Pages

Friday, 27 August 2010

బొజ్జ గణపయ్య... చిన్నారి సిరి..!

  వక్త్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా...!

అంటూ.. కళ్లు మూసుకుని తన్మయత్వంతో బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తోంది చిన్నారి సిరి... చిన్నపిల్ల అయినప్పటికీ ఎంతో భక్తితో ప్రార్థిస్తున్న సిరిని ఆప్యాయంగా చూశాడు గణపయ్య.

ఇంతకీ ఈ చిన్నారి భక్తురాలి కోరికేంటో విందామనుకుని ఆవైపు చెవులు సారించాడాయన.

"ఓ స్వామీ....! నన్నీ కష్టాల లోంచి బయటపడేస్తావన్న ఆశతో నిన్ను వేడుకుంటున్నాను."

ఇంత చిన్న అమ్మాయికి కష్టాలేంటబ్బా అని ఆలోచనలో పడ్డాడు బొజ్జ గణపయ్య...

గణపయ్య ప్రశ్నను అర్థం చేసుకుందో... ఏమోగానీ.... ఎందుకు లేవు స్వామీ అంటూ ఎదురు ప్రశ్నించింది సిరి...

ఏంటో చెప్పుమరి అన్నట్లుగా ఉన్నాయి... గణపయ్య చూపులు.

ఇంతలో తన కష్టాల పరంపరను చెప్పటం ప్రారంభించింది సిరి...

తెలిసీ తెలియని వయసు నుంచే చదువు కోసం మేము పడే పాట్లు నీకు తెలియదా స్వామీ...! ప్రీకేజీ, బేబీ క్లాసులంటూ మాకు మాత్రమే సొంతమైన బాల్యాన్ని స్వేచ్ఛగా అనుభవించనీయకుండా చేస్తున్నారు ఈ పెద్దాళ్ళు. ఇది మీకు కష్టంగా అనిపించటం లేదా...?!

తరువాత స్కూళ్లకు వెళ్లే వయస్సులోనే... మోయలేని పుస్తకాల భారంతో అవస్థలు పడుతున్న మావి కష్టాల లాగా కనిపించటం లేదా...? చివరకు వేసవి సెలవుల్లో, పండుగలప్పుడు కూడా స్వేచ్ఛగా ఆడుకోనీయక హోం వర్క్ రాయమంటూ పెద్దలు దండించటం కష్టం కాదా...?!

ఇంకా మాకు బోలెడన్ని కష్టాలున్నాయి. హాయిగా నిద్రపోనీయకుండా పొద్దున్నే, సాయంత్రం ట్యూషన్లు, ఆ తరువాత స్కూళ్లు, మళ్లీ స్పెషల్ క్లాసులు, స్పెషల్ కోర్సులు ఒకటా, రెండా.... చెప్పుకుంటే అన్నీ కష్టాలే స్వామీ...! చెప్పటం ఆపి గణపయ్య వైపు చూసింది సిరి..!

చిన్నారి సిరి కష్టాలన్నింటినీ ఓపిగ్గా విన్న గణపయ్యకు... పెద్దవాళ్లైన తన భక్తులపై విపరీతంగా కోపం వచ్చింది. ఉండు చిట్టి తల్లీ...! నువ్వేమీ బాధపడకు అన్నింటికీ నేనున్నాను. పెద్దవాళ్లంతా ఏ శుభకార్యం నిర్వహించాలన్నా... నా దగ్గరికి వస్తారు కదా...! అప్పుడు వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అన్నట్లుగా... మెడలో ఉన్న హారంలోంచి ఓ పువ్వును సిరి చేతుల్లో పడేలాగా చేశాడు గణపయ్య.

పువ్వు ఎందుకు పడిందో అర్థంకాని సిరి... హమ్మయ్య....!!! ఏమైతేనేం... దేవుడికి తన కష్టాలన్నింటినీ, తన తోటి పిల్లలందరీ కష్టాలన్నింటినీ చెప్పేశాను. పార్వతీమాతకు ముద్దుల కొడుకైన గణపయ్య తన కోరికలను తప్పకుండా తీరుస్తాడన్న ఆశతో... సంతోషంగా ఆడుకునేందుకు వీధిలోకి పరుగులెత్తింది చిన్నారి సిరి...!

Friday, 20 August 2010

మానవత్వం ఇంకా బ్రతికే ఉంది...!

నిన్న మా అబ్బాయి స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి రావడం వల్ల బాగా ఆలస్యంగా పడుకున్నాము. ప్రయాణంలో బాగా అలసిపోవడం, ఒంట్లో కూడా కాస్తంత నలతగా ఉండటంతో బాగా నిద్ర పట్టేసింది. చూస్తే టైం 8.30. ఇంకేముందీ ఇంక అప్పట్నించీ ఒకటే ఉరుకులు, పరుగులు... టిఫిన్, స్నానం ఏదో అయ్యిందనిపించేసి గబగబా ఆఫీసుకు తయారై బయలుదేరాను.

అప్పటికే ఆలస్యమైపోయిందన్న కంగారుతో బస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో 12బి బస్ రావడంతో ఎక్కి, కిటికీ పక్కగా కూర్చున్నాను. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేస్తుందేమోనని భయపడుతున్నా. అయితే ట్రాఫిక్ అంతగా లేదు. బస్ వేగంగానే కదులుతోంది.

పాండీ బజార్లో మాత్రం కాస్తంత ట్రాఫిక్ ఉంది. బస్ మెల్లగా కదుల్తోంది. నేను అలా పక్కగా చూస్తున్నాను. ఫ్లాట్‌ఫాంపై ఒక మధ్య వయసు ఆవిడ నడుస్తోంది. ఏమైందో ఏమో ఉన్నట్లుండి కింద పడిపోయి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటోంది. రెప్పపాటు క్షణంలో జరిగినదానికి నేను బిక్కచచ్చిపోయి చూస్తున్నా...! ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు.


ఆ క్షణంలో ఏం చేస్తున్నానో తెలీదు గానీ... అయ్యయ్యో...! అని అరిచి డోర్ వైపుకు కదిలాను. దిగేసి, ఆమెకు ఏదో ఒక సాయం చేయాలన్నదాంతో దిగే ప్రయత్నం చేశాను... అయితే సాధ్యం కాలేదు. ఇంతలో పక్కవాళ్లంతా బస్సు కదుల్తుంటే అలా దిగేస్తే ఎలా గమ్మా అని అరిచారు. పాపం కదండీ... ఆవిడ అలా కొట్టుకుంటోంది అని ఆమెవైపు చూశాను.

ఇంతలో ఓ నలుగురు కుర్రాళ్లు ఆమె దగ్గరికి పరుగెత్తికెళ్లి పక్కనే షాపులో వాటర్ బాటిల్ తీసుకుని, ఆమె ముఖంపై చల్లి, బండి తాళాలను చేతిలో పెట్టి, గట్టిగా పట్టుకుని ఒళ్లో పడుకోబెట్టుకున్నారు. ఒకరు చేతిని గట్టిగా పట్టుకుంటే, మరొకరు ఆమె తలను ఒళ్లో పెట్టుకుని కూర్చున్నారు.

అది చూసిన తరువాత కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆమెను వారు ఎలాగైనా కాపాడతారని అనుకుని సీట్లో కూర్చున్నాను. బస్ దూరమయ్యేదాకా ఆమెనే చూస్తూ కూర్చున్నాను.

బస్సు కదుల్తోంది. కానీ నా మనసు మాత్రం ఆమె దగ్గరే ఉంది. పాపం ఆమెకు ఎలా ఉందో..! ఎక్కడినుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తోందో... పాపం ఆమెకేమైనా అయితే ఇంట్లో వాళ్లకు ఎలా తెలుస్తుంది. వాళ్లు ఎంతగా బాధపడతారో అనుకుంటూ కూర్చున్నాను. ఇంతలో నా స్టాపింగ్ వచ్చేసింది. దిగేసి ఆఫీసుకు వచ్చేశాను.

కానీ ఆమెకు ఏమీ కాకూడదు. ఆమె ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలి అని మనసులో దేవుణ్ణి ప్రార్థించటం తప్ప మరేం చేయగలను చెప్పండి.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కుర్రాళ్లంటే కేవలం వేగం, దుడుకుతనం మాత్రమే కాదు. వారిలో కూడా సామాజిక బాధ్యత ఉందనేదానికి...పాండిబజార్‌లో ఆ మహిళను ఒళ్లో పెట్టుకున్న కుర్రాళ్లే నిదర్శనం. వీరిదే కదా రేపటి భవిష్యత్తు. ఏమంటారు...?

అనారోగ్యంతో ఉన్నవారు రోజువారీ పనులలో భాగంగా బయటికి వెళ్లి, అక్కడ అనుకోకుండా పడిపోతే ఎన్ని సమస్యలొస్తాయి ఇంట్లోవాళ్లు ఎంతగా కంగారు పడతారో, వాళ్లు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎంతగా ఎదురుచూస్తారో నాకు అనుభవపూర్వకంగా తెలుసు.

పాండీబజార్లో పడిపోయిన "మహిళ"లాగే... మా "నాన్న"కు కూడా ఫిట్స్ ఉన్నాయి. ఆయన కూడా ఏదో ఒక పనిమీద బయటికి వెళ్లినప్పుడు సడన్‌గా రోడ్లోనే ఫిట్స్‌తో పడిపోవడం... అక్కడ ఉన్న ఎవరో ఒకరు సాయం చేసి ఇంటికి చేర్చడం మామూలైపోయింది.

ఇప్పుడు కూడా ప్రతిరోజూ ఆయన కోసం ఇంట్లోవాళ్లందరం భయపడుతూనే ఉంటాము. అందుకనే సాయం లేకుండా ఆయన్ను ఎప్పుడూ బయటికి పంపే ప్రయత్నం చేయము. ఒకవేళ ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినప్పుడే ఆయనకు ఫిట్స్ రావడం యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది.

రోడ్డుమీద ఏం జరుగుతున్నా పట్టించుకోని ఈ ఉరుకులు పరుగుల కాలంలో... కళ్లముందు పడిపోయిన వారిని కాపాడి, సహాయం చేసి ఇంటికి చేర్చే వారికి రెండు చేతులెత్తి నమస్కరించడం తప్ప మరేం చేయగలం చెప్పండి. అలాంటివారిని చూసినప్పుడల్లా నాకు... ఈ లోకంలో ఇంకా మానవత్వం చావలేదనిపిస్తుంది... కాదంటారా....?!

(ఆగస్టు 22, 2008 11:58:00న రాసిన పోస్టు ఇది)...

Friday, 6 August 2010

బాగు చేయ్ నను గోవిందా...!

"టు గాడ్" అనే అడ్రస్సుతో వచ్చిన ఒక ఉత్తరాన్ని ఎక్కడికి పంపించాలో తెలీని పోస్ట్‌మాన్ దగ్గర్లోని ఒక ఆలయంలో ఇచ్చాడు...

ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటూ ఆ గుడి పూజారి ఉత్తరం వెనుకా ముందూ, అటూ ఇటూ చూశాడు. ఎక్కడా అడ్రస్ లేదు "టు గాడ్" అనే అక్షరాలు తప్ప....

సరే అందులో ఏముందో చూద్దాం అనుకుంటూ ఆ ఉత్తరాన్ని చించి చదవటం మొదలెట్టాడు....

అందులో ఇలా ఉంది....

"దేవుడా నన్ను క్షమించు. నేను చాలా దీనమైన స్థితిలో ఉన్నాను. నా జీవితమంతా బాధలూ, కష్టాలే.... ఎటు చూసినా అప్పులే. ఏ ఉద్యోగం చేసినా నెలకు మించి అందులో ఉండలేక పోతున్నాను. నాకు ఎలా బ్రతకాలో తెలియటం లేదు. నా జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటే నా కుటుంబం గుర్తుకొచ్చింది... కాబట్టి, దయతో తమరు నాకో వెయ్యి రూపాయల సాయాన్ని కింది పోస్టాఫీసు అడ్రస్సుకు పంపగలరు" అని ఉంది.


ఇదంతా చదివి హృదయం ద్రవించిన గుడి పూజారి. పాపం ఎన్ని కష్టాలలో ఉన్నాడో ఏమో అనుకుంటూ....

గుడికి వచ్చే భక్తులకు, ఉత్తరం పంపిన అతడి కథను చెప్పి.... అందరివద్దా కొన్ని డబ్బులను వసూలు చేసి, ఎలాగోలా వెయ్యి రూపాయలను పోగు చేసి పంపించాడు.

డబ్బు పంపినందుకు రేపో మాపో కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరం వస్తుందని వేచి చూడసాగాడు ఆ గుడి పూజారి.

అయితే ఎన్ని రోజులయినప్పటికీ ఉత్తరం ఊసే లేదు. పోనీలే అని ఊరుకున్నాడు పూజారి.

రోజులలా గడుస్తుండగా ఒక రోజు మళ్ళీ "టు గాడ్" అంటూ అదే వ్యక్తి నుండి ఉత్తరం వచ్చింది.

ఓహో... ఇన్ని రోజులకయినా థ్యాంక్స్ చెబుతూ ఉత్తరం వచ్చింది. అనుకుంటూ పూజారి సంతోషంగా ఉత్తరాన్ని విప్పి చదవడం ప్రారంభించాడు...

"మళ్ళీ నన్ను క్షమించు దేవుడా...! నేను ఈసారి కూడా పీకల లోతు కష్టాలలో మునిగిపోయి ఉన్నాను" అని ఉంది...

అంతే గాకుండా... ఈసారి మాత్రం కింద నేను చెప్పిన నా అడ్రస్సుకే డబ్బులను పంపగలరు.... ఎందుకంటే... మీరు క్రితంసారి పంపిన డబ్బులలో... ఆ అడ్రస్సులోని పోస్టాఫీసువాళ్ళు 500 నొక్కేసి 500 వందల రూపాయలను మాత్రమే నాకు ఇచ్చారు... కాబట్టి తప్పకుండా నాకు మాత్రమే పంపించగలరు.... ఇట్లు తమ విధేయుడు.... కష్టాల కుమారుడు...."

గోవిందా.... గోవిందా....!
బాగు చేయ్ నను గోవిందా....!
పైకి తే నను గోవిందా....!


దేవుడా...! ఈ దేశాన్ని బాగు చేయడం నీ వల్ల కూడా కాదేమో...!

Thursday, 5 August 2010

అమ్మ ఎక్కడికీ వెళ్ళదు

(గుర్తులేదు కానీ, సంవత్సరం లేదా రెండేళ్ళు అయ్యిందనుకుంటా.. ఆంధ్రజ్యోతి వారపత్రికలో చదివిన, మనసును కదిలించే ఈ "అమ్మ కవిత" మీకోసం)

తమ్ముడు తడిసిపోతున్నాడు
ధారలుధారలుగా కురుస్తున్నాడు
అమ్మ వెళ్లిపోయిందని తల్లడిల్లిపోతున్నాడు

ఊదురుగాలికి చెల్లా చెదురవుతున్న
పిచ్చుకగూడులాగా...
లోపల్లోపలే దిగులుదిగులుగా పిగిలిపోతున్నాడు
ఉన్న చేతుల్ని వేలాడేసుకుని
దిగాలుగా మొగాలు పెట్టి అలా చూస్తుండగానే
అమ్మ టాటా చెప్పేసిందని
తమ్ముడు నిలువునా బీటలువారి పోతున్నాడు

మన పిచ్చిగానీ అమ్మ ఎక్కడికి వెళుతుంది?
అమ్మ మన చుట్టూనే ఉంటుంది
మనల్ని చుట్టుకునే ఉంటుంది
మన మెతుకులో మెతుకై వాతాపి జీర్ణం అంటూ
ప్రేమగా కడుపు తడుముతూనే ఉంటుంది

ఆకాశంలో ఉన్నా మనల్ని చూస్తూనే ఉంటుంది
గాల్లో ఉన్నా మనల్ని తాకుతూనే ఉంటుంది
మబ్బుల మంచెమీద కూర్చుని
మన బతుకు పంటకి కాపలా కాస్తుంది
ఏ నడి జాములోనే చుక్కల్ని వెంటేసుకుని
మన ఇళ్ల చుట్టూ రక్షణగా
వెలుగు రేఖల్ని గీసి వెళుతుంది అమ్మ

కురిసే వానజల్లులో చల్లని పిలుపు అమ్మే
విరిసే పూల నవ్వులో మమతల మకరందం అమ్మే
మనకు తెలీదుగానీ
ముత్యాల కిరణాలను కొంగునిండా నింపుకొని
మన గుమ్మాల ముందు గుమ్మరించిపోయేది అమ్మే...!

అమ్మ లేకుండా బతకడం నేర్చుకోమని చెప్పడానికే
ఏ కొండ చాటుకో వెళ్లి ఉంటుంది కానీ...
అమ్మ ఎక్కడికి వెళుతుంది?
బొమ్మలు కావాలని మారాం చేసే
మన పిల్లల కళ్ళల్లో మెరిసేది అమ్మ బొమ్మె కదా...!

తొలిపొద్దు వెలుగులో
చిగురాకుతో ముచ్చట్లు చెప్పే
మంచుబొట్టు నీడలో
బిడ్డల్ని దీవిస్తూ అమ్మ కదులుతూ ఉంటుంది

అమ్మ వెళ్లిపోయిందని
వాన నీటికి తడిసిన మట్టి గోడలా
లోలోపలే కొంచెం కొంచెం పెళ్లలు పెళ్లలుగా
విరిగిపోతున్నాడు తమ్ముడు
కన్నీటి పొరల మధ్య కానలేకున్నాడు కానీ...!
అమ్మ పక్కనే ఉంది కొడుకును నిలబెడుతూ.......!

అమ్మ ఎక్కడికి వెళుతుంది?
మహా అయితే
తాను పంచిన రక్తంలోకే తిరుగు ప్రయాణం కడుతుంది..........

Tuesday, 3 August 2010

సరదా... సరదాగా...!!

ఆ.... చెప్పండి మేడం...! ఈరోజు మీ జీవితాలలోంచి వెలుగు దూరమవబోతోంది. మళ్లీ మీరంతా బ్రతికుంటే, రేపటిదినాన ఈ వెలుగును మీరు చూస్తారు... అంటూ మొదలెట్టాడు మా సహోద్యోగి.

ఆ... ఏముంది చెప్పడానికి నువ్వే చెప్పు అన్నాన్నేను...

నిన్న నా కాంప్ఆఫ్ కదా...! నాకు బాగా చేయడానికి వచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అన్ని వస్తువులు కొనుక్కెళ్లాను. పైగా... నేను చాలా బాగా చేస్తాన్రా అంటూ నా ఫ్రెండ్‌ను కూడా నాతో లాక్కెళ్లాను.

సరే మంచిది. మరి బాగా వండావా...?

ఏం వండాను మేడం... అన్నీ కొన్న నేను సిలిండర్‌కు రెగ్యులేటర్ కొనడం మర్చిపోయాను. దీంతో నా వంట కార్యక్రమం ఆ రోజుకు అలా సమాప్తమయ్యింది. పాపం మా వాడికి నాతో పాటు ఎప్పట్లాగే హోటల్ కూడు తప్పలేదు.

నాకు నవ్వాగలేదు.... మళ్ళీ ఇంకోరోజు తన పని ముగించుకుని ఇంటికెళ్లబోతూ ఎప్పట్లాగే... వెలుగు వెళ్లిపోతోంది అంటూ బాయ్ చెప్పడానికి వచ్చాడు. నేను నా పనిలో కాస్తంత బిజీగా ఉండి... తనను పట్టించుకోలేదు.

మేడం... నేను ఈ మధ్య చూస్తున్నాను. మీరంతా అలా శవాకారాల్లాగా మోనిటర్లకు అతుక్కుపోతున్నారు. అసలు నేనొక్కడిని వచ్చానన్న సంగతే పట్టించుకోలేదు.

"మీ బతుకులెందుకిలా తయారయ్యాయి. పని చేయాలే కానీ... పనే జీవితం కాకూడదు" అంటూ జోరున వర్షంలాగా మాటల వర్షాన్ని కురిపించాడు.

అదేంలేదు... కొంచెం బిజీ అంతే... పని కాస్త ఎక్కువగా ఉంది ఏం చేయమంటావు చెప్పు... అన్నాను నేను తనవైపు తిరుగుతూ...

అదీ ఇలాగ అడిగారు... బాగుంది.... అంటూ మళ్లీ మాటలు....

ఎందుకీమధ్య మరీ దిగాలుగా ఉంటున్నారు...

ఏం లేదంటే వినవు కదా...! కాస్తంత పని ఎక్కువగా ఉందంతే....!

పోనీలెండి మేడం.... జీవితంలో కష్టాలందరికీ సహజమే... బాధపడకండి అన్నాడు నవ్వుతూ....

పనెక్కువ అంటే... కష్టాలంటావేంటి.... నీకేం కష్టాలున్నాయి? అన్నాను నవ్వుతూనే...

ఎందుకు లేవు మేడం... నేను చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేదు.... ఇంత పెద్ద కష్టాన్ని దాచుకుని నేను సంతోషంగా ఉండటం లేదూ...!

అదేంటీ చేస్తున్న పనికి చదివిన దానికీ సంబంధం లేదా...?! అయినా ఈ ఆఫీసులో చాలా మంది చేస్తున్నది అదే కదా...! బ్రతుకు పోరాటం... దానికి నువ్వేమీ మినహాయింపు కాదే...?

అసలు నువ్వేం చదువుకున్నావు...?

ఏరోనాటికల్ ఇంజనీరింగ్...!

ఆ...! అవునా... ఇన్ని రోజులూ తెలియలేదే... మరి చదువుకుంటూనే జాబ్ చేస్తున్నావా....?

ఎక్కడ మేడం.. లేదు... అసలు చదువుకునేందుకే ఇక్కడికి వచ్చాను. అది కాస్తా ఇలాగ అయ్యింది. (అతడి పర్సనల్ విషయాల్లోకి ఇంతకంటే వెళ్లలేను మరి...!)

పోనీలే... ఊరుకో...! ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ నవ్విస్తుండే నీలో ఇంత విషయముందా...?! అంటూ ఆశ్చర్యపోయాను.

ఎందుకుండదు... ప్రతి ఒక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. అలాంటి ఒక కథే నాది.... అయినా నేను జరిగిపోయిన దానికి ఎప్పుడూ బాధపడలేదు.... జరగాల్సిందే చూస్తున్నా....

నవ్వులలోంచి సీరియస్ డిస్కషన్‌లోకి వెళ్లిపోయిన మా ఇద్దరిమధ్య వాతావరణాన్ని కాస్తంత చల్లబరుస్తూ....

సెల్‌ఫోను మోగింది.... ఫోను తీసి ఆ.... చెప్పయ్యా...!

మరి అవతలి వ్యక్తి ఏం మాట్లాడాడో తెలియదు... కానీ... తను మాత్రం నన్ను నమ్ము.... నన్ను నమ్ముకున్నవారి చేతిని ఎప్పుడూ వదలలేదు... నమ్మకం ఉంచు. ఈ లోకంలో ఉన్నవాళ్ళందరికీ మేలు చేసేందుకే నేను పుట్టాను.... అంటూ చిన్నపాటి లెక్చర్ మొదలెట్టాడు.

హమ్మయ్యా...! అని కాసేపు ఊపిరి పీల్చుకుంటూ... మళ్లీ నా పనిలో మునిగిపోయాను నేను...

పని చేస్తూనే తను చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూనే ఉన్నా.... తను చెప్పింది నిజం కదా...! లోకంలో ఎంతోమంది వాళ్ళు చదువుకున్న చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం లేకుండా జీవితాలను వెళ్లబుచ్చుతున్నారు.

జీవితం అంటే రాజీ అనే దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు మరి...!

ఇక ఇదలా ఉంచితే... మళ్ళీ మా సహోద్యోగి సీన్‌లోకి ఎంటరయ్యాడు....

నేను నా ఆలోచనల నుండి బయటపడ్డాను. తనే ముందటి వాతావరణాన్ని తేలికపరుస్తూ.... మళ్లీ కాసేపు నవ్వులు పంచాడు.... చివరగా ఇంటికి వెళ్తూ.... గుడ్ మార్నింగ్ చెప్పాడు...

అదేంటీ గుడ్ నైట్ చెప్పాల్సింది పోయి గుడ్ మార్నింగ్ అంటావు అన్నాన్నేను...

ఏం లేదు మేడం మరీ రొటీన్‌గా ఉండకూడదనే వెరైటీగా అలా చెప్పాను అన్నాడు...

సరే... జాగ్రత్తగా వెళ్లిరా... అంటూ బాయ్ చెప్పాను....

తను వెళ్లిన తరువాత ఒక సందర్భంలో తాను చేసిన కామెడీ గుర్తొచ్చి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను...

అదేంటంటే.... మా పోర్టల్ లీడర్ ఒకసారి ఊరెళుతుంటే.... సార్.... మీ ఎడబాటును ఎలా తట్టుకోవాలి. మీ పునర్దర్శనం ఎప్పుడు సార్...! అంటూ అమాయకంగా అడిగాడు... (నిజంగా తనకు ఎడబాటు అనేది దానికి సరిగా అర్థం తెలియదట)

ప్రయాణం హడావిడిలో ఉన్న ఆయన కూడా...! ఎంతలే త్వరగా వచ్చేస్తానులే...! అంటూ వెళ్లిపోయారు. ఆయన అలా వెళ్లపోగానే పక్కనే ఉన్న మేమందరం భళ్లున నవ్వేశాం.

తరువాత మా సీనియర్ సహోద్యోగి ఒకరు తనను పిలిచి ఎడబాటు అనకూడదయ్యా...! అంటూ వివరించి చెప్పేసరికి... నిజంగా తనకు ఆ పదం వెనుక అంత అర్థం ఉందని తెలియదు సార్....! అంటూ తను కూడా మాతో జతకలిపాడు....

మా టీం అంతటా ఒకటే నవ్వులే.... నవ్వులు....!!

ఇంకేముంది కథ కంచికి... మనం ఇంటికి.... :)