Pages

Tuesday, 8 February 2011

మట్టి సుగంధం ''మా నాన్న''


"మన పిచ్చిగానీ నాన్న ఎక్కడికి వెళతాడు?
ఆయన మన చుట్టూనే ఉంటాడు
మనల్ని చుట్టుకునే ఉంటాడు
మన మెతుకులో మెతుకై 
వాతాపి జీర్ణం అంటూ
ప్రేమగా కడుపు తడుముతూనే ఉంటాడు"

నాన్న గురించి చెప్పాలంటే, రాయాలంటే ఎన్ని పేజీలు, పుస్తకాలు నింపినా.. మళ్లీ మళ్లీ అవి నిండిపోతూనే ఉంటాయి. మనసు అనే ప్రవాహం నుంచీ జ్ఞాపకాలు అనే గట్లు తెగి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నప్పటినుంచీ అన్నీ తానై, ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ, ఆ దేవుడికి మారు రూపమైన నాన్నల గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే.

మా నాన్న మాకు దూరమై అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం రోజులు ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తూ ఉన్నా, తన ఆశీస్సులు మమ్మల్ని చల్లగా ఉంచుతాయన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాం. సంవత్సరం క్రితందాకా మాతో ఉన్న ఆయన ఈరోజు మా ముందులేడన్న నిజం తల్చుకుంటే గుండె పిండేసినట్లవుతుంది.

తను లేని లోటు, ఆయన తోడు లేకుండా మేము భారంగా వేసిన అడుగులు, గడిపిన రోజులు గుర్తొస్తే ఇంకా ఒక ఏడాదేగా గడిచింది... ఇంకెన్ని రోజులు ఇలా గడపాలో కదా.. అనుకోగానే గుండె కరిగి కన్నీటి వరదై చెంపలను తడిమేస్తుంది. అయితే, పసిపిల్లల అమాయకత్వం కలగలసిన మా నాన్న నవ్వు మాకు ధైర్యం చెబుతూ, నేనెక్కడున్నా మీతోనే ఉంటాననే ధీమాను కలిగిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది.

రవాణా సౌకర్యాలు అంతగా లేని ఓ మారుమూల పల్లెటూళ్లో మా నాన్నగారు జన్మించారు.... అప్పట్లో పల్లెటూళ్లలో నిరుపేద కుటుంబీకులు ఎలాంటి జీవనం గడిపేవారో, నా తండ్రి కూడా అలాంటి జీవితాన్నే గడిపారు. పశువులను మేతకు తీసుకెళ్లటం, వాటి బాగోగులు చూసుకోవటంతోనే ఆయన బాల్యం గడిచిపోయింది. పాఠశాల సౌకర్యం కూడా ఆ ఊర్లో లేదు కాబట్టి మా నాన్నకు చదువుకోలేదు. ఒకవేళ పాఠశాల ఉండివున్నా, చదువుకునేవారో లేదో తెలియదు.

అలా బాల్యం గడిచిన తరువాత మా అమ్మను పెళ్లి చేసుకున్నారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనంలో పెరిగి పెద్దవారైన నా తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులు మైనారిటీ తీరకుండానే వివాహం జరిపించారు. మరో సంవత్సరానికి నేను తొలి సంతానంగా వారికి జన్మించాను.... కనీసం వంట కూడా చేయటం చేతగాని అమ్మను, నన్ను మా నాన్న కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజంతా కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తూ, వంటకు కావాల్సిన సరుకులు కొనుక్కుని వచ్చేవారు. ఆ తరువాత ఆయనే వంటచేసి అమ్మకూ, నాకూ తినిపించి పడుకునేవారు. మళ్లీ ఉదయాన్నే పనులకు పరుగుతీసేవారు.

కూలిపనులు లేని రోజున అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, తనతోపాటు వచ్చిన జతగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క మోపు మాత్రమే తెస్తే, మా నాన్న రెండు మోపులను మోపుపై మోపు పెట్టుకుని పరుగుతీసేవారు. ఆ కట్టెల మోపులను తీసుకుని ఓ గంటసేపు కాలినడకనే పక్కనే ఉండే గ్రామానికి వెళ్లి అక్కడ షావుకార్లకు అమ్మి డబ్బులు తీసుకుని.. బియ్యం, ఉప్పూ, పప్పూ కొనుక్కుని వచ్చేవారు. (నాన్నగారి మొదటి వర్థంతి రోజు రాత్రి అమ్మ నాతో మాట్లాడుతూ.. వారి జీవితం ఎలా మొదలైందీ, ఇప్పుడు ఎలా ఉందీ.. భోరున విలపిస్తూ చెప్పింది..)

నాన్నకు చేదోడువాదోడుగా ఉండేందుకు అమ్మకూడా కూలిపనులకు వెళ్లేందుకు సిద్ధపడింది. అలా ఇద్దరూ జంటగా కూలిపనులకు వెళ్లేవాళ్లు. ఓ భుజంపైన నన్ను, మరో భుజంపైన చద్దిమూటను పెట్టుకుని.. అమ్మ తోడుగా నాన్న హుషారుగా కూలిపనులకు వెళ్లేవాడు. ఎంత కష్టమైనా సరే.. ముద్దుగా, బొద్దుగా ఉండే నన్ను చూడగానే ఇట్టే మరిచిపోయేవారమని అమ్మ ఇప్పటికీ చెబుతుంటుంది.


 ........... ఆ తరువాత మరో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన మా అమ్మానాన్నలు.. ఓ చిన్న పూలకొట్టు, పూరిపాకతో జీవితం ప్రారంభించారు. అదే ఊర్లో ఇప్పుడు మూడు మిద్దె ఇళ్లను కట్టి, మా పేరుతో కొద్దిపాటి డబ్బును జమచేశారు. ముగ్గుర్నీ ఉన్నత చదువులు చదివించారు. ఉన్నంతలో సంతృప్తికరమైన జీవితం.. ఇలా హాయిగా సాగిపోతున్న జీవితంలో మా నాన్న అనారోగ్యం పెద్ద శాపంలా పరిణమించింది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆయన అనారోగ్యం కుదుటపడలేదు. ఈ క్రమంలోనే కామెర్ల వ్యాధి సోకింది. దానికి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకుండా ఆయన ఎక్కువగా నాటుమందులపైనే ఆధారపడటంతో ఆయన లివర్ పూర్తిగా పాడయిపోయింది.

....... మెల్లిగా నోటినుంచి, ముక్కునుంచి, మలమూత్రాలలోనూ రక్తం పడటం ప్రారంభించింది. మాకు చెబితే భయపడతాం అని ఆయన చెప్పకుండా దాచేశారు. అలా ఓ పదిరోజుల్లోనే ఆయనకు సీరియస్ అయ్యింది. ఆసుపత్రిలో మూడు రోజులుండి మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆయన చివరిరోజంతా ఆసుపత్రిలోనే ఉన్నాం. బీపీ చాలా కిందికి పడిపోయింది. మెలకువగాలేరు. చాలా భారంగా శ్వాస తీసుకుంటున్నారు. ఆయన ఇంకో నాలుగు గంటల్లో చనిపోతారనగా.. కాస్త మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న అందరినీ కళ్లతోనే పలుకరించారు. నా వైపు మాత్రం పదే పదే చూస్తుండటంతో ఏంటి నాన్నా అని అడిగాను. "ఏంలేదమ్మా" అంటూ ఓపిక తెచ్చుకుని అన్నారు. అదే ఆయన చివరిమాట. ఆ తరువాత ఆయన మాకు ఇక లేరు.

జీవితమంతా కష్టాలతోనే సాగిపోయిన మా నాన్న.. పిల్లలు పెద్దవారై, ప్రయోజకులై సుఖపెట్టే సమయంలో ఈ లోకంనుంచే శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఈ విషయం తల్చుకున్నప్పుడల్లా గుండెనెవరో మెలిపెడుతున్నట్లుగా ఒకటే బాధగా ఉంటుంది. ఏ రోజు కూడా సుఖమంటే ఏంటో తెలియని నా తండ్రి, ఇక తాను పడ్డ కష్టం చాలునంటూ శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లిపోయారు. తాను ఉన్నా, లేకున్నా పిల్లలు కష్టపడకూడదని.. తనకు చేతనైన అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఆయన ఎలాంటి కష్టం కలిగించకుండా కానరాని లోకాలకు తరలివెళ్లారు.

జీవితమంతా పిల్లల కోసమే కష్టపడిన, తపించిన ఆయన నుంచి ఆయన పిల్లలమైన మేమే కాదు, ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి.

ఆకలితో ఉన్నవారు ఎవరైనా, ఎలాంటివారైనా ఆదరించాలని. మనకు లేకపోయినా వాళ్లకు మనకు ఉన్నంతలో పెట్టి పంపించాలని ఆయన పదే పదే చెబుతుండేవారు. ప్రతిరోజూ తను తినే తిండిని ఎవరో ఒకరితో పంచుకోకుండా ఆయన ఎప్పుడూ తిన్నది లేదు. ఒక్కోసారి తనకు లేకపోయినా ఎదుటివారి ఆకలిని గుర్తించి తీర్చేవారు. తాను ఒకపూట తింటూ, మాకు మూడుపూట్లా కడుపునిండా తిండిపెట్టిన ఆయనకు ఆకలి విలువ ఏంటో తెలుసు కాబట్టి అలా చేసేవారేమో. ఆయన నుంచి మేం నేర్చుకున్న గొప్ప విషయం ఇది. ఆయన పిల్లలుగా మేం ముగ్గురం ఆయన కట్టించిన, తిరుగాడిన ఆ ఇంటికి ఎవరు వచ్చినా ఆకలితో వెళ్లకుండా చూస్తున్నాము.

అదే విధంగా మోసపూరితమైన పనులకు ఎప్పుడూ పాల్పడవద్దనీ, అబద్ధాలు చెప్పవద్దని ఆయన మాకు పదే పదే చెప్పేవారు. మోసం చేయటం, అక్రమంగా, అన్యాయంగా సంపాదించటం అంటే ఆయనకు గిట్టదు. న్యాయంగా కష్టపడి సంపాదించుకోవాలని ఆయన చెప్పేవారు. రాజన్న పిల్లలు అంటే పదిమందీ మంచిగా చెప్పుకోవాలని ఆయన ఆశపడేవారు. నేను మీకు పెద్ద పెద్ద ఆస్తులను సంపాదించి ఇవ్వకపోయినా విద్యాబుధ్దులు, నీతి నిజాయితీలు నేర్పించాను. తండ్రిగా ఇంతకంటే ఇంకేం చేయలేనురా అని అప్పుడప్పుడూ ఆయన అంటుండేవారు.

అన్నింటికంటే ఆయననుంచి ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సినది ఒకటుంది. అదే క్షమాగుణం. ఎన్నోసార్లు తనను మానసికంగా, శారీరకంగా గాయపర్చిన వ్యక్తులను సైతం ఆయన చాలా సులభంగా క్షమించేసేవారు. "పోనీలే తల్లీ వారి పాపాన వాళ్లే పోతారు. మనకు వచ్చే నష్టం ఏమీ లేదు" అనేవారాయన. రక్త సంబంధీకులనే కాదు, బంధువులను, ఊర్లోవాళ్లను ఎవరినైనా సరే తన తప్పు ఏమీ లేకున్నా, తనను నిందిస్తూ ఇబ్బంది పెట్టినా సరే.. అలాంటి వాళ్లను కూడా చాలా సులభంగా క్షమించేసేవారు.

తన వ్యాధి తీవ్రమవుతోందనీ, ఇకపై ఎక్కువ రోజులు తాను బ్రతికి ఉండనని అర్థం చేసుకున్న మా నాన్న మాకు చెబితే భయపడతామని చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. బ్రతికి ఉన్న రోజులలో తనకు ఏవేవి ఇష్టమో అవన్నీ చేశారు. ఎవరెవరిని చూడాలని ఉందో, అందరినీ చూసి వచ్చారు. ఏమేమి తినాలో వాటన్నింటినీ తిన్నారు. తాను కట్టించిన ఇళ్లను, ఇంటి పరిసర ప్రాంతాలను తనివితీరా చూసుకున్నారు.

(ఇవన్నీ తాను చనిపోయిన తరువాత అందరూ చెబితే మాకు తెలిసాయి. ముఖ్యంగా మొదటి వర్థంతి రోజున మా ఊర్లో ఒకామె చెప్పిన విషయం మమ్నల్ని నిశ్చేష్టులను చేసింది. మరో మూడు రోజుల్లో ఆయన చనిపోతారనగా తనను పిలిచి, "ఏమ్మా నీకు 5 రూపాయలు బాకీ ఉన్నాను కదా, ఇదుగో తీసుకో" అని అన్నాడట. "ఏంటన్నా ఈ ఊర్లోనే కదా ఉన్నావు, ఇప్పుడెందుకు పిలిచి మరీ ఇస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావేంటి?" అని ఆమె అడిగితే, "ఎక్కడికీ వెళ్లటంలేదమ్మా, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఎవ్వరికీ బాకీ ఉండటం నాకు ఇష్టం లేదు" అని చెప్పారట. అది ఆమె చెబుతుంటే ఆయన రూపం మా కళ్లముందు నిలబడి చెబుతున్నట్లుగా అనిపించి పిచ్చిగా ఏడ్చేశాం.)

ఇవండీ మా నాన్నతో మాకున్న జ్ఞాపకాలు.. జ్ఞాపకాలు అనేకన్నా, మా నాన్నతో మేం గడిపిన అరుదైన క్షణాలు అనవచ్చు. ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టి, తాను నిరక్షరాస్యుడైనా, తన పిల్లలు తనలా ఉండకూడదని చదువులు చెప్పించి, తన పిల్లలు మరో పదిమందికి విద్యాదానం చేయగలిగే స్థాయికి మమ్మల్ని ప్రయోజకుల్ని చేసి.. కానరాని లోకాలకు తరలివెళ్లిన నా తండ్రికి ఇదే నా అక్షర సుమాంజలి. 

నాన్నా...
నీవు ఎక్కడున్నా, నీ ఆత్మకు శాంతి చేకూరాలనీ...
నీ చల్లని చూపులు మా వెన్నంటే ఉండాలనీ
నీ జ్ఞాపకాలను...
నువ్వు పంచిన ఆత్మీయతానురాగాలను..
నీ చిరునవ్వులను పూమాలగా చేసి...
ఇదుగో నీకే సమర్పిస్తున్నాం...
ఆశీర్వదిస్తావు కదూ... ?!!


ఈ వ్యాసం పూర్తి పాఠం సిలికానాంధ్ర వారి సుజనరంజని పాఠకుల పేజీలోని మా నాన్నకు జేజేలు శీర్షిక కిందన పబ్లిష్ అయ్యింది.

24 comments:

గిరీష్ said...

maatalu levandi..
I pray that your father's soul rest in peace.

శోభ said...

ధన్యవాదాలు గిరీష్‌గారూ..

లత said...

మిగిలేవి జ్ఞాపకాలే కదా
చాలా బాగా రాశారు

శోభ said...

Thank You Lathagaaru...

రాధిక(నాని ) said...

చదువుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయండి. మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని, మీరు ఈ భాధనుండి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మధురవాణి said...

శోభ గారూ,
కళ్ళు చెమర్చాయండీ! నాన్న ప్రేమని ఎన్ని మాటల్లో చెప్పినా తక్కువే! మీ నాన్నగారి వ్యక్తిత్వం స్పూర్తిని కలిగించేలా ఉంది. ఆయన జ్ఞాపకాలతో ఆయన నమ్మిన వాటిని ఆచరిస్తూ జీవించడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.

శోభ said...

రాధికగారూ, మధురవాణిగారూ.. మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ బ్లాగు ద్వారా, సిలికానాంధ్ర సుజనరంజని పత్రిక ద్వారా మా నాన్నగారి గురించి చెప్పుకునేందుకు వీలు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ముఖ్యంగా తన పిల్లలు తనలా నిరక్షరాస్యులుగా ఉండకూడదని, అష్టకష్టాలు పడి చదివించిన మా నాన్నను.. నా అక్షరాలతో ఈ ప్రపంచానికి పరిచయం చేయటం నా జీవితంలో ఇంతకంటే తృప్తి మరొకటి ఉండదేమో...

ఇక్కడ పేదవాళ్లమని, వెనుకబాటుతనం నుంచి వచ్చినవాళ్లమని ఏ మాత్రం నాకు చిన్నతనంగా అనిపించటంలేదు. పేదవాడైనా మా నాన్న మంచి బుద్ధిలో అందరికంటే సంపన్నుడు. ఇది చెబుతున్నందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది... ఎదో చెప్పాలనిపించి అలా... ఏమీ అనుకోకండి...

కొత్త పాళీ said...

నిజమే. నాన్నకి జేజేలు. మీక్కూడా.

లాహిరి said...

yes... now you did well... good.... shobha gaaroo, mee bhavavyakteekarana chaalaa baagundi.....

శోభ said...

కొత్తపాళిగారూ, శ్రీనివాసరావుగారూ.. కృతజ్ఞతలండీ..

ఆ.సౌమ్య said...

బాగా రాసారండీ...తండ్రి ప్రేమ ఎన్నటికీ మరువలేనిది. మీ నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

శోభ said...

ధన్యవాదాలు సౌమ్యగారూ...

curve said...

heart touchinggggg...thanks for sharing your memories with us...

శోభ said...

Thank You vijaya bhanu gaaru..

మనసు పలికే said...

ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. మనసంతా అదోలా అయిపోయింది.
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

శోభ said...

"పోయినోళ్ళు అందరూ మంచోళ్లే... ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు".... ధన్యవాదాలు అపర్ణగారూ...

Swetha Malla said...

శోభా మీ నాన్నగారి జీవితం లో ఎన్ని కష్టాలు పడినా ఇంత మంచి కూతుర్ని కని గొప్ప తండ్రి అనిపించుకున్నారు..ఎంతమంది నీలా ఇలా తమ ప్రేమను వ్యక్తం చెయ్యగలరు చెప్పు? ఇంత కంటే ఆయనకు నువ్విచ్చే బహుమానం ఎముంటుంది డియర్!ఆయన దీవెనలు ఎప్పటికీ బలంగా నిన్ను వెన్నంటే ఉండాలని ఆశిస్తూ..నీ అక్క

శోభ said...

థాంక్ యూ వెరీమచ్ అక్కా...

veera murthy (satya) said...

క్షణ క్షణం చస్తూ బతికే కన్నా, తిరిగిరాని ప్రతీ క్షణాన్ని చివరి క్షణంగా, అమూల్యంగా మలుచుకొని, తెలుసుకొని,
బాధ్యతతో, ప్రేమతో సంతోషపెట్టి సంతోషపడి బ్రతకడమే నిజమైన జీవితం, అలా తన్వు చాలించడమే నిజమైన మరణం!

శోభ said...

ఈ సత్యం తెలుసుకునే నాన్న అంత నిబ్బరంగా మరణాన్ని ఆహ్వానించారేమో.. తను ఇక ఉండడని బాగా అర్థమైపోయిందాయనకు.. అందుకే చివరి రోజుల్లో చేయాల్సినవన్నీ చేశారు.

అయితే చివరి ఘడియల్లో నాకేదో చెప్పాలని పదే పదే ప్రయత్నించారు కానీ, గొంతు పెగల్లేదు.. అంత నీరసంగా ఉన్నా.. బీపీ క్షణక్షణానికీ పడిపోతున్నా, కళ్లు మూతలు పడుతున్నా బలవంతంగా తెరచుకుంటూ.. కళ్లతోనే ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు.. ఏమీ చెప్పలేకపోయారు...

ధన్యవాదాలు సత్యా...

శ్రీ said...

మీ నాన్నగారికి వందనాలు.

శోభ said...

ధన్యవాదాలు శ్రీ గారు...

Anonymous said...

Shobha garu,
Kallu masaka badatam spastamgaa chusaanu.

May his soul rest in peace,


Your narration is good.

శోభ said...

@ అనానిమస్ గారూ..

మరీ అందర్నీ ఇలా ఏడిపించేస్తున్నానేమో... సారీ...

కానీ, ఈ ఏడుపులో కూడా ఎంతో ఓదార్పు ఉంటుంది కదండీ..