ఎందుకోగానీ.. ఈరోజు లేచింది మొదలు "మహా గణపతిం మనసా స్మరామీ" అనే పాట మరీ గుర్తుకొచ్చేస్తోంది. గుర్తుకు రావడమేంటి, పైకి కూడా పాడేస్తూ మరీ వంటపని మొదలెట్టాను. కూనిరాగాలు తీస్తూ, పాడిన ఆ పాటనే మళ్లీ మళ్లీ పాడుతూ (అందులోని రెండు లైన్లు తప్ప పాట పూర్తిగా నోటికి రాదు మరి...!) పనులన్నీ ముగించి, ఎప్పట్లాగే ఆఫీసుకు బయల్దేరాను.
ఆరోజు ఎందుకోగానీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. నా చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదంగా, హాయిగా అనిపిస్తోంది. ఇక్కడ "ఆ నలుగురు సినిమా"లో రాజేంద్రప్రసాద్‌కు యమభటులు చెప్పే ఒక డైలాగ్‌ను మీకు తప్పకుండా చెప్పాలి. అదేంటంటే... "నేనే గెలిచాను, నేనే గెలిచాను అంటూ రాజేంద్రప్రసాద్ సంతోషంగా యమభటుల వైపు చూడగానే వారు దేవతల్లాగా కనిపిస్తారు.
అది చూసి ఉలిక్కిపడ్డ రాజేంద్రప్రసాద్ అదేంటి మీరు యమభటులు కదా..! దేవతల్లాగా కనిపిస్తున్నారెందుకని ప్రశ్నిస్తాడు. నువ్వు ఇంతదాకా దుంఖంలో మునిగిపోయి ఉన్నావు కాబట్టి, మేము నీకు యమభటుల్లాగా కనిపించాము, ఇప్పుడు పట్టరాని సంతోషంతో ఉన్నావు కాబట్టి దేవతల్లాగా కనిపిస్తున్నాము. దుఃఖం అంటే నరకమని, సంతోషమంటే స్వర్గం అని వివరించి చెబుతారు వాళ్ళు".
ఆ కథనలా ఉంచితే... నేను ప్రతిరోజూ అదే దార్లో వెళ్తూ ఉన్నా కూడా ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప నాకు ఈరోజు ఉన్నంతటి ప్రశాంత వాతావరణం కనిపించలేదు. అంటే ప్రతిరోజూ ఏవో చికాకులు మనసును ఒక పట్టాన ఉండనీయక పోవడం వల్ల నేను ఈరోజు ఉన్నంత హాయిని రోజూ అనుభవించలేక పోతున్నానేమో...?!
సంతోషాన్ని, దు:ఖాన్ని అంత చక్కగా చెప్పిన ఆ సినిమాలోని సంభాషణ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కోసారి చాలా ఇన్‌స్పిరేషనల్‌గా కూడా అనిపిస్తుంటుంది. నా మనసులో ఏదేని దుఃఖం గూడుకట్టుకున్నప్పుడల్లా ఆ సినిమాలోని యమభటులు అలా కళ్లముందు నిలబడుతారంటే నమ్మండి. అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవతల్లా...!
ఇక ఈరోజు ఉదయం ప్రశాంతతలోకి మళ్లీ వస్తే... బస్సు వేగంగా కదుల్తోంది. వెస్ట్ మాంబళం, తంబైయార్ రోడ్ (మా ఆఫీస్ అక్కడే ఉంటుందిలెండి)కు వెళ్ళాలంటే.. ముందు దొరైస్వామి బ్రిడ్జ్ దాటి వెళ్లాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అసలే చాలా ఇరుగ్గా ఉండే ఆ రోడ్‌లో రెండువైపులా వాహనాలను వదలాలంటే, ట్రాఫిక్ పోలీసులు పాపం చాలా కుస్తీలే పడాల్సి ఉంటుంది.
ఆరోజు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మాకు ఎదురువైపు నుండి వచ్చే వాహనాలతో రోడ్ నిండిపోయి ఉంది. ఎదురుగా రావాల్సిన వాహనాలు వాటికి కేటాయించిన రోడ్డు సగం భాగంలో కాకుండా పూర్తిగా మా ఎదురుగా వచ్చి చేరాయి. అందులో ఆటోలు, బైక్‌లు ఎక్కువగా ఉన్నాయి.
కూర్చోడానికి సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కగా నిల్చున్నా. మా బస్సుకు ఎదురుగా వస్తోన్న వాహనాలను పరిశీలనగా చూస్తున్నాను. ఆటోలు, బైక్‌లు ఆ రకంగా ముందుకొచ్చి ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్నా, దగ్గర్లో ట్రాఫిక్ పోలీసుల ఆనవాళ్లే కనిపించటం లేదు. రెండువైపులా ట్రాఫిక్ స్తంభించి ఎటుచూసినా వాహనాలన్నీ బారులు తీరాయి.
మా బస్సు డ్రైవర్ స్కూటర్ వాలాలను, ఆటోవారిని తిట్టో, బ్రతిమాలుకునో బస్సును మెల్లగా ముందుకు కదిలిస్తున్నాడు. ఇంతలో ఎదురుగా వెనకనుండి వచ్చాడో బైక్‌వాలా... రావడం రావడం ఫాస్ట్‌గా వచ్చి సరాసరి మా బస్సును గుద్దేశాడు. బస్సు వేగంగా కదలటం లేదు కాబట్టి, అతడి అదృష్టం బాగుండి చిన్నపాటి దెబ్బలతో బైటపడ్డాడు. కిందపడిపోయిన అతడిని తిట్టి మరీ పక్కవాళ్లు లేపి, అతడి వస్తువులను అందించారు.
బైక్‌వాలా అలా రాంగ్ రూట్లో వచ్చినందుకు అందరూ తిట్టుకున్నా, పడిపోగానే అయ్యో...! అంటూ బాధపడ్డారు. నా పక్కనున్న మహిళలు కూడా పాపం ఆ అబ్బాయి, అయినా ఎందుకంత తొందర అంటూ మెల్లగానే చీవాట్లు పెడుతున్నారు. ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినా కూడా ట్రాఫిక్ పోలీసుల జాడ మాత్రం లేదు.
ఇంతలో నా పక్కనున్న మహిళలు అందుకున్నారు. ఇలా రాంగ్ రూట్‌లో వచ్చేవాళ్లు, వస్తూనే ఉంటారు, ట్రాఫిక్ ఆగిపోతూనే ఉంటుంది. పోలీసులు మాత్రం రారు అని ఒకామె అంటే... మరొకామె పాపం వాళ్ల బొజ్జల్ని కదిలించుకుంటూ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా..! అంటూ గట్టిగా నవ్వేసింది. వాళ్ళిద్దరి సంభాషణనంతా విన్న బస్సులో మిగిలిన వారందరూ కూడా వారికి జతకలిపారు.
హమ్మయ్య... కాసేపటి ముందు ఉన్న ప్రశాంత వాతావరణం ఇలా అయ్యిందేంటి అనుకుంటున్న నాకు ఆ ఇద్దరి మహిళల సంభాషణతో ప్రాణం లేచివచ్చినట్లైంది. వాళ్ళ నవ్వుల్తో జత కలుపుతూ నేనూ హాయిగా నవ్వుతూ, తలతిప్పి చూస్తే.. నిజంగానే ఓ లావాటి ట్రాఫిక్ కానిస్టేబుల్ తన పొట్టను ఊపుకుంటూ... ఆటోల, బైక్‌ల వారిపై కేకలేస్తూ వస్తున్నాడు. అది చూసిన బస్సులోని వారందరం మరోసారి పెద్దగా నవ్వేశాం...!
{గమనిక... ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను కించపరచటం నా ఉద్దేశ్యం కాదండి. జస్ట్ "సెన్సాఫ్ హ్యూమర్" కోణంలో చూస్తే మీరు కూడా తప్పకుండా నవ్వేస్తారు. వేలాది, లక్షలాది వాహనాలను అనునిత్యం సరైన దార్లో నడిపిస్తూ, నగర ట్రాఫిక్‌ను అదుపాజ్ఞల్లో పెట్టే ట్రాఫిక్ పోలీసులు లేకుండా, కాసేపు ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. అలాంటి వారి సేవలను కించపరచడం భావ్యం కాదు కదా...! జస్ట్ ఫర్ పన్... అంతే...!!}