Pages

Thursday, 15 September 2011

అవిసె పువ్వుల వేపుడు ఎప్పుడైనా తిన్నారా..?

 

కావలసిన పదార్థాలు :
అవిసె పువ్వులు... పావుకేజీ
ఉల్లిపాయలు.. మీడియం సైజువి రెండు
పచ్చిమిర్చి... రెండు
కరివేపాకు... సరిపడా
కొత్తిమీర... తగినంత
వేయించిన వేరుశెనగ గింజలు... వంద గ్రాములు
వెల్లుల్లి.. కాసిన్ని
కారంపొడి... ఒక టీస్పూన్
ధనియాలపొడి... ఒక టీస్పూన్
నూనె... తగినంత
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి... పోపుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా అవిసె పువ్వులను తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని మూడు లేదా నాలుగు ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయలను నిలువుగా సన్నంగా తరగాలి. పచ్చిమిర్చిని నిలువుగా కోయాలి.

వేయించిన వేరుశెనగ గింజలకు, కాస్తంత ఉప్పు, పసుపు, కారంపొడి, ధనియాలపొడి కలిపి మెత్తగా పొడి కొట్టాలి. చివర్లో వెల్లుల్లి పాయలను కూడా వేసి తిప్పాలి. ఈ పొడిని తీసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు బాణలిపెట్టి అందులో తగినంత నూనె పోసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి. నచ్చినవాళ్లు కాస్తంత మినప్పప్పును కూడా పోపులో వేసుకోవచ్చు. కాసేపటి తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి మరి కాసేపు వేయించాలి. అందులోనే కాస్త పసుపును కూడా చేర్చాలి.

ఇప్పుడు తరిగి ఉంచుకున్న అవిసె పువ్వులను వేసి కలియదిప్పి ఆవిరిపై ఉడికించాలి. పువ్వులు కాసేపటికే మగ్గిపోతాయి. తరువాత పొడి కొట్టి ఉంచుకున్న వేరుశెనగ గింజల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలియదిప్పి, ఉప్పు సరిజూసి మరికాసేపు సిమ్‌లోనే ఉడికించాలి. ఉడికింది అనిపించగానే దించేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అవిసె పువ్వుల వేపుడు రెడీ.

దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్బ్‌గా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!

(మా అమ్మమ్మ, తాతయ్య గురించి రాసిన పోస్టులో అమ్మమ్మ చేసే అవిసె పువ్వుల వేపుడు భలే ఇష్టం అని రాశాను. దాన్ని చదివిన శైలూ (http://kallurisailabala.blogspot.com/) ఎలా చేస్తారో చెప్పమని అడిగింది. అంతేకాదు, ఎలా చేయాలో రాసి బ్లాగులో పోస్ట్ చేస్తే దాన్ని చూసి నేనూ ఎంచక్కా చేసేస్తాను అంది. నేను తొలిసారిగా నా బ్లాగులో వంటల గురించి రాశాను. ప్రేమతో రాసిన ఈ తొలి పోస్టు, మళ్లీ ఇంకా ఏవైనా రాస్తే అవి కూడా శైలూకే అంకితం..... )

14 comments:

kallurisailabala said...

అక్క అడగగానే ప్రేమతో రాసినందుకు చాలా థాంక్స్. నిజంగా నాకు నచ్చేసింది. నేను తప్పకుండా ట్రై చేస్తాను.మీ అభిమానం చూస్తె ఎంతో సంతోషంగా ఉంటుంది.

శోభ said...

:) You are most Welcome Sailu...

sudha said...

Ee avishe poolu ekkada dorukuthaayi?

శోభ said...

అవిసె చెట్లకు ఈ పువ్వులు కాస్తాయి సుధా. వాటిని ఒకప్పుడు ఇంటి పెరడుల్లో, పంటపొలాల గట్లుమీదా బాగా పెంచేవారు. మునగతో సమానంగా దీన్ని ఆహారంలో ఉపయోగించేవారు. ఇప్పుడు ఇది ఎక్కడోగానీ దొరకదు.

కావాలంటే ఎక్కడైనా గింజలు తెచ్చుకుని పెరట్లో పెంచుకుంటే సరి. లేదా పల్లెటూళ్లలో దొరకవచ్చు. పట్టణాలలో అవిసె ఆకు మాత్రమే దొరుకుతోంది అనుకుంటా. నేను చెన్నైలో చూస్తుంటాను కూడా. పువ్వులు మాత్రం నాకు కనిపించలేదు. అవి కావాలంటే స్వయంగా ఇంట్లో పెంచుకోవటమే ఉత్తమం.

అవిసె లేత కాయలను కూడా వేపుడు చేస్తారు. అది కూడా చాలా బాగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. అవిసె లేత ఆకులను వేపుడు చేస్తారు. ఇది కూడా మునగ ఆకులాగే రుచిగా ఉంటుంది. జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో పోషక విలువలు దీంట్లో ఉన్నాయి. ఆరోగ్యానికి మంచి చేస్తుందేగానీ, అవిసె వల్ల చెడు జరగదు. అన్నట్టు అవిసె గింజలనుండి నూనె తీసి వాటిని కూడా మందులలో వాడతారని తెలిసింది.

హమ్మయ్య... బోలెడన్ని విషయాలు చెప్పేశాను కదూ..? :)

సిరిసిరిమువ్వ said...

అవిసె గింజలు (Flax seeds) కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి పొడి చేసుకుని ఆహారంలో వాడవచ్చు.

ఇందులో ఉండే ఒమేగా-3 (omega-3) ఫాటీ ఆసిడ్సు పిల్లల్లో మెదడు పెరగటానికి ఉపయోగపడతాయి.

కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తాయి. రక్తపోటు, బ్రెస్టు కాన్సర్..గుండె జబ్బులు, చర్మ వ్యాధులు రాకుండా అరి కడతాయి.

శోభ said...

సిరిసిరిమువ్వగారు... ధన్యవాదాలండీ... మంచి సమాచారం అందించినందుకు మరోసారి బోలెడన్ని థాంకులు... :)

రసజ్ఞ said...

ఈ అవిసి పూలు కార్తీక మాసంలో ఎక్కువగా పూస్తాయి శివునికి చాలా ఇష్టం అందుకే ఈపూలతో పూజ చేస్తారు. వేపుడు ఎప్పుడూ తినలేదు కాని కూర, పచ్చడి తిన్నాను చాలా బాగుంటాయి. సిరిసిరిమువ్వ గారు చాలా చక్కగా చెప్పారు వీటి గురించి. కళ్ళ కలకలతో బాధపడేవారు అవిసి పువ్వులని కళ్ళ మీద పెట్టుకుంటే infection త్వరగా తగ్గుతుంది కూడాను.

శోభ said...

రసజ్ఞగారు థ్యాంక్ యూ వెరీమచ్ అండి. సిరిసిరిమువ్వగారితోపాటు మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.

rajasekhar Dasari said...

సిరిసిరిమువ్వ గారు చెప్పినట్లు అవిసె గింజలు ఒమేగా 3 అధికముగా ఉన్న ఒక శేకాహారము. సామాన్యముగా మాంసాహారులు చేపల ద్వారా ఈ ఒమేగా 3 పొందుకుంటారు. కాని దీనిని ఎక్కువుగా తీసుకోకూడదు , మరియు వేయించకుండా తీసుకోకూడదు .

కొత్త పాళీ said...

Very interesting.
అవిశ తెలుసు, ఫ్లాక్ష్ సీడ్స్ తెలుసు, రెండూ ఒకటే అని తెలీదు!

శోభ said...

రాజశేఖర్ గారు మీరు మరింత సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు

శోభ said...

కొత్తపాళీ గారు నాక్కూడా ఈ విషయం నిన్ననే తెలిసిందండీ..

pAlana said...

Hello!
This "Avisa" is not Flax. This is "agiSe". This is a Legume (Bean or Pea family or Leguminosae member). The correct botanical name of this tree is "Sesbania grandiflora. In Sanskrit, it is called "agasti". Please correct this. The "aviSalu" are Flax Seeds - Linseed - Linum usitatissimum belonging to the family Linaceae. The plant in Karunya's blog picture is not Flax. The Flax Seeds are rich in omega-3 fatty acids and the oil is used to coat wood i.e. Linseed Oil or Flax Oil (in US).
Please correct this.
Thanks
pAlana
Columbus, OH

శోభ said...

మిత్రులందరికీ...

అవిసెను... ప్రాంతాల యాసను బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. మా రాయలసీమ పడమటి మండలాలలో అవిసెను అవిసె అనే పిలుస్తాము. మిత్రులు కొంతమంది సూచించినట్లుగా దీన్ని అగిసె అని కూడా అంటుంటారేమో..

కానీ కొంతమంది బ్లాగర్లు దీన్ని Flax seeds అని అంటారని చెప్పారు. నాకు ఇంగ్లీషు సరిగా తెలియదు కాబట్టి, అవిసెకు ఇంగ్లీషు పేరు అదేనేమో అనుకున్నాను. సిరిసిరిమువ్వగారే ఈ విషయాన్ని చెప్పారు. కొత్తపాళిగారు కూడా ఆశ్చర్యపోతూ అడిగారు. నాక్కూడా తెలియదండీ.. నిన్ననే తెలుసుకున్నాను అంటూ ఇంకో కామెంట్లో సమాధానం చెప్పాను. ఆ తరువాత ఆ విషయం పట్టించుకోలేదు.

కానీ ఇవ్వాళ పాలనగారు పెట్టిన కామెంట్ వల్ల మళ్లీ దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. పాలనగారేమో అవిసెను అగిసె అంటారని అన్నారు.. ప్రాంతాలనుబట్టి తేడా ఉండవచ్చు అనుకున్నాను. కానీ ఫ్లాక్ష్ సీడ్స్ ను అవిశెలు అని అంటారని చెప్పారు.

దీంతో నేను మళ్లీ అవిసె శాస్త్రీయ నామం (Sesbania grandiflora) పేరుతో ఓసారి గూగుల్ లో సెర్చ్ చేయగా ఇమేజ్ కరెక్ట్ గా వచ్చింది.. (అంటే నేను దేన్నయితే చెబుతున్నానో ఆ చెట్టు పువ్వులకు సంబంధించిన ఫొటోలు వచ్చాయి)

Flax seeds అనే పేరుతో సెర్చ్ చేయగా వేరే రకాల ఫొటోలు వచ్చాయి. దాంతో నేను చెబుతున్న అవిసె - సెస్బేనియా గ్రాండిఫ్లోరా కరెక్టు అనుకున్నాను. దీని నేను గురించే రాసింది. ఫ్లాక్ష్ సీడ్స్ గురించి కాదని మిత్రులందరికీ మనవి.

ఇకపోతే పాలనగారు సూచించినట్లుగా నేను అవిసెకు అగిసె అనే పేరును మార్చటం లేదు. ఎందుకంటే, మా ప్రాంతంలో దీన్ని అలాగే పిలుస్తారు కాబట్టి.. నేను దాన్నే అలాగే ఉంచుతున్నాను. పాలనగారు అవిసెకు, అవిశెలకు తేడాను తెలియజేసినందుకు కృతజ్ఞతలు...