నీ దేహపు పరిమళం
నా జ్ఞాపకాల మడతల్లో
ఇప్పటికీ అదే స్వచ్ఛత
అంతకుమించిన సువాసన
నీ పాదాల్ని ముద్దాడినప్పుడల్లా
వానొచ్చేముందు మట్టివానసనలా
గుండె నిండిపోయేది
నీ నుదుటిపై ముద్దాడినప్పుడల్లా
పిల్లగాలి నాట్యం చేస్తుంటే
పచ్చని పైరు పరవశించినట్లుండేది
నీ కళ్లపై ముద్దాడినప్పుడల్లా
అప్పుడే పుట్టిన లేగదూడని
ఒళ్లంతా తడిమి తడిమి నాకుతున్నట్లుండేది
నీ పెదాల్ని ముద్దాడినప్పుడల్లా
తొలిసారి అమ్మ గోరుముద్దల్ని
తినిపించి హత్తుకున్నంత హాయిగా ఉండేది
నీ చేతి వేళ్లని స్పృశించినప్పుడల్లా
నే పొత్తిళ్లలో ఉన్నప్పుడు
నాన్న పసిపిల్లాడై నన్ను తాకినట్లుండేది
అడుగులో అడుగై సాగుతున్నప్పుడల్లా
అంతటి ఆకాశమే
నా పక్కనే ఉందన్న గర్వం తొణికిసలాడేది
ఇప్పుడూ అంతే...
లేనిదల్లా నువ్వూ.. ఉన్నవన్నీ నీ జ్ఞాపకాలే...!!!
(అనుకోని వరమై దరిచేరి... జ్ఞాపకాలతో చలికాచుకోమని దూరమైన ఓ చిన్ని పిట్ట జ్ఞాపకంలో...)