Pages

Wednesday, 12 December 2012

వెన్నెల పూదోటలో "సిరి"ఆఫీస్‌కు బయల్దేరిన మా ఆయనకు బాల్కనీలోంచి టాటా చెప్పేసి... హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ లోనికి వచ్చా.. ఒకటే హడావిడి మనిషి.. చేయాల్సిన పనులు కాస్త ఆలస్యం అయినా క్యారియర్‌పై అలిగేసి వెళ్తుంటారు మావారు అప్పడప్పుడూ  ఆరోజు పనులేమీ ఆలస్యం కాలేదు. అన్నీ సక్రమంగానే ఉండటంతో ప్రశాంతంగానే ఆఫీసుకి బయల్దేరారు. ఆ సంతోషంలో కాబోలు హమ్మయ్యా అనిపించింది.. 

బెడ్రూంలో, హాల్లో చిందర వందరగా పడి ఉన్న వస్తువుల్ని సర్దుతుంటే.. ఎక్కడినుంచో ఫోన్ రింగవుతున్న సౌండ్. అది మావారి ఫోన్ రింగ్ టోన్. కానీ ఆయన బయల్దేరేసారు కదా.. పక్కింటోళ్లదేమోనని నేను పట్టించుకోలేదు. కానీ ఫోన్ రింగవుతూనే ఉంది తీరా చూస్తే.. పేపర్ల కిందన మావారి ఫోన్.. అయ్యో.. ఈయన ఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారే.. ఇక నా పని గోవిందా అనుకున్నా.. 

చందమామ పిల్లల పత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న మావారికి చందమామ అభిమానులు, పాఠకులు, రచయితలు.. ఇలా ఎవరెవరో ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఉన్నారంటే మా చెవులు చిల్లులు పడాల్సిందే.. ఒకటే ఫోన్లే ఫోన్లు. ఇవ్వాళేమో ఆ ఫోన్ మర్చిపోయారు. ఫోన్ స్విచ్ఛాప్ చేయాలో, కాల్స్ అటెండ్ చేయాలో అర్థంకాని స్థితి....

ఫోన్ మళ్లీ మళ్లీ రింగవుతుంటే.. అది కూడా ఒకే నంబర్‌నుంచి.. పాపం ఎంత అవసరమో ఏంటో... ఫోన్ అటెండ్ చేసి విషయం చెప్పేస్తే సరిపోతుందని నిర్ణయించుకుని... "హలో.." అనగానే అవతలి నుంచి కూడా "హలో" అంటూ ఓ అమ్మాయి గొంతు.

"రాజు సర్" అనే మాట తననుంచి వచ్చిందో లేదో.. ఆ తరువాత తనకి ఛాన్స్ ఇవ్వకుండా... "అవర్ ఆఫీస్ కెలంబిటార్.. ఫోన్ వీట్‌లియే మరందటు పోయిటార్.. అవరోడ ఆఫీస్ నంబర్ వుంగలుక్కు తెరింజా.. అంద నంబర్‌కు కాల్ పన్నుంగ (ఆయన ఆఫీసుకు బయల్దేరేసారు. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్లిపోయారు... మీకు ఆయన ఆఫీస్ నంబర్ తెలిస్తే, ఆ నంబర్‌కు కాల్ చేయండి)" అంటూ గడగడా తమిళంలో మాట్లాడేసాను.

నా మాటల్ని చాలా ఓపికగా విన్న ఆ అమ్మాయి.. నమస్తే శోభగారు.. బాగున్నారా. రాజుగారి ద్వారా మీగురించి నాకు తెలుసు అంటూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడింది. నాకు షాక్.. అయ్యో.. తను ఏ భాషలో మాట్లాడుతోందో కూడా పట్టించుకోకుండా నా పాటికి నేను వాగేశానే అని నన్ను నేను కోపగించుకుంటూ.. కాసేపట్లో సర్దుకుని.. నవ్వుతూ.. అయ్యో మీరు తెలుగువారా.. నేను అదేమీ పట్టించుకోకుండా మాట్లాడేశాను.. సారీ మా.. అన్నా.

ఫర్వాలేదులెండి.. అంటూ తన గురించి, తను ఎందుకు కాల్ చేసింది చెప్పుకొచ్చింది. అలా నిమిషాలు కాస్త గంటకు దగ్గరపడ్డాయి. నిజంగా అప్పుడే పరిచయం అయిన వారితో అంతసేపు మాట్లాడటం అదే తొలిసారి నాకు. తను నా గురించి మావారి ద్వారా విందేమోగానీ, తనగురించి నాకు ఏమాత్రం తెలీదు. అయినా కూడా ఆ అమ్మాయి పరిచయం లేనిదిలా అనిపించలేదు. తను మాట్లాడుతుంటే బాగా తెలిసిన అమ్మాయి, ఓ పక్కింటమ్మాయి మాట్లాడినట్లు అనిపించిదేగానీ కొత్తగా అనిపించలేదు. ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ అడ్రస్సులు ఇచ్చిపుచ్చుకుని బై చెప్పుకున్నాం ఆ రోజుకి.

ఇలా మొదలైన మా స్నేహం.. మూడు ఫోన్లు, ఆరు మెసేజీలుగా వర్ధిల్లుతోంది ఇప్పటికీ... ఎప్పటికీ కూడానూ.. 

ఆ రోజు మావారు ఫోన్ మార్చిపోయిన సంగతి ఆఫీసుకెళ్లాక గుర్తుకుతెచ్చుకుని ఆఫీస్ ఫోన్ నుంచి కాల్ చేసి తనకి ఇప్పటిదాకా ఎవైనా కాల్స్ వచ్చాయా అని ఎంక్వైరీ చేసి, ఎవరైనా చేస్తే ఆఫీసు నంబరు ఇవ్వమని చెప్పారు. సో.. ఆ రోజంతా తన కాల్స్ అటెండ్ అవటం, నంబర్ ఇవ్వడంతోనే గడిచిపోయింది.

రాత్రి ఆయన ఇంటికి వచ్చాక... పొద్దున కాల్ చేసిన అమ్మాయి గురించి చెప్పాను. అలాగా అంటూ తన పనిలో మునిగిపోయిన ఆయన్ని కదిలించా.. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి వివరాలు చెప్పమని. కాస్త పనుంది తర్వాత చెబుతాలే అని ఆయన అంటే, అదేం కుదరదు ఇప్పుడే చెప్పమని పట్టుబట్టి తన గురించి కనుక్కున్నా...

ఆ అమ్మాయి పేరు శిరీష. అందరూ సిరి అంటుంటారు. తన వృత్తి డాక్టర్, ప్రవృతి రచయిత. రచయిత అనే మాట దగ్గరే ఆగిపోతే తన గురించిన మిగతా టాలెంట్స్ అన్నీ మరుగున పడిపోతాయి అనుకున్నారేమో ఆయన.. అలా చెప్పుకుంటూ పోయారు.

చాలా చిన్న వయసు. ఇంత చిన్న వయసులోనే ఆమె ఎంత టాలెంటెడ్ తెలుసా... కథలు, నవలలు, కవితలు, పాటలు రాస్తుంది, పాడుతుంది.. డ్యాన్సులు చేస్తుంది, మంచి మంచి సందేశాలతో షార్ట్ ఫిల్ములు తీస్తుంది.. ఇంటిపని, వంటపని ఇలా ఒకటేమిటి.. మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. తన గురించి వింటుంటే చాలా ముచ్చటేస్తుంది అన్నారు.

నిజం కదా.. అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను నేను. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి పట్టుంది. తెలుగు అంటే కూడా ప్రాణం తనకి.. నవలలు, కవితలు, కథలు కూడా ఈ భాషల్లో చాలా సులభంగా రాసేస్తుంటుంది. ఇప్పటిదాకా తను ఓ వెయ్యి కవితలు దాకా రాసిందట. అయితే ఏవో కొన్ని తప్పిస్తే ప్రచురణకు పంపినవి చాలా తక్కువట. కొన్ని కవితలు, కథలు పత్రికల్లో వచ్చాయట. చందమామకు కూడా కొన్ని కథలు రాసి పంపింది... చెప్పుకుంటూ పోతున్నారు ఆయన. నిజంగా చాలా గ్రేట్ కదా ఈ అమ్మాయి అని మనసులోనే అనుకుంటూ వింటూ కూర్చున్నా.

అది సరేగానీ.. ఇవ్వాళ తనెందుకు ఫోన్ చేసింది అని అడిగాను మావారిని. ఓస్.. అదా.. తను చిన్న పిల్లల కోసం కొన్ని కథలు రాసింది. ఆ కథలన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా అచ్చు వేయించే పనిలో బిజీగా ఉంది. ఆ పుస్తకానికి ముఖ చిత్రం కోసం శంకర్ (చందమామ కథలకు తన బొమ్మలతో ప్రాణం తెప్పించే తెలుగుజాతి గర్వపడే చిత్రకారుడు) గారిని సంప్రదించింది. అందుకు ఆయన సరేనన్నారు. తన పని ఎంతవరకూ వచ్చిందో కనుక్కునేందుకు తను ఫోన్ చేసిందిలే అన్నారు.

ఇక ఆ రోజునుంచి ఆ అమ్మాయికి తీరిక దొరికినా, నాకు తీరిక దొరికినా ఫోన్లు, మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు... నేను అండి అని మాట్లాడుతుంటే వారించే, మీ కంటే చిన్నదాన్ని కాబట్టి పేరుతో పిలవండని పట్టుబట్టి మరీ పేరుతో పిలిపించేసుకుంది. తనతో ఎప్పుడు మాట్లాడుతున్నా అస్సలు టైం తెలిసేది కాదు.. (ఇప్పుడు కూడా) చిన్న వయసులోనే ఎంత పరిణతో.. ప్రతి విషయంపైనా స్పష్టమైన ఆలోచన, తనదైన ముద్ర ఉంటుంది. ఎవరినైనా సరే తన లోకంలోకి లాక్కెళ్లిపోయేలా ఉంటాయి తన మాటలు, ఆలోచనలు, భావాలు.

తనతో మాట్లాడుతున్నంతసేపు ఎంతలా ఆశ్చర్యపోతుంటానో నేను. అసలు ఒక మనిషి ఇన్ని పనులు చేయటం ఎలా అని ఆశ్చర్యం. అదే అడిగేస్తే.. ఎంత హాయిగా నవ్వేస్తుందో.. తన మాటలాగే, తన నవ్వు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో చెప్పలేను. 

లేచింది మొదలు నిద్రపోయేదాకా ఏమేం చేస్తుంటుందో తెలిసాక నోరెళ్లబెట్టేశాను నిజంగానే ఓరోజు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా నిద్ర లేవగానే ఇంటిముందు కళ్లాపిజల్లి ముగ్గు వేయటం దగ్గర్నించి, ఇంటిపనులు, వంటపనులు, పూజ అన్నీ ముగించుకుని బయటపడి, క్లినిక్‌లో కేసులకు అటెండ్ అయి.. మధ్యలో మళ్లీ ఏవైనా పనులుంటే వాటిని చూసుకుని (డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్స్ వగైరాలు) సాయంత్రం ఇంటికి చేరుకున్నాక మళ్లీ ఇంటిపనులు అన్నీ ముగించి ఏ అర్థరాత్రికిగానో నిద్రపోదట. అందరూ తినేసి పడుకున్నాక తను కూర్చుని చదవటం, రాయటం లాంటి పనులు చేసుకుంటుందట.

ఏంటి నువ్వు... అలా చేస్తే ఎలా.. నిద్ర సరిపోదు కదా.. ఎందుకు అంతసేపు మేల్కోవడం అని ఓరోజు కోప్పడితే.. ఇన్నిపనులు చేయాలంటే టైం సరిపోవటం లేదు ఏం చేయను అని నవ్వేసింది. నాకు ఖాళీగా ఉండటం అంటే చిరాకు. ఏదో ఒక పని చేయకుండా ఏరోజైనా వృధాగా గడిచిపోతే చాలా బాధగా ఉంటుంది నాకు. అందుకే సాధ్యమైనంతవరకు అస్సలు ఖాళీగా ఉండను చెప్పుకుపోతోంది... నిజమేకదా అని... వింటూ ఉండటం నాకూ అలవాటే.

ఇన్నిపనులు చేస్తూ వంట కూడా నువ్వే చేయటం ఎందుకు, ఇంట్లోవాళ్లను చేయమనొచ్చుగా అంటే... వంట చేసాక, ఇంట్లోని అందరూ కూర్చుని హాయిగా తింటుంటే, చూడ్డానికి నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. అందుకే ఆ సంతోషం కోసం... ఓపిక ఉన్నా, లేకపోయినా వంట నేనే చేసేస్తుంటా అంటుంది ఎప్పట్లా నవ్వుతూ...ముఖ్యంగా మీతో చెప్పాల్సిందొకటి ఉంది. తను ఈ మధ్య చూపులేని అంధ విద్యార్థులు కొంతమందికి తనే డ్యాన్స్ కంపోజ్ చేసి, దగ్గరుండి ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయించి చిల్డ్రన్స్ డే సందర్భంగా గవర్నరు గారు పాల్గొన్న ఓ ప్రోగ్రాంలో వారిచే ప్రదర్శన ఇప్పించింది. ఈ పిల్లల డ్యాన్స్ ఆ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచిందని.. ఆ పిల్లల తల్లిదండ్రులు తనని చుట్టుముట్టి ఇప్పటిదాకా తమ పిల్లలకు ఏం ఇంట్రెస్ట్ ఉందో కూడా తెల్సుకోలేకపోయామంటూ కంటతడి పెట్టారని తను చెప్పినప్పుడు నా మనసంతా ఆమే నిండిపోయింది. నిజంగా చూపు సరిగా ఉండి చెబితే నేర్చుకోలేని పిల్లల్ని చాలామందినే చూస్తుంటాం. అలాంటిది ఏ మాత్రం చూపులేని పిల్లలకి డ్యాన్స్ నేర్పించటం అంటే మాటలు కాదు కదా.. అలాంటిది ఆమె సాధించింది. అది కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా (డబ్బు రూపంలో). రోజూ తన సొంత ఖర్చులతోనే గంటన్నర దూరం ప్రయాణించి పిల్లలకోసమే వెళ్లి, వాళ్లను సంతోషపెట్టేందుకే తను అలా చేసింది.

పసిపిల్లలు అంటే ప్రాణం ఇచ్చే ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడంతా చిన్నపిల్లలేనట. సిరి ఏదో మాయ చేసేస్తోంది అందుకే ఎవరిదగ్గరికీ రాని పిల్లలూ కూడా ఒక్క క్షణంలో తనకి దగ్గరైపోతుంటారని తన ఫ్రెండ్స్ అంతా కుళ్లుకుంటుంటారని నవ్వుతూ చెబుతుంటుంది. నాక్కూడా సహజంగా పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పగానే.. ఇక ఇద్దరం పిల్లల గురించిన కబుర్లే, కబుర్లు... నిజం చెప్పాలంటే, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లు ఎవరైనా సరే.. ఇలాంటి కూతురు, ఇలాంటి అక్క, ఇలాంటి స్నేహితురాలు, ఇలాంటి పక్కింటమ్మాయి ఉండాలని ఎవరైనా కోరుకునేంత మంచి మనసున్న మనిషి సిరి.

ఇంకా ఒకరినొకరం చూసుకోలేదుగానీ... సాహిత్యం గురించిన కబుర్లుతోపాటు చదివిన రచనలు, చదవాల్సినవి.. ఇతర పరిచయాలు, స్నేహాలు, చదువుకున్న రోజులు, చిన్ననాటి జ్ఞాపకాలు... ఒకరినుంచి ఒకరు నేర్చుకోవాల్సినవి, తెల్సుకోవాల్సినవి.... ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో కలబోసుకుంటూ స్వచ్ఛమైన స్నేహపు మధురిమలతో సాగుతోంది మా ప్రయాణం...

తన గురించి చెప్పాల్సింది చాలానే ఉంది. ఇంతకుమించి చెబితే నేనేదో గొప్ప కోసం చెప్పుకుంటున్నానని అనుకుంటారు కాబోలు. అయితే ఒక్కటి మాత్రం నిజ్జం. ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్ మాత్రమే చెబుతున్నా... ఇందులో అతిశయోక్తికి ఏ మాత్రం చోటు లేదు. తనతో స్నేహం చేస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.

ఇంతకీ.. సిరి గురించి మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ మధ్యనే తను రాసిన పుస్తకాలు మూడు అచ్చయ్యాయి. వాటిని మన బ్లాగ్లోకంలోని మిత్రులందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా మీ ముందుకు వచ్చాను... వీటిలో ఒకటి శంకర్ గారు ముఖచిత్రం వేసి ఇచ్చిన పుస్తకం "వెన్నెల పూదోట" (పిల్లల కథలు), రెండోది "ఎ గిఫ్ట్ కాల్డ్ లైఫ్" (ఇది పిల్లలకీ, పెద్దలకీ ఎవరికైనా పనికివచ్చేదే), మూడోది "ది లాస్ట్ మీల్ ఎట్ సాగరిక" (నవల).. చివరి రెండూ పేర్లు ఇంగ్లీషులో ఉన్నా.. తెలుగు పుస్తకాలే..                        

ఈ పుస్తకాలు మూడూ.. విశాలాంధ్ర బుక్‌ హౌస్, ప్రజాశక్తి బుక్‌ హౌస్, నవోదయ బుక్ హౌస్, శశిరామ్ పబ్లికేషన్స్‌ లలో దొరుకుతున్నాయి. ఆసక్తి కలిగిన బ్లాగు మిత్రులు ఈ వర్ధమాన రచయిత్రి రచనలను చదివి ప్రోత్సహించి మీ అభినందనలను, ఆశీస్సులను అందించాలని కోరుకుంటూ.. మీ కారుణ్య.