ఎప్పుడూ బస్ ప్రయాణంలో... మొబైల్ ఫోన్లో ఎఫ్ఎం పెట్టుకుని వింటుండే నేను, ఈరోజు కాస్త భిన్నంగా ఏదైనా పుస్తకం చదవాలనుకుని ముందుగానే బ్యాగులో సర్దుకున్నాను. పండుగ సెలవులు కావడంతో రోడ్లంతా నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నాయి. ఆ ప్రశాంతతలోనే, బస్సులో కూర్చున్న నేను మెల్లిగా పుస్తకం తెరిచాను.
పుస్తకం అటు నుంచీ ఇటూ, ఇటు నుంచీ అటూ తిరగేసిన నాకు... "అమృతం కురిసిన రాత్రి" అంటూ ఓ కథ నాకు స్వాగతం పలికింది. అంతే ఒక్కసారిగా కథలో లీనమైపోయాను. చదువుతుండేకొద్దీ నా మనసులో ఎక్కడలేని సంతోషం, ఒక రకమైన భావోద్వేగం కమ్ముకున్నాయి.
పల్లెలో టీచర్‌గా పనిచేస్తుండి, రిటైరైపోయిన ఓ పెద్దాయన... కొడుకు ఉంటుండే భాగ్య నగరానికి వచ్చి అపార్ట్‌మెంట్‌పై నిల్చుని వెన్నలను ఆస్వాదిస్తూ ఉంటాడు. "అయ్యో.. మంచులో నిల్చున్నారేంటీ, కిందికి దిగిరండి. లేదంటే రొంప చేస్తుందంటున్న" భార్య పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తాడాయన.
వెంటనే.. "తులసీ.. ఓ పెద్ద క్యారేజీ సెట్ తీసుకొచ్చి, అందులోని గిన్నెలన్నింట్లోనూ వెన్నెల నింపి, కిందికి తీసుకెళ్లి అబ్బాయికీ, కోడలికి, మనవడికి గోరుముద్దల్లాగా తినిపించకూడదూ.." అని ఆమెనడుగుతాడు. "చాల్లేండి సంబరం. భావుకత చాలించి కిందికి దిగిరండి, వెన్నెల్లి చూస్తే చాలు మరీ చిన్నపిల్లాడైపోతారు.." అంటూ సున్నితంగా హెచ్చరిస్తుందామె.
నిజంగా... వెన్నెల గురించి అంత భావుకతగా మాట్లాడిన ఆయన తీరు, ఆమె సమాధానం.. చదివిన నాకు ఎక్కడలేని ఆనందం, ఒక రకమైన తృప్తి కలిగాయి. "తల్లిదండ్రులు ఉద్యోగ జీవితాలతో, పిల్లలు చదువుల భారంతో సతమతమయ్యే నేటి స్పీడ్ కాలంలో ఇలాంటి ఫీలింగ్స్‌కు కూడా తావుందా..?" అన్న ప్రశ్న నాకే కాదు, కథలోని ఆ పెద్దాయనకు కూడా.
ఇంటికి రాగానే కొడుకు లాప్‌టాప్‌తోనూ, కోడలు టీవీతోనూ, మనుమడు మొబైల్‌ఫోన్‌తోనూ బిజీగా ఉండటం చూసి అందరి ముఖాలను మార్చి, మార్చి చూస్తుండే తన భార్య అవస్థ గుర్తొచ్చిందేమో ఆయనకు.. ఆ వెన్నెల రాత్రుల్లో అపార్ట్‌మెంట్ లైన్‌మెన్‌కు డబ్బులిచ్చి ఎవరికీ తెలియకుండా కరెంట్ తీసేయమని చెప్పేస్తాడు.
అనుకున్నట్లుగానే కరెంట్ పోవడం... అపార్ట్‌మెంట్‌లోని పిల్లా, జెల్లా, చిన్నా, పెద్దా అందరూ బిలబిలమంటూ టెర్రస్ పైకి చేరుకోవటం జరిగిపోతాయి. ఆ టెర్రస్‌మీద అక్కడ ఆ పెద్దాయన, తులసమ్మ ఇద్దరూ మనవడికి తమ కొడుకు చిన్నప్పటి సంగతులు, చిన్న చిన్న కథలు చెబుతూ, తమషా విషయాలు వచ్చినప్పుడు నవ్వుతూ.. వారు తమని తామే మైమరచిపోతారు.
ఆ తరువాత, వెంట వెంటనే... అదే టెర్రస్ పైన మనసును కదిలించివేసే అనేక సంఘటనలతో మేలుకున్న స్పీడ్ మనుషులందరిలోనూ ఇన్నాళ్లు తాము మరమనుషులుగా బ్రతుకుతున్నామన్న భావనను కలిగించి, వాళ్ల కళ్లు తెరిపించేలా ముగుస్తుందీ కథ.
ముఖ్యంగా ఆ అపార్ట్‌మెంట్లోనే ఉండే ఓ పెద్దావిడ... "ఉండడర్రా పిల్లలూ... అలసిపోయి ఉంటారు" అంటూ గోంగూర, నెయ్యి కలిపిన వేడి వేడి అన్నం తీసుకొచ్చి అందరి చేతుల్లో తలో ముద్ద పెడుతుంది. అది తిన్న వారందరూ ఆ చల్లటి వెన్నెల్లో అమృతంలాగా భావించి తృప్తిగా తిని అక్కడే కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు... ఈ కథ కంచికి మనం కిందికి...
పొద్దున్నే... అదీ పండుగ రోజున మంచి కథ చదివాననిపించింది. పట్టణాల్లో ఉద్యోగ జీవితాల్లో, ఉరుకుల పరుగులతో వెనుక ఎవరో తరుముతున్నట్లుగా పరుగులు తీసే అందరూ తప్పకుండా ఈ కథ చదివితే బాగుండుననిపించింది. మరబొమ్మల్లాగా పని చేసుకుపోయేవారు, ఖచ్చితంగా ఆలోచించాల్సిందే కదా...!
ఏదో తెలియని ఆనందంతో నవ్వుతూ చూద్దును కదా.. నా ఎదురుగా ఓ విదేశీ మహిళ నిల్చుని ఉంది. అప్పటికే సంతోషంతో ఉన్న నేను, ఆమెని చూడగానే మరింత సంతోషానికి లోనయ్యాను. అలాగని ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ ఆమె రూపం, అలంకరణ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఓస్.. విదేశీ మహిళ ఎలా ఉంటుందిలే... టీషర్టు, ఫ్యాంటుతోనో, మరేదో డ్రస్‌తోనో ఉండి ఉంటుందిలే అనుకుంటున్నారేమో..!
అయితే మీరు పప్పులో కాలేసినట్లే..! చూడచక్కగా ఉన్న ఆమె నుదుటిమీద ఎర్రటి బొట్టు, పాపిట్లో సింధూరం, కళ్లకు కాటుకతో, నున్నగా దువ్వుకుని.. చక్కగా జడ వేసుకుని హాయిగా నిల్చుని అటూ, ఇటూ చూస్తోంది. నిజంగా ఆమె చూడ్డానికి ఎంత బాగుందో తెలుసా..?
అసలే తెల్లని మేనిఛాయ, ఆపైన కుంకుమ బొట్టు... అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే... చక్కగా చీరకట్టుకుంది. ఎంత చక్కగా అంటే, మనం కూడా అంత బాగా కట్టుకోలేమేమో అన్నంతగా... భారతీయతకే కొత్త అర్థాన్నిస్తున్న ఈ విదేశీ మహిళ కట్టూ, బొట్టూ... ఫ్యాషన్లకు అలవాటు పడిన భారతీయ వనితలకు ఏదో చెబుతున్నట్లుగా లేదూ...!
పొద్దుటిపూట, అదీ పండుగ రోజున ఓ మంచి సందేశంతో కూడిన కథను చదివి, ఆనందంలో మునిగి ఉన్న నన్ను... చక్కగా, సంప్రదాయబద్ధంగా కనిపించిన విదేశీ మహిళ ఆకర్షణీయమైన రూపం "సంక్రాంతి లక్ష్మి" ఈమే కాదుగదా.. అనే సందేహంలో పడేసింది కూడా...!!
నీలవేణి
2 weeks ago