ఒక్కోసారి నా బలానివి
చాలాసార్లు నా బలహీనతవి
గెలిపించేది నువ్వే
ఓడించేది నువ్వే
దిగులు పెట్టించేది నీవే
ఓదార్చేది నువ్వే
అనురాగంలో అమ్మనీ
కోపంలో నాన్ననీ
గుర్తు తెచ్చేది నీవే
ప్రేమగా మురిపించేది నువ్వే
అందర్నీ మరిపించేది నీ నవ్వే
ఆశల్ని పెంచిందీ నువ్వే
మొగ్గలోనే చిదిమేసిందీ నువ్వే
ఏడ్చినప్పుడూ
నవ్వినప్పుడూ
కంటనీరు నీవల్లనే
కాంతి రేఖవు నీవే
చిక్కని చీకటి నీ వల్లనే
ధైర్యాన్నిచ్చేది నీవే
అగాధంలోకి విసిరేది నీవే
శాంతమూర్తిలా ఓసారి
ఉగ్రరూపంలో మరోసారి
భిన్నత్వంలో ఏకత్వంలా
సమస్తాన్నీ నిక్షిప్తం చేసుకున్న
ఓంకార స్వరూపమై
అర్ధనారీశ్వర తత్వమై
అర్థమయ్యేలోగానే
అర్థంకాని బ్రహ్మాండమై
అణగదొక్కేస్తోందీ నువ్వే
నీ పరిచయం వరమా, శాపమా..?!