"కొండను తవ్వి ఎలుకను పట్టిన" చందంగా మారిపోయిందండి నా పరిస్థితి. ప్రతిరోజూ... మా ఆయన చెత్తకుప్పలా పేర్చి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డుల కవర్ల భండాగారాన్నంతా తవ్విపోయడమే పనిగా పెట్టుకున్నాను. (మరేం లేదు... మా ఆయన ఆ కెమెరాను క్రెడిట్ కార్డుతో కొన్నారులేండీ..!) వీటిల్లోనయినా కనీసం ఆ బిల్లు ఒరిజినల్ కాకపోయినా, డూప్లికేట్ కాపీ అయిన దొరుకుతుందన్న ఆశ నన్ను అంతపని చేయిస్తోంది మరి...!
కెమెరా సంగతి పక్కకుపోయి, కెమెరా బిల్లు సంపాదించటానికి పడరాని పాట్లు (వెతకడం) పడాల్సి వస్తోంది. ఇదేం ఖర్మరా బాబూ..! అనుకోని రోజు లేదంటే నమ్మండి. స్నేహితులు, కొలీగ్స్, బంధువులు అందరూ... ఇలా చేయండి, అలా చేయండి అంటూ సలహాలిస్తున్నారుగానీ... బిల్లు మాత్రం కనిపించే దారే లేకుండా పోయింది.
ఓ రోజు లంచ్ టైంలో మా కొలిగ్ ఒకతను "ఏంటండీ కెమెరా కోర్టు నుండి తెచ్చేసుకున్నారా..? బిల్లు కనిపించిందా..?" అంటూ కుశలప్రశ్నలు వేశాడు. "మూలిగే నక్కపై తాటికాయ పడటం" అంటే ఏంటో అర్థమైంది అతని ప్రశ్ననుండి నాకు. లేదండీ బిల్లు కనిపించలేదు అన్నాను. ఆరోజు మీరు కొన్న క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ అయినా వెతికి పట్టుకుంటే... డూప్లికేట్ బిల్లు సంపాదించవచ్చు అని అన్నాడతను.
ఇంకో సీనియర్ కొలిగ్ ఇంకొకరు మా చర్చలో కల్పించుకుంటూ.. దీని కోసం ఎందుకింత టెన్షన్ పడుతున్నారు. "ఇండెమ్నినిటీ" బాండ్ వేశారంటే... మీదగ్గర బిల్లు లేకపోయినా కెమెరాను తెచ్చేసుకోవచ్చు అన్నాడు. ఎలాగ సార్...? అన్నాను ఆశగా...
మరేం లేదమ్మా..! ఇండెమ్నినిటీ బాండ్ అంటే... "ఈ వస్తువును భవిష్యత్తులో తమదే అంటూ ఎవరైనా క్లెయిమ్ చేసినట్లైతే దానికి నేను బాధ్యత వహిస్తాను" అని అర్థం... అంటూ వివరంగా చెప్పాడు. నేను సరేనండీ... అలాగే చేస్తాను... థ్యాంక్స్ అంటూ తలాడించేసి వచ్చేశాను.
ఇండెమ్నిటీ బాండ్ సంగతలా ఉంచితే.. ఒరిజినల్ బిల్ కోసం నా వేటను మాత్రం ఆపలేదు... అలా వెతుకులాటలోనే మరికొన్ని నెలలు గడిచాయి. "ఓరి దేవుడా.. ఇలాగైతే నాకిష్టమైన కెమెరా నాకు దక్కేలా లేదు. ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సరే కోర్టుకెళ్లాలి. అక్కడికెళితే ఏంచేయాలో లాయరే చెబుతాడు" అంటూ ఓ నిర్ణయానికి వచ్చేశాను.
ఓ రోజు లీవుపెట్టేసి... సాయంకాలం ఇంటికెళ్లాను. ఆశ చావక చివరిసారిగా... ఓసారి వెతికి చూద్దాం అనుకుంటూ... ఎక్కడో మంచం కింద దాచిపెట్టిన మరికొన్ని కాగితాల గుట్టను కదిలించాను. చాలా సీరియస్‌గా బిల్లుకోసం వెతికేస్తున్నాం. ఎక్కడా దాని ఆనవాళ్లు కనిపించడం లేదు.
పట్టువదలని విక్రమార్కుల్లాగా... మా ప్రయత్నం ఆపలేదు... ఇంతలో అమ్మా...! దొరికేసింది అంటూ ఓ పెద్ద కేక పెట్టాడు మావాడు. హమ్మయ్యా..! ఇప్పటికైనా దొరికింది కదూ...! అంటూ చూస్తే... అది బిల్లుకాదు... క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్. అందులో కెమెరా కొన్న తేదీ స్పష్టంగా ఉంది... ఇదైనా సరే దొరికింది అనుకుని మనసుకు సర్దిచెప్పుకున్నాము. మరుసటి రోజు కోర్టుకెళ్లాలి కాబట్టి త్వరగా తినేసి పడుకున్నాము.
ఆరోజు గురువారం... కోర్టుకెళ్లాలి కాబట్టి త్వరత్వరగా రెడీ అవుతున్నాము. ఇంతలో ఏదో అవసరమొచ్చి బీరువా లాకర్‌లో చెయ్యి పెడితే కొన్ని బిల్లులు చేతికి తగిలాయి. ఏంటో చూద్దామనుకుని విప్పి చూద్దును కదా...! సంతోషంతో నాకు నోటమాట రాలేదు. నేను దేనికోసమైతే నెలల తరబడీ వెతుకుతున్నానో... అదేనండీ డిజిటల్ కెమెరా ఒరిజినల్ బిల్లే అది.
మావారికి, అబ్బాయికి చూయిస్తే... మావాడు నాకు రెండు చేతులెత్తి నమస్కరించేశాడు. మా ఆయనైతే నావైపు గుర్రుగా చూశాడు. నీ మతిమరపువల్ల ఎన్నిరోజులు, ఎంతగా కష్టపడ్డాము, ఎంతలా వెతికాము, ఎన్ని తిప్పలు.. అంటూ నాకు బాగా అక్షింతలు పడ్డాయి. వాళ్లెంతలా మాట్లాడుతున్నా... మౌనంగా నవ్వుతూ ఉండిపోయాను (బిల్లు దొరికిన సంతోషం కాబోలు...!)
హమ్మయ్య...! శకునం బాగానే ఉంది. బిల్లు దొరికేసింది కాబట్టి కెమెరాను ఈరోజు ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనుకుంటూ ఉత్సాహంగా కోర్టుకు బయలుదేరాము....!! ..............
మహీన్
1 day ago