Pages

Wednesday 6 October 2010

పసిమొగ్గలను వాడిపోనీయవద్దు...!


కొన్ని రోజుల క్రితం మా పక్క వీధిలో ఒకటే అరుపులు, కేకలు, ఏడ్పులు, ఆర్తనాదాలు... ఏమయ్యింది? అనుకుంటూ కంగారుగా, ఆతృతగా బాల్కనీలోకి పరుగెత్తికెళ్లాను. ఒకతను ఏడుస్తూ... ఓ పది సంవత్సరాల అబ్బాయిని చేతులపై మోసుకెళ్లటం నాకు కంటబడింది. అతడి వెంట చాలామంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వెళ్తున్నారు.

కిందికి పరుగెత్తుకెళ్లి... పక్కింటి మామిని ఏమయ్యింది? అని అడిగాను. నిండా పదేళ్లు కూడా లేవు ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పింది. ఆ మాట విన్న నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఇంత చిన్నబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అని...?

కాసేపటి తరువాత తేరుకున్న నేను... ఎందుకు? అని మళ్లీ ఆమెనే అడిగాను. ఇంకా ఏమీ తెలియలేదు, కనుక్కుని చెబుతానుండండి అని అంది. ఆ చిన్నపిల్లాడి రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంది. నాకేమీ పాలుబోలేదు. అసలు ఎలా జరిగింది? అని మామిని అడిగాను.

స్కూలుకెళ్లిన పిల్లాడు మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాడు. వాళ్ళ అమ్మ కట్టి ఇచ్చిన పెరుగన్నం తినేసి మేడమీది గదిలోకెళ్ళాడు. ఏమనుకున్నాడో ఏమో కిటికీ ఊచలకు వాళ్ళమ్మ చీరను బిగించి తన మెడకు ఉరి వేసుకున్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడూ మేడమీది గదిలో ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదట.

ఒకటి రెండుసార్లు వాళ్ల అక్క పైకి వెళ్లి కిటికీ పక్కన మెడకు చీరను బిగించుకున్న తమ్ముడిని చూసి అలా ఆడుకోకూడదురా, తప్పురా అంటూ మందలించి కిందికి వెళ్లిపోయిందేగానీ సరిగా గమనించలేదు. మధ్యాహ్నం మెడకు ఉరి బిగించుకున్న ఆ పిల్లాడిని సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చూశారు.

ఎంతసేపు ఆడుకుంటావు కిందికి రారా అంటూ అక్క ఎంత పిలిచినా ఆ అబ్బాయి కిందికి రాలేదు, పలకడం లేదు. ఏమైంది అనుకుంటూ ఆ అమ్మాయి వచ్చి చూడగా.. నాలుక బయటపెట్టి, కనుగుడ్లు పైకి తేలేసి కనిపించాడు ఆ అబ్బాయి. భయంతో కిందికి పరుగెత్తి కెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మకు విషయం చెప్పి పైకి తీసుకెళ్లగా... కొడుకు నిర్జీవంగా కనిపించాడు ఆ తల్లికి.

అయినా బతికే ఉంటాడన్న చిన్ని ఆశతో చుట్టుప్రక్కల వారిని పిలిచి హాస్పిటల్‌కు పరుగులెత్తింది ఆ తల్లి. హాస్పిటల్‌లో డాక్టర్ ఆ అబ్బాయిని పరీక్షించి మధ్యాహ్నమే చనిపోయాడని చెప్పాడు. ఇంతలో తండ్రికి విషయం తెలిసి హాస్పిటల్‌కు పరుగెత్తాడు. అప్పటికే బిడ్డను ఏడుస్తూ తీసుకొస్తున్న భార్య చేతుల్లోంచి తీసుకుని గుండెలు బాదుకుంటూ తీసుకొస్తున్నాడు. ఇదండీ జరిగింది అని చెప్పింది మామి.

ఆ చిన్న పిల్లాడికి ఏం కష్టమొచ్చింది? ఎందుకు ఉరివేసుకోవాలనుకున్నాడు? అని మళ్లీ ఆమెనే అడిగాను. ఏమోనండీ అందరూ దుఃఖంలో ఉన్నారు. ఇంకా ఏమీ తెలియడం లేదని చెప్పిందామె.

తరువాత కొన్ని రోజులకు ఆ పిల్లాడు ఉరి వేసుకున్న కారణం తెలిసి అవాక్కయ్యాను. స్కూల్లో ఏదో కారణం చేత వాళ్ల మిస్ అందరి ముందూ తిట్టిందట. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని ఆ పిల్లాడు ఉరిపోసుకున్నాడు.

అప్పటిదాకా, స్కూల్లో అందరికంటే ఫస్ట్ వచ్చే తమ కొడుకు మార్కులు తక్కువ వచ్చినందుకో, లేదా ఎప్పుడైనా తాము తిట్టినందుకో మనసు కష్టపెట్టుకుని ఇలా చేశాడనుకున్నారు ఆ పిల్లాడి తల్లిదండ్రులు. అయితే ఆరోజు స్కూల్లో మధ్యాహ్నం మిస్ తిట్టినందుకు అంతపని చేశాడని తెలిసిన తల్లిదండ్రులు కాసేపు ఆమెని కోపగించుకున్నా, ఏం చేసినా తమ కొడుకు ఇక తిరిగి రాడని ఊరకున్నారు.

అయ్యో...! చిన్న పిల్లాడిని కోపగించుకుని తన చావుకు కారణమయ్యాయనని ఆ మిస్ కూడా పశ్చాత్తాపంతో ఏడుస్తూ, పిల్లాడి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది.

ఇక్కడ ఎవరిని తప్పుబట్టాలో నాకు అర్థం కావడం లేదు. తప్పు చేసినప్పుడు దండించిన టీచర్‌దా? లేదా చిన్నపాటి అవమానాన్ని కూడా భరించలేని ఆ పిల్లాడిదా..?

అదలా ఉంచితే... చిన్నపిల్లలు సహజంగానే సున్నిత మనస్కులై ఉంటారు. వారికి సాధ్యమైనంత సున్నితంగానే తప్పొప్పులను తెలియజేయాలే గానీ, కోపంగా తిట్టి చెబితే మాత్రం గాయపడతారు. గాయపడినవారు కొంతమంది మర్చిపోయినా... మరికొంతమంది మరీ సున్నిత స్వభావం కలిగిన పిల్లలు పైన చెప్పిన పిల్లాడిలాగే బలవన్మారణాల దారిలోకి వెళ్లిపోతారు.

కాబట్టి... ప్రియమైన తల్లిదండ్రులారా, విద్యాబుద్ధులు నేర్పే గురువుల్లారా...! చిన్నారి పసిమొగ్గలను వసివాడి పోనీయకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది. కఠినమైన మాటలు, భాషతో చిన్నారి మనసులను గాయపడనీయకుండా సున్నితంగా వారికి తప్పొప్పులను తెలియజెప్పుదాం....! చిన్నారులను కాపాడుకుందాం...!!