Pages

Friday 23 December 2011

రాయలసీమ "గుత్తొంకాయ"

 
{రెండేళ్ల క్రితం నేను పనిచేస్తుండే ఆఫీసులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల వారి మధ్య వంటకాలకు సంబంధించి ఓ చిన్న పోటీ జరిగింది. ఈ పోటీలో భాగంగా దాదాపు 16 రకాల వంటకాలను అన్ని భాషలవారు వండారు. బాగా వండిన వంటకాలకు ప్రైజులిచ్చారు.
 
అందులో తెలుగువారి తరపున నేను వండిన ఈ వంటకం 3వ బహుమతిని గెలుచుకుంది. ఈ వంటకానికి కాంబినేషన్‌గా గోంగూర పచ్చడి, గీ వెజిటబుల్ బిర్యానీ కూడా ఆ రోజు వండాను. పాత ఫైల్స్ అన్నీ వెతుకుతుంటే ఇదుగో ఇలా నా చేతికి దొరికేసింది ఇక ఆలస్యం ఎందుకు మరి సీమ గుత్తొంకాయను రుచి చూడండి మరి...!!}

కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు... 1 కేజీ
టొమోటో... పావు కేజీ
ఉల్లిపాయలు... 200 గ్రాములు
పచ్చిమిర్చి... 5
వెల్లుల్లి... 2 గడ్డలు
అల్లం... 100 గ్రాములు
వేరుశెనగ పప్పు... 100 గ్రాములు
ఎండుకొబ్బరి... అర చిప్ప
పట్ట, లవంగం... తగినంత
నువ్వుల నూనె... పావు కేజీ
కరివేపాకు... సరిపడా
కొత్తిమీర... సరిపడా
కారం... సరిపడా
ధనియాలపొడి... సరిపడా
పసుపుపొడి... సరిపడా
ఉప్పు... తగినంత
ఆవాలు, జీలకర్ర, మెంతులు... సరిపడా

తయారీ విధానం :
ముందుగా వంకాయలను ముందువైపు నుండి నాలుగు చీలికలుగా (కాయ విడిపోకుండా) కోసి ఉప్పునీటిలో వేసుకోవాలి. వేరుశెనగపప్పు, ఎండుకొబ్బరి, పట్ట, లవంగాలను ముందు మెత్తగా నూరుకుని, అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బుకున్న పదార్థానికి కారంపొడి, ధనియాలపొడి, పసుపుపొడి, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మసాలా ముద్దను కోసి ఉంచుకున్న వంకాయలలో బాగా కూరాలి. ఇలా మొత్తం కాయలకు మసాలాముద్దను పట్టించిన తరువాత పావు గంటసేపు ఊరనివ్వాలి.



 తరువాత బాణలిలో సరిపడా నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులతో పోపు పెట్టుకుని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు, రెండుగా కోసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత వంకాయలను వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న క్రమంలోనే వంకాలపై ముక్కలుగా కోసుకున్న టొమోటోలను వేసి ఆవిరిపైనే ఉడకనివ్వాలి.

కొద్దిసేపటి తరువాత తగినన్ని నీళ్ళను పోసి కూరను బాగా ఉడికించాలి. గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేలా, నూనె పైకి తేలేలా కూర ఉడికిన తరువాత దానికి చింతపండు రసం పోయాలి. ఆపై కూరను మెల్లిగా కలియదిప్పి కాసేపు అలాగే ఉంచి... తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డించాలి. ఇది చపాతీ, ఫ్రైడ్ రైస్, వేడి వేడి అన్నం, వెజిటబుల్ రైస్, నేతి అన్నం లాంటి వాటికి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

(అన్నట్టు ఇదివరకు నేను మీ అందరికీ చెప్పినట్లుగా ఈ వంటకం కూడా శైలూకే ప్రేమతో అంకితం.......)


ఆరోజు నేను వండిన గోంగూర పచ్చడి, గీ వెజిటబుల్ రైస్ సిత్రాలివిగో.....



9 comments:

Unknown said...

wow.. very nice..

శోభ said...

Thank You very much Praseeda gaaru........

Unknown said...

అక్క! గుత్తొంకాయ కూడా నాకోసం ప్రేమగా పోస్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్.
నోరు ఊరిపోతోంది.అసలే నాకు చాలా ఇష్టం కూడాను.
మీ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టాలి...చేస్తావు కదూ...

శోభ said...

గుత్తొంకాయ అంటే ఇష్టం లేని వాళ్లు దాదాపు ఉండరనుకుంటా శైలూ..

నీక్కూడా ఇష్టమైతే అంతకన్నానా... తప్పకుండా చేసి పెడతాను... :)

Hymavathy.Aduri said...

"గుత్తొంకాయ కూర రుచి ఆంధ్ర వంకాయలైతేనే , బెంగుళూరు వంకాయలతోచేస్తే , ' వంకాయ వంటికూరయు..'పద్యం హూ తూఛ్ ఐపోతుంది.మరెప్పుడూ వంకాయ పేరెత్తరు ఎవ్వరూనూ.శోభారాజుగారూ జాగ్రత్త.చెన్నైవచ్చి మీయింట్లో తింటానులే.చెన్నై వంకాయలరుచి మాత్రం నాకుతెలీదుస్మీ !
నీ
ఆదూరి.

Advaitha Aanandam said...

గుత్తొంకాయ కూర ఏ విధంగా చేసినా చాలా రుచికరంగా ఉంటుంది....
వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఈ విధానము కూడా ప్రయత్నిస్తాను.... చాలా థాంక్స్ అండీ

శోభ said...

@ ఆదూరి హైమ అమ్మా.....

చెన్నై వంకాయల రుచి చూద్దురుగానీ... వచ్చినప్పుడు తప్పక వండి పెడతాను... :)

@ మాధవిగారూ..

గుత్తొంకాయ ఎలా వండినా రుచే.. మీరన్నది ముమ్మాటికీ నిజం.. ట్రై చేయండి నిజంగా సూపర్బ్‌గా ఉంటుంది.

Priya said...

గత వారం రోజులుగా నా ప్రాణం గుత్తొంకాయ కూరను తెగ కలవరించేస్తోంది! కాని నాకేమో చేయడం రాదు.. ఇప్పుడు తెలిసిపోయిందిగా ఈ రోజో, రేపో చేసి ఎలా వచ్చిందో చెబుతా.. థాంక్స్ ఫర్ ది పోస్ట్ శోభ గారు :)

శోభ said...

హ్మ్...... మొత్తానికి గుత్తొంకాయ చేశావా లేదా ప్రియా... :)

పాపం మీవారు... సరదాకేలే... ఊరికే అలిగేయకు... :)