Pages

Wednesday 23 November 2011

రెండేళ్లు గడిచిపోయాయి... ఇంకా ఎన్నేళ్లో ఇలా...!!"నువ్వు ఓ జ్ఞాపకానివా?
కాదు
నిజానివి...
జ్ఞాపకాలతో ఊపిరి పోస్తున్నావు
అందుకే నువ్వు నిజానివి"

ఈ మధ్య మావూరికి బస్‌లో వెళ్తుంటే అప్రయత్నంగా నా కళ్లు ఓ చోటికి పరిగెత్తాయి. కనురెప్ప పాటులో ఆ చోటు కళ్లముందు నుంచి దూరమైంది. కానీ నా ఆలోచనలు మాత్రం ఎక్కడికో వెళ్లిపోయాయి. ఎందుకంటే మా నాన్న మాకు దూరమైంది ఇందాక చూసిన ఆ చోటు నుంచే. అందుకే అప్పటినుంచీ ఆ చోటును చూస్తే తట్టుకోలేనని ఆ దార్లో వెళ్తున్న ప్రతిసారీ కళ్లుమూసుకుని కూర్చొనేదాన్ని. అయితే ఈసారి మాత్రం అనుకోకుండా చూసేశాను.

అంతే.. నాన్న హాస్పిటల్‌‌లో చేరటం.. బాగా మాట్లాడుతూ ఉన్న మనిషికి వెంటిలేటర్లు పెట్టడం.. ఆపై మాట పడిపోవడం... స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అటూ, ఇటూ తీసుకెళ్లటం... లాంటివన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తొచ్చి పిచ్చిగా ఏడ్చేశాను. ఆ మాయదారి హాస్పిటల్ మా ఆయన్ని తీసుకెళ్లిపోయిందంటూ అమ్మ రోదించటం గుర్తొచ్చి, కళ్లు అలా వర్షిస్తూనే ఉన్నాయి. నాన్నగారి 2వ వర్ధంతి (నవంబర్ 7) జరిపేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరగటం యాదృచ్ఛికం.

నాన్న దూరమై అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ రెండేళ్లు ఎంత భారంగా గడిచాయో... ఇంకా ఎన్నేళ్లు ఇలా గడపాలోనని ఒకటే ఆవేదన. ఈ రెండేళ్లలో నాన్న ఉన్నప్పటి పరిస్థితికీ, ఆయన లేనప్పటి పరిస్థితికీ చాలా స్పష్టమైన తేడా. బాధలోను, సంతోషంలోను, కష్ట సుఖాల్లోనూ.. ఇలా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా చాలా వెలితి. నాన్న లేరన్న వెలితి. ఆయనే ఉంటే.. ఇలా చేసేవారు, అలా చేసేవారు.. అనని రోజు లేదు.


ముఖ్యంగా అమ్మ ముఖంలో ఎప్పుడూ వెలితే. పిల్లల్లోనే మా ఆయన్ని చూసుకుని రోజులు గడిపేస్తున్నానని ఆమె మా బంధువులతో చెబుతున్నప్పటికీ తన ముఖంలో నాన్న లేని వెలితి. అది ఎప్పటికీ తీరేది కాదు.. అది ఆమెకూ, మాకూ అందరికీ తెలిసిందే. అయినా నాన్నకోసం, ఆయన ప్రేమ కోసం మా జీవితాల్లో తపన ఆగదు.

నాన్న రెండో వర్ధంతి రోజున తన సమాధి వద్దకు వెళ్తున్నప్పుడు ఒకాయన మాకు ఎదురుపడ్డాడు. ఆయనెవరో నాకు సరిగా గుర్తులేదు. కానీ మా అమ్మ, చిన్నాన్న, నానమ్మ గుర్తుపట్టి పలుకరించారు. ఆయన చాలా సంతోషంగా బదులిచ్చాడు. "అదిసరేగానీ ఏంటి అందరూ పూజ సామగ్రి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు. గుడికా..?" అని అడిగాడు. గుడికి కాదు, మావారి సమాధి వద్దకు వెళ్తున్నామని అమ్మ చెప్పింది. అంతే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆ మధ్య వయస్సు ఆయన అంతే పొగిలి పొగిలి ఏడ్చాడు. "నిజమా..? అన్న చనిపోయాడా..? ఇన్నాళ్లూ కనిపించకపోతే ఆయన అంగడి దగ్గర లేనప్పుడే నేను అక్కడికి వెళ్తున్నానేమో.. ఎప్పుడైనా ఇంటికెళ్లి పలుకరించి రావాలని అనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందా.. అంటూ ఒకటే ఏడుపు".

నాన్న పోయి రెండు సంవత్సరాల తరువాత కూడా తన కోసం ఏడ్చే మనుషులను సంపాదించుకున్న నాన్న మంచితనానికి లోలోపలే ఎంతగానో సంతోషించాను. నిజం చెప్పాలంటే మొదటి వర్ధంతి రోజున ఉన్న దుఃఖం ఇప్పుడు మాలో లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే ఇంకిపోయాయా అన్నట్టుగా మా కళ్లల్లో కన్నీటికి కొరత. అయినా భరించలేని బాధ మాత్రం ఉంటుంది. ఆయన లేరన్న నిజం ఎప్పుడూ గుండెల్ని పిండేస్తుంటుంది.
కానీ ఇన్నాళ్ల తరువాత కూడా ఆయన కోసం కళ్లనీళ్లు పెట్టుకునేవారు ఉన్నారని మాకు అప్పుడే తెలిసింది.

ఆ రోజు రాత్రే అమ్మతో నేను ఎవరమ్మా ఆయన నాన్న కోసం అంతలా ఏడ్చాడని అడిగితే.. వేరే ఊరికి చెందిన అతను మనకు బంధువేమీ కాదని, కేవలం పూల అంగడి దగ్గరకు పూలు కొనేందుకు వస్తుంటాడని అమ్మ చెప్పింది. ఆయనే కాదు, అంగడి దగ్గరకు చాలామంది వస్తుంటారనీ వాళ్లకు మీ నాన్న పోయిన సంగతే తెలియదని, ఇప్పటికీ నమ్మనే నమ్మరని.. ఆయన ఇంటి దగ్గర ఉండి ఉంటాడులే నువ్వు అబద్ధం చెబుతున్నావని నాతో వాదిస్తుంటారని అమ్మ చెప్పింది.

ఎవరైనా తెలిసినవాళ్లు పోయారంటే, అయ్యో.. అని బాధపడటం సహజం. కానీ ఏడుస్తున్నామంటే, వారితో మనకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని తెలుపుతుంది. మనుషులను సంపాదించుకోవటం, వారి మనసులను గెల్చుకోవటం నాన్నకున్న గొప్ప గుణం. అందుకేనేమో తనంటే అభిమానించేవారినే కాదు, ఏడ్చే వారిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆయనలా,, తన పిల్లలమైన మేము మా కోసం ఏడ్చే, మేము లేరని బాధపడే నలుగురినైనా సంపాదించుకోగలమా..? అనే సందేహం చాలాసార్లు వస్తుంటుంది నాకు.

నాన్న 2వ వర్థంతి రోజున... "మనకు ఉన్నంతలో పదిమందికి సాయం చేయాలని, అన్నార్తులను ఆదుకోవాలని ఎప్పుడూ చెప్పే ఆయన కోరిక మేరకు....." ఆ రోజున అన్నదానం చేశాం. రోజంతా ఆయన జ్ఞాపకాలతోనే గడిపేశాం. ఆయన మాతో కలిసి తీయించుకున్న ఫొటోలను డీవీడీగా రూపొందించి ఆ ఫొటోలను చూస్తూ, మధ్య మధ్యలో అమ్మ, నానమ్మ ఆయన గురించి చెప్పిన కబుర్లతో.. తీపి, చేదు జ్ఞాపకాలతో రోజును వెల్లదీశాం.


పిల్లలమైన మాకు కన్నీళ్లు ఇంకిపోయినా, అమ్మ కళ్లల్లో మాత్రం ఆ కన్నీటి పొర ఎప్పటికీ చెరగదని మాకు ఆ రోజే ఇంకా స్పష్టంగా అర్థమైంది. ఆయన గురించి తల్చుకుంటే చాలు ఆమె కళ్లు వర్షిస్తూనే ఉంటాయి. ఏడుస్తూనే జ్ఞాపకాలను చెప్పుకుంటూ వెళ్లేది.

అలాంటి జ్ఞాపకమే ఒకటి... "మాకు పెళ్లయిన కొత్తలో కూలిపనులు చేసి మీ నాన్న కూడబెట్టిన డబ్బుతో ఓ రేడియో కొన్నాం. అప్పట్లో రేడియో కొనటం అంటే చాలా గొప్ప. రేడియో కొన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఖాళీగా ఉన్నప్పుడే కాదు, కూలి పనులకు వెళ్లేటప్పుడు కూడా దాన్ని వెంట తీసుకెళ్లి పాటల్ని వినేవాళ్లం. పాటలు రాని టైంలో మిగతా ఏ ప్రోగ్రాములు వచ్చినా వినేవాళ్లం.


ముఖ్యంగా మీ నాన్నకు వార్తలంటే చాలా ఆసక్తి. వార్తలు వస్తున్న సమయంలో ఏమైనా చిన్న శబ్దం చేసినా సరే, భలే కోపగించుకునేవారు. ఓసారి వార్తలు వస్తున్న టైంలో గమనించకుండా ఏదో మాట్లాడినందుకు కొట్టేశారు కూడా. అందుకే వార్తలు వస్తున్నాయంటే నేను దూరంగా జరిగిపోతా.

రేడియోలో పాటలు వస్తుంటే భలే ఉత్సాహంగా వింటూ, పాడేవారు ఆయన. నాటికలు, జానపద గేయాలు ఇలా ఒకటేమిటి అన్నీ ఆసక్తిగా వినేవాళ్లం. ఇలా ఒకరోజు ఆయన నన్ను 'రేడియో కడపలో పెట్టు'. అని అన్నాడు. రేడియో వినటమేగానీ అందులో ఏయే స్టేషన్లు ఉంటాయో నాకు తెలీదు. అలాంటిది కడపలో పెట్టు అనే సరికి రేడియో తీసుకొచ్చి సరిగ్గా ఇంటిగడపలో పెట్టేశాను. (మావూరి యాసలో గడపను, కడప అని కూడా అనేవాళ్లు..).


అది చూసి మీ నాన్న పడి పడీ నవ్వారు. నాకు అర్థంకాక ఉడుక్కుంటుంటే రేడియోను కడప స్టేషన్‌లో పెట్టమని చెబితే, నువ్వేంటి గడపమాను మీద తెచ్చి పెట్టావు అని ఫకఫకా నవ్వుతూ చెప్పారు. ఆ స్టేషన్ల గోల నాకు అర్థం కాక నేను కూడా నవ్వాను" అంటూ అమ్మ సంతోషం, బాధ కలగలసిన గొంతుతో చెబుతుంటే కళ్లార్పకుండా ఆమెనే చూస్తూ, మేం పుట్టకముందు అమ్మా, నాన్న ఎలా ఉండేవాళ్లో ఊహించుకుంటూ ఎంతగా మురిసిపోయామో.... ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలో ఆమెకు.... మాక్కూడా...

ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమేనా..? ఇవి మా జీవితాలు.. అమ్మా, నాన్నలతో పెనవేసుకున్న తిరిగిరాని అనుభూతులు.

నాన్నా...!! నువ్వు దూరమై రెండేళ్లు కాదు... మరెంతకాలం గడిచినా... మేము ఉన్నంతవరకూ నువ్వూ మాతోనే జీవించి ఉంటావు. మేము లేకపోతేనే నువ్వూ మాయమయ్యేది.. దూరమయ్యేది.. మేమున్నంతవరకూ నువ్వు మృత్యుంజయుడవు. నీ చల్లని ఆశీర్వాదాలు ఉన్నంతవరకూ మేమూ చిరంజీవులమే...!!


(నాన్నగారి మొదటి వర్థంతి జ్ఞాపకాల కోసం ఇక్కడ చూడండి)

[2009 నవంబర్ 7వ తేదీన మాకు దూరమైన నాన్న గారి 2వ వర్థంతి సందర్భంగా ఆ రోజునే ఒక పోస్టు పెట్టాలని అనుకున్నా. కానీ ఇంటర్నెట్ ప్రాబ్లెంవల్ల కుదరలేదు. ఆ తరువాత వర్థంతి కార్యక్రమాల కోసం మావూరు వెళ్లటంవలన ఇప్పటిదాకా కుదరలేదు. అందుకే కాస్త ఆలస్యంగా పోస్టు చేయాల్సి వచ్చింది].

29 comments:

Unknown said...

అక్క! ఈ పోస్ట్ కి కామెంట్ పెట్టాలని ఉంది.
కాని ఏమి రాయాలో తెలీడం లేదు.
నాన్నగారి గురించి నువ్వు రాసిన పోస్ట్ లు అన్ని చదివిన నేను ఒక్క మాట చెప్పగలను
మీ నాన్నగారు అయన ప్రేమని అభిమానాన్ని మీకు పదిలంగా అందించి వెళ్ళడమే కదా ఆ సంస్కారం కూడా మీకు ఇచ్చి వెళ్లారు.
అందుకే మీ మాటలో నాకు మీ నాన్నగారు కనిపిస్తూ ఉంటారు.
నిజ్జం...నాకు అయితే అయన లేరు అన్న భావనే రాదు.
నిజ్జంగా మీలాంటి కూతురు ఉన్న అయన ఎంతో అదృష్టవంతులు.
అమ్మ అన్న మాట నిజ్జం...మీరే ఆవిడకి ఇప్పుడు అన్ని...

వనజ తాతినేని/VanajaTatineni said...

పువ్వుల లోని పరిమళం, మనిషి మంచితనం రెండూ ఒకటే! అందుకే మంచి మనసున్న వారు చిరకాలం జ్ఞాపకాలలో బ్రతికి ఉంటారు. కొంచెం ఊరట చెందండి శోభ గారు. మీ బ్లాగ్ నాకు బాగా నచ్చింది

రాజేష్ మారం... said...

శోభ గారు,

నేను ఈ post ఆరు గంటల క్రితం మొదటి సారిగా చదివాను..
చదివిన వెంటనే ఏదయినా రాయాలనిపించింది comment గా, కాని ఏం రాయాలో అర్థం కాలేదు..
తర్వత, ప్రతి గంట కి ఒకసారి వచ్చి చదువుతున్న post ని, కాని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. .

చదివిన ప్రతిఒక్కరికి ఇలానే అనిపించి ఉంటుందని అనుకుంటున్నా.. .

దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాల్లో ఒకటి ... "జ్ఞాపకాలు" ...
మనకి కావాల్సిన వారు దూరమయినా, మనం మాములుగా బ్రతకటానికి ఉపిరి లాంటివి .. ఈ జ్ఞాపకాలే.. ..

శోభ said...

శైలూ.. ఆప్తులను కోల్పోయిన వారందరి పరిస్థితి ఇదే. చదువుతుంటే ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి. ఏదో చెప్పాలని అనుకుంటామేగానీ ఏమీ చెప్పలేం. అందుకే నువ్వూ ఏమీ చెప్పలేకున్నావు. అయితే నాన్న ప్రేమ, అభిమానాన్ని, సంస్కారాన్ని అందిపుచ్చుకున్నానంటూ... నేను చెప్పే ప్రతిమాటలోనూ నాన్నగారే కనిపిస్తున్నారంటూ నువ్వు చెప్పిన మాటలు ఎంతగానో ఊరట కలిగిస్తున్నాయి. ధన్యవాదాలు శైలూ..

శోభ said...

వనజగారూ.. నా బ్లాగు మీకు నచ్చినందుకు, నాన్నగారి గురించి రాసిన పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు...

"పువ్వులలోని పరిమళం, మనిషి మంచితనం రెండూ ఒకటే..." మీరన్నది ముమ్మాటికీ నిజమే...!

శోభ said...

రాజేష్‌గారూ...

మీ అభిమానానికి ధన్యవాదాలు..

గంట గంటకూ పోస్టును చదువుతున్నప్పటికీ.. మీ దగ్గర మాటలు కరువయ్యాయంటే మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. అది అంతే.. ఏదో చెప్పాలనుకున్నా, ఏమీ చెప్పలేని పరిస్థితి..

మీరు చెప్పినట్లుగా... "దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాల్లో ఒకటి జ్ఞాపకాలు. మనకి కావాల్సిన వారు దూరమయినా, మనం మాములుగా బ్రతకటానికి ఉపిరి లాంటివి ఈ జ్ఞాపకాలే"... మీరు చెప్పిన ప్రతిమాటా అక్షర సత్యమే..

Raj said...

చాలా బాగా - మీ నాన్నగారితో మీకున్న అనుబంధాన్ని చక్కగా చెప్పారండీ.. చిన్ని చిన్ని సంఘటనలతో చక్కగా మీ నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలనీ చూస్తూ ఉంటే (చదువుతుంటే కాదు.. చూసేలా చేశారు) కళ్ళు చెమర్చాయి..

శోభ said...

రాజ్ గారు ఈ పోస్టు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అభిమానానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

లాహిరి said...

శోభ గారూ... మీలో నాకు నచ్చేది ఇదే... మనసులోని ఫీలింగ్స్ చక్కగా, సూటిగా వ్యక్తీకరించగలరు...
అలాంటి తండ్రిని పొందిన మీకన్నా మీలాంటి కూతుర్ని కన్న ఆయనే ఎక్కువ అదృష్టవంతుడు!

శోభ said...

లాహిరి (శ్రీనివాస రావు) గారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు... ఇంతకంటే మాటలు రావటం లేదు...

శోభ said...

శోభా రాజు గారు..

నాన్న గారి గురించి మీ పోస్ట్ చదివాను.....
మున్ముందుగా వారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ....
నాన్న గారి జ్ఞాపకాలని, కుటుంబం లోని అమ్మానాన్నల మరియు పిల్లల అనుబంధాన్ని చక్కగా కళ్ళకు కట్టేట్లు రాశారు, కంగ్రాట్స్.

మీ నాన్న గారిలోని మనీషిని కొన్ని సంఘటనల ద్వారా బాగా చెప్పారు.
మన ప్రయాణపు గమ్యం మనందరికి తెల్సిందే కాని మనం అతిగా ప్రేమించే వ్యక్తులు అనుకోకుండా ప్రయాణాన్ని ముగించినప్పుడే మనసు వ్రయ్యలవుతుంది, మీ దుఃఖాన్ని అర్ధం చేసుకోగలను.

అమ్మ ప్రాణం అయితే జీవితం లోకి వేలు పట్టుకు నడిపించే అద్భుత శక్తి నాన్న....
అటువంటు చుక్కాని మాయమైనప్పుడు మన బాధ వర్ణాణాతీతం.....
ఎదేమైనప్పడికీ నిజాన్ని జీర్ణించుకోవాలి కదా....

అదిగో బయటికెల్లి చూడండి మీ నాన్న గారు ఎదో చెప్పాలనుకుంటున్నారు.....
కాని వినబడదు, కనబడదు....
ఆ జ్ఞాపకాలు వెంటాడుతునే ఉంటాయి.....
అమ్మ గారిని ఓ కంట కనిపెట్టుకు ఉండగలరు...

శ్రేయోభిలాషి
-హనీ (ఈగ హనుమాన్ - http://facebook.com/hanumanega)

శోభ said...

సాహచర్యంతో మనుషులను, మనసుల్లో స్థానాన్నీ సంపాదించుకోవడం గొప్ప గుణం!
మీ నాన్నగారు సుగుణాత్ముడు!
అందుకే మరణించాక కూడా జీవించి ఉండాలని కోరుకునే సంపత్తిని పోగుచేసుకున్నాడు!
మీ అమ్మగారి ఆత్మే మీ నాన్న! ఆమె కంట కన్నీటి ఊట ఆ ఆత్మలు రెండూ ఒకటయ్యేవరకూ చెరగవు.

శోభా...!
సునిశితమైన బందాన్ని, అనురాగాన్ని, మమకారాన్నీ తట్టి ... మంచి చేస్తున్నావో లేదో తెలియదు కానీ ... నీతో బాంధవ్యం ఉండి ఉంటే ఎంత ధన్యమో జీవితం అనిపించేలా ఉంది ... నీ జ్ఞాపకం ... నీ మమతాబిషేకం..!

చంద్రశేఖర్ వేములపల్లి ( http://facebook.com/Chandra.Vemulapally)

శోభ said...

హనుమాన్‌గారూ...

మీ ఆత్మీయ పలుకరింపుకు, శ్రేయోభిలాషిగా మీరు చెప్పిన మాటలు చాలా ఊరడింపుగా, మనసును తేలికపర్చేలా ఉన్నాయి..

ధన్యవాదాలు...

శోభ said...

వేములపల్లివారూ...

"సునిశితమైన బందాన్ని, అనురాగాన్ని, మమకారాన్నీ తట్టి ... మంచి చేస్తున్నావో లేదో తెలియదు కానీ ... నీతో బాంధవ్యం ఉండి ఉంటే ఎంత ధన్యమో జీవితం అనిపించేలా ఉంది ... నీ జ్ఞాపకం ... నీ మమతాబిషేకం..!".......

పైన మీరు అన్న ఈ మాటలంత గొప్పదాన్ని అవునో, కాదో.. కానీ మీలాంటి ఆత్మీయులందరి ప్రేమను పొందిన నా జీవితం మాత్రం నిజంగా ధన్యమే..! ఇది అతిశయోక్తి కాదు.. అక్షర సత్యం..

Uday Kumar Alajangi said...

తల్లీ.... చాలా బాధ కలిగిందిరా.. నాకు నాన్న గుర్తుకువచ్చారు..... నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ రాత్రి గుండెపోటుతో నాన్న చనిపోవడం కళ్ళముందు వెలిసింది... ఒక స్నేహితుడిలా నన్ను చూసుకునేవారు..... తండ్రిలేని లోటు ఎవరూ తీర్చలేరు............... నీ ఆవేదన ......నాలో ఆవేదన కలిగిస్తుంది.....

Uday Kumar Alajangi said...

తల్లీ...... చాలా బాధ కలుగుతుంది గుండెలో తెలియని బాధ....నేను ఏడవతరగతిలో ఉన్నప్పుడు ఓ రాత్రి గుండెపోటుతో నాన్న నిద్రలేవడం...చూస్తుండగా మా కళ్ళముందు చనిపోవడం అంతా గుర్తుకు వస్తుంది..నీ ఆవేదన.....నా ఆవేదన...ఒకటే.... కాలం గాయాలు మాన్పినా...... జ్ణాపకాలు పదిలం

కెక్యూబ్ వర్మ said...

శోభగారూ మెసేజ్ చూసి ఇప్పుడే చదివా...ఈ మధ్యనే కోల్పోయిన నాన్నగారిని మళ్ళీ తడిమి చూసుకున్నా...ఆ దుఖంలోంచి మేమింకా కోలుకోనే లేదు...ఈ జ్నాపకాలు ఎన్నటికీ తడి ఆరనివి...గుండెల్లో ఆ వెలితి సజీవంగా కొనసాగుతూనె వుంటుంది...నాన్న లేరన్నది ఇప్పుడు నాకు భయాన్ని కలిగిస్తూంది...అయినా తప్పని ఆ లోటు పూడ్చుకోలేనిది...నాన్నలందరికీ వందనాలు...అమ్మకు నా సహానుభూతిని తెలియజేయగలరు...

శోభ said...

మీ స్పందనకు ధన్యవాదాలు వర్మగారు. నాన్న లేరన్న నిజం భయాన్నే, అనేక రకాల ఫీలింగ్స్ కలుగజేస్తుంది. ఇది నాన్న ప్రేమను అనుభవించిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. మెల్లిగా కోలుకునేందుకు ప్రయత్నించండి..

అయినా నాన్న ఎక్కడికి పోగలడు. మనం ఉన్నంతదాకా మన మనసుల్లో, మన ప్రతి పనిలో, జ్ఞాపకాల్లో సదా జీవించే ఉంటారు.

శోభ said...

ఉదయ్ అన్నయ్యా.. ఆ చిన్న వయసులో నాన్న ఇక ఉండరు అన్న నిజాన్ని మీరు ఎలా భరించారో.. తల్చుకుంటే కళ్లలో నీళ్లు ఆగటం లేదు. నిజంగా అలాంటి పరిస్థితిని ఊహించాలంటేనే చాలా కష్టంగా ఉంది. అలాంటిది మీరు ఆ పరిస్థితిని తట్టుకుని నిలబడ్డారు. అదే గొప్ప విషయం. కానీ, ఆ సంఘటన జీవితమంతా ఎలా వెంటాడుతుందో నేను అర్థం చేసుకోగలను.

ఈ పోస్టు ద్వారా నాన్నగారి గురించి రాసి మంచిపనే చేశానని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ పోస్టు ద్వారా ప్రతి ఒక్కరూ తమ తండ్రులతో గల అనుబంధాలను నెమరువేసుకునే అవకాశం కలిగిందనే అనుకుంటున్నా.

నిజం చెప్పాలంటే.. చాలామందికి బాధాకరమైన జ్ఞాపకాలను, తీపి ఘటనలను గుర్తుకు తెచ్చే ఉంటుంది. ఈ విషయంలో నాకు బాధగానే ఉంటుంది. అయినా మనకు దూరమైన ఆప్తులు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ జీవించి ఉంటారనే సత్యాన్ని తెలుసుకునేందుకు... నా చిన్న చిన్న అనుభవాలు ఉపకరిస్తాయే ఇలా రాశాను. మిత్రులందరూ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా.

మనసు పలికే said...

శోభ గారు..
మాటలు లేవు. మీకు మీ అమ్మగారికి కలిగిన వెలితి ఎవరూ తీర్చలేనిది. భగవంతుడు మీ నాన్న గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

శోభ said...

శోభగారూ...

నాన్నగారితో మీ అనుభవాలూ, అనుభూతులూ చదువుతూ౦టే అప్రయత్న౦గా నా కళ్ళు చెమర్చాయి. నాన్నతో మీకు పెనవేసుకుపోయిన అనురాగపూరితమైన అనుబ౦ధాన్ని అత్య౦త అపురూప౦గా అభివర్ణి౦చారు. ఆయన గురి౦చి ఎ౦త పొగిడినా తక్కువే ఔతు౦దేమో..?

నా ఇరవై ఒకటో స౦వత్సర౦లో, పదిహేడు స౦వత్సరాలక్రిత౦ నా కన్నతల్లి కూడా నన్ను ఒ౦టరివాడినిచేసి ఆ దేవుడివద్దకు వెళ్ళి౦ది. (బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయి౦ది మా అమ్మ)పదిహేను రోజులుగా మ౦చ౦మీద ఉ౦డి చివరిరోజు ఆసుపత్రిను౦డి కారులో వస్తూ౦డగా నా ఒడిలోనే చివరిశ్వాస విడిచి౦ది. ఆ జ్ఞాపకాలు నన్నిప్పటికీ వె౦టాడుతూనే ఉన్నాయి.

ఒక వ్యక్తి భౌతిక౦గా మనదగ్గర ఉ౦డట౦ ముఖ్య౦ కాదు, వారు కనుమరుగైనా వారి జ్ఞాపకాలను బ్రతికి౦చడమే గొప్పదన౦. మీ నాన్నైనా, మా అమ్మైనా భౌతిక౦గా మాత్రమే మనదగ్గర లేరు. కానీ... వారెప్పుడూ మానసిక౦గా మనలోనే ఉన్నారు, మనతోనే ఉ౦టారు. వారి చల్లని ప్రేమ మనకు ఎప్పుడూ రక్షగానే ఉ౦టు౦ది.వారు చూపిన బాట మనల్ని ఎప్పుడూ సన్మార్గ౦లో నడిపిస్తూనే ఉ౦టు౦ది.

అమ్మకు నా నమస్కారాలు తెలుపుకు౦టున్నాను.
- స్పందన నరేష్ (http://facebook.com/spandana.naresh)

శోభ said...

అపర్ణా... ధన్యవాదాలు..

అమ్మకు ఏర్పడిన వెలితి ఎప్పటికీ తీరలేనిది. అయితే ఆమెలోనే నాన్నను చూసుకుంటూ.. తనను కంటికి రెప్పలా మేం కాపాడుకోగలమన్న నమ్మకం ఉంది.

శోభ said...

నరేష్‌గారూ.. మీ స్పందనకు ధన్యవాదాలు...

తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా మన ఒడిలోనే చనిపోవటం అంటే.. ఆ దుఃఖం ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఆ జ్ఞాపకం ఎంత బాధిస్తుందో అర్థం చేసుకోగలను.

మా నాన్నగారు బ్రతికున్న రోజుల్లో ఓసారి నన్ను చూసేందుకు వచ్చారు. నాన్నతోపాటు అమ్మ, తాతయ్య కూడా వచ్చారు. టిఫిన్ పెట్టాను. కబుర్లు చెబుతూ తింటున్నారు. కాసేపయ్యాక మా నాన్నకు ఫిట్స్ వచ్చాయి. అంతకు ముందు కూడా తరచుగా వచ్చేవట. ఆ విషయం నాకు తెలియదు. నా కళ్లముందే ఆయన అలా కొట్టుకుంటుంటే, ఎంతలా బెదిరిపోయాను. గట్టిగా ఏడుస్తూ, పక్కింటి వాళ్లను పిలిచి, వాళ్ల సాయంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దించి ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాను.

ఆ క్షణంలో నేను ఎంత నరకయాతన అనుభవించానో.. ఆ ఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ కూడా తట్టుకోలేను. నా ప్రాణమే పోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఆ తరువాత రోజు చుట్టుపక్కల వాళ్లంతా మా ఆయనతో... మీ మామగారికి ఫిట్స్ వచ్చి పడిన బాధకంటే, ఆ అమ్మాయి పడిన ఆరాటం, ఏడ్చిన ఏడుపు అంతా ఇంతా కాదు అని చెప్పారట.

ఫిట్స్ వచ్చి, మళ్లీ కోలుకున్న నాన్న గురించే నేను అంతలా కుమిలిపోతే... మీ ఒడిలోనే తలపెట్టుకుని ఆఖరి శ్వాస తీసుకున్న మీ అమ్మగారి మరణం మిమ్మల్ని ఎంతలా కదిల్చివేసిందో...

మీరు చెప్పినట్లు... మనకు ప్రియమైనవాళ్లు భౌతికంగా మనముందు లేకపోయినా, మన మనసుల్లో, మన జ్ఞాపకాల్లో సదా జీవించే ఉంటారు..

మీ అమ్మగారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

kaartoon.wordpress.com said...

మీ నాన్నగారి గురించి మీరు చెప్పిన మాటలు , నేపధ్యంలొ వచ్చిన ఓ నాన్న పాట నన్ను మైమరిపించింది. ఏమని వ్రాయను, మాటలు రావటంలేదు. మన్నించు,

శోభ said...

అప్పారావు అంకుల్.. ఎవరికైనా మాటలు కరువయ్యే పరిస్థితి.. నేను అర్థం చేసుకోగలను..

మీ సహానుభూతికి ధన్యవాదములు...

SRRao said...

శోభమ్మా !
చదివి చాలాకాలమైనా వెంటనే స్పందించలేకపోయాను. ఓదార్చడం కష్టం కాదని, నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఎదుటివారి బాధను తాత్కాలికంగానైనా తగ్గించడం మన బాధ్యత అని ఇన్నాళ్లూ అనుకుంటూ వుండేవాడిని. కానీ మొదటిసారి మనసు మూగవోయింది.
నిజంగా ఇంతటి అభిమానాన్ని సంపాదించుకుని వెళ్ళిపోయిన నాన్నగారు ధన్యులు. ఆయన్ని ఇప్పటికీ గుండెలో గుడి కట్టి ఆరాధిస్తున్న మీరందరూ అభినందనీయులు. నీ జ్ఞాపకాలలో ఆయన ఎప్పటికీ నిలిచే వుంటారు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా వుండడం పై లోకాలలో వున్న ఆయన్ని కూడా సంతోషపెడుతుందమ్మా !

శోభ said...

బాబాయ్...

మనసు మూగవోయింది.... చాలామంది మిత్రులు ఇదే మాటన్నారు. ఈ లోకంలోకి తీసుకొచ్చింది అమ్మ అయితే, వేలు పట్టి ఈ ప్రపంచాన్ని చూపింది మాత్రం నాన్నే. అలాంటి నాన్న దూరమైన ప్రతిఒక్కరి పరిస్థితీ ఇదే.

నాన్న దూరమైనా, నేను సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించే మీలాంటి ఆత్మీయుల దీవెనల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. మీ అందరి దీవెనలే నన్ను ముందుకు నడిపిస్తాయి.

Anonymous said...

Maatalu ravatledu shobha garu .,

శోభ said...

@ అనానిమస్ గారూ..

మాటలురాక మూగబోవడం... నేను అర్థం చేసుకోగలను..