Pages

Monday, 18 February 2013

ఆ ఇంట్లో ఏం జరుగుతోంది...?




ఊరికి చివరగా ఓ పూరిల్లు...

ఇంకా విద్యుత్తు వెలుగులు పలుకరించని ఆ ఇంట్లో కిరసనాయిలు బుడ్డీ.. వెన్నెల వెలుగులంత స్వచ్ఛంగా హాయిగా నవ్వుతోంది. అంతలోనే నల్లని మబ్బులతో వేళాకోళం ఆడుతున్న రాత్రమ్మకు నిద్రొచ్చింది. చిక్కటి చీకటితో చెలిమి చేసిన రాత్రమ్మకు తోడుగా ఒంటరి ఆ పూరిల్లూ మత్తుగా జోగేందుకు సిద్ధమైంది.

"అమ్మలూ... ఇటొచ్చి పడుకోవే.."

"వుహూ.. ఇయ్యాల నేను నీతో పడుకోను పో.." చిన్ని చాపను అమ్మకి కాస్త పక్కగా జరిపి (మరీ దూరంగా పడుకుంటే రాత్రి భయమేస్తేనో) బుల్లి దిండు వేసుకుని పేద్ద ఆరిందానిలా పడుకుంది సీత.

కూతురి గడుసుదనానికి విస్తుపోయిన తల్లి.. "నీ ఇష్టం అమ్మలూ.. మరి రాతిర్లో బయమేస్తే నా దగ్గరికి రాకూడదు అయితే" బెదిరిస్తే అయినా దగ్గరికి వస్తుందేమోనని ఆశతో అంది

"నాకేం భయమేయదు పో... నువ్ పడుకో" మూతి విరుస్తూ అటు తిరిగి పడుకుంది.

ఏంటీపిల్ల ఇయ్యాల ఇలా చేస్తోందని మనసులో అనుకుంటుండగానే.. అలసిన శరీరానికి ఆవులింతలు స్వాగతం చెప్పగానే ఎప్పుడు నిదరోయిందో తనకే తెలీదు.

మామూలుగా అయితే అమ్మ మెడచుట్టూ చేతులు వేసుకుని హాయిగా బజ్జునే సీత.. ఇవ్వాళ అమ్మకి కాస్త దూరంగా ఒంటరిగా పడుకుంది. పక్కన తమ్ముళ్లని కూడా పడుకోనీయలేదు. తనలో తానే ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంది.

ఇంతలోనే... వెల్లకిలా పడుకున్న సీతమీద ఎవరో ఎక్కి కూర్చుని, గొంతు నొక్కేస్తున్నారు. బెదిరిపోయిన సీత అమ్మా, అమ్మా అంటూ వెర్రిగా కేకలేస్తూ పిలిచింది. మీదనున్న బరువును తోసేందుకు ప్రయత్నించింది. ఏం చేసినా మీదనుంచి బరువు దిగితే కదా.. ఏం జరుగుతోందో తెలీక అలాగే పడిపోయింది.

తెల్లవారుజామున మెలకువ రావడంతో దూరంగా పడుకుని ఉన్న సీతని దగ్గరికి తీసుకునేందుకు తల్లి మీద చేయి వేయగానే... ఒళ్లంతా కాలిపోతోంది. అయ్యో నా తల్లీ... ఏమైందే నీకు అనుకుంటూ దగ్గరికి తీసుకోగానే వెక్కి వెక్కి ఏడుస్తోంది. తెల్లారేదాకా ఒళ్లో పడుకోబెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్తే.. ఏదో చూసి భయపడింది, మరేం ఫర్వాలేదంటూ డాక్టర్ జ్వరం తగ్గేందుకు మందులిచ్చి పంపాడు.

జ్వరం కాస్త తగ్గాక... ఏం తల్లీ రాత్రి ఏమైంది నీకు.. ఏం చూసి భయపడ్డావు అని మెల్లిగా అడిగింది తల్లి. "నీతో మాటాడను పోమ్మా... ఎవరో నామీద ఎక్కి గొంతు నొక్కేస్తుంటే... గట్టిగా అమ్మా అని అరిచాను, ఏడ్చాను.. నువ్వు రానేలేదు" వెక్కుతూ మాటాడింది సీత. 

"నీమీద ఎవరో ఎక్కి కూసున్నారా, నువ్వు గట్టిగా ఏడుస్తూ పిలిచావా.. లేదు తల్లీ.... నువ్వు అసలు పిలవలేదు.. నువ్వు పిలిస్తే నేను లేవనా..?"

"లేదు.. నేను పిలిచాను.. నువ్వే లేవలేదు" బుంగమూతితో వెక్కుతూనే మాటాడుతోంది సీత.

"పోన్లే అమ్మలూ.. నాకు వినిపించలేదేమో.. సరేలే ఇకపై నువ్వు ఒక్కదానివే పడుకోకు.. సరేనా...?" సముదాయించింది తల్లి.

"అమ్మో.. ఇకమీదట ఒక్కదాన్నేనా..... అమ్మలేకుండా పడుకోనే కూడదు..." మనసులో బలంగా అనుకుంది సీత.

సీత పెద్దయ్యేలోగా... పూరిల్లు కాస్తా చిన్నపాటి మూడు రూములుండే మిద్దె ఇల్లు అయ్యింది. అమ్మా,నాన్న ఓచోట, పిల్లలు మరోచోట పడుకోవడం అలవాటైంది. చిన్నప్పుడు ఒంటరిగా పడుకునేందుకు బయపడిన సీత పెద్దయ్యేకొద్దీ... ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకుంది. చిన్నప్పుడు జరిగిన సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగక పోవటంతో.. భయం పోయి ఒంటరిగానే పడుకునేది.

అలాంటిది మళ్లీ ఓరోజు రాత్రి... చిన్నప్పటిలాగే.. ఎవరో మీద ఎక్కి కూర్చుని బలంగా గొంతు నొక్కేస్తున్నారు... మాట పెగలటం లేదు... భయంతో బిక్కచచ్చి పోయింది. ఎంత పిలిచినా, అరచినా, ఏడ్చినా పక్కనే ఉన్న తమ్ముళ్లుగానీ, మరో రూంలో ఉన్న తల్లిదండ్రులుగానీ ఎవరూ రావటం లేదు... పెనుగులాడి పెనుగులాడి ఏడుస్తూ ఉండిపోయింది.

ఉదయాన్నే అమ్మ దగ్గర బావురుమంటూ జరిగిందంతా చెప్పింది సీత. అయినా అమ్మగానీ, తమ్ముళ్లుగానీ ఎవరూ నమ్మటం లేదు. అయినా మనింటికి ఎవరు వస్తారు సీతా... మేమందరం పక్కనే ఉంటే, నీమీద ఎక్కి కూర్చుని గొంతు నొక్కేస్తారా.. చిన్నప్పుడు భయపడినట్టే.. ఏదో చూసి భయపడ్డావులే... అని నచ్చజెప్పింది.. ఎంతచెప్పినా ఎవరూ నమ్మకపోయేసరికి కోపం ఎక్కువై ఏడుస్తూ వెళ్లిపోయింది.

పెళ్లయి అత్తారింటికెళ్లిన సీతకి మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవలేదు. దాంతో హాయిగా ఉండసాగింది. కానీ.. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లాలంటే మాత్రం.. తనని చంపేందుకు చూస్తున్న ఆ బరువైన ఆకారం గురించి తల్చుకుంటేనే వణుకు. అయినా ఎప్పుడో ఓసారి మాత్రమే అలా జరుగుతోంది.. ప్రతిసారీ కాదుకదా అని మనసుకి ధైర్యం చెప్పుకుని పుట్టింటికి వచ్చి వెళుతోంది.

ఓరోజు వేసవి ఉక్కబోతకి తట్టుకోలేక భర్తతో కలిసి మిద్దెపై పడుకుంది సీత. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుని హాయిగా నిద్రకుపక్రమించారు. ఇంతలో సీతకి మళ్లీ చిన్నప్పటి అనీజీ. మెల్లిగా బరువైన ఆకారం మీదకొస్తోంది. బలంగా గొంతు నొక్కుతోంది. ఊపిరి సలపనీయటం లేదు. అయినా పైకి లేచేందుకు ప్రయత్నిస్తోంది సీత. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. గట్టిగా భర్తని పిలిచింది, పక్కనే పడుకుని ఉన్నా భర్తని చేతితో తట్టి లేపేందుకు ఎంతగానో ట్రై చేస్తోంది కుదరటం లేదు. ఎప్పట్లా ఏమీ చేయలేక సొమ్మసిల్లి పడిపోయింది సీత.

తెల్లారిన తరువాత భర్తకి జరిగింది చెబితే.. పిచ్చిదానిలా చూశాడు.. నువ్వు నన్ను పిలిచావా.. ఎప్పుడు..? అంటూ వేళాకోళం చేశాడు. చిన్నప్పటినుంచీ చెబుతుంటే ఎవరూ నమ్మటం లేదు.. ఇప్పుడు మీరెందుకు నమ్ముతార్లే.. అని మనసులో అనుకుని భయం భయంగా కిందికి దిగింది సీత.

కుర్చీలో జారబడి ఎందుకు నాకే ఇలా జరుగుతోంది. పోనీ జరిగింది చెబితే ఎవరైనా నమ్ముతారా అంటే అదీ లేదు.. నేనే భయంతో అలా ఊహించుకుంటున్నానా, లేక నిజంగానే జరుగుతోందా..? మనసంతా ఒకటే ఆలోచనలు.... నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకోవటం ఎలా..? నా భ్రమా.. లేక నిజమా.? ఎలాగైనా సరే తెలుసుకోవాలి. మనసులో బలంగా అనుకుంది.

మరుసటి రోజు రాత్రి మేడమీదికి సీత అమ్మానాన్నలు తమ్ముళ్లు కూడా పడుకునేందుకు వచ్చారు. అందరూ కాసేపు కబుర్లలో పడిపోయి, వెన్నెల వెలుగులో, చల్లగాలికి హాయిగా నిద్రపోయారు.

రాత్రిలా మళ్లీ అవుతుందేమోనని భయంతో బిగుసుకుపోయిన సీత, భర్తని గట్టిగా పట్టుకుని పడుకుంది.

ఎప్పట్లా తెల్లారింది. ఒక్కొక్కరే లేచి కూర్చున్నవాళ్లంతా... వాళ్లమ్మని చూసి బెదిరిపోయారు. ఒళ్లంతా చెమటలతో ఏడుస్తూ కూర్చుంది సీత తల్లి. అందరూ ఏమైంది అనేంతలోనే... "ఇంతమంది ఉన్నారు.. ఎవరో వచ్చి మీద కూర్చుని గొంతు నొక్కుతుంటే..... ఒక్కరైనా వచ్చారా.. ఎంత అరిచాను, ఏడిచాను..పెనుగులాడాను.. అమ్మో అమ్మో.. ఎంత బరువు... ఊపిరి ఆడనిస్తేగా..." ఏడుపులో గొంతు పూడుకుపోయిందామెకు.

ఇంతలో అందుకుంది సీత.. చిన్నప్పటినుంచీ చెబుతుంటే విన్నావా... నేనే ఏదో భయపడ్డానని చెబుతూ వచ్చావు.. ఇప్పుడేమంటావు..?! కోపంగా తల్లిని నిలదీసింది. నిజమేనే తల్లీ.. ఇప్పుడు కదా తెలుస్తోంది... ఇదంతా ఎవరో మనిషి చేశాడని అనుకోలేం.. ఏదో పీడ అనుకుంటా... మొన్ననే చిట్టిబండ దగ్గర కిరసనాయిలు పోసుకుని మొగుడూ పెళ్లాలు చచ్చారు కదా.. అసలే చివరిల్లు... గాలి రూపంలో మనల్ని పట్టుకున్నారో ఏమో... ఏడుస్తూనే చెప్పుకొచ్చిందామె.

ఎవరో మంత్రగాళ్లను తీసుకొచ్చి, మరుసటి రోజునుంచీ ఇంట్లో ఒకటే పూజలు... అందరికీ యంత్రాలు కట్టించింది... మంత్రించిన అక్షింతలను, నిమ్మకాయల్ని ఇంటిచుట్టూ చల్లింది.. భూత, ప్రేత, పిశాచాల నుంచి ఇంటికి రక్ష అంటూ.. రాగి రేకులపై ఏవో గీతలు గీసి దేవుడి గదిలో పెట్టించి... అమ్మ దగ్గర బాగా దండుకుని హాయిగా జారుకున్నారు మంత్రగాళ్లు.

"అమ్మో... చిన్నప్పటినుంచీ నేను బాధపడింది ఇంట్లోకి ఏదో పీడ జొరబడటంవల్లేనా.. ఇన్నాళ్లకైనా అమ్మకి తెలిసింది. లేకపోతే... తల్చుకుంటేనే భయమేస్తోంది... హమ్మయ్యా.. ఇంక ఎలాంటి బాధా ఉండదు" అనుకుంటూ ఆరోజు హాయిగా నిద్రపోయింది సీత.

ఆ రోజు నుంచి ఇంట్లో సీత తల్లితో సహా అందరూ హాయిగా నిద్రపోతున్నారు.. ఇంతలో ఓరోజు ఉదయాన్నే.. మళ్లీ ఒళ్లంతా చెమటలతో, జడుసుకున్న ముఖంతో ఏడుస్తూ... సీత తల్లి.....

..........
...........
..........

ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతోంది... సీత, సీత తల్లికి.. లేదా ఇంట్లో మరెవరికైనా... ఎందుకలా జరుగుతోంది..? అదంతా దెయ్యాలు, భూతాలు, గాలి పీడలు చేస్తున్న పనేనా...?!! మరింకేదైనా కారణం ఉందా..?! అసలు ఇలాంటి అనుభవాలు ఆ ఇంట్లో వాళ్లకి మాత్రమేనా... మరింకెవరికీ అలా జరగటం లేదా...?!