నీలో నేనుగా
నాలో నీవుగా మిగిలుందాం
ఒకే దేహపు గూడుగా
మూల మూలల్ని ప్రేమతో
నిక్షిప్తం చేసి
పరవళ్లెత్తి పరవశిద్దామని
నువ్ చేసిన బాసకి
లిపి ఏది...
లయ తప్పిన నా గుండె సడి తప్ప
నీకు నీవుగా
నాకు నేనుగా మిగిలున్న
దేహపు గూడుల
మూల మూలల్లోనూ
నిక్షిప్తమైన "ఇగో"లని
సంతృప్తిపరచలేక
కలిసి జీవించనూ లేక
ఎవరి దారి వారిదేనంటూ
నువ్ ఇచ్చిన తీర్పుకి
లిపి ఏది...
లయ తప్పిన నా గుండె సడి తప్ప
నాలో నేనుగా
నాకు నేనుగా మిగిలున్న
దేహపు గూడులో
మూల మూలల్లో
నిగూఢంగా నిక్షిప్తమై
నిత్యం నిద్రలేపే
వేనవేల భావాలకి
లిపీ లేదు, భాషా లేదు
లయ తప్పిన నా గుండె సడి తప్ప...!
నీకు నీవుగా
నాకు నేనుగా వద్దు
ఇద్దరం కలిసి ఉంటేనే ముద్దు
"ఇగో"లేం వద్దు.. అసలే "గోలా" వద్దు
నింపుకుందాం నమ్మకాన్ని
ఒడిసి పట్టుకుందాం ఆశల్ని
ఒలికిపోయిన జీవితానికి
కొత్త రంగుల శోభనద్ది
దాసోహమౌదాం ప్రేమకి
మరో జన్మ ఇద్దాం దేహాలకి
ఇలా.....
నా దేహపు గూడు
లోలోపల ఎగిసిపడే
ఆశల లావా ఎగజిమ్మితే
వర్ణించే లిపి ఏది...
లయ తప్పిన నా గుండె సడి తప్ప...!!
("ఇగో"ల మాయలోపడి అస్తవ్యస్త జీవితాలతో సతమతమవుతున్న వారందరి కోసం...)