Pages

Monday 27 October 2014

కొన్ని ముద్దులు..!!



నీ దేహపు పరిమళం
నా జ్ఞాపకాల మడతల్లో
ఇప్పటికీ అదే స్వచ్ఛత
అంతకుమించిన సువాసన

నీ పాదాల్ని ముద్దాడినప్పుడల్లా
వానొచ్చేముందు మట్టివానసనలా
గుండె నిండిపోయేది

నీ నుదుటిపై ముద్దాడినప్పుడల్లా
పిల్లగాలి నాట్యం చేస్తుంటే
పచ్చని పైరు పరవశించినట్లుండేది

నీ కళ్లపై ముద్దాడినప్పుడల్లా
అప్పుడే పుట్టిన లేగదూడని
ఒళ్లంతా తడిమి తడిమి నాకుతున్నట్లుండేది

నీ పెదాల్ని ముద్దాడినప్పుడల్లా
తొలిసారి అమ్మ గోరుముద్దల్ని
తినిపించి హత్తుకున్నంత హాయిగా ఉండేది

నీ చేతి వేళ్లని స్పృశించినప్పుడల్లా
నే పొత్తిళ్లలో ఉన్నప్పుడు
నాన్న పసిపిల్లాడై నన్ను తాకినట్లుండేది

అడుగులో అడుగై సాగుతున్నప్పుడల్లా
అంతటి ఆకాశమే
నా పక్కనే ఉందన్న గర్వం తొణికిసలాడేది

ఇప్పుడూ అంతే...
లేనిదల్లా నువ్వూ.. ఉన్నవన్నీ నీ జ్ఞాపకాలే...!!!


(అనుకోని వరమై దరిచేరి... జ్ఞాపకాలతో చలికాచుకోమని దూరమైన ఓ చిన్ని పిట్ట జ్ఞాపకంలో...)

5 comments:

Unknown said...

మేడమ్! నా పేరు హనుమంతరావు. మా సొంతూరు కర్నూల్ జిల్లా,పత్తికొండ మండలం,రాజుల మండగిరి గ్రామము. వృత్తి రీత్యా రాజంపేటలో(కడప)వుంటున్నాను. నేనూ కథలు రాస్తుంటాను. ప్రస్తుతానికేవీ... ప్రచురణకు నోచుకోలేదనుకోండి. మీ సుమధురమైన కవిత చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు మరెన్నో కవితలు.., కథలు రాయడానికి ఈ ప్రకృతి సహకరించాలని ఆశిస్తూ.... శలవు.

శోభ said...

ధన్యవాదాలండీ

Anonymous said...

అద్భుతః🙏

Vijaya Ramireddy said...

అనుకోని వరమై మీ దరిచేరి మీతో అనుబంధం పెంచుకొని,
తన ఆ బంధపు పరిమళాలు మీ దగ్గర వదిలి వెళ్లిన ... ఓ పాల పిట్టా ఇప్పుడు నువ్వు ఎక్కడ ???

ప్రేమాను బంధాన్ని , మమకారాన్ని అద్భుతంగా వ్యక్తం చేసారు .... శోభా గారు

Anonymous said...

పదాలు లలితమైనవే ,భావం మధురంగా వుంది