Pages

Thursday 9 February 2012

ప్రశ్నిస్తూ, వెక్కిరిస్తూ, నిలదీస్తూ...!!


దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం మాట... ఉన్న ఊరును, కన్నవారిని విడిచి మావారితో కలిసి బ్రతుకుదెరువుకోసం చెన్నై మహానగరానికి వచ్చిన రోజులవి... అప్పట్లో భాష తెలీక ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో... చుట్టూ తెలుగువాళ్లే ఉన్నప్పటికీ.. వాళ్లు తెలుగు మాట్లాడితే తప్ప తెలుగు తెలిసినవాళ్లని తెలీనంతగా తమిళానికి అలవాటుపడిపోయారని అర్థమయ్యేందుకు చాలా రోజులే పట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడాలన్నా, ఏం అడగాలన్నా సంకోచం.. మొహమాటం.. ఒకరకమైన భీతి..

పచారీ కొట్టుకు, కూరగాయల షాపుకు వెళ్లినా... ఏం వస్తువు కావాలో దాన్ని చేత్తో చూపించి అది కావాలి, ఇది కావాలి అంటూ సైగలతో అడగటం అలవాటైపోయింది. ఆ తరువాత మెల్లిగా ఏంగే, పోంగే, వాంగే, ఎన్నాంగే, అదు ఎవళవు, ఇదెవళవు.. అంద బస్ ఎంగే పోగుమ్, ఇంద బస్ ఇంగే నిక్కిమా.... లాంటి చిన్న చిన్న పదాలు నేర్చుకున్న తరువాత కాస్తంత ధైర్యం వచ్చేసింది.

అయితే ఆ ధైర్యం వచ్చేందుకు చాలా రోజులే పట్టింది. మొదట్లో ఇరుగు, పొరుగువాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయ్యేది కాదు, మనమేం చెబుతున్నామో వాళ్లకీ అర్థం అయ్యేది కాదు. మనకంటూ సొంతవాళ్లు ఇక్కడెవరూ లేరే, మనకంటూ ఎవరూ లేకపోతే ఎలా అని దిగులుగానే కాలం వెళ్లదీయసాగాము. ఇల్లు, పని తప్ప మరోదాని జోలికి పోకుండా గుట్టుగా ఉండటానికి అలవాటుపడిపోయాం... "నీకు నేనూ, నాకు నువ్వూ" లాగా... నేనూ, మా ఆయన, ఇల్లు, పని.. వేరే లోకమే లోకుండా......

అదుగో అలాంటి పరిస్థితుల్లోనే "మీకు నేను కూడా తోడు" అంటూ వచ్చేసింది "కుట్టి". పక్కింటి ఇంజనీర్ గోపీ అతని ముస్లిం శ్రీమతి వహీదా ముద్దు ముద్దుగా పెంచుకుంటున్న బుజ్జి కుక్కపిల్లే కుట్టి (ఈ పేరు మేమే దానికి పెట్టుకున్నాం). పక్కింట్లో ఉంటున్నందుకు అది మాతో అప్పుడప్పుడూ సావాసం చేసేది. ఆ మధ్యనే లవ్ మ్యారేజ్ చేసుకున్న వహీదా దంపతులు సాయంత్రాలు, సెలవు రోజుల్లో విహారానికి వెళ్లేటప్పుడు కుట్టిని మా దగ్గరే వదిలి వెళ్లేవాళ్లు.. ఒక్కోసారి మీ దగ్గరే ఉంచుకోమని అభ్యర్థించేవాళ్లు.

అనువాదాలు, ఫ్రూఫ్ రీడింగ్‌ల భారంతో ఉండే మా ఆయనకు, ఇంటి పనుల ఒత్తిడితో ఉండే నాకు... దగ్గరకు రానిచ్చే మనిషి ఎవరయినా ఫర్వాలేదు నమ్మేస్తాను అన్నట్లుండే కుట్టీకి ఎలాగైతేనేం పొత్తు కుదిరేసింది. ఆ పొత్తు ముదిరి పాకానపడి గోపీ వాళ్ల ఇంట్లో ఉండేకంటే, మా ఇంట్లో ఉండేందుకే అది ఇష్టపడేది. మద్రాసులో మాకెవరూ లేకపోవడం, ఒకవేళ ఎవరితోనయినా మాట్లాడదామంటే భాష సమస్య, తెలుగోళ్లు అని తెలిస్తే తమిళమోళ్లు ఎక్కడ మోసేస్తారో అనే భయం మాలోంచి పోని ఆ టైంలో..... మీకు నేనున్నానంటూ మా ఇంట్లో కాలు పెట్టింది కుట్టి.

చిన్నప్పటినుంచీ సహజంగానే పిల్లి, కుక్క కనిపిస్తే చాలు నన్ను నేనే మర్చిపోయేదాన్ని.. అలాంటిది కుట్టి వస్తే కాదంటానా.. సో.. ఆ రకంగా నాకో మంచి తోడు దొరికేసింది. కుట్టి అలా మాకు ఎంత దగ్గరయ్యిందంటే... మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటే మా మధ్యలో దూరి మరీ పడుకునే రాజసాన్ని దక్కించుకుంది. దాన్ని ఎక్కువగా ముద్దు చేస్తే నెత్తికెక్కుతుంది, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి అని గోపీ దంపతులు చెబుతున్నా మా చెవులకు ఏ మాత్రం ఎక్కేవి కావు.


అలా రోజులు గడుస్తున్నకొద్దీ చిన్న చిన్న సమస్యలు తలెత్తసాగాయి. ఆదిమ జంతు జీవనంతో తెగతెంపులు చేసుకున్న మాకూ, తన జాతి లక్షణాలను ఏమాత్రం మార్చుకోని కుట్టీకి మధ్య తగవులు మొదలయ్యాయి. శుభ్రత అంటే ఇష్టపడే నాకూ, ప్రాణం పోయినా సరే నా అలవాట్లు మానుకోనుగాక మానుకోను అని హఠం పట్టిన ఆ కుట్టిపిల్లదానికి ఓ శుభముహూర్తంలో తగవు ముదిరింది.

మధ్యలో పడుకోబెడితే బుద్ధిగా ఉండాల్సిందిపోయి.. సైలెంట్‌గా ఎక్కడపడితే అక్కడ పాస్ పోసేసేది.. మా మధ్యలో పడుకుంటే వెచ్చగా ఉండే సుఖానికి, స్వేచ్ఛగా ఇది తన ఇల్లు అనుకునే గర్వం తోడయ్యిందో ఏమోగానీ... కొన్నాళ్లకు ఆ రెండోది కూడా కానిచ్చేయటం మొదలెట్టేసింది. అప్పటికీ ఊరుకున్నా.. ఎక్కడపడితే అక్కడ కానిచ్చేయటం చేయసాగింది.

ఏదో పోనీలే.. మాకూ తోడు లేదు, దానికీ తోడు లేదు..యజమానులు తమ షికారు యావలో దాన్ని పట్టించుకునే సమయంలేదు. పాపం మనదగ్గరయినా ఉంటుంది అని జాలి చూపించి మరీ ఆహ్వానిస్తే ఇలా చేస్తుందా అని నాకు ఒకటే కోపం. మా ఆయనకేం పోయింది శుభ్రం చేసుకోవాల్సింది నేనే కదా. దాన్ని నేనేమయినా అంటే మాట పడనిచ్చేవారు కారు. పోనీ దాన్ని ఎక్కడయినా కాస్త దూరంలో కట్టేద్దాము అనుకుంటే మద్రాసులో సగటు మనిషి అద్దె ఇళ్లు మనుషులకే సరిపోవు ఇక పిల్లులకు, కుక్కలకు వేరే విరామ స్థలాలు అంటే మాటలా. బయటికి తీసుకెళ్దామా అన్నా కూడా ఇబ్బందే.

మొత్తంమీద కుట్టి విశ్వరూపం ఇలా కొత్తకోణంలో కనిపించడంతో దానికి, నాకూ మధ్య అగాథం కొద్ది కొద్దిగా పెరగడం మొదలుపెట్టింది. అసలు పాస్ పోయటమే వద్దనుకుంటే ఇక రెండోదానికి కూడా సిద్ధపడిపోయిందే పిల్లది అంటూ మొదట్లో కసుర్లు, విసుర్లు మొదలయ్యాయి. ఒకటో పనికి దిగీదిగకముందే గట్టిగా అరవడం, తర్జనితో బెదిరించడం, చూపులతోటే భయపెట్టడం. ఊహూ.. అసలే తోకవంకరది. ఇలాంటి బుడ్డబెదిరింపులకు అది లొంగుతుందా.. నీ పని నీది నా పని నీది అనిపించేలా తన పని తాను కొనసాగించిందది.


ఇక ఓపిక నశించిపోయి ఇష్టం లేకపోయినా, బాధ కలిగినా చేసేదేం లేక చురుగ్గా దెబ్బలు మొదలెట్టేశాను. హాయిగా నిద్రపోతున్నప్పుడో, అన్నం తింటున్నప్పుడో, విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడో అది ఒకటీ, రెండు కానివ్వడం ప్రతిఫలాన్ని వెంటనే అందుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. అయితే ఏ చర్యకైనా, కార్యానికైనా, పరిణామానికైనా ఒక ఆదీ, ఒక అంతమూ ఉంటాయి కదా.. ఒకరోజు అది కూడా సంభవించింది.

ఆ కుక్కపిల్లకు ఆ రోజు దెబ్బలు తినాలని రాసి ఉందో (?) లేక విచక్షణా రహిత కోపం పనికిరాదని నాకు రుజువు కావాలని ఉందో కాని, ఆ రోజు దానికి దెబ్బలు పడ్డాయి. ఇంట్లో కూర్చుని డిటిపి పని చేసుకునే పరిస్థితి కదా... మధ్యాహ్నం తిండి తిప్పల తర్వాత కాస్సేపు నిద్రించే అలవాటు వచ్చేసింది మాకు. అలా మాగన్నుగా నిద్రపోతున్నప్పుడు అది తన పని కానిచ్చేసింది. తన స్వేచ్ఛ ఇతరుల నిద్రకు సైతం భంగం కలిగిస్తుందని పాపం దానికి తెలియదాయె.

ఇంకేముంది అన్ని రోజుల కోపం, అణచి పెట్టుకుని ఉన్న కోపం నాలో పెల్లుబుకి వచ్చింది. ఏం చేస్తున్నానో కూడా తెలియని ఆవేశంతో ఆ పిల్లదానికి ఒకటే దెబ్బలు. ఎక్కడ తగులుతాయో అని చూసుకోకుండా చేతితో బాదేశాను. కుయ్యో కుయ్యో అని మొత్తుకున్న కుట్టి... చివరకు దెబ్బల స్థాయి మోతాదు మించిందేమో.. అరవడం కూడా ఆపివేసి కూలబడిపోయింది.

అన్నాళ్లుగా దాన్ని తప్పు చేస్తోందని కొట్టడం సరికాదని చెబుతూ వచ్చారు మా ఆయన. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో కుక్కలను పెంచనే కూడదని, పెంచితే దాని స్వేచ్ఛను మనం అరికట్టలేమని, దెబ్బలతో అస్సలు అరికట్టకూడదని పదే పదే చెబుతూ వచ్చినా నేను వినలేదు. అదలా దెబ్బతిని ప్రాణం తీసుకుంటే తర్వాత దాని యజమానుల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భయం ఆయనలో కోపంగా మారి, నన్ను నానా మాటలూ అనేశారు.

ముందే చెప్పానుగా, కుక్కపిల్లపై అతి ప్రేమ వద్దని, ఉన్నా దాన్ని మన పక్కలో పడుకోబెట్టుకోవద్దని, పక్కనే పడుకోబెట్టుకుంటే దాని ఫలితాలను అనుభవించక తప్పదని, రెండు రకాల స్వేచ్ఛలు ఒకే ఇరుకుగదిలో ఇమడవని, ఎక్కడ అతి ప్రేమ ఉంటుందో అక్కడ అతి ద్వేషం పొంచుకుని కూర్చొని ఉంటుందని, జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదని... ఇలా వరుసగా తిట్ల దండకం ప్రారంభించారు.


పాపం... అది తప్పెక్కడ జరిగిందో తనకే తెలీని స్థితిలో దెబ్బల బాధ తట్టుకోలేక నోటిమాట లేక ముడుచుకు పోయింది. నా ప్రేమ వికటిస్తే దానికి దెబ్బలేమిటి? మామూలుగా అయితే మాటకు మాట ఇవ్వడంలో, బంతిని రివర్స్ చేయడంలో ఆయనకే మాత్రం తీసిపోని నేను, నా తప్పును గ్రహించిన స్థితిలోనో... లేక అంత అమానుషంగా పిల్లదాన్ని బాదిన చర్యకు నాపై నాకే కోపం కలిగిందో కానీ... ఆ రోజు మాత్రం బిక్కచచ్చిపోయి నోటి మాట లేకుండా చూస్తూండి పోయాను. (అన్నాళ్లుగా అంత సైలెంట్‌గా జీవిస్తూ వచ్చిన మేం ఆరోజు ఎందుకు అలా అంత పెద్ద ఘర్షణకు దిగామని మా ఇరుగింటి పొరుగింటి వారు రోజుల తరబడి చర్చ పెట్టుకున్నారట. కుక్క బాధలు, కుక్కతో సంబంధంతో వచ్చే బాధలు వాళ్లకేం తెలుసు మరి)

తిట్ల దుమారం ముగిసింది. తిట్టినవారు, తిట్లు తిన్నవారు, దెబ్బలు తగిలించుకున్నవారు అంతా సద్దులేకుండా ఉండిపోయాం. దుమారం రేగి వెలిసి పోయినట్లయింది. ఎవరికి వారు మౌనంగా తలదించుకుని చూస్తుండిపోయాం. పాపం అది తల దించి నీరసంగా పడుకునిపోయింది. ఎంతగా భయపడిపోయిందంటే అది కళ్లుమూసుకుని కూడా వణుకుతోంది. దాని తల్లే దగ్గర ఉంటే అది అన్ని దెబ్బలు తినేదా.. ఎవరైనా దాని మీద పడితే దాని తల్లి ఊరుకుని ఉండేదా... కాస్తంత కనికరం కూడా నాకు లేకపోయిందే అని ఒకటే బాధ... తరువాత ఏడుపూ ముంచుకొచ్చాయి.

నేనూ, ఆయనా ఇద్దరం మూగగా దానికేసి చూస్తూ గోడకు చారగిలబడి కూర్చుండిపోయాం. మెల్లగా దాని కళ్లలో నీళ్లు.. చుక్క చుక్కగా కారుతూ కన్నీళ్లు.. ఇక తట్టుకోవడం నా వల్ల కాలేదు. భోరుమంటూ దాన్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్లిపోయాను. దాన్ని శుభ్రం చేసి, గుండెలమీద పడుకోబెట్టుకుని జోకొడుతూ ఓదార్చాను. దాని కళ్లలోకి చూస్తూ నేనూ.. నా కళ్లలోకి చూస్తూ అది.. ఎంతసేపు గడిపామో తెలీదు.


ఆరోజునుంచి ఆ కుట్టిపిల్ల తిట్లు పడలేదు. దెబ్బలు తినలేదు. నమ్మి మా యింట్లోకి వచ్చిన అది ఇలా చావుదెబ్బలు తిన్నాక, తిరిగీ మమ్మల్ని నమ్మడానికి దానికి అయిదారురోజులు పట్టింది. మౌనంగానే తిరిగి సావాసం చేశాం. మరింతగా దానికి తిండి పెట్టడం. ఒక ఉత్పాతం తర్వాత తిరిగి ఏర్పడిన మా కొత్త సంబంధంలో మార్పులు వాటికవే చోటుచేసుకున్నాయి.

మా హద్దులు మేం దాటలేదు. దాని హద్దులు అది దాటలేదు. ప్రకృతి పిలుపు వంటి సందర్భాల్లో అది అసాధారణంగా ప్రవర్తించే తీరును ముందే పసిగట్టి దానికో చోటు కేటాయించేవాళ్లం. మరోవైపు అది సైతం మళ్లీ దెబ్బలు తినకూడదు అనే కండిషన్‌కి గురయిందో ఏమో, ఒకటీ రెండూ పనుల వ్యవహారం ముగించుకోవలసిన పరిస్థితుల్లో అలెర్టయిపోయి పక్కకు వెళ్లిపోవడం నేర్చేకుంది.

మనిషికోసం, మద్రాసు జీవితంలో మాట్లాడేవారి కోసం మేం పడ్డ తపనకు ఫలితంగా ఆ కుక్కపిల్లతో మాకేర్పడిన అనుబంధం ఆపై ఎక్కువ రోజులు సాగలేదు. ఓ ఇరవై రోజుల తర్వాత దాని యజమానులు గోపీ, వహీదాలు వేరే ఇంటికి మారిపోయారు. వారితో పాటు కుట్టి కూడా. అయితే ఆ ఇరవై రోజుల్లో మా అనుబంధం తిరిగి ఎంతగా అల్లుకుపోయిందంటే....అది పక్కింట్లోని యజమానుల వద్దకు వెళ్లడానికే నిరాకరించేది. అన్ని వేళలా మా దగ్గరే...

http://offthewallposters.com/data/media/469/1024%20-%20Sleeping%20Puppy%201.jpg

ఒక పిడుగుపాటు తర్వాత మామధ్య జరిగిన నెలకొన్న సంబంధం మనిషికి జంతువుకు మధ్య సంబంధ బాంధవ్యాలను నూతన స్థాయికి తీసుకువెళ్లింది. దానికి మేం... మాకు అది...దానికి సంతోషం కలిగినప్పుడల్లా మా ముఖంలో కళ్లు పెట్టి చూస్తుండిపోయేది. మేమూ దాన్ని అలాగే పొదివి పట్టుకునేవాళ్లం.. అది శాశ్వతం కాదు అనే విషయం దానికి తెలీలేదు. కానీ, ఒక అద్దె ఇంటినుంచి మరో అద్దె ఇంటికి మారవలసిన నగర జీవితం అనుబంధాలను, పరిచయాలను తగిన హద్దుల్లోనే ఉంచుతుందని మాకు త్వరలోనే అర్థమైంది.


అలా ఇరవైరోజులు గడిపిన తర్వాత వాళ్లు ఇల్లు ఖాళీ చేసి కొత్త మజిలీకి వెళ్లిపోయారు. వెళుతూ తాము చేరుతున్న కొత్త ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వస్తామని కొత్త ఇంటికి తీసుకు పోతామని చెప్పారు. అయితే ఏమైందో కాని వాళ్లు నెలరోజులుగా ఈ వైపు తిరిగి చూడలేదు.. కుక్కపిల్ల జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కలుక్కుమనేది మాకు.

మాకంటూ ఎవరూ లేని, మేం మనసు విప్పి మాట్లాడలేని మా తొలి మద్రాసు జీవితంలో ఆప్తబంధువులా మా ఇంట అడుగుపెట్టిందది. ఒక బాధాకరమైన అనుభవం అనంతరం, జంతువుకు, మనిషికి తరతరాలుగా అల్లుకుపోతూ వస్తున్న అమృత క్షణాలను ఇరువైపులా ఆస్వాదించాం. కానీ, ఎవరికెవరు ఈ లోకంలో.... అని ఓ సినీ కవి అన్నట్లుగా అది మా జీవితం నుంచి తప్పుకుంది. దాని ప్రమేయం, మా ప్రమేయం లేని పరిస్థితుల్లో అది దూరమైంది. మెరుపులా వచ్చి మెరుపులాగే మాయమైంది. అది ఎలా ఉందో, ఏం చేస్తోందో, వహీదా దంపతులు తమ నూతన దాంపత్య జీవితంలోని సుఖాలను వెతుక్కుంటూ వారు ముందులాగే దాని ఆలనా పాలనా సరిగా చూడకుండా వదిలేశారేమో. రకరకాల శంకలు మాకు.

ఒక రోజు ఉరుములు మెరుపులు లేని వానలా ఊడిపడ్డది వహీదా.... దాదాపు నెలరోజులు తర్వాత...మా యింటి కొచ్చింది. కొత్త ఇంటి చిరునామా ఇచ్చి రేపు ఉదయం తప్పక రావాల్సిందిగా ఆహ్వానించింది. రాగానే ఆమెను అడిగిన ప్రశ్న... కుట్టి బాగుందా....? దానికామె ...కొత్త ఇంటిలో చేరాం.. అపార్ట్‌మెంట్ అది. కానీ ఇది ఇల్లంతా పాడు చేస్తోంది. అందుకే ఇంట్లోనే ఒకచోట కట్టేశాం.... అంది. ఎక్కడో కాస్త బాధ.. కాని బయటపడకుండా రేపు తప్పక వస్తామని చెప్పాము. కాస్సేపుండి ఆమె వెళ్లిపోయాక కుట్టి అక్కడ పడుతున్న బాధలను మావిగా ఫీలయ్యాం....ఏదేమైనా అది వాళ్ల కుక్క..వాళ్ల పెంపకం. అంతే అని సరిపెట్టుకున్నాం. కుట్టి కోసమైనా సరే ఎలా ఉందో ఓసారి చూసివద్దాం అని బయలుదేరాలనుకున్నాం.

ఆ మరుసటి రోజు... ఉదయాన్నే.... 8 గంటల వేళ వహీదా ఇచ్చిన చిరునామా పట్టుకుని వాళ్ల అపార్ట్‌మెంట్‌కు వెళ్లాం. వహీదా తలుపుతీసింది. లోపలకు అడుగుపెట్టాం. కుట్టికోసం మా కళ్లు వెతకసాగాయి...హాల్లో ఒకచోట తాడుతో కట్టేసిన కుట్టి. మా ఇద్దరికీ దిగ్ర్బాంతి...అది మా కుట్టీనేనా..మేం పెంచిన కుట్టీనా ఇది... బక్క చిక్కిపోయి, ఎముకలు బయటకు కనపడుతూ...శవాకారంలో.... మాకేసి చూస్తోంది..గుర్తు పట్టేసింది.


అప్పుడో కేక...కంఠనాళం చించుకుపోయేంత గట్టిగా.. ఎక్కడ శక్తిని దాచుకుని ఉందో...అది ఎగిరిన ఎగురుకు తాడు పట్‌మని తెగింది. అదే ఊపున మా వైపు దూకింది. ఎగిరి మమ్మల్నికరుచుకుపోయింది. బిత్తరపోయి చూస్తున్నాం... అది చూస్తోంది. వాసన పడుతోంది. కళ్ళలో కళ్లు పెట్టి మరీ.....ఏడుస్తోంది.. ఆనందంతో, శోకంతో... మనిషి పొడ అప్పుడే చూసినట్లుగా... తప్పిపోయిన ఆత్మబంధువులను అప్పుడే కలుసుకున్నట్లుగా...బుల్లెట్ వేగంతో తోక తిప్పుతూ...

ఏం చేయాలో మాకు పాలుబోవడం లేదు. దీన్నేనా కొట్టింది... దీన్నేనా తిట్టింది...దీన్నేనా దూరం పెట్టబోయింది.... పూర్వ జన్మపై మాకు నమ్మకం లేకపోయినా, కాని ఇది ఏ జన్మ సంబంధం...ఎవరు కల్పించిన బాంధవ్యం...మా చేత తిట్లు తిన్న ఆ చిన్నపిల్ల, ఘోరంగా దెబ్బలు తిన్న ఆ తల్లిలేని పిల్ల... మేం ఏం చేసినా సహించి క్షమించివేసిన ఆ ఆదిమ జంతువు... జీవితాంతం మర్చిపోని పాఠం నేర్పుతూ మమ్మల్ని నాకుతోంది. వాసన చూస్తోంది...

నాగరికతకు అనాగరికతకు వార చెరిగిపోయిన ఆ అనిర్వచనీయ క్షణాల్లో ఒక శోకాగ్ని మమ్మల్ని దహించివేసింది.. అది జంతు, మానవ బంధాన్ని కదిలించివేసిన స్నేహాగ్ని. అది తన కన్నీళ్లతో, చుంబనంతో, వాసనతో, మా సమస్త పాపాలను కడిగివేసిన దివ్యాగ్ని... కొద్ది రోజులు దానికి అన్నం పెట్టాం...అక్కున చేర్చుకున్నాం.... పక్కన పడుకోబెట్టుకున్నాం.. అంతకు మించి మేం ఏమీ చేయలేదు దానికి. ఈ మాత్రానికే అది తన రుణం ఇలా తీర్చుకుంది. పసిపిల్ల అని కూడా చూసుకోకుండా హింసించిన మా ఘోరాపరాధాన్ని అది ఇలా మన్నించింది. నిండుమనసుతో మమ్మల్ని క్షమించింది...

సమస్త విలువలూ నా చుట్టూ గిర్రున తిరుగుతున్నాయి. ప్రశ్నిస్తూ, వెక్కిరిస్తూ, నిలదీస్తూ.... విశ్వాసం అనే విలువను ఓ శునకం మానవజాతికి రుచిచూపిన దివ్యక్షణాలవి.. ఒక కుక్క పిల్ల మనిషి పట్ల చూపించిన ఔన్నత్యం అది... మనిషి తోటి మనిషిపై ఇలాంటి విశ్వాసం చూపగలడా? మనిషి తోటి మనిషిని ఆ పసిదానిలాగా విశ్వసించగలడా? ఆ పసిదానిలాగా చేసిన మేలును గుర్తుపెట్టుకోగలడా?

పునఃకలయికతో తడిసి ముద్దయిన ఆ అమర క్షణాలనుంచి బయటపడి విషయం కనుక్కుంటే తెలిసింది. ఆ కుక్కపిల్ల ఎందుకు అంత శవాకారంలా తయారయ్యింది అంటే... మూడు పూటలా తిండి పెడితే అది ఎక్కడంటే అక్కడ హాల్లో రెండోది కానిచ్సేస్తోందట. ఇక్కడ చరిత్ర మనకు గుర్తుకు రావటం లేదూ... బానిసలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ పనిపట్ల అలక్ష్యం వహిస్తారో అని బానిస యజమానులు వారిని ఒంటిపూట భోజనంతో రాతి గుహల్లో బంధించేవారని చదువుకోలేదూ మనం..

తన ప్రేమ కోసం తల్లిదండ్రులనే వదులుకుని హిందువుతో సహజీవనం కోసం మద్రాసుకు వచ్చేసిన వహీదా... ఒక ప్రాణికి జీవితం కల్పించడం అనే దృష్టితో కాక...ఒక స్టేటస్ కోసమే కుక్కపిల్లను పెంచుకోవడం ప్రారంభించిన వహీదా... తనకు దురుద్దేశాలు లేకపోయినా... కుక్కపిల్లకూ స్వేచ్ఛ ఉంటుందని, జాతి సహజాతాలు దానిపై పనిచేస్తుంటాయని గ్రహించని సగటు మనిషి వహీదా... ఇంటిని అశుభ్రపరుస్తోందన్న అన్యాయపు మిషతో దాన్ని బంధించటమే కాదు...తిండి కట్టిపెట్టి మాడ్చి మరీ దాన్ని శవాకారంగా చేసేసింది.


ఇది వహీదా తప్పు కాదు...ఇది ముస్లిం మహిళ తప్పు అంతకంటే కాదు.. ఇది మనుషుల తప్పు.. జంతువుల స్వేచ్ఛను గుర్తించని మనిషి తప్పు... నువ్వు జంతువును ప్రేమించదలిస్తే, పెంచదలిస్తే.. జంతుజీవితపు అలవాట్లను కూడా ప్రేమించాలి.. దాని "అనాగరిక" లక్షణాలను ప్రేమించాలి. జంతు సంస్కృతి, మనుషుల సంస్కృతి రెండూ ఎప్పటికీ ఒకటిగా ఉండవన్న ఎరుకతో ప్రేమించాలి.

ఇది తెలియనప్పుడు మనుషులు వహీదాలాగో.. అలాంటి మరో మనిషిలాగో.. మాత్రమే ఉంటారు. లోపాలను, లేదా లోపాలు అని మనం భావిస్తున్న వాటితో సహా మనుషులను లేదా జంతువులను అన్ని కోణాలనుంచి మనం ప్రేమించలేకపోతే మనం జంతువునూ అర్థం చేసుకోలేం, మనిషినీ ప్రేమించలేం... లోపాన్ని మనం ప్రేమించలేకపోతే... ఆ లోపాన్ని మనం నివారించే వైపుగా అడుగు వేయలేం..

ఆ కుక్కపిల్లను తన నమ్మకాల ప్రకారం శవాకారంగా మార్చిన వహీదా...అచిరకాలంలోనే తన దాంపత్య జీవితాన్ని రద్దు చేసుకోవలసిన విపత్కర స్థితిలో కూరుకుపోయింది. కుక్క పిల్ల ఉసురు తగిలిందని కాదు. భర్త ఆఫీసులో తోటి సహ ఉద్యోగినులతో చనువుగా ఉంటున్నాడని అనుమానంతో మొదలైన ఆమె దాంపత్య జీవితం అది కేవలం అనుమానమో లేదా సత్యమో మాకు తెలియని విపత్కర పరిణామాల వెల్లువలో కూరుకుపోయి...తిరిగి తాను వదిలిపెట్టేసిన తల్లిదండ్రుల వద్దకే చేరింది. జంతువైనా, మనిషైనా భరించాల్సిన సామాజిక సంక్షోభాల యుగం కదా ఇది...

ఆ తర్వాత వాళ్లు, వాళ్లతో పాటు ఆ కుక్క ఏమైపోయారో ఇప్పుడెలా ఉన్నారో మాకు తెలీదు. మద్రాసు నలుమూలలా అద్దె ఇళ్లు మారుతూ జీవితం ఎలా తంతే ఆ వైపుకు పరుగెడుతూ ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తూ వచ్చిన మాకు తర్వాత వారి విశేషాలు తెలీవు..

ఒకటి మాత్రం నిజం వాళ్లు  ఉంటారు. గోపీ, వహీదా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. కలిసో, విడిపోయో... కానీ...
http://www.upickreviews.com/_images//dog-training/cute-puppy-photo.jpg
మా కుట్టీ ఇప్పుడు ఎక్కడుందో.. అస్సలు... ఉందో లేదో...

పదిహేడు సంవత్సరాల క్రితం ఇది ముగిసిపోయినా... ఇప్పుడే జరిగినట్లు.. కుట్టి మమ్మల్ని ఇంకా వాసన చూస్తున్నట్లు... కళ్లల్లోకి తొంగిచూస్తున్నట్లు...ఆనందంతో తోక తిప్పుతున్నట్లు... మా మధ్యనే తిరుగాడుతున్నట్లు అనిపిస్తూనే ఉంటోంది...
.