Pages

Saturday, 9 October 2010

ఓ వర్షం కురిసిన రాత్రి....!

ఈరోజు ఎలాగైనా సరే బీచ్‌కు వెళ్ళాల్సిందే అనుకుంటూ...(అలా చాలా రోజులుగా అనుకోవడమేగానీ వెళ్లింది లేదు) ఆఫీసులో పని ముగించుకుని త్వరగా బయటపడ్డాం. నేనూ, మా అబ్బాయి, మావాడి ఫ్రెండ్ కలిసి బీచ్‌కు వెళ్దామనుకున్నాం. బస్‌స్టాప్‌లో ఎంతసేపు వెయిట్ చేసినా బస్‌ రాలేదు. మా వాడి ఫ్రెండ్‌కు ఇంకో ఫ్రెండ్ జతకలవడంతో సినిమాకు తుర్రుమన్నాడు. (వాడెప్పుడూ అంతే..!) ఇంకేముంది... ఎప్పట్లాగే ఆరోజు కూడా బీచ్‌కెళ్లే ప్రోగ్రామ్ అటకెక్కేసింది.

ఓ గంటసేపటి తరువాత బస్ రావడంతో బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాం. టీవీ పెట్టుకుని ఏదైనా ఓ మంచి ప్రోగ్రామ్ అయినా చూసేద్దాం అనుకుంటే... కేబుల్ కూడా సరిగా రావడం లేదు. ఇంక చేసేదేంలేక వీసీడీ ఆన్ చేసి హిందీ పాటలు పెట్టుకుని మిగతా పనుల్లో మునిగిపోయాను.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కేబుల్ రాకపోయినా, బీచ్‌కెళ్లకపోయినా మా అబ్బాయికి దిగులేం లేదండీ... ఎందుకంటే వాడికి ఇంట్లో కంప్యూటర్.. అందులో ఓ క్రికెట్ గేమ్ ఉంటే చాలు. ఆ గేమ్ ఆడుతూ అలా గంటలు గంటలు గడిపేస్తాడు. కాబట్టి... ఆరోజు వాడేం బాధపడలేదు సరికదా... క్రికెట్‌లో లీనమైపోయాడు.
వంట పూర్తిచేసి, మా ఆయన కోసం ఎదురుచూస్తుంటే... ఆయన రాలేదుగానీ ఫోన్ మాత్రం వచ్చింది. అందులో ఆయనే... నేను రావడం లేటవుతుంది. మా ఫ్రెండ్స్ ఇంటికెళుతున్నాను. మీరిద్దరూ తినేసి పడుకోండి అని చెప్పాడు. మరుసటిరోజు ఆదివారం, మా అబ్బాయి ఓ ఫంక్షన్‌కు వెళ్ళాల్సి ఉండటంతో.. త్వరగా తినేసి పడుకున్నాం.

మరుసటిరోజు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి, అబ్బాయిని ఫంక్షన్‌కు పంపేశా, మా ఆయన కూడా జర్నలిస్టుల సంఘం మీటింగ్ ఉందంటూ వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కదాన్నే... పని మాత్రం బోలెడు. వంట, ఇల్లు చక్కబెట్టుకోవడం, వారం రోజుల బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ ఓ వైపు పిలుస్తుంటే... నిద్రాదేవి కూడా నన్ను ఊరికే ఆవరించేస్తోంది.

ఏమైతే అయిందని వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి ఆన్‌చేసి, పడుకున్నాను. బాగా నిద్రపట్టేసింది. అలారం మోగుతున్నా నేను మాత్రం లేవలేకపోయాను. ఎలాగోలా లేచి వంటపూర్తి చేసేసరికి మా ఆయన, అబ్బాయి వచ్చేశారు. ఇద్దరికీ భోజనాలు వడ్డించి మళ్లీ పనిలో మునిగిపోయాను.

ఇక సాయంత్రం టీ టైం‌లో అమ్మా.. బీచ్‌కెళ్దామా..?! అని అడిగాడు మావాడు. మా ఆయన నేను రాను, సెలూన్‌కెళ్లాలి.. మీరిద్దరూ వెళ్లి వచ్చేయండి అన్నాడు. అంతకుముందే కరెంట్ పోవడంతో బట్టల పని ఆగిపోయింది, పిండి రుబ్బాలి, గలేబులు మార్చాలి... ఇవన్నీ పక్కనబెడితే అబ్బాయి ఆశగా అడుగుతున్నాడు. వాడికోసమైనా వెళ్లాల్సిందే అనుకుంటూ బయలుదేరాను.

హమ్మయ్య...! చాలా రోజుల నుంచీ బీచ్‌కెళ్లాలన్న కోరిక ఆరోజు తీరిపోయింది. సముద్రంలో వెన్నెల వెలుగులో పెద్ద పెద్ద అలలు స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నాయి. ఏవేవో కబుర్లు చెప్పుకుని, కాల్చిన మొక్కజొన్న కండె చెరిసగం తినేసి ఇంటికొచ్చేశాం.

మిగిలిపోయిన పనులను పూర్తిచేసే కార్యక్రమంలో నేను... ఓ ఇంగ్లీషు అనువాదపు సినిమాను చూస్తూ అందులో మునిగిపోయిన అబ్బా, కొడుకులిద్దరూ... ఈలోపు నేనున్నానంటూ జోరున పెద్ద వర్షం. బెడ్‌రూంలో కిటికీలు వర్షపు గాలికి ఊరికే కొట్టుకుంటుండటంతో వేసేందుకు వెళ్లాడు మా ఆయన.

ఎంతసేపటికి ఆ రూం నుంచి ఆయన బయటకు రావడం లేదేంటబ్బా అనుకుంటూ నేనూ మా అబ్బాయి వెళ్ళాము. ఏముంది చక్కగా ఆ రూంలో లైట్ ఆపివేసి కిటికీలోంచి బయట ఏపుగా పెరిగిన మునగచెట్టు నుంచి ఆకులు, కాయలు అందినకాడికల్లా తెంపుతూ కూర్చున్నాడాయన.

(మామూలు రోజుల్లో మునగచెట్టు కిటికీకి పక్కగా ఉన్నప్పటికీ అందేది కాదు. ఆరోజు జోరున వర్షం, హోరుగాలికి అది ఊగుతూ బాగా చేతికి అందింది. అలా మా ఆయన చేతికి అది దొరికిపోయింది... పాపం...!!)

అదలా ఉంచితే... తనకు తోడుకు కొడుకును కూడా పిలిచాడు మా ఆయన. నేను రానని వాడంటే... వస్తావా రావా అంటూ కోప్పడటంతో వాడూ వెళ్లి సాయం చేశాడు. మొత్తానికి కాస్తంత ఆకు, మునక్కాయలు కోసేసి గబగబా కిటికీలు వేసేసి వచ్చేశారు. బయట పదిరూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా... ఇలాంటి పని ఎందుకని నేను కోప్పడ్డాను.

దొంగతనం చేసి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది తెలుసా..? అయినా నువ్వు పల్లెటూర్లో పుట్టి పెరిగుంటే కదా.. తెలిసేందుకు అని నన్నే మా ఆయన ఎగతాళి చేశాడు. ఇంతలో మావాడు ఊరుకుంటాడా..? అమ్మా... ఆయన పల్లెలో పుట్టాడు కాబట్టి ఇలాంటివన్నీ బాగా అలవాటేలే...! అంటూ నవ్వుతూ సెటైర్ వేశాడు. నాకు నవ్వాగలేదు... మొదట గుర్రుగా చూసినా మా ఆయన కూడా నవ్వుతూ మాతో జతకలిపాడు.

6 comments:

శిశిర said...

:) బాగుంది.

పరిమళం said...

:) :)

శోభ said...

శిశిరగారూ, పరిమళంగారూ.. ధన్యవాదాలండీ.. :)

పాఠకుడు...! said...

శోభా గారు: యింత చిన్న విషయాన్ని కూడా ఒక కధానికలా అద్భుతంగా చెప్పారు. ఏదేమైనా మీరు కవితలే కాదు కధా ప్రక్రియలో కూడా అందెవేసిన చేయి అని చెప్పకనే చెప్పుతున్నారు. యిక మీ కవితల నుండీ ఏదీ మిస్ కాకూడదనే శపధం పెట్టుకున్నాను. :-)

శోభ said...

పాఠకుడు(యోహాన్)గారూ...

నా కవితలే కాకుండా, నా చిన్నపాటి కథానికల్లాంటి రచనలు కూడా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు.. మీలాంటి వారి వ్యాఖ్యలు మాలాంటి రచయిత (?)లకు బాధ్యతను గుర్తు చేస్తుంటాయి.. Thanks a lot Yohan Ji... :)

Unknown said...

⭐⭐⭐