటనే నేను చేసిన తప్పు అర్థమైంది.. "అమ్మ దగ్గరికి వెళ్లి, పోన్లేమా... ఏదో బాధలో అనేశాను.. నాకు తెలీదా నువ్వెలా చూసుకుంటున్నావో.. బాధపడకు" అంటూ ఓదార్చాను.

"నీకు ఏం తక్కువ చేస్తున్నాను తల్లీ.. ఇంకెప్పుడూ అలా అనకు. ఎంతైనా నాయన ఉన్నప్పటికీ, లేనప్పటికీ తేడా ఉండనే ఉంటుంది. ఆ తేడా తెలీనివ్వొద్దనే అమ్మనైన నేను నాన్నను కూడా అయి సాకుతున్నా. ఆయనకేం మహానుభావుడు త్వరగా వెళ్లిపోయాడు. ఆయనా లేక, నేను లేకపోతే బిడ్డలు ఏమవుతారోనని, తండ్రిలేని పిల్లలుగా పదిమందిలో ఎక్కడ పల్చనవుతారోనని బాధను మనసులో దాచుకుని మీ కోసమే బ్రతుకుతూ, నాకు చేతనైనంత చేస్తున్నాను. అయినా నువ్వే అలా అంటే.. నేనింక ఎవరికి చెప్పుకోను..." బావురుమంది అమ్మ. 

ఆమె బాధలో న్యాయం ఉంది. తను ఎవరికోసం బ్రతుకుతోందో తెలీని స్థితిలో తమ్ముళ్లు, నేనూ లేము. అయినా ఏదో ఆవేశంలో మాట అలా తూలింది. మాట తూలింది అనడం కంటే, నాన్న లేని లేటు, లేడన్న వాస్తవం తట్టుకోలేక "అదే మా నాయనే ఉంటేనా" అనే రూపంలో బయటికి వచ్చేసింది. ఇక్కడ అమ్మదీ తప్పుకాదు, నాదీ తప్పుకాదు..  ఏదయినా తప్పొప్పులు ఉంటే అన్నీ ఆ దేవుడివే... మా నాయనను మాకు లేకుండా చేసిన ఆ దేవుడిదే తప్పు (నిస్సహాయతలో ఇంతకుమించి ఎవరిని నిందించగలం).

చాలాసేపు అమ్మ బాధపడుతూనే ఉంది. ఆమెను ఓదార్చేందుకు తమ్ముళ్లూ, నేనూ ప్రయత్నించాం. మెల్లిగా సర్దుకుంది. కాసేపు మౌనం రాజ్యమేలగా.. ఆ నిశ్శబ్దానికి నేనే బ్రేక్ వేస్తూ.. "నాయన కళ్లద్దాలు కనిపించటం లేదు. ఎక్కడున్నాయి మా.." అడిగాను.

"మారాజు ఇంకా ఎంతకాలం బ్రతుకుదామని ఆశగా ఉన్నాడో ఏమో... ఇక 2 నెలల్లో చనిపోతాడనగా కన్ను ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాక కళ్లు బాగా కనిపిస్తున్నాయని ఎంత సంబరంగా చెప్పాడో... అయినా ఆ దేవుడికి కనికరం లేకుండా పోయింది తీసుకెళ్లిపోయాడు" బాధగా నిట్టూరుస్తూ నాన్న సంచిని తీసుకొచ్చి నా ముందర పెట్టింది.

"ఇదేంది మా సంచి పసుపుపచ్చగా ఉంది" అన్నాను.

"ఓ అదా.. మీ నాయన ప్రతి సంవత్సరం గోవిందమాల వేసేవాడు కదా.. చివరిసారి వేసినప్పటి సంచి అది. అందులో ఉండేవన్నీ ఆయన వస్తువులే.. గుర్తుగా ఉంటాయని అన్నీ అందులోవేసి ఉంచాను" అంది.

ఆ సంచిలో నాన్న కళ్లద్దాలు, వాచీ, పూజ సామగ్రి కొంత, వెంకటేశ్వరుడి చిన్న చిన్న పటాలు.. ఇంకా ఏవేవో అందులో ఉన్నాయి. ఆ సంచిని భద్రంగా దాచుకోవాలని మనసులో అనుకుంటూ పక్కన ఉంచుకున్నాను. నాన్న ఆసుపత్రికి వెళ్లేముందు వాడిన ఖర్చీప్ ఒకటి నా దగ్గర భద్రంగా ఉంచుకున్న సంగతి గుర్తురాగా... నాన్న సంచిలో దాన్ని కూడా ఉంచి జాగ్రత్త చేసుకోవాలనుకున్నా..

అదే సమయంలో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాక ఓరోజు మా నాయనతో ఫోన్లో మాట్లాడిన సంగతి గుర్తుకొచ్చింది.

"ఏం రా కొడకా చాన్నాళ్లకు ఫోన్ చేశావు అన్నాడు. ఏం లేదు నాయినా... ఈ రోజు పేపర్లో చూశాను.. నెల్లూరు దగ్గర ఎవరో కంటి ఆపరేషన్లు చేయించుకుంటే చాలామందికి చూపు పోయిందట. వెంటనే నాకు భయమేసి నువ్వు కూడా ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నావు కదా.. నీకేమైనా ఇబ్బంది అయిందోమోనని భయంతో ఫోన్ చేశాను" అని చెప్పా.

"నాకేం కాలేదులే కొడకా (మా నాయన నన్ను ముద్దుగా కొడకా, తల్లీ, అమ్మా అని పిలిచేవారు) .. ఆపరేషన్ అయినాంక బాగా కనిపిస్తున్నాయి" అని ఎంత సంబరంగా చెప్పాడో.. ఆ రోజు తను మాట్లాడిన మాటలు అచ్చంగా అలాగే నా చెవుల్లో గింగురుమంటున్నాయి.

నేను ఫోన్ చేసి తన కళ్లు గురించి ఆరా తీసిన విషయం "నా బిడ్డకు నేనంటే ఎంత అక్కరో.. అక్కడెవరికో ఏదో అయిందని భయపడి, నాక్కూడా అలాగే అవుతుందేమోనని ఫోన్ చేసేసింది. నాకు బాగుంది అంటేగానీ ఆయమ్మకు మనసు నిమ్మతించలేదు" అని ఆ రోజు సాయంత్రం మాయమ్మతో అన్నాడట. ఇవన్నీ ఆ తరువాత ఎప్పుడో అమ్మ నాకు చెప్పింది.. ఇదుగో ఇప్పుడు మళ్లీ ఇలా గుర్తుకొస్తున్నాయి.

మా నాయనకు సంబంధించిన ఏ విషయాలైనా నాకు గుర్తుకొచ్చినప్పుడు.. ఆయన ఎదురుగా సజీవంగా ఉంటే ఎలా మాట్లాడుతారో అలాగే తన గొంతు వినిపిస్తుంది. తను నవ్వుతున్నట్లు, మాట్లాడుతున్నట్లు, పిల్చినట్లు.... అలాగే కళ్లు మూసుకుంటే చాలు ఎదురుగా నవ్వుతూ కనిపిస్తారు. ఎలాంటి సమయంలోనైనా సరే నాయన్ని తల్చుకుని కళ్లు మాసుకుంటే చాలు వెంటనే కనిపిస్తారు. ఎందుకు తల్లీ పిలిచావు అంటూ ప్రేమగా అడుగుతారు.



ఇదే విషయం ఓసారి మా అమ్మతో చెప్పాను. మా నాయన్నిగానీ, మా అమ్మమ్మనుగానీ తల్చుకుంటే చాలు వెంటనే కనిపిస్తారని అన్నాను. దానికి మా అమ్మ నిట్టూరుస్తూ... "మా అమ్మకు, మీ నాయనకి నేను ఎం చెడ్డ చేసానోగానీ ఎంత తల్చుకున్నా కనిపించరు. వాళ్లనే తల్చుకుని కళ్లు గట్టిగా మూసుకుని పడుకున్నా సరే అస్సలు కనిపించరు. ఇన్నేళ్లయింది కదా చచ్చిపోయి, ఓసారైనా కనిపిస్తే ఒట్టు. కళ్లముందూ కనిపించరూ, కలల్లోనూ కనిపించరు. నా ప్రాప్తం అంతే తల్లీ.." అంది బాధగా.

"నువ్వేం బాధపడకమ్మా.. ఈసారి మా నాయన కనిపిస్తే నేను నీకు కనిపించమని చెబుతాలే.. అస్సలు నీకు ఎందుకు కనిపించడో గట్టిగా అడిగేస్తాను.. పెళ్లయిన దగ్గర్నించీ తననే అంటిపెట్టుకుని సగ భాగమై బ్రతికిన, ఇప్పుడు తను లేని భాగాన్ని కూడా మోస్తున్న నీకు కనిపించడా... అస్సలు నీ గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో.. నీకు మేమున్నాం (అమ్మకు మేమున్నాం అనే ధైర్యంతోనే కదా ఆయన అంత నిశ్చింతగా వెళ్లిపోయింది).... ఆయన్ని నిలదీస్తాం.. నువ్వు ధైర్యంగా ఉండు మా" అని వాతావరణాన్ని చల్లబరిచేందుకు కాస్త సరదాగా మాట్లాడాను.

"ఆ జీవుడు వెళ్లిపోయి మూడేళ్లు నిండుతున్నాయి.. ఎక్కడో గాల్లో కలిసిపోయిన పేణం ఎదురుగా వచ్చి మాట్లాడుతుందా.. మీరు గొడవేసుకుంటారా.... అంతా మన పిచ్చి, భ్రమ గానీ..." అమ్మ గొణుక్కుంటూ లేచింది.

అమ్మ అన్న దాంట్లో నిజం లేకపోలేదు. కానీ పిచ్చి అని, భ్రమ అని నేను అనలేను. ఎందుకంటే ఆ పిచ్చి, భ్రమ అనేది అవసరం అనే అనిపిస్తుంది నాకు. లేకుంటే శాశ్వతంగా దూరమైన వారి జ్ఞాపకాల నుంచి అంత త్వరగా బయటపడలేం. వారు లేరన్న నిజం జీవితం పొడవునా బాధిస్తుంటుంది. ఆ బాధను తగ్గించేందుకు కాసింత పిచ్చి, ఇంకాస్త భ్రమ అవసరమే (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం).

నా మటుకు నాకు రోజు లేచింది మొదలు, నిద్రపోయేదాకా ఏ సమయంలో అయినా సరే మా నాయన గుర్తొస్తే చాలు కళ్లు మూసుకుంటాను.. ఆయన కూడా వెంటనే కళ్లముందు నవ్వుతూ కనిపిస్తాడు. నేను ఆయన ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతానో అలాగే తనతో మాట్లాడతాను. తను కూడా చక్కగా వింటాడు. తనకు తోచిన సలహాలు ఇస్తాడు. ఇది నా మానసిక భ్రమ... అయినా సరే.. నాకు అందులోనే చాలా ఆనందం ఉంది. ఇలా నాలో నేను మాట్లాడుకోవడం అవతలివాళ్లు చూస్తే.. పిచ్చిది కాదు కదా అనుకుంటారేమో.. అయినా నాకేం బాధలేదు.. నాన్న లేడని ఏడుస్తూ కూర్చోవటం కంటే ఇది నయం కదా...

నేను మావూరు వెళ్తే మా నాయన నా కోసం ఎంతగా ఎదురుచూస్తుండేవారో.. అంగడి దగ్గర కూర్చుని వచ్చే ప్రతి బస్సునూ చూస్తూ కూర్చేండేవారు. నాకు ఇప్పుడు కూడా ఆయన అలాగే నా కోసం ఎదురు చూస్తున్నట్లు, నాకోసం ప్రతి బస్సునూ చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. అందుకే బస్సు దిగగానే అంగడి దగ్గరకి వెళతాను. అక్కడ మా నాయన నన్ను నవ్వుతూ పలుకరిస్తాడు. ఆ తరువాత నేను సంతృప్తిగా ఇంటికెళతాను. ఇంట్లోకెళ్లగానే దేవుడి గదిలో నాన్న ఫొటో దగ్గరికి వెళ్లి కాసేపు కూర్చుని కబుర్లు చెబుతాను. ఆ సాయంత్రం సమాధి దగ్గరకు వెళ్లి కూర్చొని నాన్నతో మాట్లాడి భారమైన మనసుతో ఇంటికి చేరుకుంటాను. నేను ఊరెళ్లినా ప్రతిసారీ నా కార్యక్రమాలు ఇవే.

నవంబర్ 7.. ఈ తేదీ గుర్తు రాగానే నాకు ఏడుపు ఆగదు. మూడేళ్ల ముందు ఈ తేదీ అంటే చాలా మామూలు విషయం. కానీ ఇప్పుడు మా నాయన్ని మాకు లేకుండా చేసిన ఆ తేదీ అంటేనే వణుకు. ఆ తేదీ గుర్తొస్తేనే మా నాయన, ఆసుపత్రి, చివరిచూపులు, చివరి మాటలు ఆ తరువాతి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మనసుపై యుద్ధం చేస్తూ.. కళ్ల ముందు ఏముందో తెలియనంతగా దిగులు పొగను కమ్మేస్తాయి.

ఎప్పట్లా క్యాలెండర్‌ను మారుస్తుండగా నవంబర్ నెల, అందులోని 7వ తేదీ గుర్తొచ్చాయి మొన్న. అంతే ఏడుపు ఆగలేదు. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. సరిగ్గా ఆ సమయంలో ఓ ఆత్మీయురాలి ఫోన్. ఆ రోజు తన అనుభవాలను చాలా సంతోషంగా ఏకరువు పెడుతోంది. నేను వింటూ అలాగా, అవునా అంటూ ముక్తసరి సమాధానాలు ఇస్తున్నా. మామూలుగా అయితే తను ఎంత సంతోషంగా విషయాలను పంచుకుంటుందో, నేను అంతే సంతోషంగా స్వీకరిస్తూ చాలా ఆక్టివ్‌గా మాట్లాడుతుంటాను. కానీ నా ముక్తసరి సమాధానాలు పసిగట్టిన తను...

ఏమైంది శోభగారూ.. చాలా డల్‌గా మాట్లాడుతున్నారు అంది. ఇక తట్టుకోవడం నా వల్ల కాలేదు. చెప్పేశాను. తను కాసేపు మౌనంగా ఉండి.. నేనొకటి చెబుతాను వింటారా అంది. చెప్పు అన్నా. మీ నాన్నగారంటే మీకు అంత ఇష్టం కదా.. కళ్లు మూసుకున్న ప్రతిసారీ నవ్వుతూ కనిపిస్తున్న ఆయనకు.. నువ్వు ఇలా ఏడుస్తూ కనిపిస్తే ఆయన తట్టుకోగలడా... అంది. నిజమే కదా అన్నా. నా బిడ్డ బాధపడకూడదు అని ఆయన కనిపించిన ప్రతిసారీ నీకు నవ్వుతూ కనిపిస్తున్నారు.. కానీ నువ్వు మాత్రం ఇలా ఏడుస్తూ కనిపిస్తే ఆయనకి బాధ అనిపించదా.. సో.. మీరు ఎప్పుడూ ఏడవకూడదు అంది.

నువ్వు చెప్పేది నిజమేరా.. ఇక ఏడవను అన్నాను. అదీ అలా ఉండాలి అని.. కాసేపు ఇంకేవోవో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. కానీ.. నిజం చెప్పొద్దూ నా మూడ్ అప్పటికింకా సెట్ కాలేదు. ఏడవకపోతే ఎలా... బాధ ఏదైనా ఎవరితోనైనా పంచుకుంటే కాస్త తగ్గుతుంది. అదే ఏడిస్తే.. కన్నీళ్ల రూపంలో ఇంకాస్త తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గే మార్గం మాత్రం ఉండదుగా.... మా నాయన గుర్తొస్తే ఆయన నవ్వుతూ ఎలా పలుకరిస్తారో... ఓ కన్నీటి చుక్క కూడా నాకళ్లని అలాగే పలుకరిస్తుందని నాకు మాత్రమే తెలుసు. నాన్న లేరన్న బాధ అనేది ఒక జీవనది.. అది గుర్తొచ్చినప్పుడల్లా... ఆ నదిని నింపే కన్నీటి చుక్కలు టపటపా నాట్యం చేస్తూ మనసును తాకుతుంటాయి. అవి జ్ఞాపకాలై, నా జీవితాన్ని నడిపిస్తుంటాయి.. ఇది ఆగని ప్రయాణం.. అంతులేని ప్రయాణం... నాయన తోడులేని, తోడురాని సుదూర ప్రయాణం....!!!

(అనారోగ్యం కారణంగా నవంబరు 7, 2009న మాకు దూరమైన నాన్న 3వ వర్ధంతి సందర్భంగా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.... ఈ చిన్న అక్షర నీరాజనం..!!)

మొదటి వర్థంతి వివరాలు ఇక్కడ http://kaarunya.blogspot.in/2011/02/blog-post.html

రెండో వర్ధంతి వివరాలు ఇక్కడ http://kaarunya.blogspot.in/2011/11/blog-post.html చూడగలరు