Pages

Thursday, 27 December 2012

అప్పదాసూ... మా నాన్నా...!!
శ్రీరమణగారి "మిథునం"... "మన అమ్మానాన్నల కథ"....... ఈ మాటలు ఎంత అక్షర సత్యాలో కదా....

మిథునం కథ మాత్రమేనా... కథ అనుకుని అక్కడే ఆగిపోగలమా ఎవరైనా దాన్ని చదివితే... చదివాక అసలు స్థిరంగా ఉండగలమా... కొన్నాళ్లకైనా మామూలు మనుషులం కాగలమా... ఎప్పటికైనా మిథునంనిగానీ, అప్పదాసు, బుచ్చిలక్ష్మిలను గానీ మర్చిపోగలమా...?!

ఎప్పటికీ మర్చిపోలేం.. ఎందుకంటే అది కథ కాదు.. మన అమ్మా నాన్నల జీవితం. మనం అమ్మానాన్నలుగా జీవించబోయే జీవితం. అందుకే అది మన జీవితాల్లో అంత గాఢంగా పెనవేసుకుపోయే "కథానుబంధం" అయింది. మన అమ్మానాన్నలు ఇలా ఉండేవారేమో అని, మనం అమ్మానాన్నలం అయ్యాక ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకోని "మిథునం" ప్రేమికులు ఉండరేమో.

మిథునంతో కళ్లు కలిపితే... కళ్లల్లో అమ్మానాన్నల జీవితం స్వచ్ఛంగా సాక్షాత్కారం అవుతుంది. అప్పదాసు, బుచ్చిలక్ష్మి కబుర్ల లోగిళ్లోకి అడుగుపెట్టినట్లుగా మన అమ్మానాన్నల జీవితపు కుటీరంలోకి తెలీకుండా అడుగులు వేసేస్తాం. అలా చిన్నతనం నుంచీ, ఇప్పటిదాకా అమ్మానాన్నలతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ.. ఒక్కో జ్ఞాపకాన్ని ఏరుకుంటూ పోతే...

సంతోషాలు, ఆనందాలు అనే ఎన్నో వజ్రాలు, రత్నాలూ దొరకవచ్చు... కష్టాలు, కడగండ్లు అనే రాళ్లూ, రప్పలూ దొరకనూవచ్చు. వాటితో, వాళ్లతో పెనవేసుకున్నదే కదా మన జీవితం... అందుకే ప్రతిదీ అపురూపమే.

నా వరకు నేను... మిథునం చదువుతున్నంతసేపు, చదవటం ఆపేసి ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు బుచ్చి లక్ష్మిలో అమ్మను, అప్పదాసులో నాన్నని చూడకుండా ఉండలేకపోయా. నిజ్జంగా ఎన్నెన్ని సారూప్యాలో వాళ్లకీ, వీళ్లకీ. అందుకే వాళ్లు హాయిగా నవ్వుతుంటే నేనూ గలగలమంటూ జతకలిపాను, బాధపడుతుంటే విలవిలలాడిపోయాను, ఉడుక్కుంటుంటే మురిసిపోయాను.. జీవితం కాసి వడబోసిన వాళ్ల అనుభవాల మాటల్ని వింటూ భవిష్యత్తుకు సన్నద్ధమయ్యే సిపాయినయ్యాను..

బుచ్చిలక్ష్మమ్మలా మా అమ్మ వయసులో అంత పెద్ద కాకపోయినా...... బుచ్చమ్మను చూసినట్లే ఉంటుంది. ఛామనచాయ ముఖంతో, ఆ ముఖంలో ఓ మెరుపుతో, శాంతానికి మారుపేరులా కనిపించేది. నాన్న కూడా అప్పదాసులా పెద్ద వయసువారు కాకపోయినా.... ఆయనకేం తీసిపోరు అన్నట్లుగా ఉండేవారు. తిండిపట్ల యావ ఉన్నా... రోజూ తను తినే భోజనాన్ని ఇద్దరికైనా పంచిపెట్టనిదే తినేవారు కాదు. పైగా అమ్మకోసం తన పళ్లెంలో కాస్తయినా అలాగే ఉంచేవారు.

ఓరోజు... ఎందుకలా ఎప్పుడూ ప్లేటులో అలా ఉంచుతావు నాన్నా... అంటే.. "మీ అమ్మ తిక్కది రా... ఎప్పుడూ అందరి కడుపూ నిండిందా అని చూస్తుందేగానీ, తన కడుపు గురించి పట్టించుకోదు. నేనూ పట్టించుకోకపోతే ఎలా...?!" అన్నాడు నాన్న. ఆహా.. అలాగా.. అనేసి ఊరుకున్నా. చిన్న వయసులో అంతకంటే ఇంకెలా స్పందించాలో తెలీలేదు. ఇదుగో ఇవ్వాళ "మిథునం" చూస్తుంటే (చదువుతుంటే) ఇలాంటివి గుర్తొస్తున్నాయి. కళ్లను తడిపేస్తున్నాయి, గుండెలో చెమ్మని బయటికి తెస్తున్నాయి.

"దోర జామకాయను అప్పదాసు నమిలి గుజ్జును పళ్లూడిపోయిన బుచ్చమ్మకు ఇస్తే ఆమె చప్పరిస్తూ జామ రుచిని ఆస్వాదిస్తుంటే..." "సత్సంగత్యే నిస్సంగత్వం - మంచితోడూ మంచినీడా" అనుకుంటూ విశ్రాంతిగా బావికి చేరగిలబడిన అప్పదాసు... ఈ వాక్యాలు చదువుతుంటే ఎంత తృప్తిగా అనిపించిందో.. "మంచితోడూ, మంచినీడా..." ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు కదా... ఏ కొందరికో ఆ భాగ్యం దక్కుతుందేమో..

చిన్నతనంలోనే దంపతులైన అమ్మానాన్నల్ని వేరుకాపురం పేరుతో నాన్నమ్మ పక్కనబెడితే.. వంట కూడా చేతగాని అమ్మకి, నెలల పాపనైన నాకూ.. అన్నీ తానై అమ్మలా చూసుకున్న నాన్న... అప్పదాసులా కళ్లముందు కదలాడగా.. కళ్లు నిండిపోయాయి. పళ్లూడిపోయిన భార్యకి గుజ్జును నమిలి ఇచ్చిన అప్పదాసును... పగలంతా కూలిపనులు చేసి, వంట సరుకులతో ఇంటికొచ్చి అలసిన శరీరంతోనే వంటచేసి అమ్మకి తినిపించిన తనే ఓ అమ్మలా మారిపోయిన నాన్న గురించి తల్చుకుంటే..."మంచితోడూ, మంచినీడా" మాటలు ఎంత అక్షర సత్యాలో కదా అనిపించింది.

బుచ్చమ్మ, అప్పదాసుల ఇంట్లో అంత పెద్ద పెరడు లేకపోయినా.. మా ఇంట్లోనూ ఒకప్పుడు బోలెడన్ని మొక్కలుండేవి. ప్రతివాటితోనూ అమ్మా, నాన్నకి అనుబంధం ఉండేది. మొక్కలతోపాటు కోళ్లు, కుక్కలు, పిల్లులు ఇంట్లో ఉండేవి. వాటికి ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తుండేవాడు నాన్న. అప్పటి మొక్కలు, పెంపుడు జంతువులు అన్నీ పోగా.. ఇప్పటికి మిగిలుంది ఒకే ఒక్క కొబ్బరి చెట్టు మాత్రమే.

బుచ్చమ్మను అప్పదాసు ఉడికించినట్లుగా నాన్న అమ్మని భలేగా ఉడికించేవారు. నాన్నతో కలిసి అమ్మను మేం కూడా ఏడిపించేవాళ్లం. కానీ కాసేపట్లోనే అమ్మ మాతో జతకలిసి హాయిగా, స్వచ్ఛంగా నవ్వేసేది. అమ్మ కూడా తక్కువేం తినలేదు. నాన్నని బాగా ఆటపట్టించేది అచ్చం బుచ్చమ్మలా... మీకంటే ముందు వచ్చిన ఉజ్జోగస్తుల సంబంధం చేసుకునుంటే ఈ కష్టాలేం లేకుండా బ్రతికేద్దును. మిమ్మల్ని చేసుకుని ఓ నగా, నట్రా అంటూ మూతి వంకర్లు తిప్పుతూ మాట్లాడుతుంటే... నాకంటే బాగా చూసుకునేటోళ్లు ఎవరే అంటూ నవ్విసేవారు నాన్న.

బుచ్చమ్మ, అప్పదాసుల్లా...... అమ్మ ఎక్కడికెళ్లినా ఆమెతోపాటు నాన్న ఉండాల్సిందే. నాన్న లేకుండా అమ్మ కూడా ఎక్కడికీ వెళ్లేది కాదు. ఒకవేళ వెళ్లినా ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేయాల్సిందే. చిన్నప్పుడు ఊర్లో హరికథలు, బుర్రకథలు, వీథి నాటకాలు లాంటివి జరుగుతుంటే.. అమ్మా, నాన్న చక్కగా తయారై... చాపలు, నీళ్ల చెంబులతో హాజరైపోయేవాళ్లు. ఇక పిల్లలైన మామాట సరేసరి. అమ్మా, నాన్న కథలో ఎంతగా లీనమయ్యేవారంటే.. కథను బట్టి నవ్వేవాళ్లు, ఏడ్చేవాళ్లు, బాధపడేవాళ్లు... అప్పుడు చిన్నవాళ్లం కదా.. మాకేమీ అర్థమయ్యేది కాదు.. ఇప్పుడు "మిథునం" పుణ్యమా అని.. వాళ్ల అమాయకత్వం, స్వచ్ఛమైన వాళ్ల అనుభూతుల్ని ఇలా ఏరుకుంటూ పోగుచేసుకుంటున్నా.

ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని జ్ఞాపకాలు.. అనుభూతులు.. మరపురానివి.. మాసిపోనివి...కానీ.. అప్పదాసుకూ.. మా నాన్నకీ ఓ గొప్ప సారూప్యం ఏంటంటే...

అప్పదాసులా నాన్న ముందుగానే వెళ్లిపోయారు.... బుచ్చమ్మలాంటి మా అమ్మను వదిలి ఆయన వెళ్లిపోయారు. దాసు లేని బుచ్చమ్మలా అమ్మ జీవితపు సముద్రాన్ని జ్ఞాపకాల నావతో ఇప్పటికీ ఈదుతూనే ఉంది.

"చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం, నే వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు. అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములూ, కందట్లూ, పొంగరాలూ ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే పిచ్చి వెర్రి కోరిక లెవరు తీరుస్తారు? కొడుకా, కోడలా, మనవడా, దేవుడా?" అంటూ బుచ్చమ్మలా అనలేదు కానీ...

"నేనుండగానే ఈ జీవుడ్ని తీసుకెళ్లు తండ్రీ... ఆయన లేకపోయినా నేను ఉండగలను, పిల్లల్ని చూసుకోగలనేమోగానీ... నేను లేకుండా ఆయన ఉండటం, పిల్లల్ని చూసుకోవడం కల్లో మాటే.. చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోతారు..." ఇద్దర్లో ఎవరో ఒకరు పోవాల్సి వస్తే.. ముందు ఆయన్ని, ఆ తరువాతే నన్ను తీసుకెళ్లు అంటూ గొణుక్కుంటుండటం చాలాసార్లు విన్నాను నేను. అప్పట్లో అర్థం కాలేదు.. కానీ ఇప్పుడు బుచ్చమ్మ కోణంలోంచి చూస్తే.. అమ్మలా ఎంతమంది బుచ్చమ్మలున్నారో ఈ లోకంలో కదా అనిపించగానే దుఃఖం ఆగలేదు.

ఒక్కటి మాత్రం నిజం.....

"ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చని చెట్లలో చూసుకోవడం నేర్పించాడు... కాసే ప్రతి చెట్టులోనూ ఆయన్ని చూసుకోగలను... లక్కా బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని వత్తి ఎన్నాళ్లుంటుంది. నా విస్తళ్లు అయిపోగానే నేనూ..." బుచ్చిలక్ష్మి ఎక్కిళ్ల శబ్దంలా....

నేను లేకుండా ఆయన బ్రతకలేరని అనుకుందేగానీ... ఆయన లేని తాను కూడా బ్రతకటం కష్టమే అని అమ్మకి మాత్రమే తెలుసు. లేచింది మొదలు, నిద్రపోయేదాకా తోడునీడగా కదలాడే ఆ మనిషి లేకుండా జీవితం గడపటం అంత సులభం కాదని కొన్నాళ్లకే అర్థమైందేమో ఆమెకి... ఈ మధ్య చాలా సార్లు అంది నాతో.. మీ నాన్నతోపాటు నేనూ పోవాల్సిందని. ఎందుకలా అంటావు. నీకు మేమంతా లేమా అని అంటే.. ఎందరున్నా.. మీ నాన్నతో సమానమవుతారా చెప్పు.. అంటూ అమ్మ ఎక్కిళ్ల శబ్దం.....

అంటే...

"బంగారం లేని లక్కముద్దలా, ప్రమిద లేని ఒత్తిలా, తన విస్తళ్లు అయిపోయేందుకు అమ్మ కూడా బుచ్చమ్మలా ఎదురుచూస్తోందా..." అనుకోగానే కళ్లు మసకబారి ఇక అక్షరాలు ముందుకు సాగలేదు.....

"మరి బతుకంటే అదేరా బడుద్ధాయ్......." బుచ్చమ్మ మాటలు మాత్రం చెవుల్లో మార్మోగుతున్నాయి...Monday, 24 December 2012

"ప్రియబాంధవి" శైలూకి... "ఆత్మబంధువు"కి...


నిన్న పుట్టినరోజు జరుపుకున్న "నాన్న" ప్రియపుత్రిక, మా చిన్నారి చెల్లాయి, "వెన్నెల్లో గోదావరి" రచయిత్రి కల్లూరి శైలబాలకి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...అతి తక్కువ కాలంలోనే మా జీవితంలో భాగమైపోయిన ఓ "ఆత్మబంధువు", నేను ప్రేమగా పిలుచుకునే "పరి"కి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు...మీరు ఇద్దరూ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే...

ఇన్నాళ్లూ డిసెంబర్ 23, 24 చాలా సాధారణంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. ప్రియమైన ఈ ఇద్దరు ఆప్తులు పుట్టినరోజులు ఈ తేదీలలోనే రావటం వల్ల ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుల్లా అవి మారిపోయాయి...


నెట్‌కి అందుబాటులో లేని కారణంగా నిన్ననే పోస్ట్ చేయాల్సిన ఈ శుభాకాంక్షలు ఓ రోజు ఆలస్యంగా ఇలా పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఓ రోజు ఆలస్యమైనా సరే బ్లాగ్ మిత్రులందరూ.. మీ అభినందనలను, ఆశీస్సులను ఈ చిన్నారులకు (పెద్దవాళ్లే అయినా నా మనసులో వీళ్లు చిన్నారులే) అందించాలని కోరుకుంటున్నాను... అందిస్తారు కదూ..?!

మా ఇద్దరు చిన్నారులతోపాటు.. నిన్న, ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. Friday, 21 December 2012

ఆత్మీయ కానుక...!!కొన్ని ఉదయాలు ఎంత ప్రత్యేకమో...

నువ్వు మాకు తారసపడింది మొదలు
ఎన్ని ఉదయపు జ్ఞాపకాలో..

అప్పుడే ఈ ప్రపంచానికి పరిచయమైన చిన్నారిలా
మా మనసు లోగిళ్లలోకి అడుగుపెట్టావు
మా ప్రపంచంలో నువ్ ఇష్టంగా ఇమిడిపోతే
ఆప్యాయమై అక్కున చేర్చుకున్నాం
అదో ఆత్మీయ ఉదయపు జ్ఞాపకం...!

అది మొదలూ...
ప్రతి క్షణమూ అద్భుతమే...
ప్రతి రోజూ ఆనందపు హరివిల్లులే
ప్రతి ఉదయమూ శుభోదయమే
ప్రతి ఉదయమూ ఓ తీపి జ్ఞాపకమే...!!

కొన్ని ఉదయాలు నీ అల్లర్ల కలబోతలైతే
మరికొన్ని నీ అలకలకు కులుకులైతే
ఇంకొన్ని నీ ప్రేమలో తడిసిముద్దైతే
చాలా చాలా ఉదయాలు మేమే నువ్వైపోతే..!!

ఉదయరాగపు ఆలాపనలా నీ సంతోషం
వేసవి మండుటెండలా నీ కోపం
సేదదీర్చే చిరుగాలిలా నీ స్నేహం
ఆసరా ఇచ్చే భుజమై నీ ఓదార్పు
నేనున్నానంటూ నిలిచే నీ ఆప్యాయత
ఎన్నో.. ఎన్నెన్నో... ఉదయాలు ఇలాగే..
ఇప్పటికీ.. ఎప్పటికీ..

అందుకే.. కొన్ని ఉదయాలు చాలా ప్రత్యేకం..!!

(ఆనందపు, ఆత్మీయపు శుభోదయాలతో మా జీవితంలో రంగులు నింపిన మా కంటి వెలుగు పుట్టిన రోజు ఇవ్వాళ.. నాన్నా...! నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలనీ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ చిన్ని కానుక)Wednesday, 12 December 2012

వెన్నెల పూదోటలో "సిరి"ఆఫీస్‌కు బయల్దేరిన మా ఆయనకు బాల్కనీలోంచి టాటా చెప్పేసి... హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ లోనికి వచ్చా.. ఒకటే హడావిడి మనిషి.. చేయాల్సిన పనులు కాస్త ఆలస్యం అయినా క్యారియర్‌పై అలిగేసి వెళ్తుంటారు మావారు అప్పడప్పుడూ  ఆరోజు పనులేమీ ఆలస్యం కాలేదు. అన్నీ సక్రమంగానే ఉండటంతో ప్రశాంతంగానే ఆఫీసుకి బయల్దేరారు. ఆ సంతోషంలో కాబోలు హమ్మయ్యా అనిపించింది.. 

బెడ్రూంలో, హాల్లో చిందర వందరగా పడి ఉన్న వస్తువుల్ని సర్దుతుంటే.. ఎక్కడినుంచో ఫోన్ రింగవుతున్న సౌండ్. అది మావారి ఫోన్ రింగ్ టోన్. కానీ ఆయన బయల్దేరేసారు కదా.. పక్కింటోళ్లదేమోనని నేను పట్టించుకోలేదు. కానీ ఫోన్ రింగవుతూనే ఉంది తీరా చూస్తే.. పేపర్ల కిందన మావారి ఫోన్.. అయ్యో.. ఈయన ఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారే.. ఇక నా పని గోవిందా అనుకున్నా.. 

చందమామ పిల్లల పత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న మావారికి చందమామ అభిమానులు, పాఠకులు, రచయితలు.. ఇలా ఎవరెవరో ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఉన్నారంటే మా చెవులు చిల్లులు పడాల్సిందే.. ఒకటే ఫోన్లే ఫోన్లు. ఇవ్వాళేమో ఆ ఫోన్ మర్చిపోయారు. ఫోన్ స్విచ్ఛాప్ చేయాలో, కాల్స్ అటెండ్ చేయాలో అర్థంకాని స్థితి....

ఫోన్ మళ్లీ మళ్లీ రింగవుతుంటే.. అది కూడా ఒకే నంబర్‌నుంచి.. పాపం ఎంత అవసరమో ఏంటో... ఫోన్ అటెండ్ చేసి విషయం చెప్పేస్తే సరిపోతుందని నిర్ణయించుకుని... "హలో.." అనగానే అవతలి నుంచి కూడా "హలో" అంటూ ఓ అమ్మాయి గొంతు.

"రాజు సర్" అనే మాట తననుంచి వచ్చిందో లేదో.. ఆ తరువాత తనకి ఛాన్స్ ఇవ్వకుండా... "అవర్ ఆఫీస్ కెలంబిటార్.. ఫోన్ వీట్‌లియే మరందటు పోయిటార్.. అవరోడ ఆఫీస్ నంబర్ వుంగలుక్కు తెరింజా.. అంద నంబర్‌కు కాల్ పన్నుంగ (ఆయన ఆఫీసుకు బయల్దేరేసారు. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్లిపోయారు... మీకు ఆయన ఆఫీస్ నంబర్ తెలిస్తే, ఆ నంబర్‌కు కాల్ చేయండి)" అంటూ గడగడా తమిళంలో మాట్లాడేసాను.

నా మాటల్ని చాలా ఓపికగా విన్న ఆ అమ్మాయి.. నమస్తే శోభగారు.. బాగున్నారా. రాజుగారి ద్వారా మీగురించి నాకు తెలుసు అంటూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడింది. నాకు షాక్.. అయ్యో.. తను ఏ భాషలో మాట్లాడుతోందో కూడా పట్టించుకోకుండా నా పాటికి నేను వాగేశానే అని నన్ను నేను కోపగించుకుంటూ.. కాసేపట్లో సర్దుకుని.. నవ్వుతూ.. అయ్యో మీరు తెలుగువారా.. నేను అదేమీ పట్టించుకోకుండా మాట్లాడేశాను.. సారీ మా.. అన్నా.

ఫర్వాలేదులెండి.. అంటూ తన గురించి, తను ఎందుకు కాల్ చేసింది చెప్పుకొచ్చింది. అలా నిమిషాలు కాస్త గంటకు దగ్గరపడ్డాయి. నిజంగా అప్పుడే పరిచయం అయిన వారితో అంతసేపు మాట్లాడటం అదే తొలిసారి నాకు. తను నా గురించి మావారి ద్వారా విందేమోగానీ, తనగురించి నాకు ఏమాత్రం తెలీదు. అయినా కూడా ఆ అమ్మాయి పరిచయం లేనిదిలా అనిపించలేదు. తను మాట్లాడుతుంటే బాగా తెలిసిన అమ్మాయి, ఓ పక్కింటమ్మాయి మాట్లాడినట్లు అనిపించిదేగానీ కొత్తగా అనిపించలేదు. ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ అడ్రస్సులు ఇచ్చిపుచ్చుకుని బై చెప్పుకున్నాం ఆ రోజుకి.

ఇలా మొదలైన మా స్నేహం.. మూడు ఫోన్లు, ఆరు మెసేజీలుగా వర్ధిల్లుతోంది ఇప్పటికీ... ఎప్పటికీ కూడానూ.. 

ఆ రోజు మావారు ఫోన్ మార్చిపోయిన సంగతి ఆఫీసుకెళ్లాక గుర్తుకుతెచ్చుకుని ఆఫీస్ ఫోన్ నుంచి కాల్ చేసి తనకి ఇప్పటిదాకా ఎవైనా కాల్స్ వచ్చాయా అని ఎంక్వైరీ చేసి, ఎవరైనా చేస్తే ఆఫీసు నంబరు ఇవ్వమని చెప్పారు. సో.. ఆ రోజంతా తన కాల్స్ అటెండ్ అవటం, నంబర్ ఇవ్వడంతోనే గడిచిపోయింది.

రాత్రి ఆయన ఇంటికి వచ్చాక... పొద్దున కాల్ చేసిన అమ్మాయి గురించి చెప్పాను. అలాగా అంటూ తన పనిలో మునిగిపోయిన ఆయన్ని కదిలించా.. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి వివరాలు చెప్పమని. కాస్త పనుంది తర్వాత చెబుతాలే అని ఆయన అంటే, అదేం కుదరదు ఇప్పుడే చెప్పమని పట్టుబట్టి తన గురించి కనుక్కున్నా...

ఆ అమ్మాయి పేరు శిరీష. అందరూ సిరి అంటుంటారు. తన వృత్తి డాక్టర్, ప్రవృతి రచయిత. రచయిత అనే మాట దగ్గరే ఆగిపోతే తన గురించిన మిగతా టాలెంట్స్ అన్నీ మరుగున పడిపోతాయి అనుకున్నారేమో ఆయన.. అలా చెప్పుకుంటూ పోయారు.

చాలా చిన్న వయసు. ఇంత చిన్న వయసులోనే ఆమె ఎంత టాలెంటెడ్ తెలుసా... కథలు, నవలలు, కవితలు, పాటలు రాస్తుంది, పాడుతుంది.. డ్యాన్సులు చేస్తుంది, మంచి మంచి సందేశాలతో షార్ట్ ఫిల్ములు తీస్తుంది.. ఇంటిపని, వంటపని ఇలా ఒకటేమిటి.. మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. తన గురించి వింటుంటే చాలా ముచ్చటేస్తుంది అన్నారు.

నిజం కదా.. అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను నేను. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి పట్టుంది. తెలుగు అంటే కూడా ప్రాణం తనకి.. నవలలు, కవితలు, కథలు కూడా ఈ భాషల్లో చాలా సులభంగా రాసేస్తుంటుంది. ఇప్పటిదాకా తను ఓ వెయ్యి కవితలు దాకా రాసిందట. అయితే ఏవో కొన్ని తప్పిస్తే ప్రచురణకు పంపినవి చాలా తక్కువట. కొన్ని కవితలు, కథలు పత్రికల్లో వచ్చాయట. చందమామకు కూడా కొన్ని కథలు రాసి పంపింది... చెప్పుకుంటూ పోతున్నారు ఆయన. నిజంగా చాలా గ్రేట్ కదా ఈ అమ్మాయి అని మనసులోనే అనుకుంటూ వింటూ కూర్చున్నా.

అది సరేగానీ.. ఇవ్వాళ తనెందుకు ఫోన్ చేసింది అని అడిగాను మావారిని. ఓస్.. అదా.. తను చిన్న పిల్లల కోసం కొన్ని కథలు రాసింది. ఆ కథలన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా అచ్చు వేయించే పనిలో బిజీగా ఉంది. ఆ పుస్తకానికి ముఖ చిత్రం కోసం శంకర్ (చందమామ కథలకు తన బొమ్మలతో ప్రాణం తెప్పించే తెలుగుజాతి గర్వపడే చిత్రకారుడు) గారిని సంప్రదించింది. అందుకు ఆయన సరేనన్నారు. తన పని ఎంతవరకూ వచ్చిందో కనుక్కునేందుకు తను ఫోన్ చేసిందిలే అన్నారు.

ఇక ఆ రోజునుంచి ఆ అమ్మాయికి తీరిక దొరికినా, నాకు తీరిక దొరికినా ఫోన్లు, మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు... నేను అండి అని మాట్లాడుతుంటే వారించే, మీ కంటే చిన్నదాన్ని కాబట్టి పేరుతో పిలవండని పట్టుబట్టి మరీ పేరుతో పిలిపించేసుకుంది. తనతో ఎప్పుడు మాట్లాడుతున్నా అస్సలు టైం తెలిసేది కాదు.. (ఇప్పుడు కూడా) చిన్న వయసులోనే ఎంత పరిణతో.. ప్రతి విషయంపైనా స్పష్టమైన ఆలోచన, తనదైన ముద్ర ఉంటుంది. ఎవరినైనా సరే తన లోకంలోకి లాక్కెళ్లిపోయేలా ఉంటాయి తన మాటలు, ఆలోచనలు, భావాలు.

తనతో మాట్లాడుతున్నంతసేపు ఎంతలా ఆశ్చర్యపోతుంటానో నేను. అసలు ఒక మనిషి ఇన్ని పనులు చేయటం ఎలా అని ఆశ్చర్యం. అదే అడిగేస్తే.. ఎంత హాయిగా నవ్వేస్తుందో.. తన మాటలాగే, తన నవ్వు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో చెప్పలేను. 

లేచింది మొదలు నిద్రపోయేదాకా ఏమేం చేస్తుంటుందో తెలిసాక నోరెళ్లబెట్టేశాను నిజంగానే ఓరోజు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా నిద్ర లేవగానే ఇంటిముందు కళ్లాపిజల్లి ముగ్గు వేయటం దగ్గర్నించి, ఇంటిపనులు, వంటపనులు, పూజ అన్నీ ముగించుకుని బయటపడి, క్లినిక్‌లో కేసులకు అటెండ్ అయి.. మధ్యలో మళ్లీ ఏవైనా పనులుంటే వాటిని చూసుకుని (డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్స్ వగైరాలు) సాయంత్రం ఇంటికి చేరుకున్నాక మళ్లీ ఇంటిపనులు అన్నీ ముగించి ఏ అర్థరాత్రికిగానో నిద్రపోదట. అందరూ తినేసి పడుకున్నాక తను కూర్చుని చదవటం, రాయటం లాంటి పనులు చేసుకుంటుందట.

ఏంటి నువ్వు... అలా చేస్తే ఎలా.. నిద్ర సరిపోదు కదా.. ఎందుకు అంతసేపు మేల్కోవడం అని ఓరోజు కోప్పడితే.. ఇన్నిపనులు చేయాలంటే టైం సరిపోవటం లేదు ఏం చేయను అని నవ్వేసింది. నాకు ఖాళీగా ఉండటం అంటే చిరాకు. ఏదో ఒక పని చేయకుండా ఏరోజైనా వృధాగా గడిచిపోతే చాలా బాధగా ఉంటుంది నాకు. అందుకే సాధ్యమైనంతవరకు అస్సలు ఖాళీగా ఉండను చెప్పుకుపోతోంది... నిజమేకదా అని... వింటూ ఉండటం నాకూ అలవాటే.

ఇన్నిపనులు చేస్తూ వంట కూడా నువ్వే చేయటం ఎందుకు, ఇంట్లోవాళ్లను చేయమనొచ్చుగా అంటే... వంట చేసాక, ఇంట్లోని అందరూ కూర్చుని హాయిగా తింటుంటే, చూడ్డానికి నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. అందుకే ఆ సంతోషం కోసం... ఓపిక ఉన్నా, లేకపోయినా వంట నేనే చేసేస్తుంటా అంటుంది ఎప్పట్లా నవ్వుతూ...ముఖ్యంగా మీతో చెప్పాల్సిందొకటి ఉంది. తను ఈ మధ్య చూపులేని అంధ విద్యార్థులు కొంతమందికి తనే డ్యాన్స్ కంపోజ్ చేసి, దగ్గరుండి ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయించి చిల్డ్రన్స్ డే సందర్భంగా గవర్నరు గారు పాల్గొన్న ఓ ప్రోగ్రాంలో వారిచే ప్రదర్శన ఇప్పించింది. ఈ పిల్లల డ్యాన్స్ ఆ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచిందని.. ఆ పిల్లల తల్లిదండ్రులు తనని చుట్టుముట్టి ఇప్పటిదాకా తమ పిల్లలకు ఏం ఇంట్రెస్ట్ ఉందో కూడా తెల్సుకోలేకపోయామంటూ కంటతడి పెట్టారని తను చెప్పినప్పుడు నా మనసంతా ఆమే నిండిపోయింది. నిజంగా చూపు సరిగా ఉండి చెబితే నేర్చుకోలేని పిల్లల్ని చాలామందినే చూస్తుంటాం. అలాంటిది ఏ మాత్రం చూపులేని పిల్లలకి డ్యాన్స్ నేర్పించటం అంటే మాటలు కాదు కదా.. అలాంటిది ఆమె సాధించింది. అది కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా (డబ్బు రూపంలో). రోజూ తన సొంత ఖర్చులతోనే గంటన్నర దూరం ప్రయాణించి పిల్లలకోసమే వెళ్లి, వాళ్లను సంతోషపెట్టేందుకే తను అలా చేసింది.

పసిపిల్లలు అంటే ప్రాణం ఇచ్చే ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడంతా చిన్నపిల్లలేనట. సిరి ఏదో మాయ చేసేస్తోంది అందుకే ఎవరిదగ్గరికీ రాని పిల్లలూ కూడా ఒక్క క్షణంలో తనకి దగ్గరైపోతుంటారని తన ఫ్రెండ్స్ అంతా కుళ్లుకుంటుంటారని నవ్వుతూ చెబుతుంటుంది. నాక్కూడా సహజంగా పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పగానే.. ఇక ఇద్దరం పిల్లల గురించిన కబుర్లే, కబుర్లు... నిజం చెప్పాలంటే, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లు ఎవరైనా సరే.. ఇలాంటి కూతురు, ఇలాంటి అక్క, ఇలాంటి స్నేహితురాలు, ఇలాంటి పక్కింటమ్మాయి ఉండాలని ఎవరైనా కోరుకునేంత మంచి మనసున్న మనిషి సిరి.

ఇంకా ఒకరినొకరం చూసుకోలేదుగానీ... సాహిత్యం గురించిన కబుర్లుతోపాటు చదివిన రచనలు, చదవాల్సినవి.. ఇతర పరిచయాలు, స్నేహాలు, చదువుకున్న రోజులు, చిన్ననాటి జ్ఞాపకాలు... ఒకరినుంచి ఒకరు నేర్చుకోవాల్సినవి, తెల్సుకోవాల్సినవి.... ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో కలబోసుకుంటూ స్వచ్ఛమైన స్నేహపు మధురిమలతో సాగుతోంది మా ప్రయాణం...

తన గురించి చెప్పాల్సింది చాలానే ఉంది. ఇంతకుమించి చెబితే నేనేదో గొప్ప కోసం చెప్పుకుంటున్నానని అనుకుంటారు కాబోలు. అయితే ఒక్కటి మాత్రం నిజ్జం. ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్ మాత్రమే చెబుతున్నా... ఇందులో అతిశయోక్తికి ఏ మాత్రం చోటు లేదు. తనతో స్నేహం చేస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.

ఇంతకీ.. సిరి గురించి మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ మధ్యనే తను రాసిన పుస్తకాలు మూడు అచ్చయ్యాయి. వాటిని మన బ్లాగ్లోకంలోని మిత్రులందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా మీ ముందుకు వచ్చాను... వీటిలో ఒకటి శంకర్ గారు ముఖచిత్రం వేసి ఇచ్చిన పుస్తకం "వెన్నెల పూదోట" (పిల్లల కథలు), రెండోది "ఎ గిఫ్ట్ కాల్డ్ లైఫ్" (ఇది పిల్లలకీ, పెద్దలకీ ఎవరికైనా పనికివచ్చేదే), మూడోది "ది లాస్ట్ మీల్ ఎట్ సాగరిక" (నవల).. చివరి రెండూ పేర్లు ఇంగ్లీషులో ఉన్నా.. తెలుగు పుస్తకాలే..                        

ఈ పుస్తకాలు మూడూ.. విశాలాంధ్ర బుక్‌ హౌస్, ప్రజాశక్తి బుక్‌ హౌస్, నవోదయ బుక్ హౌస్, శశిరామ్ పబ్లికేషన్స్‌ లలో దొరుకుతున్నాయి. ఆసక్తి కలిగిన బ్లాగు మిత్రులు ఈ వర్ధమాన రచయిత్రి రచనలను చదివి ప్రోత్సహించి మీ అభినందనలను, ఆశీస్సులను అందించాలని కోరుకుంటూ.. మీ కారుణ్య.


Friday, 7 December 2012

నువ్వెప్పుడూ ఇంతే...!!!నువ్వెప్పుడూ ఇంతే..

అమ్మ గుర్తొచ్చింది అనేంతలోనే..
అమ్మవై లాలిస్తుంటావు
నాన్న.. మాట పెదాల్ని తాకకముందే
నాన్నవై నడిపిస్తుంటావు

దిగులుకొండ నేనెక్కి కూర్చుంటే
ఆసరా నిచ్చెనై గుండెల్లో పొదువుకుంటావు
సంబరం అంబరమై నే తుళ్లిపడుతుంటే
ఇంద్రధనుస్సువై పులకరిస్తుంటావు
బుంగమూతితో వయ్యారాలు పోతుంటే
వెచ్చని ముద్దువై నుదుటిపై నర్తిస్తావు

నా కబుర్ల సెలయేటి ప్రవాహానికి
నిశ్శబ్ద సంగీతమై తోడు వస్తుంటావు
అనురాగం ఆనందమై అల్లరి చేస్తుంటే
చక్కిలిగింతల చెలికాడివై మురిసిపోతావు
అపార్థమనే ఆవగింజ మొలకెత్తేలోగానే
నమ్మకం అనే మర్రివిత్తును నాటేస్తుంటావు
ఇద్దరం ముగ్గురమై ముద్దుల మూటలైతే
చంటిపిల్లాడల్లే బోసినవ్వువై విరబూస్తావు

నువ్వెప్పుడూ ఇంతే...

అంతులేని ప్రేమని నీకిచ్చేయాలని
అనుకునేంతలోనే...
అంతకు రెట్టింపు ప్రేమని
ముద్దుగా మూటగట్టి
బహుమతిగా ఇచ్చేస్తుంటావు
అందుకేనేమో..
ఇప్పుడు నా జీవితం అంతా
రంగులమయం... హరివిల్లుల లోకం...
ఈ రంగులన్నీ చిత్రించేది మాత్రం నీ రూపాన్నే....!!


("మనసులోని మౌనరాగం" బ్లాగర్ "ప్రియ"గారు రాసిన ఓ పోస్టుకి స్పందనే ఈ కవిత)Wednesday, 5 December 2012

ఎవరా లాలస..? ఏంటా కథ..?!!"అది కాదే అమ్ములూ.. నా బంగారు కదూ... నే చెప్పేది కాస్త వినవే.."

"వూహూ నే వినను గాక వినను.. అయినా అన్నీ తెలిసి కూడా నిన్ను కట్టేసుకున్నాను చూడూ... నన్ను అనాలి"

"అన్నీ తెలుసా.. ఏం తెలుసు నీకు.. నువ్వు అంటున్నది నిజం కాదు.. ఒట్టి భ్రమ మాత్రమే.. నన్ను నమ్మవే అమ్ములూ..."

"ఎలా నమ్మాలి నిన్ను.. ఇలా నిద్రలో కూడా కలవరిస్తూ ఆ పేరును జపం చేస్తుంటే..."

"హవ్వా... నిద్రలోనా... నేనా... కలవరించానా... అందుకని నువ్వు దాన్ని గుర్తు పెట్టుకుని.. నాతో ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నావా.. ఇదేమైనా న్యాయమా తల్లీ..."

"ఎందుకు న్యాయం కాదు.. తమరు మాత్రం కలల్లో కూడా మర్చిపోలేని ఆ పేరుతో జపం చేస్తుంటే.. నేను చూసీ చూడనట్లూ, వినీ విననట్లూ పోవాలా..."

"ఇదెక్కడి గోలే... నేను ఏ పేరును కలవరించాను తల్లీ..."

"అదే తమరి గొప్పతనం.. అది కూడా నా నోటినుంచే వినాలనా... నాకెందుకు అంత భాగ్యం.. మీరే గుర్తు తెచ్చుకోండి"

వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ.. బలవంతపు నిగ్రహంతో "ఏం గుర్తులేదు మొర్రో అంటే వినకుండా.. పదే పదే విసిగిస్తావేంటి అమ్ములూ" అంటే..

"అన్నిసార్లు కలవరించి ఇప్పుడు గుర్తు లేదు అంటే మేం నమ్మాలా..."

ఓసి నీ యంకమ్మా... "ఏం కలవరించానో చెప్పమంటే చెప్పకుండా ఈ సాధింపు ఏంటే... ఇదే చివరాఖరు.. ఇక చెప్పకపోయావా.. ఇంకెప్పుడూ అడగను... నువ్వేమైనా మాట్లాడుకో నే బదులివ్వా" బెదిరిస్తే అయినా దార్లోకి వస్తుందని ప్రయత్నం..

అయినా వింటేగా...

"ఓసోస్... ఈ బెదిరింపులకు నే భయపడా... ముందు ఎవరా శాల్తీ చెప్పండి.."

ఇక లాభం లేదనుకుని మౌన వ్రతం ట్యాగ్‌ వేసేసుకుని కామ్‌గా ఉండిపోయా

ఊరుకుంటుందా... మౌనం అర్థాంగీకారం అనుకుందో ఏమో...

నా నుంచి నిజం రాబట్టేందుకు అలిగింది, అరిచింది, కోప్పడింది, బెదిరించింది, ఏడ్చింది, వెటకరించింది నా అమ్ములు.. ఏం చేసినా నే చెబితేగా...

అయినా ఏమైనా ఉంటేగా చెప్పేందుకు... నిజ్జంగా ఒట్టు అండి ఏమీ లేదు.. అసలు నేను నిద్రలో ఏం కలవరించానో కూడా గుర్తు లేదు నాకు..

ఏముందీ.. ఇక ఆ రోజు నుంచీ నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది.

లేచింది మొదలు, నిద్రపోయేదాకా రంగు రంగుల సీతాకోకలు ఇంట్లో తిరుగాడినట్లుగా ఎన్ని కబుర్లూ, ఎంత సందడి, ఎన్ని ముద్దులు, మరెన్నో మురిపాలు, అలకలు, అల్లర్లు........ ఇలా ఉండేది నా అమ్ములుకు నామీద సందేహం రానంతదాకా...

నామీద అనుమానం ఎప్పుడైతే వచ్చిందో అప్పట్నించీ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ లాగా అయిపోయింది నా పరిస్థితి.

అప్పట్లో నిద్రలేచేటప్పుడు ఓ వెచ్చని బిగికౌగిలి ముద్దుతో రోజుకి స్వాగతం .. ఇప్పుడు నామీద కోపంతో భగభగ మండిపోయే నా అమ్ములూ సూర్యోదయానికి ముందే ఎర్రటి ఎండను తన ముఖంలోకి తీసుకొచ్చి మరీ రోజును స్వాగతిస్తోంది

నిజంగా ఆడోళ్లు కోపంలో కూడా చాలా అందంగా ఉంటారు. అందుకు నా అమ్ములూనే సాక్ష్యం. ఎంత ముద్దొస్తోందనీ. తను నన్ను కోపంగా నిద్ర లేపినా ఎర్రబడ్డ ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తనివితీరా ముద్దాడాలని ఎంత ఆశగా ఉందో... అయినా రాక్షసి.. తాకనిస్తేగా...

ప్రాణం ఉస్సూరుమనగా.. బేలగా నిద్ర లేవడం ఈ కొద్ది రోజుల్లో అలవాటైంది. కానీ ఇదెంత నరకంగా ఉందో చెప్పలేను.

ఈ పిల్లకి నామీద కోపం రాకముందు.. సారీ సారీ అనుమానం రాకముందు... కాఫీ తాగుతూ, పేపర్ ముందేసుకుని.. వార్తల్ని ఆమె విన్నా, వినకపోయినా.. దేశ రాజకీయాల దగ్గర్నించీ, ప్రాంతీయ ప్రారబ్దాల దాకా... ఒకటేమిటి అన్నీ చెప్పుకుపోతుండే నా నసని ఎంత ప్రేమగా భరించేదో... ఆహా, అలాగా, ఇలాగా అంటూ ఏ మాత్రం విసుక్కోకుండా హాయిగా నవ్వేసేది నా అమ్ములు..

ఇప్పుడు కాఫీ ఎంత చేదుగా ఉందో.. అమ్ములు పక్కన లేకుండా పేపర్ చదవాలా... తను వినకుండా నేనేం చదవను.. నాకేం ఒద్దు పో... పేపర్ పైనా, కాఫీ పైనా అలిగేసా.. ఓరకంట గమనిస్తూ ఏమీ ఎరగనట్టు వెళ్తోంది నా రాక్షసి.. నా అలక చూసైనా కరుగుతుందనుకుంటే ఊహూ.. ఒట్టి రాతిగుండె. కరిగితేగా...

ఇలా ఒకటేమిటి అన్ని పనుల్లోనూ సహాయ నిరాకరణ చేసేస్తోంది నా శ్రీమతి ఉరఫ్ అమ్ములు (నేను ముద్దుగా ఇలానే పిల్చుకుంటా). ఏం చేయను నిస్సహాయుడిని. తనకి అర్థం చేయించే, నమ్మించే తెలివితేటలు లేనివాడను. ఏమీ లేని దానికి ఏదైనా ఉంది అని ఒప్పుకుని దోషిగా నిలబడటం ఏంటో నాకు అర్థం కావటం లేదు.

అమ్ములూ.. అమ్ములూ.. నన్ను ఇలా అనాధను చేయకే.. నేనేం తప్పు చేయలేదే.. నా మాట వినవే.. నా బంగారు కదూ... అని ఎన్నిసార్లు బ్రతిమలాడినా.. తను మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది. నేను దాస్తున్నదేంటో చెప్పాల్సిందేనని. ఒట్టు ఏమీ లేదంటే నమ్మేదెవరు.

రోజులు ఇలా దొర్లుతున్నాయి..

ఓ రోజున ఉరుములు, మెరుపుల్లేని వర్షంలా ఊడిపడ్డారు మా అమ్మానాన్న.. అసలే పల్లెటూరి మాలోకాలు. మేం ఉన్న పరిస్థితి చూస్తే, ఎక్కడ నొచ్చుకుంటారో, కథను ఎక్కడ పెద్దగా చేస్తారో అని ఒకటే ఖంగారు నాకు.

అయినా వాళ్లకు అదేమీ తెలీకుండా జాగ్రత్తపడ్డాను. ఎప్పట్లా అమ్ములుతో ప్రేమగా ఉండేందుకు ట్రై చేశా. తను కూడా ఏమనుకుందో ఏంటో అమ్మావాళ్ల ముందు బాగానే ఉండసాగింది. ఆరోజు రాత్రి పడకగదిలో.. అమ్మావాళ్లకి విషయం తెలీకుండా మానేజ్ చేసినందుకు అమ్ములుకి థ్యాంక్స్ చెప్పాను.

"తమరి థ్యాంక్స్ మాకేం అక్కర్లే.. వాళ్లు నాకు అత్తామామలు.. అమ్మా నాన్నలతో సమానం. వాళ్లు బాధపడితే నాక్కూడా బాధగానే ఉంటుంది. అందుకే ఇలా..." అంది


అమ్ములుకు నా తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ.. తన మాటల్లో వ్యక్తమైన తీరు చూసి చాలా ముచ్చటేసింది. మనసులోనే తనకి థ్యాంక్స్ చెప్పుకున్నా.. ముద్దులాడేసా.. (థ్యాంక్సే ఒప్పుకోనిది.. ముద్దు ఒప్పుకుంటుందా).

కొన్నాళ్లుండి అమ్మావాళ్లు మళ్లీ ఊరెళ్లిపోయారు. వాళ్లకి ఏమీ తెలియకుండానే తిరుగు ప్రయాణం అయినందుకు హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నా...

ఏ ముద్దూ ముచ్చటా లేకుండా రోజులు అలా నిర్లిప్తంగా దొర్లుతున్నాయి.

దేవిగారూ.. కోపాన్ని, బెట్టును వదిలేట్టు లేరు.. ఏం చేయాలో తెలీని స్థితిలో నేను...

ఇక ఇలా కాదు అనుకుందో ఏమో.. ఓ రోజు ఆఫీసు నుంచి రాగానే.. నన్ను లాగి సోఫాలో కూర్చోబెట్టి.. "ఇదుగో ఆ పేరు ఏంటో నేను చెబుతా.. అది ఎవరో, నువ్వు నిద్రలో ఎందుకు కలవరించావో చెబుతావా?" కొద్దిగా రాజీ ధోరణితో అడిగింది అమ్ములు.

అయ్యగారికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. అసలే ఏం కలవరించానో గుర్తు లేని నాకు, ఆ పేరేంటో చెబితే అయినా గుర్తొస్తుందేమోనని నేనూ ఎదురుచూస్తున్నా.. ఇన్నాళ్లకి కావాల్సింది కాళ్లకి అడ్డంపడ్డట్టుగా చెబుతానంది. రాజీకి మార్గం కుదురుతోందన్న ఉత్సాహంలో..

"తప్పకుండా చెబుతా అమ్ములూ... చెప్పు చెప్పు..." తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా గిల్లాను..

"ఇదుగో ఇలా చేస్తే నే ఊరుకోను.. దూరంగా కూర్చో.. ఇప్పుడు చెప్పు... ఎవరు తను..?"

"అమ్మా తల్లీ.. నీకో దండం.. ఆ తను ఎవరో చెబుతాగానీ.. ముందు ఆ పేరు చెప్పు.."

"లాలస..."

"లాలసా..." ముఖంలో క్షణకాలం రంగులు మారిపోయాయి నాలో...

నాలో రంగులు మారటం చూసి నా భార్యామణి కన్ఫర్మ్ చేసేసుకుంటున్న దశలో... ఒక్కసారిగా పగలబడి నవ్వా.. నిజంగా అంత నవ్వు వచ్చింది నాకు.. ఇందుకోసమా ఈ పిచ్చిది నన్ను ఇన్నాళ్లుగా ఏడిపిస్తోంది అనుకుంటే నాకు కడుపు పగిలిపోయేంతగా నవ్వు..

సోఫాలో దొర్లి దొర్లి నవ్వుతున్నా... అమ్ములుకి ఓ వైపు కోపం, మరోవైపు అయోమయం...

నవ్వి, నవ్వి ఓపిక లేక తననే చూస్తూ ఉంటే.. ఉడుక్కుంటూ... ఇక చాలు ఇప్పుడైనా చెబుతావా లేదా... కోపంగా అడిగింది

"దేవీగారూ.. శాంతి... శాంతి.... ఓహ్.. శాంతి ఎవరు అని మళ్లీ అడగకే తల్లీ.. నీకు దండం పెడతానే.. శాంతి అంటే శాంతంగా విను అని అర్థం సరేనా.."

లాలస ఎవరంటే... లాలస.... లాలస... ఏదో ఆలోచిస్తున్నట్లు పెద్దగా ఫోజు పెట్టా.. (అక్కడేమీ లేదు)

"ఊరికే విసిగించకు.. చెప్పు ప్లీజ్..." కోపం, వేడుకోలు రెండూ కలగలిపిన మాటలా తను.. చూస్తే చాలా జాలేసింది.. పోన్లే ఇక ఏడిపించింది చాలనుకుని...

లాలస.. నేను కాలేజీ చదివే రోజుల్లో మా పక్కింట్లో ఉండేది.

తన సందేహం నిజమేనేమో అనుకుంటూ అమ్ములు నోట్లోంచి "కాలేజీ రోజుల్లోనా....?" అనే మాట

అవును కాలేజీ రోజుల్లోనే.. రోజూ నన్ను చూసి నవ్వేది.. నేను కూడా నవ్వేవాడిని.. వాళ్ల నాన్నమ్మ లేని టైం చూసి దగ్గరికి వెళ్లి ముద్దులాడేవాడిని కూడా.. వాళ్ల నాన్నమ్మ అంటే నాకు పడదు అందుకనే ఆవిడ లేని టైంలో వెళ్లేవాడిని.

ఛీ... ముద్దులాడేవాడివా.. ఎంత సిగ్గులేకుండా నాకే చెబుతున్నావు చూడు... ముఖం కందగడ్డలా మారిపోయింది అమ్ములుకి.

"సిగ్గు ఎందుకు అమ్ములూ.. తను ఎంత ముద్దుగా ఉండేదో.. ముట్టుకుంటే కందిపోయేంత తెలుపు. తను నవ్వితే ఎంత బాగుండేదో తెలుసా.." ఇంకాస్త ఉడికించాను.

"అవున్లే అన్నీ తెగించారు కాబట్టే.. ఇలా నాతోనే ప్రేమ కబుర్లు అన్నీ కట్టగట్టుకుని చెబుతున్నారు.. అంతేలే.. ఇవన్నీ తెలీని మా అమ్మానాన్నలు నీకు ఇచ్చి నా గొంతు కోశారు"

"అవునా.. అదేం లేదు అమ్ములూ.. నేను బంగారం.. ఏ తప్పూ చేయలేదు.. కేవలం లాలసను చూసి నవ్వేవాడిని, ముద్దులాడేవాడిని.. ఓసారి ఎత్తుకున్నాననుకో.. అంతేగానీ నేనేం చేయలేదు.. ఒట్టు..." వస్తున్న నవ్వును ఆపుకుంటూ బదులిచ్చా.

"తప్పు చేయలేదా.. నవ్వడం, ముద్దులాడటం, ఎత్తుకోవడం" ఇవన్నీ ఏంటి...? దుఃఖం తన్నుకొస్తుంటే.. గొంతు జీరబోయింది తనకి.. (తన పరిస్థితి చూస్తే ఇక నిజం దాచకూడదని అనిపించింది. సరే చెప్పేద్దా అనుకునేంతలో..)

మళ్లీ తనే... "అలాంటప్పుడు తననే పెళ్లి చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకుని నా జీవితం ఇలా చేశారు.." ఇంకో మాట మాట్లాడితే భోరున ఏడ్చేలా ఉంది తన పరిస్థితి. అలాగని నేను ఏమీ మాట్లాడక పోయినా ఊరుకునేలా లేదు.

"నేను కూడా అదే అనుకున్నా అమ్ములూ.. ఆఖరుకు వాళ్ల నాన్నమ్మ నాకు నచ్చకపోయినా వెళ్లి అడిగాను లాలసను నాకు ఇచ్చి పెళ్లి చేయమని.. వాళ్లెవరూ వినలేదు.. పైగా నన్నే తిట్టారు. తెలుసా..?" కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెప్పా

"అన్నారా.. అనుకున్నా... తమరు ఆ పని కూడా చేసి ఉంటారని.. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. తననే పెళ్లి చేసుకోండి. నే వెళ్తున్నా..." అంటూ ఏడుస్తూ.. సూట్ కేస్ సర్దేందుకు బయల్దేరింది నా కోమలి.

అయ్యో.. తను వెళ్లిందంటే నీ పని అంతేరా రామ్.. నా అంతరాత్మ నన్ను హెచ్చరించగా... ఇక తనని ఏడిపించింది చాలనుకుని.. నేనూ బెడ్‌రూంలోకి దూరా..

ముక్కు చీదుకుంటూ బట్టలు సర్దుకుంటోంది నా భార్యామణి.

ప్రేమగా దగ్గరికి తీసుకోబోయా. విసిరి కొట్టింది. మళ్లీ వెళ్లా.. మళ్లీ అలానే చేసింది.. చివరికి ఇలా కాదని బలవంతంగా గట్టిగా హత్తుకున్నా... ఏమనుకుందో ఏమో కామ్‌గా ఉండిపోయింది.

"ఓసి పిచ్చి అమ్ములూ... లాలసను పెళ్లి చేసుకోవాలంటే... ఇంకో 15 ఏళ్లకు పైగానే ఆగాలే.." అన్నా"15 ఏళ్లా..."

"అవును. తనకి ఇప్పుడు ఓ ఆరేళ్లుంటాయేమో. పక్కింట్లో ఉండే రామాయమ్మగారి మనవరాలు లాలస. చాలా ముద్దుగా ఉండేది. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ రామాయమ్మ మనవరాల్ని తాకనిచ్చేది కాదు. చివరికి ఓసారి లాలసను పెళ్లి చేసేసుకుంటా ఇచ్చేయండి అని కూడా అడిగాను. ఓరి భడవా.. ఏంటా మాటలు అంటూ చీవాట్లు పెట్టింది తెలుసా..?!" అంటూ అమ్ములుకి కంప్లైంట్ చేశా.

"వింటోంది.. కలో.. నిజమో.. తెలీని స్థితిలో అమ్ములు.."

"నిజం అమ్ములూ... నీకో విషయం తెలుసా... మనకి కూడా అలాంటి పాప పుడితే ఎంత బాగుంటుందో.. ఈ విషయం నేను చాలాసార్లు మనసులో అనుకున్నా. అదే అలా కలవరింతలో బయటికి వచ్చిందేమో..?!"

"విషయం అర్థమవగానే.. అమ్ములును చూడాలి.. ఆ కళ్లల్లో సంతోషం.. నేను ఎప్పటికీ తన వాడినే అన్న ఆనందం.. అయ్యో మాటల్లో చెప్పలేను. తన ముఖంలో అప్పుడు కనిపించిన భావాలను ఫ్రేమ్ చేయటం అస్సలు సాధ్యం కాదు.. అన్ని రకాల భావాలు ఒక్కసారిగా తనలో...."

అంతే అల్లుకుపోయింది తను.. తరువాత తను చేసింది.. నేను లాలస గురించి చెప్పింది తల్చుకుని పడి పడీ నవ్వింది.. ఇందాక బాధతో కన్నీళ్లు కార్చిన నా అమ్ములు కళ్లు.. ఇప్పుడు నవ్వి నవ్వి ఆనందబాష్పాలతో నిండిపోయాయి...

అలా నవ్వి నవ్వి అలసిపోయి.. చెప్పలేనంత నమ్మకంతో నాగుండెలపై వాలిపోయి, కలతల్లేని నిద్రలోకి హాయిగా జారుకుంది.

తన అనుమానం అనుమానమేగానీ, నిజం కాదనీ అర్థం చేయించటంతో నాక్కూడా ఎక్కడలేని ప్రశాంతత ఆవహించినట్లు అనిపించింది.

నా గుండెలపై హాయిగా బజ్జున్న అమ్ములు తలను నిమురుతూ... ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు...!!!

(అనుమానం అంటూ రాకూడదు.. ఒకవేళ వచ్చినా దాన్ని మొగ్గలోనే తుంచేయాలి. అలా చేసినప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. _ ఈ కథనం కూడా సరదాగా రాసిందే, ఎవరినీ ఉద్దేశించి కాదని మనవి.. )

Friday, 23 November 2012

అలకమానవే కులుకుల చిలకా...!!రోజూ ఆరింటికి కాకపోయినా ఏడింటికైనా నిద్రలేచేసే బుద్ధిమంతురాలినైన నేను....

ఆ రోజు తెల్లారి... టైం ఎనిమిది అవుతోందన్న స్పృహ కూడా లేకుండా... గాఢనిద్రలో... కలల సలపరంతో విలవిలలాడుతుంటే... తలుపులు దబదబా బాదుతున్న చప్పుడు....

ఉలిక్కిపడి లేచి కూర్చొని టైం చూసి బావురుమంటూ లేచి తలుపుతీస్తే.. ఎదురుగా ముఖంనిండా నవ్వులు పులుముకుని... పక్కింటావిడ.

ఏంటండీ.. ఏమయ్యింది.. ఇంత టైం అయినా లేవలేదు. గుమ్మం బయటే పాలు, పేపర్.... కాకులు పాల కవర్‌ని ముక్కుతో పొడుస్తుంటే మిమ్మల్ని లేపాల్సి వచ్చిందని..... అడక్కుండానే గడగడా వివరణ ఇచ్చేసింది.

చాలా చాలా థ్యాంక్స్ అండీ.. మీరు లేపకపోతే కవర్ చిరిగిపోయి పాలన్నీ నేలపాలు అయ్యుండేవి. రాత్రి సరిగా నిద్రపోలేదు.. తెల్లారుజామున ఎందుకో బాగా నిద్రపట్టేసింది... అందుకే లేవలేకపోయానండీ.. పాలు కాకులపాలు కాకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా నా వివరణ ఇచ్చేశాను.

అలాగా.. ఇప్పటికే లేటయ్యింది పనులు చూసుకోండి అయితే.. నేనూ బాబును స్కూలుకి తయారు చేయాలి అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.

పాలు, పేపర్ తెచ్చి టేబుల్‌పై పెట్టి... సోఫాలో కూలబడుతూ.. నిద్ర లేవలేకపోయినందుకు కాసేపు నన్ను నేను తిట్టుకునే ప్రోగ్రాం పెట్టేసుకున్నా.....

పిచ్చిమొద్దూ అంత నిద్ర ఏంటే.... అయినా హాయిగా నిద్రపోయావా అంటే అదీ లేదు..... ఏవేవో పిచ్చి కలలు...

పిచ్చి కలలు.. గుర్తుకురాగానే..... అన్నట్టు హాయిగా మంచి కలల్లో జోగాడుతూ నిద్రపోయే పరిస్థితి కాస్తా పిచ్చి కలల్లోకి మారిపోడానికి కారణం ఏంటి చెప్మా.... ఆలోచనలో పడ్డాను.

ఇంకెవరు... ఉన్నారుగా మహానుభావులు.... అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్తే....

దిండును గట్టిగా కౌగలించేకుని నిద్రలో కలవరిస్తూ, పలవరిస్తూ వయ్యారాలు పోతున్న అతగాడ్ని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. చూడు ఎంత అమాయకంగా, ఏమీ ఎరగనట్టు ఎలా నిద్రపోతున్నాడో...

ఉన్నఫళంగా ఓ బకెటెడు నీళ్లు తెచ్చి మీద కుమ్మరించేయాలన్న ఆత్రం వచ్చేసింది. ఆవేశంతో అలా ఊగిపోతుంటే... నిద్రలో నన్నే కలవరిస్తున్న తనని చూడగానే చప్పున చల్లారిపోయి కూలబడ్డా. పాపం కదా అనిపించింది.

మళ్లీ అంతలోనే ఓ సందేహం. మెలకువగానే ఉండి తను నన్ను కూల్ చేయాలని వేసిన ఎత్తుగడ కాదుకదా అది అనిపించింది. మెల్లిగా దగ్గరికి వెళ్లి చూశా. లేదు నిజంగా నిద్రపోతున్నాడు. అరెరే నిజంగా కలవరిస్తున్నాడు. అయ్యో.. సందేహపడ్డాను కదా....

పోన్లే బంగారూ.. నువ్వు అలాగే కలవరిస్తుండమ్మా.... నే మళ్లీ వస్తాలే... (మనసులో ప్రేమ పొంగుతుంటే...) కోపంగా ఉన్నాను కాబట్టి నా ప్రేమని అప్పుడు తనపై వ్యక్తం చేయలేక భారంగా అక్కడ్నించి కదిలా.

ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు ముగించుకుని వంటగదిలోకెళ్లి, పాలు స్ట‌వ్‌పై పెట్టి.. టిఫిన్‌కి ఏం చేయాలి, లంచ్ ఎలా... అనుకుంటుంటే.. ఆ రోజు సెలవు కాదన్న విషయం అప్పటికిగానీ బోధపడలేదు.

అయ్యో... ఈ రోజు ఆఫీసు ఉంది కదా.. ఆదివారం అన్న మాయలో ఉన్నానేమో... అయినా వారాలు కూడా గుర్తెట్టుకోలేకపోతే ఎలానే తల్లీ... నా పరిస్థితికి నాకే చాలా కోపం వచ్చేసింది. అంతలోనే తనకి కూడా ఆఫీస్ ఉందన్న విషయం గుర్తొచ్చింది. 

రోజూ అయితే నే ముందు లేచేసి, పాలు, టిఫిన్, స్నానం లాంటి పనులు చూసుకుని తనని లేపితే... 

తనేమో తీరిగ్గా లేచి బెడ్ కాఫీ తాగి, పేపర్ చదివి, సిస్టమ్ ఆన్ చేసి మెయిల్స్ గట్రా చెక్ చేసుకుని ఆ తరువాత ఆరామ్‌గా బాత్రూంలోకి దూరిపోయి.. ఆపై టైం చూసుకుని ఉరుకులు పరుగులతో రెడీ అయి నన్ను తొందరచేసి ఎలాగోలా మా ఆఫీసులో నన్ను దించేసి, తను వెళ్లేవారు.

ఇవ్వాళ మేడంగారు.. అంటే నేనే... అలకలో ఉన్నాను కదా... అందుకే తనని లేపలేదు. లేకపోతే నన్ను అంతగా బాధపెడితే నేను అలకమానేసి ప్రేమగా వెళ్లి నిద్ర లేపుతానా..? అస్సలు కుదరదు. నేను లేపేది లేదు అంతే... ఇవేమీ తెలీని తను హాయిగా నిద్రోతున్నాడు. ఎప్పట్లా నేను వెళ్లి నిద్ర లేపుతాననే భ్రమలో ఉన్నాడేమో... నే వెళ్ల.. లేస్తే లేవనీ.. లేకపోతే లేదు..

కోపంగా ఉన్నా కదా.. అందుకే మా ఆఫీసుకి మాత్రమే ఫోన్ చేసి లేటుగా వస్తానని ఫర్మిషన్ తీసుకున్నా. మామూలు స్థితిలో అయితే తను లేవలేని సమయంలో నేనే వాళ్లాఫీసుకు ఫోన్ చేసి ఫర్మిషన్ చెప్పేసేదాన్ని. కానీ ఇవ్వాళ అలా చేయలేదు.

పనులన్నీ చక్కబెట్టేసి ఇద్దరికీ క్యారియర్లు సర్దేసి, కసికొద్దీ కాఫీ, టిఫిన్ లాగించేసి.... తీరిగ్గా పేపర్ ముందేసుకుని కూర్చున్నా.... కాసేపయ్యాక

టైం అవుతున్నా ఇంకా లేవడేం అనుకుంటూ బెడ్రూంలోకెళ్తే.. మళ్లీ సేమ్ కండీషన్‌లో తను.. ఈసారి మరీ చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు (అన్నీ చెప్పుకోలేం కదా- పరువు పోతుంది..). చిర్రెత్తుకొచ్చింది. ఇలా కాదు. ఉండు నీ పని చెబుతా అని బయటికి వచ్చి.. ఫోన్ రింగ్ చేస్తూ కూర్చున్నా. అటువైపు ఉలుకూ, పలుకూ లేదు. ఇహ ఇలా కాదు అనుకుని ల్యాండ్‌లైన్‌కి రింగ్ ఇచ్చా. అంతే ఒక్క కాల్‌కే గురుడు మేలుకున్నాడు.

ఏమీ ఎరగనట్లు ఎప్పట్లా... నా పేరును చాలా ప్రేమగా, తియ్యగా, గోముగా పిలుస్తున్నాడు (మామూలుగా అయితే మురిసిపోతూ తన ఒడిలో వాలిపోయుండేదాన్నేమో..) ఇప్పుడు అలక, కోపం కదా... లోపల్నించి పొంగుకొస్తున్న ప్రేమకు అన్యాయంగా అడ్డుకట్ట వేస్తూ.. భింకంగా, ఏమీ వినపడనట్లుగా పేపర్లో తలపెట్టి కూర్చున్నా...పిలిచి, పిలిచి.. నేను రాకపోయేసరికి కళ్లు నులుముకుంటూ మెల్లిగా హాల్లోకి వచ్చాడు. సోఫాలో నా పక్కన కూలబడుతూ.. ఏంట్రా బంగారూ.. పిలుస్తుంటే పలకవేం అంటూ దగ్గరికి జరగబోయాడు. (పాపం ఎంత ప్రేమగా దగ్గరికి వస్తున్నాడో చూడు... అలక తీసి గట్టుమీద పెట్టెయ్యవే అని మనసు రొద పెడుతున్నా.. దానికి బుద్ధి చెబుతూ..) ఏదో షాక్ కొట్టినట్లుగా లేచి నిలబడి...

ఇదుగో ఈ బంగారూ, గింగారూ ఏమీ వద్దు... నే అలిగానంతే... నువ్వేం దగ్గరికి రానక్కర్లే... వెళ్లి ప్లాస్క్‌లో కాఫీ ఉంది తాగేసి, హాట్‌బాక్స్‌లో టిఫిన్ ఉంది తినేసి, ఇదుగో నీ క్యారియర్ పట్టుకుని ఆఫీసుకెళ్లు... ఇవ్వాళ నేనే వెళ్తాలే.. అన్నా కోపంగా....

మా బంగారు కదూ, బుజ్జి కదూ... ఎందుకే అంత కోపం... నేను ఏమన్నానని... ఇంతలా సాధిస్తున్నావు అన్నాడు..

ఇదుగో.. నాకు ఇంకాస్త కోపం తెప్పించకు... ఏం అన్నాను అని అంత చిన్నగా అడుగుతావా... (ఇంతకీ ఏమన్నాడు.. అలకలో అసలు విషయం మర్చిపోయా)

ఏమన్నాను బంగారూ.. చెప్పు.. నాకు సరిగా గుర్తు లేదు.. అంటున్నాడు..

మామూలుగా అయితే అలా నిద్ర మత్తులో జోగుతున్న తనని బుజ్జగిస్తూ, ముఖాన్ని ముద్దుల వర్షంలో తడిపేస్తూ.. తన ముఖంలోని పసితనాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇవ్వాళ అలక అనే బెట్టుతో ఉన్నా కదా... తనని అస్సలు పట్టించుకోవట్లేదు.. పాపం ముఖం దీనంగా పెట్టి బ్రతిమలాడుతున్నాడు.

ఇంతలో "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే" అంటూ తన ఫోన్ గట్టిగా పాడుతోంది. బెడ్రూంలో ఉన్న సెల్ కోసం నిద్రమత్తు వదలని నా పతిదేవుడు పరుగున వెళ్లబోయి తూలిపడబోయాడు. అంతే ఒక్కసారిగా నా గుండె జారిపోయింది.

పరుగున వెళ్లి పడిపోకుండా పట్టుకున్నా. తన ముఖం చూడాలి అప్పుడు. ముసిముసి నవ్వులు కలబోసిన ప్రేమతో... విచ్చుకున్న పువ్వులాంటి స్వచ్ఛమైన ఆ ముఖంలో ఓ వెలుగు.. ఆ క్షణంలో నాకు నచ్చిన ఆ బుజ్జి ముఖంలో ఓ గొప్ప నిశ్చింత. నన్ను పడిపోనీయకుండా నువ్వు ఎప్పుడూ నా పక్కన ఉంటావు అనే నిశ్చింతేమో అది.

తనని పడిపోనీయకుండా పట్టుకున్నానన్న అదే నిశ్చింత నాలో కూడా. అంతే ఒక్కసారిగా తనని అల్లుకుపోయా. ముద్దులతో ముంచెత్తేశా.. నా అలక ఇంత త్వరగా తీరుతుందని ఊహించని తను కూడా...  ఓసి నా పిచ్చి బంగారూ... అంటూ నుదుటిపై వెచ్చని ముద్దొకటి ఇయ్యగానే సిగ్గులమొగ్గనైపోయా....

నిజం చెప్పొద్దూ...

అసలు నేను ఎందుకు అలిగానో ఎంత గుర్తు చేసుకుందామన్నా.. ఇప్పటికీ అస్సలు గుర్తుకు రావడం లేదు.....     

(ఓ చిన్న చిలిపి ఊహకు అక్షర రూపమే ఈ పోస్టు..)


Monday, 5 November 2012

నాయన తోడులేని, తోడురాని సుదూర ప్రయాణం....!!!"నాన్న అంటే...
ఒక జ్ఞాపకమా..?
కాదు.. నా జీవితం...!"

"మా నాయన ఉండి ఉంటే నాకు ఇలాగ జరిగేదా...?" కళ్లలోంచి నీళ్లు ఉబుకుతుంటే దాచుకోలేక అనేశాను.

"ఈ మాట నువ్వు అనకుండా ఉండాలని, మీ నాన్న లేని లోటు కనిపించకూడదని.. ఆడ బాధ, మగ బాధ అన్నీ నేనే అయి భరిస్తూ నెట్టుకొస్తున్నా... అయినా అననే అనేశావు కదా...!!" తనకీ కళ్లలో నీళ్లు...

ఆరోజు ఏమైందో ఏమో.. ఒకటే బాధ.. ప్రతిదాంట్లోనూ, ప్రతి విషయంలోనూ... మా నాయినే ఉండి ఉంటే.. ఇలా ఉండేదా, అలా ఉండేదా అనిపిస్తోంది. ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఏదో విషయంలో ఆ లోటు మరీ ఎక్కువగా అనిపించింది (సరిగా గుర్తులేదు) అంతే ఒక్కసారిగా అమ్మపై కేకలు వేసేశాను...

నేనోవైపూ, ఆమె ఓ వైపూ... కళ్లు కన్నీటి సంద్రాలు... బిక్క చచ్చిపోయి పక్కనే తమ్ముళ్లు... కాసేపటికిగానీ తేరుకోలేదు. వెంటనే నేను చేసిన తప్పు అర్థమైంది.. "అమ్మ దగ్గరికి వెళ్లి, పోన్లేమా... ఏదో బాధలో అనేశాను.. నాకు తెలీదా నువ్వెలా చూసుకుంటున్నావో.. బాధపడకు" అంటూ ఓదార్చాను.

"నీకు ఏం తక్కువ చేస్తున్నాను తల్లీ.. ఇంకెప్పుడూ అలా అనకు. ఎంతైనా నాయన ఉన్నప్పటికీ, లేనప్పటికీ తేడా ఉండనే ఉంటుంది. ఆ తేడా తెలీనివ్వొద్దనే అమ్మనైన నేను నాన్నను కూడా అయి సాకుతున్నా. ఆయనకేం మహానుభావుడు త్వరగా వెళ్లిపోయాడు. ఆయనా లేక, నేను లేకపోతే బిడ్డలు ఏమవుతారోనని, తండ్రిలేని పిల్లలుగా పదిమందిలో ఎక్కడ పల్చనవుతారోనని బాధను మనసులో దాచుకుని మీ కోసమే బ్రతుకుతూ, నాకు చేతనైనంత చేస్తున్నాను. అయినా నువ్వే అలా అంటే.. నేనింక ఎవరికి చెప్పుకోను..." బావురుమంది అమ్మ. 

ఆమె బాధలో న్యాయం ఉంది. తను ఎవరికోసం బ్రతుకుతోందో తెలీని స్థితిలో తమ్ముళ్లు, నేనూ లేము. అయినా ఏదో ఆవేశంలో మాట అలా తూలింది. మాట తూలింది అనడం కంటే, నాన్న లేని లేటు, లేడన్న వాస్తవం తట్టుకోలేక "అదే మా నాయనే ఉంటేనా" అనే రూపంలో బయటికి వచ్చేసింది. ఇక్కడ అమ్మదీ తప్పుకాదు, నాదీ తప్పుకాదు..  ఏదయినా తప్పొప్పులు ఉంటే అన్నీ ఆ దేవుడివే... మా నాయనను మాకు లేకుండా చేసిన ఆ దేవుడిదే తప్పు (నిస్సహాయతలో ఇంతకుమించి ఎవరిని నిందించగలం).

చాలాసేపు అమ్మ బాధపడుతూనే ఉంది. ఆమెను ఓదార్చేందుకు తమ్ముళ్లూ, నేనూ ప్రయత్నించాం. మెల్లిగా సర్దుకుంది. కాసేపు మౌనం రాజ్యమేలగా.. ఆ నిశ్శబ్దానికి నేనే బ్రేక్ వేస్తూ.. "నాయన కళ్లద్దాలు కనిపించటం లేదు. ఎక్కడున్నాయి మా.." అడిగాను.

"మారాజు ఇంకా ఎంతకాలం బ్రతుకుదామని ఆశగా ఉన్నాడో ఏమో... ఇక 2 నెలల్లో చనిపోతాడనగా కన్ను ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాక కళ్లు బాగా కనిపిస్తున్నాయని ఎంత సంబరంగా చెప్పాడో... అయినా ఆ దేవుడికి కనికరం లేకుండా పోయింది తీసుకెళ్లిపోయాడు" బాధగా నిట్టూరుస్తూ నాన్న సంచిని తీసుకొచ్చి నా ముందర పెట్టింది.

"ఇదేంది మా సంచి పసుపుపచ్చగా ఉంది" అన్నాను.

"ఓ అదా.. మీ నాయన ప్రతి సంవత్సరం గోవిందమాల వేసేవాడు కదా.. చివరిసారి వేసినప్పటి సంచి అది. అందులో ఉండేవన్నీ ఆయన వస్తువులే.. గుర్తుగా ఉంటాయని అన్నీ అందులోవేసి ఉంచాను" అంది.

ఆ సంచిలో నాన్న కళ్లద్దాలు, వాచీ, పూజ సామగ్రి కొంత, వెంకటేశ్వరుడి చిన్న చిన్న పటాలు.. ఇంకా ఏవేవో అందులో ఉన్నాయి. ఆ సంచిని భద్రంగా దాచుకోవాలని మనసులో అనుకుంటూ పక్కన ఉంచుకున్నాను. నాన్న ఆసుపత్రికి వెళ్లేముందు వాడిన ఖర్చీప్ ఒకటి నా దగ్గర భద్రంగా ఉంచుకున్న సంగతి గుర్తురాగా... నాన్న సంచిలో దాన్ని కూడా ఉంచి జాగ్రత్త చేసుకోవాలనుకున్నా..

అదే సమయంలో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాక ఓరోజు మా నాయనతో ఫోన్లో మాట్లాడిన సంగతి గుర్తుకొచ్చింది.

"ఏం రా కొడకా చాన్నాళ్లకు ఫోన్ చేశావు అన్నాడు. ఏం లేదు నాయినా... ఈ రోజు పేపర్లో చూశాను.. నెల్లూరు దగ్గర ఎవరో కంటి ఆపరేషన్లు చేయించుకుంటే చాలామందికి చూపు పోయిందట. వెంటనే నాకు భయమేసి నువ్వు కూడా ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నావు కదా.. నీకేమైనా ఇబ్బంది అయిందోమోనని భయంతో ఫోన్ చేశాను" అని చెప్పా.

"నాకేం కాలేదులే కొడకా (మా నాయన నన్ను ముద్దుగా కొడకా, తల్లీ, అమ్మా అని పిలిచేవారు) .. ఆపరేషన్ అయినాంక బాగా కనిపిస్తున్నాయి" అని ఎంత సంబరంగా చెప్పాడో.. ఆ రోజు తను మాట్లాడిన మాటలు అచ్చంగా అలాగే నా చెవుల్లో గింగురుమంటున్నాయి.

నేను ఫోన్ చేసి తన కళ్లు గురించి ఆరా తీసిన విషయం "నా బిడ్డకు నేనంటే ఎంత అక్కరో.. అక్కడెవరికో ఏదో అయిందని భయపడి, నాక్కూడా అలాగే అవుతుందేమోనని ఫోన్ చేసేసింది. నాకు బాగుంది అంటేగానీ ఆయమ్మకు మనసు నిమ్మతించలేదు" అని ఆ రోజు సాయంత్రం మాయమ్మతో అన్నాడట. ఇవన్నీ ఆ తరువాత ఎప్పుడో అమ్మ నాకు చెప్పింది.. ఇదుగో ఇప్పుడు మళ్లీ ఇలా గుర్తుకొస్తున్నాయి.

మా నాయనకు సంబంధించిన ఏ విషయాలైనా నాకు గుర్తుకొచ్చినప్పుడు.. ఆయన ఎదురుగా సజీవంగా ఉంటే ఎలా మాట్లాడుతారో అలాగే తన గొంతు వినిపిస్తుంది. తను నవ్వుతున్నట్లు, మాట్లాడుతున్నట్లు, పిల్చినట్లు.... అలాగే కళ్లు మూసుకుంటే చాలు ఎదురుగా నవ్వుతూ కనిపిస్తారు. ఎలాంటి సమయంలోనైనా సరే నాయన్ని తల్చుకుని కళ్లు మాసుకుంటే చాలు వెంటనే కనిపిస్తారు. ఎందుకు తల్లీ పిలిచావు అంటూ ప్రేమగా అడుగుతారు.ఇదే విషయం ఓసారి మా అమ్మతో చెప్పాను. మా నాయన్నిగానీ, మా అమ్మమ్మనుగానీ తల్చుకుంటే చాలు వెంటనే కనిపిస్తారని అన్నాను. దానికి మా అమ్మ నిట్టూరుస్తూ... "మా అమ్మకు, మీ నాయనకి నేను ఎం చెడ్డ చేసానోగానీ ఎంత తల్చుకున్నా కనిపించరు. వాళ్లనే తల్చుకుని కళ్లు గట్టిగా మూసుకుని పడుకున్నా సరే అస్సలు కనిపించరు. ఇన్నేళ్లయింది కదా చచ్చిపోయి, ఓసారైనా కనిపిస్తే ఒట్టు. కళ్లముందూ కనిపించరూ, కలల్లోనూ కనిపించరు. నా ప్రాప్తం అంతే తల్లీ.." అంది బాధగా.

"నువ్వేం బాధపడకమ్మా.. ఈసారి మా నాయన కనిపిస్తే నేను నీకు కనిపించమని చెబుతాలే.. అస్సలు నీకు ఎందుకు కనిపించడో గట్టిగా అడిగేస్తాను.. పెళ్లయిన దగ్గర్నించీ తననే అంటిపెట్టుకుని సగ భాగమై బ్రతికిన, ఇప్పుడు తను లేని భాగాన్ని కూడా మోస్తున్న నీకు కనిపించడా... అస్సలు నీ గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో.. నీకు మేమున్నాం (అమ్మకు మేమున్నాం అనే ధైర్యంతోనే కదా ఆయన అంత నిశ్చింతగా వెళ్లిపోయింది).... ఆయన్ని నిలదీస్తాం.. నువ్వు ధైర్యంగా ఉండు మా" అని వాతావరణాన్ని చల్లబరిచేందుకు కాస్త సరదాగా మాట్లాడాను.

"ఆ జీవుడు వెళ్లిపోయి మూడేళ్లు నిండుతున్నాయి.. ఎక్కడో గాల్లో కలిసిపోయిన పేణం ఎదురుగా వచ్చి మాట్లాడుతుందా.. మీరు గొడవేసుకుంటారా.... అంతా మన పిచ్చి, భ్రమ గానీ..." అమ్మ గొణుక్కుంటూ లేచింది.

అమ్మ అన్న దాంట్లో నిజం లేకపోలేదు. కానీ పిచ్చి అని, భ్రమ అని నేను అనలేను. ఎందుకంటే ఆ పిచ్చి, భ్రమ అనేది అవసరం అనే అనిపిస్తుంది నాకు. లేకుంటే శాశ్వతంగా దూరమైన వారి జ్ఞాపకాల నుంచి అంత త్వరగా బయటపడలేం. వారు లేరన్న నిజం జీవితం పొడవునా బాధిస్తుంటుంది. ఆ బాధను తగ్గించేందుకు కాసింత పిచ్చి, ఇంకాస్త భ్రమ అవసరమే (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం).

నా మటుకు నాకు రోజు లేచింది మొదలు, నిద్రపోయేదాకా ఏ సమయంలో అయినా సరే మా నాయన గుర్తొస్తే చాలు కళ్లు మూసుకుంటాను.. ఆయన కూడా వెంటనే కళ్లముందు నవ్వుతూ కనిపిస్తాడు. నేను ఆయన ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతానో అలాగే తనతో మాట్లాడతాను. తను కూడా చక్కగా వింటాడు. తనకు తోచిన సలహాలు ఇస్తాడు. ఇది నా మానసిక భ్రమ... అయినా సరే.. నాకు అందులోనే చాలా ఆనందం ఉంది. ఇలా నాలో నేను మాట్లాడుకోవడం అవతలివాళ్లు చూస్తే.. పిచ్చిది కాదు కదా అనుకుంటారేమో.. అయినా నాకేం బాధలేదు.. నాన్న లేడని ఏడుస్తూ కూర్చోవటం కంటే ఇది నయం కదా...

నేను మావూరు వెళ్తే మా నాయన నా కోసం ఎంతగా ఎదురుచూస్తుండేవారో.. అంగడి దగ్గర కూర్చుని వచ్చే ప్రతి బస్సునూ చూస్తూ కూర్చేండేవారు. నాకు ఇప్పుడు కూడా ఆయన అలాగే నా కోసం ఎదురు చూస్తున్నట్లు, నాకోసం ప్రతి బస్సునూ చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. అందుకే బస్సు దిగగానే అంగడి దగ్గరకి వెళతాను. అక్కడ మా నాయన నన్ను నవ్వుతూ పలుకరిస్తాడు. ఆ తరువాత నేను సంతృప్తిగా ఇంటికెళతాను. ఇంట్లోకెళ్లగానే దేవుడి గదిలో నాన్న ఫొటో దగ్గరికి వెళ్లి కాసేపు కూర్చుని కబుర్లు చెబుతాను. ఆ సాయంత్రం సమాధి దగ్గరకు వెళ్లి కూర్చొని నాన్నతో మాట్లాడి భారమైన మనసుతో ఇంటికి చేరుకుంటాను. నేను ఊరెళ్లినా ప్రతిసారీ నా కార్యక్రమాలు ఇవే.

నవంబర్ 7.. ఈ తేదీ గుర్తు రాగానే నాకు ఏడుపు ఆగదు. మూడేళ్ల ముందు ఈ తేదీ అంటే చాలా మామూలు విషయం. కానీ ఇప్పుడు మా నాయన్ని మాకు లేకుండా చేసిన ఆ తేదీ అంటేనే వణుకు. ఆ తేదీ గుర్తొస్తేనే మా నాయన, ఆసుపత్రి, చివరిచూపులు, చివరి మాటలు ఆ తరువాతి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మనసుపై యుద్ధం చేస్తూ.. కళ్ల ముందు ఏముందో తెలియనంతగా దిగులు పొగను కమ్మేస్తాయి.

ఎప్పట్లా క్యాలెండర్‌ను మారుస్తుండగా నవంబర్ నెల, అందులోని 7వ తేదీ గుర్తొచ్చాయి మొన్న. అంతే ఏడుపు ఆగలేదు. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. సరిగ్గా ఆ సమయంలో ఓ ఆత్మీయురాలి ఫోన్. ఆ రోజు తన అనుభవాలను చాలా సంతోషంగా ఏకరువు పెడుతోంది. నేను వింటూ అలాగా, అవునా అంటూ ముక్తసరి సమాధానాలు ఇస్తున్నా. మామూలుగా అయితే తను ఎంత సంతోషంగా విషయాలను పంచుకుంటుందో, నేను అంతే సంతోషంగా స్వీకరిస్తూ చాలా ఆక్టివ్‌గా మాట్లాడుతుంటాను. కానీ నా ముక్తసరి సమాధానాలు పసిగట్టిన తను...

ఏమైంది శోభగారూ.. చాలా డల్‌గా మాట్లాడుతున్నారు అంది. ఇక తట్టుకోవడం నా వల్ల కాలేదు. చెప్పేశాను. తను కాసేపు మౌనంగా ఉండి.. నేనొకటి చెబుతాను వింటారా అంది. చెప్పు అన్నా. మీ నాన్నగారంటే మీకు అంత ఇష్టం కదా.. కళ్లు మూసుకున్న ప్రతిసారీ నవ్వుతూ కనిపిస్తున్న ఆయనకు.. నువ్వు ఇలా ఏడుస్తూ కనిపిస్తే ఆయన తట్టుకోగలడా... అంది. నిజమే కదా అన్నా. నా బిడ్డ బాధపడకూడదు అని ఆయన కనిపించిన ప్రతిసారీ నీకు నవ్వుతూ కనిపిస్తున్నారు.. కానీ నువ్వు మాత్రం ఇలా ఏడుస్తూ కనిపిస్తే ఆయనకి బాధ అనిపించదా.. సో.. మీరు ఎప్పుడూ ఏడవకూడదు అంది.

నువ్వు చెప్పేది నిజమేరా.. ఇక ఏడవను అన్నాను. అదీ అలా ఉండాలి అని.. కాసేపు ఇంకేవోవో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. కానీ.. నిజం చెప్పొద్దూ నా మూడ్ అప్పటికింకా సెట్ కాలేదు. ఏడవకపోతే ఎలా... బాధ ఏదైనా ఎవరితోనైనా పంచుకుంటే కాస్త తగ్గుతుంది. అదే ఏడిస్తే.. కన్నీళ్ల రూపంలో ఇంకాస్త తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గే మార్గం మాత్రం ఉండదుగా.... మా నాయన గుర్తొస్తే ఆయన నవ్వుతూ ఎలా పలుకరిస్తారో... ఓ కన్నీటి చుక్క కూడా నాకళ్లని అలాగే పలుకరిస్తుందని నాకు మాత్రమే తెలుసు. నాన్న లేరన్న బాధ అనేది ఒక జీవనది.. అది గుర్తొచ్చినప్పుడల్లా... ఆ నదిని నింపే కన్నీటి చుక్కలు టపటపా నాట్యం చేస్తూ మనసును తాకుతుంటాయి. అవి జ్ఞాపకాలై, నా జీవితాన్ని నడిపిస్తుంటాయి.. ఇది ఆగని ప్రయాణం.. అంతులేని ప్రయాణం... నాయన తోడులేని, తోడురాని సుదూర ప్రయాణం....!!!

(అనారోగ్యం కారణంగా నవంబరు 7, 2009న మాకు దూరమైన నాన్న 3వ వర్ధంతి సందర్భంగా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.... ఈ చిన్న అక్షర నీరాజనం..!!)

మొదటి వర్థంతి వివరాలు ఇక్కడ http://kaarunya.blogspot.in/2011/02/blog-post.html

రెండో వర్ధంతి వివరాలు ఇక్కడ http://kaarunya.blogspot.in/2011/11/blog-post.html చూడగలరు

Friday, 14 September 2012

ఇంతకీ నేనెవర్ని...??!!


పెద్దసైజు గోళీకాయల్లాంటి
కళ్లను అలా ఇలా తిప్పుతూ
జ్ఞాపకాల లోకానికి తీసుకెళ్తూ
నిన్ను నువ్వు మర్చి
నవ్వుతున్నావా, పలవరిస్తున్నావా
తెలీని నీ స్థితిని చూస్తే..
స్వచ్ఛమైన సెలయేరు
పరవళ్లు తొక్కుతున్నట్లనిపించేది

యేటి చెలిమలా, నీ జ్ఞాపకాల చెలిమలో
ఎన్నెన్ని తీపి ఊసులో, అనుభూతులో......

బాల్యం వాకిట్లో నువ్వు తచ్చాడుతుంటే
పసితనాన్నై పలుకరించా
మధురోహల యవ్వన విహారానికెళ్తే
సిగ్గులమొగ్గనై చిలిపిగా నవ్వా
మొగ్గలోనే చితికిన తొలిప్రేమ
కన్నీరై ప్రవహిస్తుంటే
ఓదార్పు ఆనకట్టనయ్యా...

తీపి ఊసులన్నీ ఉక్కిరిబిక్కిరిచేస్తే
ఆనందమై అక్కున చేర్చుకున్నా
జ్ఞాపకాల చెలిమ భారంగా నిండితే
ఒరిగిపోకుండా ఒంపుగా పట్టుకున్నా...
మనసు గాయాలు మళ్లీ రేపుతుంటే
మందునై మాన్పుతూ వచ్చా
కల్లోలపరిచే కాలం చీకట్టు కమ్ముకుంటే
వెలుగు దివ్యనై కాంతిని పంచా...

జీవితం ప్రతిదశలోనూ...
నీ వెంట నీడనై.. నేనే నువ్వై సాగుతుంటే

ఓ రోజున హఠాత్తుగా... నువ్వడిగిన ప్రశ్న....
"నువ్వెవరు అని"......?
పెద్ద చిక్కుప్రశ్నే వేశావు
అవును నేనెవర్ని....?

నేనెవర్నో, నీకు ఏమవుతానో...
పూర్తిగా మర్చిపోయా...
అంతా నువ్వే అయిన మనఃస్థితిలో
నన్ను నేనే మర్చిపోయిన దీనస్థితి అది

ఇంతకీ నేనెవర్ని...?
నువ్వు మాత్రం నేను కాను
నేను మాత్రం ముమ్మాటికీ నువ్వే....!
నేనున్నంతదాకా... నా ఊపిరి ఆగేంతదాకా.....!!

Monday, 10 September 2012

జ్ఞాపకాల జడివాన జోరు తగ్గేదెలా.....!!నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన...

చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన...

చూపులు, చేతులు కలిసి
ఒకటి రెండో భుజానికి ఆసరాగా
ఇరు మనసుల కలబోతలో
అంతేలేని మాటల జల్లులై కురిసేవేళ
ముసిముసి నవ్వుల ప్రేమవాన...

ప్రేమబంధం మాంగల్య బంధమై
మరుజన్మ ఎత్తితే
ఏకాంతపు లోగిలిలో
అనురాగపు ఆనందాల వెల్లువలో
సిగ్గుల మొగ్గ సింధూరపు వాన...

ముద్దు ముద్దు మాటలు
మురిపాల మూటలై
అమ్మానాన్నలని చేసిన
బుడి బుడి అడుగుల చప్పుడు
చిటపట చినుకుల నాట్యమైనప్పుడు
గుండెనిండా వాత్సల్యపు వాన...

రెక్కలొచ్చి ఎగురనేర్చి
గూడును, కన్నవారినొదిలి
కాలమనే కారుమబ్బులై
తుఫానులా తీరం చేర్చితే
జీవితపు మలిసంధ్య వాన...

మది గదిలో వాన...
చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది
వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...

Thursday, 6 September 2012

ప్రేమ మేఘం వర్షించిందిలా..!!!బాగా చిన్నప్పుడనుకుంటా
ఏదో కావాలని మారాం చేసేస్తుంటే
ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడాయన
అయినా వింటేగా..
అంతే.. లాగి చెంపపై ఒకటిచ్చుకున్నాడు

ఎప్పుడూ భుజంపై ఎక్కించుకుని
ఊరంతా తిప్పుతుండే ఆ వ్యక్తికి
ఆ రోజునుంచీ మనసు మనసులో లేదు
రాత్రీ పగలూ ఒకటే ఏడుపు
ఆ పసిదానిపైనా నా ప్రతాపం
తనలో తాను తిట్టుకోని, గొణుక్కోని రోజులేదు
ముద్ద ముడితే ఒట్టు

తనను ఎత్తుకుని ఆడించే ఆ మనిషి
ఇలా కొడతాడని ఊహించని ఆ పసిమనసు
చెంపమీద వేళ్లగుర్తులు అచ్చుగుద్దినట్టు
ఆ రోజునుంచీ అతడి దగ్గరికెళితే ఒట్టు
మామూలుగా అయితే...
చూడగానే మీదికెక్కే ఆ పసిది
ఆ మనిషిని చూస్తేనే జడుసుకునేది

వారిద్దరి సయోధ్యకు చాన్నాళ్లే పట్టింది
ఓ రోజున జాగ్రత్తగా దగ్గరికి తీసుకుని
తినేందుకు ఒడినిండా కొనిచ్చి
ముద్దులాడుతూ క్షమించమన్నాడు
ఏమనుకుందో ఏమో
క్షమించేసింది, ఇకపై ఇలా చేయకని
ముద్దుతో మరీ వార్నింగ్ ఇచ్చేసింది...

తాత మనవరాళ్ల ఫైటింగ్ ఇలా సమాప్తం.....

మళ్లీ చాన్నాళ్ల తరువాత
ఎందుకోగానీ అదే చెంపపై
మళ్లీ వేళ్ల గుర్తులు అచ్చుగుద్దినట్లు
అయితే ఈసారి తాతవి కావు, నాన్నవి...
ఆ పసిది ఇప్పుడు యుక్తవయసు అమ్మాయి

చిన్నప్పుడు తాతపై ప్రకటించిన యుద్దమే
ఇప్పుడు నాన్నపై....
నాన్న పరిస్థితీ తాత పరిస్థితికంటే దారుణం
అయ్యో నా తల్లిని ఇలా కొట్టేశానేంటి
ఏడ్వని రోజు లేదు...
ముద్ద ముడితే ఒట్టు...
అర్థం చేసుకుందో ఏమో
తాతలాగే నాన్ననీ ముద్దుతో క్షమించలేదు
మౌనంగా, కళ్లతో క్షమించేసింది

అదే పెళ్లై అత్తారింటికెళ్లాక...
రోజూ చెంపపై
మొగుడి ప్రేమ ముద్రలు 
కాదు కాదు
చేతి వేళ్ల ముద్రలను
మౌనంగా భరించటం నేర్చుకుంది
అయినా ఎంతకాలం అలా...?

చిన్న దెబ్బకే అల్లాడిపోయిన
తాత, తండ్రుల్లాగా
ఇక్కడ ప్రేమ పంచడానికి
బుజ్జగించడానికి ఎవరూ
లేరన్న సత్యం మెల్లిగా బోధపడిందే ఏమో
మానసిక, శారీరక గాయాలకు
మందు ఇక్కడ లేదనుకుందో ఏమో
ఓ రోజు పుట్టిల్లు చేరుకుంది

బ్రతికినంతకాలం నీ కూతురుగా
ఇక్కడే ఉంటా...
ఇంత తిండి పెట్టండి చాలని
బ్రతిమాలింది ఆ తండ్రిని
కన్నీటి వరదై కరిగిపోయాడా తండ్రి
కానీ... లోకం నోటికి భయపడి
చావైనా, బ్రతుకైనా కట్టుకున్నోడితోనే
ఇక్కడొద్దని బయల్దేరదీశాడు

మెట్టినింట్లో కూతురిని అప్పజెపుతూ
అల్లుడి మాటలు నమ్మి
ఆమెకు బుద్ధిమాటలు చెప్పాడు
బంగారు తల్లిని బలి ఇస్తున్నాడని
ఆయనకు తెలియదాయె..
చావైనా, బ్రతుకైనా ఇక్కడేనా
మరి బ్రతుకుతూ చావటమెందుకైతే
అందుకే ఓరోజున ఆమె నావ తీరం చేరింది
తాత, తండ్రులపై గర్జించిన ప్రేమ మేఘం
చివరికలా వర్షించింది....

(ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో సామాన్యగారు రాసిన "మహిత" కథ చదివాక (నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలూ కాసిన్ని గుర్తుకురాగా) బాధను ఎలా వ్యక్తపరచాలో తెలీక ఇలా...!!)