Pages

Saturday 14 May 2011

ఇప్పుడు ఆమె కూడా ఓ జ్ఞాపకం మాత్రమే....!!

చిన్న వయసులో స్కూళ్లకు సెలవులిచ్చే రోజుకోసం ఎదురుచూడని వాళ్లు ఎవరూ ఉండరు. అందరిలాగే నా చిన్ననాటి రోజులు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గర చేసిన అల్లరి అన్నీ మనసు మూలల్లో తియ్యటి, అందమైన జ్ఞాపకంలా భద్రంగా దాగి ఉన్నాయి. ఇప్పటి పిల్లలు వేసవి సెలవులను ఎంజాయ్ చేయటం చూస్తుంటే.. నా చిన్నతనంలోకి అలా పరుగులు పెట్టాలని అనిపిస్తోంది...

వేసవి సెలవులు అంటేనే అమ్మమ్మ వాళ్ల ఊరు.. అమ్మ, తాతయ్యలతో చేసిన అల్లరీ.. ముఖ్యంగా అమ్మమ్మను ముప్పతిప్పలుపెట్టిన సంఘటనలు, స్నేహితులతో కలిసి చేసిన ఘనకార్యాలు... తాతయ్య ఇచ్చిన వార్నింగులు.. నేరేడుపండ్ల తీపి గుర్తులు.. చింతపిక్కల రుచులు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి.. నా మనసు నిండా...

ఆ రోజుల్లో ఒంటిపూట బడులు జరుగుతున్నప్పుడే మాకు ఓ రకమైన హుషారు వచ్చేసేది.. ఒంటిపూట బడులు అయిపోగానే సెలవులు ఇచ్చేస్తారని బాగా గుర్తుంచుకునేవాళ్లం. అంతే ఇక సెలవులు ఇవ్వగానే నేనూ, తమ్ముళ్లు అమ్మను లాక్కుని అమ్మమ్మ వాళ్ల ఊరికి పరుగులు తీసేవాళ్లం. అమ్మ మాతో పాటు రెండ్రోజులుండి మళ్లీ మావూరు వెళ్లిపోయేది. మేము మాత్రం సెలవులు అయ్యేదాకా అక్కడే ఉండిపోయేవాళ్లం.


అమ్మమ్మకు మేం వచ్చినందుకు సంతోషంగా ఉన్నా... మేం చేసే అల్లరి తల్చుకుని భయపడిపోయేది. అది అమ్మకు తెలుసు కాబట్టి అమ్మమ్మను ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా ఉండాలని చెప్పి వెళ్లేది. అలాగే అమ్మా అంటూ అమ్మమ్మను బాగా చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చి మరీ పంపించేవాళ్లం.

అమ్మ అలా వెళ్లిందో లేదో ఇక మా ఆకతాయి పనులు మొదలు. ముగ్గురికీ వేరు వేరు స్నేహ బృందాలు. వాళ్లందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఆటలే ఆటలు.. అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఊరికి చివరన ఉండేది. ఇంటి చుట్టూ చెట్లు మధ్యలో పూరిగుడిసె.. ఎండలు ఎక్కువగా ఉన్నా, చెట్లు బాగా ఉండటంతో చెట్లకింద మా స్నేహితుల బృందాలతో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం...

ఆటలు ఆడేందుకు అమ్మమ్మ కంటబడకుండా ఇంట్లోకి వెళ్లి దొరికిన వస్తువును తెచ్చుకుని అప్పటికప్పుడు ఓ కొత్త ఆటను సృష్టించి ఆడేవాళ్లం. ఈలోగా అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లి జరిగిన తంతును తెలుసుకుని కర్ర పట్టుకుని మా దగ్గరికి పరుగులెత్తేది. మేం ఆమెకు అందితేగా.. ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఇలాగైతే మీ ఇంటికి పంపించేస్తానని బెదిరించేది. మేం వెళ్లమని చెబుతూ స్నేహితులతో కలిసి ఆమెను వెక్కిరించేవాళ్లం..

అమ్మానాన్నల ఆటలు, బొమ్మల పెండ్లి చేయటం, ముట్టాట (మామిడి ముట్టెతో ఆడేది), అచ్చినకాయలు (రాళ్లతో ఆడేది).. కోతి కొమ్మచ్చి... గోళీలాట, బిళ్లంకోళ్ళు..... ఇలా ఒకటేమిటి రకరకాల ఆటలు ఆడేవాళ్లం. బొమ్మల పెళ్లి సందర్భగా చిన్న చిన్న బుడుగు పాత్రలతో రకరకాల వంటలను వండటం... వాటికోసం ఇంట్లోంచి బియ్యం, పప్పులు దొంగిలించటం... ఇళ్లల్లోని పెద్దవాళ్లతో తన్నులు తినటం.. ఎంత సరదాగా ఉండేదో..

ముఖ్యంగా కోతి కొమ్మచ్చి ఆడుతూ.. మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలించుకుని ఇంటికి ఏడుస్తూ వెళితే... ఇంట్లోవాళ్లు ఇంకాస్త తన్ని.. ఆపైన ఏడుపు మాన్పేందుకు బుజ్జగించటం ఎంత బాగుండేదో... అలాగని ఊరుకూరికే బుజ్జగిస్తే ఒప్పుకునేది లేదు.. ఆ బుజ్జగింపులోనే అన్నింటినీ సాధించుకునేవాళ్లం...

తమ్ముళ్లు.. ఈత కొట్టేందుకు బావుల్లో దుంకటం, దెబ్బలు తగిలించుకుని రావటం... ఎక్కువసేపు నీళ్లలో ఉండటంవల్ల జలుబు, తుమ్ములు... ఇంటికి రాగానే అమ్మమ్మ, తాతయ్యలు వారిని తిడుతుంటే వాళ్లని వెక్కిరిస్తూ నవ్వటం.. దానికి వాళ్లు మరింతగా ఏడ్వటం... మళ్లీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్లను బుజ్జగిస్తూ నన్ను కోప్పడటం.. లాంటివన్నీ తల్చుకుంటే ఉన్నఫలానా ఇప్పటికిప్పుడు చిన్నవాళ్లం అయిపోవాలని అనిపిస్తోంది...

ఎండల్లో బయట తిరగవద్దంటూ అమ్మమ్మ, తాతయ్యలు ఎంతగా తిట్టినా, కొట్టినా, కోప్పడినా మేం ఏనాడూ ఆగింది లేదు.. పైగా స్నేహాలతో కలిసి ఒక్కోరోజు ఒక్కో రకమైన అడ్వెంచర్లు.....

ఆరోజు మా అడ్వెంచర్ ఏట్లోకి... ఏటిగట్టున ఉండే తాటిచెట్లలో ఉండే తాటి ముంజెలను, పండిపోయిన తాటిపండ్లను తినాలని ప్లాన్... అలాగే వస్తూ వస్తూ పక్కనే ఉండే నేరేడుపండ్ల చెట్టెక్కి బోలెడన్ని పండ్లు కోసుకుని రావాలని గుంపుగా బయల్దేరాము... ఏట్లోకి వెళ్లి తాటిచెట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ముంజెలు కొట్టేవాళ్ల దగ్గర రూపాయో, అర్దరూపాయో ఇచ్చి ముంజెలు కొనుక్కుని అందరం తినేవాళ్లం... అలాగే చెట్లకింద రాలిన తాటిపండ్లను ఏరుకుని ఓపికకొద్దీ వాటి రసాన్ని పీల్చేసేవాళ్లం.. పీల్చాం అనే బదులు పీల్చి పీల్చి పిప్పి చేసేసేవాళ్లం అని చెప్పవచ్చు..

తాటిపండ్లు తియ్యగా, ఓ కమ్మనైన వాసనతో తినేందుకు భలే రుచిగా ఉంటాయి.. అయితే వాటికి పీచు ఎక్కువగా ఉంటుంది... దాన్ని ఇష్టపడి తినేవాళ్లకు ఆ రుచే వేరుగా ఉంటుంది. ఆ పీచులోంచి వచ్చే రసం తియ్యగా మంచి వాసనతో ఉంటుంది.. అదంటే మా గుంపుకు భలే ఇష్టం.. అందుకే తాటిపళ్లను ఫూటుగా లాగించేశాం... కాసేపు అక్కడే ఉన్న కానుగ, వేప చెట్లకింద కాసేపు ఆడుకుని ఆ తరువాత వానర సైన్యం లాగా మా గుంపు నేరేడుపండ్ల తోటలవైపు పరుగులు పెట్టింది.

గతంలో ఆ చెట్లలో కాసే పండ్లను ఎవరైనా సరే కోసుకుని తినేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిని ఎవరికో ఎవరో అమ్మేశారు. దాంతో కొనుక్కున్నవాళ్లు ఆ చెట్ల చుట్టూ కంచెవేసి కాపలావాళ్లను కూడా పెట్టుకున్నారు.. ఆ సంగతి తెలియక ఆ చెట్ల దగ్గరికి వెళితే కాపలావాడు మమ్మల్ని కట్టెతో బెదిరించాడు.. అయినా అతను చూడకుండా రాళ్లను పండ్లను రాలగొట్టేందుకు ట్రై చేశాం. అలా కొన్ని పండ్లను పోగుచేసుకున్నాం. అయితే అవి ఎవరికీ సరిపోలేదు.

దాంతో ఎలాగైనా సరే కాపలావాడు చూడకుండా కంచెదాటి చెట్టు పైకి ఎక్కాలనుకుని ఓ ఇద్దరూ అతను చూడకుండా మెల్లిగా కంచె దూకేశారు.. పిల్లిలా చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి అందినకాడికల్లా పండ్లను కోసి జేబుల్లో వేసుకోసాగారు... మేము కూడా ఇటువైపు చప్పుడు చేయకుండా ఉన్నాము.. ఇంతలో పెద్ద గాలి.. ఆ తరువాత మెల్లిగా చినుకులు మొదలై జోరుగా వర్షం పడసాగింది. ఓవైపు గాలి, మరోవైపు వర్షంవల్ల నిండా పండ్లతో ఉన్న చెట్లనుంచి పండ్లు గాలికి టపటపా నేలపై రాలుతున్నాయి.

బోలెడన్ని పండ్లు నేలపై పడటంతో జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మెల్లిగా కంచె దాటుకుని అందరం బిలబిలమంటూ పరుగెత్తి ఒడినిండా పండ్లు నింపుకుని, చెట్టుపై నక్కి ఉన్నవాళ్లను తీసుకుని ఇంటికి పరుగులు పెట్టాం. పాపం తోటవాడు అలా చూస్తూ ఉండిపోయాడేగానీ ఏమీ చేయలేకపోయాడు. (చిన్నతనంలో తెలియలేదుగానీ, పాపం పండ్లన్నీ రాలిపోయి ఆ చెట్లను కొన్నవాళ్లకు ఎంత నష్టం వచ్చి వుంటుందో కదా పాపం అనిపిస్తూ ఉంటుంది).

వర్షానికి తడిసి ఒడినిండా పండ్లతో ఇంటికి చేరిన మమ్మల్ని చూసిన పెద్దవాళ్లు మళ్లీ తిట్ల దండకాన్ని అందుకోవటమో, కొట్టడమో చేయటం.. మళ్లీ విధిగా బుజ్జగించటం జరిగిపోయేవి.. జలుబు, తుమ్ములు, పెద్దవాళ్ల తిట్లు, దెబ్బలు... ఇవన్నీ పక్కనపెడితే... నేరేడుపండ్లను శుభ్రం చేసి రాళ్ల ఉప్పు వేసిన మంచినీటిలో వాటిని ఊరబెట్టి తింటుంటే... అన్నీ మర్చిపోయేవాళ్లం...

ఒక్కోసారి తిరుగుళ్ళు కట్టిపెట్టి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పొలం దగ్గిరికి వెళ్లేవాళ్లం. అమ్మమ్మవాళ్లు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసేవాళ్లు.. ఆ పొలంలోనే  ఉండే బావి, బావి గట్టుపై ఉండే పనసచెట్టు, పక్కనే ఉండే మామిడిచెట్లు, టమోటో తోట, వరిపొలం.. అన్నింటినీ అప్పట్లో ఎంతగానో ఎంజాయ్ చేసేవాళ్లం... బాగా పండిన టొమోటో పండ్లను ఉప్పు, పచ్చిమిర్చి కారం వేసుకుని హాయిగా లాగించేసేవాళ్లం. పనస చెట్టెక్కి ఎవైనా పండి వుంటే వాటిని కోసుకునేవాళ్లం. మామిడి చెట్టు చాలా పెద్దగా ఉండటంతో దాన్ని ఎక్కేందుకు చేతకాక రాళ్లతో రాలగొట్టి తినేవాళ్లం.

మామిడికాయలను ఆవురావురు మంటూ తినేసేవాళ్లమేకానీ... దానికి ఉండే జీడిని పట్టించుకోకుండా తినటంవల్ల పెదాలపై పుళ్లు పడేవి. ఒక్కోసారి మీసాలు పెట్టుకున్నట్లుగా జీడి అయ్యేది. అందరూ వాటిని చూసి ఏడిపించేవాళ్లు కూడా...

ఆ... అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను.. మా అమ్మమ్మ అవిసె పువ్వుల వేపుడు ఎంత బాగా చేస్తారో తెలుసా... ఊరికి వెళ్లగానే ముందుగా అడిగి మరీ అవిసె పువ్వుల వేపుడు అడిగి మరీ చేయించుకుని తినేవాళ్లం. అలాగే లేత అవిసె కాయల వేపుడు కూడా.

గుమ్మడి పండుతో హల్వా చేయటం అందరికీ తెలిసిందే. మా అమ్మమ్మ మాత్రం గుమ్మడిపండు ముక్కలకు వేరుశెనగ గింజల పొడి కలిపి తాలింపు చేసేది. కారంగా, కమ్మగా, తియ్యగా ఎంత బాగుండేదో.. అలాగే మా అమ్మమ్మ స్పెషల్ వంటకం చక్కెరతో చేసే అత్తిరసాలు. వాటికి ముద్దపప్పు, నెయ్యి కలిపి తింటుంటే వాటి రుచే వేరు. మా అమ్మమ్మ దగ్గర బోలెడన్ని చేయించుకుని మరీ వెంట మావూరికి తీసుకెళ్లేవాళ్లం.

ఇకపోతే... చింతపిక్కల గురించి మీకు తప్పకుండా చెప్పాలి. చింతపండును విడదీయగా వచ్చే గింజలను సేకరించి వాటిని పెనంపై కొద్ది కొద్దిగా పోసి బాగా వేయించి వాటిని ఉప్పు కలిపిన నీటిలో రెండు లేదా మూడు రోజులపాటు బాగా నానబెట్టి, ఆ తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి గింజలను తినేవాళ్లం. అబ్బా చెబుతుంటేనే నోరూరిపోతోంది. నిజంగా చాలా రుచిగా ఉంటాయి. వేయించి, నానబెట్టడం, ఉప్పు కలిపిన నీటిలో నానటంవల్ల అవి కాస్త ఉప్పగా, కమ్మగా ఉంటాయి. ఇది మీకెవరికీ తెలిసి ఉండదు. కానీ, నా బాల్యానికి సంబంధించిన ఓ అపురూప జ్ఞాపకం ఇది.

మధ్యాహ్నం వేళల్లో ఆడుకునే ఓపిక లేనప్పుడు ఇంటి ముందర కానుగ చెట్టు కింద నులక మంచం... అమ్మమ్మ, తాతయ్యలతో కబుర్లు చెబుతూ నిద్దరోవడం. రాత్రిళ్లు కూడా చెట్టుకిందే పడుకుని అమ్మమ్మవాళ్లు చెప్పే కథలు ఊకొడుతూ హాయిగా నిద్రపోయేవాళ్లం.

అమ్మమ్మ వాళ్ల ఊర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. పాతకాలం నాటి కోట.. కృష్ణ దేవరాయల కాలం నాటిదనుకుంటా. (వివరాలు అవీ నాకు సరిగా తెలియవు) మహమ్మదీయులు హిందూ కోటలు, ఆలయాలపై విరుచుకుపడి చేసిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లుగా ఆ కోటలో విగ్రహాలన్నీ తలలు తెగిపడి కనిపిస్తుంటాయి.

ఒక్కోసారి మా బృందం ఆ కోటలోకి ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం. కోట చుట్టూ ప్రహరీగోడలన్నీ పడిపోయి శిథిలావస్థలో ఉండేది. కానీ కోట ముందర ఎంతో అందంగా రాళ్లతో పేర్చిన ప్రవేశ ద్వారం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఠీవిగా నిలబడి ఉంటుంది. అందులోంచి లోపలికి వెళ్తే మరీ పెద్దది కాదుగానీ ఓ మోస్తరు విశాలమైన ప్రాంతం.. అందులో చిన్న కోట.. ఆ కోట లోపల ఆలయంలాంటి ప్రదేశం.. ఆ ఆలయ గర్భగుడిలో విఠలేశ్వరుడు ఉండేవాడట. అందుకే మా అమ్మమ్మ వాళ్ల ఊరికి విఠలం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

తురక రాజులు హిందూ ఆలయాలపై, కోటలపై దాడులు చేసినప్పుడు ఈ కోటను, కోటలోని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఆలయం గర్భగుడిని పగుల గొట్టడమేగాక, ఆలయం వెలుపల, కోటచుట్టూ ఉండే రకరకాల రాతి విగ్రహాల తలలు తెగనరికి వేయటంతో అవి ఇప్పటికీ మొండాలు, తలలు వేరు వేరుగా కనిపిస్తుంటాయి. ఆ కోటలో కొంత భాగం బాగానే ఉండేది. ఆ ప్రాంతంలోనే మేము రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం.

ఆ కోటపై తురక రాజులు దాడి చేసినప్పుడు ఆలయంలోని విఠలేశ్వర స్వామి భయంతో అలా అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడనీ.. అలా వెళ్తూ వెళ్తూ ఓచోట వాయిల్ చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశంలో దాక్కున్నాడని తమ పెద్దవాళ్లు చెప్పారని మా అమ్మమ్మవాళ్లు మాకు కథలు కథలుగా చెప్పేవాళ్లు. అందుకే ఆ దేవుడు దాక్కున్న ప్రాంతం తరువాత తరువాత వాయిల్‌పాడుగా కాలక్రమంలో వాయల్పాడు.. ఇప్పుడు వాల్మీకిపురంగా అవతరించింది.

అలాగే ఆ కోట గురించి పెద్దవాళ్లు చెప్పే విషయాలను నోళ్లు వెళ్లబెట్టి వినేవాళ్లం. ఇంకోసారి అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేంతగా వాళ్లు మాకు ఆ కోట గురించి కథలు చెప్పేవాళ్లు. తురక రాజులు దాడులు చేసినప్పుడు ఆ కోటలోని రాజు, అతని భార్యలు, సంతానం, ఇంకా ముఖ్యమైన రాజ సంబంధీకులంతా తురక రాజులకు దొరకకూడదని సామూహికంగా వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, బంగారంతో సహా కోటలోనే ఉన్న కోనేరులో దూకి సమాధి అయ్యారనీ... ఆ ఆస్తి పరులపాలు కాకుండా ఉండేందుకు మంత్రబలంతో ఓ పామును కాపలాగా ఉంచారనీ చెబుతుంటారు. కాబట్టి.. ఆ డబ్బు, బంగారం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రక్తం కక్కుకు చచ్చిపోతారని కాబట్టి మీరు ఆ వైపు వెళ్లవద్దని మమ్మల్ని చాలా భయపెట్టేవాళ్లు.

మేం చిన్నపిల్లలప్పటికే ఆ కోట అవసాన దశలో ఉండేది. అప్పటికే కోటలోని కోనేరు పూర్తిగా పూడిపోయి ఆ స్థానంలో మట్టి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కోటలోని గుప్త నిధుల కోసం ఎవరెవరో తవ్వకాల కోసం రావటం, మా పెద్దవాళ్లు చెప్పినట్లు రక్తం కక్కుకు చచ్చిపోవటం జరిగేది. అలా చనిపోయిన ఒకతన్ని నేను చూసినట్లు నాకు లీలగా గుర్తు. (కానీ అది నిజమో, అబద్ధమో ఇప్పటికీ అంతుబట్టలేదనుకోండి) ఇప్పటికీ కోట అలాగే ఉంది.. మేం పిల్లలప్పటికంటే ఇప్పుడు ఇంకా జీర్ణ దశలో ఉంది. అయితే కోట ప్రవేశ ద్వారం మాత్రం అంతే ఠీవిగా నిలబడి.. తనపై చిన్న చిన్న చెట్లకు జీవం పోస్తోంది.

ఇదండీ.. మా అమ్మమ్మ వూరితో నాకున్న అనుబంధం.. అనుభవాలు.. అమ్మమ్మతో పెనవేసుకున్న ఈ జ్ఞాపకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు.. వరద వెల్లువలా అలా మనసునిండా జ్ఞాపకాల ఊసులన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి. ఇన్ని జ్ఞాపకాలను మిగిల్చిన ఆ ఊరుతోపాటు.. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఒక జ్ఞాపకం మాత్రమే.

ఆమె ఆ వూరికి, మాకూ లేకుండా ఏప్రిల్ 18, 2007న పైలోకాలకు తరలిపోయింది. తను లేని ఆ ఊరికి వెళ్లాలంటే మనస్సు మూగదైపోతుంటుంది. అయినా.. ఆమె తిరిగిన ఆ ఇంటిని, ఆమె స్పర్శతో పులకించిపోయిన ప్రతిదాన్నీ కళ్లతో స్పర్శించి.. ఆమె శాశ్వతంగా నిద్రించిన స్థలంలో జ్ఞాపకాల ఊసులతో సేదతీరి భారమైన మనస్సుతో తిరిగిరావటం మామూలైపోయింది.

13 comments:

SRRao said...

చిన్నప్పటి జ్ఞాపకాలు...అందులోనూ అమ్మమ్మ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేని, మరపురాని మధురమైనవి. వాటిని మీ ఆమ్మమ్మగారింటికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళినంతగా వర్ణించిన నీకు అభినందనలమ్మా !

శశి కళ said...

chala bagundi maa selavalanni gurthuku vachchayi. friend bai.sasikala

సో మా ర్క said...

శోభ గారూ!పాత రోజులను మళ్ళీ!గుర్తుకు తెచ్చారు.భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమై,ఏదైనా వరం కోరుకోమంటే!గడచిన నా బాల్యాన్ని నాకిచ్చేయమని కోరుకోవాలనిపిస్తోంది!మంచి విషయాలు నెమరు వేయించారు.ధన్యవాదాలు !

meghamala said...

mee chinnanaati rojulloki mammalnee teesukellaaru meeru, chaalaa baagaa raasaaru. congrats

గిరీష్ said...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు..nice

sho said...

mee balyam tho maa balyam gurthuku techharu.Nenu udyoga reethy Vayalpad lo unna, vittalam chusaa.mee jnapakaalu baagaaunna. Radha krishna Proh & Excise Inspector, Now at Mydukur. Kadapa dist

శోభ said...

SR Rao బాబాయ్... ధన్యవాదాలు...

శోభ said...

నా టపాను మెచ్చిన శశికళగారికి, సోమార్క గారికి, మేఘమాలగారికి, గిరీష్ గారికి, రాధాక్రిష్ణగారికి ధన్యవాదాలు...

Unknown said...

అక్క థాంక్స్ మీకు.ఇప్పుడే మీ బ్లాగ్ లో పోస్ట్ కూడా చదివాను. తాటిపండ్లు గురించి మీరు రాసిన దాని దగ్గర నేను ఆగిపోయాను. ఎందుకంటే మా వారికి చాల ఇష్టం తాటి పండ్లు అంటే . అవిస పువ్వుల వేపుడా ...మీరు వెంటనే ఎలా చేస్తారో రాసి మీ బ్లాగ్ లో పోస్ట్ చేయండి.నేను నేర్చుకుని వండేస్తాను.బాబోయి చింతపిక్కలు తింటార? నాకు అస్సలు తెలీదు.మీరు ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ కొట్టండి నేను వచ్చేస్తాను. ఇవి అన్ని రుచి చూడాలి. మీ అమ్మమ్మ గారి ఊరు పేరేంటో రాయలేదు మీరు.

శోభ said...

శైలూ యూ ఆర్ వెలకమ్....

ఇవ్వన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలు.. నువ్వు కోరినట్లు అవిసె పువ్వుల వేపుడు గురించి రాసి తప్పకుండా పోస్ట్ చేస్తాను.

ఇక చింతపిక్కల సంగతి... నిజంగా నిజం. వాటిని మేం చిన్నప్పుడు భలే తినేవాళ్లం. ఇప్పుడు ఆ రుచి నచ్చుతుందో లేదో తెలియదు.. అయితే చిన్నప్పటి ఆ రుచిలోని కమ్మదనం ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. నిజం చెప్పనా ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేసేందుకు కూడా టైం లేదు. అవి చిన్నప్పటి అపురూప జ్ఞాపకాలు మాత్రమే...

అమ్మమ్మ వాళ్ల ఊరు పేరు పోస్టులోనే రాశాను.. నువ్వు గమనించినట్టు లేదు.. కోట గురించి రాసినప్పుడు అందులో ఊరి పేరు ఎలా రూపాంతరం చెందిందో రాశాను. మేం చిన్నప్పుడు విఠలం అని అనేవారు.. ఇప్పుడు అదే ఊరు వాల్మీకి పురంగా మారిపోయింది. అక్కడ రామాలయం చాలా ప్రసిద్ధి. చాలా పురాతన ఆలయం అది. నేను చూసి చాలా సంవత్సరాలే అయింది.

ఇక మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వస్తానన్నావుగా... తప్పకుండా వచ్చేద్దువుగానీ.. యూ ఆర్ మోస్ట్ వెల్‌కం... :)

మనసు పలికే said...

శోభ గారు,
మీతో పాటు నన్ను కూడా చిన్నతనానికి తీస్కెళ్లారు.. ముఖ్యంగా, తాటి పళ్లు, నేరేడు పళ్లు, మామిడి కాయలు, చింత పిక్కలు.. వీటన్నిటి దగ్గరికీ :)))) నాకు తిరిగి రావాల్ని లేదు అంత మధురమైన ఙ్ఞాపకాలు అవన్నీనూ... రేగిపళ్ల ఒడియాలు తెలీద మీకు? సంక్రాంతి వచ్చిందంటే రేగిపళ్ల హడావుడి. కాస్త పచ్చిమిర్చి, బెల్లం కలిపి రోట్లొ దంచి, రేగిపళ్లు కూడా కలిపి దంచాలి.. ఉప్పు కలిపిప్, వాటిని గుండ్రంగా గారెల్లాగా గుడ్డ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ పేర్చి, డాబా మీద ఏండబెట్టే వాళ్లం. ఎండకుండానే లాగించేసే వాళ్లం ;);) అద్భుతంగా ఉండేవనుకోండి రేగిపళ్ల వడియాలు :))) నాకు ఆ రోజుల నుండి రావాలని లేదు ప్చ్..:(((

మీ అమ్మొమ్మ గారి వాళ్ల ఊరి గురించిన విశేషాలు బాగున్నాయి. కోట, అందులో గుర్తులు, ఊరి పేరు రూపాంతరం..:) టోటల్ గా టపా సూపరు:))

శోభ said...

హాయ్ అపర్ణా.. చాన్నాళ్లయింది నీతో మాట్లాడి.. నీ కామెంట్ చూడగానే భలే సంతోషమేసేసిందోచ్..

రేగిపళ్ల వడియాలు గురించి తెలియక పోవటం ఏంటి... అయ్యో అంత మంచి విషయాన్ని నేనెలా మర్చిపోయానబ్బా.. ఎనీవే గుర్తు చేసినందుకు థ్యాంక్స్.

చిన్నప్పుడు రేగిపళ్లేం ఖర్మ.. రేగి కాయలు మావూళ్లో వాటిని అందరం రేణికాయలు అనేవాళ్లం. అవి దోరగా ఉన్నప్పుడే కోసుకుని ఉప్పూ, కారం కలిపి కరకరా నమిలేసేవాళ్లం.. తినీ తినీ నాలుక మంటెత్తిపోయేదనుకో. అలాగే పచ్చి చింతకాయలమాట ఇక సరే.. సరే..

అరెరే వెలక్కాయ (వెలగపండు) మాట మర్చిపోయానే.. రేగి, వెలగ, ఉసిరి, గజనిమ్మ, దానిమ్మ, పచ్చిమామిడి... నువ్వు రేగుపండ్లు గుర్తు చేయగానే నాకు ఇవ్వన్నీ కూడా గుర్తొచ్చేస్తున్నాయి..

వీటి కోసం మా బ్యాచ్ ఎన్నెన్ని మజిలీలు చేసిందో... తల్చుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందో.. ఉన్నఫళంగా వెంటనే చిన్నపిల్లనైపోవాలని అనిపిస్తోంది.

థ్యాంక్యూ రా......

Vijaya Ramireddy said...

మీ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు , పాటలు , కేరింతలు, అమ్మమ్మ తో మురిపాలు , వాటితో పాటు అలనాటి చారిత్రక కట్టడాల తాలూకు ఘట్టాలు , ఒకటేమిటి అన్ని మధుర ఘట్టాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శోభా గారు