Pages

Tuesday 3 April 2012

ఓ వానదేవుడా.. బాగా కురువు తండ్రీ...!!

ఇలా ఉండాల్సిన మా చేను

లేచింది మొదలు ఉరుకులు, పరుగుల జీవితానికి ఓ నాలుగు రోజులపాటు విరామం ఇచ్చేసి.. రెక్కలు గట్టుకుని మా ఊర్లో వాలిపోయాను. వెళ్లినప్పటినుంచి చుట్టుప్రక్కలవాళ్ల, ఊళ్లోవాళ్ల పలుకరింపులు, చాన్నాళ్లకు వచ్చామని చూసేందుకు వచ్చిన బంధువుల సందడితో రెండు రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. మూడో రోజు మాత్రం చేన్లు, పొలాలు చూసి రావాలని మనసులో గట్టిగా నిర్ణయించేసుకుని.. "అమ్మా చేను దగ్గరికి వెళ్దాం పద"మని బైల్దేరదీశా. మా ఇద్దరికీ తోడుగా చిన్న తమ్ముడు, చెల్లెలు, తన పాప కూడా రెడీ అయిపోయారు. అందరం కలిసి చేనువైపుకు నడక సాగించాం.

మా వూరి గురించి చెప్పాలంటే... రాళ్ళు తప్ప నీళ్ళే లేని రాయలసీమలో మాది ఓ పల్లెటూరు. అయితే మా ఊర్లో, చుట్టుపక్కల పల్లెల్లో మాత్రం నీటి కొరత లేదనే చెప్పవచ్చు. చెరువులు, వ్యయసాయ బావులు, బోర్ల ద్వారా చాలా వరకు పంటలు సాగవుతుంటాయి. వరి, చెరకు, కూరగాయలు లాంటివి బాగానే పండుతుంటాయి.

బావులు, చెరువుల ద్వారా సాగయ్యే వరి, చెరకు లాంటి పంటలకయితే నీళ్లకు ఢోకా లేదు గానీ... వేరుశెనగ చేన్లు మాత్రం దాదాపు ఎండిపోయాయి. ఎందుకంటే ఈ చేళ్ళన్నింటికీ వర్షం పడితేనే ప్రాణం లేచివస్తుంది. అయితే... కొన్ని రోజులుగా వర్షం ఆనవాళ్ళే లేకపోవడంతో దాదాపు 80 శాతం పంట ఇక లేనట్టేనని రైతులంతా హడలిపోతున్నారు.

చాలా సంవత్సరాల తరువాత మా అమ్మావాళ్ళు కూడా వేరుశెనగ పంట వేశారు. అప్పూ, సప్పూచేసి పంట పెట్టి... ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న మా వాళ్ళకు కూడా అందరి రైతుల పరిస్థితే ఎదురయ్యింది. ఎంతో ఆశగా చేను చూసేందుకు వెళ్ళిన నాకు వాడిపోయి, ఎండిపోయిన చెట్లే దర్శనమిచ్చాయి.

"పంట బాగా వస్తే నగలన్నీ బ్యాంకునుండి తెచ్చేస్తాను. అప్పుడు ఇక తమ్ముళ్ళ చదువుకు ఏ సమస్యా ఉండదని..." చేను వేసేముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకురాగా, చేసేదేం లేక భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నా...! సీమలో వేరుశెనగ పంటపైన ఇలాంటి ఆశలెన్నో పెట్టుకున్న అమ్మలాంటి అమ్మలు, నాన్నలు కూడా ఇలాగే ఆలోచిస్తుంటారు కదూ.. అనుకోగానే నా మనసులో ఎక్కడో కలుక్కుమంది.

మరుసటిరోజు మా పొలంలో మామిడిచెట్లు పెట్టేందుకు గుంతలు తవ్వుతుంటే చూసేందుకు వెళ్లా. ఇక్కడ కూడా అదే పరిస్థితి భూమి పక్కనే ఏరు ఉంది నీటికేం సమస్య ఉండదు. చెట్లు పూడ్చగానే ఏటినుంచి నీరు తెచ్చి పోసి, చెట్లను బ్రతికించుకోవచ్చు అనుకుంటూ వెళ్తే... ఇంకేముందీ ఏరు కాస్తా ఎండిపోయి దర్శనమిచ్చింది.

దిగులుగా పొలం ఈ కొస నుంచీ ఆ కొసదాకా తిరిగి, కాసేపు చెట్ల నీడలో కాసేపు బాధపడుతూ కూర్చున్నా. "బాధపడితే ఎలాగమ్మా, ఏదయితే అదయింది మన చేతిలో ఏముంది" అంటూ అమ్మ కాస్త ధైర్యం చెప్పింది. ఆ తరువాత కాసేపటికి తేరుకుని పొలం మధ్యలోనే ఉన్న బలిశె చెట్లలో గుత్తులు గుత్తులుగా పండిపోయిన కాయలను తెంపి తినేసి మా పండు (చెల్లెలి కూతురు హారిక)తో కాసేపు ఆడుకుని మళ్లీ ఇంటిదారి పట్టాను. ఇంటికి ఇంకాస్త దూరంలో ఉన్నామో, లేదో ఒకటే మబ్బులు.. పెద్ద పెద్ద చినుకులు మొదలయ్యాయి. అమ్మా... వర్షం పెద్దగా పడేటట్లుంది. త్వరగా నడు ఇంటికెళ్లిపోదాం అన్నాను.

ఇలాగైపోయింది... తరువాత పంట చేతికే రాలేదు.. ఒట్టి పొట్టు తప్ప...

"ఆ... ఇదేం వచ్చేవానా కాదూ, ఏమీకాదు. ఇలా వారం రోజులుగా ఊరిస్తూనే ఉంది. ఈ వారం రోజుల నుంచి ఆ వర్షం వచ్చి ఉంటే, శెనక్కాయ చెట్లయినా బ్రతుక్కుని ఉండేవని" అమ్మ ఓ నిట్టూర్పు విడిచింది. అమ్మ అలా అంటోందో లేదో... కుండపోతగా ఒకటే వర్షం బాగా తడిచి ముద్దయిపోయాం.

ఇక ఈ వర్షం ఆగేలా లేదు.. ఇంకా తడిస్తే జ్వరాలొచ్చేస్తాయ్ ఆ రైస్‌మిల్లులోకి వెళ్దాం పదండి అంది అమ్మ. అంతే నేనూ, తమ్ముడు, చెల్లెలు, హారికను తీసుకుని పరుగులు తీశాం. పాప తడిచిపోయిందని రైస్ మిల్లులో వారినడిగి ఓ టవల్ తీసుకుని తుడుస్తూ ఉంటే... అమ్మ మాత్రం... "ఓ వానదేవుడా.. బాగా కురువు తండ్రీ.. ఇలాగైనా శనక్కాయ చెట్లు బ్రతుకుతాయి.." అంటూ గొణుక్కుంటూ దేవుణ్ణి ప్రార్థించేస్తోంది.

అమ్మ మాత్రమే కాదు... ఎన్నో ఆశలు పెట్టుకుని వేరుశెనగ పంట పెట్టిన సీమ తల్లులంతా ఆ క్షణంలో నా కళ్లముందు మెదిలారు. ఓ ముప్పావుగంటపాటు బాగా కురిసిన ఆ వర్షంతో చెట్లు ఓ మేరకు బ్రతుక్కోగలవు. అయితే పంట ఏ మేరకు చేతికందుతుందో మాత్రం ఇప్పుడే ఎవరూ ఏమీ చెప్పలేరు. ఏళ్ల తరబడీ ఇలాగే జరుగుతున్నా సీమ ప్రజలు మాత్రం వేరుశెనగ పంట పెట్టడం మాత్రం ఆపటం లేదు. ఏ యేటికాయేడు చెట్లు నిర్జీవమై పెట్టిన పెట్టుబడి కూడా రాకున్నా... "ఈ సంవత్సరం కాకపోయినా, వచ్చే సంవత్సరం అయినా పంట బాగా రాకపోతుందా, అప్పులు తీరకపోతాయా అన్న ఆశ మాత్రం వారిలో సజీవంగా కదలాడుతోంది...