"డేయ్ అంద డబ్బా కొండువాడా... (రేయ్ ఆ డబ్బా తీసుకురా).. పెరియమ్మా ఇవన్ పారూ ఎన్నై అడికిరా... (పెద్దమ్మా వాడు చూడూ నన్ను కొడుతున్నాడు)" అంటూ పక్క పోర్షన్‌లోంచి గట్టిగా మాటలే మాటలు.. బాల్కనీ అంతా గిజగిజా జనాలు నిల్చోనున్నారు. ఒకటే సందడి.
ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు.. "రేపు ఆదివారం కాబట్టి నన్ను ఎవరూ లేపకండి. ఇవ్వాళైనా బాగా నిద్రపోవాలి" అంటూ మావారినీ, మా అబ్బాయినీ హెచ్చరించి మరీ పడుకున్న నాకు పక్కింటి గోలతో ఆరుకూడా కాకుండానే మెలకువ వచ్చేసింది.
గత వారం రోజుల నుంచీ ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలూ లేకుండా నిశ్శబ్దంగా ఉన్న మా పక్క పోర్షన్‌లో ఒకటే హడావిడి. అస్సలే భోరున కురుస్తున్న వర్షం శబ్దానికి తోడుగా పక్కింట్లోంచి వస్తున్న చప్పుళ్లతో.. "అబ్బా ఏంటీ నస, ఎమైనా సరే నిద్రపోవాల్సిందే..." అనుకుంటూ ముసుగుతన్ని మళ్ళీ పడుకున్నాను.
ఓ ఐదు నిమిషాల తరువాత ఎవరో తలుపును దబదబా బాదుతున్నారు. అసలే నిద్రపట్టక చిరాగ్గా ఉన్న నేను, "ఈ రోజు నా చేతిలో అయిపోయారే అనుకుంటూ..." విసురుగా వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఒకామె నవ్వు మొహంతో "ఇన్నేకి పాల్ కాసరోం.. ఇన్నూం సామాన్ కొండువర్‌లే.. చిన్న పాత్రం ఒన్నుం తరింగలా" (ఈరోజు పాలు కాస్తున్నాం. ఇంకా సామాన్ తీసుకురాలేదు. చిన్నపాత్ర ఒకటి ఇస్తారా) అని అడిగింది.
ఓహో పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగినారన్నమాట అని మనసులో అనుకుంటూ... "ఇందాంగే" (ఇదుగోండి) అంటూ నవ్వుతూ పాత్ర ఇచ్చాను. ఎలాగూ నిద్ర చెడిపోయింది ఇప్పుడు పడుకున్నా నిద్ర రాదు. సర్లే పనులైనా త్వరగా ముగించి మధ్యాహ్నం అయినా పడుకోవచ్చులే అనుకుంటూ పనుల్లో పడిపోయాను.
ఎవరినైతే దబాయించి, బెదిరించి రాత్రి పడుకున్నానో.. ఆ శాల్తీలు రెండూ మాత్రం 11 గంటలు అవుతున్నా నిద్ర లేవలేదు. ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లను చూసి కుళ్లుకుంటూ వంటపని చేయసాగాను. ఇంతలో మావాడు లేచి అమ్మా... కాఫీ అంటూ అరిచాడు. కాఫీ చేసి తీసుకెళ్లి ఇవ్వగానే.. "ఏంటమ్మా బాల్కనీలో ఒకటే గోల" అని అడిగాడు.
"ఆహా.. ఆ గోల తమరికి ఇప్పుడే వినిపిస్తోందా.. ఉదయం నుంచీ ఆ గోలను భరిస్తూనే ఉన్నాను తండ్రీ. పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగారట. పాలు కాస్తున్నారు" అని చెప్పాను. "ఆహా.." అంటూ మావాడు పేపర్లో మునిగిపోయాడు. ఇంతలో మా ఆయన లేచి "టిఫిన్ అయ్యిందా" అన్నాడు. "అయ్యింది మహాప్రభో తమరు అన్ని పనులూ ముగించుకుని రండి, ఆరగించుదురుగానీ..." (ఈయనదో గోల.. ఎప్పుడైతే ఆ షుగర్ జబ్బు వచ్చిందోగానీ.. లేచీ లేవగానే ఆకలేస్తుంది అంటూనే నిద్ర లేస్తారు) అన్నాను.
"ఏంటీ పొద్దున్నే భలే వేడిగా ఉన్నావు.. ఏంటి సంగతి" ఆరా తీశాడు మా ఆయన. "ఆ ఏముంది పక్కింట్లోకి కొత్తగా వచ్చారట పాలు కాస్తున్నారు. అయినా ఇన్నేళ్లుగా మనం ఇక్కడ ఉంటున్నాం.. ఓ ఇల్లు మారి, ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో నామ్ కే వాస్తే లాగా పాలు కాస్తాం కదా... వీళ్ళేంటో మరీ విచిత్రంగా మందలు మందలుగా జనాలు, ఒకటే గోల.. ఏవేవో చేస్తున్నారు. అద్దె ఇంట్లోకి దిగుతూ.. ఏదో సొంతంగా ఇల్లు కట్టి, ఆ ఇంట్లో పాలు పొంగిస్తున్నట్లుగా చేస్తున్నారు" చిరాగ్గా అన్నాను.
"సర్లే.. మనలాగే అందరూ ఉండాలంటే కుదురుతుందా. అసలే అరవమేళాలు.. వాళ్లలాగా మనం కూడా టెనెంట్స్ మాత్రమే, మనకెందుకు చెప్పు" అంటూ మా ఆయన బాత్రూంలో దూరిపోయాడు. అవును నిజమే కదూ అనుకుంటూ.. అబ్బా రోజంతా ఇలాగే మూడీగా ఉంటే బాగుండదు, మూడ్ మార్చుకోవాల్సిందేనని నిర్ణయించుకుని, చిన్నగా పాడుకుంటూ వంటింట్లోకి వెళ్ళాను.
పక్కింట్లో హడావిడి మాత్రం తగ్గలేదు. వర్షం పడుతున్నా ఎవరో జనాలు వస్తూనే, వెళ్తూనే ఉన్నారు. పాలూ, పండ్లు తీసుకుని ఆ ఇంటావిడ మాకు ఇచ్చి వెళ్లింది. మధ్య మధ్యలో కూడా అవి కావాలి, ఇవి కావాలి అంటూ వస్తువులు పట్టుకెళ్తూనే ఉన్నారు. మొత్తానికి ఆ రోజు అలా గడిచిపోయింది.
మరుసటి రోజు పక్కింట్లో దిగిన అతను మా ఆయన్ని పిలిచి పరిచయం చేసుకున్నాడు. "నిన్న ఒకటే హడావిడిగా ఉండి పరిచయం చేసుకోవటం కుదర్లేదు సర్.." అంటూ, తన భార్యను కూడా పిల్చి పరిచయం చేసుకున్నాడు. మా ఆయన నన్ను కూడా పరిచయం చేశాడు. మొత్తానికి పరిచయ కార్యక్రమాలు అయ్యాక మెల్లిగా మొదలెట్టాడతను.
"ఎక్కడెక్కడో వెదికాం. ఇలాంటి ఇల్లు దొరకలేదు. మొత్తానికి మంచి ఇల్లే దొరికింది" అంటూ ఓనర్ గురించీ, పక్క ఇళ్లవాళ్ల గురించీ, కింద పోర్షన్లలో ఉండేవారి గురించి, చుట్టుప్రక్కల అంగళ్లు, బస్టాండు.. వివరాలన్నీ ఆరా తీశాడు అతను.
"అది సరేనండీ.. ఇంటి అద్దె ఎంతని ఓనర్ చెప్పాడు?" అంటూ మావారు అడగ్గా... "4 వేలు సార్.. అడ్వాన్స్ 40 వేలు" అన్నాడు.
"ఆహా.. అలాగా..! మా ఇల్లు 3 వేలే, 25 వేలే అడ్వాన్స్ ఇచ్చాం.." అంటూ మావారు నోరు జారనే జారారు - షరామామూలుగా.
"అవునా అలాగా.. సేమ్ మీ ఇల్లంతే కదా మా ఇల్లు కూడా ఉంటుంది. మరి మాకెందుకు ఓనర్ ఎక్కువ అద్దె చెప్పాడు?" అంటూ అతను వెంటనే ప్రశ్నించాడు.
మా ఆయన్ని మెల్లిగా గిల్లిన నేను కల్పించుకుంటూ... "మరేంలేదులెండి.. మేము చాన్నాళ్లుగా ఉంటున్నాం కదా.. మాపైన ఓనర్‌కు నమ్మకం ఎక్కువలెండి. ఇన్నిరోజులుగా నమ్మకంగా ఉంటున్నాం కాబట్టే అద్దె పెంచలేదు" అన్నాను.
"ఓహో.. అప్పడియా?" అంటూ అతను వెళ్లిపోయాడు.
అతను అలా వెళ్లగానే.. "మీ నోట్లో ఏదీ దాగదా...? అతను వెళ్లి ఓనర్‌ను నిలదీస్తే.. మనల్ని కూడా అద్దె ఎక్కువ ఇవ్వమని అడుగుతాడులే ఉండు..." అంటూ కోప్పడ్డాను.
"అవును నిజమే.. ఏదో అలా వచ్చేసింది." అంటూ సర్దుకున్నారు మావారు.
పక్క పోర్షన్ ఖాళీ అవుతున్నప్పుడే మేం కాస్త భయపడ్డమాట వాస్తవం. ఈసారి అద్దెకు వచ్చేవాళ్లు ఎక్కువ ఇస్తే మమ్మల్ని కూడా అద్దె ఎక్కువ ఇవ్వమని అడుగుతాడేమో అనుకున్నాం. ఇప్పుడేమో ఈయన ఇలా నోరుజారారు. ఏమవుతుందో ఏమో అనుకుంటూ.. అలా రెండు రోజులు గడిచిపోయాయి.
మేం భయపడినట్లుగానే... సాధారణంగా ఇంటివైపు కన్నెత్తి చూడని మా ఇంటి ఓనర్.. పొద్దున్నే ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే మా ఆయన ఆఫీసుకు వెళ్లిపోయారు. మా అబ్బాయి ఆఫీసుకెళ్లేందుకు బయల్దేరుతూ బాల్కనీలో ఓనర్ని చూసి "అమ్మా.. అంకుల్" వచ్చారు అన్నాడు.
"రండి సర్.. బాగున్నారా..?" లోపల గుబులుగా ఉన్నా, బయటికి మాత్రం నవ్వుతూ ఆహ్వానించాను.
"ఏంటి సర్ ఎప్పుడూ ఇటువైపు రారు, ఏంటి విషయం?" అని అడిగాను.
"ఒన్నుం ఇల్లే మా.. ఎనకు వీడు వేండుమ్ (ఏం లేదమ్మా.. నాకు ఇల్లు కావాలి)" అన్నాడు.
"అదేంటి సర్.. ఇలా సడెన్‌గా చెబితే ఎలా?" అన్నాను.
"సడెన్‌గా ఏమీ లేదమ్మా.. ఇంకో రెండు నెలల్లో ఖాళీ చేస్తే చాలు. మా చెల్లెలు ఇల్లు కావాలంటోంది. పిల్లల స్కూలు ఇక్కడికి దగ్గర్లోనే. అందుకే ఇక్కడికి రావాలంటోంది." అన్నాడు.
"అదేంటి సర్.. పక్కింట్లోకి ఎవరు కొత్తగా వచ్చినా మీరు ఇలాగే చెబుతున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు మళ్లీ ఇలా అంటున్నారు..?" బాధగా అన్నాను.
"నేను ఆ తరువాత ఎప్పుడైనా ఇలా అడిగానా.. నాకు ఇల్లు అవసరం ఏం చేయమంటారు. అయినా ఇది నా ఇల్లే కదా, మీరు ఎన్నేళ్లు ఉన్నా, ఖాళీ చేయాల్సిందే కదా.." అన్నాడు.
"అదీ నిజమేలెండి.. ఆయన ఇంటికి రాగానే చెబుతానులెండి" అన్నాను.
ఓనర్ వెళ్లాక మా ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆ రోజు తమరు కంట్రోల్‌గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని దెప్పాను.
ఏదో ఆవేశంలో మా ఆయనపై కోప్పడ్డానుగానీ.. మా ఓనర్ ఓ విచిత్రమైన మనిషి.. తాను రెంట్ పెంచాలనుకుంటే అదే విషయం నేరుగా చెప్పడు. నేరుగా చెబితే ఇష్టమైతే ఉండటమో లేకపోతే వెళ్లిపోవడమో చేస్తాం. కానీ ఆయన ఏకంగా ఇల్లే ఖాళీ చేసేయమంటాడు. అదే ఆయన స్పెషాలిటీ.. అలా చెబితే మన పరిస్థితులను బట్టి అతన్ని బ్రతిమలాడుకోవాలి. లేదంటే పారిపోవాలి.
ఇప్పటికి ఇలా రెండుసార్లు అలాగే చేశాడు. అందుకే పక్కింట్లో ఎవరైనా ఖాళీ చేస్తే, మాకు ఆ రోజునుంచే గుబులు మొదలవుతుంది. మేం భయపడినట్టుగానే ఈసారి కూడా అలాగే చేశాడు. ఇక మళ్లీ అతగాడిని బ్రతిమలాడుకోవాలి అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నా. బుర్ర అస్సలేం బాగలేదు.. వేరే ఇల్లు చూసుకుందామా, లేదా ఇక్కడే ఉందామా.. అనుకుంటూ పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఉండిపోయా.
ఆ తరువాత ఓ వారం రోజులపాటు ఓనర్ ఇంటిచుట్టూ ప్రదక్షిణ చేస్తేగానీ... ఆయనగారు ఆ ఇంట్లో మేం ఉండేందుకు ఒప్పుకోలేదు. రెంట్ పెంచటమేగాకుండా, అడ్వాన్స్ కూడా ఎక్కువ తీసుకున్నాడు. అదీ ఓ సంవత్సరం రోజుల వరకు మాత్రమే. ఆ తరువాత ఖచ్చితంగా చెప్పిన రోజున ఖాళీ చేయాలనే కండీషన్‌తో ఒప్పుకున్నాడు.
ఇవండీ మా అద్దె ఇంటి కష్టాలు.. ముఖ్యంగా మా ఆయన నోరుజారటంవల్ల వచ్చిన కష్టాలు.. ఈ మహానగరంలో ఓ పద్నాలుగేళ్లుగా అద్దె ఇంట్లోనే గడుపుతున్న మాకు... ఇల్లు మారాల్సిన ప్రతిసారీ ఇలాంటి కష్టాలే. అందుకే ప్రతిసారీ.. చదువులేకపోయినా, ఎలాంటి ఉద్యోగం లేకపోయినా రెండు మూడు పోర్షన్లు ఉండే ఓ సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది అనుకోని రోజు లేదంటే నమ్మండి. ఎందుకంటే.. ఈ రోజుల్లో సొంత ఇల్లే ఓ బంగారుబాతు లాంటిది. అది ఉంటే చాలు డబ్బులే.. డబ్బులే...!! ఆ బంగారుబాతు ఉన్నవాళ్లంతా మహారాజులే...!!