Pages

Friday, 29 October 2010

బ్యాక్ టు హోమ్...!

"అన్నీ మంచి శకునములే" అని మనసులో పాడుకుంటూ... కోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టాము. ఎంట్రన్స్‌లోనే ఓ లాయర్ ఏం కావాలమ్మా...! అంటూ ముందుకొచ్చాడు. ఫలానా సార్... అంటూ వివరాలు అవీ చెప్పేసరికి, నాతో రండని తీసుకెళ్లాడు.

కోర్టు ఇంకోవైపు ఎంట్రన్స్ వద్ద పాండీబజార్ పోలీస్ స్టేషన్ క్రైం డిపార్ట్‌మెంట్ పోలీసాయన ఉంటే.. అతడివద్దకు తీసుకెళ్లాడు ఆ లాయర్. వెళ్లగానే ఆ పోలీసాయనను చూస్తూ... అందరూ నాదగ్గరే బాగా ఇరుక్కుపోతారండీ అన్నాడు తమిళంలో. దానికో నవ్వు పారేసిన పోలీసాయన కేసు వివరాలను విని, లాయర్ చెప్పినట్లుగా చేయండమ్మా అన్నాడు.

అంటూనే... కాసేపలా పక్కకు వెళ్లి, మళ్లీ మా దగ్గరకు వచ్చారు. కెమెరా వాల్యూ ఎంత ఉంటుందని? ప్రశ్నించారు. మేము చాలా రోజులు క్రిందట కొన్నాము కాబట్టి, ఇప్పుడు 3 వేల రూపాయల విలువ చేస్తుందని చెప్పాము. ఇంతలో ఆ లాయర్ ఓస్ అంతేనా ఇంకేం అడుగుతాము.. అంటూ ఓ నిట్టూర్పు విడిచాడు. పోలీసాయన ఏదో పని ఉండి వెళ్తూ ఎలాగోలా చేయవయ్యా.. అని లాయర్‌కు చెప్పేసి వెళ్లిపోయాడు.

ఇంక ఆ లాయర్ ఫీజు విషయంలో మాతో బేరాలు మొదలెట్టాడు. ఓ రెండువేలు ఇస్తారా అని అన్నాడు. ఏంటి సార్..! మా కెమెరా 3 వేలు అయితే మీకు రెండువేలు ఇచ్చేయాలా..? ఏమైనా న్యాయంగా ఉందాండీ... అన్నాన్నేను. ఇంకేం చేయనమ్మా ఇంకా చాలా పనులు చేయాలి... మీకు కెమెరా ఊరికినే చేతికి రాదు కదా..! అన్నాడు.

ఆ లాయర్ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో.. మా అబ్బాయి ఫ్రెండుకు ఫోన్ చేయమని చెప్పగా అతడు అందుబాటులో లేడు. ఇంకేం చేయాలబ్బా...! అనుకుంటుండగా మా కొలీగ్ ఒకరు గుర్తొచ్చాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పగా... అయ్యో..! ముందే నాకు చెప్పి ఉంటే నేను చూసుకుందును కదా..! అన్నారు. సరే ఓ పది నిమిషాలు ఆగి ఫోన్ చేయండి నేను ఏమైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తానని చెప్పారు.

ఓ పావుగంట తరువాత ఫోన్ చేయగా... ఆయన తన లాయర్ ఫ్రెండు ద్వారా ఆ కోర్టులోనే ఉన్న మరో సీనియర్ లాయర్ వివరాలు, ఫోన్ నెంబరు ఇచ్చి ఆయన వద్దకు వెళ్ళమన్నారు. ఇందాకటి లాయర్‌కు మాకు తెలిసినవారు ఉన్నారండీ... మీ సహాయానికి కృతజ్ఞతలంటూ సెలవు తీసుకున్నాము.

ఆ సీనియర్ లాయర్‌ను కలువగా... ఆయన తెలుగు తెలిసిన తన జూనియర్ లాయర్‌ను పిలిచి కేసు వివరాలు చెప్పి ప్రొసీడ్ కమ్మని చెప్పి పంపించారు. సార్... ఇంక మా కెమెరాను తీసుకెళ్లిపోవచ్చా... అని అడిగాను ఆ తెలుగు లాయర్‌ను. అంత ఈజీగా ఎలా తీసుకెళ్తారమ్మా...! ఇంకా చాలా పనులున్నాయని అన్నారు. అప్పుడుగానీ మాకు తెలియదు మా కెమెరా మా చేతికి రావాలంటే ఇంకా మూడు, నాలుగు రోజులు పడుతుందని...

సరేనండీ... ఇప్పుడేం చేయాలి మళ్లీ నేనే అడిగాను. మొదటగా పిటీషన్ ఒకటి తయారు చేయించాలి. ఈ పిటీషన్‌ను జడ్జి కూర్చోకముందే పొద్దుటిపూటే పెట్టేయాలి. ఇప్పుడు ఒంటిగంట అవుతోంది కాబట్టి ఇంక రేపు పొద్దున్నే వేయాలి. ఈరోజేం చేయలేం అన్నాడాయన. ఎంతో ఆశగా కెమెరాను తీసుకెళ్లొచ్చు అనుకుంటుంటే మళ్లీ రేపు కూడా రావాలా...? బాగా నీరసపడిపోయాను.

పిటీషన్ తయారీ పనులు గట్రా.. అన్నీ పూర్తి చేసుకుని రేపు పొద్దుటే వస్తామని చెప్పి లాయర్‌కు చెప్పి కోర్టునుండి బయటపడ్డాము. మరుసటిరోజు కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరై... పిటీషన్‌ వేసింది తానేనని, కెమెరా నాదేనని చెప్పాను. సరేనమ్మా..! ఇప్పుడు మీరు ఇంటికెళ్లిపోయి మూడు రోజుల తరువాత రండి... ఆరోజు కెమెరాను మీవెంట తీసుకెళ్లచ్చు అన్నాడు లాయర్.

మూడురోజుల తరువాత మళ్లీ కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరవగా.. ఆయన కెమెరాను నాకు హ్యాండోవర్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేశారు. హమ్మయ్య... అనుకుంటుండగా కాసేపు కూర్చొండి ఇదో వస్తానంటూ బయటికెళ్లి తిరిగొచ్చాడు లాయర్. మీ ఆర్డర్ టైప్ చేసినందుకు, రికార్డ్స్ వెతికిపెట్టినందుకుగానూ వాళ్లు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఓ రెండొందలు ఇవ్వండని అడిగారు.

అన్ని ఖర్చులకుగానూ ఆయనకు అప్పటికే డబ్బులు ముట్టజెప్పేశాను. మళ్లీ ఆయనలా అడిగేసరికి బిత్తరపోయాను. అదేంటండీ అప్పుడే డబ్బులిచ్చేశాను కదా..! మళ్లీ అడిగితే నేనెక్కడికి పోను అన్నాను. ఆయనలాగే ఉండిపోయేసరికి మావాడు పక్కకు పిలిచి మనం ఇవ్వకపోతే ఇంకాసేపు లేటవుతుంది, ఎందుకొచ్చిన గొడవ ఇచ్చేద్దామని చెప్పాడు. నేను సరేనన్నాను.

డబ్బు ఇవ్వగానే ఆయన ఎవరిదగ్గరకో పోయి, అన్నీ పేపర్లను రెడీ చేయించి పైన ఉండే ప్రాపర్టీ రూంకు తీసుకెళ్లాడు. అక్కడ వివరాలన్నింటినీ రికార్డు చేసే ఆయన... చివర్లో డబ్బు డిమాండ్ చేయగా మా లాయర్ నావైపు చూయించాడు. ఏమ్మా మాకు రాసినందుకుగానూ ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్నాడు. మొదట ఇవ్వనని బయటికి వచ్చేశాను.

అతను ఊరుకుంటాడా..? బయటికి నాదగ్గరికి వచ్చి నేనిప్పుడు జడ్జి దగ్గరకు సంతకం చేయించేందుకు వెళ్లాలి. అతను సంతకం చేస్తేనే మీకు కెమెరా ఇవ్వగలను అని గొణుగుతూ పక్కన నిల్చున్నాడు. నేను ఉండేకొద్దీ లేటవుతుందని చేసేదేం లేక అతనికి కొంత డబ్బు ఇవ్వగానే అతనెళ్లి సంతకం చేయించుకొచ్చి నన్ను లోపలికి పిలిచి కెమెరాను అప్పజెప్పాడు.

కెమెరాను నా చేతికి తీసుకుని ప్రాపర్టీ రూం క్లర్క్‌కు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి సంతోషంగా మా అబ్బాయి చేతికి కెమెరాను అందించాను. గబగబా కెమెరాను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న సెల్స్ వేసి చూస్తే... మంచి కండీషన్లోనే ఉంది. సార్ మనకు చాలా సాయం చేశారంటూ వెంటనే మావాడు లాయర్‌ను ఓ ఫోటో తీశాడు. లాయర్‌కు, సీనియర్‌ లాయర్‌కు థ్యాంక్స్ చెప్పి కోర్టు నుండి బయటపడ్డాము.

ఇదండీ నేను పోగొట్టుకుని ఎట్టకేలకు సాధించుకున్న మా బుల్లి కెమెరా కథ. పోగొట్టుకుని ఎలాగైనా తెచ్చేసుకున్నారు కదా...! అయినా మూడు, నాలుగు రోజులు ఆ కథను ఆపకుండా రాసేయాలా..? అనుకుంటున్నారా..?! మీకు చదివేందుకే అంత ఇబ్బందిగా ఉంటే... దాదాపు ఓ ఐదారు నెలలపాటు నేను పడ్డ కష్టం ఎలా ఉంటుందో ఆలోచించండి.

ఇంతకూ నేను పోగొట్టుకున్న కెమెరా... మేం కొన్నప్పటి ధర 10 వేల రూపాయలు కాగా... నేను దాన్ని తిరిగీ దక్కించుకునేందుకు మరో 2 వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వచ్చింది.

అయినా నేను ఈ కథ ద్వారా చెప్పదలచింది మాత్రం ఒక్కటే...! బయటికి వెళ్లేటప్పుడు మన వస్తువులపట్ల తగినంత జాగరూకతతో లేనట్లయితే... చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వస్తువును పోగొట్టుకున్నట్లయితే తిరిగీ దానికోసం ప్రయత్నించకండి.. ఒకవేళ ప్రయత్నిస్తే.. మేం ఎదుర్కొన్న కష్టాలు మీకూ తప్పవు.

(సమాప్తం)

Thursday, 28 October 2010

కొండను తవ్వి....!!

"కొండను తవ్వి ఎలుకను పట్టిన" చందంగా మారిపోయిందండి నా పరిస్థితి. ప్రతిరోజూ... మా ఆయన చెత్తకుప్పలా పేర్చి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డుల కవర్ల భండాగారాన్నంతా తవ్విపోయడమే పనిగా పెట్టుకున్నాను. (మరేం లేదు... మా ఆయన ఆ కెమెరాను క్రెడిట్ కార్డుతో కొన్నారులేండీ..!) వీటిల్లోనయినా కనీసం ఆ బిల్లు ఒరిజినల్ కాకపోయినా, డూప్లికేట్ కాపీ అయిన దొరుకుతుందన్న ఆశ నన్ను అంతపని చేయిస్తోంది మరి...!

కెమెరా సంగతి పక్కకుపోయి, కెమెరా బిల్లు సంపాదించటానికి పడరాని పాట్లు (వెతకడం) పడాల్సి వస్తోంది. ఇదేం ఖర్మరా బాబూ..! అనుకోని రోజు లేదంటే నమ్మండి. స్నేహితులు, కొలీగ్స్‌, బంధువులు అందరూ... ఇలా చేయండి, అలా చేయండి అంటూ సలహాలిస్తున్నారుగానీ... బిల్లు మాత్రం కనిపించే దారే లేకుండా పోయింది.

ఓ రోజు లంచ్ టైంలో మా కొలిగ్ ఒకతను "ఏంటండీ కెమెరా కోర్టు నుండి తెచ్చేసుకున్నారా..? బిల్లు కనిపించిందా..?" అంటూ కుశలప్రశ్నలు వేశాడు. "మూలిగే నక్కపై తాటికాయ పడటం" అంటే ఏంటో అర్థమైంది అతని ప్రశ్ననుండి నాకు. లేదండీ బిల్లు కనిపించలేదు అన్నాను. ఆరోజు మీరు కొన్న క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ అయినా వెతికి పట్టుకుంటే... డూప్లికేట్ బిల్లు సంపాదించవచ్చు అని అన్నాడతను.

ఇంకో సీనియర్ కొలిగ్ ఇంకొకరు మా చర్చలో కల్పించుకుంటూ.. దీని కోసం ఎందుకింత టెన్షన్ పడుతున్నారు. "ఇండెమ్నినిటీ" బాండ్ వేశారంటే... మీదగ్గర బిల్లు లేకపోయినా కెమెరాను తెచ్చేసుకోవచ్చు అన్నాడు. ఎలాగ సార్...? అన్నాను ఆశగా...

మరేం లేదమ్మా..! ఇండెమ్నినిటీ బాండ్ అంటే... "ఈ వస్తువును భవిష్యత్తులో తమదే అంటూ ఎవరైనా క్లెయిమ్ చేసినట్లైతే దానికి నేను బాధ్యత వహిస్తాను" అని అర్థం... అంటూ వివరంగా చెప్పాడు. నేను సరేనండీ... అలాగే చేస్తాను... థ్యాంక్స్ అంటూ తలాడించేసి వచ్చేశాను.

ఇండెమ్నిటీ బాండ్ సంగతలా ఉంచితే.. ఒరిజినల్ బిల్ కోసం నా వేటను మాత్రం ఆపలేదు... అలా వెతుకులాటలోనే మరికొన్ని నెలలు గడిచాయి. "ఓరి దేవుడా.. ఇలాగైతే నాకిష్టమైన కెమెరా నాకు దక్కేలా లేదు. ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సరే కోర్టుకెళ్లాలి. అక్కడికెళితే ఏంచేయాలో లాయరే చెబుతాడు" అంటూ ఓ నిర్ణయానికి వచ్చేశాను.

ఓ రోజు లీవుపెట్టేసి... సాయంకాలం ఇంటికెళ్లాను. ఆశ చావక చివరిసారిగా... ఓసారి వెతికి చూద్దాం అనుకుంటూ... ఎక్కడో మంచం కింద దాచిపెట్టిన మరికొన్ని కాగితాల గుట్టను కదిలించాను. చాలా సీరియస్‌గా బిల్లుకోసం వెతికేస్తున్నాం. ఎక్కడా దాని ఆనవాళ్లు కనిపించడం లేదు.

పట్టువదలని విక్రమార్కుల్లాగా... మా ప్రయత్నం ఆపలేదు... ఇంతలో అమ్మా...! దొరికేసింది అంటూ ఓ పెద్ద కేక పెట్టాడు మావాడు. హమ్మయ్యా..! ఇప్పటికైనా దొరికింది కదూ...! అంటూ చూస్తే... అది బిల్లుకాదు... క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్. అందులో కెమెరా కొన్న తేదీ స్పష్టంగా ఉంది... ఇదైనా సరే దొరికింది అనుకుని మనసుకు సర్దిచెప్పుకున్నాము. మరుసటి రోజు కోర్టుకెళ్లాలి కాబట్టి త్వరగా తినేసి పడుకున్నాము.

ఆరోజు గురువారం... కోర్టుకెళ్లాలి కాబట్టి త్వరత్వరగా రెడీ అవుతున్నాము. ఇంతలో ఏదో అవసరమొచ్చి బీరువా లాకర్‌లో చెయ్యి పెడితే కొన్ని బిల్లులు చేతికి తగిలాయి. ఏంటో చూద్దామనుకుని విప్పి చూద్దును కదా...! సంతోషంతో నాకు నోటమాట రాలేదు. నేను దేనికోసమైతే నెలల తరబడీ వెతుకుతున్నానో... అదేనండీ డిజిటల్ కెమెరా ఒరిజినల్ బిల్లే అది.

మావారికి, అబ్బాయికి చూయిస్తే... మావాడు నాకు రెండు చేతులెత్తి నమస్కరించేశాడు. మా ఆయనైతే నావైపు గుర్రుగా చూశాడు. నీ మతిమరపువల్ల ఎన్నిరోజులు, ఎంతగా కష్టపడ్డాము, ఎంతలా వెతికాము, ఎన్ని తిప్పలు.. అంటూ నాకు బాగా అక్షింతలు పడ్డాయి. వాళ్లెంతలా మాట్లాడుతున్నా... మౌనంగా నవ్వుతూ ఉండిపోయాను (బిల్లు దొరికిన సంతోషం కాబోలు...!)

హమ్మయ్య...! శకునం బాగానే ఉంది. బిల్లు దొరికేసింది కాబట్టి కెమెరాను ఈరోజు ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనుకుంటూ ఉత్సాహంగా కోర్టుకు బయలుదేరాము....!! ..............

Wednesday, 27 October 2010

అసలు చిక్కల్లా దాంతోనే...!

కెమెరా దొరికిందన్న మాటేగానీ... ఇల్లు చేరే మార్గం కనిపించడం లేదు. క్రితం ఆర్టికల్‌లో రాసినట్లుగా ఏ రోజుకారోజు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ రాకపోతుందా...! అని ఎదురుచూపులే మిగులుతున్నాయి.

ఫోన్ రాకపోతే పోయింది మనం ఒక్కసారి వెళ్లి అడిగివద్దాం అంటాను నేను. ఉండమ్మా మనం తొందరపడితే వాళ్లు కోపగించుకుంటారేమో అంటాడు మావాడు. అదిసరేగానీ మీ కొలీగ్‌ను సలహా అడిగిచూడు. అతనెలా చెబితే అలా చేద్దాం అన్నాను.

మీకు చెప్పనేలేదు కదూ...! మేము పోలీస్ స్టేషన్లో కంప్లైయింట్ ఇవ్వడానికి ముందు మావాడి కొలీగ్ సలహా తీసుకున్నాము. మా కోసం స్టేషన్‌కు కూడా వచ్చాడు. తమిళ పత్రికారంగంలో పనిచేసినవాడు కాబట్టి కాస్తంత ఇన్‌ఫ్లుయన్స్ ఉంటుందని, పోలీసులు ఆమ్యామ్యాలు అడగకుండా ఉంటారని తన సాయం తీసుకున్నాము.

మరుసటిరోజు మావాడు తన కొలీగ్‌ను అడిగితే... నాకొక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు, అతడినడిగి సలహా తీసుకుని మీకు ఏ విషయం చెబుతానని అన్నాడు. అన్నాడేగానీ ఆ ఊసే మర్చిపోయాడు. అలా రోజులు గడిచిపోసాగాయి. మళ్లీ ఓరోజు గట్టిగా అడిగితే సాయంత్రానికల్లా ఏ విషయం చెబుతానని అన్నాడు. చెప్పలేదు సరికదా... ఆ మర్నాడు తన ఫ్రెండ్ ఊర్లో లేడని చెప్పాడతను.

ఇక లాభం లేదనుకుని మేమే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాము. ఫలాన అని వివరాలు చెప్పిన తరువాత అక్కడి యస్సై మీ కేసు తీర్పు అయిపోయింది. మీ కెమెరా సైదాపేట కోర్టు ప్రాపర్టీ రూంలో ఉంది. మీరు వెళ్లి రికవర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అదేంటి సార్ కేసు ఎప్పుడో అయిపోతే మాకు ఇంతవరకూ చెప్పనేలేదు. ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నారు కదా...! అని అడిగాను.
నిజమేనమ్మా...! ఇక్కడ చాలామంది లీవ్‌లో ఉన్నారు. మీ కేసును డీల్ చేసినవారు కూడా లీవ్‌లో ఉన్నారు. దాంతో మీకు "ఇన్‌టైంలో ఇన్‌ఫాం చేయలేకపోయాము" అన్నాడు. సర్లే అనుకుని కోర్టుకెళ్లిన తరువాత ఎలా ప్రొసీడ్ అవ్వాలో వివరంగా చెప్పమని రిక్వైస్ట్ చేశాను.

ఆయన కేసు వివరాలన్నింటినీ ఓ పేపర్లో రాసిచ్చి, ఓ లాయర్‌ను సంప్రదించమని చెప్పాడు. అంతేగాకుండా... కెమెరా మీదేనన్న ఆధారాలు, ఒరిజినల్ బిల్స్ గట్రా ఉన్నాయా...! అంటూ ఆరా తీశాడాయన. కెమెరాలో ఫోటోలు ఉన్నాయి కదండీ.. అంతకు మించిన ఆధారాలేం కావాలి అన్నాను నేను. "అవి సరిపోవమ్మా.. కోర్టులో జడ్జి ఒరిజినల్ బిల్స్‌ను తప్పకుండా అడుగుతారు. కాబట్టి మీరు బిల్స్ పట్టుకుని వెళితే పని సులువవుతుంది" అని చావుకబురు చల్లగా చెప్పాడు ఆ యస్సై.

అలాగే.. వస్తాం సార్... థ్యాంక్స్...! అంటూ స్టేషన్ నుంచి బయటపడ్డాం. దార్లో ఒకటే ఆలోచన ఒరిజినల్ బిల్ కనిపించకుండా పోయి చాలా రోజులైంది. బిల్ లేకుండా కోర్టుకెళితే కెమెరాను ఇవ్వరు కదా...! ఇప్పుడేం చేయాలి... ఇంట్లో ముఖ్యమైనవాటిని ఎప్పుడూ దాచిపెట్టే చోటునే అది ఖచ్చితంగా ఉండి ఉంటుందని అనిపించింది. వెళ్లగానే ఆ పని చేయాలనుకుంటూ ఇంటికెళ్లాను.

అలా అనుకున్నానే గానీ... కాసేపట్లోనే నా ఆశలు నీరుగారిపోయాయి. ఎందుకంటే.. నేను అనుకున్న చోట అది దొరకలేదు సరికదా..! ఎక్కడ ఉందో అంతుబట్టకుండా పోయింది. అయితే నా సిక్త్ సెన్స్ మాత్రం బిల్ పోలేదు.. ఇంట్లోనే ఉంది అని చెబుతూనే ఉంది.

ఇక ఆ రోజు నుంచి కెమెరా సంగతటుంచి... కెమెరాను కొన్న ఒరిజినల్ బిల్ కోసం మా వేట మొదలైంది.... ఇంట్లో వెతకని చోటంటూ లేదు... వెతుకుతూనే ఉన్నాము... బిల్లు దొరకలేదు... కెమెరా కోసం నా ఆశా చావనూలేదు....!!!

(సశేషం...)

Tuesday, 26 October 2010

ఆరోజు ఏం జరిగిందంటే...!!

ఆరోజు ఊరినుంచి మా అమ్మావాళ్లు వస్తున్నారు. ఈ ఊర్లోనే మా పెద్దమ్మవాళ్లు కూడా ఉండటంతో ముందుగా వాళ్లదగ్గరకు వెళ్లి ఆ తరువాత మాదగ్గరికి వస్తామని చెప్పింది అమ్మ. వాళ్లొస్తున్నారని నేను ముందుగా లీవ్ కూడా పెట్టేశాను.

అమ్మ చెప్పినట్లుగానే ముందుగా పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ ఓరోజు ఉండి, ఆ తరువాత మా ఇంటికి వచ్చింది. అమ్మతో పాటు అక్క, పిల్లలు కూడా రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. సాయంత్రం షాపింగ్‌కెళ్లి ఆ తరువాత బీచ్‌కెళ్దామని అమ్మ చెప్పడంతో సరేనని నేను, మా అబ్బాయి, అక్క, పిల్లలు, అమ్మ అందరం బయలుదేరాం.

టీనగర్‌లోని రంగనాథన్ స్ట్రీట్‌లో ఉన్న జయచంద్రన్ టెక్ట్స్‌టైల్స్ కెళ్లి అక్కడ అమ్మకు, అక్కకు బట్టలు కొన్నాం. ఆ తరువాత అదే బజార్లో ఉన్న షాపులన్నింట్లో చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కుంటూ ముందుకెళ్లాము. ఇంతలో పిల్లలకు మంచి డ్రస్సులు ఎక్కడ దొరుకుతాయని అక్క అడగటంతో.. శరవణా స్టోర్స్ అయితే బెస్ట్ అని చెప్పాను.

రంగనాథన్ స్ట్రీట్ నుంచి మెల్లగా నడుచుకుంటూ పనగల్ పార్క్ శరవణా స్టోర్స్‌కు వెళ్ళాము. అక్కడ అప్పటికే కొన్న వస్తువుల కవర్లన్నింటికీ టోకెన్లు వేయించి, అక్కడే పెట్టేసి లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాం. చిన్నపిల్లల డ్రస్సులు ఎన్నో అంతస్తులో దొరుకుతాయో కనుక్కుని, అక్కడికి వెళ్లాము.

మా బుడిగమ్మకు గౌన్లు, బబ్లూకు ప్యాంట్లూ, షర్టులూ అంటూ ఓ మూడు నాలుగు జతల బట్టలు కొనేశాం. పిల్లలకు నైట్ డ్రస్సులు కావాలని అక్క అనడంతో ఆ ఫ్లోర్‌లోనే మరో వైపుకు వెళ్లాం. ఇంతలో ఏదో డిజిటల్ కెమెరాకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పదే పదే వినిపిస్తోంది... డిజిటల్ కెమెరా అనగానే నేను వెంటనే నా హ్యాండ్‌బ్యాగును తడుముకున్నాను. (షాపింగ్‌కు వెళ్ళి, అలాగే బీచ్‌కు కూడా వెళ్లాలని అనుకున్నాం కాబట్టి, నా బ్యాగులో నేను డిజిటల్ కెమెరాను తీసుకెళ్లాను). నాది నా దగ్గరే ఉంది కదా..! ఏదోలే అనుకుంటూ ఉండిపోయాను.

మళ్ళీ మళ్లీ అదే అనౌన్స్‌మెంట్... ఎవరైనా పోగొట్టుకున్నట్లయితే కింది ప్లోర్‌కు రమ్మని దాని సారాంశం. ఏదో కెమెరా అంటున్నార్రా..? అంటూ నా బ్యాగ్ తీయబోయేసరికి... ఆ.. ఎవరో అక్కడ ఫోటోలు తీశారటలేమ్మా...! అందుకే అలా చెబుతున్నారు... మనం కాదుకదా...! అని మా అబ్బాయి అనడంతో నేను ఊరకుండిపోయాను. మళ్లీ షాపింగ్‌లో మునిగిపోయాము.

అక్కడే బాగా లేటవడంతో ఇక బీచ్ ప్రోగ్రాం‌ను క్యాన్సిల్ చేసేసి ఇంటికి వెళ్లి, వండుకుని తినేసి ప్రశాంతంగా పడుకుండిపోయాము. మరుసటిరోజు ఆఫీసుకు బయలుదేరబోతుంటే... అమ్మా బ్యాగులో కెమెరా ఎందుకు? తీసి ఇంట్లో పెట్టేసేయ్ అన్నాడు మావాడు.

అవును కదా...! అనుకుంటూ హ్యాండ్‌బ్యాగు ఓపెన్ చేశాను. అంతే... ఒక్కసారిగా షాక్ తిన్నాను... కంగారుగా బ్యాగులోని వస్తువులన్నింటినీ తీసి కిందపడేశాను. బ్యాగు మొత్తాన్ని విదిలించాను. ఇంకేముంది కెమెరా పోయిందంటూ కుప్పగూలిపోయాను.


నా కంగారును చూసిన అందరూ ఏమైంది అంటూ నా దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. డిజిటల్ కెమెరా పోయింది? బ్యాగులో కనిపించటం లేదు అన్నాను. ఇంతలో అమ్మ... "ఒకటా, రెండా పదివేల రూపాయలు వద్దంటే పోసి కొన్నారు. ఇప్పుడు పోయిందే" అంటూ బాధపడుతూ కూర్చుంది.

మా ఆయన ఏమంటాడో అని నాకైతే నోటమాటరాలేదు. ఏం చేయాలి? ఎక్కడ వెతకాలి అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాను. అప్పుడే క్రితం రోజు శరవణా స్టోర్స్ అనౌన్స్‌మెంట్ గుర్తొచ్చింది. డౌట్ లేదు. అది ఖచ్చితంగా మాదే అయి ఉంటుందని వెంటనే శరవణా స్టోర్స్ ఫోన్ నెంబర్ వెతకమని మా అబ్బాయికి చెప్పాను.

ఆ స్టోర్స్ కవర్‌పైనుండే నెంబర్‌ను తీసుకుని వెంటనే మావాడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అవునా సార్..! మేము నిన్ననే చాలాసేపు అనౌన్స్ చేశాము మీరే రాలేదు. సరే మా మేనేజర్‌ను కలవండి ఆయన మిగిలిన విషయాలు చెబుతాడని ఫోన్ పెట్టేశాడు.

నేనూ, మా అబ్బాయి గబాగబా ఆటో పట్టుకుని శరవణా స్టోర్స్‌కు పరుగులు తీశాము. అక్కడి మేనేజర్‌ను కలిసి విషయం చెప్పగానే... ఆయన నన్ను, నా హ్యాండ్‌బ్యాగును గుర్తుపట్టాడు. (ఆ కెమెరాలో ఉన్న మా ఫ్యామిలీ ఫోటోలను ఆయన చూశాడు). మీ కెమెరా ఉంది ఎక్కడికీ పోలేదు అని ఆయన అనడంతో కాస్తంత కుదుటపడ్డాము.

"మీరు పైకెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్లారు. మీ పక్కనే ఓ లేడీ పిక్ పాకెటర్ కూడా లిఫ్ట్‌లోకి వచ్చి నిల్చుంది. మెల్లగా మీ హ్యాండ్‌బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి కెమెరాను కొట్టేసింది. మీ కెమెరా స్లిమ్‌గా ఉండటంతో డబ్బు కట్ట అనుకుని పొరపాటుడిందామె. పాపం ఈ దొంగగారికి మా స్టాఫ్ తననే వెంబడిస్తున్నారని, మా సీసీ కెమెరాల్లో క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారని తెలియక మాకు పట్టుబడిపోయింది." జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు మేనేజర్.

వాళ్లు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి... "ఎలాగైతేనేం మా కెమెరా మాకు దొరికింది. ఇవ్వండి సార్...! మాకు ఆఫీకు టైం అవుతోంది. అసలే ఫర్మీషన్ అడిగి వచ్చాము" అన్నాను నేను. కెమెరా ఇక్కడెక్కడుందమ్మా...! మేము నిన్నరాత్రే పాండీబజార్ పోలీస్‌స్టేషన్లో.. దొంగను, కెమెరాను అప్పగించేశాం. మీరు అక్కడికి మాతో పాటు వచ్చి కంప్లెయింట్ రాసివ్వాలని చెప్పాడతను.

ఇక చేసేదేంలేక తిరిగీ ఆఫీసుకు ఫోన్ చేసి ఫర్మీషన్ అడిగి పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాము. అక్కడి ఎస్సైను కలిసి జరిగిందంతా చెప్పి మా కెమెరాను ఇవ్వమని అడిగా. అది అలా కుదరదమ్మా...! దొంగ దొరికింది కాబట్టి.. దొంగను, ఈ వస్తువును మేము కోర్టుకు హ్యాండోవర్ చేయాలి అన్నాడు.

మళ్లీ అతనే.. మీరు జరిగిందంతా చెబుతూ కంప్లెయింట్ రాసివ్వండి.. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మీ ఫోన్ నెంబర్‌ అడ్రస్సును కూడా ఇచ్చివెళ్లండి... తరువాత మేము కబురు చేస్తాము. ఆపై మీరు కోర్టుకెళ్లి, పిటీషన్ వేసి మీ వస్తువును మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు.

అయ్యో..! ఇంత తతంగముందా... అనుకుంటూ కంప్లైయింట్ రాసిచ్చేసి ఆఫీసుకెళ్లిపోయాను. ఆతరువాత చాలారోజుల దాకా ఈరోజుగానీ, రేపుగానీ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాను... రోజులు నెలలైనాయి... ఫోన్ మాత్రం రాలేదు....!! మా కెమెరా మీద నాకు ఆశ కూడా చావలేదు....!!!


(సశేషం...)

Tuesday, 12 October 2010

టీవీ స్విచ్.. తాత చేతికర్ర...!

ఆఫీసు నుంచి పని ముగించుకుని ఈసురోమంటూ ఇంటికి బయల్దేరాను. ఆఫీసు దాటి కాస్తంత దూరం వెళ్లగానే నేను ఎక్కాల్సిన యం12సి బస్సు కాస్తా నన్ను దాటుకుని ముందుకు పరుగులు తీసింది. చేసేదేం లేక బస్టాప్‌దాకా నడచి అక్కడ 12జి బస్సు పట్టుకుని ఎలాగోలా ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరగానే మా పింకీ ఎదురొచ్చి బాగా అలసిపోయావా..?! అంటూ నా బ్యాగ్ అందుకుని తాగడానికి నీళ్లిచ్చింది. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ...! పింకీ మా అక్క కూతురు. కొన్ని రోజులు మాతో ఉండేందుకు వచ్చింది. వరుసకు నాకు కూతురైనప్పటికీ దానికీ, నాకూ ఓ నాలుగేళ్ల తేడా మాత్రమే ఉంటుంది.

లెక్కలేనన్ని కబుర్లూ, చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ చాలా సరదాగా ఉంటాం మేమిద్దరం. దాని కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటూ ఉంటుంది. ఏదేని సమస్యలొచ్చినప్పుడు నన్ను సలహా కూడా అడుగుతూ ఉంటుంది. నేను కూడా పెద్ద ఆరిందాన్నిలా తోచిన సలహా ఇచ్చేస్తుంటాను.

ఆరోజు ఓ చిన్న విషయంపైకి మా ఇద్దరి చర్చ మళ్లింది (పర్సనల్ కాబట్టి వివరాలు మాత్రం చెప్పలేను). ఆ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. ముందు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడటం లేదు. ఈ విషయంలో ఇప్పటికే నువ్వు చాలా సార్లు మాట తప్పావు కాబట్టి నిన్ను నమ్మను. నామీద ఒట్టేసి చెబితేగానీ ఈసారి నమ్మేది లేదు అంటూ ఓ చిన్నపాటి క్లాస్ పీకడం మొదలెట్టాను పింకీకి.

పాపం అది బిక్కమొహం వేసి... నీకూ, మా అన్నకూ ఎప్పుడూ ఇదే భయం. చెబితే వినరు, నమ్మరు. "అమ్మా...! అసలు దాన్నెప్పుడూ నమ్మవద్దంటూ" వాడెప్పుడూ అమ్మకు చెబుతుంటాడు కూడా...! మీకెందుకంత సందేహం. నేను మంచి అమ్మాయిని కదా..! ఈసారి మాట తప్పనులే అంటూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది పింకీ.

కానీ నేను మాత్రం నా బెట్టు వీడలేదు సరికదా... మరింత కోపంగా బుంగమూతితో కూర్చున్నాను. సీరియస్ వాతావరణాన్ని ఎలాగైనా సరే చల్లబర్చాలనుకున్న పింకీ...

పిన్నీ పిన్నీ...! ఓసారి నువ్వు ఇంట్లో లేనప్పుడు జరిగిన ఓ విషయాన్ని చెప్పనా..?! అంటూ మొదలెట్టింది. ఏంటబ్బా..! అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. అది చూసిన పింకీ ఇంకాస్త ఉత్సాహంగా... ఆరోజు ఇంట్లో నాకూ, అక్కకూ, అన్నకూ ఓ పెద్ద గొడవైంది...... అంటూ ఆగింది.

"ఏంటో..." అన్నట్లుగా మొహం పెట్టాను నేను. ఏదో చిన్న విషయం దగ్గర మొదలైన గొడవ టీవీ దగ్గర ఆగిపోయింది అని చెప్పింది. "టీవీదగ్గరా...?" అని అడిగాను. అవును.. "మాటా మాటా పెరిగి నేను అసలు ఇకపై టీవీ స్విచ్ ముట్టుకునేదే లేదని తెగేసి చెప్పేశాను" అంది పింకీ.

"సర్లే..! గొడవపడైనా మంచిపని చేశావు. అలాగైనా బుద్ధిగా చదువుకుంటావు కదా..!" అన్నాను. "అమ్మా....! ఆశ, దోశె, అప్పడం, వడా...! అలాగేం జరగలేదు తెలుసా..?!" అంటూ అల్లరిగా చెప్పడం ఆపింది పింకీ.

"ఇంకేం జరిగిందే...!" అన్నాను ఆసక్తిగా... "గొడవ జరిగిన ఓ రెండు మూడు రోజులు ఇంట్లో అంతా సర్దుకుంది. అందరం ఒకరితో ఒకరం మాట్లాడేసుకుంటున్నాం... అయినా నేను టీవీ స్విచ్ ముట్టుకోనని చెప్పేశాను కాబట్టి ఆ గండం నుంచి కూడా ఎలాగైనా సరే బయటపడాలి కదా...! అని ఆలోచించాను.." చెప్పుకుపోతోంది పింకీ.

"టీవీ స్విచ్ చేతితో కదా ముట్టుకోకూడదు. ఇలా ఎందుకు చేయకూడదని ఆలోచించాను. అటకపైనుండే తాత చేతికర్రను తీసి టీవీ స్విచ్ ఆన్ చేయడం మొదలెట్టాను" చెప్పడం ఆపి నావైపు చూసింది పింకీ... అసలే గుర్రుగా ఉన్న నేను అది చెప్పిన మాట విని నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వేశాను.

నాతో జతకలిపిన పింకీ కూడా నవ్వుతూ... "ఆరోజు ఇంట్లో కూడా అందరూ ఇలాగే నవ్వారు పిన్నీ..." అంటూ నా మెడ చుట్టూ చేతులేసి, చక్కిలిగింతలు పెట్టేసి... మా ఇంటిని నవ్వులతో నింపేసింది ఆ అల్లరి అమ్మాయి.

Saturday, 9 October 2010

ఓ వర్షం కురిసిన రాత్రి....!

ఈరోజు ఎలాగైనా సరే బీచ్‌కు వెళ్ళాల్సిందే అనుకుంటూ...(అలా చాలా రోజులుగా అనుకోవడమేగానీ వెళ్లింది లేదు) ఆఫీసులో పని ముగించుకుని త్వరగా బయటపడ్డాం. నేనూ, మా అబ్బాయి, మావాడి ఫ్రెండ్ కలిసి బీచ్‌కు వెళ్దామనుకున్నాం. బస్‌స్టాప్‌లో ఎంతసేపు వెయిట్ చేసినా బస్‌ రాలేదు. మా వాడి ఫ్రెండ్‌కు ఇంకో ఫ్రెండ్ జతకలవడంతో సినిమాకు తుర్రుమన్నాడు. (వాడెప్పుడూ అంతే..!) ఇంకేముంది... ఎప్పట్లాగే ఆరోజు కూడా బీచ్‌కెళ్లే ప్రోగ్రామ్ అటకెక్కేసింది.

ఓ గంటసేపటి తరువాత బస్ రావడంతో బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాం. టీవీ పెట్టుకుని ఏదైనా ఓ మంచి ప్రోగ్రామ్ అయినా చూసేద్దాం అనుకుంటే... కేబుల్ కూడా సరిగా రావడం లేదు. ఇంక చేసేదేంలేక వీసీడీ ఆన్ చేసి హిందీ పాటలు పెట్టుకుని మిగతా పనుల్లో మునిగిపోయాను.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కేబుల్ రాకపోయినా, బీచ్‌కెళ్లకపోయినా మా అబ్బాయికి దిగులేం లేదండీ... ఎందుకంటే వాడికి ఇంట్లో కంప్యూటర్.. అందులో ఓ క్రికెట్ గేమ్ ఉంటే చాలు. ఆ గేమ్ ఆడుతూ అలా గంటలు గంటలు గడిపేస్తాడు. కాబట్టి... ఆరోజు వాడేం బాధపడలేదు సరికదా... క్రికెట్‌లో లీనమైపోయాడు.
వంట పూర్తిచేసి, మా ఆయన కోసం ఎదురుచూస్తుంటే... ఆయన రాలేదుగానీ ఫోన్ మాత్రం వచ్చింది. అందులో ఆయనే... నేను రావడం లేటవుతుంది. మా ఫ్రెండ్స్ ఇంటికెళుతున్నాను. మీరిద్దరూ తినేసి పడుకోండి అని చెప్పాడు. మరుసటిరోజు ఆదివారం, మా అబ్బాయి ఓ ఫంక్షన్‌కు వెళ్ళాల్సి ఉండటంతో.. త్వరగా తినేసి పడుకున్నాం.

మరుసటిరోజు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి, అబ్బాయిని ఫంక్షన్‌కు పంపేశా, మా ఆయన కూడా జర్నలిస్టుల సంఘం మీటింగ్ ఉందంటూ వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కదాన్నే... పని మాత్రం బోలెడు. వంట, ఇల్లు చక్కబెట్టుకోవడం, వారం రోజుల బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ ఓ వైపు పిలుస్తుంటే... నిద్రాదేవి కూడా నన్ను ఊరికే ఆవరించేస్తోంది.

ఏమైతే అయిందని వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి ఆన్‌చేసి, పడుకున్నాను. బాగా నిద్రపట్టేసింది. అలారం మోగుతున్నా నేను మాత్రం లేవలేకపోయాను. ఎలాగోలా లేచి వంటపూర్తి చేసేసరికి మా ఆయన, అబ్బాయి వచ్చేశారు. ఇద్దరికీ భోజనాలు వడ్డించి మళ్లీ పనిలో మునిగిపోయాను.

ఇక సాయంత్రం టీ టైం‌లో అమ్మా.. బీచ్‌కెళ్దామా..?! అని అడిగాడు మావాడు. మా ఆయన నేను రాను, సెలూన్‌కెళ్లాలి.. మీరిద్దరూ వెళ్లి వచ్చేయండి అన్నాడు. అంతకుముందే కరెంట్ పోవడంతో బట్టల పని ఆగిపోయింది, పిండి రుబ్బాలి, గలేబులు మార్చాలి... ఇవన్నీ పక్కనబెడితే అబ్బాయి ఆశగా అడుగుతున్నాడు. వాడికోసమైనా వెళ్లాల్సిందే అనుకుంటూ బయలుదేరాను.

హమ్మయ్య...! చాలా రోజుల నుంచీ బీచ్‌కెళ్లాలన్న కోరిక ఆరోజు తీరిపోయింది. సముద్రంలో వెన్నెల వెలుగులో పెద్ద పెద్ద అలలు స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నాయి. ఏవేవో కబుర్లు చెప్పుకుని, కాల్చిన మొక్కజొన్న కండె చెరిసగం తినేసి ఇంటికొచ్చేశాం.

మిగిలిపోయిన పనులను పూర్తిచేసే కార్యక్రమంలో నేను... ఓ ఇంగ్లీషు అనువాదపు సినిమాను చూస్తూ అందులో మునిగిపోయిన అబ్బా, కొడుకులిద్దరూ... ఈలోపు నేనున్నానంటూ జోరున పెద్ద వర్షం. బెడ్‌రూంలో కిటికీలు వర్షపు గాలికి ఊరికే కొట్టుకుంటుండటంతో వేసేందుకు వెళ్లాడు మా ఆయన.

ఎంతసేపటికి ఆ రూం నుంచి ఆయన బయటకు రావడం లేదేంటబ్బా అనుకుంటూ నేనూ మా అబ్బాయి వెళ్ళాము. ఏముంది చక్కగా ఆ రూంలో లైట్ ఆపివేసి కిటికీలోంచి బయట ఏపుగా పెరిగిన మునగచెట్టు నుంచి ఆకులు, కాయలు అందినకాడికల్లా తెంపుతూ కూర్చున్నాడాయన.

(మామూలు రోజుల్లో మునగచెట్టు కిటికీకి పక్కగా ఉన్నప్పటికీ అందేది కాదు. ఆరోజు జోరున వర్షం, హోరుగాలికి అది ఊగుతూ బాగా చేతికి అందింది. అలా మా ఆయన చేతికి అది దొరికిపోయింది... పాపం...!!)

అదలా ఉంచితే... తనకు తోడుకు కొడుకును కూడా పిలిచాడు మా ఆయన. నేను రానని వాడంటే... వస్తావా రావా అంటూ కోప్పడటంతో వాడూ వెళ్లి సాయం చేశాడు. మొత్తానికి కాస్తంత ఆకు, మునక్కాయలు కోసేసి గబగబా కిటికీలు వేసేసి వచ్చేశారు. బయట పదిరూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా... ఇలాంటి పని ఎందుకని నేను కోప్పడ్డాను.

దొంగతనం చేసి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది తెలుసా..? అయినా నువ్వు పల్లెటూర్లో పుట్టి పెరిగుంటే కదా.. తెలిసేందుకు అని నన్నే మా ఆయన ఎగతాళి చేశాడు. ఇంతలో మావాడు ఊరుకుంటాడా..? అమ్మా... ఆయన పల్లెలో పుట్టాడు కాబట్టి ఇలాంటివన్నీ బాగా అలవాటేలే...! అంటూ నవ్వుతూ సెటైర్ వేశాడు. నాకు నవ్వాగలేదు... మొదట గుర్రుగా చూసినా మా ఆయన కూడా నవ్వుతూ మాతో జతకలిపాడు.

Friday, 8 October 2010

నా హృదయాంతరాళాల్లో...!నా హృదయాంతరాళాల్లో...
ఓ స్థానం ఎప్పుడూ నిండుగా ఉంటుంది
అది నాకు మాత్రమే తెలుసు
ఎందుకంటే, ఆ స్థానం.......
ప్రేమతో నిండిపోయింది
నా కుటుంబంతో నిండిపోయింది

నేను ఎక్కడికెళ్ళినా, ఎక్కడ ఉన్నా...
ఎవరెంత దూరంలో ఉన్నా....
ఆ ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది
అది నా బాధ్యతను గుర్తు చేస్తుంది

ఆ ప్రేమ నన్ను ఎప్పుడూ....
సంతోషంగా ఉంచుతుంది
బ్రతుకుమీద ఆశను కల్పిస్తుంది
మా కోసం నువ్వు కావాలంటూ...
నన్నెప్పుడూ బ్రతికిస్తుంటుంది.....!

Wednesday, 6 October 2010

పసిమొగ్గలను వాడిపోనీయవద్దు...!


కొన్ని రోజుల క్రితం మా పక్క వీధిలో ఒకటే అరుపులు, కేకలు, ఏడ్పులు, ఆర్తనాదాలు... ఏమయ్యింది? అనుకుంటూ కంగారుగా, ఆతృతగా బాల్కనీలోకి పరుగెత్తికెళ్లాను. ఒకతను ఏడుస్తూ... ఓ పది సంవత్సరాల అబ్బాయిని చేతులపై మోసుకెళ్లటం నాకు కంటబడింది. అతడి వెంట చాలామంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వెళ్తున్నారు.

కిందికి పరుగెత్తుకెళ్లి... పక్కింటి మామిని ఏమయ్యింది? అని అడిగాను. నిండా పదేళ్లు కూడా లేవు ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పింది. ఆ మాట విన్న నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఇంత చిన్నబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అని...?

కాసేపటి తరువాత తేరుకున్న నేను... ఎందుకు? అని మళ్లీ ఆమెనే అడిగాను. ఇంకా ఏమీ తెలియలేదు, కనుక్కుని చెబుతానుండండి అని అంది. ఆ చిన్నపిల్లాడి రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంది. నాకేమీ పాలుబోలేదు. అసలు ఎలా జరిగింది? అని మామిని అడిగాను.

స్కూలుకెళ్లిన పిల్లాడు మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాడు. వాళ్ళ అమ్మ కట్టి ఇచ్చిన పెరుగన్నం తినేసి మేడమీది గదిలోకెళ్ళాడు. ఏమనుకున్నాడో ఏమో కిటికీ ఊచలకు వాళ్ళమ్మ చీరను బిగించి తన మెడకు ఉరి వేసుకున్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడూ మేడమీది గదిలో ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదట.

ఒకటి రెండుసార్లు వాళ్ల అక్క పైకి వెళ్లి కిటికీ పక్కన మెడకు చీరను బిగించుకున్న తమ్ముడిని చూసి అలా ఆడుకోకూడదురా, తప్పురా అంటూ మందలించి కిందికి వెళ్లిపోయిందేగానీ సరిగా గమనించలేదు. మధ్యాహ్నం మెడకు ఉరి బిగించుకున్న ఆ పిల్లాడిని సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చూశారు.

ఎంతసేపు ఆడుకుంటావు కిందికి రారా అంటూ అక్క ఎంత పిలిచినా ఆ అబ్బాయి కిందికి రాలేదు, పలకడం లేదు. ఏమైంది అనుకుంటూ ఆ అమ్మాయి వచ్చి చూడగా.. నాలుక బయటపెట్టి, కనుగుడ్లు పైకి తేలేసి కనిపించాడు ఆ అబ్బాయి. భయంతో కిందికి పరుగెత్తి కెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మకు విషయం చెప్పి పైకి తీసుకెళ్లగా... కొడుకు నిర్జీవంగా కనిపించాడు ఆ తల్లికి.

అయినా బతికే ఉంటాడన్న చిన్ని ఆశతో చుట్టుప్రక్కల వారిని పిలిచి హాస్పిటల్‌కు పరుగులెత్తింది ఆ తల్లి. హాస్పిటల్‌లో డాక్టర్ ఆ అబ్బాయిని పరీక్షించి మధ్యాహ్నమే చనిపోయాడని చెప్పాడు. ఇంతలో తండ్రికి విషయం తెలిసి హాస్పిటల్‌కు పరుగెత్తాడు. అప్పటికే బిడ్డను ఏడుస్తూ తీసుకొస్తున్న భార్య చేతుల్లోంచి తీసుకుని గుండెలు బాదుకుంటూ తీసుకొస్తున్నాడు. ఇదండీ జరిగింది అని చెప్పింది మామి.

ఆ చిన్న పిల్లాడికి ఏం కష్టమొచ్చింది? ఎందుకు ఉరివేసుకోవాలనుకున్నాడు? అని మళ్లీ ఆమెనే అడిగాను. ఏమోనండీ అందరూ దుఃఖంలో ఉన్నారు. ఇంకా ఏమీ తెలియడం లేదని చెప్పిందామె.

తరువాత కొన్ని రోజులకు ఆ పిల్లాడు ఉరి వేసుకున్న కారణం తెలిసి అవాక్కయ్యాను. స్కూల్లో ఏదో కారణం చేత వాళ్ల మిస్ అందరి ముందూ తిట్టిందట. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని ఆ పిల్లాడు ఉరిపోసుకున్నాడు.

అప్పటిదాకా, స్కూల్లో అందరికంటే ఫస్ట్ వచ్చే తమ కొడుకు మార్కులు తక్కువ వచ్చినందుకో, లేదా ఎప్పుడైనా తాము తిట్టినందుకో మనసు కష్టపెట్టుకుని ఇలా చేశాడనుకున్నారు ఆ పిల్లాడి తల్లిదండ్రులు. అయితే ఆరోజు స్కూల్లో మధ్యాహ్నం మిస్ తిట్టినందుకు అంతపని చేశాడని తెలిసిన తల్లిదండ్రులు కాసేపు ఆమెని కోపగించుకున్నా, ఏం చేసినా తమ కొడుకు ఇక తిరిగి రాడని ఊరకున్నారు.

అయ్యో...! చిన్న పిల్లాడిని కోపగించుకుని తన చావుకు కారణమయ్యాయనని ఆ మిస్ కూడా పశ్చాత్తాపంతో ఏడుస్తూ, పిల్లాడి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది.

ఇక్కడ ఎవరిని తప్పుబట్టాలో నాకు అర్థం కావడం లేదు. తప్పు చేసినప్పుడు దండించిన టీచర్‌దా? లేదా చిన్నపాటి అవమానాన్ని కూడా భరించలేని ఆ పిల్లాడిదా..?

అదలా ఉంచితే... చిన్నపిల్లలు సహజంగానే సున్నిత మనస్కులై ఉంటారు. వారికి సాధ్యమైనంత సున్నితంగానే తప్పొప్పులను తెలియజేయాలే గానీ, కోపంగా తిట్టి చెబితే మాత్రం గాయపడతారు. గాయపడినవారు కొంతమంది మర్చిపోయినా... మరికొంతమంది మరీ సున్నిత స్వభావం కలిగిన పిల్లలు పైన చెప్పిన పిల్లాడిలాగే బలవన్మారణాల దారిలోకి వెళ్లిపోతారు.

కాబట్టి... ప్రియమైన తల్లిదండ్రులారా, విద్యాబుద్ధులు నేర్పే గురువుల్లారా...! చిన్నారి పసిమొగ్గలను వసివాడి పోనీయకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది. కఠినమైన మాటలు, భాషతో చిన్నారి మనసులను గాయపడనీయకుండా సున్నితంగా వారికి తప్పొప్పులను తెలియజెప్పుదాం....! చిన్నారులను కాపాడుకుందాం...!!

Monday, 4 October 2010

దేవుడిచ్చిన బహుమతి "అమ్మ"

మా అమ్మ వజ్రం లాంటిది
ఒక అందమైన రత్నం లాంటిది
ఆమె... దేవలోకం...
ప్రసాదించిన గొప్ప బహుమతి
ఆమె నాకు మాత్రమే సొంతం


జీవితమంతా అన్నీ తానై నన్ను నడిపిస్తుంది
జీవన పయనంలో ఒడిదుడుకులొస్తే
కలత చెందకుండా, కంటనీరు పెట్టకుండా
అన్నీ తానై నన్ను కాపాడుతుంది

మృదుత్వం, దయ, ప్రేమ, నిజం...
నిజాయితీ, మార్దవ్యం కలగలసిన ఆమె
నీలాకాశం లాగే... ఈ భూమాతలాగే
దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి

అమ్మా..! నిన్ను ప్రేమిస్తున్నాను
నీ పాదాలపై ప్రణమిల్లుతున్నాను
నీకెప్పుడూ దూరం కాను...
పసిబిడ్డలాంటి నిన్ను...
పదిలంగా చూసుకుంటాను...!!

Friday, 1 October 2010

మాతృదేవోభవ.. పితృదేవోభవ..!!

పార్వతీ పరమేశ్వరుల పుత్రులైన వినాయకుడు, కుమార స్వామిల మధ్య విఘ్నాధిపత్యం కోసం పోటీ జరిగిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ... అసలు విషయాన్ని తడిమేముందు విఘ్నాధిపత్యం కథ కాస్త టూకీగా చూద్దాం...!

కైలాసంలో ఉన్న అన్ని తీర్థాలలోనూ స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం లభిస్తుందని పోటీ పెడతారు. ఈ పోటీలో భాగంగా కుమారస్వామి వేగంగా తీర్థాలవైపు కదిలితే... జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించినట్లైతే అన్ని తీర్థాలలోనూ స్నానం చేయడంతో సమానమన్న నిజాన్ని గ్రహించి, వారికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం మొదలుపెడతాడు వినాయకుడు.

నెమలి వాహనంపైన బయల్దేరిన కుమారస్వామికి ఏ తీర్థం వద్దకు వెళ్ళినా, అప్పటికే వినాయకుడు స్నానమాచరిస్తూ ఉండటం కనిపిస్తుంది. అన్ని తీర్థాలలోనూ స్నానం ముగించుకున్న కుమారస్వామి తల్లిదండ్రుల వద్దకు రాగా, అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు.

అమితాశ్చర్యానికి లోనైన కుమారస్వామి అదెలా సాధ్యం..? అని తల్లిదండ్రులను ప్రశ్నిస్తాడు. అప్పుడు వారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మొక్కడంకంటే, వారి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి తీర్థాలలో స్నానం చేయడమంత అవివేకం మరొకటి లేదని వివరించి చెబుతారు.

దీంతో తన తప్పు తెలుసుకున్న కుమారస్వామి తల్లిదండ్రులకు ప్రణమిల్లుతాడు. ఇదీ విఘ్నాధిపత్యం కథ. ఇది పురాణ కథే కదా..! అన్న విషయాన్ని కాసేపలా పక్కనపెట్టి.. ప్రస్తుత కాల పరిస్థితులను ఓసారి చూద్దాం...!


తల్లీదండ్రీ బ్రతికున్నంతకాలం వారి బాగోగులు పట్టించుకోవడం అటుంచి, వారు చనిపోయిన తరువాత మాత్రం కర్మకాండల కోసమో, సమాధుల కోసమో లక్షల కొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి... తమకు తల్లిదండ్రుల మీద ఉన్న ఖరీదైన ప్రేమను మాత్రం లోకానికి చాటుకుంటున్నారు ఈనాటి పుత్ర రత్నాలూ, పుత్రికా రత్నాలూ..!

కనీ పెంచి తమను ఇంతవాళ్లను చేసిన ఆ ప్రత్యక్ష దైవాలను నిర్లక్ష్యంగా వదిలివేసి, ధన సంపాదనలో పడిపోయి యాంత్రిక జీవనాన్ని గడుపుతూ, మానవ సంబంధాలను మరుగున పడేస్తూ, కృత్రిమంగా బ్రతికేస్తుంటారు వీరు.

తమ ఉనికికే కారణమైన కన్నవారిని పూర్తిగా మరచిపోయిన ఇలాంటివారు, సంవత్సరానికి ఒకసారి మాత్రం మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటి వాటిని మాత్రం బాగా గుర్తు పెట్టుకుని మరీ... ఆరోజు మాత్రం పలుకరిస్తున్నారు. వీలైతే వారి స్తోమతను బట్టి బహుమతులతో తమలో ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.

మరికొంతమంది పిల్లలైతే తల్లిదండ్రుల మీద ఉన్న అమితమైన ప్రేమను చాటుకుంటూ... వారిని వృద్ధాశ్రమాల పాలబడేస్తున్నారు కూడా...! తమను ఎన్నిరకాలుగా పిల్లలు దూరం చేసుకున్నప్పటికీ వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంటారు ఈ పిచ్చి తల్లిదండ్రులు.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానే ఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా.... అపర బ్రహ్మలైన పిల్లలకు మాత్రం ఇవేమీ పట్టవు. ఎన్నిజన్మలెత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని వీరు గ్రహించలేరు.

అందుకే... తల్లిదండ్రులను పూజించటంలోనే అసలైన, అమితమైన ఆనందమున్నదంటూ బొజ్జ గణపయ్య ఇచ్చిన సందేశం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రతి ఒక్కరికీ ఆచరణీయమే....!