Pages

Monday 26 September 2011

నా కలలన్నీ వెచ్చనివే...... కానీ....?!


నా కల
తిరిగిరాని బాల్యం కోసం
అమ్మమ్మ చెప్పే కథల కోసం
తాతయ్య తెచ్చే మిఠాయిల కోసం
పంట కాలువల్లో… యేటినీళ్ళలో
అమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసం
తమ్ముళ్లతో చేసిన అల్లరి కోసం
నాన్న చెంపపై ఇచ్చిన గుర్తుల కోసం
అదే చెంపపై ఇచ్చిన ముద్దుల కోసం

అమ్మ ముఖంలో నవ్వు కోసం

నా కల
తుపాకులు లేని రాజ్యం కోసం
యాసిడ్ దాడుల్లేని రోజు కోసం
నిజమైన రాజకీయాల కోసం
ప్రశాంతంగా బ్రతికే జనాల కోసం
ఎళ్లవేళలా పరితపించే శాంతి కోసం

నా కల
స్వార్థం లేని మనుషుల కోసం
కల్మషం లేని నవ్వుల కోసం
ఎల్లలు లేని సంతోషం కోసం
బతుకంతా పెనవేసే స్నేహం కోసం
చివరిదాకా అంటిపెట్టుకునే ప్రేమ కోసం

నా కలలు
వెచ్చనివే… కానీ తడిగా ఉంటాయి
ఊహలే… కానీ సృజనాత్మకమైనవి
జ్ఞాపకాలే… కానీ ఉల్లాసాన్నిస్తాయి
సాధారణమైనవే… కానీ ఆలోచింపజేస్తాయి

Thursday 15 September 2011

అవిసె పువ్వుల వేపుడు ఎప్పుడైనా తిన్నారా..?

 

కావలసిన పదార్థాలు :
అవిసె పువ్వులు... పావుకేజీ
ఉల్లిపాయలు.. మీడియం సైజువి రెండు
పచ్చిమిర్చి... రెండు
కరివేపాకు... సరిపడా
కొత్తిమీర... తగినంత
వేయించిన వేరుశెనగ గింజలు... వంద గ్రాములు
వెల్లుల్లి.. కాసిన్ని
కారంపొడి... ఒక టీస్పూన్
ధనియాలపొడి... ఒక టీస్పూన్
నూనె... తగినంత
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి... పోపుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా అవిసె పువ్వులను తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని మూడు లేదా నాలుగు ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయలను నిలువుగా సన్నంగా తరగాలి. పచ్చిమిర్చిని నిలువుగా కోయాలి.

వేయించిన వేరుశెనగ గింజలకు, కాస్తంత ఉప్పు, పసుపు, కారంపొడి, ధనియాలపొడి కలిపి మెత్తగా పొడి కొట్టాలి. చివర్లో వెల్లుల్లి పాయలను కూడా వేసి తిప్పాలి. ఈ పొడిని తీసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు బాణలిపెట్టి అందులో తగినంత నూనె పోసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి. నచ్చినవాళ్లు కాస్తంత మినప్పప్పును కూడా పోపులో వేసుకోవచ్చు. కాసేపటి తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి మరి కాసేపు వేయించాలి. అందులోనే కాస్త పసుపును కూడా చేర్చాలి.

ఇప్పుడు తరిగి ఉంచుకున్న అవిసె పువ్వులను వేసి కలియదిప్పి ఆవిరిపై ఉడికించాలి. పువ్వులు కాసేపటికే మగ్గిపోతాయి. తరువాత పొడి కొట్టి ఉంచుకున్న వేరుశెనగ గింజల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలియదిప్పి, ఉప్పు సరిజూసి మరికాసేపు సిమ్‌లోనే ఉడికించాలి. ఉడికింది అనిపించగానే దించేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అవిసె పువ్వుల వేపుడు రెడీ.

దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్బ్‌గా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!

(మా అమ్మమ్మ, తాతయ్య గురించి రాసిన పోస్టులో అమ్మమ్మ చేసే అవిసె పువ్వుల వేపుడు భలే ఇష్టం అని రాశాను. దాన్ని చదివిన శైలూ (http://kallurisailabala.blogspot.com/) ఎలా చేస్తారో చెప్పమని అడిగింది. అంతేకాదు, ఎలా చేయాలో రాసి బ్లాగులో పోస్ట్ చేస్తే దాన్ని చూసి నేనూ ఎంచక్కా చేసేస్తాను అంది. నేను తొలిసారిగా నా బ్లాగులో వంటల గురించి రాశాను. ప్రేమతో రాసిన ఈ తొలి పోస్టు, మళ్లీ ఇంకా ఏవైనా రాస్తే అవి కూడా శైలూకే అంకితం..... )

Wednesday 7 September 2011

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి...?


ఇతరుల బాధలు చూసి తల్లడిల్లే
తనువంతా మనసున్న తల్లి
కారుణ్య రాతలతో మనసులోని
ఆర్ద్రత వ్యక్తపరచే అనురాగవల్లి

తండ్రి జ్ణాపకాలతో తరచి
తరచి
  అనుక్షణం పరితపిస్తూ
ఎదలోతుల్లోని భావాలను
ప్రసరింపచేసే మరుజాజిమల్లి

ఆబాలలోకాన్ని అనాదిగా ఆనందింపచేసే
చందమామ కబుర్లుతో
గడచిన బాల్యపు పొలిమేరలకు
పయనింపచేసే స్నేహశీలి

ఆర్తులకు అడగకపోయినా
తోడుగా నిలిచే కల్పవల్లి
అప్యాయతకు అనురాగానికి
శాశ్వత చిరునామా ఈ రంగవల్లి

గర్వంగా చెప్పుకుంటా ఈమె నాకు దేవుడిచ్చిన చెల్లి....!!

(నాపై ఉన్న అవ్యాజమైన ప్రేమను తన ప్రేమమయ మాటలతో అక్షరీకరించిన ఉదయ్ అన్నయ్యకు కృతజ్ఞతాభివందనాలు... మీ ప్రేమానురాగాల చిరుజల్లుల్లో తడిసిముద్దవుతూ, మురిసిపోతున్నా... మీ అక్షరాలను ఎప్పటికీ పదిలంగా దాచుకోవాలనే ఇలా బ్లాగులో పొందుపరుచుకుంటున్నాను అన్నయ్యా...)

Tuesday 6 September 2011

ఆ నలుగురూ.........!!!!


బుల్లి బుల్లి చేతులతో
ముట్టుకుంటే మాసిపోయేంతలా
అచ్చం దేవకన్యలా
దూదిలాంటి మెత్తనైన మేనుతో
మెరిసిపోతున్న బుజ్జాయిని
సంభ్రమాశ్చర్యాలతో
మునివేళ్లతో స్పృశించాడతను...

అమాయకమైన బోసి నవ్వులతో
కళ్లల్లో ఒకింత మెరుపుతో
బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ చిన్నారి చేయి
తన వేలును గట్టిగా పట్టుకోగానే
మురిసిపోతూ గుండెలకు హత్తుకున్నాడతను

ఇక అప్పటినుంచి...
ఆ బుజ్జాయే ఆతని లోకం
ఆ బుజ్జాయి ఆవాసం ఆతని గుండెలపైనే
ఆ చిన్ని తల్లి నవ్వితే తానూ నవ్వాడు
ఏడ్చితే తానూ ఏడ్చాడు
అలా తన గుండెలపైనే పెరిగి పెద్దయిన
చిట్టితల్లిని వదలి వుండాలనే
ఊహ వస్తేనే విలవిలలాడిపోతాడతను
తనని వదలి వెళ్లాలంటే ఆమెదీ అదే స్థితి...

కానీ...
కాలం వారిద్దరికంటే గొప్పది
అనుకున్నట్లుగా అన్నీ జరిగిపోతే ఇంకేం..
ఒకానొక ఘడియన.....
ఈ ఇద్దర్నీ దూరం చేసేసింది

అప్పుడప్పుడూ కలుస్తున్నా
మానసికంగా అందనంత దూరం....
నువ్వు మారిపోయావు
ముందుట్లా లేవు
చిట్టితల్లి ప్రశ్నిస్తుంటే...
లేదమ్మా నేను మారలేదనీ
చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఓవైపు...

మీ ప్రేమంతా మీ సోదరి సంతానానికేనా
మరి మా సంగతేంటంటూ...?
తన సగభాగమూ నిలదీస్తుంటే
ఎవరికి ఏమి తక్కువ చేసాడో తేల్చుకోలేక
అటూ, ఇటూ, ఎటూ సర్దిచెప్పలేక మరోవైపు

ఆతని అవస్థ వర్ణనాతీతం........

కాలం ఆటల్ని అలా సాగనిస్తే....
"ప్రేమ" అనే మాటకు విలువేముంది
కాలం ఏర్పర్చిన సంకెళ్లను, హద్దుల్ని
చేధించిన "ప్రేమే" ఆ ఇద్దర్నీ మళ్లీ కలిపింది
ఆ ఇద్దర్నే కాదు.. అందర్నీ కలిపింది
మరెప్పటికీ విడిపోనంతగా
"అనుబంధం" గెలిచింది