అమ్మ చెప్పినట్లుగానే ముందుగా పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ ఓరోజు ఉండి, ఆ తరువాత మా ఇంటికి వచ్చింది. అమ్మతో పాటు అక్క, పిల్లలు కూడా రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. సాయంత్రం షాపింగ్‌కెళ్లి ఆ తరువాత బీచ్‌కెళ్దామని అమ్మ చెప్పడంతో సరేనని నేను, మా అబ్బాయి, అక్క, పిల్లలు, అమ్మ అందరం బయలుదేరాం.
టీనగర్‌లోని రంగనాథన్ స్ట్రీట్‌లో ఉన్న జయచంద్రన్ టెక్ట్స్‌టైల్స్ కెళ్లి అక్కడ అమ్మకు, అక్కకు బట్టలు కొన్నాం. ఆ తరువాత అదే బజార్లో ఉన్న షాపులన్నింట్లో చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కుంటూ ముందుకెళ్లాము. ఇంతలో పిల్లలకు మంచి డ్రస్సులు ఎక్కడ దొరుకుతాయని అక్క అడగటంతో.. శరవణా స్టోర్స్ అయితే బెస్ట్ అని చెప్పాను.
రంగనాథన్ స్ట్రీట్ నుంచి మెల్లగా నడుచుకుంటూ పనగల్ పార్క్ శరవణా స్టోర్స్‌కు వెళ్ళాము. అక్కడ అప్పటికే కొన్న వస్తువుల కవర్లన్నింటికీ టోకెన్లు వేయించి, అక్కడే పెట్టేసి లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాం. చిన్నపిల్లల డ్రస్సులు ఎన్నో అంతస్తులో దొరుకుతాయో కనుక్కుని, అక్కడికి వెళ్లాము.
మా బుడిగమ్మకు గౌన్లు, బబ్లూకు ప్యాంట్లూ, షర్టులూ అంటూ ఓ మూడు నాలుగు జతల బట్టలు కొనేశాం. పిల్లలకు నైట్ డ్రస్సులు కావాలని అక్క అనడంతో ఆ ఫ్లోర్‌లోనే మరో వైపుకు వెళ్లాం. ఇంతలో ఏదో డిజిటల్ కెమెరాకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పదే పదే వినిపిస్తోంది... డిజిటల్ కెమెరా అనగానే నేను వెంటనే నా హ్యాండ్‌బ్యాగును తడుముకున్నాను. (షాపింగ్‌కు వెళ్ళి, అలాగే బీచ్‌కు కూడా వెళ్లాలని అనుకున్నాం కాబట్టి, నా బ్యాగులో నేను డిజిటల్ కెమెరాను తీసుకెళ్లాను). నాది నా దగ్గరే ఉంది కదా..! ఏదోలే అనుకుంటూ ఉండిపోయాను.
మళ్ళీ మళ్లీ అదే అనౌన్స్‌మెంట్... ఎవరైనా పోగొట్టుకున్నట్లయితే కింది ప్లోర్‌కు రమ్మని దాని సారాంశం. ఏదో కెమెరా అంటున్నార్రా..? అంటూ నా బ్యాగ్ తీయబోయేసరికి... ఆ.. ఎవరో అక్కడ ఫోటోలు తీశారటలేమ్మా...! అందుకే అలా చెబుతున్నారు... మనం కాదుకదా...! అని మా అబ్బాయి అనడంతో నేను ఊరకుండిపోయాను. మళ్లీ షాపింగ్‌లో మునిగిపోయాము.
అక్కడే బాగా లేటవడంతో ఇక బీచ్ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసేసి ఇంటికి వెళ్లి, వండుకుని తినేసి ప్రశాంతంగా పడుకుండిపోయాము. మరుసటిరోజు ఆఫీసుకు బయలుదేరబోతుంటే... అమ్మా బ్యాగులో కెమెరా ఎందుకు? తీసి ఇంట్లో పెట్టేసేయ్ అన్నాడు మావాడు.
అవును కదా...! అనుకుంటూ హ్యాండ్‌బ్యాగు ఓపెన్ చేశాను. అంతే... ఒక్కసారిగా షాక్ తిన్నాను... కంగారుగా బ్యాగులోని వస్తువులన్నింటినీ తీసి కిందపడేశాను. బ్యాగు మొత్తాన్ని విదిలించాను. ఇంకేముంది కెమెరా పోయిందంటూ కుప్పగూలిపోయాను.
నా కంగారును చూసిన అందరూ ఏమైంది అంటూ నా దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. డిజిటల్ కెమెరా పోయింది? బ్యాగులో కనిపించటం లేదు అన్నాను. ఇంతలో అమ్మ... "ఒకటా, రెండా పదివేల రూపాయలు వద్దంటే పోసి కొన్నారు. ఇప్పుడు పోయిందే" అంటూ బాధపడుతూ కూర్చుంది.
మా ఆయన ఏమంటాడో అని నాకైతే నోటమాటరాలేదు. ఏం చేయాలి? ఎక్కడ వెతకాలి అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాను. అప్పుడే క్రితం రోజు శరవణా స్టోర్స్ అనౌన్స్‌మెంట్ గుర్తొచ్చింది. డౌట్ లేదు. అది ఖచ్చితంగా మాదే అయి ఉంటుందని వెంటనే శరవణా స్టోర్స్ ఫోన్ నెంబర్ వెతకమని మా అబ్బాయికి చెప్పాను.
ఆ స్టోర్స్ కవర్‌పైనుండే నెంబర్‌ను తీసుకుని వెంటనే మావాడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అవునా సార్..! మేము నిన్ననే చాలాసేపు అనౌన్స్ చేశాము మీరే రాలేదు. సరే మా మేనేజర్‌ను కలవండి ఆయన మిగిలిన విషయాలు చెబుతాడని ఫోన్ పెట్టేశాడు.
నేనూ, మా అబ్బాయి గబాగబా ఆటో పట్టుకుని శరవణా స్టోర్స్‌కు పరుగులు తీశాము. అక్కడి మేనేజర్‌ను కలిసి విషయం చెప్పగానే... ఆయన నన్ను, నా హ్యాండ్‌బ్యాగును గుర్తుపట్టాడు. (ఆ కెమెరాలో ఉన్న మా ఫ్యామిలీ ఫోటోలను ఆయన చూశాడు). మీ కెమెరా ఉంది ఎక్కడికీ పోలేదు అని ఆయన అనడంతో కాస్తంత కుదుటపడ్డాము.
"మీరు పైకెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్లారు. మీ పక్కనే ఓ లేడీ పిక్ పాకెటర్ కూడా లిఫ్ట్‌లోకి వచ్చి నిల్చుంది. మెల్లగా మీ హ్యాండ్‌బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి కెమెరాను కొట్టేసింది. మీ కెమెరా స్లిమ్‌గా ఉండటంతో డబ్బు కట్ట అనుకుని పొరపాటుడిందామె. పాపం ఈ దొంగగారికి మా స్టాఫ్ తననే వెంబడిస్తున్నారని, మా సీసీ కెమెరాల్లో క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారని తెలియక మాకు పట్టుబడిపోయింది." జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు మేనేజర్.
వాళ్లు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి... "ఎలాగైతేనేం మా కెమెరా మాకు దొరికింది. ఇవ్వండి సార్...! మాకు ఆఫీకు టైం అవుతోంది. అసలే ఫర్మీషన్ అడిగి వచ్చాము" అన్నాను నేను. కెమెరా ఇక్కడెక్కడుందమ్మా...! మేము నిన్నరాత్రే పాండీబజార్ పోలీస్‌స్టేషన్లో.. దొంగను, కెమెరాను అప్పగించేశాం. మీరు అక్కడికి మాతో పాటు వచ్చి కంప్లెయింట్ రాసివ్వాలని చెప్పాడతను.
ఇక చేసేదేంలేక తిరిగీ ఆఫీసుకు ఫోన్ చేసి ఫర్మీషన్ అడిగి పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాము. అక్కడి ఎస్సైను కలిసి జరిగిందంతా చెప్పి మా కెమెరాను ఇవ్వమని అడిగా. అది అలా కుదరదమ్మా...! దొంగ దొరికింది కాబట్టి.. దొంగను, ఈ వస్తువును మేము కోర్టుకు హ్యాండోవర్ చేయాలి అన్నాడు.
మళ్లీ అతనే.. మీరు జరిగిందంతా చెబుతూ కంప్లెయింట్ రాసివ్వండి.. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మీ ఫోన్ నెంబర్ అడ్రస్సును కూడా ఇచ్చివెళ్లండి... తరువాత మేము కబురు చేస్తాము. ఆపై మీరు కోర్టుకెళ్లి, పిటీషన్ వేసి మీ వస్తువును మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు.
అయ్యో..! ఇంత తతంగముందా... అనుకుంటూ కంప్లైయింట్ రాసిచ్చేసి ఆఫీసుకెళ్లిపోయాను. ఆతరువాత చాలారోజుల దాకా ఈరోజుగానీ, రేపుగానీ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాను... రోజులు నెలలైనాయి... ఫోన్ మాత్రం రాలేదు....!! మా కెమెరా మీద నాకు ఆశ కూడా చావలేదు....!!!
(సశేషం...)
5 comments:
Intresting..Next...?
మరల contact చేసి చుడక పొయారా?
మీ కమెర మీకు దొరకాలని ఆసిస్తు....
ఆ షాప్ వాళ్ళని మెచ్చుకోవాలండి. Good work.
నిజంగానే ఆ షాపు వాళ్లను మెచ్చుకోవాలండి. అయితే మా కెమెరా కోసం మేము పడిన పాట్లు ఏంటో తరువాతి భాగాల్లో మీరే చూస్తారుగా... :)
పోలీసులకు చేరిన దొంగసొత్తూ, గోడకు కొట్టిన సున్నమూ తిరిగి రావు అని నానుడి. మీచేతికి ఓ బొమ్మ కెమరా వస్తుంది అని నా అంతరాత్మ చెబుతోంది. కొత్త కాసియో 10MP DSLR కెమెరా కొనుక్కోండి. :)
Post a Comment