Pages

Tuesday 16 November 2010

తక్కువా..? అలాగని ఎక్కువా..?!

ఎప్పట్లాగే ఆఫీసుకు ప్రయాణం. మైలాపూర్ కచేరీ రోడ్‌లో మా బస్సు వెళ్తోంది. కిటికీ పక్కగా కూర్చున్న నేను (ఏ విషయంపైనో ఏంటో) తెగ సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. ఇంతలో "కపాలీశ్వరన్ కోయిల్" స్టాఫింగ్ వచ్చింది. కాసేపు ఆలోచనల నుంచి బయటపడి, పక్కనే ఉన్న షాపులోకి నా దృష్టిని మరల్చాను.

అదో దేవుడు పటాలను తయారు చేసే చిన్న షాపు. అందులో ఒకతను తదేకంగా, శ్రద్ధగా తనపని తాను చేసుకు పోతున్నాడు. దేవుడి పోస్టర్‌కు సరిపోయేలా ఉన్న గాజు పలకలను కొయ్య ఫ్రేముకు అమర్చి, కాలితో తొక్కిపట్టి ఫ్రేము కట్టేస్తున్నాడతను. నేనలా చూస్తుండగానే బస్సు కదిలిపోయింది.

బస్సుతో పాటు నా ఆలోచనలు కూడా ఇందాక చూసిన విషయంపై వేగంగా పరుగెత్తసాగాయి. ఎంత విచిత్రం... పటాలను తయారు చేసే అతను కాలికింద తొక్కిపట్టి చేసిన దేవుడి పటాలను... మనమేమో చాలా పవిత్రంగా తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి, పూజలు, వ్రతాలు, నైవేధ్యాలు చేయడం.. అంటు, సొంటూ కలవకుండా చూడడం లాంటివన్నీ చేస్తున్నాం.

తననే కాలికింద తొక్కిపట్టి ఫ్రేములో బంధిస్తోన్న ఇతగాడిని ఆ దేవుడు ఏమీ చేయడా..? ఇంతకూ అతడు చేసింది తప్పా...? ఒప్పా..? అని ఆలోచించాను. అతను చేసినదాంట్లో తప్పేమీ లేదు కదా..! అనిపించింది. అతడు బ్రతకాలంటే, అతని జీవనాధారమైన ఆ పనిని చేయక తప్పదు. అతడి వృత్తి ధర్మాన్ని అతడు నిర్వర్తించాడు అంతే...!

వెనకటికి ఇలాంటిదే ఓ కథే ఉన్నట్లు కూడా నాకా సమయంలో గుర్తొచ్చింది. అదేంటంటే... కొయ్యలతో దేవుడి విగ్రహాలను, గుమ్మాలను తయారు చేసే శిల్పి ఒకతను ఉండేవాడట. అతను ఓ రోజు ఒక చెట్టు నుండి తీసిన కొయ్యలతో ఒక దేవుడి విగ్రహాన్ని, ఒక గుమ్మాన్ని తయారు చేశాడు.

ఈ రెండింటినీ ఒక ఊర్లో కడుతున్న గుడి కోసం తీసుకెళ్లారు. దేవుడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించి, గుమ్మాన్ని ప్రధాన ద్వారానికి అమర్చారు. ఆ విగ్రహానికి ప్రతిరోజూ పూజలు జరుపుతూ ఉండేవారట. ఇలా రోజులు గడుస్తుండగా... ఓ రోజు గుమ్మం తనను తయారు చేసిన శిల్పి దగ్గరకెళ్లి భోరున విలపించిందట.

అది చూసిన శిల్పి.. ఎందుకేడుస్తున్నావని ప్రశ్నించగా... "ఒకే చెట్టునుండి చేసిన నన్ను తొక్కుకుంటూ వెళ్తుంటే, విగ్రహానికి మాత్రం పూజలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం..? నన్ను కూడా దేవుడి విగ్రహంగా చేసి ఉండవచ్చు కదా...!" అని అందట ఆ గుమ్మం.

గుమ్మం చెప్పిన మాటలను ఓపిగ్గా విన్న ఆ శిల్పి... "ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నా వృత్తి ధర్మాన్ని మాత్రమే నేను నిర్వర్తించాను. అయినా దేవుడికంటే ముందుగా నిన్ను తాకి, నిన్ను దాటుకునే కదా అందరూ వెళ్ళేది. ఈ రకంగా కూడా నీకు పుణ్యం దక్కినట్లే కదా..." అంటూ సర్దిచెప్పాడట...!

నిజమే కదా... ఈ లోకంలో వేటికుండాల్సిన విలువ వాటికుంటుంది. దీని గురించి చెప్పుకోవాలంటే... ఈ మధ్య మా అక్కకు, వాళ్లబ్బాయికి జరిగిన సంభాషణ కూడా చెప్పాల్సిందే..! ఆరోజు మా అక్కా, వాళ్ళబ్బాయి అదే పనిగా వాదించుకుంటున్నారు. అప్పుడే వెళ్లిన నేను ఏమైందని అడగ్గా...! "వాడికెప్పుడూ వాళ్ళ నాన్నంటేనే ఇష్టం, నాపైన ఏమీలేదు, అందుకే ఎప్పుడూ గొడవపడుతుంటాడు" అంటూ ఫిర్యాదు చేసింది.

దానికి మా వాడు చెప్పిన సమాధానం ఏంటంటే... "అమ్మా దేని విలువ దానికుంటుంది. ఒక పైసా నుంచి, ఐదు పైసల నుంచీ, లక్షల కోట్ల రూపాయల దాకా వేటి విలువ వాటిదే.. అలాగని పైసాకు, రూపాయికి విలువ లేకుండా పోతుందా... పైసా పైసా కలిస్తేనే కదా రూపాయి, వందలు, కోట్లు...! అలాగని ఏదీ ఎక్కువా కాదు, తక్కువా కాదు" అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చేశాడు.

కాబట్టి... నేను చూసిన పటాల తయారీ అతను, కథలో చెప్పినట్లుగా శిల్పి తయారు చేసిన గుమ్మం, దేవుడి విగ్రహం, మా అక్క కొడుకు లెక్చర్... ఇలా దేన్ని చూసినా.. వాటి సారాంశం మాత్రం ఒక్కటే... ఈ భూ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకైనా, ఏ ప్రాణికైనా వాటి విలువలు వాటికుంటాయి. ఏవీ తక్కువా కాదు, అలాగని ఎక్కువా కాదు...! కాదంటారా...?!!