Pages

Friday, 25 March 2011

'పండు'టాకుల పాట..!!



ఇన్నాళ్లూ చలితో బిగదీసుకుపోయిన కోకిలమ్మ
గొంతు సవరించుకుని వేసవికి సన్నద్ధమవుతోంటే...

నేనేమీ తక్కువ తినలేదంటూ
కోకిలమ్మకు ఆశ్రయం ఇచ్చే చెట్లు కూడా
ఆకులన్నింటినీ రాల్చేసుకుని,
పచ్చని పెళ్లికూతురిలా, చిగుర్లు తొడిగి
వేసవికి చల్లటి స్వాగతం చెప్పేందుకు
బిరబిరా సృష్టికార్యాన్ని నెరవేరుస్తున్నాయి...

అంతకుముందుగా..
కోకిలమ్మ ఓ చెట్టుపై వాలి రాగాలు తీస్తోంటే...
గలగలమంటూ 'పండు'టాకులు చప్పుడు చేశాయి
ఓహో ఇదేంటి.. నా పాట కంటే,
వీటి చప్పుడే కమ్మగా ఉందే అనుకుంటూ
ఓ చెవి అటు పారేసింది కోకిలమ్మ

పండుటాకులున్న కొమ్మకు పక్కగా మరో కొమ్మ
ఆ కొమ్మకొక చిన్న రెమ్మ
ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు
చల్లగాలి జోలపాటతో నిద్దరోయిన దాన్ని
సూర్య కిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి...
ఒళ్లు విరుచుకుని కిలకిలమంటున్న చిగురుటాకును
సన్నగా, బాధగా 'పండు'టాకుల పాట తాకింది
పాటను విన్న చిగురుటాకు ఫక్కున నవ్వింది

దాంతో 'పండు'టాకులన్నీ ఇంకా గట్టిగా పాడసాగాయి
చిగురుటాకు కూడా మళ్లీ మళ్లీ నవ్వసాగింది
ఇంతలో ఓపిక నశించిన ఓ పండుటాకు...
"ఎందుకే ఆ మిడిసిపాటు" అంటూ
చిగురుటాకును నిలదీసింది..
మిడిసిపాటు ఎందుకుండదు..
నేనేమీ మీలా పసుపుపచ్చను కాదు...
నున్నగా నవనవలాడే పచ్చనాకును
ఇకపై పువ్వులు పూస్తాను..
పండ్లు కాస్తాను... అంటూ
ఆపకుండా చెప్పుకుపోతోంది పచ్చనాకు..

అలా చెబుతూ, చెబుతూ
ఇక ముందుకెళ్లటం సాధ్యంకాక...
ఓ చోట చటుక్కున ఆగిపోయింది...
వెంటనే పండుటాకులు అందుకున్నాయి
"ఏం ఆపేశావేం? కానీ...?" రెట్టించాయి
"మరీ.. మరీ..." గొణుక్కుంటోంది పచ్చనాకు...

తానూ ఏదో ఓరోజున 'పండు'టాకు
అవక తప్పదని అర్థమైంది 'పచ్చ'నాకుకు...
దాంతో మనసు భారంకాగా... తలవాల్చేసి,
పండుటాకులకేసి దీనంగా చూసింది
ఇందాకటిలా కాకుండా...
'పండు'టాకుల పాటలోని ఆర్తి
మనసుని పిండేయగా...
పండుటాకులను సగర్వంగా సాగనంపుతూ
సన్నగా పాటనందుకుంది...
ఇదంతా కళ్లారా చూసిన కోకిలమ్మ
పచ్చనాకుతో కలిసి కోరస్ ఇచ్చింది....!!!