Pages

Tuesday, 30 August 2011

నువ్వులేవు.. నీ జ్ఞాపకాలున్నాయి....


కొందరు సుఖాల్లోనే తారసపడతారు
మరికొందరు కష్టాల్లోనూ చేయూతనిస్తారు
నువ్వు మాత్రం ఎప్పుడూ చెంతనే ఉంటావు
కళ్లు మూసినా, తెరచినా
నిద్రపోయినా, మేల్కొన్నా
నవ్వినా, ఏడ్చినా
ఎక్కడ ఉన్నా, ఏం చేసినా
నా ప్రతి కదలికలోనూ
చిరునవ్వుతో జీవిస్తుంటావు

కానీ.. నువ్వు దగ్గరున్నప్పుడు
నీకు ఏవంటే ఇష్టమో, నీకేం కావాలో
నీకంటూ ఇష్టాయిష్టాలున్నాయో, లేదో 
ఎప్పుడూ.. ఏవీ..
తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు
ఇప్పుడు.. నువ్వు లేని ఈ జీవితంలో
ప్రతిరోజూ, ప్రతి పనిలోనూ
తనకు ఇదంటే ఇష్టమో కాదో
ఇవన్నీ తనకు కావాలనిపించేదో ఏంటో
ఎప్పుడూ అడిగినవన్నీ అమర్చటమేగానీ
నోరు తెరచి ఇది కావాలని అడగలేదే..?
ఆలోచనలు మది గట్లు తెంచుకుంటాయి

అంతే…
నోటిదాకా వెళ్లింది, గొంతులో అడ్డుపడుతుంది
చెంపలపై వెచ్చని కన్నీరు
చేతిలో బొట్లుగా రాలుతుంటే
ఆ కన్నీటి బొట్లను
చిరునవ్వులు చిందించే నీ పలువరుసలో
ముత్యాలుగా మార్చి
నవ్వుతూ ముందుకు నడిపిస్తావు
నువ్వో జ్ఞాపకం అనుకున్నా..
నిజమై నాకు ఊపిరి పోస్తున్నావు….

............. ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం.

8 comments:

venkat kandula said...

Good.Very sensitive.

Uday Kumar said...

ఆర్ద్రత, ఆప్యాయత అవపాతమై కురుస్తుంటే
ఏకాంతంలో మధుర జ్ణాపకాలను నెమరు వేసుకుంటూ
తిరిగిరాని వారి ఆశయాలను మొలకెత్తించాలని
జీవనయానం కొనసాగించడమే జీవితానికి సార్ధకత

శోభ said...

వెంకట్ కందుల గారికి ధన్యవాదాలు...

శోభ said...

ఉదయ్ అన్నయ్యా.. మీరు చెప్పింది నిజమే.. ఇప్పుడు నా పరిస్థితి అదే.. ఇక రెండు నెలలు గడిస్తే నాన్న మాకు దూరమై 2 సంవత్సరాలు పూర్తవుతాయి... నవంబర్ 7 సమీపిస్తోందంటేనే నాకు మనసంతా చాలా దిగులుగా ఉంటోంది.. రోజూ ఆయన జ్ఞాపకాలే.. అందుకే ఏమీ రాయలేకపోతున్నా....

Unknown said...

అక్క మా అమ్మమ్మ, తాతయ్య గారు చనిపోయి ఎన్నో ఏళ్ళు అయ్యింది.ఈ రోజుకి వాళ్ళు నిరంతరం గుర్తుకు వస్తారు. మా పెద్దమ్మ గారు క్రితం ఏడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు.మర్చిపోయే రోజు లేదు ఇంతవరకు.ఒక్కోసారి టైం మెషిన్ తయారుచేసి వాళ్ళందరిని చూసి రావాలని అనిపిస్తుంది. మీ అక్షరాల్లో మీ నాన్న గారిని పదిల పరుచుకున్టున్నావు. నిజంగా మీరు రాసేది చదువుతుంటే ఎంత గొప్పవారో అయన అని అనిపిస్తుంది.ఇక్కడినుంచే మీ నాన్నగారికి నమస్కారాలు తెలియచేస్తూ
నీ చెల్లి
శైలబాల

శోభ said...

థ్యాంక్యూ చెల్లెమ్మా... టైం మెషిన్ తయారుచేసి ఉన్నఫళంగా నాన్న దగ్గరికి వెళ్లాలని చాలాసార్లు నాకు అనిపించింది.. నువ్వూ అదే విషయాన్ని చెబుతున్నావు..

ఉన్నవాళ్లు పోయినోళ్ల తీపిగుర్తులు అని ఊరకే అన్నారా...

మనసుకి బాగా దగ్గరైన వాళ్లు దూరమైతే ఎవరి పరిస్థితి అయినా అంతే... నాన్నపై నీకున్న అభిమానానికి, గౌరవానికి సో మెనీ థ్యాంక్స్ శైలూ...

veera murthy (satya) said...

అక్కా !...
జ్ఞాపకాలు తెలిసిన అడివి లాంటివి....
పాత ప్రదేశాలే అయినా కూడా
ప్రతీసారి కొత్త గా అనిపిస్తాయి
ఇబ్బందతా...
వెల్లిన దారి మరిచిపోతేనే ...
దారిలోనే పొద్దు గడిచిపోతేనే...

-satya

శోభ said...

"జ్ఞాపకాలు తెలిసిన అడివి లాంటివి
పాత ప్రదేశాలే అయినా కూడా
ప్రతీసారి కొత్త గా అనిపిస్తాయి
ఇబ్బందతా
వెల్లిన దారి మరిచిపోతేనే
దారిలోనే పొద్దు గడిచిపోతేనే..." ...... ఎంత బాగా చెప్పావు సత్యా... ముఖ్యం చివరి రెండు లైన్లు నాకు చాలా బాగా నచ్చాయి.... ధన్యవాదాలు తమ్ముడూ...