Pages

Thursday, 27 December 2012

అప్పదాసూ... మా నాన్నా...!!




శ్రీరమణగారి "మిథునం"... "మన అమ్మానాన్నల కథ"....... ఈ మాటలు ఎంత అక్షర సత్యాలో కదా....

మిథునం కథ మాత్రమేనా... కథ అనుకుని అక్కడే ఆగిపోగలమా ఎవరైనా దాన్ని చదివితే... చదివాక అసలు స్థిరంగా ఉండగలమా... కొన్నాళ్లకైనా మామూలు మనుషులం కాగలమా... ఎప్పటికైనా మిథునంనిగానీ, అప్పదాసు, బుచ్చిలక్ష్మిలను గానీ మర్చిపోగలమా...?!

ఎప్పటికీ మర్చిపోలేం.. ఎందుకంటే అది కథ కాదు.. మన అమ్మా నాన్నల జీవితం. మనం అమ్మానాన్నలుగా జీవించబోయే జీవితం. అందుకే అది మన జీవితాల్లో అంత గాఢంగా పెనవేసుకుపోయే "కథానుబంధం" అయింది. మన అమ్మానాన్నలు ఇలా ఉండేవారేమో అని, మనం అమ్మానాన్నలం అయ్యాక ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకోని "మిథునం" ప్రేమికులు ఉండరేమో.

మిథునంతో కళ్లు కలిపితే... కళ్లల్లో అమ్మానాన్నల జీవితం స్వచ్ఛంగా సాక్షాత్కారం అవుతుంది. అప్పదాసు, బుచ్చిలక్ష్మి కబుర్ల లోగిళ్లోకి అడుగుపెట్టినట్లుగా మన అమ్మానాన్నల జీవితపు కుటీరంలోకి తెలీకుండా అడుగులు వేసేస్తాం. అలా చిన్నతనం నుంచీ, ఇప్పటిదాకా అమ్మానాన్నలతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ.. ఒక్కో జ్ఞాపకాన్ని ఏరుకుంటూ పోతే...

సంతోషాలు, ఆనందాలు అనే ఎన్నో వజ్రాలు, రత్నాలూ దొరకవచ్చు... కష్టాలు, కడగండ్లు అనే రాళ్లూ, రప్పలూ దొరకనూవచ్చు. వాటితో, వాళ్లతో పెనవేసుకున్నదే కదా మన జీవితం... అందుకే ప్రతిదీ అపురూపమే.

నా వరకు నేను... మిథునం చదువుతున్నంతసేపు, చదవటం ఆపేసి ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు బుచ్చి లక్ష్మిలో అమ్మను, అప్పదాసులో నాన్నని చూడకుండా ఉండలేకపోయా. నిజ్జంగా ఎన్నెన్ని సారూప్యాలో వాళ్లకీ, వీళ్లకీ. అందుకే వాళ్లు హాయిగా నవ్వుతుంటే నేనూ గలగలమంటూ జతకలిపాను, బాధపడుతుంటే విలవిలలాడిపోయాను, ఉడుక్కుంటుంటే మురిసిపోయాను.. జీవితం కాసి వడబోసిన వాళ్ల అనుభవాల మాటల్ని వింటూ భవిష్యత్తుకు సన్నద్ధమయ్యే సిపాయినయ్యాను..

బుచ్చిలక్ష్మమ్మలా మా అమ్మ వయసులో అంత పెద్ద కాకపోయినా...... బుచ్చమ్మను చూసినట్లే ఉంటుంది. ఛామనచాయ ముఖంతో, ఆ ముఖంలో ఓ మెరుపుతో, శాంతానికి మారుపేరులా కనిపించేది. నాన్న కూడా అప్పదాసులా పెద్ద వయసువారు కాకపోయినా.... ఆయనకేం తీసిపోరు అన్నట్లుగా ఉండేవారు. తిండిపట్ల యావ ఉన్నా... రోజూ తను తినే భోజనాన్ని ఇద్దరికైనా పంచిపెట్టనిదే తినేవారు కాదు. పైగా అమ్మకోసం తన పళ్లెంలో కాస్తయినా అలాగే ఉంచేవారు.

ఓరోజు... ఎందుకలా ఎప్పుడూ ప్లేటులో అలా ఉంచుతావు నాన్నా... అంటే.. "మీ అమ్మ తిక్కది రా... ఎప్పుడూ అందరి కడుపూ నిండిందా అని చూస్తుందేగానీ, తన కడుపు గురించి పట్టించుకోదు. నేనూ పట్టించుకోకపోతే ఎలా...?!" అన్నాడు నాన్న. ఆహా.. అలాగా.. అనేసి ఊరుకున్నా. చిన్న వయసులో అంతకంటే ఇంకెలా స్పందించాలో తెలీలేదు. ఇదుగో ఇవ్వాళ "మిథునం" చూస్తుంటే (చదువుతుంటే) ఇలాంటివి గుర్తొస్తున్నాయి. కళ్లను తడిపేస్తున్నాయి, గుండెలో చెమ్మని బయటికి తెస్తున్నాయి.

"దోర జామకాయను అప్పదాసు నమిలి గుజ్జును పళ్లూడిపోయిన బుచ్చమ్మకు ఇస్తే ఆమె చప్పరిస్తూ జామ రుచిని ఆస్వాదిస్తుంటే..." "సత్సంగత్యే నిస్సంగత్వం - మంచితోడూ మంచినీడా" అనుకుంటూ విశ్రాంతిగా బావికి చేరగిలబడిన అప్పదాసు... ఈ వాక్యాలు చదువుతుంటే ఎంత తృప్తిగా అనిపించిందో.. "మంచితోడూ, మంచినీడా..." ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు కదా... ఏ కొందరికో ఆ భాగ్యం దక్కుతుందేమో..

చిన్నతనంలోనే దంపతులైన అమ్మానాన్నల్ని వేరుకాపురం పేరుతో నాన్నమ్మ పక్కనబెడితే.. వంట కూడా చేతగాని అమ్మకి, నెలల పాపనైన నాకూ.. అన్నీ తానై అమ్మలా చూసుకున్న నాన్న... అప్పదాసులా కళ్లముందు కదలాడగా.. కళ్లు నిండిపోయాయి. పళ్లూడిపోయిన భార్యకి గుజ్జును నమిలి ఇచ్చిన అప్పదాసును... పగలంతా కూలిపనులు చేసి, వంట సరుకులతో ఇంటికొచ్చి అలసిన శరీరంతోనే వంటచేసి అమ్మకి తినిపించిన తనే ఓ అమ్మలా మారిపోయిన నాన్న గురించి తల్చుకుంటే..."మంచితోడూ, మంచినీడా" మాటలు ఎంత అక్షర సత్యాలో కదా అనిపించింది.

బుచ్చమ్మ, అప్పదాసుల ఇంట్లో అంత పెద్ద పెరడు లేకపోయినా.. మా ఇంట్లోనూ ఒకప్పుడు బోలెడన్ని మొక్కలుండేవి. ప్రతివాటితోనూ అమ్మా, నాన్నకి అనుబంధం ఉండేది. మొక్కలతోపాటు కోళ్లు, కుక్కలు, పిల్లులు ఇంట్లో ఉండేవి. వాటికి ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తుండేవాడు నాన్న. అప్పటి మొక్కలు, పెంపుడు జంతువులు అన్నీ పోగా.. ఇప్పటికి మిగిలుంది ఒకే ఒక్క కొబ్బరి చెట్టు మాత్రమే.

బుచ్చమ్మను అప్పదాసు ఉడికించినట్లుగా నాన్న అమ్మని భలేగా ఉడికించేవారు. నాన్నతో కలిసి అమ్మను మేం కూడా ఏడిపించేవాళ్లం. కానీ కాసేపట్లోనే అమ్మ మాతో జతకలిసి హాయిగా, స్వచ్ఛంగా నవ్వేసేది. అమ్మ కూడా తక్కువేం తినలేదు. నాన్నని బాగా ఆటపట్టించేది అచ్చం బుచ్చమ్మలా... మీకంటే ముందు వచ్చిన ఉజ్జోగస్తుల సంబంధం చేసుకునుంటే ఈ కష్టాలేం లేకుండా బ్రతికేద్దును. మిమ్మల్ని చేసుకుని ఓ నగా, నట్రా అంటూ మూతి వంకర్లు తిప్పుతూ మాట్లాడుతుంటే... నాకంటే బాగా చూసుకునేటోళ్లు ఎవరే అంటూ నవ్విసేవారు నాన్న.

బుచ్చమ్మ, అప్పదాసుల్లా...... అమ్మ ఎక్కడికెళ్లినా ఆమెతోపాటు నాన్న ఉండాల్సిందే. నాన్న లేకుండా అమ్మ కూడా ఎక్కడికీ వెళ్లేది కాదు. ఒకవేళ వెళ్లినా ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేయాల్సిందే. చిన్నప్పుడు ఊర్లో హరికథలు, బుర్రకథలు, వీథి నాటకాలు లాంటివి జరుగుతుంటే.. అమ్మా, నాన్న చక్కగా తయారై... చాపలు, నీళ్ల చెంబులతో హాజరైపోయేవాళ్లు. ఇక పిల్లలైన మామాట సరేసరి. అమ్మా, నాన్న కథలో ఎంతగా లీనమయ్యేవారంటే.. కథను బట్టి నవ్వేవాళ్లు, ఏడ్చేవాళ్లు, బాధపడేవాళ్లు... అప్పుడు చిన్నవాళ్లం కదా.. మాకేమీ అర్థమయ్యేది కాదు.. ఇప్పుడు "మిథునం" పుణ్యమా అని.. వాళ్ల అమాయకత్వం, స్వచ్ఛమైన వాళ్ల అనుభూతుల్ని ఇలా ఏరుకుంటూ పోగుచేసుకుంటున్నా.

ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని జ్ఞాపకాలు.. అనుభూతులు.. మరపురానివి.. మాసిపోనివి...



కానీ.. అప్పదాసుకూ.. మా నాన్నకీ ఓ గొప్ప సారూప్యం ఏంటంటే...

అప్పదాసులా నాన్న ముందుగానే వెళ్లిపోయారు.... బుచ్చమ్మలాంటి మా అమ్మను వదిలి ఆయన వెళ్లిపోయారు. దాసు లేని బుచ్చమ్మలా అమ్మ జీవితపు సముద్రాన్ని జ్ఞాపకాల నావతో ఇప్పటికీ ఈదుతూనే ఉంది.

"చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం, నే వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు. అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములూ, కందట్లూ, పొంగరాలూ ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే పిచ్చి వెర్రి కోరిక లెవరు తీరుస్తారు? కొడుకా, కోడలా, మనవడా, దేవుడా?" అంటూ బుచ్చమ్మలా అనలేదు కానీ...

"నేనుండగానే ఈ జీవుడ్ని తీసుకెళ్లు తండ్రీ... ఆయన లేకపోయినా నేను ఉండగలను, పిల్లల్ని చూసుకోగలనేమోగానీ... నేను లేకుండా ఆయన ఉండటం, పిల్లల్ని చూసుకోవడం కల్లో మాటే.. చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోతారు..." ఇద్దర్లో ఎవరో ఒకరు పోవాల్సి వస్తే.. ముందు ఆయన్ని, ఆ తరువాతే నన్ను తీసుకెళ్లు అంటూ గొణుక్కుంటుండటం చాలాసార్లు విన్నాను నేను. అప్పట్లో అర్థం కాలేదు.. కానీ ఇప్పుడు బుచ్చమ్మ కోణంలోంచి చూస్తే.. అమ్మలా ఎంతమంది బుచ్చమ్మలున్నారో ఈ లోకంలో కదా అనిపించగానే దుఃఖం ఆగలేదు.

ఒక్కటి మాత్రం నిజం.....

"ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చని చెట్లలో చూసుకోవడం నేర్పించాడు... కాసే ప్రతి చెట్టులోనూ ఆయన్ని చూసుకోగలను... లక్కా బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని వత్తి ఎన్నాళ్లుంటుంది. నా విస్తళ్లు అయిపోగానే నేనూ..." బుచ్చిలక్ష్మి ఎక్కిళ్ల శబ్దంలా....

నేను లేకుండా ఆయన బ్రతకలేరని అనుకుందేగానీ... ఆయన లేని తాను కూడా బ్రతకటం కష్టమే అని అమ్మకి మాత్రమే తెలుసు. లేచింది మొదలు, నిద్రపోయేదాకా తోడునీడగా కదలాడే ఆ మనిషి లేకుండా జీవితం గడపటం అంత సులభం కాదని కొన్నాళ్లకే అర్థమైందేమో ఆమెకి... ఈ మధ్య చాలా సార్లు అంది నాతో.. మీ నాన్నతోపాటు నేనూ పోవాల్సిందని. ఎందుకలా అంటావు. నీకు మేమంతా లేమా అని అంటే.. ఎందరున్నా.. మీ నాన్నతో సమానమవుతారా చెప్పు.. అంటూ అమ్మ ఎక్కిళ్ల శబ్దం.....

అంటే...

"బంగారం లేని లక్కముద్దలా, ప్రమిద లేని ఒత్తిలా, తన విస్తళ్లు అయిపోయేందుకు అమ్మ కూడా బుచ్చమ్మలా ఎదురుచూస్తోందా..." అనుకోగానే కళ్లు మసకబారి ఇక అక్షరాలు ముందుకు సాగలేదు.....

"మరి బతుకంటే అదేరా బడుద్ధాయ్......." బుచ్చమ్మ మాటలు మాత్రం చెవుల్లో మార్మోగుతున్నాయి...



18 comments:

Chinni said...

శోభ గారు,మాటలు రావట్లేదు చెప్పడానికి. కళ్లు చెమ్మగిల్లాయి.

యశోదకృష్ణ said...

మాటలు రావడం లేదు. ఏమి చెప్పాలో తెలియడం లేదు

ఎందుకో ? ఏమో ! said...

"సత్సంగత్యే నిస్సంగత్వం - మంచితోడూ మంచినీడా''

దోర జామకాయ samanvyam bagundi,

నేనుండగానే ఈ జీవుడ్ని తీసుకెళ్లు తండ్రీ...
really heart touching

?!

శోభ said...

@ చిన్నిగారు

@ గీత గారు

@ ఎందుకో? ఏమో! శివగారూ...


మీ అందరికీ ధన్యవాదాలు.

Vinay said...

చాల బాగుంది అండి.

Srini said...

నేను కథ చదవలేదు కాని మిథునం సినిమా చూసాను.
సినిమా చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయండి.

Priya said...

No words. మీ మాటల్లో మిధునం మరింత బావుంది!

శోభ said...

@ వినయ్

@ ప్రియా

@ శ్రీనివాసరావు ఉండవల్లి గార్లకు... హృదయపూర్వక ధన్యవాదాలు..

David said...

శోభ గారు కథ చదువలేదు, సినిమా చూడలేదు...మీరు రాసింది చదివాక చూడాలనిపిస్తుంది...తప్పకుండా చూస్తాను..మీరు రాసే విధానం చాల బాగుంది.

శోభ said...

డేవిడ్ గారూ...

ముందు కథ చదవండి.. ఆ తరువాత సినిమా చూడండి. కథ చదివాక సినిమా చూస్తుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది.. అందుకే అలా చెప్పాను. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి.

నా రాత శైలి మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ.

Anonymous said...

శోభ గారూ,

మిధునం కథ ఎంత అందంగా ఉందో, మీ వ్యాఖ్యానమూ, మీ తల్లి దండ్రులతో బేరీజు వేసి చెప్పడమూ అంత అందంగానే ఉన్నాయి.

"ఓరోజు... ఎందుకలా ఎప్పుడూ ప్లేటులో అలా ఉంచుతావు నాన్నా... అంటే.. "మీ అమ్మ తిక్కది రా... ఎప్పుడూ అందరి కడుపూ నిండిందా అని చూస్తుందేగానీ, తన కడుపు గురించి పట్టించుకోదు. నేనూ పట్టించుకోకపోతే ఎలా...?!" అన్నాడు నాన్న. ఆహా.. అలాగా.. అనేసి ఊరుకున్నా. చిన్న వయసులో అంతకంటే ఇంకెలా స్పందించాలో తెలీలేదు. ఇదుగో ఇవ్వాళ "మిథునం" చూస్తుంటే (చదువుతుంటే) ఇలాంటివి గుర్తొస్తున్నాయి. కళ్లను తడిపేస్తున్నాయి, గుండెలో చెమ్మని బయటికి తెస్తున్నాయి."

ఇది ఎంత సత్యమో! ఇలాంటి విషయాలు కొంచెం పెద్దవయసున్న నాలాంటి వాళ్లకి ఎంత అనుభవంలోనివే.

మీ పోస్టు చూసేక, ఆ కథ చదివిన రోజు నా తలలో తిరిగిన ఆలోచనలన్నీ మళ్ళీ రీళ్ళురీళ్ళుగా గుర్తుకొస్తున్నాయి.

ఇంతమంచి టపా రాసినందుకు హృదయపూర్వక అభినందనలు.

శోభ said...

@ sunamu గారూ..

మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.. మీ అభినందనలకు కృతజ్ఞతలు..

Sree said...

Gunde pindesaaru andi

శోభ said...

ధన్యవాదాలు శ్రీ గారు...

శ్రీ said...

superb.. maaTalu raavaDam leadanDi..

శోభ said...

ధన్యవాదాలు శ్రీ గారు...

Joshi said...

మంచితోడు మంచినీడ కి మారుపేరైన రమణగారి మిధునం చదివినంతసేపు ఒకరికొకరై నిలిచే జీవితాలెంతందంగా ఉంటాయో అనిపించింది. ఆ పాత్రలని అమ్మా నాన్నలతో పోల్చుకుంటూ చాలా హృద్యంగా రాశారు. చాలా బాగుంది శోభగారూ.

శోభ said...

థ్యాంక్యూ జోషీ