"అబ్బా... ఏంటో ఈరోజు ఒంట్లో నలతగా ఉంది. ఏమీ తోచటం లేదు, ఏ పనీ చేయబుద్ధి కావటం లేదు. మరీ ఇంత నీరసంగా ఉందేంటి" అనుకుంటూ బెడ్‌మీద లేచి వెళ్ళబోతుండగా ఫోన్......
"ఈ టైంలో ఎవరబ్బా..... ఆలోచిస్తూనే ఫోన్ చూస్తే గౌతమి కాలింగ్"
"హలో.. గౌతమీ బాగున్నావా..... ఏం ఈ టైంలో ఫోన్ చేశావు?" అడిగా.
"అక్కా నే బాగున్నా. ఇదిగో నీ కూతురు మాట్లాడుతుందట" అంటూనే ఫోన్ ఇచ్చేసింది
"హలో... హనీ బాగున్నావా రా"
"వూ...వూ ద్దమ్మా ఏణున్నావ్. నేనూ చ్చా" (పెద్దమ్మా.. ఏడున్నావు. నేనూ నీ దగ్గరికి వస్తా) అని ఏడుస్తూనే మాట్లాడుతోంది
"ఏడవద్దురా తల్లీ... ఎందుకేడుస్తున్నావ్, అమ్మ ఏదీ?" అంటే
"అమ్మ ఏకో పోయింది. పిన్ని ఎత్తోంది. పిన్ని ద్దు. నువ్ రా. నేనొచ్చా.....ఊ... ఊ.... రా ద్దమ్మా" (అమ్మడికో ఎక్కడికో పోయింది పిన్ని ఎత్తుకుని ఉంది. పిన్ని వద్దు. నువ్వు రా, నీ దగ్గరికి నీనొస్తా.. రా పెద్దమ్మా అని దాని భాషలో పిలుస్తోంది)
"సరే. నేనొస్తాలే. నువ్వు ఏడవద్దు తల్లీ. మా బుజ్జి కదూ?" సముదాయించేందుకు ట్రై చేస్తున్నా
"ఇప్పే రా. నీనూ ఏడున్నా. నేనూచ్చా" ఏడుపు ఆపకుండా మాట్లాడుతూనే ఉంది (ఇప్పుడే రా. నువ్వు ఏడున్నావు, నేనే వస్తా)
"ఇప్పుడు రాలేన్రా. మళ్లొస్తాలే. నువ్వు ఏడవకుండా ఉంటేనే వస్తా"
"ఇప్పే రా" ఏడుపు ఏ మాత్రం ఆపకుండా ద్దమ్మా ద్దమ్మా అంటూనే ఉందది.
దాని ఏడుపు వింటుంటే నాకు ఇటువైపు కంట్లో నీళ్లు కారిపోతున్నాయి. చాలా బాధగా ఉంది. ఇప్పడు దగ్గరుంటే వచ్చి నన్ను హత్తుకుపోయుండేది. నేనేమో తనకు దగ్గర్లో లేను.
పక్కనే ఉండే ఇంట్లోంచి పెద్దమ్మ వచ్చి నన్ను ఎందుకు ఎత్తుకుపోవటం లేదు అనేది మా హనీ ఆలోచన.
నేనసలు ఆ వూర్లో ఉంటే కదా.. మా వూరికి 8 గంటల దూరంలో ఉండే ఊర్లో ఉన్న నేను ఉన్నఫళంగా హనీ దగ్గరికి ఎలా వెళ్లగలను. అదీ నా బాధ.
ఈ విషయం దానికి అర్థం కావటం లేదు. రెండేళ్లు దాటి 3 నెలల వయసున్న తనకి నేను వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఇంట్లోనే ఉన్నప్పటికీ వచ్చి ఎత్తుకోవటం లేదని బాధ. వాళ్ల అమ్మ లేకపోతే నా దగ్గరికి వచ్చి నాతోనే ఉండే ఆ పిల్లకి ఇప్పుడు నేను కావాలి. వాళ్ల అమ్మలాగే, నేను కూడా తనని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయానని బెంగ. అందుకే ద్దమ్మా ద్దమ్మా అని వెక్కిళ్లు పెట్టి మరీ ఏడుస్తోంది.
ఎంత ఊరడించినా అది ఊరుకోవట్లేదు. పైగా వెక్కిళ్లు. చాలా భయమేసింది నాకు. వెంటనే ఫోన్ పిన్నికి ఇవ్వు అంటే ఫోన్ కూడా ఇవ్వదు. ఏం చేయాలో తెలీక దాని ఏడుపు వింటూ నేనూ ఈవైపు ఏడుస్తూ అలాగే ఉన్నా. ఈలోగా గౌతమి ఫోన్ ఎలాగోలా లాక్కుంది.
"అక్కా వాళ్లమ్మ ఏదో పనిమీద బయటికి వెళ్తూ నా దగ్గర వదిలేసి వెళ్లింది. దానికి నా దగ్గర ఉండటం ఇష్టం లేదేమో. వెంటనే పెద్దమ్మ కావాలి అంది. లేదురా అంటే విన్లేదు. ఇంటికెళ్లి వెతికింది. నువ్వు కనిపించలేదు. గట్టిగా ఏడుస్తూ ద్దమ్మా ద్దమ్మా అంటోంది. గేటు గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలో తెలీక నీకు ఫోన్ చేశాను. నీ గొంతు వింటే అయినా ఊరుకుంటుందని. నీ గొంతు విని అదింకా ఏడుస్తోంది. నేను ఎలాగోలా సముదాయిస్తాలే నువ్వు బాధపడకు" అంది.
సరే ఎలాగోలా ముందు దాని ఏడుపు ఆపు. వింటుంటే చాలా బాధగా ఉంది అని ఫోన్ పెట్టేశా.
ఫోన్ పెట్టేశానేగానీ హనీ గురించే దిగులు. ఇందాకే ఒంట్లో బాగలేని నేను.. ఇప్పుడు నా మనసు కూడా పేషెంట్ అయ్యింది.
మా బాబాయ్ కూతురు మంజు. దాని కూతురే హనీ. మొన్నటిదాకా... సంవత్సరంలో ఏ మూడు నాలుగు సార్లో మావూరికి వెళ్తుండే నన్ను హనీ అంతగా గుర్తుపట్టేది కాదు. నా దగ్గరికి సరిగా వచ్చేది కాదు కూడా. అలాంటిది ఈ మధ్య మావూర్లో ఓ నెల రోజులు ఉండేసరికి అది నాకు చాలా దగ్గరైంది. రోజూ తనతోనే నాకు కాలక్షేపం. నా దగ్గరికి వస్తే వాళ్ల అమ్మను సైతం మర్చిపోయేది.
మా హనీ పిల్ల అందరు పిల్లల్లాంటిది కాదు. కాస్త వెరైటీ. ఈ కాలం పిల్లలు అమ్మ తినిపిస్తే కూడా తినకుండా చాలా మారాం చేస్తుంటారు. కానీ ఈ పిల్ల మాత్రం చాలా బుద్ధిగా ఆకలేసిందంటే చాలు... అప్పుడు ఎవరు తనకు అందుబాట్లో ఉంటారో వాళ్లను "బూ పెట్టు" అని అడిగిమరీ పెట్టంచుకుని తింటుంది. అది కూడా ఎవరైనా తినిపిస్తే ఇష్టం ఉండదు, తనే చక్కగా కలుపుకుని చిన్న చిన్న ముద్దలు చేసుకుని ఎంత చక్కగా తింటుందో. అది కూడా సరిపోయినంతే. కడుపునిండిందంటే చాలు ఆ తరువాత ఒక్క ముద్ద కూడా ముట్టదు. అది కూడా ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తింటుంది. ఇది నిజ్జంగా నిజం. చూసి ఎంత ఆశ్చర్యపోయానో.. అంతకంటే ఎక్కువగా మురిసిపోయాను.
ఒకరోజు నేను అన్నం తింటుంటే వచ్చింది. బువ్వ తింటావా అంటే ఊ అంది. అప్పుడు నేను వేడన్నంలో టొమోటో ఊరగాయ వేసుకుని తింటున్నా. అది తనకి కలిపి పెట్టేసరికి చాలా నచ్చేసింది. ఇక అప్పట్నించి బువ్వ కావాలి అని అడిగిందంటే పక్కన ఊరగాయ ఉండాల్సిందే. ఒకవేళ పెట్టకపోతే ద్దమ్మా ఊగాయ ట్టు (పెద్దమ్మా ఊరగాయ పెట్టు) అని అడిగిమరీ పెట్టించుకుని తింటుంది మా బుజ్జి పిల్ల.
అంతేకాదు పాస్ వచ్చినా సరే.. ద్దమ్మా పాస్... డ్రాయి తీ.. అంటూ నా దగ్గరికి వచ్చి డ్రాయిర్ తీయించుకుని బాత్రూంలోకి వెళ్తుంది. ఈ వయసులో ఇంత శుభ్రత ఎలా అలవాటైందోగానీ దానికి. నాకు మాత్రం తను ఏం చేసినా అబ్బురమే.
ఓరోజు ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చింది. కొత్త బట్టలు వేసుకుని మరీ మెరిసిపోతోంది. నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. నిజం చెప్పొద్దూ నాకు అర్థం కాలేదు. "త్త ద్దలు.. జ్జెలు" అని అంటోంది. ఏంటి నాన్నా అని నేను అడుగుతుంటే వాళ్లమ్మ నవ్వుతూ.. కొత్త గుడ్డలు వేసుకున్నాననీ.. తన బ్లౌజ్‌కు గజ్జెలు కూడా ఉన్నాయని అంటోంది అక్కా అని చెప్పింది. ఓహో అలాగా.. భలేగుందిరా తల్లీ ఏదీ చూద్దాం రా అంటే.. దగ్గరికి రాదు. వాళ్లమ్మ ఎక్కడ తనను వదిలేసి ఊరికెళ్లిపోతుందో అనే భయంతో రావట్లేదని తరువాత అర్థమైంది నాకు.
నా దగ్గరుండేటప్పుడు ఎన్నెన్ని పనులు చేసేదో. నేను పాత్రలు తోముతుంటే తను కూడా చిన్న గ్లాస్ పట్టుకుని తోమేందుకు రెడీ అయిపోయేది. బట్టలు ఉతుకుతున్నా అంతే. చెత్త ఊడుస్తున్నా చీపురు తనకు ఇవ్వమని వచ్చేది. నువ్వు పట్టుకోలేవు అన్నా వినదు. కావాల్సిందే మొండికేసేది. చేసేదేంలేక తనకోసం ఓ చిన్న చీపురు రెడీ చేసి ఇచ్చాను. వంట చేస్తున్నప్పుడు కూడా అంతే ఉల్లిపాయలు చేత పట్టుకుని "నూనీ ఆ... సలేనా" (నేనూ చేస్తాను సరేనా) అంటూ నా గడ్డం పట్టుకుని అడిగేది. ఆ.. కానీ తల్లీ అనేదాన్ని నవ్వుతూ... ఆ ఉల్లిపాయ పొట్టుతీసేందుకు అది పడే అవస్థ చూసి ఎంత నవ్వుకునేదాన్నో.
ఓసారి నా చున్నీ తీసుకొచ్చి చీ కట్టు అని అడిగింది. ఏంటీ చీరా.. ఎందుకురా అంటే.. ట్టు ద్దమ్మా..... అంది. సరేనని చున్నీని సగానికి మడిచి కుచ్చిళ్లుపోసి చిన్నగా పైటలాగా వేస్తే ఆ పైట అటూ ఇటూ వేస్తూ ఎంత నవ్విందో. ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావ్ అంటే హ హ హ అంటూ వీధిలోకి పరిగెత్తింది. అలాగే ఓసారి వాళ్లమ్మను పెద్ద జడ వేసి మల్లెపూలు చుట్టమని అడిగిందట. ఎవరు చెప్పారో ఏంటో.. దానికి అలా చేయటం సంతోషం అంతే. చిన్న పిల్ల కదా.. ఏం చేసినా ఎంత బాగుండేదో. నిజంగానే వాళ్లమ్మ సవరంతో పెద్ద జడ వేసి పువ్వుల్ని చుట్టింది. అయితే కాసేపే ఉంచి తీసేసింది. పాపం హనీ బరువు మోయలేకపోయింది.
ఇకపోతే ఒక్క సెకండ్ కూడా అది కుదురుగా ఉండేది కాదు. ఎప్పుడూ ఏవేవో ఆటలు. కుక్కపిల్లలు, పిల్లులతో, బొమ్మలతో ఎన్ని ఆటలు ఆడుకునేదో. ఒక్కోసారి ఏమీ తోచకపోతే నా జుట్టుపై ప్రయోగాలు చేసేది. తల దువ్వేందుకు ట్రై చేయడం, జడ వేయడం.. అలా జడ వేస్తూ ఎన్ని కబుర్లు చెప్పేదో. చేతిలో ఆకేసి, పప్పేసి అంటూ.. చక్కిలిగింతలు పెట్టేది. నేను నవ్వకముందే తనే నవ్వేసేది. అది చూసి నేను ఎంత నవ్వేదాన్నో. తనకు కూడా చక్కిలిగిలి పెడితే ఎంతగా నవ్వేదో. ఎంత ముద్దుగా నవ్వుతుందో తను. నిజంగా స్వర్గమంటే ఇదేనేమో అనిపించేది నాకు.
అలా ముద్దులన్నీ మాటకట్టినట్టుండే తన నవ్వుల్నే చూశాను ఇప్పటిదాకా. అలాంటిది దాని ఏడుపు వింటుంటే భరించలేని బాధ. ఓ గంటసేపాగి మళ్లీ ఫోన్ చేశా. మళ్లీ అదే పరిస్థితి. ఏడుపు ఏ మాత్రం మానలేదు. పెద్దమ్మ ఇంట్లోనే ఉండి తన దగ్గరకు రాలేదని దాని బాధ. వాళ్ల అమ్మ వచ్చాక కూడా అలాగే ఏడుస్తోందట. వాళ్ల అమ్మను కూడా మా ఇంటికి తీసుకెళ్లి మళ్లీ చూసిందట. నేను లేను. అది ఏడుస్తూనే బాగా బెంగ పెట్టుకునేసిందని వాళ్ల అమ్మ మళ్లీ నాకు ఫోన్. నువ్ లా... ఏడున్నా ద్దమ్మా అంటోంది. సాధ్యంకాక ఫోన్ పెట్టేశా.
వాళ్లమ్మ ఏం సర్దిచెప్పిందోగానీ.. మరుసటి రోజుకు సర్దుకుంది. ఇక అప్పట్నించీ అప్పుడప్పుడూ ద్దమ్మతో మాట్లాడాలని వాళ్ల అమ్మని అడిగిమరీ ఫోన్ చేసేది. "ద్దమ్మా బాగున్నావా, బూతిన్నావా, ద్దనాయనా బాగున్నాడా, నువ్వెప్పుడొస్తావ్, నాకు చాకీటులు, బిస్కత్తులు తెచ్చావా" నాన్‌స్టాప్‌గా ఆగకుండా అడిగేది. నేను ఏం అడిగినా బుద్దిగా బదులిచ్చేది. ఆ కాసేపట్లోనే నువ్ బూ తిన్నావా అని ఎన్నిసార్లు అడిగేదో.. ఎన్ని బాధలున్నా దాని గొంతువింటే, అది చెప్పే కబుర్లు వింటే మనసంతా ప్రశాంతంగా అయిపోతుంటుంది నాకు.
ఇవ్వాళ కూడా ఫోన్... "ద్దమ్మా హాపీ నూ యర్, ఐలవ్వూ" అని చెప్పింది. పక్కన వాళ్లమ్మ చెబుతుంటే అలాగే చెప్పిందది. ఎంత బుజ్జి పిల్లో. నాకైతే ఈ లోకంలో ముద్దు ముద్దుగా పిల్చే ఎన్ని పేర్లున్నాయో, అన్ని పేర్లతోనూ తనని పిలవాలని అనిపించేస్తుంటుంది ప్రతిసారీ.
పసిపిల్లలు దేవుని రూపాలని ఊరికే అన్నారా అనిపిస్తుంది. అమాయకమైన ముఖం, అంతకంటే అమాయకమైన చేష్టలు. ముద్దు ముద్దు మాటలు, స్వచ్ఛమైన నవ్వులు.. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా... ఇవన్నీ దొంగపిల్ల హనీ నాకు ఎన్నో ఇచ్చేసింది. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అపురూపమైన జ్ఞాపకాలు. తను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
మా హనీ పిల్లతో కలిసి మీ అందరినీ ఇలా పలుకరించేశానన్నమాట. ఆ పిల్ల కబుర్లు మీకు కూడా నచ్చే ఉంటాయనుకుంటున్నా. మీ అందరూ చల్లని మనస్సుతో ఆ చిన్నారిని ఆశీర్వదించేయండి మరి...
2011కు వీడ్కోలు పలుకుతూ... 2012కు స్వాగతం పలుకుతూ.. నేనూ, మా హనీ బ్లాగ్ మిత్రులందరికీ.... నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేస్తున్నామహో...... ఈ కొత్త సంవత్సరం అందరికీ సకల శుభాలను కలుగజేయాలనీ.. సుఖ సంతోషాలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
బోలెడన్ని నవ్వుల పువ్వులతో...
మీ
కారుణ్య, హనీ.