Pages

Friday, 7 December 2012

నువ్వెప్పుడూ ఇంతే...!!!నువ్వెప్పుడూ ఇంతే..

అమ్మ గుర్తొచ్చింది అనేంతలోనే..
అమ్మవై లాలిస్తుంటావు
నాన్న.. మాట పెదాల్ని తాకకముందే
నాన్నవై నడిపిస్తుంటావు

దిగులుకొండ నేనెక్కి కూర్చుంటే
ఆసరా నిచ్చెనై గుండెల్లో పొదువుకుంటావు
సంబరం అంబరమై నే తుళ్లిపడుతుంటే
ఇంద్రధనుస్సువై పులకరిస్తుంటావు
బుంగమూతితో వయ్యారాలు పోతుంటే
వెచ్చని ముద్దువై నుదుటిపై నర్తిస్తావు

నా కబుర్ల సెలయేటి ప్రవాహానికి
నిశ్శబ్ద సంగీతమై తోడు వస్తుంటావు
అనురాగం ఆనందమై అల్లరి చేస్తుంటే
చక్కిలిగింతల చెలికాడివై మురిసిపోతావు
అపార్థమనే ఆవగింజ మొలకెత్తేలోగానే
నమ్మకం అనే మర్రివిత్తును నాటేస్తుంటావు
ఇద్దరం ముగ్గురమై ముద్దుల మూటలైతే
చంటిపిల్లాడల్లే బోసినవ్వువై విరబూస్తావు

నువ్వెప్పుడూ ఇంతే...

అంతులేని ప్రేమని నీకిచ్చేయాలని
అనుకునేంతలోనే...
అంతకు రెట్టింపు ప్రేమని
ముద్దుగా మూటగట్టి
బహుమతిగా ఇచ్చేస్తుంటావు
అందుకేనేమో..
ఇప్పుడు నా జీవితం అంతా
రంగులమయం... హరివిల్లుల లోకం...
ఈ రంగులన్నీ చిత్రించేది మాత్రం నీ రూపాన్నే....!!


("మనసులోని మౌనరాగం" బ్లాగర్ "ప్రియ"గారు రాసిన ఓ పోస్టుకి స్పందనే ఈ కవిత)21 comments:

Priya said...

శోభ గారు.. మీ కవిత నా మనసుకి ఎంత నచ్చిందో చెప్పడానికి మాటలు చాలడం లేదు.
అయ్యో... ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదండీ బాబు..!!! "వావ్.. సూపర్బ్.. కేక.. అద్భుతంగా రాశారు. అందునా నా పోస్ట్ కి స్పందనగా మీరింత అందమైన కవిత రాయడం చాలా చాలా చాలా......................... సంతోషంగా ఉంది" అని టైప్ చేయబోయాను.. కాని నా ఫీలింగ్ ని ఎక్ష్ప్రెస్స్ చేయడానికి ఈ మాటలు చాలవనిపించి చిరునవ్వు తో సరిపెడుతున్నా.. నోచ్చుకోరుగా..?!

శోభ said...

ప్రియ గారు..

మీ చిరునవ్వు ఎన్ని భావాల్ని మోసుకొస్తుందో నేను అర్థం చేసుకోగలను అలాంటప్పుడు నొచ్చుకోడానికేముంటుంది సంతోషం తప్ప...:)

మీ పోస్టు ఎంతగా నచ్చిందో అందుకు స్పందనగా వచ్చిన ఈ కవితే సాక్ష్యం.. :)

అందుకోండి అభినందన మందారమాలలు...

ధాత్రి said...

వలచిన మగని గెలిచిన వనిత హృదయన్ని చాలా(బోలెడన్ని అన్నమాట) బాగా ఆవిష్కరించారు..
ప్రియ గారి టపాకి మీ కవితాస్పందన చాలా(ఇవి కూడా బోలెడన్ని) నచ్చేసింది..:)
Soo sweet of you..:))

జలతారువెన్నెల said...

మీకు తప్పట్లు. బాగుందండి

Chinni said...

శోభ గారు,
తన టపాకి, మీ స్పందనగా వచ్చిన కవిత చాలా అద్భుతంగా ఉంది..అభినందనలు మీకు..

డేవిడ్ said...

శోభ గారు చాలా బాగుంది మీ కవిత...

శోభ said...

@ చిన్నిగారికి
@ డేవిడ్ గారికి ధన్యవాదాలు

శోభ said...

"దిగులుకొండ నేనెక్కి కూర్చుంటే
ఆసరా నిచ్చెనై గుండెల్లో పొదువుకుంటావు
సంబరం అంబరమై నే తుళ్లిపడుతుంటే
ఇంద్రధనుస్సువై పులకరిస్తుంటావు
బుంగమూతితో వయ్యారాలు పోతుంటే
వెచ్చని ముద్దువై నుదుటిపై నర్తిస్తావు..."

అద్భుత ప్రేమానురాగాలు కురిపించు చిక్కని కవిత్వం.

- Linga Reddy Kasula (https://www.facebook.com/lingareddy.kasula)

శోభ said...

"అమ్మ గుర్తొచ్చింది అనేంతలోనే..
అమ్మవై లాలిస్తుంటావు
నాన్న.. మాట పెదాల్ని తాకకముందే
నాన్నవై నడిపిస్తుంటావు"

ఆర్ద్రంగా ఉంది.జయహో!

- Kavi Yakoob https://www.facebook.com/kaviyakoob)

శోభ said...

"బుంగమూతితో వయ్యారాలు పోతుంటే
వెచ్చని ముద్దువై నుదుటిపై నర్తిస్తావు..."

So sweet lines

- బహుదూరపు బాటసారి (https://www.facebook.com/baatasaari.bahudoorapu)

శోభ said...

@ లింగా రెడ్డి గారికి,

@ కవి యాకూబ్ గారికి

@ బహుదూరపు బాటసారి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

శోభ said...

@ జగతి అమ్మకు,

@ జలతారు వెన్నెల గారికి సో మెనీ థ్యాంక్స్.. ! :)

శోభ said...

"నా కబుర్ల సెలయేటి ప్రవాహానికి
నిశ్శబ్ద సంగీతమై తోడు వస్తుంటావు
అనురాగం ఆనందమై అల్లరి చేస్తుంటే
చక్కిలిగింతల చెలికాడివై మురిసిపోతావు
అపార్థమనే ఆవగింజ మొలకెత్తేలోగానే
నమ్మకం అనే మర్రివిత్తును నాటేస్తుంటావు
ఇద్దరం ముగ్గురమై ముద్దుల మూటలైతే
చంటిపిల్లాడల్లే బోసినవ్వువై విరబూస్తావు"

ఇది చాలు ఏ పడతికైనా పది జన్మలు కావాలనుకునే అనురాగానికి...శోభా! ఆలూమగల అన్యోన్యత ను అక్షరాల్లో పొదిగితే అది నీ కవితవుతుందిరా....నైస్ రా...

- Padma Sreeram (https://www.facebook.com/sphoorty1)

శోభ said...

@ పద్మక్కా...

ఓ తల్లిలా, తండ్రిలా, తోబుట్టువులా, స్నేహితునిలా ప్రేమించే భర్త దొరకడం ఎంత అదృష్టమో కదూ..ఎన్ని జన్మలకైనా ఇలాంటి తోడు వెంట వస్తే.. అంతకంటే ఏముంటుంది అతివ జీవితానికి.

ధన్యవాదాలు

చిన్ని ఆశ said...

ఆహా రంగుల హరివిల్లునే దించారు కవితలో అనురాగంతో....
ఆ రంగులన్నీ చిత్రించే జీవితమే నిజమైన రంగుల జీవితం.

కావ్యాంజలి said...

చాలా చాలా బాగుంది శోభ గారు :)

శోభ said...

@ చిన్ని ఆశ గారికి

@ కావ్యాంజలి గారికి ప్రేమపూర్వక ధన్యవాదాలు.. :)

kallurisailabala said...

"దిగులుకొండ నేనెక్కి కూర్చుంటే
ఆసరా నిచ్చెనై గుండెల్లో పొదువుకుంటావు
సంబరం అంబరమై నే తుళ్లిపడుతుంటే
ఇంద్రధనుస్సువై పులకరిస్తుంటావు
బుంగమూతితో వయ్యారాలు పోతుంటే
వెచ్చని ముద్దువై నుదుటిపై నర్తిస్తావు..."

ఎంత నచ్చిందో చెప్పడానికి మాటలు లేవు ...చదువుతున్నప్పుడు నా కనుల నుంచి రాలిన కన్నీటి బిందువును అడగాలి...చాల చాల బావుంది అక్క.

శోభ said...

శైలూ.. ఈ కవిత నిన్ను ఎంతలా కదిలించిందో అర్థం చేసుకోగలను.. కూల్ మా...

శోభ said...

చాలా చాలా బాగుంది శోభ . మళ్ళీ వ్రాయడంలో బిజీ అయిపోవాలని ఆశిస్తూ ...

- వనజ తాతినేని.

శోభ said...

వనజ గారు.. థ్యాంక్యూ... మీ కామెంట్ పబ్లిష్ చేయబోతుంటే రిజెక్టెడ్ అని వస్తోంది. నేను ఎలాంటి సెట్టింగ్స్ మార్చలేదు.. ఎందుకిలా అవుతోందో అర్థం కాలేదు.. అందుకే మీ కామెంట్ ని మెయిల్లోంచి తీసి నేనే పోస్ట్ చేసాను..

మీరు కోరుకున్నట్లు రాసేందుకు ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.