Pages

Wednesday 23 November 2011

రెండేళ్లు గడిచిపోయాయి... ఇంకా ఎన్నేళ్లో ఇలా...!!"నువ్వు ఓ జ్ఞాపకానివా?
కాదు
నిజానివి...
జ్ఞాపకాలతో ఊపిరి పోస్తున్నావు
అందుకే నువ్వు నిజానివి"

ఈ మధ్య మావూరికి బస్‌లో వెళ్తుంటే అప్రయత్నంగా నా కళ్లు ఓ చోటికి పరిగెత్తాయి. కనురెప్ప పాటులో ఆ చోటు కళ్లముందు నుంచి దూరమైంది. కానీ నా ఆలోచనలు మాత్రం ఎక్కడికో వెళ్లిపోయాయి. ఎందుకంటే మా నాన్న మాకు దూరమైంది ఇందాక చూసిన ఆ చోటు నుంచే. అందుకే అప్పటినుంచీ ఆ చోటును చూస్తే తట్టుకోలేనని ఆ దార్లో వెళ్తున్న ప్రతిసారీ కళ్లుమూసుకుని కూర్చొనేదాన్ని. అయితే ఈసారి మాత్రం అనుకోకుండా చూసేశాను.

అంతే.. నాన్న హాస్పిటల్‌‌లో చేరటం.. బాగా మాట్లాడుతూ ఉన్న మనిషికి వెంటిలేటర్లు పెట్టడం.. ఆపై మాట పడిపోవడం... స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అటూ, ఇటూ తీసుకెళ్లటం... లాంటివన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తొచ్చి పిచ్చిగా ఏడ్చేశాను. ఆ మాయదారి హాస్పిటల్ మా ఆయన్ని తీసుకెళ్లిపోయిందంటూ అమ్మ రోదించటం గుర్తొచ్చి, కళ్లు అలా వర్షిస్తూనే ఉన్నాయి. నాన్నగారి 2వ వర్ధంతి (నవంబర్ 7) జరిపేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరగటం యాదృచ్ఛికం.

నాన్న దూరమై అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ రెండేళ్లు ఎంత భారంగా గడిచాయో... ఇంకా ఎన్నేళ్లు ఇలా గడపాలోనని ఒకటే ఆవేదన. ఈ రెండేళ్లలో నాన్న ఉన్నప్పటి పరిస్థితికీ, ఆయన లేనప్పటి పరిస్థితికీ చాలా స్పష్టమైన తేడా. బాధలోను, సంతోషంలోను, కష్ట సుఖాల్లోనూ.. ఇలా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా చాలా వెలితి. నాన్న లేరన్న వెలితి. ఆయనే ఉంటే.. ఇలా చేసేవారు, అలా చేసేవారు.. అనని రోజు లేదు.


ముఖ్యంగా అమ్మ ముఖంలో ఎప్పుడూ వెలితే. పిల్లల్లోనే మా ఆయన్ని చూసుకుని రోజులు గడిపేస్తున్నానని ఆమె మా బంధువులతో చెబుతున్నప్పటికీ తన ముఖంలో నాన్న లేని వెలితి. అది ఎప్పటికీ తీరేది కాదు.. అది ఆమెకూ, మాకూ అందరికీ తెలిసిందే. అయినా నాన్నకోసం, ఆయన ప్రేమ కోసం మా జీవితాల్లో తపన ఆగదు.

నాన్న రెండో వర్ధంతి రోజున తన సమాధి వద్దకు వెళ్తున్నప్పుడు ఒకాయన మాకు ఎదురుపడ్డాడు. ఆయనెవరో నాకు సరిగా గుర్తులేదు. కానీ మా అమ్మ, చిన్నాన్న, నానమ్మ గుర్తుపట్టి పలుకరించారు. ఆయన చాలా సంతోషంగా బదులిచ్చాడు. "అదిసరేగానీ ఏంటి అందరూ పూజ సామగ్రి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు. గుడికా..?" అని అడిగాడు. గుడికి కాదు, మావారి సమాధి వద్దకు వెళ్తున్నామని అమ్మ చెప్పింది. అంతే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆ మధ్య వయస్సు ఆయన అంతే పొగిలి పొగిలి ఏడ్చాడు. "నిజమా..? అన్న చనిపోయాడా..? ఇన్నాళ్లూ కనిపించకపోతే ఆయన అంగడి దగ్గర లేనప్పుడే నేను అక్కడికి వెళ్తున్నానేమో.. ఎప్పుడైనా ఇంటికెళ్లి పలుకరించి రావాలని అనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందా.. అంటూ ఒకటే ఏడుపు".

నాన్న పోయి రెండు సంవత్సరాల తరువాత కూడా తన కోసం ఏడ్చే మనుషులను సంపాదించుకున్న నాన్న మంచితనానికి లోలోపలే ఎంతగానో సంతోషించాను. నిజం చెప్పాలంటే మొదటి వర్ధంతి రోజున ఉన్న దుఃఖం ఇప్పుడు మాలో లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే ఇంకిపోయాయా అన్నట్టుగా మా కళ్లల్లో కన్నీటికి కొరత. అయినా భరించలేని బాధ మాత్రం ఉంటుంది. ఆయన లేరన్న నిజం ఎప్పుడూ గుండెల్ని పిండేస్తుంటుంది.
కానీ ఇన్నాళ్ల తరువాత కూడా ఆయన కోసం కళ్లనీళ్లు పెట్టుకునేవారు ఉన్నారని మాకు అప్పుడే తెలిసింది.

ఆ రోజు రాత్రే అమ్మతో నేను ఎవరమ్మా ఆయన నాన్న కోసం అంతలా ఏడ్చాడని అడిగితే.. వేరే ఊరికి చెందిన అతను మనకు బంధువేమీ కాదని, కేవలం పూల అంగడి దగ్గరకు పూలు కొనేందుకు వస్తుంటాడని అమ్మ చెప్పింది. ఆయనే కాదు, అంగడి దగ్గరకు చాలామంది వస్తుంటారనీ వాళ్లకు మీ నాన్న పోయిన సంగతే తెలియదని, ఇప్పటికీ నమ్మనే నమ్మరని.. ఆయన ఇంటి దగ్గర ఉండి ఉంటాడులే నువ్వు అబద్ధం చెబుతున్నావని నాతో వాదిస్తుంటారని అమ్మ చెప్పింది.

ఎవరైనా తెలిసినవాళ్లు పోయారంటే, అయ్యో.. అని బాధపడటం సహజం. కానీ ఏడుస్తున్నామంటే, వారితో మనకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని తెలుపుతుంది. మనుషులను సంపాదించుకోవటం, వారి మనసులను గెల్చుకోవటం నాన్నకున్న గొప్ప గుణం. అందుకేనేమో తనంటే అభిమానించేవారినే కాదు, ఏడ్చే వారిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆయనలా,, తన పిల్లలమైన మేము మా కోసం ఏడ్చే, మేము లేరని బాధపడే నలుగురినైనా సంపాదించుకోగలమా..? అనే సందేహం చాలాసార్లు వస్తుంటుంది నాకు.

నాన్న 2వ వర్థంతి రోజున... "మనకు ఉన్నంతలో పదిమందికి సాయం చేయాలని, అన్నార్తులను ఆదుకోవాలని ఎప్పుడూ చెప్పే ఆయన కోరిక మేరకు....." ఆ రోజున అన్నదానం చేశాం. రోజంతా ఆయన జ్ఞాపకాలతోనే గడిపేశాం. ఆయన మాతో కలిసి తీయించుకున్న ఫొటోలను డీవీడీగా రూపొందించి ఆ ఫొటోలను చూస్తూ, మధ్య మధ్యలో అమ్మ, నానమ్మ ఆయన గురించి చెప్పిన కబుర్లతో.. తీపి, చేదు జ్ఞాపకాలతో రోజును వెల్లదీశాం.


పిల్లలమైన మాకు కన్నీళ్లు ఇంకిపోయినా, అమ్మ కళ్లల్లో మాత్రం ఆ కన్నీటి పొర ఎప్పటికీ చెరగదని మాకు ఆ రోజే ఇంకా స్పష్టంగా అర్థమైంది. ఆయన గురించి తల్చుకుంటే చాలు ఆమె కళ్లు వర్షిస్తూనే ఉంటాయి. ఏడుస్తూనే జ్ఞాపకాలను చెప్పుకుంటూ వెళ్లేది.

అలాంటి జ్ఞాపకమే ఒకటి... "మాకు పెళ్లయిన కొత్తలో కూలిపనులు చేసి మీ నాన్న కూడబెట్టిన డబ్బుతో ఓ రేడియో కొన్నాం. అప్పట్లో రేడియో కొనటం అంటే చాలా గొప్ప. రేడియో కొన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఖాళీగా ఉన్నప్పుడే కాదు, కూలి పనులకు వెళ్లేటప్పుడు కూడా దాన్ని వెంట తీసుకెళ్లి పాటల్ని వినేవాళ్లం. పాటలు రాని టైంలో మిగతా ఏ ప్రోగ్రాములు వచ్చినా వినేవాళ్లం.


ముఖ్యంగా మీ నాన్నకు వార్తలంటే చాలా ఆసక్తి. వార్తలు వస్తున్న సమయంలో ఏమైనా చిన్న శబ్దం చేసినా సరే, భలే కోపగించుకునేవారు. ఓసారి వార్తలు వస్తున్న టైంలో గమనించకుండా ఏదో మాట్లాడినందుకు కొట్టేశారు కూడా. అందుకే వార్తలు వస్తున్నాయంటే నేను దూరంగా జరిగిపోతా.

రేడియోలో పాటలు వస్తుంటే భలే ఉత్సాహంగా వింటూ, పాడేవారు ఆయన. నాటికలు, జానపద గేయాలు ఇలా ఒకటేమిటి అన్నీ ఆసక్తిగా వినేవాళ్లం. ఇలా ఒకరోజు ఆయన నన్ను 'రేడియో కడపలో పెట్టు'. అని అన్నాడు. రేడియో వినటమేగానీ అందులో ఏయే స్టేషన్లు ఉంటాయో నాకు తెలీదు. అలాంటిది కడపలో పెట్టు అనే సరికి రేడియో తీసుకొచ్చి సరిగ్గా ఇంటిగడపలో పెట్టేశాను. (మావూరి యాసలో గడపను, కడప అని కూడా అనేవాళ్లు..).


అది చూసి మీ నాన్న పడి పడీ నవ్వారు. నాకు అర్థంకాక ఉడుక్కుంటుంటే రేడియోను కడప స్టేషన్‌లో పెట్టమని చెబితే, నువ్వేంటి గడపమాను మీద తెచ్చి పెట్టావు అని ఫకఫకా నవ్వుతూ చెప్పారు. ఆ స్టేషన్ల గోల నాకు అర్థం కాక నేను కూడా నవ్వాను" అంటూ అమ్మ సంతోషం, బాధ కలగలసిన గొంతుతో చెబుతుంటే కళ్లార్పకుండా ఆమెనే చూస్తూ, మేం పుట్టకముందు అమ్మా, నాన్న ఎలా ఉండేవాళ్లో ఊహించుకుంటూ ఎంతగా మురిసిపోయామో.... ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలో ఆమెకు.... మాక్కూడా...

ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమేనా..? ఇవి మా జీవితాలు.. అమ్మా, నాన్నలతో పెనవేసుకున్న తిరిగిరాని అనుభూతులు.

నాన్నా...!! నువ్వు దూరమై రెండేళ్లు కాదు... మరెంతకాలం గడిచినా... మేము ఉన్నంతవరకూ నువ్వూ మాతోనే జీవించి ఉంటావు. మేము లేకపోతేనే నువ్వూ మాయమయ్యేది.. దూరమయ్యేది.. మేమున్నంతవరకూ నువ్వు మృత్యుంజయుడవు. నీ చల్లని ఆశీర్వాదాలు ఉన్నంతవరకూ మేమూ చిరంజీవులమే...!!


(నాన్నగారి మొదటి వర్థంతి జ్ఞాపకాల కోసం ఇక్కడ చూడండి)

[2009 నవంబర్ 7వ తేదీన మాకు దూరమైన నాన్న గారి 2వ వర్థంతి సందర్భంగా ఆ రోజునే ఒక పోస్టు పెట్టాలని అనుకున్నా. కానీ ఇంటర్నెట్ ప్రాబ్లెంవల్ల కుదరలేదు. ఆ తరువాత వర్థంతి కార్యక్రమాల కోసం మావూరు వెళ్లటంవలన ఇప్పటిదాకా కుదరలేదు. అందుకే కాస్త ఆలస్యంగా పోస్టు చేయాల్సి వచ్చింది].