"ఏం కొడకా ఎప్పుడు చూసినా కొత్త బట్టలు వేసుకుని తిరగడమేనా? మాకేమైనా ఇచ్చేదుందా?" అన్న మాటలతో ఉలిక్కిపడి తిరిగి చూశా. ఎదురుగా కట్టెల మోపు దించి, గోడకు ఆనించి, ఆయాసంతో రొప్పుతూ నిల్చోనుంది ఆదెమ్మక్క. "అబ్బా... నువ్వా అక్కా.. ఎవరో అనుకుని కంగారు పడ్డాను అంటూ..." చేతికి నీళ్ల చెంబు అందించాను.
గడగడా నీళ్లు తాగేసి.. "ఇదిగో తల్లీ.. అమ్మ కట్టెలు తెమ్మని డబ్బు ఇచ్చింది. తెచ్చేశాను. ఇక వెళ్ళేదా అంటూ... ఏమ్మా... ఈసారైనా నా కూతురుకు ఓ పావడా గుడ్డ ఇచ్చేది ఉందా? లేదా?" అంది. "లేదక్కా.. ఈసారి తప్పకుండా ఇస్తాను. రాత్రి అమ్మ ఇంటికి రాగానే అడిగి తీసుకుంటాను. రేపు ఇంటికి రా.." అని చెప్పి పంపించేశాను.
ఆదెక్క ఓ దళిత మహిళ. ఆమె మా ఊర్లో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఎక్కడ్నించి, ఎలా వచ్చిందో ఏమో.. చిన్న వయసులోనే మా ఊరికి వచ్చేసింది. నా అనే వారు ఎవరూ లేకపోయినా, ఊర్లో వాళ్లు ఇచ్చే పావలా, అర్ధ సాయంతోనే పెరిగి పెద్దదైంది. ఇక ఆమె యుక్తవయసులోకి వచ్చేటప్పటికి, ఊర్లోని మగరాయుళ్లు... చూడ్డానికి ఓ మోస్తరుగా వయసులో ఉన్న ఆడది, ఏ ఆసరా లేనిది అయిన ఆమెను ఎలా చూడాలో అలాగే చూశారు. ఇది తప్పు అని ఆమెకు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఆమె కూడా అలాగే కొనసాగింది.
కొన్ని రోజుల తరువాత.. ఏ తోడులేని ఒక వయసు మళ్లిన పెద్దాయన ఆదెమ్మను చేరదీసి పెళ్లి చేసుకున్నాడు. ఊర్లోనే ఓ ఇంట్లో వాళ్ళు కాపురం పెట్టారు. ఇకమీదట బుద్ధిగా ఉండాలని నిర్ణయించుకున్న ఆమె కూలీ, నాలీ చేసుకుంటూ భర్తతో ఉండసాగింది. అయితే, ఆమెను తమ కామానికి వాడుకున్న మగరాయుళ్ళు మాత్రం తమ వద్దకు రావాలంటూ వేధించేవాళ్ళు. ఆ ముసలాడు నిన్నేం సుఖపెడతాడంటూ వాళ్ళు చేసే హేళనలకు, వెక్కిరింతలకు కొదవే లేదు. అన్నింటినీ ఆమె ఓర్చుకుంటూ తన దారిన సాగిపోయింది.
ఓ సంవత్సరం తరువాత ఆ ముసలాయన ద్వారా ఆదెమ్మ ఓ పాపకు జన్మనిచ్చింది. తన పాపకు ఆమె గిరిజ అని పేరు పెట్టుకుని ఉన్నంతలో అపురూపంగా చూసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే... నన్ను ఓ పావడా గుడ్డను ఇవ్వమని ఆదెక్క అడిగింది.
గిరిజ పెరిగి పెద్దదయ్యేకొద్దీ, గతంలో తనను చూసిన మగరాయుళ్లు అవే ఆకలి కళ్లతో తన కూతుర్ని కూడా చూడటాన్ని ఆదెమ్మ సహించలేక పోయేది. తన జీవితంలా కూతురి జీవితం పాడు కాకూడదని ఆమె బలంగా అనుకునేది. ఎవడైనా తమ ఇంటివద్దకు వచ్చి తోక జాడిస్తే... నోటితోనే కాకుండా, చేతితో కూడా ఆమె సమాధానం చెప్పేది.
ఎప్పుడూ ఆదెమ్మ చుట్టుప్రక్కల ఇళ్లవారితో.. "నా బ్రతుకు నా కూతురికి రాకూడదు. కూతురిని కాపాడుకునేందుకు చావనైనా చస్తానుగానీ, ఆ రొంపిలోకి దింపనని" చాలా సార్లు అంటుండేది కూడా...!
అదలా ఉంచితే... మరుసటిరోజు బోరింగ్ కాడికి మంచినీళ్లకోసం వచ్చింది ఆదెక్క. నేను కూడా అక్కడే ఉండటంతో... "అక్కా ఓసారి ఇంటికి వచ్చిపో..." అనేసి బిందె నింపుకుని ఇంటికెళ్లాను. నా వెనకే ఆమె కూడా వచ్చింది. "నీకు నచ్చితే తీసుకో, లేకుంటే ఈసారి కొత్త బట్టల జతే ఇస్తాను అని చెప్పి" ఓ కవర్ ఆమె చేతిలో పెట్టాను.
కవర్లో ఉన్న లంగా, జాకెట్, పైట సెట్టును చూసి సంతోషంతో... "బాగున్నాయి కొడకా... నా కూతురుకు ఇవి బాగుంటాయి కదా...! చల్లగా ఉండు తల్లీ..!" అనేసి వెళ్లిపోయింది. నేను కొన్నిరోజులపాటు వాడిన బట్టలను కూడా అంత ఆనందంగా కూతురు కోసం పట్టుకెళ్తోన్న ఆమె కంటే, ఆమెలోని అమ్మతనం నన్ను బాగా కదిలించి సన్నని నీటితెర నా కళ్లను కమ్మేసింది.
కొన్ని రోజుల తరువాత.. మా ఊర్లో గంగమ్మ తిరనాల జరుగుతోంది. ఆ తిరనాల సమయంలో ఒక రాత్రి, ఒక పగలు ఊరంతా కోలాహలంగా ఉంటుంది. ఆ రోజు కూడా ఎప్పట్లా రాత్రి గడచిపోయి, పొద్దున్నే తెల్లవారింది. ఏటిదాకా ఫ్రెండ్స్‌తో వెళ్ళిన మా తమ్ముళ్ళు గాబరాగా పరుగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమయ్యిందిరా అంటే.. "ఆదెమ్మక్కను ఎవరో చంపేసి నీళ్లలో పడేసారు" అని చెప్పారు.
అమ్మా, నాన్న రావద్దని వారిస్తున్నా వినకుండా అందరితో పాటు ఆదెక్కను చూసేందుకు వెళ్ళాను. ఏటి ఒడ్డున పొలాల్లో, ఓ నీటిమడుగులో బొక్కాబోర్లా పడిపోయి ఉందామె. కాస్త పక్కగా ఆమె కట్టుకున్న చీర... పువ్వులు... పగిలిపోయిన గాజు ముక్కలు... పెనుగులాడిన గుర్తులు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఎప్పుడు చూసినా అరే, కొడకా, తల్లీ అంటూ ప్రేమగా పిలిచే ఆదెమ్మక్కను అలా చూడగానే నాకు ఏడుపు ఆగలేదు. భోరుమని ఏడ్చేశాను. అన్నింటికంటే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ బాధించేది ఏంటంటే... ఆరోజు ఆదెమ్మక్క శవంగా తేలాడుతున్నప్పుడు ఒంటిపైనుండే జాకెట్, చీర లోపల కట్టుకున్న పావడా... "ఆమె నా దగ్గర కొట్లాడి మరీ కూతురు కోసం తీసుకుంది కదా.. అవే బట్టలతో ఆమెనలా చూడాల్సి రావడం..." ఇవన్నీ తల్చుకుంటే మనసు కలుక్కుమంటుంది.
పోలీసులు రావడం, పోస్ట్‌మార్టం చేసి ఆదెక్క శవాన్ని ఇవ్వడం జరిగిపోయాయి. అయితే చేతిలో చిల్లిగవ్వలేని ఆదెక్క భర్త, కూతురు ఏం చేస్తారు. ఊరి చివర గానుగ చింతమాను వద్ద శవాన్ని పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. ఆమె బ్రతికుండగా, ఆమె చేత ఎన్నో పనులు చేయించుకున్న ఊరి జనాలంతా... చూసి అయ్యో అన్నారే తప్ప.. ఆమె దహన సంస్కారాల కోసం పావలా సాయం కూడా చేయలేదు.
మా అమ్మా వాళ్లకు కూడా అప్పట్లో అంత స్తోమత లేదు. నేనేమో చిన్నదాన్ని చూస్తూ ఏడ్వటం తప్ప ఏమీ చేయలేకపోయాను. చివరకు పంచాయితీ వాళ్లే ఆదెక్క శవాన్ని పూడ్చిపెట్టారు. ఊర్లో వాళ్ళంతా తలా ఐదో, పదో వేసుకుని ఉంటే... ఆమె దహన సంస్కారాలు అయినా జరిగి ఉండేవి, ఆమె ఆత్మ శాంతించేది కదా...! కన్నీళ్లను కార్చిన జనాలకు కాస్తంత కనికరం కూడా లేకపోయిందే అని అనుకోని రోజు లేదంటే నమ్మండి.
ఆ తరువాత కాలంతో పాటు కదిలిపోయిన నేను... ఈ మధ్యనే మా ఊరికి వెళ్ళాను. ఎందుకోగానీ ఆదెక్క గుర్తొచ్చి, "అమ్మా... గిరిజ ఏమయ్యింది?" అని అడిగాను. "ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యమో, ఆదెమ్మ చేసిన పుణ్యమోగానీ.. ఇద్దరు పిల్లలు, భర్తతో హాయిగా కాపురం చేసుకుంటోంది" అని అమ్మ చెప్పింది.
ఆదెక్కను ఎందుకు చంపేశారో ఇప్పటికీ తెలియకపోయినా, కూతురి గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు తిరగబడి ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకునే ఆమెను హత్య చేసి ఉంటారని అప్పట్లో ఊరంతా అనుకునేవారు. చివరకు ఆమె ఎప్పుడూ చెప్పేటట్లుగానే కూతురి కోసం తన ప్రాణాలనే వదిలేసి మాట నిలబెట్టుకుంది.
ఈ సంఘటన జరిగి ఇప్పటికి ఇంచుమించు 15 సంవత్సరాలు కావస్తున్నా... ఇప్పటికీ ఆదెక్క మరణం నన్ను కలచి వేస్తుంటుంది. కూతురి బ్రతుకు తనలాగా కాకూడదని కోరుకున్న ఆమె కన్న కలలు నిజమయ్యాయి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటోన్న కూతురి కాపురాన్ని పైనుంచి చూస్తూ.. ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది.
ఏం కొడకా... మాకేమైనా ఇచ్చేదుందా? ఆదెక్క తన జీవితంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. ఆదెక్కలు, ఇలాంటి తల్లుల కూతుళ్లు లెక్కలేనంతమందే ఉన్నారు మన మధ్యలో.. నిజంగా.. మనం వాళ్లకేమయినా ఇచ్చేదుందా...?!
సొగసు మట్టుకు నీ సొంతం
1 day ago