Pages

Friday 1 October 2010

మాతృదేవోభవ.. పితృదేవోభవ..!!

పార్వతీ పరమేశ్వరుల పుత్రులైన వినాయకుడు, కుమార స్వామిల మధ్య విఘ్నాధిపత్యం కోసం పోటీ జరిగిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ... అసలు విషయాన్ని తడిమేముందు విఘ్నాధిపత్యం కథ కాస్త టూకీగా చూద్దాం...!

కైలాసంలో ఉన్న అన్ని తీర్థాలలోనూ స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం లభిస్తుందని పోటీ పెడతారు. ఈ పోటీలో భాగంగా కుమారస్వామి వేగంగా తీర్థాలవైపు కదిలితే... జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించినట్లైతే అన్ని తీర్థాలలోనూ స్నానం చేయడంతో సమానమన్న నిజాన్ని గ్రహించి, వారికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం మొదలుపెడతాడు వినాయకుడు.

నెమలి వాహనంపైన బయల్దేరిన కుమారస్వామికి ఏ తీర్థం వద్దకు వెళ్ళినా, అప్పటికే వినాయకుడు స్నానమాచరిస్తూ ఉండటం కనిపిస్తుంది. అన్ని తీర్థాలలోనూ స్నానం ముగించుకున్న కుమారస్వామి తల్లిదండ్రుల వద్దకు రాగా, అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు.

అమితాశ్చర్యానికి లోనైన కుమారస్వామి అదెలా సాధ్యం..? అని తల్లిదండ్రులను ప్రశ్నిస్తాడు. అప్పుడు వారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మొక్కడంకంటే, వారి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి తీర్థాలలో స్నానం చేయడమంత అవివేకం మరొకటి లేదని వివరించి చెబుతారు.

దీంతో తన తప్పు తెలుసుకున్న కుమారస్వామి తల్లిదండ్రులకు ప్రణమిల్లుతాడు. ఇదీ విఘ్నాధిపత్యం కథ. ఇది పురాణ కథే కదా..! అన్న విషయాన్ని కాసేపలా పక్కనపెట్టి.. ప్రస్తుత కాల పరిస్థితులను ఓసారి చూద్దాం...!


తల్లీదండ్రీ బ్రతికున్నంతకాలం వారి బాగోగులు పట్టించుకోవడం అటుంచి, వారు చనిపోయిన తరువాత మాత్రం కర్మకాండల కోసమో, సమాధుల కోసమో లక్షల కొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి... తమకు తల్లిదండ్రుల మీద ఉన్న ఖరీదైన ప్రేమను మాత్రం లోకానికి చాటుకుంటున్నారు ఈనాటి పుత్ర రత్నాలూ, పుత్రికా రత్నాలూ..!

కనీ పెంచి తమను ఇంతవాళ్లను చేసిన ఆ ప్రత్యక్ష దైవాలను నిర్లక్ష్యంగా వదిలివేసి, ధన సంపాదనలో పడిపోయి యాంత్రిక జీవనాన్ని గడుపుతూ, మానవ సంబంధాలను మరుగున పడేస్తూ, కృత్రిమంగా బ్రతికేస్తుంటారు వీరు.

తమ ఉనికికే కారణమైన కన్నవారిని పూర్తిగా మరచిపోయిన ఇలాంటివారు, సంవత్సరానికి ఒకసారి మాత్రం మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటి వాటిని మాత్రం బాగా గుర్తు పెట్టుకుని మరీ... ఆరోజు మాత్రం పలుకరిస్తున్నారు. వీలైతే వారి స్తోమతను బట్టి బహుమతులతో తమలో ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.

మరికొంతమంది పిల్లలైతే తల్లిదండ్రుల మీద ఉన్న అమితమైన ప్రేమను చాటుకుంటూ... వారిని వృద్ధాశ్రమాల పాలబడేస్తున్నారు కూడా...! తమను ఎన్నిరకాలుగా పిల్లలు దూరం చేసుకున్నప్పటికీ వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంటారు ఈ పిచ్చి తల్లిదండ్రులు.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానే ఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా.... అపర బ్రహ్మలైన పిల్లలకు మాత్రం ఇవేమీ పట్టవు. ఎన్నిజన్మలెత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని వీరు గ్రహించలేరు.

అందుకే... తల్లిదండ్రులను పూజించటంలోనే అసలైన, అమితమైన ఆనందమున్నదంటూ బొజ్జ గణపయ్య ఇచ్చిన సందేశం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రతి ఒక్కరికీ ఆచరణీయమే....!