Pages

Wednesday, 6 November 2013

నాన్నా...!!

  

 గుండెని గుప్పిట పట్టి అమ్మని
జ్ఞాపకాల్ని దోసిటపట్టి నాన్నని
జీవితపు అక్షయపాత్రలో
చూస్తున్నా... చూస్తూ జీవిస్తున్నా
వాళ్ల కోసమే.. వాళ్లతోనే...!!


****

నాన్నా...!!

ఎలా ఉన్నావు?

నేను లేకుండా మీరంతా ఎలా ఉన్నారో.. నేనూ అంతేగా తల్లీ.. అంటున్నావా.. ఇది నీకూ, మాకూ తెలిసిన నిజమే కదా. కొత్తేం లేదుగా..

నువ్వు లేకుండా నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా ఎన్ని ముందున్నాయో. నువ్వు లేని రోజుల్ని భారంగా గడపటం అలవాటైపోయినా.. మా మనసులనిండా నువ్వే కదా.

ఈ మధ్య నీతో కబుర్లు చెప్పటం లేదని, నీ దగ్గర కాసేపు కూడా కూర్చోలేదని అలిగావా.. ఏం చేయను. నా పరిస్థితి నీకు తెలియంది కాదు. నువ్వే చెప్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ దగ్గర కూర్చొనేందుకు, కబుర్లు చెప్పేంత మానసిక ప్రశాంతత ఎక్కడిది.

కొన్నాళ్లుగా.. కాదు కాదు.. కొన్ని నెలలుగా ఎంత ఉరుకులు పరుగుల జీవితమో. ఇంతటికీ కారణం నువ్వే.

ఏం తల్లీ... నిందిస్తున్నావా అని అడుగుతున్నావా.. నింద కాదులే. నువ్వు అసంపూర్తిగా వదిలేసిన కొన్ని బాధ్యతల్ని. ఇంటికి పెద్దదాన్ని అయిన కారణాన నేను ఎత్తుకోవాల్సి వచ్చిందిగా.. అందుకే అలా అన్నాన్లే.

మొత్తానికి నీ చేతులమీద జరగాల్సిన పెద్దోడి పెళ్లి నా చేతులమీదుగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జరిగిపోయింది. పెళ్లి తంతు అంతా సంతోషంగా జరిగిపోయినా నువ్వు లేవన్న దిగులు అడుగడుగునా.. మా అందరి కన్నీళ్ల రూపంలో.

ఇంక అమ్మ మాట చెప్పనక్కరలేదు. పెళ్లి విషయాలు మాట్లాడిన దగ్గరి నుంచి పెళ్లి పూర్తయ్యేదాకా ఏ కార్యక్రమంలోనూ ఆమె ముందుకురాలేదు. ఏం అంటే మీ నాన్న లేని నేను, శుభకార్యంలో ఎలా ముందుకొస్తాను. మీ చిన్నాయన, చిన్నమ్మ ఉన్నారుగా వాళ్లనే కానీ... అని దూరంగా జరిగిపోయేది. మాకు నువ్వు ముఖ్యం... అలాంటి పట్టింపులేం మాకు లేవు నువ్వు రామ్మా అని ఎంత చెప్పినా అస్సలు వినలేదు. మీకు లేకపోయినా లోకం నోటికి ఉంది. వద్దు.. నా బిడ్డలు మంచిగా ఉండటమే కావాల్సింది అంటూ కళ్లనిండా నీటితో చాటుకి వెళ్లిపోయేది.

నువ్వు లేకపోవడంతో పువ్వూ, బొట్టుకే కాదు.. శుభకార్యాలకు కూడా అమ్మ దూరమైపోయింది. నువ్వు ఉన్నప్పుడు అమ్మ ఎదురొస్తే శుభం.. ఇప్పుడు అశుభం.. అమ్మ మాకు ఎప్పుడూ శుభమే.. లోకం నోళ్లకే అశుభం. అయినా లోకాన్నెప్పుడూ మేం ఖాతరు చేయలేదు. ఈ లోకంలో ఉన్న గొప్ప ఆస్తి మాకు మా అమ్మే కాబట్టి.

ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పెళ్లి జరిగిపోయింది. అటూ, ఇటూ రాకపోకలు జరుగుతున్నాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే...

అమ్మ వాళ్ల నాన్న.. తాత ఉన్నట్టుండి చనిపోయారు. పెళ్లయిన 20 రోజుల్లోపు ఇంట్లో అలా జరిగిపోయింది. నువ్వు పోయిన తరువాత అమ్మకి తోడూ, నీడగా ఉన్న తన నాన్న హఠాత్తుగా పోవడంతో అమ్మ పరిస్థితి వర్ణనాతీతం. నువ్వు లేని బాధనే దిగమింగుకునే సత్తాలేక రోజు రోజుకీ ఉడిగిపోతున్న ఆమె నెత్తిమీద అలా మరో పిడుగు. ఆరోగ్యంగా హాయిగా తిరుగులాడుతూ... చిన్నప్పుడు తను ఎత్తుకు తిరిగిన మనవడి పెళ్లిలో హుషారుగా పనులు చేసిన ఆయన... ఊహించని మరణం.. అందరికీ షాక్.

ఆ.. నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా.. మీ అమ్మ.. అదే మా నాన్నమ్మ గురించి...

ఆమెకేం హాయిగా తిరిగేస్తుంది కదా.. నేను ఒళ్లు బాలేక పోయానుగానీ.. ఆమె మంచి ఆరోగ్యంతో బాగుండేది కదా అంటావేమో... నేనూ ఆ మాటకే వస్తున్నా... బాగా ఆరోగ్యంగా తిరుగులాడుతూ పనులు చేస్తూ ఉండేది కదా..

ఒకరోజు కాలికి చిన్న పుల్ల గుచ్చుకుంది అంతే.. అదే ఆమె ప్రాణాలమీదికి తెచ్చేసింది. కాలు తీసేయాల్సినంతగా కుళ్లిపోయింది కొన్ని రోజుల్లోనే. ఏదో ఆపరేషన్ చేసి కాలు తీయకుండా కుళ్లిపోయిన చర్మం అంతా తీసేసారు. మెల్లిగా కోలుకుంటోంది. కానీ ప్రతిరోజూ భయమే ఎప్పుడు ఏమౌతుందో అని. అలాంటి పరిస్థితుల్లోనే పెద్దోడి పెళ్లి జరిగిపోయింది. మనవడి పెళ్లి కళ్లారా చూసుకుంది.

పెళ్లికి ముందో, తరువాతో ఆమె ఏమవుతుందో అని అందరం కంగారుపడ్డామేగానీ.. తాత విషయం మాత్రం అస్సలు ఊహించలేదు. అంత సునాయాసంగా ఈ లోకం వదిలి వెళ్లిపోయాడాయన. నిజం చెప్పొద్దూ... నువ్వు లేవు అంటే ఎంత ఏడుపు వస్తుందో.. ఆయన్ని తల్చుకున్నా అంతే.. ఏదో తెలీని అపరాధ భావం కమ్మేస్తుంటుంది నాలో. పిచ్చిగా ఏడ్చేస్తుంటాను.

తాత పోయిన సరిగా నెల రోజులకు... నాన్నమ్మ కూడా వెళ్లిపోయింది. ఎలా పోయింది అని అడగవేం.. మెల్లిగా కోలుకుంటోందిలే అనుకుంటే.. రాను రాను తినడమే మానేసింది. చివరికి నీళ్లు తాగడం కూడా.. డాక్టర్లకి చూపిస్తే చేతులెత్తేశారు. గ్లూకోజ్ నీళ్లతో కొన్ని రోజులు ఊపిరి పీల్చుకుంది. అంతే మంచంలో తీసుకుని తీసుకుని పోయింది. పెద్ద మనవరాల్ని కదా.. నా దుఃఖం సంగతి నీకు తెలిసిందే. దెబ్బలమీద దెబ్బలు... తట్టుకోవడం సాధ్యం కాలేదు. మౌనంగా రోదించటం తప్ప ఏం చేయలేను కూడా.

వరుసగా జరుగుతున్న పరిణామాలు మానసికంగా ఎంతగా కుంగదీశాయో చెప్పలేను. ఓ దశలో ఇంటినుంచి ఫోన్ వస్తేనే గడగడా వణికిపోయేదాన్ని. కూడదీసుకుని మాట్లాడేదాన్ని ఏమైంది.. ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశారు అంటూ.. విషయం ఏమీ లేదని తెలీగానే కాస్త ఊపిరి పీల్చుకునేదాన్ని అంతలా పిరికిదాన్ని అయిపోయాను అనుకో.

ఇక చెప్పబోయే విషయం విని నువ్వేం బాధపడకూడదు. బాధలేకుండా ఎలా ఉంటుంది. ఏదో చెప్పాలని చెప్పడం కాకపోతే. ఎవ్వరు బాధపడినా చేసేదేం లేదు... అందుకనే మనసు కాస్త ధైర్యం చేసుకో... నాకేం మా... ఎప్పుడో దాటుకునేశా... ధైర్యం చిక్కబట్టుకోవాల్సింది నువ్వే అంటున్నావా... చిక్కబట్టుకోవడం అటుంచు.. పై ప్రాణం పైనే పోయింది.. ఏదో అలా నెట్టుకొచ్చేస్తున్నానంతే..

ఇక విషయం ఏంటంటే... పెద్దోడి పెళ్లికి ముందునుంచే అమ్మ ఒంట్లో బాలేదని చెబుతోంది. నాలుగు అడుగులు కూడా వేయలేకపోయేది.. ఒకటే ఆయాసం.. ఏదైనా కాస్త పనిచేస్తే వదలకుండా జ్వరం వచ్చేసేది. తాతకి ఆస్త్మా ఉండేది కదా.. అమ్మకి కూడా అలా ఉందేమో అని హాస్పిటల్‌కి పంపించాం.

నేను మావూళ్లో ఉండటం.. తమ్ముళ్లకి వేరే పనులు ఉండటంతో అమ్మను ఒక్కదాన్నే హాస్పిటల్‌కి పంపించాం. ఆయాసంకి మందులు ఇస్తూనే.. ఎందుకో గుండె ఓవైపు సరిగా కొట్టుకోవట్లేదమ్మా టెస్ట్ చేయించుకో మంచిది అన్నాడట డాక్టర్. అమ్మ ఇంటికి వచ్చి విషయం చెబితే తమ్ముళ్లు, నేనూ నవ్వాం.. ఆ డాక్టర్‌కి తిక్కా.... ఆయాసం శ్వాసకి సంబంధించిన సమస్య అయితే గుండె సమస్య అంటాడేంటి అని. కానీ రెండోసారి వెళ్లినప్పుడు అదే విషయం చెప్పాడు అనటంతో.. భయపడి ఈసీజీ లాంటి టెస్ట్‌లు చేయిస్తే..

వచ్చిన రిజల్ట్స్ చూసి బిక్కచచ్చిపోయాం. గుండెలో రెండు వాల్వ్‌లకు సమస్య ఉందని వెంటనే "ఓపెన్ హార్ట్ సర్జరీ" చేయాలని డాక్టర్ చెప్పటంతో చిన్నోడు ఏడుస్తూ ఫోన్. సెకండ్ ఒపినీయన్ తీసుకుందాం. నువ్వేం బాధపడకు అని వాడికి ధైర్యం చెప్పానేగానీ.. ఆ క్షణం నుంచి దిగులు, ఏడుపు, బాధ.. అన్నీ మాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయని.

పెళ్లికే అప్పులు అయ్యాయి.. తరువాత నాన్నమ్మ, తాతల కార్యక్రమాలకు ఖర్చులయ్యాయి. ఇప్పుడేమో అమ్మకిలా. గుండెకు సంబంధించిన సమస్య అంటే తక్కువ ఖర్చేం కాదు. డబ్బులకి ఏం చేయాలన్న దిగులు. ఎవరిని అడగాలి.. ఏడుస్తూ రోజులు.. ఈలోగా గుండెకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చూస్తారని తెలిసింది. ఆ కార్డ్ ఉంది కాబట్టి అమ్మకి చూపించవచ్చులే అనుకుంటుండగా...

ఆరోగ్యశ్రీలో గుండె సంబంధిత ఆపరేషన్లను ఆపేస్తున్నాం అంటూ కొంతమంది వైద్యుల ప్రకటన. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా ఆపరేషన్లను ఆపేస్తున్నట్టు. ఆ న్యూస్ చూడగానే కాళ్లూ చేతులు వణకటం మొదలైంది నాకు. కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి తెలిసిన స్నేహితులను అడిగి కనుక్కుంటే ఒకటిన్నర రెండు లక్షల దాకా కావచ్చు అని అన్నారు. చేతిలో పదివేలు కూడా లేని స్థితిలో అంత డబ్బుకి ఎక్కడపోవాలి అని ఒకటే ఏడుపు.

ఇదే టైంలో సమైక్యాంధ్ర బంద్. ఉద్యోగులూ, జనాలూ ఉద్యమంలో జోరుగా ఉన్నారు. బస్సులు లేవు. స్కూల్లూ, ఆఫీసులూ అన్నీ బంద్. హాస్పిటల్లో అత్యవసర సేవలు కూడా ఆగిపోతే అమ్మ పరిస్థితి ఏంటి అని దుఃఖం. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ.. ఏడుస్తూ ఉన్న సమయంలో కొందరు మిత్రులు ఆర్థికంగా సాయపడతామని ముందుకొచ్చారు. కానీ దేవుడి దయవల్ల ఆరోగ్యశ్రీ కార్డుపై గుండె సంబంధిత ఆపరేషన్లు చేస్తున్నట్లు మళ్లీ న్యూస్ రావటంతో.. హాస్పిటల్లో కూడా ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుని.. వెంటనే అమ్మని అడ్మిట్ చేయించాం.

ముందుగా ఆంజియాప్లాస్టీ చేశారు. తరువాతి రోజు ఆగస్టు 31న ఉదయాన్నే పదిన్నరకి ఆపరేషన్ అన్నారు. అది కాస్తా 12 అయ్యింది. 12కి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30, 7 గంటలు అయినా డాక్టర్లనుంచి పిలుపేదీ రాలేదు. ఏమీ చెప్పటం లేదని.. ఆపరేషన్ ఎలా జరిగిందో ఏమో అని కంగారు. ఏదోమూల భయం.. కళ్లు తిరగటం మొదలైంది నాకు. అదే టైంలో అమ్మని ఆపరేషన్‌కి తీసుకెళ్లిన పెద్ద డాక్టర్, ఆమె అసిస్టెంట్లు ఎదురుగా రావటం కనిపించింది. పరుగెత్తికెళ్లి... మేడమ్ అని అన్నానో లేదో.. ఆపరేషన్ బాగా జరిగింది. ఐసీయూలోకి షిప్ట్ చేస్తున్నాం.. కాసేపటి తరువాత వెళ్లి చూడండి అని నవ్వుతూ వెళ్లిందామె. ఆమె నవ్వు చూడగానే పోయిన ప్రాణం లేచివచ్చినట్టయింది నాకు.

పొద్దుట్నుంచీ ఏమీ తినకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. దేవుళ్లందరికీ మొక్కుకుంటూ.. ఏడుస్తూ కూర్చున్నా.. కళ్లు తిరుగుతున్నాయి. కాళ్లు లాగేస్తున్నాయి. తమ్ముళ్లు, బంధువులు కాస్త ఎంగిలిపడమని ఎంత చెప్పినా వినలేదు అమ్మని చూస్తేగానీ ఏమీ తినలేనని. తీరా ఒక్కొక్కరే వెళ్లి చూడవచ్చని పిలుపు. తమ్ముళ్లని పంపించాను. వాళ్లిద్దరూ చూసివచ్చి నువ్వు ఇప్పుడు వద్దులే అక్కా.. రేపు చూస్తువులే అన్నారు. అమ్మను అలా చూస్తే నువ్వు తట్టుకోలేవు వద్దు అన్నారు. అసలే ఏ మాత్రం ధైర్యంలేకుండా ఉన్నానేమో సరే అని కూలబడ్డా.

ఆమెకి ఉదయందాకా స్పృహరాదు. అందర్నీ ఇక్కడ ఉండనీయరు. ఒక్కరు మాత్రం ఉండి అందరూ వెళ్లిపోండని సెక్యూరిటీవాళ్లు అనడంతో.. పెద్దోడు మేమిద్దరం ఉంటాం నువ్వు తమ్ముడు పెదనాన్నతో వెళ్లండక్కా అనటంతో చేసేదేంలేక ఆయనతో బయల్దేరాం. వాళ్ల బలవంతంమీద స్నానంచేసి నాలుగుమెతుకులు తిని పడుకున్నా నిద్రపడితే కదా. తెల్లవారుజామున అమ్మకి మెలకువ వచ్చిందా అని చిన్నోడు ఫోన్. ఏమో వాళ్లు రానీయటం లేదురా అని పెద్దోడు. ఇంకా స్పృహ రాకపోవడం ఏంటని ఆదుర్దా. చూసి వస్తా నువ్వు ఇక్కడే ఉండమని వెళ్లిపోయాడు చిన్నోడు.

 

అమ్మకి స్పృహ వచ్చింది. సైగలతో మాట్లాడుతోంది. మధ్యాహ్నం తరువాత మాట్లాడవచ్చట అని చిన్నోడి ఫోన్ వచ్చేదాకా మనసులో మనసు లేదు. గబగబా స్నానంచేసి దేవుడికి దణ్ణంపెట్టుకుని హాస్పిటల్‌కి పరుగెత్తా. మధ్యాహ్నం తరువాత నోట్లో పెట్టిన ట్యూబ్ తీసేస్తారట. పాలు తాపవచ్చట. వెంటవెంటనే చూసేందుకు పంపించరు. అలా వెళితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందట. ఒకేసారి పాలు తీసుకుని వెళ్దువులే అక్కా అని అన్నాడు. ఒంటిగంట ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నా. పాలు తీసుకుని గుండెచిక్కబట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లా.

నన్ను చూడగానే అమ్మ కళ్లలో వెలుగు. సన్నని కన్నీటి పొర. నా పరిస్థితి అంతకంటే ఘోరం. కానీ నేనూ అలా చేస్తే ఇక అంతే. ఎమోషనల్‌ అవకుండా చూసుకోమని డాక్టర్లు ముందే చెప్పారు. అందుకే ఆపరేషన్ బాగా జరిగింది. వారం రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చట. పిచ్చిదానా ఎందుకు ఏడుపు అంటూ నవ్వుతూ తల నిమిరాను. నువ్వు సరిగా తిని మందులు వేసుకున్నావంటే ఇంకా ముందుగానే ఇంటికి వెళ్లిపోతాం.. బాగయిపోతుంది బాధపడకూడదు. నువ్వు బాధపడుతున్నట్లు కనిపిస్తే డాక్టర్లు మమ్మల్ని లోపలికే రానీయరు అని మెల్లిగా నచ్చజెప్పా. కాసేపటికి సర్దుకుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదట. ఇదిగో ఈ పాలు తాగేస్తే నేను మళ్లీ సాయంత్రం వస్తా అని చెప్పి పాలు తాగించి, ధైర్యంచెప్పి బైటపడ్డా.

అమ్మకి ధైర్యం చెప్పానేగానీ అమ్మని ఆ పరిస్థితుల్లో.. ఒంటినిండా ట్యూబులు, ముక్కుకి ఆక్సిజన్‌.. వినీ వినిపించకుండా మాటలు.. మళ్లీ జన్మెత్తిన పసిబిడ్డలా ఉన్నట్టు... నావల్ల కాలేదు.. అప్పటిదాకా అణచిపెట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. హాస్పిటల్లో చుట్టూ ఉన్నారన్న స్పృహకూడా లేకుండా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. ఎవ్వరితరమూ కాలేదు ఓదార్చటం. కాసేపటికి నేనే సర్దుకున్నా. ఆపరేషన్ బాగా జరిగింది కదమ్మా ఎందుకు ఏడుస్తావు.. ఏడిస్తే అమ్మకి మంచిదికాదు అన్నారు అంతే.. ఇక అప్పటినుంచి అమ్మో అమ్మకి మంచిది కాదా అయితే ఇక ఏడవనే ఏడవను.. ఏడుపు ఆగిపోయింది. బాధ ఆగదు కదా..

ఆపరేషన్ జరిగేదాకా ఒక ఎత్తయితే.. ఆ తరువాత డిస్చార్జ్ అయ్యేదాకా మరో ఎత్తు అనేది అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. సాధారణంగా అయితే వారం పది రోజుల్లో ఇంటికెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కానీ రోగి ఆరోగ్య పరిస్థితి.. కోలుకునే శక్తి సామర్థ్యాలు అన్నీ దానిపై ఆధారపడి ఉంటాయి. గుండె ఆపరేషన్ తరువాత ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుందనీ.. కిడ్నీలు ఫెయిలవవచ్చని, స్ట్రోక్ రావచ్చని.. ఇలా ఏవేవో డాక్టర్లు ఆపరేషన్‌కి ముందే చెప్పారు. అయితే అందరికీ ఇలా అవ్వాల్సిన పరిస్థితి ఉండదనీ.. ఒకరిద్దరికి ఇలా జరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. దేవుడా అమ్మకి ఇలాంటివేమీ రాకూడదని మనసులో భయపడుతూ ఉన్నాం.

ఏదైతే రాకూడదని అనుకున్నామో సరిగ్గా అదే వచ్చింది. ఓసారి ఐసీయూనుంచి పిలుపు. రెండు మూడు రోజులుగా ఏం తిన్నా కడుపు విపరీతంగా ఉబ్బిపోతోంది. శ్వాస కూడా చాలా సమస్యగా ఉందని నేను సిస్టర్లకి అప్పటికే చెప్పి ఉన్నాను. డాక్టర్ రౌండ్స్ వచ్చినప్పుడు చెబుతాం అన్నారు. ఆ విషయమై డాక్టర్ పిలిచాడని అనుకున్నా కానీ.. ఊపిరితిత్తులు కొలాప్స్ అయ్యాయి మా.. ఊపిరితిత్తుల నిండా వాటర్ ఫాం అయ్యింది. దాన్నంతా తీసేందుకు ట్యూబులు వేయాల్సి ఉంటుంది అన్నాడు. అలా చేస్తే ఊపిరితిత్తులు బాగయిపోతాయా సర్ అడిగా. బాగవ్వాలనే మా ప్రయత్నం అన్నాడాయన.

అమ్మ భయపడుతుంటే ఏం కాదని చెప్పి అక్కడ్నించి కదిలా. ఓ అరగంట తరువాత మళ్లీ పిలుపు. షర్ట్, టవల్ తీసుకుని రమ్మని. వెళ్తే అమ్మ పరిస్థితి చూసి కాసేపు నోటమాట రాలేదు. ఏడుస్తోంది భయంకరంగా. అరగంట ముందువరకూ బాగున్న మనిషి ఏడుస్తోంది... నొప్పితో విలవిలలాడిపోతోంది. పక్కన చూస్తే తెల్లని చొక్కానిండా రక్తం.. టవల్ కూడా తడిచిపోయింది. ఏంటి సిస్టర్ ఎందుకింత రక్తం ఆశ్చర్యంతో తేరుకుంటూ కోపంగా అడిగాను. ఊపిరి తిత్తులలోని నీరు తీసేందుకు రెండువైపులా ట్యూబ్స్ పెట్టాం మా. ఆ ట్యూబ్స్ పెట్టేటప్పుడు మత్తుమందులాంటిదేం ఇవ్వలేదు. ఇవ్వకూడదు. ఇలా చేస్తుంటేనే బ్లీడింగ్ బాగా ఎక్కువైందని చెప్పుకొచ్చింది.

అమ్మని ఎంత ఓదార్చినా ఏడుపు ఆపటం లేదు. నన్ను చంపేందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు నమ్మకం లేదు తిరిగి ఇంటికి వస్తానని. ఎంతపని చేసారు అంటూ ఏడుస్తూ, గొణుగుతూ తిడుతోంది. ఇక ఓపికగా చెబితే వినదని.. కాస్త కోపంగా, నిన్ను చంపేందుకు కాదు.. ముందు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అనగానే.. ఏమనుకుందో ఏమో మెల్లిగా ఏడుపు ఆపింది. ఏడుపు ఆపిందేకానీ ఎక్కిళ్లు ఆగటం లేదు.. తనకి ఎంత నొప్పిగా ఉంటే అంతగా ఏడుస్తోందో.. అర్థం అవుతోంది. ఎక్కువ ఆవేశపడితే తన గుండెకి ఏమవుతుందో ఏమో అని నా కంగారు.

ఏడుపు ఆపిన తరువాత మెల్లిగా నచ్చజెప్పాను. డాక్టరుతో మాట్లాడానని.. ఊపిరితిత్తుల్లో బాగా నీరు చేరిపోవటంవల్లనే కడుపు ఉబ్బిపోతోంది.. ఏమీ తినలేకపోతున్నావని చెప్పాడు. ఆ నీరు రెండు మూడు రోజుల్లో బయటికి వచ్చేస్తుంది.. అప్పుడు నువ్వు మామాలుగా మా అందరిలాగే తినవచ్చు అని చెప్పాను. అయితే నొప్పి ఎక్కువగా ఉండటంవల్ల తను వినేస్థితిలో లేదు.. మాట్లాడే ఓపికా లేదు. చేసేదేంలేక సిస్టర్లను చూసుకోమని చెప్పి బయటకి వచ్చాను.

ఆపరేషన్ జరిగిన తరువాత దాదాపు 20 రోజులపాటు అమ్మ ఐసీయూలోనే ఉంది. ఆ 20 రోజుల్లో ప్రతిరోజూ ఆమె పడిన బాధ, ఆమె కోసం ఉన్న మా బాధలు మాటల్లో చెప్పలేనివి. 20 రోజుల ఐసీయూ అనుభవాల్ని నీకు ఇంకోసారి చెబుతాన్లే. ఒకటి మాత్రం నిజం "మనిషి జీవితం అంటే ఇంతేనా" అనిపించింది.

మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేశాం... వచ్చిన రోజునే ఇన్ఫెక్షన్ సోకిందో ఏమో ఒకటే జ్వరం.. సిస్టర్లకి ఫోన్ చేసి అడిగితే ఇన్నాళ్లూ ఐసీయూలో ఉంది కదా.. బయటి వాతావరణం సెట్ అయ్యేందుకు టైం పడుతుంది.. భయపడకండి అంటూ జ్వరం తగ్గేందుకు టాబ్లెట్స్ చెప్పారు.. అవి ఇవ్వటంతో జ్వరం తగ్గింది.. కానీ ప్రతిరోజూ ఏదో ఒక సమస్యే. సమస్యల్ని తట్టుకుంటూ, రోజుల్ని నెట్టుకుంటూ... మెల్లిగా తన ఆరోగ్యం బాగుపడుతోంది.


ఆసుపత్రి నుంచి వచ్చినప్పటినుంచీ నా దగ్గరికి వచ్చేయాలని ఒకటే ఆశ అమ్మకి. కానీ ఇంతదూరం ప్రయాణం చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని భయంతో ఇన్నాళ్లూ వద్దని చెప్పాను. ఇప్పుడు కాస్త కోలుకుంది కాబట్టి తీసుకువచ్చే ధైర్యం చేసి తీసుకురావాలని అనుకుంటున్నా. నవంబర్ 7న నువ్వు మాకు భౌతికంగా దూరమైన రోజు కదా.. ఆ రోజు నీ జ్ఞాపకంగా పదిమందికి అన్నంపెట్టి ఆ తరువాత నీ దగ్గరికి వస్తానమ్మా అని చెప్పింది. ఇక్కడికి వచ్చినా... మీరిద్దరూ నా దగ్గరకు వచ్చినప్పటి రోజుల జ్ఞాపకాలు ఆమెని మనశ్శాంతిగా ఉండనీయవు. అలాగని రాకుండా ఉండలేదు. అయినా ఆమె పిచ్చిగానీ ఆమె ఎక్కడున్నా నీ జ్ఞాపకాలు ఎలా లేకుండా ఉంటాయి.

ఇక చివరిగా... పిల్లలుగా మా భవిష్యత్తు ఆమెకి ఎంత ముఖ్యమో.. ఆమెని కాపాడుకోవటం మాకూ అంతే ముఖ్యం. "నాన్నని అర్థాంతరంగా తీసుకెళ్లినా అమ్మనైనా మిగుల్చు దేవుడా" అని రోజుకి లెక్కలేనన్నిసార్లు మొక్కుకుంటూనే ఉన్నాం. పైనుంచీ నువ్వు కూడా అమ్మని చల్లగా చూసి మా ముందు నవ్వుతూ తిరుగాడేలా చేయి.. ఇంతకంటే జీవితంలో మరే ఆశలూ లేవు. చేస్తావు కదూ...?!

నువ్వు లేవన్నది ఎంత నిజమో... మాతోనే ఉన్నావన్నది అంతే నిజం.. నీ చల్లని దీవెనలు కలకాలం మమ్మల్ని కాపాడాలని..
ఎప్పటికీ ప్రేమతో...