Pages

Friday 22 March 2013

గొడ్డుమోతుతనం...!!!



 తానూ...
ఓ అమ్మనన్నది మరిచిందో
అత్తమ్మ ప్రమోషన్‌కు మురిసిందో
కోడలు కోడలేగానీ
కూతురు కాదుగా..
అనుకుందో ఏమో
తన పెద్దరికానికి సాక్ష్యంగా
నా అమ్మతనాన్ని బలి కోరితే
మనసూ, శరీరం రక్తమోడుతుంటే
బేలనై బలిపీఠం ఎక్కిన క్షణాలు
నాకింకే గుర్తే

విరిగిన ఆశల్ని పోగుచేసి
మూటగట్టి ఓ మూలన విసిరేసి
కడుపున పుడితేనే బిడ్డలా
'ఆడబిడ్డ'లు 'బిడ్డలు'కారా
 పిచ్చి భ్రమలో బ్రతికేస్తూ
 అలుపెరుగని కుటుంబ సేద్యం చేస్తూ
 చిందించిన స్వేదబిందువులెన్నో
 బిడ్డలనుకున్న ఆడబిడ్డలే
 "గొడ్రాలు" పట్టం కట్టేస్తే
అమ్మతనంపైనే అసహ్యంవేసిన క్షణాలు
నాకింకా గుర్తే

పిల్లలు లేకపోతేనేం
'అక్క'వైతేనేం అమ్మవుకావా
కన్నీళ్లు చిప్పిళ్లగా
వీరినైనా మిగిల్చావు దేవుడా
కృతజ్ఞత చెప్పుకునేలోపే
అమ్మ "బంగారు" అక్కకెందుకులే
తనకు అన్నీ 'మనమే'గా
అమ్మతనం ఎంత "విలు"వైందో
తెలిసిన ఆ క్షణాలు
నాకింకా గుర్తే

అమ్మతనాన్ని ఆవిరి చేసింది
తన అమ్మే అని తెలిసినా
చౌడుబోయిన భూమికీ
అమ్మ కాలేని నీకూ
 పెద్ద తేడా ఏం లేదంటూ
 రోజూ మాటల శూలాలతో పొడుస్తున్న
 భరించేవాడైన "భర్త"
 రెండోపెళ్లి కోరిక అర్థమై
 "ఆడ"తనంపై జాలి పడిన క్షణాలు
  నాకింకా గుర్తే

  ఇంతకీ..
  ఈ లోకంలో "గొడ్డుమోతుతనం" ఎవరిది?
  పిల్లలు లేని నాదా... మనసే లేని                    వీళ్లందరిదా...???

(దగాపడ్డ, పడుతున్న అక్క, చెల్లెళ్లందరికీ...)