Pages

Monday 27 December 2010

జ్ఞాపకాల అలజడిలో....!!

"ఏమీ కాదులే అనిపిస్తున్నా... మనసులో ఏదో ఒక మూలన భయం. ఆరేళ్లయింది కదా... మళ్ళీ ఇప్పుడెందుకు అలా జరుగుతుందిలే..." లాంటి అంతూ, పొంతూ లేని ఆలోచనలతో మొన్న రాత్రి కలతలోనే నిద్రపోయా. పొద్దున్నే మెలకువ వచ్చేసరికి అంతా ప్రశాంతంగా, రోజులాగే ఉంది. హమ్మయ్య...! ఏమీ జరగలేదు అన్న నిశ్చింతతో రోజువారీ పనుల్లో మునిగిపోయాను.

శనివారంనాడు ప్రజలంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకున్నారు కానీ ఏదో మూల కాస్తంత భయంతోనే ఉన్నారు. అయితే... ఓ ఆరేళ్ల క్రితం క్రిస్మస్ పండుగను సంబరంగా జరుపుకున్న వీరికి భయం ఆనవాళ్ళే లేవు. ఎందుకంటే, ఆ మరుసటి రోజున ఓ పెను ప్రళయం సంభవించి, తమ జీవితాలను అతలాకుతలం చేస్తుందన్న బెంగ వారికి లేదు కాబట్టి...!

సో.. మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందనే అనుకుంటాను. నేను చెప్పేది 2004లో కడలి విలయతాండవం చేసి సునామీగా విరుచుకుపడ్డ దుర్ఘటన గురించి. ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షినైన నేను ఆ జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకువచ్చే చిన్న ప్రయత్నం...!


ఆరోజు డిసెంబర్ 26వ తేదీ ఆదివారం. తెలతెలవారుతుండగా, బాగా నిద్రలో ఉండగానే మంచాన్ని ఎవరో కాస్త కదిలించినట్లు అనిపించినా మగతగా ఉండటంతో అలాగే నిద్రపోయాను. కానీ, మా ఆయన మాత్రం లేచి కూర్చుండిపోయారట. 7 గంటలకు నిద్రలేచి కాఫీ తాగిన తరువాత ఆయన మాంసం కొనుక్కొచ్చేందుకు బజారుకు వెళ్ళారు.

నేను ఇంట్లో పనుల్లో మునిగిపోయాను. ఇంతలో బయటినుంచి ఎవరివో అరుపులు, కేకలు... ఆదివారం కదా... జనాలు బాగా ఉత్సాహంగా ఉన్నట్లున్నార్లే అనుకుంటూ, అలాగే ఉండిపోయాను. అయితే మళ్ళీ అవే అరుపులు, కేకలు.. బయట బాల్కనీలోకి వచ్చే చూస్తే... "కడల్ పొంగుదు" (సముద్రం పొంగుతోంది) అంటూ ఉరుకులు, పరుగులతో పారిపోతున్నారు.

సముద్రం పొంగటం ఏంటబ్బా... అనుకుని చూద్దును కదా...! మా ఇంటి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు గుండా వందలాదిమంది జనాలు తడిచి ముద్దయిపోయి, చేతికి అందినదల్లా పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇంకాస్త పరికించి చూస్తే... ఇంటికి ఎదురుగా కాస్తంత దూరంగా, సముద్రానికి దగ్గరగా ఉండే పట్టినంబాక్కం బస్ డిపో నీటితో మునిగిపోవడంతో... బస్సులపైకి ఎక్కి హాహాకారాలు చేస్తోన్న జనాలు చేతులు పైకెత్తి నిల్చోనుండటం స్పష్టంగా కనిపించింది.

నాకయితే ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతలో ఆయన గుర్తొచ్చారు. అయ్యో..! ఇప్పుడెలా ఆయనకు విషయం తెలుసో, లేదో.. నా పరిస్థితి ఏంటి...? మాంసం కొట్టు దగ్గరున్నారో, ఇంకెక్కడికయినా వెళ్ళారో అంటూ కంగారు పడిపోయాను. నైటీలో ఉన్న నేను డ్రస్ కూడా మార్చుకోకుండా, పైన టవల్ కప్పుకుని ఇంటికి తాళం వేసి ఆయన కోసం పరుగులు పెట్టాను.

ఇంతలో నాకు ఎదురుగా ఆయన కూడా పరుగులు పెడుతూ వస్తూ కనిపించారు. ఇద్దరం ఇంటికి వచ్చి, ముఖ్యమైన కాగితాలు, నగలు, డబ్బు, రెండు జతలు బట్టలు ఓ చిన్న సంచిలో సర్దుకుని బాల్కనీలో నిల్చున్నాం. ఎదురుగా సముద్రం గాండ్రింపు, పెద్ద పెద్ద అలలు బాగా కనిపిస్తున్నాయి.

ఇక జనాల సంగతయితే చెప్పనక్కర లేదు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని ఆ పరిస్థితిలో, ఆప్తులను కోల్పోయి తేరుకున్న మిగిలినవారు కట్టుబట్టలతో, రోదనలతో వేలాదిమందిగా మందవెల్లి బస్ డిపో వైపు పరుగులు తీస్తున్నారు. మేం ఆ పరిస్థితిని చూశాక కాళ్ళూ, చేతులూ ఆడటం లేదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో అలాగే నిల్చుండిపోయాం.

కరెంటు లేదు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. చుట్టూ ప్రపంచమంతా ఏం జరుగుతోందో, ఎందుకలా అయ్యిందో ఏమీ తెలియదు. ఇంతలో మావారి ఫ్రెండ్స్ నుంచి ఫోన్.. వాళ్ళు చెన్నైకి దూరంగా ఉండే వేరే బంధువుల ఇంటికి వెళ్తున్నారట, మీరు కూడా వస్తారా అని...? కానీ మా ఆయన ఎందుకోగానీ రానని చెప్పేశారు.

అలా నిల్చుని, గాభరాగా చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఒకామె బాగా తడిసిపోయి ఉంది. చంకలో చిన్నబిడ్డ, చేతితో ఇంకొక బిడ్డను పట్టుకుని గబగబా మెట్లు ఎక్కి మా బాల్కనీలోకి వచ్చి ఆగిపోయింది. కాసిన్ని మంచినీళ్లు ఇవ్వమని అడిగింది. నీళ్లు ఇచ్చాక కాస్త తేరుకున్న ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఏమయింది అని అడిగితే... తన ఇంకో బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోయిందని, తన భర్త కనిపించడం లేదని గుండెలు బాదుకుంటూ చెప్పింది.

ఆమెతో కలిసి ఏడవటం తప్పించి, ఏమీ చేయగలను. ఊరుకోమ్మా, మీ ఆయన వస్తాడులే అంటూ ఓదార్చాను. పిల్లాడికి కాస్తంత అన్నం పెట్టమని అడగటంతో పెట్టాను. నేను వీరిని ఇలా పరామర్శిస్తూ ఉన్నానో, లేదో మా ఆయన కనిపించటం లేదు. ఎప్పుడు కిందికి దిగి వెళ్ళిపోయారో, ఏమో... తెలియదు. కనిపించలేదు. ఇల్లు తాళం వేసి, ఏడుస్తూ ఆయన్ను వెతుక్కుంటూ అటూ, ఇటూ పరుగులెత్తాను.

మా ఇంటికి ఎదురుగా సముద్రానికి దగ్గర్లో ఉండే ఎయిర్‌టెల్ బిల్డింగ్స్ వైపు నుండి సైకిల్‌పై వస్తూ కనిపించారాయన. చూడగానే దగ్గరికెళ్లి బాగా తిట్టిపోశాను. నీళ్ళు ఎంతదాకా వచ్చాయో, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను. నీళ్ళు బిల్డింగ్స్‌కు ఇవతలదాకా నడముల్లోతు పైకే వచ్చేశాయి. నీళ్ళు బాగా వేడిగా, కుత కుత ఉడుకుతున్నట్లున్నాయని చెప్పాడు. "అయినా ఇంకా పెద్ద పెద్ద అలలు వస్తూనే ఉన్నాయి కదా.. నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా అలా వెళ్తే ఎలాగండీ" అంటూ ఆయన్ని కోపగించుకున్నాను.

ఎలాగోలా మళ్ళీ ఇల్లు చేరాము. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న జనాలను చూస్తూ... మా ఇంటిదాకా నీళ్ళు రావులే అనుకుంటూ అలాగే బాల్కనీలోనే ఉండిపోయాము. సాయంత్రం మూడు, నాలుగు గంటల దాకా జనాలు అలా పరుగులు పెడుతూ, ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. మా బిల్డింగ్‌లో కూడా జనాలంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. మేము, కింద ఇంట్లో ఒకరిద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు.


"మా ఆయనకు వైరాగ్యమో, ధైర్యమో చెప్పలేను కానీ... ఏదయితే అది అయింది. ఎంతమంది పోయారో తెలియదు. అయినా ఎవరూ, దేన్నీ ఆపలేము. మనము ఎక్కడికీ వెళ్ళవద్దు, ఇక్కడే ఉందాం.. ఏమీ జరగదులే" అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఎక్కడికీ వెళ్ళకుండా అలాగే ఉండిపోయాము. చీకటి పడింది. కరెంటు లేదు. చుట్టూ చిమ్మ చీకటి, జనాల గొంతు ఏ మూల కూడా వినిపించలేదు. సముద్రం గాండ్రింపు తప్ప మరే శబ్దమూ లేదు. భయం భయంగా ఆరోజు రాత్రి గడచిపోయింది.

మరుసటి రోజుగానీ విషయాలు తెలియలేదు. ఇండోనేషియా సముద్రంలో వచ్చిన భారీ భూకంపం వల్ల సునామీ వచ్చిందని, అందువల్లనే సముద్రం అతలాకుతలమై తీరప్రాంతాలపై విరుచుకుపడిందని తెలిసింది. సునామీ తరువాతి విషయాలు, జరిగిన ప్రాణ నష్టం అన్నీ మీ అందరికీ తెలిసిందే...!

ఆరోజు మా ఇంటి ఎదురుగా ఉన్న పట్టినంబాక్కం జాలర్ల కుటుంబాలే సునామీలో ఎక్కువగా నష్టపోయాయి. వందలాది మంది చనిపోయారు. పట్టినంబాక్కం చెరువులోనే దాదాపు 200 పైబడి శవాలను వెలికితీసినట్లు తరువాతి రోజు వార్తల్లో చూశాము. చెన్నై తీర ప్రాంతాలలో సంభవించిన సునామీ వల్ల ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం పట్టినంబాక్కమే. ఇక్కడే ఎక్కువమంది చనిపోయారు, అప్పటి సీఎం, సోనియాగాంధీ లాంటి వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించి వెళ్ళారు కూడా...!

సునామీ వచ్చిన ఓ వారం రోజుల తరువాత మా ఇంటి పక్కనే ఉండే మైలాపూర్ మార్కెట్టుకు నేనూ, పక్కింటామె కలిసి కూరగాయలు కొనేందుకు వెళ్లాం. మా పక్కనే కూరగాయలు కొంటున్న ఒకామెకు ఎవరో వచ్చి, ఏదో చెప్పారు. అంతే ఆమె ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. ఏమైందని పక్కవాళ్లను ఆరాతీస్తే సునామీ రోజున తప్పిపోయిన తన కొడుకు శవం సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిందట. అది తెలిసే ఆమె అలా ఏడుస్తూ వెళ్లిందని చెప్పారు. ఆ తరువాత నెలా, రెండు నెలలదాకా శవాలు అలా బయటపడుతూనే ఉన్నాయి.

ఆ తరువాత సంఘటనలు, జ్ఞాపకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆనాటి దుర్ఘటనకు ఆనవాళ్లుగా జాలర్ల నివాసాలు విధ్వంసమై మొండిగోడలుగా మిగిలి పలుకరిస్తున్నాయి. సునామీలో నష్టపోయిన కుటుంబాల వారికి ఆయా ప్రభుత్వాలు ఎంతమేరకు సాయం చేసాయన్నది ఈనాటికీ సముద్రం ఒడ్డున బ్రతుకును వెళ్లదీస్తున్న జాలర్లను అడిగితే వారి దగ్గరనుంచీ కన్నీళ్లు, ఆగ్రహమే సమాధానాలుగా రాక మానవు. చేపలను బుట్టల్లో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్మే ఒకామెను నేను ఇదే విషయం అడిగితే...ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా.. మళ్లీ ఈ కడలితల్లే తమకింత తిండి పెడుతోందని, అన్నం పెట్టే అమ్మే ఓ దెబ్బ కొట్టిందని అనుకుంటాం తల్లీ అని అంది.

ఇక ఆ విషయాలను పక్కనబెడితే... ఈనాటికీ మేము అదే ఇంట్లో ఉన్నాము. సునామీ వచ్చిన మరుసటి సంవత్సరం ఉన్న భయం ఆ తరువాత, తరువాత కొద్ది, కొద్గిగా తగ్గిపోయింది. సునామీ మళ్లీ ఇప్పట్లో రాదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, ఆ భీతి మాత్రం ఇప్పటికీ లోలోపలే వెంటాడుతూనే ఉంది.