బుల్లి బుల్లి చేతులతో
ముట్టుకుంటే మాసిపోయేంతలా
అచ్చం దేవకన్యలా
దూదిలాంటి మెత్తనైన మేనుతో
మెరిసిపోతున్న బుజ్జాయిని
సంభ్రమాశ్చర్యాలతో
మునివేళ్లతో స్పృశించాడతను...
అమాయకమైన బోసి నవ్వులతో
కళ్లల్లో ఒకింత మెరుపుతో
బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ చిన్నారి చేయి
తన వేలును గట్టిగా పట్టుకోగానే
మురిసిపోతూ గుండెలకు హత్తుకున్నాడతను
ఇక అప్పటినుంచి...
ఆ బుజ్జాయే ఆతని లోకం
ఆ బుజ్జాయి ఆవాసం ఆతని గుండెలపైనే
ఆ చిన్ని తల్లి నవ్వితే తానూ నవ్వాడు
ఏడ్చితే తానూ ఏడ్చాడు
అలా తన గుండెలపైనే పెరిగి పెద్దయిన
చిట్టితల్లిని వదలి వుండాలనే
ఊహ వస్తేనే విలవిలలాడిపోతాడతను
తనని వదలి వెళ్లాలంటే ఆమెదీ అదే స్థితి...
కానీ...
కాలం వారిద్దరికంటే గొప్పది
అనుకున్నట్లుగా అన్నీ జరిగిపోతే ఇంకేం..
ఒకానొక ఘడియన.....
ఈ ఇద్దర్నీ దూరం చేసేసింది
అప్పుడప్పుడూ కలుస్తున్నా
మానసికంగా అందనంత దూరం....
నువ్వు మారిపోయావు
ముందుట్లా లేవు
చిట్టితల్లి ప్రశ్నిస్తుంటే...
లేదమ్మా నేను మారలేదనీ
చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఓవైపు...
మీ ప్రేమంతా మీ సోదరి సంతానానికేనా
మరి మా సంగతేంటంటూ...?
తన సగభాగమూ నిలదీస్తుంటే
ఎవరికి ఏమి తక్కువ చేసాడో తేల్చుకోలేక
అటూ, ఇటూ, ఎటూ సర్దిచెప్పలేక మరోవైపు
ఆతని అవస్థ వర్ణనాతీతం........
కాలం ఆటల్ని అలా సాగనిస్తే....
"ప్రేమ" అనే మాటకు విలువేముంది
కాలం ఏర్పర్చిన సంకెళ్లను, హద్దుల్ని
చేధించిన "ప్రేమే" ఆ ఇద్దర్నీ మళ్లీ కలిపింది
ఆ ఇద్దర్నే కాదు.. అందర్నీ కలిపింది
మరెప్పటికీ విడిపోనంతగా
"అనుబంధం" గెలిచింది
మహీన్
1 day ago