Pages

Wednesday 28 December 2011

నువ్వు లేని ఊరు.. నీ మాటల్లేని ఇల్లు…!!



 పొద్దుట్నుంచీ వచ్చే ప్రతి బస్సునూ
అందులో రాబోయే తన మనిషినీ
రెండు కళ్లు వెతుకుతూనే ఉన్నాయి
నిమిషాలు, గంటలు గడుస్తున్నా
రావాల్సిన మనిషి రాలేదు
రెండు కళ్ల వెతుకులాట ఆగనూ లేదు

సూర్యుడు నడినెత్తికి వచ్చినా
మనిషి రాలేదు, చూపులు ఆగలేదు
ఎట్టకేలకు…
రావాల్సిన మనిషి బస్సు దిగ్గానే..
రెండు కళ్లూ తృప్తిగా, సంతోషంగా
అటువైపు పరుగులు తీశాయి

పొద్దుట్నుంచీ ఎదురు చూస్తున్నా..
ఇప్పుడా రావటం….?
ప్రశ్నించాయి ఆ కళ్లు

అదెంటీ.. నేను ముందే చెప్పానుగా
ఈ టైంకే వస్తానని
మరెందుకలా పొద్దుట్నుంచీ చూడటం
అవతలి కళ్ల ఎదురు ప్రశ్న..?

నీకేంటి అలాగే చెబుతావ్…
మా ఆరాటం మాదీ..
నా రక్తంలో రక్తం నన్ను
చూసేందుకు వస్తుంటే
తొందరగా చూడాలని ఉండదా మరి..?

తిరిగి ఊరెళ్తుంటే…
అప్పుడే వెళ్లాలా అంటూ
అవే కళ్లు మళ్లీ వేడుకోలు
తప్పదు మరి.. మళ్లీ వస్తాగా అంటే,
భారంగా వర్షిస్తూ ఆ కళ్ల వీడ్కోలు

చాలా సంవత్సరాలు ఇలాగే…

కానీ ఈరోజు..
నా కోసం ఎదురుచూసే
ఆ రెండు కళ్ల కోసం
రోజుల తరబడీ ఎదురుచూస్తున్నా
ఆ కళ్ల జాడ కనిపించటం లేదు

ఎదురుచూపులు, వీడ్కోళ్లతోనే
అలసిపోయిన ఆ కళ్లు…
శాశ్వత విశ్రాంతి కోసం
రక్తంలో రక్తాన్ని వదిలేసి
అందరాని దూరాలకు
ఆనందంగా వెళ్లిపోయాయి

ఇప్పుడు నా కోసం
వెతుకులాడే కళ్లు
ఎదురుచూసే ఆ మనిషి
వేడుకోల్లు, వీడ్కోళ్లు
ఏవీ ఏవీ లేనే లేవు…

కనిపించకుండా పోయిన ఆ కళ్లు
ఎవ్వరికీ, ఎప్పటికీ కనిపించవు
అయినా…
కనిపించే తన ప్రతిరూపమైన నాకు
ఎప్పుడూ చూపునిస్తూనే ఉంటాయి…..!!


(నవంబర్ 7, 2009న అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించిన మా “నాన్న”గారికి కన్నీటితో…..)

{ఈ పోస్టు November 20, 2009న నా మరో బ్లాగు http://blaagu.com/kaarunya/ లో రాశాను. అయితే అక్కడ బ్లాగు నిర్వహణ బాగలేక పోయిన కారణంగా ఆ బ్లాగును అప్‌డేట్ చేయడం ఆపేశాను. చాలాసార్లు ఆ సైట్ ఓపెన్ కావడం లేదు. అందుకనే అందులోని నా పోస్టులన్నింటినీ ఈ బ్లాగులోకి ఇప్పటికే తరలించేశాను. అయితే ఈ పోస్టు మాత్రం ఈ బ్లాగులోకి మార్చేశాననుకుని మర్చిపోయా. ఈరోజు ఎందుకో వెతుకుతుంటే కనిపించింది. నా పాత బ్లాగులో ఈ పోస్టును చదివిన మిత్రులెవరైనా ఉంటే, మళ్లీ ఇక్కడ ఉంచినందుకు ఏమీ అనుకోకండి. ఇప్పటిదాకా చదవనివాళ్లు మాత్రం తప్పక చదవగలరు}

10 comments:

♛ ప్రిన్స్ ♛ said...

nanna gaari atma shanti kalgalani manasara korukuntu

Unknown said...

అక్క ఈ పోస్ట్ ఎన్నిసార్లు చదివిన కళ్ళు చెమ్మగిల్లుతాయి.మీ బాధని పంచుకోగలం కాని తీర్చలేము కదా నాకు ఏదయినా దివ్యశక్తి వచ్చి నాన్నగారిని తీసుకు రాగలిగితే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది.

Unknown said...

కారుణ్య గారూ! ఈ పోస్ట్ చదివి కళ్ళళ్ళో నీళ్ళు అమాంతమూ పొంగుకు వచ్చాయి. నాన్నని పోగుట్టుకున్న హృదయవేదన ఎన్నో ఏళ్ళుగా అనుభవిస్తున్నాను. మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ...గుర్తుగా మీరు రాసుకున్న ఈ పోస్ట్ లో ఆయన దాగి ఉన్నారనిపిస్తుంది...

శోభ said...

@ తెలుగు పాటలు గారూ... మీ స్పందనకు ధన్యవాదాలు

శోభ said...

@ శైలూ.. ఆత్మీయులు దూరమైన వారందరి పరిస్థితీ ఇదే. ఇలాగే అనుకుంటుంటారు.. ఇంకేమీ చేయలేని నిస్సహాయతలోంచే అలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటుంటారు కదా...

శోభ said...

@ చిన్ని ఆశ గారూ.. ఈ ఆవేదన మన కట్టె ఉన్నంతదాకా ఆగనిది. నాన్నగారి ఆత్మ శాంతి చేకూరాలని నిండుమనసుతో మీరు కోరుకున్నందుకు ధన్యవాదాలు.

ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలనిపిస్తోంది.

నాన్నగారు పోయిన తరువాత తొలిసారిగా మా ఊరికి వెళ్లాను. సాధారణంగా నేను వూరికి వస్తున్నానంటే మాఇంట్లో అందరికీ పండుగే. మా నాన్న అయితే కనిపించే ప్రతి ఒక్కరికీ ఈరోజు నాకూతురు వస్తోంది అంటూ సంబరంగా చెప్పుకునేవారు.

నేను రావడానికి ముందే ఫోన్లో ఎప్పుడు వచ్చేది, ఊర్లో దిగేటప్పటికి ఎంత టైం అవుతుందని ఖచ్చితంగా చెప్పినా సరే.. మా నాన్న, అమ్మా... ఉదయం నుంచే నాకోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లు. ముఖ్యంగా మా నాన్న అయితే మరీనూ. వచ్చే పోయే ప్రతి బస్సునూ అదేపనిగా చూస్తుండేవాడట. నేను దిగేదాకా ఆయన పరిస్థితి ఇదే. నేను వస్తున్నానన్న సంతోషంలో ఆయన తిండి కూడా తినేవాడు కాదు. అమ్మాయి వచ్చాక ఇద్దరం కలిసి తింటాం అని అలాగే ఉండేవాడు. ఎప్పుడూ ఇంతే.

ఆయన లేకుండా ఊరికి వెళ్లిన తొలిసారి నా పరిస్థితి చెప్పడానికి వీలుకాదు. ఎంత ఏడుపొచ్చిందో. "నాన్న ఏంటి ఇంకా రాలేదు. ఎప్పుడూ లేటుగా వచ్చానని సంతోషంతో కూడిన కోపంతో ఎలా ఉడుక్కుంటూ అడిగేవారో. అలాంటిది ఇప్పుడేంటి అస్సలు రాలేదు. నామీద ఎందుకంత కోపం. ఎక్కడైనా దాక్కుని ఉన్నారా అంటూ పిచ్చిగా బస్టాండ్ అంతా ఎంతలా వెతుకుతూ చూశానో, నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి అది". ఆ స్థితిలోంచి బయటికి వచ్చేందుకు చాలాసేపు పట్టింది. ఇక నిజం అర్థమైన తరువాత ఎంతసేపు ఏడ్చానో, ఎలా ఇంటికి వెళ్లానో ఏమీ గుర్తులేవు.

ఆయన పోవడానికి రెండు నెలలముందు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను అని ఎంత సంబరంగా ఫోన్లో చెప్పారో.

ఇంట్లో అమ్మ నాన్న వస్తువులన్నీ సర్దుతుంటే ఆయన కళ్లజోడు చూడగానే నాకు నాన్న ఫోన్లో చెప్పిన విషయం గుర్తొచ్చి మళ్లీ ఎంతసేపు నా కళ్లు సముద్రాలయ్యాయో తెలీదు. "మారాజు ఎంత బతుకు బతుకుదామనుకున్నాడో ఏంటో" అని అమ్మ నేలకు అతుక్కుపోయింది. ఇది చూశాక తమ్ముళ్లకు, నాకూ భరించలేని వేదన.

ఈ సందర్భంలోంచే నేను రాసిన కవిత పుట్టుకొచ్చింది. క్షమించాలి అందర్నీ ఎక్కువగా బాధపెడుతున్నట్లయితే. బాధ పంచుకుంటే తరుగుతుందని అంటుంటారు కదా... అందుకే ఆత్మీయులైన మీ అందరితో పంచుకుంటే కాస్తయినా మనసు నెమ్మదిస్తుందని అనుకునే ఇలా....

sarma said...

గుండె మెలిపెట్టేశారు

శోభ said...

శర్మగారూ...... ఏంచెప్పాలో అర్థం కావటం లేదు. ఇలా రాసి అందర్నీ బాధపెట్టేస్తున్నానో ఏంటో..

Unknown said...

శోభ గారూ!
అవునండీ! గుండెలు పగిలే ఆవేదన అది, నాన్నగారు ఎప్పుడూ మీకోసం ఎదురు చూసే ఆ బస్టాండ్ లో మీరు దిగి ఇప్పుడాయనకోసం చూసి ఆయనలేరని గుర్తుకొచ్చి పడే ఆ వేదన మాటల్లో చెప్పలేనిది. దుఃఖం ఎవరితో పంచుకున్న్నా తప్పక తగ్గుతుంది. ఇలా నాన్నగారి స్మృతులు తాకే ప్రతి హృదయమూ మీ బాధని పంచుకుంటుంది. ఇలా రాసి మీరెవ్వరినీ బాధ పెట్టలేదు. చదివేవాళ్ళెందరో ఇలాంటి బాధ పొందినవారే, మీతో పంచుకుని వారి బాధా కాస్త అయినా తగ్గుతుంది...ఆయన కళ్ళజోడుని గుర్తుగా కలకాలం భద్రపరచండి...

శోభ said...

చిన్ని ఆశగారూ.. మీ మాటలు నిజంగా ఎంత ఊరడింపుగా ఉన్నాయో చెప్పలేను. థ్యాంక్యూ సో మచ్ అండీ...