Pages

Tuesday 12 October 2010

టీవీ స్విచ్.. తాత చేతికర్ర...!

ఆఫీసు నుంచి పని ముగించుకుని ఈసురోమంటూ ఇంటికి బయల్దేరాను. ఆఫీసు దాటి కాస్తంత దూరం వెళ్లగానే నేను ఎక్కాల్సిన యం12సి బస్సు కాస్తా నన్ను దాటుకుని ముందుకు పరుగులు తీసింది. చేసేదేం లేక బస్టాప్‌దాకా నడచి అక్కడ 12జి బస్సు పట్టుకుని ఎలాగోలా ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరగానే మా పింకీ ఎదురొచ్చి బాగా అలసిపోయావా..?! అంటూ నా బ్యాగ్ అందుకుని తాగడానికి నీళ్లిచ్చింది. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ...! పింకీ మా అక్క కూతురు. కొన్ని రోజులు మాతో ఉండేందుకు వచ్చింది. వరుసకు నాకు కూతురైనప్పటికీ దానికీ, నాకూ ఓ నాలుగేళ్ల తేడా మాత్రమే ఉంటుంది.

లెక్కలేనన్ని కబుర్లూ, చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ చాలా సరదాగా ఉంటాం మేమిద్దరం. దాని కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటూ ఉంటుంది. ఏదేని సమస్యలొచ్చినప్పుడు నన్ను సలహా కూడా అడుగుతూ ఉంటుంది. నేను కూడా పెద్ద ఆరిందాన్నిలా తోచిన సలహా ఇచ్చేస్తుంటాను.

ఆరోజు ఓ చిన్న విషయంపైకి మా ఇద్దరి చర్చ మళ్లింది (పర్సనల్ కాబట్టి వివరాలు మాత్రం చెప్పలేను). ఆ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. ముందు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడటం లేదు. ఈ విషయంలో ఇప్పటికే నువ్వు చాలా సార్లు మాట తప్పావు కాబట్టి నిన్ను నమ్మను. నామీద ఒట్టేసి చెబితేగానీ ఈసారి నమ్మేది లేదు అంటూ ఓ చిన్నపాటి క్లాస్ పీకడం మొదలెట్టాను పింకీకి.

పాపం అది బిక్కమొహం వేసి... నీకూ, మా అన్నకూ ఎప్పుడూ ఇదే భయం. చెబితే వినరు, నమ్మరు. "అమ్మా...! అసలు దాన్నెప్పుడూ నమ్మవద్దంటూ" వాడెప్పుడూ అమ్మకు చెబుతుంటాడు కూడా...! మీకెందుకంత సందేహం. నేను మంచి అమ్మాయిని కదా..! ఈసారి మాట తప్పనులే అంటూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది పింకీ.

కానీ నేను మాత్రం నా బెట్టు వీడలేదు సరికదా... మరింత కోపంగా బుంగమూతితో కూర్చున్నాను. సీరియస్ వాతావరణాన్ని ఎలాగైనా సరే చల్లబర్చాలనుకున్న పింకీ...

పిన్నీ పిన్నీ...! ఓసారి నువ్వు ఇంట్లో లేనప్పుడు జరిగిన ఓ విషయాన్ని చెప్పనా..?! అంటూ మొదలెట్టింది. ఏంటబ్బా..! అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. అది చూసిన పింకీ ఇంకాస్త ఉత్సాహంగా... ఆరోజు ఇంట్లో నాకూ, అక్కకూ, అన్నకూ ఓ పెద్ద గొడవైంది...... అంటూ ఆగింది.

"ఏంటో..." అన్నట్లుగా మొహం పెట్టాను నేను. ఏదో చిన్న విషయం దగ్గర మొదలైన గొడవ టీవీ దగ్గర ఆగిపోయింది అని చెప్పింది. "టీవీదగ్గరా...?" అని అడిగాను. అవును.. "మాటా మాటా పెరిగి నేను అసలు ఇకపై టీవీ స్విచ్ ముట్టుకునేదే లేదని తెగేసి చెప్పేశాను" అంది పింకీ.

"సర్లే..! గొడవపడైనా మంచిపని చేశావు. అలాగైనా బుద్ధిగా చదువుకుంటావు కదా..!" అన్నాను. "అమ్మా....! ఆశ, దోశె, అప్పడం, వడా...! అలాగేం జరగలేదు తెలుసా..?!" అంటూ అల్లరిగా చెప్పడం ఆపింది పింకీ.

"ఇంకేం జరిగిందే...!" అన్నాను ఆసక్తిగా... "గొడవ జరిగిన ఓ రెండు మూడు రోజులు ఇంట్లో అంతా సర్దుకుంది. అందరం ఒకరితో ఒకరం మాట్లాడేసుకుంటున్నాం... అయినా నేను టీవీ స్విచ్ ముట్టుకోనని చెప్పేశాను కాబట్టి ఆ గండం నుంచి కూడా ఎలాగైనా సరే బయటపడాలి కదా...! అని ఆలోచించాను.." చెప్పుకుపోతోంది పింకీ.

"టీవీ స్విచ్ చేతితో కదా ముట్టుకోకూడదు. ఇలా ఎందుకు చేయకూడదని ఆలోచించాను. అటకపైనుండే తాత చేతికర్రను తీసి టీవీ స్విచ్ ఆన్ చేయడం మొదలెట్టాను" చెప్పడం ఆపి నావైపు చూసింది పింకీ... అసలే గుర్రుగా ఉన్న నేను అది చెప్పిన మాట విని నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వేశాను.

నాతో జతకలిపిన పింకీ కూడా నవ్వుతూ... "ఆరోజు ఇంట్లో కూడా అందరూ ఇలాగే నవ్వారు పిన్నీ..." అంటూ నా మెడ చుట్టూ చేతులేసి, చక్కిలిగింతలు పెట్టేసి... మా ఇంటిని నవ్వులతో నింపేసింది ఆ అల్లరి అమ్మాయి.