Pages

Showing posts with label మా "ఇంటి" గోల. Show all posts
Showing posts with label మా "ఇంటి" గోల. Show all posts

Wednesday, 11 December 2013

అప్పుడు కుట్టీ... ఇప్పుడు జెస్సీ...!!



కుట్టీ అంటే... మేం పోగొట్టుకున్న బుజ్జి కుక్కపిల్ల అని నా బ్లాగ్ మిత్రులందరికీ తెలిసిందే. మరి ఈ కుట్టీ ఎవరని అనుకుంటున్నారా.. వచ్చేస్తున్నా అక్కడికే.

కుట్టీ జ్ఞాపకాలతో (కుట్టీ జ్ఞాపకాల్ని ఇక్కడ చూడండి) ఇక ఆ ఇంట్లో ఉండలేక.. కొన్నాళ్ల తరువాత పక్క వీధిలోని ఇంకో ఇంట్లోకి మారిపోయాం. ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్ వాళ్లు ఓవైపు, మేం మరోవైపు ఉండేవాళ్లం. బాల్కనీ మాత్రం ఇద్దరం ఉమ్మడిగా వాడుకునేవాళ్లం. తమిళం అంతంత మాత్రమే కాబట్టి.. ఓనర్ వాళ్లతో కాస్త దూరంగానే ఉండేదాన్ని. కానీ పాపం వాళ్లే ఆప్యాయంగా పలుకరించేవాళ్లు. మెల్లిగా వాళ్లతో స్నేహం మొదలైంది. నాకేం తెలుసు ఆ స్నేహం ఇంకో ఎడబాటుకు చేరువ అవుతోందని.

ఇంటి ఓనర్‌ మురుగేశన్ మేస్త్రీ. ఆయనకి ముగ్గురు పిల్లలు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుక్కి, పెద్ద కూతురికి పెళ్లిళ్లయ్యాయి. చిన్నమ్మాయి చదువుమానేసి ఇంట్లోనే ఉంటోంది. పెద్దమ్మాయి పేరు సరస్వతి. అందరూ సరసూ అనేవాళ్లు. చిన్నమ్మాయి విజయ... విజ్జీ. ఓనర్ కొడుకు బిడ్డ ప్రేమ్‌ని తమతోనే ఉంచుకుని చదివిస్తున్నారు.

సరసు నాకంటే పెద్దది కాబట్టి సరసక్క అనేదాన్ని. ఓనర్ దంపతుల్ని అమ్మా, అప్పా అని పిలిచేదాన్ని. విజ్జీని పేరుతోనే పిలిచేదాన్ని. కొన్నాళ్లకి వాళ్ల ఇంట్లో మనుషులుగా అందరికీ చేరువయ్యాం. ఎంతగా అంటే వాళ్ల బంధువులే కుళ్లుకునేంతగా.

నిజ్జంగా తమిళం ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే, అంతో ఇంతో చదవగలుగుతున్నానంటే.. ఇది వీళ్ల చలవే. తమిళం తప్పు తప్పుగా మాట్లాడుతుంటే వాళ్లు నవ్వుకుంటూ సరిదిద్దేవాళ్లు. ఆ ప్రేమ్ గాడైతే నన్ను ఎంతలా ఏడిపించేవాడో. కానీ పాపం వాడే నాకు అక్షరాలు నేర్పించాడు. ఒక్కోసారి వాళ్లు నవ్వుతుంటే ఉక్రోషంగా ఉండేది. ఆ ఉక్రోషంతోనే తమిళం బాగా నేర్చుకుని వాళ్లతో గడగడా మాట్లాడేయాలనే పట్టుదల కూడా వచ్చేసేది.

కాస్త తమాయించుకుని మళ్లీ నవ్వుతూ ఏదో మాట్లాడబోయి, మరేదో మాట్లాడి వాళ్ల ఇంట్లో నవ్వులు పూయించేదాన్ననుకోండి. కానీ నాకు లోలోపల వాళ్లు నాతో ఎంతగా ఆడేసుకుంటున్నారో చూడు అని ఏడుపొచ్చేది. అంతకంతకూ పట్టుదల పెరిగిపోయింది. ఎలాగైనా సరే నేర్చేసుకోవాలి అని.

తమిళం పిచ్చి ఎంతలా ముదిరిపోయిందంటే... ఎవరైనా తిట్టుకుంటుంటే, గొడవలు పడుతుంటే.. చాలా ఆసక్తిగా గమనించటం.. ఏం పదాలు వాడుతున్నారో నోట్ చేసుకోవడం.. తీరిగ్గా ఓనరమ్మ (అమ్మ) దగ్గర చేరిపోయి ఒక్కోటి ఆరాతీస్తూ అర్థాలు కనుక్కోవడం.. ఆమె నన్ను ఆటపట్టిస్తూనే తెలీని పదాలకి అర్థం చెప్పేది. అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే యాక్షన్ చేసి చూపించటమో, టీవీలో వస్తున్న సందర్భాల్ని చూపించటమో చేసేది.

కానీ అమ్మ దగ్గర నాకు అప్పుడు, ఇప్పుడూ నచ్చని ఒకే ఒక పదం.. నా పేరు. శోభ ఎంత అందమైన పేరు.. ఈ పేరుతో పిలవటం మీకు ఇష్టం లేదా అంటారేమో.. అలా పిలిస్తే నాకంటే సంతోషించేవాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా ఎప్పుడూ పిలవనే పిలవదు. నా పేరును ఎప్పటికప్పుడు ఖూనీ చేసేస్తూ... "సోఫా" అంటుంది. నన్ను పిలుస్తుందో సోఫాలో కూర్చోమంటోందో అర్థమయ్యేది కాదు నాకు. పిలుస్తోంటే పలకవేంటే అని తిట్టేది చాలాసార్లు.. అమ్మా నా పేరు సోఫా కాదు.. శోభ... అంటే ఆ.. అదుదా అనేది.

విషయం ఏంటంటే... తమిళంలో ప, ఫ, బ, భ... ఈ నాలుగు అక్షరాలకుగానూ ఒకే అక్షరం ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆ అక్షరాన్ని వాడుతుంటారు.. అలా నా అందమైన పేరు ఇలా ఖూనీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా సోఫా అంటే చాలు.. నాకు తెలీకుండా నేను పలికేస్తుంటాను చాలాసార్లు... తల్చుకుంటే నవ్వొస్తుంది.

ఆ కుటుంబంతో కలిసి ఉన్నన్ని రోజులు చెన్నై నగరం మొత్తం ఓ చుట్టు చుట్టేశానంటే నమ్మండి. గుళ్లు, గోపురాలు, చూడాల్సిన ప్రదేశాలు అన్నీ ఎడాపెడా తిరిగేశాను వాళ్లతో. మా ఆయన వీటన్నింటికీ దూరం సుమండీ. నేను మాత్రం ఆయన వచ్చినా, రాకపోయినా అమ్మావాళ్లతో కలిసి ఎగిరిపోయేదాన్ని.

అన్నట్టు చెప్పనేలేదు కదూ.. సరసు అక్క పుట్టింట్లోనే ఉంటోంది. తను గర్భవతి. కాన్పుకి రాలేదు తను.. భర్తతో ఏదో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. కొన్నాళ్లకి పండంటి బాబు పుట్టాడు తనకి. అప్పటిదాకా తమిళం నేర్చుకోవడం.. సిటీ మొత్తం తిరగడం నా వ్యాపకాలు. ఇక బాబుగాడు పుట్టాక ఇక వాడే లోకం. ఏ మాత్రం టైం దొరికినా వాడి దగ్గరే.

చిన్నచిన్ని చేతులు, కాళ్లు తాకుతూ... వాడి ప్రతి కదలికనూ ఆస్వాదిస్తూ ఎప్పుడూ వాడితోనే. ఎందుకో వాడిని చూస్తే నాకు కుట్టీ గుర్తొచ్చేది. అలా నాకు తెలీకుండానే నా మనసులో వాడికి "కుట్టీ" పేరును పెట్టుకున్నాను. వాడు కాస్త పెద్దయ్యాక ఆ పేరుతోనే పిలిచేదాన్ని.

వాడు పుట్టినా కూడా సరసు అక్క భర్త రాలేదు. ఆమె ఎప్పుడూ ఆ దిగులుతోనే పిల్లాడిని సరిగా పట్టించుకునేది కాదు. నాకా వేరే వ్యాపకం అంటూ ఏం లేదు వాడిని చూసుకోవడం తప్ప. అలా లేచింది మొదలు నిద్రపోయేదాకా వాడే లోకం. కుట్టీ అమ్మా, నాన్న ఎవరు అంటే మమ్మల్ని చూపించేవాళ్లు వీధిలో అందరూ. సరసు అక్క దగ్గర కంటే మా దగ్గర ఉండటమే వాడికి ఇష్టం.

ముఖ్యంగా మా ఆయన బొజ్జమీద పడుకోవడం వాడికి ఎంత ఇష్టమో. లెక్కలేనన్ని రోజులు వాడు అలా నిద్రపోయేవాడు. వాడు చేసే అల్లరిని భరించలేక ఒక్కోసారి ఏమైనా అంటే మా ఆయన నామీద ఇంతెత్తున లేచేవారు. అలా ఎన్నిసార్లు వాళ్లిద్దరూ ఒక పార్టీ అయిపోయేవారో... అయినా ఆ పార్టీ ఓట్లన్నీ ఎప్పటికీ నాకే కదా అనే ధీమాతో అస్సలు లెక్కపెడితే కదా నేను.

ఒకసారి వాడికి విరేచనాలు పట్టుకున్నాయి. ఎంతకీ తగ్గడం లేదు. ఆస్పత్రిలో వాడితోనే ఉండిపోయి బాగైన తరువాతే ఇంటికి వచ్చాం. అప్పటి మా ఆదుర్దా చూసి అమ్మావాళ్లు ఎంతగా ఫీలయ్యారో.. పిల్లాడంటే ఎంత ప్రేమ మీకు.. త్వరలో మీక్కూడా బోలెడుమంది పిల్లలు పుడతారులే సోఫా.. అంటూ అమ్మ తలనిమురుతూ ఉండిపోయింది.

వాడితో చాలా చాలా జ్ఞాపకాలు.. సరసు అక్కకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకని వాడికి వాళ్ల అన్న కూతురి గౌన్ వేసి నా దగ్గరికి పంపింది. నేను ఎంత సంబరపడిపోయానంటే.. ఉన్నఫళంగా ఫొటో స్టుడియోకి పరిగెత్తి వాడితో ఫొటో తీయించుకున్నాను. ఇప్పటికీ ఆ ఫొటో భద్రంగా ఉంది.. ఉందని అనుకున్నానుగానీ.. ఈ మధ్య కనిపించకుండా పోయింది. తల్చుకుంటే ఎంత ఏడుపు వస్తుందో.

రోజు రోజుకీ వాడితో విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. అలాగే ఉండనిస్తే కాలం గొప్పదనం ఏముంటుంది. అందుకే అది మరో ఎడబాటును మాకు రుచి చూపించింది.

ఇన్నాళ్లూ సరసు అక్కకి దూరంగా ఉన్న తన భర్త.. రాజీపడి రాకపోకలు సాగించాడు. కొన్నాళ్లు గడిచాక ఇక మనింటికి వెళ్దాం పదా అంటూ అక్కని బయల్దేరదీశాడు. ఇంట్లోవాళ్లు సరేనన్నారు. సరసు అక్క భర్తది పల్లెటూరు. చెన్నై నుంచి చాలా దూరంలో ఉంటుంది. ఒకరోజంతా ప్రయాణం చేయాలని చెబుతుండేవాళ్లు.

అమ్మ, సరసు అక్క ఒకరోజు నన్ను పిలిచి.. కుట్టీ ఇక వాళ్ల ఊరు వెళ్లిపోతున్నాడు.. సోఫా ఎలా ఉంటావో ఏంటో అని బాధపడ్డారు. నాకైతే నోట మాట రాలేదు. అంటే కుట్టీ ఇక ఇక్కడ ఉండడా అని ఏడుపు తన్నుకొస్తోంది. తమాయించుకుని వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నా.

ఏం చేయను సోఫా... ఎన్నాళ్లని పుట్టింట్లో ఉండను. ఎలాంటివాడైనా కానీ భర్తతో కలిసి ఉండటమే కదా నాకూ, అమ్మావాళ్లకు మంచిది అంది సరసక్క నా బాధని చూసి. బాధపడకు.. అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటుందిలే అని అమ్మ ఓదార్చింది.

వాడు రేపు ఊరెళ్తాడనంగా.. ముందు రోజు రాత్రి చూడాలి మా బాధ. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను నేను. మా ఆయన గుండెలమీద నిద్రపోతుండే వాడే గుర్తొచ్చేవాడు. ఆయనకి చాలా బాధగా ఉంది.. కానీ మౌనంగా ఉన్నాడు. నేను మాత్రం కంట్రోల్ చేసుకోలేక పోయాను.

వాడికేం తెలుసు.. హాయిగా నవ్వుతూ ఎప్పట్లా పరుగెత్తుకొస్తున్నాడు మా దగ్గరికి. వాళ్ల నాన్న దగ్గరికి అస్సలు పోతే కదా. అతను బలవంతంగా ఎత్తుకునేసరికి ఏడుపు అందుకున్నాడు. పిల్లాడిని ఏడిపిస్తూ తీసుకెళ్లటం ఎందుకు అనుకున్నాడో ఏంటో.. మళ్లీ మా దగ్గరికే ఇచ్చాడు. కాసేపు ఆడించి, సముదాయించి.. టాటా వెళ్తున్నారని చెప్పగానే వాడు సంతోషంతో వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లాడు.

చేతులు ఊపుతూ.. నవ్వుతూ వాళ్లూరికి వెళ్లిపోయాడు. తరువాత ఏవో పండగలు, పబ్బాలకి ఎప్పుడోగానీ వచ్చేవాళ్లు కాదు.

వాడు ఊరెళ్లిన తరువాత.. మేం ఇంట్లో ఉన్నామో, లేమో తెలీనంత మౌనంగా ఉండిపోయాం. వాడు గుర్తొస్తే ఏడ్చుకోవడం... బాధపడటం మినహా... ఒక్కోసారి మాపైన మాకే కోపం.. ఎవరికీ దగ్గర కాకూడదని.

"కుట్టీ" ఈ పేరుకి నాకూ చాలా దూరమేమో... ఆ విషయం తెలీక మళ్లీ వాడికి కుట్టీ అని పేరు పెట్టుకున్నాను. పేరు పెట్టుకున్నందుకో.. మరెందుకో... నాకు వాడు కూడా మిగలలేదు.. వాడి జ్ఞాపకాలు తప్ప.

అంతే ఇక ఆ ఇంట్లో ఉండలేకపోయాం... కాలం తన్నిన బంతిలా మళ్లీ ఇంకో మూలకి పడ్డాం.

కాలం అలా దొర్లిపోతోంది... మేమూ చెన్నె మూల మూలలకి దొర్లుకుంటూ వెళ్తూనే ఉన్నాం.. అలా ఓ మూలలో ఇప్పుడు...

కాలం గాయాలతో బండబారిపోయి.. అస్సలు ఎవ్వరినీ దగ్గరకి రానీయకుండా ఉండాలని బలంగా అనుకుంటూ... దగ్గర చేర్చుకోకుండా ఉండలేని బలహీనతతో మళ్లీ మళ్లీ కొన్ని బంధాలకి లోబడి పోవాల్సి వచ్చేది. అలా మావాడు "పిన్నీ, బాబాయ్" అంటూ మా జీవితాల్లోకి  చేరువయ్యాడు. ఈ బంధం బలహీనం అవకూడదనే ఆశతో బ్రతికేస్తున్నాం.. కానీ విధి వింత ఆటలో పావులం... ఆశ పడటమే మనవంతు.. అమలు చేయటం పైవాని వంతు. 



మావాడి ఆలనలో హాయిగా సేదదీరుతుంటే... ఇదుగో నేనున్నానంటూ అనుకోకుండా పలుకరించింది ఓ చిన్ని పిట్ట. తుర్రుమంటూ వచ్చేది, ఇల్లంతా నానా హంగామా చేసేసి మళ్లీ తుర్రుమనేది. ఉండేది కాసేపైనా ఆ అల్లరికి జీవితం అంతా ఫిదా అయిపోవాలనిపించేది. ఈ చిన్నిపిట్ట పేరు "జెస్సీ". పేరుకు తగ్గట్టే ఎంత ముద్దుగా ఉంటుందో... :)

పక్క పోర్షన్‌లో ఉండే లక్ష్మిగారు ఈ జెస్సీకి పెద్దమ్మ వరస. జెస్సీ అమ్మమ్మకి ఆపరేషన్ అయిన కారణంగా, జెస్సీ తల్లి డాక్టర్‌గా బిజీగా ఉన్న కారణంగా.. తనని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో.. రోజూ జెస్సీ నాన్న లక్ష్మిగారి దగ్గర వదిలి వెళ్లేవారు. రోజూ పొద్దున్నే రావడం.. రాత్రికి వెళ్లిపోవడం.. ఇదీ వరస. చాలా రోజులు నేను జెస్సీకి దగ్గర కాలేదు. కారణం తెలిసిందే.. దగ్గరైతే మళ్లీ బాధపడాల్సి వస్తుందనే.

ఒకరోజు బాల్కనీలోకి వెళ్తే పెద్దమ్మతో ఆ.. ఊ అంటూ కబుర్లు చెబుతోంది. నన్ను చూడగానే ఆంటీకి హాయ్ చెప్పమ్మా అంది లక్ష్మిగారు. హాయ్ చెప్పడమేకాదు నవ్వుతూ నామీదకి ఒంగిపోయింది. ఎత్తుకోకపోతే బాగుండదని అన్యమనస్కంగానే తీసుకున్నాను. నోట్లో రెండే రెండు పళ్లతో నవ్వుతూ హత్తుకుపోయింది జెస్సీ. అబ్బా... పాల వాసన గుప్పుమంది. కాసేపు అలాగే ఆడించి.. ఇచ్చేశాను. అంతటితో మనసు ఊరుకుంటేగా... కాసేపటి తరువాత కాళ్లు పక్కంటికే పరుగులు తీస్తుంటే.. ఇదీ వరస.. మళ్లీ పిచ్చి మొదలైంది.

నిజం చెప్పొద్దూ... నా కాళ్లు పక్కింటికి పరుగులు తీస్తే.. జెస్సీ వాళ్లింటో వదిలితే చాలు నేరుగా మా ఇంట్లోకి వచ్చేసేది. ఇక వచ్చినప్పటినుంచి ఇల్లంతా రణరంగమే. ఏ వస్తువూ ఒక చోట ఉండనీయదు. ఒకటే ఉరుకులు పరుగులు.. నాకైతే టైమే తెలిసేది కాదు. అది ఉన్నంతసేపు నాకు స్వర్గంలో ఉన్నట్టుండేది. ముద్దులు పెట్టేది.. కొరికేసేది. అలిగేది.. నువ్వు నాకు వద్దు పో అంటే ఏడుస్తూ హత్తుకుపోయేది.

కొన్నాళ్లకి ఎంత దగ్గరైపోయిందంటే.. అది ఒక రోజు రాకపోయినా నాకు పిచ్చి పట్టినట్టుగా ఉండేది. 14 నెలల ఆ పాప... ఇంట్లోకి వచ్చిందంటే చాలు సందడే సందడి. బెడ్ చూసిందంటే చాలు పైకి ఎక్కి.. అటూ ఇటూ పరిగెత్తేది. ముఖ్యంగా పల్టీలు కొట్టది. నాకైతే ఎంత భయం వేసేదో.. కానీ అది పల్టీలు కొట్టేసి హాయిగా నవ్వేసేది. తలమీదుగా ఒక్కసారిగా ఒళ్లంతా ఎత్తేసి అటువైపు పడేసేది.. ఎక్కడ మెడ పట్టేస్తుందో అని నా భయం.. కానీ అది అవేమైనా పట్టించుకుంటేగా...

రెడీ అయ్యి ఎక్కడికైనా బయల్దేరుతుంటే తనూ రావాలని మారాం చేసేది. బండి చూస్తే అస్సలు వదలదు. బండ్లో వెళ్లాలని ఒకటే గొడవ చేసేసేది. ఒక్కోసారి మంచి మూడ్‌లో ఉంటే... నవ్వుతూ టాటా చెప్పటం.. ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం చేస్తుంది. బాల్కనీలోంచి కింద ఎవరు కనిపించినా టాటా చెప్పటం మర్చిపోదు. ఇలాంటి పిల్లతో రోజూ ఎలా గడుస్తోందో తెలీకుండా గడిచిపోయేది.

ఈ ముచ్చటా మూన్నాళ్లే. అన్నీ సవ్యంగా జరిగిపోతే జీవితం ఎందుకు అవుతుంది. జెస్సీ అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడటంతో... ఆ పిల్లని ఇక్కడికి తీసుకురావడం లేదు. నాకేమో ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించేది. జెస్సీతో ఉన్న చనువు.. వాళ్ల అమ్మా,నాన్నలతో లేకపోవడం వల్ల ఆ పిల్ల కోసం వాళ్ల ఇంటికి వెళ్లలేని పరిస్థితి. వాళ్లు ఉండేది ఒకే ఊర్లో అయినా చాలా దూరంగా ఉండేవాళ్లు. పోనీ దాంతో ఫోన్లో మాట్లాడుదాం అనుకున్నా.. ఇంకా మాటలురాని పిల్లతో ఏం మాట్లాడతాం.

జెస్సీ గురించి గుర్తుకురాగానే... ఎప్పుడో తను ఆడుకుంటుంటే అనుకోకుండా మొబైల్లో తీసిన ఫొటోలను చూసుకుని తృప్తి పడటం మినహా ఇంకేం చేయలేకున్నా ప్రస్తుతానికి. అయితే ఈ చిన్నారి దేవీ గారి గురించి అప్పుడప్పుడు వాళ్ల పెద్దమ్మ చెబుతూ ఉంటుంది.. వాళ్ల అమ్మమ్మ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అన్నీ అమ్మాయిగారి కబుర్లేనట. బాగా అల్లరిదైపోయిందని... బొమ్మల్ని ఒళ్లోపెట్టుకుని జోల పాడుతోందని.. ఇలా కబుర్లే.. కబుర్లు..

చూడాలి.. దేవీగారూ ఎప్పటికి కరుణిస్తారో.. అప్పటిదాకా ఈ బాధ తప్పదు... అయినా వచ్చినా కాసేపే కదా.. మళ్లీ తనవాళ్లతో తను వెళ్లిపోతుంది... నేను ఇలాగే జ్ఞాపకాలతో ఉండక తప్పదు.. అంతే...

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడుగక...

వాన కురిసి కలిసేది వాగులో
వాగువంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో.......

వద్దు వద్దనుకున్నా దగ్గరవకుండా ఉండలేని ఓ పెద్ద బలహీనతతో వేగుతూ బ్రతుకీడుస్తున్న ఈ జీవికి.... కుట్టీ... మరో కుట్టీ... చిన్నా.... జెస్సీ... ఆ తరువాత ఇంకెవరో... ?????


Saturday, 31 December 2011

ఇలాగైతే ఎలా చెప్మా......!!??


"అబ్బా... ఏంటో ఈరోజు ఒంట్లో నలతగా ఉంది. ఏమీ తోచటం లేదు, ఏ పనీ చేయబుద్ధి కావటం లేదు. మరీ ఇంత నీరసంగా ఉందేంటి" అనుకుంటూ బెడ్‌మీద లేచి వెళ్ళబోతుండగా ఫోన్......

"ఈ టైంలో ఎవరబ్బా..... ఆలోచిస్తూనే ఫోన్ చూస్తే గౌతమి కాలింగ్"

"హలో.. గౌతమీ బాగున్నావా..... ఏం ఈ టైంలో ఫోన్ చేశావు?" అడిగా.

"అక్కా నే బాగున్నా. ఇదిగో నీ కూతురు మాట్లాడుతుందట" అంటూనే ఫోన్ ఇచ్చేసింది

"హలో... హనీ బాగున్నావా రా"

"వూ...వూ ద్దమ్మా ఏణున్నావ్. నేనూ చ్చా" (పెద్దమ్మా.. ఏడున్నావు. నేనూ నీ దగ్గరికి వస్తా) అని ఏడుస్తూనే మాట్లాడుతోంది

"ఏడవద్దురా తల్లీ... ఎందుకేడుస్తున్నావ్, అమ్మ ఏదీ?" అంటే

"అమ్మ ఏకో పోయింది. పిన్ని ఎత్తోంది. పిన్ని ద్దు. నువ్ రా. నేనొచ్చా.....ఊ... ఊ.... రా ద్దమ్మా" (అమ్మడికో ఎక్కడికో పోయింది పిన్ని ఎత్తుకుని ఉంది. పిన్ని వద్దు. నువ్వు రా, నీ దగ్గరికి నీనొస్తా.. రా పెద్దమ్మా అని దాని భాషలో పిలుస్తోంది)

"సరే. నేనొస్తాలే. నువ్వు ఏడవద్దు తల్లీ. మా బుజ్జి కదూ?" సముదాయించేందుకు ట్రై చేస్తున్నా

"ఇప్పే రా. నీనూ ఏడున్నా. నేనూచ్చా" ఏడుపు ఆపకుండా మాట్లాడుతూనే ఉంది (ఇప్పుడే రా. నువ్వు ఏడున్నావు, నేనే వస్తా)

"ఇప్పుడు రాలేన్రా. మళ్లొస్తాలే. నువ్వు ఏడవకుండా ఉంటేనే వస్తా"

"ఇప్పే రా" ఏడుపు ఏ మాత్రం ఆపకుండా ద్దమ్మా ద్దమ్మా అంటూనే ఉందది.

దాని ఏడుపు వింటుంటే నాకు ఇటువైపు కంట్లో నీళ్లు కారిపోతున్నాయి. చాలా బాధగా ఉంది. ఇప్పడు దగ్గరుంటే వచ్చి నన్ను హత్తుకుపోయుండేది. నేనేమో తనకు దగ్గర్లో లేను.

పక్కనే ఉండే ఇంట్లోంచి పెద్దమ్మ వచ్చి నన్ను ఎందుకు ఎత్తుకుపోవటం లేదు అనేది మా హనీ ఆలోచన.

నేనసలు ఆ వూర్లో ఉంటే కదా.. మా వూరికి 8 గంటల దూరంలో ఉండే ఊర్లో ఉన్న నేను ఉన్నఫళంగా హనీ దగ్గరికి ఎలా వెళ్లగలను. అదీ నా బాధ.

ఈ విషయం దానికి అర్థం కావటం లేదు. రెండేళ్లు దాటి 3 నెలల వయసున్న తనకి నేను వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఇంట్లోనే ఉన్నప్పటికీ వచ్చి ఎత్తుకోవటం లేదని బాధ. వాళ్ల అమ్మ లేకపోతే నా దగ్గరికి వచ్చి నాతోనే ఉండే ఆ పిల్లకి ఇప్పుడు నేను కావాలి. వాళ్ల అమ్మలాగే, నేను కూడా తనని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయానని బెంగ. అందుకే ద్దమ్మా ద్దమ్మా అని వెక్కిళ్లు పెట్టి మరీ ఏడుస్తోంది.

ఎంత ఊరడించినా అది ఊరుకోవట్లేదు. పైగా వెక్కిళ్లు. చాలా భయమేసింది నాకు. వెంటనే ఫోన్ పిన్నికి ఇవ్వు అంటే ఫోన్ కూడా ఇవ్వదు. ఏం చేయాలో తెలీక దాని ఏడుపు వింటూ నేనూ ఈవైపు ఏడుస్తూ అలాగే ఉన్నా. ఈలోగా గౌతమి ఫోన్ ఎలాగోలా లాక్కుంది.

"అక్కా వాళ్లమ్మ ఏదో పనిమీద బయటికి వెళ్తూ నా దగ్గర వదిలేసి వెళ్లింది. దానికి నా దగ్గర ఉండటం ఇష్టం లేదేమో. వెంటనే పెద్దమ్మ కావాలి అంది. లేదురా అంటే విన్లేదు. ఇంటికెళ్లి వెతికింది. నువ్వు కనిపించలేదు. గట్టిగా ఏడుస్తూ ద్దమ్మా ద్దమ్మా అంటోంది. గేటు గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలో తెలీక నీకు ఫోన్ చేశాను. నీ గొంతు వింటే అయినా ఊరుకుంటుందని. నీ గొంతు విని అదింకా ఏడుస్తోంది. నేను ఎలాగోలా సముదాయిస్తాలే నువ్వు బాధపడకు" అంది.

సరే ఎలాగోలా ముందు దాని ఏడుపు ఆపు. వింటుంటే చాలా బాధగా ఉంది అని ఫోన్ పెట్టేశా.

ఫోన్ పెట్టేశానేగానీ హనీ గురించే దిగులు. ఇందాకే ఒంట్లో బాగలేని నేను.. ఇప్పుడు నా మనసు కూడా పేషెంట్ అయ్యింది.

మా బాబాయ్ కూతురు మంజు. దాని కూతురే హనీ. మొన్నటిదాకా... సంవత్సరంలో ఏ మూడు నాలుగు సార్లో మావూరికి వెళ్తుండే నన్ను హనీ అంతగా గుర్తుపట్టేది కాదు. నా దగ్గరికి సరిగా వచ్చేది కాదు కూడా. అలాంటిది ఈ మధ్య మావూర్లో ఓ నెల రోజులు ఉండేసరికి అది నాకు చాలా దగ్గరైంది. రోజూ తనతోనే నాకు కాలక్షేపం. నా దగ్గరికి వస్తే వాళ్ల అమ్మను సైతం మర్చిపోయేది.

మా హనీ పిల్ల అందరు పిల్లల్లాంటిది కాదు. కాస్త వెరైటీ. ఈ కాలం పిల్లలు అమ్మ తినిపిస్తే కూడా తినకుండా చాలా మారాం చేస్తుంటారు. కానీ ఈ పిల్ల మాత్రం చాలా బుద్ధిగా ఆకలేసిందంటే చాలు... అప్పుడు ఎవరు తనకు అందుబాట్లో ఉంటారో వాళ్లను "బూ పెట్టు" అని అడిగిమరీ పెట్టంచుకుని తింటుంది. అది కూడా ఎవరైనా తినిపిస్తే ఇష్టం ఉండదు, తనే చక్కగా కలుపుకుని చిన్న చిన్న ముద్దలు చేసుకుని ఎంత చక్కగా తింటుందో. అది కూడా సరిపోయినంతే. కడుపునిండిందంటే చాలు ఆ తరువాత ఒక్క ముద్ద కూడా ముట్టదు. అది కూడా ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తింటుంది. ఇది నిజ్జంగా నిజం. చూసి ఎంత ఆశ్చర్యపోయానో.. అంతకంటే ఎక్కువగా మురిసిపోయాను.

ఒకరోజు నేను అన్నం తింటుంటే వచ్చింది. బువ్వ తింటావా అంటే ఊ అంది. అప్పుడు నేను వేడన్నంలో టొమోటో ఊరగాయ వేసుకుని తింటున్నా. అది తనకి కలిపి పెట్టేసరికి చాలా నచ్చేసింది. ఇక అప్పట్నించి బువ్వ కావాలి అని అడిగిందంటే పక్కన ఊరగాయ ఉండాల్సిందే. ఒకవేళ పెట్టకపోతే ద్దమ్మా ఊగాయ ట్టు (పెద్దమ్మా ఊరగాయ పెట్టు) అని అడిగిమరీ పెట్టించుకుని తింటుంది మా బుజ్జి పిల్ల.

అంతేకాదు పాస్ వచ్చినా సరే.. ద్దమ్మా పాస్... డ్రాయి తీ.. అంటూ నా దగ్గరికి వచ్చి డ్రాయిర్ తీయించుకుని బాత్రూంలోకి వెళ్తుంది. ఈ వయసులో ఇంత శుభ్రత ఎలా అలవాటైందోగానీ దానికి. నాకు మాత్రం తను ఏం చేసినా అబ్బురమే. 


 
ఓరోజు ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చింది. కొత్త బట్టలు వేసుకుని మరీ మెరిసిపోతోంది. నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. నిజం చెప్పొద్దూ నాకు అర్థం కాలేదు. "త్త ద్దలు.. జ్జెలు" అని అంటోంది. ఏంటి నాన్నా అని నేను అడుగుతుంటే వాళ్లమ్మ నవ్వుతూ.. కొత్త గుడ్డలు వేసుకున్నాననీ.. తన బ్లౌజ్‌కు గజ్జెలు కూడా ఉన్నాయని అంటోంది అక్కా అని చెప్పింది. ఓహో అలాగా.. భలేగుందిరా తల్లీ ఏదీ చూద్దాం రా అంటే.. దగ్గరికి రాదు. వాళ్లమ్మ ఎక్కడ తనను వదిలేసి ఊరికెళ్లిపోతుందో అనే భయంతో రావట్లేదని తరువాత అర్థమైంది నాకు.

నా దగ్గరుండేటప్పుడు ఎన్నెన్ని పనులు చేసేదో. నేను పాత్రలు తోముతుంటే తను కూడా చిన్న గ్లాస్ పట్టుకుని తోమేందుకు రెడీ అయిపోయేది. బట్టలు ఉతుకుతున్నా అంతే. చెత్త ఊడుస్తున్నా చీపురు తనకు ఇవ్వమని వచ్చేది. నువ్వు పట్టుకోలేవు అన్నా వినదు. కావాల్సిందే మొండికేసేది. చేసేదేంలేక తనకోసం ఓ చిన్న చీపురు రెడీ చేసి ఇచ్చాను. వంట చేస్తున్నప్పుడు కూడా అంతే ఉల్లిపాయలు చేత పట్టుకుని "నూనీ ఆ... సలేనా" (నేనూ చేస్తాను సరేనా) అంటూ నా గడ్డం పట్టుకుని అడిగేది. ఆ.. కానీ తల్లీ అనేదాన్ని నవ్వుతూ... ఆ ఉల్లిపాయ పొట్టుతీసేందుకు అది పడే అవస్థ చూసి ఎంత నవ్వుకునేదాన్నో.

ఓసారి నా చున్నీ తీసుకొచ్చి చీ కట్టు అని అడిగింది. ఏంటీ చీరా.. ఎందుకురా అంటే.. ట్టు ద్దమ్మా..... అంది. సరేనని చున్నీని సగానికి మడిచి కుచ్చిళ్లుపోసి చిన్నగా పైటలాగా వేస్తే ఆ పైట అటూ ఇటూ వేస్తూ ఎంత నవ్విందో. ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావ్ అంటే హ హ హ అంటూ వీధిలోకి పరిగెత్తింది. అలాగే ఓసారి వాళ్లమ్మను పెద్ద జడ వేసి మల్లెపూలు చుట్టమని అడిగిందట. ఎవరు చెప్పారో ఏంటో.. దానికి అలా చేయటం సంతోషం అంతే. చిన్న పిల్ల కదా.. ఏం చేసినా ఎంత బాగుండేదో. నిజంగానే వాళ్లమ్మ సవరంతో పెద్ద జడ వేసి పువ్వుల్ని చుట్టింది. అయితే కాసేపే ఉంచి తీసేసింది. పాపం హనీ బరువు మోయలేకపోయింది.

ఇకపోతే ఒక్క సెకండ్ కూడా అది కుదురుగా ఉండేది కాదు. ఎప్పుడూ ఏవేవో ఆటలు. కుక్కపిల్లలు, పిల్లులతో, బొమ్మలతో ఎన్ని ఆటలు ఆడుకునేదో. ఒక్కోసారి ఏమీ తోచకపోతే నా జుట్టుపై ప్రయోగాలు చేసేది. తల దువ్వేందుకు ట్రై చేయడం, జడ వేయడం.. అలా జడ వేస్తూ ఎన్ని కబుర్లు చెప్పేదో. చేతిలో ఆకేసి, పప్పేసి అంటూ.. చక్కిలిగింతలు పెట్టేది. నేను నవ్వకముందే తనే నవ్వేసేది. అది చూసి నేను ఎంత నవ్వేదాన్నో. తనకు కూడా చక్కిలిగిలి పెడితే ఎంతగా నవ్వేదో. ఎంత ముద్దుగా నవ్వుతుందో తను. నిజంగా స్వర్గమంటే ఇదేనేమో అనిపించేది నాకు.

అలా ముద్దులన్నీ మాటకట్టినట్టుండే తన నవ్వుల్నే చూశాను ఇప్పటిదాకా. అలాంటిది దాని ఏడుపు వింటుంటే భరించలేని బాధ. ఓ గంటసేపాగి మళ్లీ ఫోన్ చేశా. మళ్లీ అదే పరిస్థితి. ఏడుపు ఏ మాత్రం మానలేదు. పెద్దమ్మ ఇంట్లోనే ఉండి తన దగ్గరకు రాలేదని దాని బాధ. వాళ్ల అమ్మ వచ్చాక కూడా అలాగే ఏడుస్తోందట. వాళ్ల అమ్మను కూడా మా ఇంటికి తీసుకెళ్లి మళ్లీ చూసిందట. నేను లేను. అది ఏడుస్తూనే బాగా బెంగ పెట్టుకునేసిందని వాళ్ల అమ్మ మళ్లీ నాకు ఫోన్. నువ్ లా... ఏడున్నా ద్దమ్మా అంటోంది. సాధ్యంకాక ఫోన్ పెట్టేశా.

వాళ్లమ్మ ఏం సర్దిచెప్పిందోగానీ.. మరుసటి రోజుకు సర్దుకుంది. ఇక అప్పట్నించీ అప్పుడప్పుడూ ద్దమ్మతో మాట్లాడాలని వాళ్ల అమ్మని అడిగిమరీ ఫోన్ చేసేది. "ద్దమ్మా బాగున్నావా, బూతిన్నావా, ద్దనాయనా బాగున్నాడా, నువ్వెప్పుడొస్తావ్, నాకు చాకీటులు, బిస్కత్తులు తెచ్చావా" నాన్‌స్టాప్‌గా ఆగకుండా అడిగేది. నేను ఏం అడిగినా బుద్దిగా బదులిచ్చేది. ఆ కాసేపట్లోనే నువ్ బూ తిన్నావా అని ఎన్నిసార్లు అడిగేదో.. ఎన్ని బాధలున్నా దాని గొంతువింటే, అది చెప్పే కబుర్లు వింటే మనసంతా ప్రశాంతంగా అయిపోతుంటుంది నాకు.

ఇవ్వాళ కూడా ఫోన్... "ద్దమ్మా హాపీ నూ యర్, ఐలవ్వూ" అని చెప్పింది. పక్కన వాళ్లమ్మ చెబుతుంటే అలాగే చెప్పిందది. ఎంత బుజ్జి పిల్లో. నాకైతే ఈ లోకంలో ముద్దు ముద్దుగా పిల్చే ఎన్ని పేర్లున్నాయో, అన్ని పేర్లతోనూ తనని పిలవాలని అనిపించేస్తుంటుంది ప్రతిసారీ.

పసిపిల్లలు దేవుని రూపాలని ఊరికే అన్నారా అనిపిస్తుంది. అమాయకమైన ముఖం, అంతకంటే అమాయకమైన చేష్టలు. ముద్దు ముద్దు మాటలు, స్వచ్ఛమైన నవ్వులు.. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా... ఇవన్నీ దొంగపిల్ల హనీ నాకు ఎన్నో ఇచ్చేసింది. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అపురూపమైన జ్ఞాపకాలు. తను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.

మా హనీ పిల్లతో కలిసి మీ అందరినీ ఇలా పలుకరించేశానన్నమాట. ఆ పిల్ల కబుర్లు మీకు కూడా నచ్చే ఉంటాయనుకుంటున్నా. మీ అందరూ చల్లని మనస్సుతో ఆ చిన్నారిని ఆశీర్వదించేయండి మరి...



2011కు వీడ్కోలు పలుకుతూ... 2012కు స్వాగతం పలుకుతూ.. నేనూ, మా హనీ బ్లాగ్ మిత్రులందరికీ.... నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేస్తున్నామహో...... ఈ కొత్త సంవత్సరం అందరికీ సకల శుభాలను కలుగజేయాలనీ.. సుఖ సంతోషాలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ....

బోలెడన్ని నవ్వుల పువ్వులతో...
మీ
కారుణ్య, హనీ.

Monday, 19 December 2011

మా 'ఇంట్లో' ఓ 'కాంచన'........!!


ఎందుకో ఈరోజు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు.. అటూ, ఇటూ పొర్లుతూ, నిద్రపోయేందుకు ట్రై చేస్తున్నా..

ఈలోగా... "పిన్నీ..." నిద్ర పట్టడం లేదు.. ఎవైనా కబుర్లు చెప్పమ్మా..." అంటూ మావాడు వచ్చి లేపాడు.

"ఏం కబుర్లు ఉన్నాయి నాన్నా... నేనయితే ఏవేవో ఆలోచిస్తున్నా, నిద్ర పట్టడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు, నీకెందుకు నిద్ర పట్టడం లేదు.." అని అడిగా

"నేనేమీ ఆలోచించటం లేదు. ఎందుకో మరి నిద్రయితే రావటం లేదు పిన్నీ"

అది సరే అమ్మా... ఏదైనా పాట పాడు అన్నాడు

"పాటా, ఇప్పుడా.. టైం ఎంతయిందో చూశావా.. అంటూ గోడ గడియారంవైపు చూపించా.." అప్పుడు టైం సరిగ్గా 12 గంటలవుతోంది.

"ఏం పాట పాడాలంటే టైం చూసుకోవాలా ఏంటి.. పాడమ్మా"

"12 గంటలప్పుడు దయ్యాలు తిరుగుతుంటాయని అంటుంటారు అంతే కదా...?! నాకేమీ భయం లేదులే.. నువ్వు పాడాల్సిందే పిన్నీ" అన్నాడు మొండిగా

చుట్టూ చీకటి, ఇంటిపక్కన కిటికీకి దగ్గర్లో రావిచెట్టు, దానిపైన రకరకాల పక్షులు చిన్నగా శబ్దం చేస్తున్నాయి. గబ్బిలాలు వేలాడుతూ అదో రకమైన సౌండ్ చేస్తున్నాయి. నిజంగా దయ్యాల సినిమాలో సీన్ లాగా ఉంది పరిస్థితి. ఆ టైంలో మావాడు పాట పాడమనడం. నాకైతే ఎంత వణుకు పుట్టిందో...

"పాటా, లేదూ ఏమీ లేదు పోయి పడుకో నాన్నా" అన్నా

"నువ్వు పాడాల్సిందే.. లేకపోతే కాంచనను పిలుస్తా"

అస్సలే కొన్ని రోజులుగా కాంచన సినిమా ఎఫెక్ట్ తో ఉన్నా. కాంచన సినిమా చూసినప్పటినుంచి ఎందుకో ఇంతకుముందెప్పుడూ లేనంత భయంతో వణికిపోతున్నానంటే నమ్మండి. సరిగ్గా కారణం తెలీదుగానీ.. ఇది నిజం.

అది పసిగట్టిన మావాడు.. మాటిమాటికీ కాంచనలాగా ముఖంపెట్టి, గొంతుమార్చి భయపెట్టడం.. నేను భయపడుతుంటే ఎంచక్కా నవ్వుతూ కూర్చుంటున్నాడు.

చివరికి తను చెప్పింది వినకపోతే కాంచనను పిలుస్తా అనేంతగా తయారైంది పరిస్థితి. ఇదుగో ఇప్పుడూ అలానే బెదిరిస్తున్నాడు.

నేను ఏదో పాట పాడబోయా...

"అమ్మా.. ఇప్పుడుగానీ నువ్వు నిను వీడని నీడను నేనే"
అని పాడుండాలి. నిజంగా బెదిరిపోయుంటానేమో...... అన్నాడు. నిజంగా అలా అనుకోగానే భలే నవ్వొచ్చేసింది. పడిపడీ నవ్వాం ఇద్దరం... మేం ఇంతలా నవ్వుతుంటే, కంప్యూటర్ మోనిటర్‌లోకి తదేకంగా చూస్తూ, ఏదో చదువుతున్న మా ఆయనను చూసి ఇంకాస్త నవ్వాం. అయినా ఆయన లోకం ఆయనది....

"అరే నిన్ను భయపెట్టే ఛాన్స్ మిస్సయిపోయింది కదా చిన్నా" అంటూ మళ్లీ నవ్వా.

అలా, అలా కబుర్లు.... మరణం.. మరణం తరువాత జీవితం... పైకి టాపిక్ మారింది

"అది సరేగానీ... పిన్నీ చనిపోయిన తరువాత జీవితం ఉంటుందా...?"

"ఏమో..? నాకు తెలీదు...?"

"ఉంటుంది. స్వర్గం, నరకం కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. అదే మరణం తరువాతి జీవితం..." చెప్పుకుంటూ పోతున్నాడు

"నిజమా...?"

"అవును. కోర్కెలు తీరక అర్ధాంతరంగా మరణించినవాళ్లు ఇక్కడే భూలోకంలో మనతోపాటే తిరుగుతుంటారట. వాళ్లు అనుకున్నది జరగ్గానే, వెంటనే ఈ లోకం విడిచి వెళ్తారట" అంటున్న చిన్నాతో..

"అవును నిన్న రాత్రి నేను సినిమా చూస్తూ, నిన్ను పిలిచాను చూడు. సేమ్ ఇదే టాపిక్ తెలుసా..?"

"అవునా...? వెరీగుడ్ పిన్నీ... ఇప్పుడు నేను నీకు విషయాన్ని బాగా అర్థం చేయించవచ్చు
సో.. పిన్నీ... ఇప్పుడు నేను చెప్పొచ్చేదేమిటంటే.."

"అలా స్వర్గానికీ, లేదా నరకానికీ వెళ్లని వాళ్లంతా మనతోపాటు ఇక్కడే ఉంటుంటారన్నమాట..!"

"నిజ్జంగా.. నిజమా... అయితే..?!" నోరెళ్లబెట్టి అడుగుతున్నా..

నాలో ఆశ్చర్యంతో కూడిన భయాన్ని పసిగట్టిన మావాడు "అవును... ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే.. మన ప్రక్కనే కూర్చుని వింటుండవచ్చు. నిద్రపోతుంటే పక్కనే పడుకోవచ్చు. తింటున్నప్పుడు అవికూడా మనకు కంపెనీ ఇస్తుండవచ్చు. నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు.. ఇలా ప్రతి పనిలోనూ అవి కూడా ఉండి ఉండవచ్చు...." చెప్పుకుంటూ పోతున్నాడు

నిజం చెప్పొద్దూ... నాలో సన్నగా వణుకు ప్రారంభమైంది

దాన్ని కప్పిపుచ్చుకుంటూ "అయినా రాత్రిపూట ఇలాంటి విషయాలా చెప్పేది. ఇంకెలా నిద్రొస్తుంది" అన్నా కోపంగా

"నిజం ఎప్పుడు చెప్పినా ఒకటే పిన్నీ... నువ్వు ఇలా భయం దాచుకుంటూ, కోపం నటిస్తుంటే పక్కనే ఉండే దయ్యాలు చూస్తూ, నవ్వుకుంటూ ఉంటాయి. వాటిముందు నువ్వు చులకన అయిపోవద్దు... ధైర్యంగా ఉండాలి. సరేనా...?!" అంటూ అప్పటిదాకా అణచిపెట్టుకున్న నవ్వును ఇక ఆపుకోలేక పడి పడీ నవ్వాడు.


"నువ్వలా భయపడుతుంటే..
ఇంకొన్ని నిజాలు చెప్పాలనిపిస్తోంది పిన్నీ..."

నేనూ నవ్వేందుకు ట్రై చేస్తూ... "ఇంతకంటే ఇంకా నిజాలున్నాయా..?! వూ.. కానివ్వు..."

"ముఖ్యంగా.. పగలంతా మనకు కేటాయించిన దెయ్యాలు.. మన ఇంటిని రాత్రిపూట వాడుకుంటాయి. అలా అవి వాడుకుంటున్నప్పుడు మనం మధ్యలో ఎంటరయితే భలే చిరాకుపడతాయి తెలుసా...?!"


"ఏంటీ... మన ఇంటిని వాడుకుంటాయా...?"

 

"అవును.. ఇందులో వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే... నువ్వు రాత్రిపూట నిద్ర మత్తులో బాత్రూంకు (నిద్ర మధ్యలో బాత్రూంకి వెళుతూ చాలాసార్లు కాళ్లకి ఏదో ఒకటి తగులుకుని పడటం బాగా అలవాటు. అది చూసి చాలాసార్లు ఇంట్లోవాళ్లు నన్ను వెక్కిరిస్తుంటారు. దాన్ని మావాడు ఇలా గుర్తుచేసి ఆటపట్టిస్తున్నాడన్నమాట :) ) వెళుతుంటావు కదా... అప్పటికే అవి పాపం క్యూలో ఉంటాయి. అది తెలీనీ నువ్వు వాటన్నింటికంటే ముందుకెళతావు. అది చూసిన ఆ దెయ్యాలు నీపై కక్ష కడతాయిలే ఉండు..." నవ్వుతూ చెబుతున్నాడు

"అవునా...?! ఇది మరీ దారుణం.. మన ఇంటి బాత్రూం వాడుకునేందుకు అవి పోటీపడతాయా..?"

"అవును... మన జనాభాలాగే, వాటి జనాభా కూడా ఎక్కువే కదా.. అలాంటప్పుడు ప్రతి ఇంట్లోనూ అవి ఉన్నా, మనలాగా ఇద్దరు ముగ్గురు ఉండరు. చాలామందే ఉంటారు. అలాంటప్పుడు ఇంత చిన్న ఇల్లు సరిపోదు కాబట్టి, అవి వంతులవారీగా పనులు చేసుకుంటుంటాయేమో.......?!"


అదంతా నిజంగా జరుగుతున్నట్టు చెప్పుకుపోతున్నాడు మావాడు.

నాకైతే నిజమో, అబద్ధమో తెలీని పరిస్థితి...

అది నిజమే.. కళ్లముందు జరుగుతుందన్నంతగా వర్ణించి, వర్ణించి చెబుతూ, నవ్వుతూ.. నన్ను పరిశీలిస్తున్నాడు

ఆశ్చర్యమూ, నిజమేనేమోనన్న ఖంగారూ, అదో రకంగా ముఖంపెట్టి నవ్వాలో, కోపగించుకోవాలో తెలీని స్థితిలో ఉన్న నన్ను భయపెట్టడం తేలికేనని అర్థమైంది వాడికి. అయితే పాపం భయపడుతోంది. మరీ ఎక్కువగా భయపెడితే ఎక్కడ జ్వరం వస్తుందేమో అనుకున్నాడో ఏంటో.. ఆ రోజుకి అలా వదిలేశాడన్నమాట.

"సో... ఈ దయ్యాల జీవితం గురించి మరోసారి వివరంగా చర్చించుకుందాం పిన్నీ... ఇప్పుడు నాకు భలే నిద్రొస్తోంది.. నేను వెళ్లి పడుకోకపోతే, నా బెడ్‌ను అవి ఆక్రమించేస్తాయి.
వెళ్తాను... బాబాయ్ ఇక చదివింది చాలు, వచ్చి పడుకోండి" అన్నాడు నవ్వుతూనే....

నేను తనవైపు గుర్రుగా చూస్తుంటే... "పిచ్చి పిన్నీ..... నేనేదో నిన్ను ఆటపట్టించాలని చెబితే నువ్వు నిజమే అనుకుని నమ్మేస్తున్నావా ఏంటి...? ఏం భయపడకు.. అస్సలు దెయ్యాలు లేవు.. ఒకవేళ నాకు కనిపిస్తే అప్పుడు చెబుతాలే...! హాయిగా నిద్రపో..." అన్నాడు.


"ఏంటి దయ్యాలు నీకు కనిపిస్తేనా....?!
"

"అయ్యో... జోక్ చేశానమ్మా... నాకు కనిపించటం ఏంటి.. అసలు అవుంటే కదా...?!"


 "అదీ.. అలారా దారికి... ఇంకోసారి ఎప్పుడైనా నిద్ర రాలేదు.. ఏవైనా మాట్లాడు అని నా దగ్గరికి రా చెబుతా నీ సంగతి...?" అంటూ బెదిరించా

"అమ్మా... తల్లీ... వదిలేయ్... లేకపోతే......"

"లేకపోతే....?" రెట్టించాను

"ఆ.. ఏం లేదు.. గుడ్ నైట్ పిన్నీ, బాబాయ్..." అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు.

లేకపోతే... అని ఆగిపోయిన చిన్నా... దెయ్యాల్ని పిలుస్తా అనబోయి... మళ్లీ భయపెట్టడం ఎందుకని ఆగిపోయాడని నాకు తెలుసు.

తను చెప్పింది నిజం కాదని తెలిసినా...... మనసులో ఏదో మూల ఒక డౌట్... అలా ఆలోచిస్తూనే నిద్రపోయా...

మరుసటి రోజు అందరూ పనులకు వెళ్లిపోయిన తరువాత.. అసలు పగలు టైంలోనే నాకు ఆ దయ్యాలు నా పక్కనే ఉన్నాయేమో అనిపించేది. బాత్రూంకి వెళితే, నా ముందు క్యూ ఏమైనా ఉందా అని పరిశీలనగా చూస్తూ వెళ్లడం... వంట గిన్నెల్లో వండినది ఏమైనా ఖాళీ అయ్యిందేమో చూడటం...... కుర్చీల్లో ఎవరైనా కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుందేమోనని చూడటం... గ్లాసులో నీళ్లు వంపినవి అలానే ఉన్నాయా, కొంచె ఖాళీ అయ్యాయేమోనని పరిశీలించటం....
లాంటివి నాకు తెలీకుండానే జరిగిపోయాయి.

నిజం చెప్పొద్దూ....... ఇప్పుడు కూడా నేను ఇదంతా రాస్తుంటే అవి నా పక్కన కూర్చుని చదువుతున్నాయేమో అనిపిస్తోంది...


"ఇన్నాళ్లూ కాంచన ఎఫెక్ట్.. ఇప్పుడేమో ఇంట్లో దెయ్యాల ఎఫెక్ట్..." ఏంటో మరీ ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతే ఎలా చెప్పు తల్లీ..... అంటూ నా మనసు కూడా నన్ను చూసి నవ్వుకుంటోంది మా అబ్బాయిలా....
LOL

Monday, 1 November 2010

పాలు పొంగిపోతున్నాయి....!!

అవి... నేను ఇంటిపట్టునే ఉంటోన్న రోజులు... అయితే మిగతా రోజుల్లో ఉండరా ఏంటీ? అని అడగకండి. అంటే నేను ఏ ఉద్యోగమూ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నానండి అంతే...!!

అబ్బా...! ప్రారంభంలోనే విషయం పక్కదారి పడుతోందే..? పోన్లేండీ... అదలా వదిలేద్దాం.. ఇందాక చెప్పినట్లు నేను ఇంటిపట్టునే ఉంటోన్న రోజుల్లో టీవీ అంటే మహా పిచ్చి. అలాంటిలాంటి పిచ్చి కాదండి బాబూ... ఏ ఒక్క సీరియల్‌ (భాషా భేదాలు నాకసలే లేవు సుమా.. మరీ సీరియల్స్ విషయంలో...)ను కూడా వదలకుండా చూసేదాన్ని.

ఎంత పక్కా ప్రణాళికతో ఉండేదాన్నంటే... టీవీ సీరియల్స్ టైమింగ్స్‌ను బట్టి ఆయా పనులకు సమయాన్ని కేటాయించుకునేదాన్ని. చాలా బాగా నచ్చిన, మనసుకు హత్తుకునేలా ఉండే సీరియల్స్‌ను కళ్ళప్పగించి మరీ చూసేస్తుంటాన్లేండి. అలాంటి సమయంలో ఏ పనీ ముట్టుకునేది లేదు. కాస్త ఫర్వాలేదు అనుకునే సీరియల్స్ వచ్చేటప్పుడు మాత్రం వాటిని చూస్తూ మిగతా పనులు చేసుకునేదాన్ని.

ఆహా... ఈరోజు చూడకపోయినా ఫర్వాలేదు అనుకునే సీరియల్స్ టైమింగ్స్‌లో మాత్రం బయటపనులు చూసుకునేదాన్ని. కొన్ని ఛానెల్స్‌లో శని, ఆదివారాలు సీరియల్స్ తక్కువగా వచ్చే సమయంలో వారం మొత్తంలో చేయకుండా అట్టిపెట్టిన పనులను ముగించేయడం అలవాటుగా మారిపోయింది.

ఇంతకూ విషయానికి రాకుండా నా టీవీ సీరియల్స్ సోది చెప్పేస్తున్నాను. మీకు సోదిలాగా ఉందేమోగానీండి. నాకు మాత్రం రోజూ అలాగే గడిచిపోయేది మరి. మా ఆయన ఆఫీసుకు వెళ్ళి, మళ్ళీ తిరిగి వచ్చేదాకా నాకు అవే నేస్తాలు కాబట్టి వాటిమీద నాకు చాలా ప్రేమ (ఒక్కోసారి మా ఆయన్ని కూడా పట్టించుకోనంత) సుమా..!!

వందల ఎపిసోడ్లయినా ఆగని టీవీ సీరియల్స్ లాగే... రోజులలా గడుస్తున్నాయి. ఒకరోజు నాకిష్టమైన "చక్రవాకం" సీరియల్ వస్తోంది. అందులో ప్రధాన పాత్ర "ఇక్బాల్" చనిపోయే సన్నివేశం వస్తోంది. ఆ సీరియల్‌లో ఇష్టమైన ఆ పాత్ర చనిపోతుంటే ఓ వైపు గుండె తరుక్కుపోతోంది. కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. కళ్ళముందు టీవీ కూడా కనిపించలేనంతగా ఏడ్చేస్తున్నాను.

అంతగా ఏడుస్తున్నా... ఏదో మర్చిపోయానే అనుకుంటూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే, టీవీ ముందు నుంచి మాత్రం కట్టుకదలలేదండి. అమ్మతోడు. ఇంతలో ఏదో మాడుతున్న కమురు వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి.

అయ్యో...! అంటూ ఒక్క పరుగున చేతిలో రిమోట్ ఏమాత్రం వదలకుండా మరీ... కిచెన్‌లోకి (గుర్తొచ్చేసింది లెండి) పరుగెత్తాను. చూస్తే ఏముందీ... స్టవ్ పైన పాలుపెట్టి మరిచిపోయాను. అవి పొంగిపోతున్నాయి. స్టవ్‌ను ఆపేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. సాధ్యం కావటం లేదు. పాలేమో పొంగిపోతున్నాయి.

అబ్బా... ఎంతసేపు సాగదీస్తారు. ఏముంది స్టవ్‌ను ఆపేసేందుకు కుదరటం లేదా...? స్టవ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్‌ను కుడివైపుకు తిప్పేస్తే సరిపోదా..! అంటారేమో...? అక్కడే ఉందండీ తిరకాసంతా...! నేను స్టవ్‌‌ను ఆపేసేందుకు కుస్తీలు పడుతున్నాను. ఓ వైపు టీవీలో సీరియల్ కాస్తా అయిపోతోంది. ఒకటే టెన్షన్. పాలు ఇంకా పొంగుతూనే ఉన్నాయి.

ఇదిగో ఇదేం బాగాలేదు.. ఇంతకీ ఏం చేశారో చెబుతారా.. లేదా..? అంటూ అలా కోపంగా చూడకండే... చెప్పేస్తున్నాను. టీవీ రిమోట్‌తో నేను స్టవ్‌ను ఆపడానికి ప్రయత్నిస్తున్నానండి. ఎంతసేపు రెడ్ బటన్ నొక్కినా స్టవ్ ఆగడం లేదు. ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. తిట్టుకుంటూ ఏమయ్యింది ఈ స్టవ్‌కు అనుకుంటూ రిమోట్ బటన్‌ను విపరీతంగా నొక్కేస్తున్నాను. పాలు పొంగి పొంగి స్టవ్ కాస్తా ఆగిపోయింది. హమ్మయ్య ఇప్పటికైనా ఈ రిమోట్ పనిచేసింది అనుకుని గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి మళ్ళీ "చక్రవాకం"లో లీనమయ్యాను.

సీరియల్‌లో ఇక్బాల్ చనిపోతాడా... లేదా...? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.. తరువాయి రేపు చూడండంటూ సీరియల్ ఆరోజుకు అయిపోయింది. మళ్ళీ ఇంకో సీరియల్‌ వచ్చే గ్యాప్‌లో కిచెన్లోకి రాగానే ఇందాకటి పాలు పొంగిన విషయం గుర్తుకొచ్చింది. ఊరికే పాకెట్ పాలు పోయాయి. రేపు పెరుగుకు ఏంచేయాలబ్బా... అనుకుంటూ స్టవ్ ఆపేందుకు నేను చేసిన ప్రయత్నం, స్టవ్ ఆరిపోయిన వైనం అన్నీ లీలగా మెదిలాయి.

అంతే ఇంట్లో ఒక్కదాన్నే పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం మొదలెట్టాను. ఎంత సీరియల్ పిచ్చైతే మాత్రం అంతలా ఇదైపోవాలా? ఇంత చోద్యం ఎక్కడైనా జరిగుంటుందా...? "గ్యాస్‌స్టౌవ్‌ను టీవీ రిమోట్‌తో ఆపటమా..." నా తింగరిపనికి నాకే పట్టరాని కోపం, ఆ తరువాత తెరలు తెరలుగా నవ్వు దోబూచులాడాయి.

ఆ రాత్రి మా ఆయన ఇంటికి రాగానే జరిగిన తంతునంతా వివరించి చెప్పేసరికి... విన్నంతసేపు విని నావైపు అదోలా చూసి పడి పడి నవ్వారు. అయినా నీకు బుర్ర అనేది ఉంటేగా...? ఆ టీవీ సీరియల్స్ అన్నీ ఈ పాటికి నీ బుర్రని కొంచెం కొంచెంగా తినేస్తున్నాయి. ఆ సీరియల్స్ చూసే నీకు ఆపాటి తెలివితేటలు ఉంటాయిలే...! అంటూ నవ్వుతూనే ఉన్నారు. నేను లోలోపల నవ్వుకుంటూనే బయటికి మాత్రం ఉడుక్కుంటూ మా ఆయనవైపు గుర్రుగా చూస్తుండిపోయాను.

ఆ తరువాత మా ఇంటికి తెలిసినవారు, బంధువులు, స్నేహితులు ఎవరొచ్చినా సరే... మా ఆయన మాత్రం నేను చేసిన తింగరిపనిని పొగిడి పొగిడి మరీ చెప్పేవారు. అప్పట్లో తానలా చెబుతుంటే నాకు చాలా కోపం వచ్చేది. అయితే ఇప్పుడు కూడా ఆరోజు సంఘటన గుర్తొస్తే మాత్రం నవ్వాపుకోలేను....!!

Saturday, 9 October 2010

ఓ వర్షం కురిసిన రాత్రి....!

ఈరోజు ఎలాగైనా సరే బీచ్‌కు వెళ్ళాల్సిందే అనుకుంటూ...(అలా చాలా రోజులుగా అనుకోవడమేగానీ వెళ్లింది లేదు) ఆఫీసులో పని ముగించుకుని త్వరగా బయటపడ్డాం. నేనూ, మా అబ్బాయి, మావాడి ఫ్రెండ్ కలిసి బీచ్‌కు వెళ్దామనుకున్నాం. బస్‌స్టాప్‌లో ఎంతసేపు వెయిట్ చేసినా బస్‌ రాలేదు. మా వాడి ఫ్రెండ్‌కు ఇంకో ఫ్రెండ్ జతకలవడంతో సినిమాకు తుర్రుమన్నాడు. (వాడెప్పుడూ అంతే..!) ఇంకేముంది... ఎప్పట్లాగే ఆరోజు కూడా బీచ్‌కెళ్లే ప్రోగ్రామ్ అటకెక్కేసింది.

ఓ గంటసేపటి తరువాత బస్ రావడంతో బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాం. టీవీ పెట్టుకుని ఏదైనా ఓ మంచి ప్రోగ్రామ్ అయినా చూసేద్దాం అనుకుంటే... కేబుల్ కూడా సరిగా రావడం లేదు. ఇంక చేసేదేంలేక వీసీడీ ఆన్ చేసి హిందీ పాటలు పెట్టుకుని మిగతా పనుల్లో మునిగిపోయాను.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కేబుల్ రాకపోయినా, బీచ్‌కెళ్లకపోయినా మా అబ్బాయికి దిగులేం లేదండీ... ఎందుకంటే వాడికి ఇంట్లో కంప్యూటర్.. అందులో ఓ క్రికెట్ గేమ్ ఉంటే చాలు. ఆ గేమ్ ఆడుతూ అలా గంటలు గంటలు గడిపేస్తాడు. కాబట్టి... ఆరోజు వాడేం బాధపడలేదు సరికదా... క్రికెట్‌లో లీనమైపోయాడు.
వంట పూర్తిచేసి, మా ఆయన కోసం ఎదురుచూస్తుంటే... ఆయన రాలేదుగానీ ఫోన్ మాత్రం వచ్చింది. అందులో ఆయనే... నేను రావడం లేటవుతుంది. మా ఫ్రెండ్స్ ఇంటికెళుతున్నాను. మీరిద్దరూ తినేసి పడుకోండి అని చెప్పాడు. మరుసటిరోజు ఆదివారం, మా అబ్బాయి ఓ ఫంక్షన్‌కు వెళ్ళాల్సి ఉండటంతో.. త్వరగా తినేసి పడుకున్నాం.

మరుసటిరోజు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి, అబ్బాయిని ఫంక్షన్‌కు పంపేశా, మా ఆయన కూడా జర్నలిస్టుల సంఘం మీటింగ్ ఉందంటూ వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కదాన్నే... పని మాత్రం బోలెడు. వంట, ఇల్లు చక్కబెట్టుకోవడం, వారం రోజుల బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ ఓ వైపు పిలుస్తుంటే... నిద్రాదేవి కూడా నన్ను ఊరికే ఆవరించేస్తోంది.

ఏమైతే అయిందని వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి ఆన్‌చేసి, పడుకున్నాను. బాగా నిద్రపట్టేసింది. అలారం మోగుతున్నా నేను మాత్రం లేవలేకపోయాను. ఎలాగోలా లేచి వంటపూర్తి చేసేసరికి మా ఆయన, అబ్బాయి వచ్చేశారు. ఇద్దరికీ భోజనాలు వడ్డించి మళ్లీ పనిలో మునిగిపోయాను.

ఇక సాయంత్రం టీ టైం‌లో అమ్మా.. బీచ్‌కెళ్దామా..?! అని అడిగాడు మావాడు. మా ఆయన నేను రాను, సెలూన్‌కెళ్లాలి.. మీరిద్దరూ వెళ్లి వచ్చేయండి అన్నాడు. అంతకుముందే కరెంట్ పోవడంతో బట్టల పని ఆగిపోయింది, పిండి రుబ్బాలి, గలేబులు మార్చాలి... ఇవన్నీ పక్కనబెడితే అబ్బాయి ఆశగా అడుగుతున్నాడు. వాడికోసమైనా వెళ్లాల్సిందే అనుకుంటూ బయలుదేరాను.

హమ్మయ్య...! చాలా రోజుల నుంచీ బీచ్‌కెళ్లాలన్న కోరిక ఆరోజు తీరిపోయింది. సముద్రంలో వెన్నెల వెలుగులో పెద్ద పెద్ద అలలు స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నాయి. ఏవేవో కబుర్లు చెప్పుకుని, కాల్చిన మొక్కజొన్న కండె చెరిసగం తినేసి ఇంటికొచ్చేశాం.

మిగిలిపోయిన పనులను పూర్తిచేసే కార్యక్రమంలో నేను... ఓ ఇంగ్లీషు అనువాదపు సినిమాను చూస్తూ అందులో మునిగిపోయిన అబ్బా, కొడుకులిద్దరూ... ఈలోపు నేనున్నానంటూ జోరున పెద్ద వర్షం. బెడ్‌రూంలో కిటికీలు వర్షపు గాలికి ఊరికే కొట్టుకుంటుండటంతో వేసేందుకు వెళ్లాడు మా ఆయన.

ఎంతసేపటికి ఆ రూం నుంచి ఆయన బయటకు రావడం లేదేంటబ్బా అనుకుంటూ నేనూ మా అబ్బాయి వెళ్ళాము. ఏముంది చక్కగా ఆ రూంలో లైట్ ఆపివేసి కిటికీలోంచి బయట ఏపుగా పెరిగిన మునగచెట్టు నుంచి ఆకులు, కాయలు అందినకాడికల్లా తెంపుతూ కూర్చున్నాడాయన.

(మామూలు రోజుల్లో మునగచెట్టు కిటికీకి పక్కగా ఉన్నప్పటికీ అందేది కాదు. ఆరోజు జోరున వర్షం, హోరుగాలికి అది ఊగుతూ బాగా చేతికి అందింది. అలా మా ఆయన చేతికి అది దొరికిపోయింది... పాపం...!!)

అదలా ఉంచితే... తనకు తోడుకు కొడుకును కూడా పిలిచాడు మా ఆయన. నేను రానని వాడంటే... వస్తావా రావా అంటూ కోప్పడటంతో వాడూ వెళ్లి సాయం చేశాడు. మొత్తానికి కాస్తంత ఆకు, మునక్కాయలు కోసేసి గబగబా కిటికీలు వేసేసి వచ్చేశారు. బయట పదిరూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా... ఇలాంటి పని ఎందుకని నేను కోప్పడ్డాను.

దొంగతనం చేసి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది తెలుసా..? అయినా నువ్వు పల్లెటూర్లో పుట్టి పెరిగుంటే కదా.. తెలిసేందుకు అని నన్నే మా ఆయన ఎగతాళి చేశాడు. ఇంతలో మావాడు ఊరుకుంటాడా..? అమ్మా... ఆయన పల్లెలో పుట్టాడు కాబట్టి ఇలాంటివన్నీ బాగా అలవాటేలే...! అంటూ నవ్వుతూ సెటైర్ వేశాడు. నాకు నవ్వాగలేదు... మొదట గుర్రుగా చూసినా మా ఆయన కూడా నవ్వుతూ మాతో జతకలిపాడు.