Pages

Wednesday 10 July 2013

"ప్రియ జన్మం" శిరాకదంబంలో...!!



"ప్రియ జన్మం" కథ గురించి సాయిపద్మగారి పరిచయం...

ప్రతీ ప్రశ్నా అడిగేందుకు చిన్నదే.. అది రేపిన కలకలం మాత్రం జీవితాంతం ఉంటుంది . ఏ సమాధానం అయినా కేవలం రాజీ ప్రయత్నం అనిపించినపుడు, అది మరింత రెట్టింపు అవుతుంది.కొంత మంది మనుషులు, వాళ్ళ కధలు మనం మరచిపోయిన కొన్ని ఐడెంటిటీ ప్రశ్నలని వెలికి తీస్తాయి. ఒక చిన్న మనసులో , తన జన్మ మీద , జన్మదినం గుర్తుపెట్టుకోలేని తల్లి తండ్రుల మీద రేగిన ఒక గారాల అసహనం .. శోభారాజు గారి "ప్రియ జన్మం" ఈ శిరాకదంబం సంచికలో...

చిన్నపిల్లల్లో ఉండే స్వచ్చత మనసు నిండా నింపుకున్న వ్యక్తి శోభ. ఇలాగే మరిన్ని మంచి కధలు రాయాలని ఆశిస్తూ ..!! వీలు చేసుకొని తప్పకుండా చదవండి ..!

శోభారాజు కథ 'ప్రియజన్మము' www.sirakadambam.com 02_033 సంచిక 37వ పేజీలో...

***********************************************************

సూర్యుడు ఒంటినిండా ముదురు ఎర్రని రంగు పులుముకుని కొండలమాటుకెళ్తూ వెళ్తూ చిక్కని చీకటిని లోకానికిచ్చి మళ్లీ పొద్దున్నే వస్తాగా అన్నట్టు వెళ్లిపోయాడు.

చీకటమ్మ రాకముందే గూళ్లకు చేరుకోవాలని పక్షులన్నీ గబగబా బారులు తీరాయి.

పొద్దుట్నుంచీ అలుపూ సొలుపూ లేకుండా పనిచేస్తున్నప్పటికీ... పిల్లలేం చేస్తున్నారన్న దిగులు వీడని శీనయ్య దంపతులు అంతే వడి వడిగా పరుగులాంటి నడకతో ఇంటికి చేరుకున్నారు.

వచ్చీ రాంగానే... అమ్మా, నాయినా అంటూ కాళ్లకు చుట్టుకున్న పిల్లల్ని చూడగానే పొద్దుట్నుంచీ పడ్డ కష్టం అంతా చిటికెలో మర్చిపోయారు. అదే ఊపులో పిల్లలకి కబుర్లు చెబుతూ నాయనా... వంటచేస్తూ అమ్మ....

కబుర్లు సాల్లే..

అమ్మ వంట చేసేలోపు కాసేపు సదువుకోండర్రా... అన్న నాయిన మాటతో బుద్ధిగా పుస్తకాలు పట్టుకుని కిరోసిన్ బుడ్డీ వెలుగులో కూర్చుని చదువసాగారు.

కాసేపట్లోనే పెద్దోడు, సిన్నోడు గురక పెడుతుంటే... వాళ్లకి తాళం వేస్తున్నట్టు నాయినా గురక రాగం తీస్తుంటే...

పాపం చిన్నారి ప్రియ మాత్రం బుడ్డీ వెలుతుర్లో ఊగీ ఊగీ చదువుతోంది. వాళ్లమ్మ కట్టెల పొయ్యి ఊదీ ఊదీ వంట చేస్తోంది.

ఊరి చివరి ఇల్లు కావడంతో... ప్రియ గొంతు తప్ప మరేం వినిపించటం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది.

చదివీ చదివీ నిద్ర ముంచుకొస్తుంటే ఆవులిస్తున్న ప్రియ... అయ్యో అని కాస్త గట్టిగానే అంది. ఉలిక్కిపడిన తల్లి.. ఏమ్మా... ఏమైందంటే ఏం లేదని మళ్లీ ఊగటం మొదలెట్టింది.

కిరోసిన్ బుడ్డీ వెలుతురికి చుట్టూ చేరి వేడి తట్టుకోలేక చచ్చి పడుతున్న చిన్న చిన్న పురుగుల్ని చూసి అయ్యో అన్నానంటే.. ఏం పిచ్చిపిల్లవే నువ్వు అని అమ్మ నవ్వుతుందని ఇందాక చెప్పలేదు.

ఆ పురుగులు చచ్చిపోవటం ఇష్టంలేని ఆ అమ్మాయి తన చిన్ని చేతితో పురుగుల్ని తోలుతూ, ఆవులిస్తూ బలవంతంగా నిద్రను ఆపుకుంటూ కూర్చుంది.

ఈ లోగా వంట పూర్తికాగానే తండ్రీ కొడుకుల్ని నిద్రలేపిన తల్లి అందరికీ వడ్డించి, తాను తిని.. అందరికీ పక్కలేసి పడుకోబెట్టింది.

నిద్ర రాని ప్రియ.. అమ్మ ఇంకా పడుకోలేదేం అని చూస్తే.. నిద్ర పోకుండా బుడ్డీ వెలుతుర్లో చిరిగిన బట్టలకి చాలా జాగ్రత్తగా కుట్లు వేసి... కుట్టిన బట్టల్ని జాగ్రత్తగా మడిచి దిండుకింద పెట్టుకుని పడుకుంటోంది.. అమ్మెందుకిలా చేస్తోందబ్బా... ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది.

పొద్దున్నే లేచి బడికి తయారవుతున్నప్పుడు అమ్మ ఇచ్చిన యూనిఫాం జత చూడగానే.. చిరుగులు కనిపించకుండా జాగ్రత్తగా కుట్టి.. చక్కగా ఇస్త్రీ చేసినట్లున్నాయి. అమ్మ బట్టలు మడిచి తలకింద ఎందుకు పెట్టుకుందో అప్పుడు అర్థమైంది. హుషారుగా తమ్ముళ్లతోపాటు బడికి బయల్దేరింది. 
తమ్ముళ్లను వాళ్ల క్లాసుల్లో వదిలిపెట్టి తన క్లాసుకు వెళ్లిపోయింది.

ఆ రోజు శుక్రవారం. తెలుగు పీరియడ్ జరుగుతోంది. రోజూ అందరూ యూనిఫారాలు వేసుకుని వచ్చేవాళ్లు. ఇవ్వాళ కూడా అందరూ యూనిఫారంలో ఉన్నా.. దివ్య మాత్రం కొత్త బట్టలతో వెలిగిపోతోంది. చూడగానే ప్రియకి అర్థమైంది. ఓహో ఇవ్వాళ తన పుట్టిన రోజన్నమాట. చిన్నప్పటినుంచీ ప్రతి క్లాసులోనూ చాలామంది పుట్టినరోజులంటూ కొత్త బట్టలు వేసుకుని, చాక్లెట్లూ, స్వీట్లూ పంచిపెడుతున్నది చూస్తోంది కాబట్టి ఇవ్వాళ కూడా చూడగానే అర్థం చేసుకుంది.

మనసంతా దిగులు నిండిపోగా... వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పాఠం వినసాగింది. దివ్య పుట్టిన రోజు చేసుకుంటే తనకెందుకు ఏడుపు...? ఏదో కారణం ఉండే ఉంటుంది.. ఏంటది..?

ఒకటో తరగతి నుంచీ 5వ తరగతికి వచ్చినా ప్రియ ఒక్కసారి కూడా పుట్టిన రోజు చేసుకోలేదు. క్లాసులోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున... పుట్టిన రోజు అంటూ చాక్లెట్లు, కొత్త బట్టలతో వచ్చేవాళ్లు.

ఏయ్ ప్రియా.... నీ పుట్టిన రోజు ఎప్పుడు అని అడిగేవాళ్లు. ఏం చెప్పాలో తెలీక, ఎప్పట్లాగే ఓ నవ్వు నవ్వి... మేం పుట్టిన రోజులు అవీ చేసుకోం అనేసేది.

కానీ నిజం తనకి మాత్రమే తెలుసు. ఏంటా నిజం... నీ పుట్టిన రోజు ఎప్పుడు అని ఎవరు ఎంతగా అడిగినా ఆమె చెప్పలేదు. ఎందుకంటే తన పుట్టిన రోజు ఎప్పుడో తనకి తెలీదు కాబట్టి. అసలు తన పుట్టిన రోజే కాదు.. తన తమ్ముళ్లిద్దరి పుట్టిన రోజులు కూడా తనకి తెలీవు. తనకే కాదు ఎవరికీ తెలీవు. అమ్మా నాన్నలకి కూడా తెలీదా అయితే అని అడిగారంటే.. వాళ్లకి కూడా తెలీదు.. అదేంటి అంటే.. అదంతే...

ఇవ్వాళ ఎలాగైనా సరే అమ్మని, నాయన్ని అడగాలి. అందరూ పుట్టిన రోజులు చేసుకుంటున్నారు.. మా పుట్టిన రోజులు ఎప్పుడని..

ఇంతకుముందు ఎన్నోసార్లు అడిగినా చెప్పలేనివాళ్లు ఇప్పుడు చెబుతారా అన్న సందేహం ఆ చిన్ని మనసులో లేకపోలేదు.. అయినా సరే అడగాలి. గట్టిగా నిర్ణయించేసుకుంది.

వాడిపోయిన ముఖాలతో ఉస్సూరని ఇంటికి వచ్చిన అమ్మానాన్నలు... పిల్లల్ని చూడగానే ఒక్కసారిగా ముఖమంతా సంతోషం పులుముకుని పొదివి పట్టుకున్నారు. ఎప్పట్లా అలసట పారిపోగా... ఉత్సాహంతో పిల్లలకి కథలు చెబుతూ నాయినా, వంటచేస్తూ అమ్మ...

కథ వింటూ వింటూ మధ్యలో ఏదో గుర్తొచ్చినదానిలా మెల్లిగా లేచి అమ్మ దగ్గరికి చేరింది ప్రియ.

మా.. మా... అంది.

ఏం తల్లీ.. ఏం కావాలి...

మరీ.. మరీ... అంటూ గొణుక్కుంటూ కూర్చుంది.

గొణుగుడు ఏంటే... ఏంకావాలమ్మా...?

మా క్లాసులో అందరూ పుట్టిన రోజులు చేసుకుంటున్నారు.. మేమూ చేసుకోవాలి కదమ్మా... మేము ఎప్పుడు పుట్టాం... అమ్మ కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగింది.

ఓస్.. ఇదా.. ఎప్పుడూ ఇలాగే అడుగుతావ్. మాకేం తెలుసు తల్లీ. ముగ్గురూ శనివారం రోజే పుట్టారు. నువ్వు సాయంత్రం 4 గంటలకు, పెద్దోడు పొద్దున్నే 6 గంటలకు, చిన్నోడు మధ్యాహ్నం 2 గంటలకు పుట్టారు అంది.

అది కాదమ్మా.. ఏ సంవత్సరంలో, ఏ తేదీలో పుట్టాం...?

అవన్నీ నాకేం తెలుసు తల్లీ. సమత్సరము, తేదీ అంటే ఏంది... ప్రియనే ఎదురు ప్రశ్నించటంతో... ఏం చేయాలో తెలీక బిక్కమొహం వేసింది.

అమ్మా, నాయనా చదువుకోలేదు కాబట్టి వాళ్లకి తెలీదని అర్థం చేసుకుంది. ఇప్పుడెలా అందరికీ పుట్టిన రోజులున్నాయి. మాకు ఉన్నాయి.. కానీ తెలీదు. చాలా బాధగా అనిపించింది... ఏడుస్తూనే నిద్రపోయింది.

పొద్దున్నే బడికి వెళ్తుంటే మళ్లీ పుట్టిన రోజు సంగతి గుర్తుకొచ్చింది ప్రియకి. అమ్మా, నాయినా చదువుకోలేదు సరే... మామ చదువుకున్నాడు కదా.. మామ రాసి ఉంటాడేమో....?!!

ఆ ఆలోచన రాగానే సంతోషం పట్టలేకపోయింది. ఆ రోజు ఉత్సాహంగా బడికి వెళ్లింది. బళ్లో అందరికీ... నేను కూడా పుట్టిన రోజు చేసుకుంటాను తెలుసా...?! అంటూ చెప్పుకుంది. అలాగా... నీ పుట్టిన రోజు ఎప్పుడు ప్రియా... అని ఫ్రెండ్స్ అడిగితే... మా మామని అడిగి చెబుతానే..! కళ్లింతవి చేసుకుంటూ చెప్పి తుర్రుమంది.

ఆర్నెల్లకో, సంవత్సరానికో ఓసారి ఇలా కనిపించి అలా మాయమయ్యే మామ కోసం... ఆ రోజు నుంచీ ఎదురుచూపులు... ఓ రోజు అనుకోకుండా ఇంటికి వచ్చాడు. 

ఉద్యోగం చేసే మామ అంటే అమ్మకీ, నాయనకీ... బంధువులందరికీ కాస్త భయం. ఉజ్జోగస్తుడనో, లేకపోతే తనకంటే పెద్దవాడనో అమ్మ ఆయనతో ఏం చెప్పాలన్నా, ఏం మాట్లాడాలన్నా భయపడేది.

ఎంతగా భయమున్నా సరే... పుట్టిన రోజు సంగతి అడగకపోతే ఊరుకునేది లేదని అమ్మకి హెచ్చరిక చేసి... రెడీ చేసి పెట్టింది ప్రియ.

అమ్మ వాళ్లన్నని చూడగానే.. కుశల ప్రశ్నలు అడిగాక... కాస్తంత భయం భయంగానే... నా... ఓన్నా... అంది.

ఏంది మే... ఏం మాట్లాడాలా...

మరీ.. మరీ... పిల్లోళ్ల పుట్టిన రోజులు అంట... నువ్వేమైనా రాసి పెట్టావా...?

ఏమ్మే.. ఇప్పుడేం వాటికి అవసరమొచ్చింది. రాసి పెట్టాలే....ఎక్కడో ఉన్నాయి.

అది కాదన్నా... పిల్లలు బల్లో అందరూ పుట్టిన రోజులు చేసుకుంటున్నారట... వాళ్ల పుట్టిన రోజులు ఎప్పుడని ఒకటే సతాయింపు.

ఆ ఏడ్చార్లే.. తినేదానికి తిండి లేదుగానీ.. పుట్టిన రోజులు వచ్చాయి....

కోపంగా మాట్లాడుతున్న మామపై అమ్మ కొంగు చాటునుంచి భయంగా చూస్తున్న ప్రియకి ఆ రోజు నుంచి ద్వేషం, కోపం మొదలయ్యాయి.

మామ చెప్పేస్తాడనే నమ్మకంతో బల్లో అందరికీ చెప్పేశానే... ఇప్పుడేమో ఈయన చెప్పటం లే.. పుట్టిన రోజు ఇంగ తెలుసుకోనేలేనా...

నాయినమ్మ, అమ్మమ్మ, తాతలు, చిన్నాయిన, చిన్నమ్మ, అత్త, మామ... ఎవరిని అడిగినా ఒకటే మాట.. ఇయ్యన్నీ మాకెలా తెలుసుమే... మీ మామనే అడగ్గూడదూ... అని..

అందాసుగా నీకు ఇన్నేళ్లు అని చెబుతున్నారేగానీ.. ఖచ్చితమైన తేదీ, సంవత్సరం చెప్పలేకపోతున్నారు.

నా పుట్టిన రోజు ఎప్పుడో తెలుసుకోవడం ఇంత కష్టమా... కంట్లో నీళ్లు చిప్పిలుతుండగా, ఎలాగైనా సరే తెలుసుకుని తీరాలి... ఎప్పట్లా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది.

ప్రతి యేడూ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాసులోకి మారుతున్నా.. కావాల్సిన సమాచారాన్నంతా టీచర్లే పూర్తి చేసి నాన్నతో వేలిముద్ర వేయించుకోడం తనకి తెలుసు. అందుకే టీచర్లను ఎవరినైనా అడగాలంటే చచ్చేంత భయం. ఇది కూడా తెలీదా నీకు అని వాళ్లూ, తోటి పిల్లలూ నవ్వుతారన్న బెరుకు...

కాలం అలాగే గడవసాగింది... ఒక్కో క్లాస్ దాటుకుంటూ పదోక్లాసులోకి వచ్చేసింది...

మొత్తానికి హాల్ టికెట్లోనో లేదా మార్కుల లిస్టులోనో తన పుట్టిన రోజు, సంవత్సరం ఉండటం గమనించింది. అంతే ప్రియ సంతోషానికి అవధులు లేకపోయింది.

హమ్మయ్యా... ఇన్నాళ్లకు కాదు కాదు ఇన్నేళ్లకు తన పుట్టిన రోజు తెలుసుకోగలిగానని అనుకోగానే.. ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్. భద్రంగా రాసి పెట్టుకుంది.. తమ్ముళ్లవీ అలాగే రాసి పెట్టుకోవచ్చు అనుకుంది.

అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.

మా అమ్మా, నాన్నలకే తెలీని పుట్టిన రోజు, సంవత్సరం.. టీచర్లకు ఎలా తెలిసింది..? రిజస్టర్లలోకి ఆ వివరాలన్నీ ఎలా వచ్చాయి..?

అంతే కుదురుగా ఉండలేకపోయింది. ఎవరిని అడగాలి.. ఎలా తెలుసుకోవాలి...

తనతో కాస్తంత చనువుగా ఉండే రాజమ్మ మేడమ్ గుర్తుకొచ్చిందా క్షణంలో.. మరుక్షణం ఆమె ముందు ప్రత్యక్షమై... పదానికి పదానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా గడగడా అడిగింది.

బడిలో చేర్చుకునేటప్పుడు అక్కడి టీచర్లు నీ వివరాలన్నీ మీ పెద్దోళ్లను అడిగి ఉంటారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం అందాసుగా వాళ్లు రాసుకుని ఉంటారు. అంతేగానీ ఇవే ఖచ్చితమైన పుట్టినరోజు, సంవత్సరం కాకపోవచ్చని చావు కబురు చల్లగా చెప్పింది మేడమ్.

అయ్యో.. అంటూ చతికిలబడిన ప్రియ సమస్య మళ్లీ మొదటికి...

తెలుసుకునే మార్గం ఎలా...? అందాసుగా అని మేడమ్ అన్న సంగతి గుర్తుకొచ్చింది. అంటే నేను పుట్టినప్పుడు జరిగినవి ఏమైనా అమ్మానాన్నలకి గుర్తు ఉంటే... అవెప్పుడు, ఏ సంవత్సరంలో జరిగాయో తెలుసుకోవచ్చుగా... ఆలోచన రాగానే మెల్లిగా పెదవులపై చిరునవ్వు దోబూచులాడింది.

ఇంటికెళ్లగానే... మ్మా... ఓమ్మా....

పిలుపూ, ఆ పిలుపులోని వేగం గమనించిన తల్లి నవ్వుతూ... "ఏమ్మా మళ్లీ పుట్టిన రోజు గొడవేనా..?!"

అమ్మ నవ్వుతూ అన్నా.. అదేం పట్టించుకోని ప్రియ చాలా సీరియస్‌గా.. "అదేం లేదు మా... మా స్కూళ్లో సార్‌లకి కూడా తెలీదంట.. పోనీలే.. ఇది చెప్పు.. నేను పుట్టినప్పుడుగానీ, పుట్టకముందుగానీ... ఏమైనా జరిగాయా...?"

మళ్లీ తనే అందుకుంటూ.. "పెద్ద పెద్ద విషయాలు.. మీరు బాగా భయపడి, బాధపడిపోయినవి" గుర్తుకు తెచ్చుకుని చెబుతావా...?!

ఏం జరిగాయబ్బా.... గుర్తుకు రావట్లేదే...

ఏమయ్యో.. ఇట్రా... నీకేమైనా గుర్తుకొస్తుందేమో కాసేపు ఆలోచించరాదూ...?!.. ఇద్దరూ చెరోవైపు ఆలోచనలో పడిపోయారు.

ఆ గుర్తొచ్చింది తల్లీ... నువ్వు సమత్సరం బిడ్డగా ఉన్నప్పుడు అదేదో స్కైలాబ్ పడుతుందనీ... ఈ పెపంచకం అంతా నాశనమైపోతుందని.. అందరూ చచ్చిపోతామని... ఏంటేంటో సెప్పారు... వణికిపోయాం.. పెపంచకమే ఉండకపోతే ఇంకెలా.. అమ్మో.. మాకేమైనా అవనీ... నా బిడ్డకేం కాకూడదు.. ఎట్లా ఏడ్చామో.. ఇదేమీ తెలీని నువ్వు బోసినవ్వులు నవ్వుతుంటే ఇంకా దుఃఖం ముంచుకొచ్చేది.

తెల్లారితే ఈ పెపంచకమే ఉండదని... మాకేమైనాగానీ.. నీకు ఏమీ కాకూడదని మా ఇద్దరి మధ్యలో నిన్ను పడుకోబెట్టుకుని...నిన్ను గట్టిగా పట్టుకుని మీయమ్మా నేనూ రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. పొద్దున్నే లేవగానే.. స్కైలాబ్ అదేదో సముద్రంలో పడిపోయిందని ప్రమాదం తప్పిందని రేడియో వార్తల్లో తెలిసాకగానీ.. మా పాణం కుదటపడలేదు తల్లీ... భారంగా ఊపిరితీసుకుంటూ నాన్న.

ఈ విషయం చెబుతున్న అమ్మానాన్నల బాధ, ఆరాటం వారి కళ్లలోనూ, మాటల్లో కనిపిస్తుంటే... మాటల్లేక మూగబోయింది. కాసేపటికిగానీ తేరుకోలేని ప్రియ..

స్కైలాబ్... ఇది ఎప్పుడు పడిందో తెల్సుకోవాలి. ఎలా..? మళ్లీ రాజమ్మ మేడమ్ ముందు ప్రత్యక్షమైంది.

స్కైలాబ్...... 1979, జూలై 11న కూలిపోయింది ప్రియా. నాకు బాగా గుర్తుంది.. స్కైలాబ్ కూలిపోతుందని తెలియగానే ఇక భూమిపై నూకలు లేవనుకున్నారు. గొర్రెలు, మేకలు, ఆస్తులు లాంటివి అమ్మేసుకున్నారు. పిల్లల్ని బడికి పంపలేదు. పిల్లా, జెల్లా అందరూ కలిసి చివరి క్షణాల కోసం భయం భయంగా ఎదురుచూశారు. చివరికి ఎలాంటి ఉపద్రవం లేకుండా.. దక్షిణ హిందూ మహా సముద్రంలో.. ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో స్కైలాబ్ కూలిపోయిందనే వార్త తెలిసింది. 2,310 కిలోల బరువున్న స్కైలాబ్ 500 ముక్కలుగా పేలిపోయిందట. 1973 మే 14న అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్ ఆరు సంవత్సరాల పాటు కక్ష్యలో ఉండిందని రేడియో వార్తల్లో, వార్తా పత్రికల్లో చదివాము... చెప్పుకుంటూ పోతోంది మేడమ్.

సో.. మార్కుల లిస్టులో ఉన్నట్లుగా నువ్వు 1978లో పుట్టావన్నది ఖచ్చితంగా అర్థమవుతోంది.. ఇక పుట్టిన రోజే తెలియాలి. అది రాసి పెట్టిన మీ మామ చెబితేగానీ తెలీదు. ఆయన్నే అడిగి తెలుసుకో... పుట్టిన రోజు కోసం మరీ ఇంతగా పట్టుబట్టి తెలుసుకోవాలా పిచ్చిపిల్లా.. చనువుకొద్దీ నవ్వుతూ అందామె. ఆమెతో జతకలిపిన ప్రియ భారంగా అక్కడ్నించీ కదిలింది.

పుట్టిన రోజు తెలుసుకోవడం ఇంత కష్టమా... చాలా బాధగా, ఎవరిపైనో కోపంగా ఉంది ప్రియకి.

తన కోపం ఎవరిపైన...? చదువుకోని అమ్మా,నాన్నల మీదనా.. లేక చదువుకుని... రాసిపెట్టి కూడా చెప్పకుండా ఉన్న ఆ పెద్ద మనిషిపైనా... తెలీదు కాని.. బాగా కోపంగా ఉంది.

చదువుకుని ఉద్యోగస్తుడిగా ఉన్నా.. చదువుల్లో ఎలాంటి గైడెన్సూ ఇవ్వకలేకపోయిన మామ పెద్దరికం, గాంభీర్యానికి ఇక తామందరం భయపడటంలో అర్థం లేదనిపించింది. ఇప్పుడు చిన్నపిల్లనేంకాను.. పెద్దదాన్ని అయ్యాగా.. ఈసారి రానీ మామని అడిగేస్తాను గట్టిగా నిర్ణయించుకుంది.

కొన్నాళ్లకే... గంగమ్మ జాతరకి కుటుంబంతో సహా దిగిన మామని గట్టిగా నిలదీసింది ప్రియ. మీ పిల్లలకైతే పుట్టిన రోజులు రాసిపెట్టి.. సంవత్సరం సంవత్సరం పుట్టిన రోజులు చేస్తారు. మా పుట్టిన రోజులు మాత్రం చెప్పరు. మాయమ్మా, నాయనకి చదువొచ్చింటే మాకీ పరిస్థితి వచ్చేది కాదు. రాసిపెట్టినా నువ్వెందుకు చెప్పటంలేదు. ఎప్పడు అడిగినా ఏదో ఒకటి చెప్పి మా నోరు మూస్తావేగానీ చెప్పవెందుకు మామా.... వసపిట్టలా ఆగకుండా మాట్లాడుతున్న ప్రియని చూసి నోరెళ్లబెట్టాడాయన.

అది ఎన్నేళ్లనుంచీ అడుగుతోంది.. ఇప్పడైనా సెప్పున్నా.... అమ్మ ప్రియకి జతకలిసింది.

అది కాదు మే..... మరీ.. మరీ... రాసిపెట్టానుగానీ... ఏదో పుస్తకంలో రాశాను.. అదెక్కడపోయిందో కనిపించటంలేదు..... తేదీ గుర్తులేదుగానీ... సంవత్సరం మాత్రం గుర్తుంది... 78 అనుకుంటా..... పేద్ద రహస్యాన్ని బద్ధలుకొట్టినట్లు నిశ్శబ్దం ఆ ఇంట్లో కాసేపు.

ప్రియకు ఏడుపు ఆగలేదు. మేమూ తన పిల్లల్లా కాదా.. మేమంటే అంత నిర్లక్ష్యమా... అదే మా అమ్మా, నాన్నా చదువుకుని ఉంటే... అంతే కళ్లు నిండిపోయాయి... మామపై ఓ చూపు విసిరేసి అక్కడ్నించీ కదిలింది.

మొత్తానికి తన పుట్టినరోజు ఓ పెద్ద సమస్యై కూర్చుంది. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. మొత్తానికి ఖచ్చితమైన తేదీ తెలీకపోయినా.. స్కైలాబ్ సంఘటనతో సంవత్సరం మాత్రం తెలుస్తోంది. ఇది చాలదా...?!

ఈ ప్రపంచం అంతా నాశనమైపోతుందని భయపడి.. ఎలాంటి ఉపద్రవాలూ లేకుండా అందరూ ప్రాణాలతో బయటపడిన ఆ రోజునే పుట్టిన రోజుగా నేను ఎందుకు చేసుకోకూడదు..?!.. ఇలా చేసుకుంటే ఏం... కాసేపటికిగానీ ఆలోచనల్లోంచి తేరుకోలేని ప్రియ..

ఓ స్థిరమైన అభిప్రాయంతో... మామనే కాదు.. ఇంకెవరినీ ఈ విషయంలో అడగాల్సిన పనిలేదు... మనసులోనే అనుకుంది.

కోట్లాది మందికి పునర్జర్మ లభించిన ఆరోజునే నా పుట్టిన రోజు.. ఇందులో మార్పేమీ లేదు.

నిద్రలోంచి హాయిగా మేల్కొంటూ కళ్లు తెరిచిన ప్రతిరోజూ ఓ పుట్టిన రోజే కదా.. ఈ సత్యం తెలిసేందుకు నాకు ఇన్నాళ్లు పట్టిందా...?! ఇప్పటికైనా తెలిసిందిగా.

చాన్నాళ్ల తర్వాత హాయిగా నిద్రపోయిందామె...

మరో పుట్టినరోజుకు సిద్ధమౌతూ....

జీవితం నాకు ఏమిచ్చింది అనేకన్నా... జీవితం నాకు జీవించడం నేర్పింది... ఇంతకంటే ఇంకేం కావాలి... తృప్తిగా సాగిపోవడం మినహా...!!