Pages

Friday 31 December 2010

సరికొత్త అధ్యాయానికి స్వాగతం.. సుస్వాగతం...!!


జీవితం అనే పుస్తకంలో
రోజులనే పేజీలకు...
సంవత్సరాలనే అధ్యాయాలకు
స్వాగతం... సుస్వాగతం...!

కొత్తదనం.. తాజాదనం
కలలు.. కల్పనలు
తగవులు... రాజీలు
అలకలు... అగచాట్లు
ఊహలు.. వాస్తవాలు
అనుభవాలు.. అనుభూతులు
ప్రేమ.. నమ్మకం

ఇవే కొత్త సంవత్సరానికి
సరికొత్త నాందీ....!!

****************************

ఎట్టకేలకు మరో కొత్త పుస్తకాన్ని తెరవబోతున్నాం
ఈ పుస్తకంలో పేజీలన్నీ కొత్తగా, ఖాళీగా ఉన్నాయి
కానీ... అవన్నీ మన కోసం, మనం రాసుకునే మాటల కోసమే...!

 ఆ పుస్తకానికి "అవకాశం" అని పేరు
అందులో మొదటి అధ్యాయం "కొత్త సంవత్సరం"

ఈ కొత్త సంవత్సరం
మంచి భవిష్యత్తును, ప్రేమ, ఆప్యాయతలను
మనశ్శాంతిని.. సంవత్సరమంతా సంతోషాన్ని
ఇవ్వాలని మనసారా కోరుకుంటూ....
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...!!

Monday 27 December 2010

జ్ఞాపకాల అలజడిలో....!!

"ఏమీ కాదులే అనిపిస్తున్నా... మనసులో ఏదో ఒక మూలన భయం. ఆరేళ్లయింది కదా... మళ్ళీ ఇప్పుడెందుకు అలా జరుగుతుందిలే..." లాంటి అంతూ, పొంతూ లేని ఆలోచనలతో మొన్న రాత్రి కలతలోనే నిద్రపోయా. పొద్దున్నే మెలకువ వచ్చేసరికి అంతా ప్రశాంతంగా, రోజులాగే ఉంది. హమ్మయ్య...! ఏమీ జరగలేదు అన్న నిశ్చింతతో రోజువారీ పనుల్లో మునిగిపోయాను.

శనివారంనాడు ప్రజలంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకున్నారు కానీ ఏదో మూల కాస్తంత భయంతోనే ఉన్నారు. అయితే... ఓ ఆరేళ్ల క్రితం క్రిస్మస్ పండుగను సంబరంగా జరుపుకున్న వీరికి భయం ఆనవాళ్ళే లేవు. ఎందుకంటే, ఆ మరుసటి రోజున ఓ పెను ప్రళయం సంభవించి, తమ జీవితాలను అతలాకుతలం చేస్తుందన్న బెంగ వారికి లేదు కాబట్టి...!

సో.. మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందనే అనుకుంటాను. నేను చెప్పేది 2004లో కడలి విలయతాండవం చేసి సునామీగా విరుచుకుపడ్డ దుర్ఘటన గురించి. ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షినైన నేను ఆ జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకువచ్చే చిన్న ప్రయత్నం...!


ఆరోజు డిసెంబర్ 26వ తేదీ ఆదివారం. తెలతెలవారుతుండగా, బాగా నిద్రలో ఉండగానే మంచాన్ని ఎవరో కాస్త కదిలించినట్లు అనిపించినా మగతగా ఉండటంతో అలాగే నిద్రపోయాను. కానీ, మా ఆయన మాత్రం లేచి కూర్చుండిపోయారట. 7 గంటలకు నిద్రలేచి కాఫీ తాగిన తరువాత ఆయన మాంసం కొనుక్కొచ్చేందుకు బజారుకు వెళ్ళారు.

నేను ఇంట్లో పనుల్లో మునిగిపోయాను. ఇంతలో బయటినుంచి ఎవరివో అరుపులు, కేకలు... ఆదివారం కదా... జనాలు బాగా ఉత్సాహంగా ఉన్నట్లున్నార్లే అనుకుంటూ, అలాగే ఉండిపోయాను. అయితే మళ్ళీ అవే అరుపులు, కేకలు.. బయట బాల్కనీలోకి వచ్చే చూస్తే... "కడల్ పొంగుదు" (సముద్రం పొంగుతోంది) అంటూ ఉరుకులు, పరుగులతో పారిపోతున్నారు.

సముద్రం పొంగటం ఏంటబ్బా... అనుకుని చూద్దును కదా...! మా ఇంటి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు గుండా వందలాదిమంది జనాలు తడిచి ముద్దయిపోయి, చేతికి అందినదల్లా పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇంకాస్త పరికించి చూస్తే... ఇంటికి ఎదురుగా కాస్తంత దూరంగా, సముద్రానికి దగ్గరగా ఉండే పట్టినంబాక్కం బస్ డిపో నీటితో మునిగిపోవడంతో... బస్సులపైకి ఎక్కి హాహాకారాలు చేస్తోన్న జనాలు చేతులు పైకెత్తి నిల్చోనుండటం స్పష్టంగా కనిపించింది.

నాకయితే ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతలో ఆయన గుర్తొచ్చారు. అయ్యో..! ఇప్పుడెలా ఆయనకు విషయం తెలుసో, లేదో.. నా పరిస్థితి ఏంటి...? మాంసం కొట్టు దగ్గరున్నారో, ఇంకెక్కడికయినా వెళ్ళారో అంటూ కంగారు పడిపోయాను. నైటీలో ఉన్న నేను డ్రస్ కూడా మార్చుకోకుండా, పైన టవల్ కప్పుకుని ఇంటికి తాళం వేసి ఆయన కోసం పరుగులు పెట్టాను.

ఇంతలో నాకు ఎదురుగా ఆయన కూడా పరుగులు పెడుతూ వస్తూ కనిపించారు. ఇద్దరం ఇంటికి వచ్చి, ముఖ్యమైన కాగితాలు, నగలు, డబ్బు, రెండు జతలు బట్టలు ఓ చిన్న సంచిలో సర్దుకుని బాల్కనీలో నిల్చున్నాం. ఎదురుగా సముద్రం గాండ్రింపు, పెద్ద పెద్ద అలలు బాగా కనిపిస్తున్నాయి.

ఇక జనాల సంగతయితే చెప్పనక్కర లేదు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని ఆ పరిస్థితిలో, ఆప్తులను కోల్పోయి తేరుకున్న మిగిలినవారు కట్టుబట్టలతో, రోదనలతో వేలాదిమందిగా మందవెల్లి బస్ డిపో వైపు పరుగులు తీస్తున్నారు. మేం ఆ పరిస్థితిని చూశాక కాళ్ళూ, చేతులూ ఆడటం లేదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో అలాగే నిల్చుండిపోయాం.

కరెంటు లేదు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. చుట్టూ ప్రపంచమంతా ఏం జరుగుతోందో, ఎందుకలా అయ్యిందో ఏమీ తెలియదు. ఇంతలో మావారి ఫ్రెండ్స్ నుంచి ఫోన్.. వాళ్ళు చెన్నైకి దూరంగా ఉండే వేరే బంధువుల ఇంటికి వెళ్తున్నారట, మీరు కూడా వస్తారా అని...? కానీ మా ఆయన ఎందుకోగానీ రానని చెప్పేశారు.

అలా నిల్చుని, గాభరాగా చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఒకామె బాగా తడిసిపోయి ఉంది. చంకలో చిన్నబిడ్డ, చేతితో ఇంకొక బిడ్డను పట్టుకుని గబగబా మెట్లు ఎక్కి మా బాల్కనీలోకి వచ్చి ఆగిపోయింది. కాసిన్ని మంచినీళ్లు ఇవ్వమని అడిగింది. నీళ్లు ఇచ్చాక కాస్త తేరుకున్న ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఏమయింది అని అడిగితే... తన ఇంకో బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోయిందని, తన భర్త కనిపించడం లేదని గుండెలు బాదుకుంటూ చెప్పింది.

ఆమెతో కలిసి ఏడవటం తప్పించి, ఏమీ చేయగలను. ఊరుకోమ్మా, మీ ఆయన వస్తాడులే అంటూ ఓదార్చాను. పిల్లాడికి కాస్తంత అన్నం పెట్టమని అడగటంతో పెట్టాను. నేను వీరిని ఇలా పరామర్శిస్తూ ఉన్నానో, లేదో మా ఆయన కనిపించటం లేదు. ఎప్పుడు కిందికి దిగి వెళ్ళిపోయారో, ఏమో... తెలియదు. కనిపించలేదు. ఇల్లు తాళం వేసి, ఏడుస్తూ ఆయన్ను వెతుక్కుంటూ అటూ, ఇటూ పరుగులెత్తాను.

మా ఇంటికి ఎదురుగా సముద్రానికి దగ్గర్లో ఉండే ఎయిర్‌టెల్ బిల్డింగ్స్ వైపు నుండి సైకిల్‌పై వస్తూ కనిపించారాయన. చూడగానే దగ్గరికెళ్లి బాగా తిట్టిపోశాను. నీళ్ళు ఎంతదాకా వచ్చాయో, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను. నీళ్ళు బిల్డింగ్స్‌కు ఇవతలదాకా నడముల్లోతు పైకే వచ్చేశాయి. నీళ్ళు బాగా వేడిగా, కుత కుత ఉడుకుతున్నట్లున్నాయని చెప్పాడు. "అయినా ఇంకా పెద్ద పెద్ద అలలు వస్తూనే ఉన్నాయి కదా.. నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా అలా వెళ్తే ఎలాగండీ" అంటూ ఆయన్ని కోపగించుకున్నాను.

ఎలాగోలా మళ్ళీ ఇల్లు చేరాము. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న జనాలను చూస్తూ... మా ఇంటిదాకా నీళ్ళు రావులే అనుకుంటూ అలాగే బాల్కనీలోనే ఉండిపోయాము. సాయంత్రం మూడు, నాలుగు గంటల దాకా జనాలు అలా పరుగులు పెడుతూ, ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. మా బిల్డింగ్‌లో కూడా జనాలంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. మేము, కింద ఇంట్లో ఒకరిద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు.


"మా ఆయనకు వైరాగ్యమో, ధైర్యమో చెప్పలేను కానీ... ఏదయితే అది అయింది. ఎంతమంది పోయారో తెలియదు. అయినా ఎవరూ, దేన్నీ ఆపలేము. మనము ఎక్కడికీ వెళ్ళవద్దు, ఇక్కడే ఉందాం.. ఏమీ జరగదులే" అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఎక్కడికీ వెళ్ళకుండా అలాగే ఉండిపోయాము. చీకటి పడింది. కరెంటు లేదు. చుట్టూ చిమ్మ చీకటి, జనాల గొంతు ఏ మూల కూడా వినిపించలేదు. సముద్రం గాండ్రింపు తప్ప మరే శబ్దమూ లేదు. భయం భయంగా ఆరోజు రాత్రి గడచిపోయింది.

మరుసటి రోజుగానీ విషయాలు తెలియలేదు. ఇండోనేషియా సముద్రంలో వచ్చిన భారీ భూకంపం వల్ల సునామీ వచ్చిందని, అందువల్లనే సముద్రం అతలాకుతలమై తీరప్రాంతాలపై విరుచుకుపడిందని తెలిసింది. సునామీ తరువాతి విషయాలు, జరిగిన ప్రాణ నష్టం అన్నీ మీ అందరికీ తెలిసిందే...!

ఆరోజు మా ఇంటి ఎదురుగా ఉన్న పట్టినంబాక్కం జాలర్ల కుటుంబాలే సునామీలో ఎక్కువగా నష్టపోయాయి. వందలాది మంది చనిపోయారు. పట్టినంబాక్కం చెరువులోనే దాదాపు 200 పైబడి శవాలను వెలికితీసినట్లు తరువాతి రోజు వార్తల్లో చూశాము. చెన్నై తీర ప్రాంతాలలో సంభవించిన సునామీ వల్ల ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం పట్టినంబాక్కమే. ఇక్కడే ఎక్కువమంది చనిపోయారు, అప్పటి సీఎం, సోనియాగాంధీ లాంటి వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించి వెళ్ళారు కూడా...!

సునామీ వచ్చిన ఓ వారం రోజుల తరువాత మా ఇంటి పక్కనే ఉండే మైలాపూర్ మార్కెట్టుకు నేనూ, పక్కింటామె కలిసి కూరగాయలు కొనేందుకు వెళ్లాం. మా పక్కనే కూరగాయలు కొంటున్న ఒకామెకు ఎవరో వచ్చి, ఏదో చెప్పారు. అంతే ఆమె ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. ఏమైందని పక్కవాళ్లను ఆరాతీస్తే సునామీ రోజున తప్పిపోయిన తన కొడుకు శవం సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిందట. అది తెలిసే ఆమె అలా ఏడుస్తూ వెళ్లిందని చెప్పారు. ఆ తరువాత నెలా, రెండు నెలలదాకా శవాలు అలా బయటపడుతూనే ఉన్నాయి.

ఆ తరువాత సంఘటనలు, జ్ఞాపకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆనాటి దుర్ఘటనకు ఆనవాళ్లుగా జాలర్ల నివాసాలు విధ్వంసమై మొండిగోడలుగా మిగిలి పలుకరిస్తున్నాయి. సునామీలో నష్టపోయిన కుటుంబాల వారికి ఆయా ప్రభుత్వాలు ఎంతమేరకు సాయం చేసాయన్నది ఈనాటికీ సముద్రం ఒడ్డున బ్రతుకును వెళ్లదీస్తున్న జాలర్లను అడిగితే వారి దగ్గరనుంచీ కన్నీళ్లు, ఆగ్రహమే సమాధానాలుగా రాక మానవు. చేపలను బుట్టల్లో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్మే ఒకామెను నేను ఇదే విషయం అడిగితే...ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా.. మళ్లీ ఈ కడలితల్లే తమకింత తిండి పెడుతోందని, అన్నం పెట్టే అమ్మే ఓ దెబ్బ కొట్టిందని అనుకుంటాం తల్లీ అని అంది.

ఇక ఆ విషయాలను పక్కనబెడితే... ఈనాటికీ మేము అదే ఇంట్లో ఉన్నాము. సునామీ వచ్చిన మరుసటి సంవత్సరం ఉన్న భయం ఆ తరువాత, తరువాత కొద్ది, కొద్గిగా తగ్గిపోయింది. సునామీ మళ్లీ ఇప్పట్లో రాదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, ఆ భీతి మాత్రం ఇప్పటికీ లోలోపలే వెంటాడుతూనే ఉంది.

Monday 20 December 2010

చెప్పాలి... గుర్తుండిపోయేలా..!!


పొద్దుట్నుంచీ ఒకటే ఆలోచన
ఏదో రాయాలి, చెప్పాలి
ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి
చెప్పాలన్న విషయంలో స్పష్టత ఉన్నా,
ఎలా ప్రారంభించాలో తెలియని అయోమయం

కానీ చెప్పాలి..
తానున్నంతవరకూ గుర్తుండిపోయేలా
అనుక్షణం గుర్తు చేస్తుండేలా
అసలు మరపు అనేదే ఎరుగకుండా
సూటిగా చెప్పాలి
కానీ ఎలా...?

రోజులా రేపు తెల్లారుతుంది
అదేం పెద్ద విషయం కాదు
ఆ రేపటిలోనే ఎంతో విషయం ఉంది
ఆ రేపటిలోనే ఎంతో జీవితం ఉంది
ఆ రేపటి రోజునే
మా ప్రియమైన పుత్నరత్నం
దేవకన్యలు తోడురాగా
ఈ భూమిమీద వాలిపోయాడు

మావాడి ప్రతి పుట్టినరోజునా
వచ్చే గిఫ్ట్‌లను చూస్తూ.. ఆ దేవుడికి
మనసులో థ్యాంక్స్ చెప్పేస్తుంటా
ఎందుకంటే...
ఆ దేవుడు చాలా పెద్ద గిఫ్ట్‌ను
తన రూపంలో మాకు ఇచ్చినందుకే...

విషయం పక్కదారిపట్టకముందే...
బ్యాచిలర్‌గా చివరి పుట్టినరోజు
జరుపుకుంటున్న ముద్దుల తనయుడా...
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది అందరూ చెప్పేదే
కానీ పెళ్లంటే...
కొత్తల్లో లోకాన్నే మర్చిపోయేలా ఉండటమూ కాదు
పాతబడేకొద్దీ అనుమానాలూ, అవమానాలూ కాదు
పెళ్లంటే ఇద్దరి మధ్య ఉండే నమ్మకం

పరస్పరం నమ్మకం, ప్రేమాభిమానాలతో
మీ జీవితం నల్లేరుమీద నడకలా
మూడు పువ్వులు, ఆరు కాయలుగా
హాయిగా, ఆనందంగా సాగిపోవాలని
ఇలాంటి పుట్టినరోజులు
మరిన్ని జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ...
విష్ యూ హ్యాపీ బర్త్ డే మై డియర్ సన్...!!
(డిసెంబర్ 21న పుట్టినరోజు జరుపుకోబోతున్న మా పుత్రరత్నానికి ఆశీస్సులతో...)

Saturday 18 December 2010

మనిషికి విలువా?


ఆకాశంలో నల్లటి మేఘాల్లాగా
నా మదిలోనూ దిగులు మబ్బులు

అమ్మా..
ఈ లోకంలో పచ్చనోట్లకున్నంత
విలువ మనుషులకు లేదు కదూ..?
రాకెట్‌కంటే వేగంగా మావాడి ప్రశ్న
ఇందాకటి దిగులుకి కారణం ఇదే

మనుషులకూ విలువుందని
అబద్ధం చెప్పలేని నిస్సహాయత
మనిషి సృష్టించిన ఆ నోట్లు
నేడు ఆ మనిషినే ఆడిస్తున్నది నిజం

లేదు నాన్నా...
పచ్చనోటుకంటే మనుషులకే విలువెక్కువని
గొంతు పెగుల్చుకుని చెప్పబోతున్నానా...
ఆస్తి కోసం తల్లినే నరికిన తనయులు
అంటూ... విషయం విషాదమైనదైనా
ముఖంనిండా నవ్వులతో
న్యూస్ రీడర్ వార్తా పఠనం..

ఎక్కడో పాతాళంలోంచి
మనుషులకే విలువెక్కువ నాన్నా
అంటూ నా మనసు ఘోషించినా
పచ్చనోటుముందు
రక్త సంబంధాలు బలాదూర్
వార్తా కథనం పచ్చిగా చెప్పేసింది..

మనసు మూగగా రోదిస్తుంటే..
ఇందాకటి దిగులు మేఘాలు
కన్నీటి జల్లులై...
మనుషులకే విలువుండే రోజులు
తప్పక వస్తాయంటూ...
నన్ను ఊరడించాయి...
ఆరోజులు వస్తాయా...?!

Thursday 16 December 2010

నేను లేకుండా.. నువ్వెళ్లగలవా...!!


మాటి మాటికీ...
వెళ్ళిపోతానంటావు
ఎక్కడికి వెళ్తావు
ఎలా వెళ్తావు
రావడం నీ ఇష్టమే..
పోవడమూ నీ ఇష్టమేనా...?!

నీకు ప్రాణం పోయడం తెలుసు
ప్రాణం తీయడమూ తెలుసు
అదెలాగంటావా...?

నా ముఖంలో పట్టరాని సంతోషాన్ని చూడు
ప్రాణం పోయడం ఏంటో తెలుస్తుంది
నా ముఖంలో భరించలేని దుఃఖాన్ని చూడు
ప్రాణం తీయడం ఏంటో చెబుతుంది

అయినా...?

కంటిపాపనొదలి కనురెప్ప దూరమవుతుందా
గుండెగది నుండి మనసు వేరుపడుతుందా

గాలినొదలి ఎంత దూరం వెళ్తావు
వెలుగునొదలి ఎక్కడ దాక్కుంటావు
నీరు లేకుండా బ్రతగ్గలవా
మాట లేకుండా మసలగలవా
చూపు లేకుండా నడవగలవా
దారి లేకుండా దాటగలవా

నేను లేకుండా.. నువ్వెళ్లగలవా...
నువ్వు లేకుండా నేను...

బ్ర....త....క....గ....ల....నా...!

Tuesday 14 December 2010

నిలువెల్లా తడిపేసే చిరు జల్లులు...!!


ఎందుకో మనసంతా శూన్యం
ఓ మూలగా నా సీటు, నేనూ
ఒకటే దిగులు.. విచారం..

ఎంత ఆలోచించినా అంతుబట్టదే
ఏమయ్యింది నాకు
ఎందుకీ నిర్లిప్తత
దేనికోసం ఆరాటం

కాసేపటికిగానీ బోధపడలేదు
అప్పటిదాకా నాతోనే ఉన్న
నా ఊపిరి కాస్తా...
అలా నడుచుకుంటూ..
మళ్లీ వస్తానంటూ
మాయమైపోయింది...

ఊపిరితో పాటు, మనసు కూడా
నవ్వుతూ తనవెంటే వెళ్లిపోయింది
నన్నొదిలేసి వెళ్లినందుకు
దానికీ దిగులేసిందే ఏమో..
మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది

చూద్దును కదా
పగలబడి నవ్వుతోంది
దిగులేసి వచ్చేశాను కానీ,
మళ్లీ వెళ్లక తప్పదు
రాకా తప్పదంది
తాను మళ్లీ రాకపోతే
ఈ ప్రాణం నిలవదని
దానికి మాత్రమే తెలుసు మరి...!

అందుకేనేమో...
కాసేపటి ముందున్న నల్లటి మేఘాలు
సంతోషపు జల్లులై
నన్ను నిలువెల్లా తడిపేస్తున్నాయి.......!!!!!

Monday 13 December 2010

ఏమయ్యావు... ఎక్కడున్నావు...?!

ఆఫీసుకెళ్లే దార్లో ఎప్పట్లాగే రోడ్డుపక్కగా ఉండే ఫ్లాట్‌ఫాంవైపు చూశాను. ఎప్పుడూ కనిపించే నడుం ఒంగిపోయిన ఓ మనిషి ఆరోజు కనిపించలేదు. ఆరోజే కాదు ఆ తరువాత ఓ నెల రోజులైనప్పటికీ ఆ మనిషి జాడే లేదు. పాపం ఏమై ఉంటుంది? అని అనుకోని రోజే లేదు.

ఆ దారి వెంబడి వెళ్తున్నప్పుడల్లా ఆ మనిషి గుర్తొస్తుంటాడు. అతడు నాకు కనిపించే ఆ స్థలం ఖాళీగా, బోసిగా, ఏదో లేని లోటుగా కనిపిస్తుంటుంది. అతనెవరో కాదు, ఫ్లాట్‌ఫాంపైన కూరగాయలను చిన్న చిన్న కుప్పలుగా పోసి అమ్మే ఓ ముసలాయన. కుటుంబ భారాన్ని ఎంతగా మోస్తున్నాడో ఏమో, అతడి నడుము భాగం కూడా అంతే భారంగా కింది ఒంగిపోయి ఉంటుంది.

ప్రతిరోజూ ఆఫీసు నుండి ఇంటికెళ్లేటప్పుడల్లా ఆ పెద్దాయన తన దగ్గర కూరగాయలు కొనుక్కోమని పిలిచేవాడు. ఒక్కోరోజు కొనుక్కోవడం, ఇంకో రోజు వెళ్ళిపోవడం చేసేదాన్ని. ఎప్పుడైనా బస్ ఛార్జీలకు చిల్లర దొరకకపోతే, పక్కనుండే పండ్ల షాపుల వారిని నేను అడుగుతుంటే, పెద్దాయన పిలిచి మరీ చిల్లర ఇచ్చేవాడు. ఒక్కోసారి అడగకపోయినా చిల్లర కావాలా అంటూ ఇచ్చేవాడు.

ఆ రోజు కూడా ఆఫీసు వదలి ఇంటికెళ్తున్నాం. నేనూ, మా అబ్బాయి బస్ కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాం. ఇంతలో ఒకటే అరుపులు వెనక్కి తిరిగి చూస్తే... ఆ పెద్దాయనతో ఓ పాతికేళ్ల కుర్రాడు ఏదో సీరియస్‌గా వాదిస్తున్నాడు. ఈ పెద్దాయన కూడా ఏమీ తగ్గడం లేదు. మాటకు మాట సమాధానం ఇస్తున్నాడు.

ఉన్నట్టుండి ఆ కుర్రాడు ఓ పెద్ద బండరాయి తీసుకుని పెద్దాయనపైకి ఉరికివచ్చాడు. అప్పటిదాకా కాస్త ధైర్యంగానే నిలువరించిన ఆ పెద్దాయన ఒక్కసారిగా భయపడిపోయి... వాడు ఏమైనా చేస్తాడో ఏమోనని గబగబా ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి పరుగెత్తుకుంటూ పోయాడు.

ఆ కుర్రాడు బండరాయితోనే పరుగెత్తుకుంటూ ముసలాయనను వెంబడించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరించటంతో రాయి కిందపడేసి నిల్చున్నాడు. హమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ, ముసలాయన తన చోటుకు తిరిగి వచ్చాడు. కానిస్టేబుల్ హెచ్చరికతో కాసేపు గమ్ముగా ఉన్న ఆ కుర్రాడు మళ్లీ ముసలాయన వద్దకు వచ్చాడు.

ఈసారి బెదిరింపుల్ని కట్టిపెట్టిన ఆ కుర్రాడు... ఓ 50 రూపాయలు లేదా కనీసం 20 రూపాయలైనా సరే ఇవ్వమని ముసలాయన్ను దీనంగా అడుక్కోవడం మొదలెట్టాడు. "నేను ఇవ్వను పోరా..! నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో" అంటూ గట్టిగా నిలబడ్డాడు ముసలాయన. చాలాసేపు అడుక్కున్న ఆ కుర్రాడు, పక్కనే కానిస్టేబుల్ కూడా ఉండటంతో ఇక డబ్బులు వసూలు చేసుకోవటం సాధ్యం కాదని అర్థం కావడంతో... ఆ ముసలాయనను బెదిరిస్తూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.

జరిగినదంతా చూస్తూ నిల్చున్న మాకు అతనెవరో సరిగా అర్థం కాలేదు. కాసేపటి తరువాత మెల్లిగా ముసలాయన వద్దకు వెళ్ళి.. "ఏం తాతా, ఎవరతను?" అని అడిగాను. "ఆ... ఏం చెప్పమంటావు తల్లీ..! వాడెవరో కాదు, నా కొడుకే. ఇంత వయసు వచ్చినా, పైసా సంపాదన లేదు. పైగా గాలి తిరుగుళ్ళు, త్రాగుడు. ఇందాక నా దగ్గరికి వచ్చి తాగేందుకు 50 రూపాయలు అడిగాడు. నేను ఇవ్వను అన్నందుకే ఇంతగా రాద్దాంతం చేశాడు. అష్టకష్టాలుపడి పెంచాను, ప్రయోజకుడై ఉద్ధరిస్తాడనుకుంటే ఈ రకంగా బాధపెడుతున్నాడు. చూశారు కదా..! ఎంత పెద్దరాయి ఎత్తుకున్నాడు కదా చంపేస్తానని, అంతేగాకుండా ఇంటికి రా తేల్చుకుంటానని బెదిరిస్తూ వెళ్ళాడు..." అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

తాత చెప్పినదంతా విన్న నాకు ఒక్కసారిగా ఇందాక చూసిన అతడి కొడుకుపైన అసహ్యం వేసింది. వయసుడిగిపోయిన ఈ వయసులో ఆ తాత కష్టపడి కుటుంబాన్ని నెట్టుకువస్తుంటే... ఇతగాడు బలాదూర్‌గా తిరగడమేగాకుండా, డబ్బులివ్వనందుకు కొట్టేందుకు వస్తాడా..? ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? అని మనసులోనే తిట్టుకుంటూ... "ఊరుకో తాతా.. అంతా సర్దుకుంటుంది.." అని చెప్పి మళ్ళీ బస్టాప్‌కు వచ్చేశా.

"బస్టాప్‌‌లో నిల్చొని బస్ కోసం చూస్తున్నామేగానీ... తాత గురించిన ఆలోచనలు మాత్రం వదలడం లేదు. ఎంత అన్యాయం... జన్మనిచ్చిన తండ్రినే చంపేస్తానంటూ ఎంత పెద్ద బండరాయి ఎత్తుకున్నాడో చూడు... ఇలాంటివారిని ఏం చేసినా పాపం పోదు. మనచుట్టూ ఇలాంటివాళ్ళు ఉన్నారు కాబట్టే, సినిమాల్లో అలాంటి పాత్రలు పెట్టి తీస్తున్నారని" కోపంగా మా వాడితో అన్నాను.

అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న మా అబ్బాయి అయితే ఒక్కసారిగా విరుచుకుపడుతూ... "నాకే గనుక అధికారం ఉంటే... ముందుగా ఇలాంటి వాళ్ళను, వయసుడిగిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలకు పంపించే వెధవలను షూట్ చేసి పారేస్తానమ్మా..!" అన్నాడు.

ఆ రోజు తరువాత తరచుగా తాత, కొడుకులు అలా రోడ్డుమీద వాదించుకోవటం చాలాసార్లు చూసినా ఏమీ చేయలేకపోయాము. ఈ మధ్యనే ఓ నెలరోజుల ముందు వర్షాలు విపరీతంగా కురిశాయి. రోడ్లు, ఫ్లాట్‌ఫాంలు నీళ్లతో నిండిపోవడంతో ఆ తాత కనిపించలేదు. వర్షాలు తగ్గిపోయి మామూలుగా అయినప్పటికీ... తాత జాడే లేదు.. ఇప్పటికి నెల రోజుల పైనే అయిపోయింది.

ఇంతకీ ఆ తాత... "బలాదూర్‌గా తిరుగుతున్న దుర్మార్గపు కొడుకు చేతిలో బలైపోయాడో? లేదా భారీవర్షాలను సైతం లెక్కచేయకుండా గోనెసంచి కప్పుకుని వ్యాపారం చేసుకునే ఆ పండు ముదుసలికి ఆరోగ్యం సహకరించటం లేదో, ఏమో తెలియదు గానీ.... ఆ తాత అంగడి లేని ఆ బస్టాప్ మాత్రం చాలా వెలితిగా కనబడుతోంది. రోజూ... బస్సు వచ్చే వరకు ఆ తాతను చూసే మా కళ్లకు ఆయన అక్కడున్నట్లే ఉంటోంది... కానీ... ఆయన మాత్రం లేడు. ఇంతకీ ఆ తాత ఏమయ్యాడో... ఏంటో?!

Monday 6 December 2010

నా గుండె గొంతుక మూగ భాషకో రూపం...

కాసేపిలా నా మాటలు వినవా
ప్లీజ్... మళ్లీ ఆ పదం ఎప్పుడూ చెప్పొద్దు
మొదటిసారి నువ్వు నన్ను కలిసిన రోజుల్ని
ఓసారి మళ్లీ గుర్తు తెచ్చుకోవాలనుంది
ఎంతలా మాటల కోసం తపనపడ్డాం
ఎన్ని జ్ఞాపకాలను కలబోసుకున్నాం
ఒక్కసారి గుర్తు తెచ్చుకో
అప్పట్లో నీకు నామీద ఉండే శ్రద్ధని...!

ఇప్పుడు ఆలోచిస్తే ఎంతలా దూరమయ్యాం
ఎంతలా రోదించాను
ప్లీజ్ నన్నాపవద్దు... మాట్లాడవద్దు..
చెప్పేది పూర్తిగా వింటే చాలు
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో
నీకెప్పుడూ అబద్ధాలు చెప్పలేదుగానీ,
ముక్కలు ముక్కలుగా పగిలిపోయిన
నా గుండె గొంతుక మూగ భాషను
మాత్రం ఎప్పుడో చెప్పాను

ఆ గాయం ఉంది చూశావూ...
చాలా పదునైంది, అంతకంటే లోతైంది
భరించలేని బాధతో మనసును మెలిపెట్టేది
సంవత్సరాలుగా ఇలాగే సాగుతూనే ఉంది
ఆ బాధాకర క్షణాలను
లెక్క పెట్టలేనన్ని కన్నీళ్లను
ఎప్పటికీ మర్చిపోలేనేమో..?

అయితే...
ఇప్పుడిప్పుడే జీవితాన్ని మళ్లీ పునర్నిర్మించుకుంటున్నా
గతం తాలూకూ గాయాలు మళ్లీ పునరావృతం కాకుండా
కష్టమైనప్పటికీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నా

గాయాల సంగతి పక్కకు నెట్టేస్తే
నా జీవిత యాత్రలో
మర్చిపోలేని సుగంధానివి
విడదీయరాని అనుభూతివి
పాత గాయాలు కష్టపెట్టినా
నువ్వు ప్రసాదించిన చిన్ని చిన్ని
సంతోషాలను గుర్తు తెచ్చుకుని మరీ
తనివితీరా ఆస్వాదిస్తున్నా....
ఊపిరున్నంతదాకా నిన్ను మరవలేను నేస్తం...!

Saturday 4 December 2010

కాలంతోపాటు గింగిరాలు కొడుతూ...!!

అలారం కూతతో నిద్రకు వీడ్కోలు
ఆవులింతలతో రోజుకు ఆహ్వానం
గోడపైన నవ్వుతూ చూస్తుండే
నామాల స్వామికి హాయ్ చెప్పింది మొదలు…

వంటింటి పాత్రలతో
మొదలవుతుంది
మొట్టమొదటి యుద్ధం
అసలు నడుస్తున్నామా
పరుగెడుతున్నామా
తెలియని అయోమయంలో
గింగిరాలు కొడుతూ…!

తమకంటే వేగంగా
ఆగకుండా పరుగెడుతున్న
గడియారం వైపు గుర్రుగా చూస్తూ…
తిన్నామనిపించి బయటపడతాం

ఇప్పుడిక మరో పోరాటం
సెకన్లు… నిమిషాలు…
వాటి కంటే వేగంగా అడుగులు
సిగ్నల్‌లో బస్సు… ఇటువైపు మనం
అందితే సంతోషం
అందకపోతే నిట్టూర్పు
మళ్లీ ఇంకో బస్సుకై ఆరాటం…!

గమ్యం చేరాక…
కార్యాలయం చేరేందుకు
ఇంకాస్త గాభరా…
అయినా రోడ్డుపైని గుంతలకు
మన గాభరా ఏం తెలుస్తుంది
హాయిగా స్వాగతం చెబుతాయిగానీ

గుంతల స్వాగతాన్నందుకుని
కుంటుతూ మెట్లకు హాయ్ చెప్పి
కార్యాలయంలోకి వెళ్తే…
అప్పుడే మొదలవుతుంది
అసలు సిసలైన యుద్ధం…!!

Friday 3 December 2010

ఏం కొడకా... మాకేమైనా ఇచ్చేదుందా..?

"ఏం కొడకా ఎప్పుడు చూసినా కొత్త బట్టలు వేసుకుని తిరగడమేనా? మాకేమైనా ఇచ్చేదుందా?" అన్న మాటలతో ఉలిక్కిపడి తిరిగి చూశా. ఎదురుగా కట్టెల మోపు దించి, గోడకు ఆనించి, ఆయాసంతో రొప్పుతూ నిల్చోనుంది ఆదెమ్మక్క. "అబ్బా... నువ్వా అక్కా.. ఎవరో అనుకుని కంగారు పడ్డాను అంటూ..." చేతికి నీళ్ల చెంబు అందించాను.

గడగడా నీళ్లు తాగేసి.. "ఇదిగో తల్లీ.. అమ్మ కట్టెలు తెమ్మని డబ్బు ఇచ్చింది. తెచ్చేశాను. ఇక వెళ్ళేదా అంటూ... ఏమ్మా... ఈసారైనా నా కూతురుకు ఓ పావడా గుడ్డ ఇచ్చేది ఉందా? లేదా?" అంది. "లేదక్కా.. ఈసారి తప్పకుండా ఇస్తాను. రాత్రి అమ్మ ఇంటికి రాగానే అడిగి తీసుకుంటాను. రేపు ఇంటికి రా.." అని చెప్పి పంపించేశాను.

ఆదెక్క ఓ దళిత మహిళ. ఆమె మా ఊర్లో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఎక్కడ్నించి, ఎలా వచ్చిందో ఏమో.. చిన్న వయసులోనే మా ఊరికి వచ్చేసింది. నా అనే వారు ఎవరూ లేకపోయినా, ఊర్లో వాళ్లు ఇచ్చే పావలా, అర్ధ సాయంతోనే పెరిగి పెద్దదైంది. ఇక ఆమె యుక్తవయసులోకి వచ్చేటప్పటికి, ఊర్లోని మగరాయుళ్లు... చూడ్డానికి ఓ మోస్తరుగా వయసులో ఉన్న ఆడది, ఏ ఆసరా లేనిది అయిన ఆమెను ఎలా చూడాలో అలాగే చూశారు. ఇది తప్పు అని ఆమెకు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఆమె కూడా అలాగే కొనసాగింది.

కొన్ని రోజుల తరువాత.. ఏ తోడులేని ఒక వయసు మళ్లిన పెద్దాయన ఆదెమ్మను చేరదీసి పెళ్లి చేసుకున్నాడు. ఊర్లోనే ఓ ఇంట్లో వాళ్ళు కాపురం పెట్టారు. ఇకమీదట బుద్ధిగా ఉండాలని నిర్ణయించుకున్న ఆమె కూలీ, నాలీ చేసుకుంటూ భర్తతో ఉండసాగింది. అయితే, ఆమెను తమ కామానికి వాడుకున్న మగరాయుళ్ళు మాత్రం తమ వద్దకు రావాలంటూ వేధించేవాళ్ళు. ఆ ముసలాడు నిన్నేం సుఖపెడతాడంటూ వాళ్ళు చేసే హేళనలకు, వెక్కిరింతలకు కొదవే లేదు. అన్నింటినీ ఆమె ఓర్చుకుంటూ తన దారిన సాగిపోయింది.

ఓ సంవత్సరం తరువాత ఆ ముసలాయన ద్వారా ఆదెమ్మ ఓ పాపకు జన్మనిచ్చింది. తన పాపకు ఆమె గిరిజ అని పేరు పెట్టుకుని ఉన్నంతలో అపురూపంగా చూసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే... నన్ను ఓ పావడా గుడ్డను ఇవ్వమని ఆదెక్క అడిగింది.

గిరిజ పెరిగి పెద్దదయ్యేకొద్దీ, గతంలో తనను చూసిన మగరాయుళ్లు అవే ఆకలి కళ్లతో తన కూతుర్ని కూడా చూడటాన్ని ఆదెమ్మ సహించలేక పోయేది. తన జీవితంలా కూతురి జీవితం పాడు కాకూడదని ఆమె బలంగా అనుకునేది. ఎవడైనా తమ ఇంటివద్దకు వచ్చి తోక జాడిస్తే... నోటితోనే కాకుండా, చేతితో కూడా ఆమె సమాధానం చెప్పేది.

ఎప్పుడూ ఆదెమ్మ చుట్టుప్రక్కల ఇళ్లవారితో.. "నా బ్రతుకు నా కూతురికి రాకూడదు. కూతురిని కాపాడుకునేందుకు చావనైనా చస్తానుగానీ, ఆ రొంపిలోకి దింపనని" చాలా సార్లు అంటుండేది కూడా...!

అదలా ఉంచితే... మరుసటిరోజు బోరింగ్ కాడికి మంచినీళ్లకోసం వచ్చింది ఆదెక్క. నేను కూడా అక్కడే ఉండటంతో... "అక్కా ఓసారి ఇంటికి వచ్చిపో..." అనేసి బిందె నింపుకుని ఇంటికెళ్లాను. నా వెనకే ఆమె కూడా వచ్చింది. "నీకు నచ్చితే తీసుకో, లేకుంటే ఈసారి కొత్త బట్టల జతే ఇస్తాను అని చెప్పి" ఓ కవర్ ఆమె చేతిలో పెట్టాను.

కవర్లో ఉన్న లంగా, జాకెట్, పైట సెట్టును చూసి సంతోషంతో... "బాగున్నాయి కొడకా... నా కూతురుకు ఇవి బాగుంటాయి కదా...! చల్లగా ఉండు తల్లీ..!" అనేసి వెళ్లిపోయింది. నేను కొన్నిరోజులపాటు వాడిన బట్టలను కూడా అంత ఆనందంగా కూతురు కోసం పట్టుకెళ్తోన్న ఆమె కంటే, ఆమెలోని అమ్మతనం నన్ను బాగా కదిలించి సన్నని నీటితెర నా కళ్లను కమ్మేసింది.

కొన్ని రోజుల తరువాత.. మా ఊర్లో గంగమ్మ తిరనాల జరుగుతోంది. ఆ తిరనాల సమయంలో ఒక రాత్రి, ఒక పగలు ఊరంతా కోలాహలంగా ఉంటుంది. ఆ రోజు కూడా ఎప్పట్లా రాత్రి గడచిపోయి, పొద్దున్నే తెల్లవారింది. ఏటిదాకా ఫ్రెండ్స్‌తో వెళ్ళిన మా తమ్ముళ్ళు గాబరాగా పరుగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమయ్యిందిరా అంటే.. "ఆదెమ్మక్కను ఎవరో చంపేసి నీళ్లలో పడేసారు" అని చెప్పారు.

అమ్మా, నాన్న రావద్దని వారిస్తున్నా వినకుండా అందరితో పాటు ఆదెక్కను చూసేందుకు వెళ్ళాను. ఏటి ఒడ్డున పొలాల్లో, ఓ నీటిమడుగులో బొక్కాబోర్లా పడిపోయి ఉందామె. కాస్త పక్కగా ఆమె కట్టుకున్న చీర... పువ్వులు... పగిలిపోయిన గాజు ముక్కలు... పెనుగులాడిన గుర్తులు స్పష్టంగా తెలుస్తున్నాయి.

ఎప్పుడు చూసినా అరే, కొడకా, తల్లీ అంటూ ప్రేమగా పిలిచే ఆదెమ్మక్కను అలా చూడగానే నాకు ఏడుపు ఆగలేదు. భోరుమని ఏడ్చేశాను. అన్నింటికంటే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ బాధించేది ఏంటంటే... ఆరోజు ఆదెమ్మక్క శవంగా తేలాడుతున్నప్పుడు ఒంటిపైనుండే జాకెట్, చీర లోపల కట్టుకున్న పావడా... "ఆమె నా దగ్గర కొట్లాడి మరీ కూతురు కోసం తీసుకుంది కదా.. అవే బట్టలతో ఆమెనలా చూడాల్సి రావడం..." ఇవన్నీ తల్చుకుంటే మనసు కలుక్కుమంటుంది.

పోలీసులు రావడం, పోస్ట్‌మార్టం చేసి ఆదెక్క శవాన్ని ఇవ్వడం జరిగిపోయాయి. అయితే చేతిలో చిల్లిగవ్వలేని ఆదెక్క భర్త, కూతురు ఏం చేస్తారు. ఊరి చివర గానుగ చింతమాను వద్ద శవాన్ని పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. ఆమె బ్రతికుండగా, ఆమె చేత ఎన్నో పనులు చేయించుకున్న ఊరి జనాలంతా... చూసి అయ్యో అన్నారే తప్ప.. ఆమె దహన సంస్కారాల కోసం పావలా సాయం కూడా చేయలేదు.

మా అమ్మా వాళ్లకు కూడా అప్పట్లో అంత స్తోమత లేదు. నేనేమో చిన్నదాన్ని చూస్తూ ఏడ్వటం తప్ప ఏమీ చేయలేకపోయాను. చివరకు పంచాయితీ వాళ్లే ఆదెక్క శవాన్ని పూడ్చిపెట్టారు. ఊర్లో వాళ్ళంతా తలా ఐదో, పదో వేసుకుని ఉంటే... ఆమె దహన సంస్కారాలు అయినా జరిగి ఉండేవి, ఆమె ఆత్మ శాంతించేది కదా...! కన్నీళ్లను కార్చిన జనాలకు కాస్తంత కనికరం కూడా లేకపోయిందే అని అనుకోని రోజు లేదంటే నమ్మండి.

ఆ తరువాత కాలంతో పాటు కదిలిపోయిన నేను... ఈ మధ్యనే మా ఊరికి వెళ్ళాను. ఎందుకోగానీ ఆదెక్క గుర్తొచ్చి, "అమ్మా... గిరిజ ఏమయ్యింది?" అని అడిగాను. "ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యమో, ఆదెమ్మ చేసిన పుణ్యమోగానీ.. ఇద్దరు పిల్లలు, భర్తతో హాయిగా కాపురం చేసుకుంటోంది" అని అమ్మ చెప్పింది.

ఆదెక్కను ఎందుకు చంపేశారో ఇప్పటికీ తెలియకపోయినా, కూతురి గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు తిరగబడి ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకునే ఆమెను హత్య చేసి ఉంటారని అప్పట్లో ఊరంతా అనుకునేవారు. చివరకు ఆమె ఎప్పుడూ చెప్పేటట్లుగానే కూతురి కోసం తన ప్రాణాలనే వదిలేసి మాట నిలబెట్టుకుంది.

ఈ సంఘటన జరిగి ఇప్పటికి ఇంచుమించు 15 సంవత్సరాలు కావస్తున్నా... ఇప్పటికీ ఆదెక్క మరణం నన్ను కలచి వేస్తుంటుంది. కూతురి బ్రతుకు తనలాగా కాకూడదని కోరుకున్న ఆమె కన్న కలలు నిజమయ్యాయి. భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటోన్న కూతురి కాపురాన్ని పైనుంచి చూస్తూ.. ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది.

ఏం కొడకా... మాకేమైనా ఇచ్చేదుందా? ఆదెక్క తన జీవితంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. ఆదెక్కలు, ఇలాంటి తల్లుల కూతుళ్లు లెక్కలేనంతమందే ఉన్నారు మన మధ్యలో.. నిజంగా.. మనం వాళ్లకేమయినా ఇచ్చేదుందా...?!

Wednesday 1 December 2010

"నవ్వు"ను మించిన ఆభరణం

ప్రతిరోజూ ఏదో ఒకటి రాద్దామనుకుంటూనే ఉన్నా, కాస్తంత బిజీగా ఉండటం వల్ల ఏ రోజుకారోజు అలా వాయిదా పడుతూనే ఉంది. ఈరోజు మాత్రం కాస్తంత తీరిక చేసుకుని... రెండు రోజులుగా నా మనసులో మెదలుతోన్న ఒక విషయం గురించి నాలుగు మాటలు రాయాలనే ఈ ప్రయత్నం...

ప్రతిరోజూ మేం ఆఫీసుకు వెళ్లే బస్సు ఎక్కాము. రోజులాగే ఆరోజు కూడా ఓ చిరునవ్వుతో కూడిన పలకరింపు ఒకటి ఎదురైంది. ఆ పలకరింపులోని చిరునవ్వులో ఏ మాత్రం తేడా లేదు గానీ, మనిషిలోనే ఏదో తేడా ఉంది. అదేంటో తెలియటం లేదు, కానీ తేడా మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

ఓ మధ్య వయస్కుడైన ఆ వ్యక్తి మేం ప్రతిరోజూ వెళ్లే బస్సులో కండక్టర్. సహజంగా చాలా మంది కండక్టర్లకులాగా చిరాకుపడే మనస్తత్వం కాదు అతడిది. ఎప్పుడూ నిండు కుండలాగా, తొణకని చిరునవ్వుతో, శాంతమూర్తిలాగా, ప్రశాంతంగా.. తనపని తను చేసుకుపోతుంటాడు.

ప్రతిరోజూ బస్సులో వెళ్తున్న మమ్మల్ని ఎన్నిరోజుల నుండీ గమనిస్తున్నాడో ఏమో ఆయన.. ఒకరోజు మేము బస్సెక్కి కూర్చుని డబ్బు ఇవ్వకుండా, స్టాఫింగ్ చెప్పకుండానే టిక్కెట్లు ఇచ్చేసి వెళ్లిపోయాడు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేమూ ప్రతిరోజు తనను చూస్తున్నప్పటికీ ఆ ఇంతమంది ఎక్కుతూ, దిగుతూ ఉంటారు.. మేమెందుకు ఆయనకు గుర్తుంటాం అనుకున్నాం. కానీ ఆయన దానికి భిన్నంగా ఓ చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్లిపోయాడు.

ఇక అప్పట్నించీ ఆయనతో మాకు పరిచయం ఏర్పడింది. బస్సెక్కగానే ఓ చిరునవ్వుతో కూడిన పలకరింపు, మాలో ఏ ఒక్కరు రాకపోయినా వాళ్లెమయ్యారు అంటూ కాస్తంత పరామర్శ మామూలైపోయింది. ఆరోజు కూడా పలకరింపు, పరామర్శ అయిన తరువాత ఆయనలో ఏదో తేడా ఉందే అనుకుంటూ నేను, మా అబ్బాయి ఆలోచనలో పడిపోయాము.

కాసేపటి తరువాత ఆ... గుర్తొచ్చిందమ్మా..! ఆయన చేతికి ఉండే లావాటి బ్రాస్‌లెట్ లేదు. చేయి బోసిగా ఉంది. అలాగే మెడలో ఉండే లావాటి బంగారు చైన్లు కాస్తా సన్నగా ఉన్నాయి... అన్నాడు మావాడు. అప్పుడు నేను మళ్లీ వెనక్కి తిరిగి ఆయన్ని చూసి, నిజమేరా..! అన్నాను.

ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవడం అటుంచి, ఆయనంటే మాకు కూడా కాస్తంత ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఎందుకంటే, ప్రతిరోజూ సిటీ బస్సుల్లో తిరుగుతున్నప్పుడు రకరకాల కండక్టర్లను చూశాము. విసుక్కునేవారిని, చిరాకు పడేవారిని, వెకిలిగా ప్రవర్తించే వాళ్లను ఇలా చాలామందిని చూశాం. కానీ వాళ్లందరికంటే కాస్తంత భిన్నంగా, శాంతంగా కనిపించే ఈయనంటే మాకు కొంచెం అభిమానం ఏర్పడింది.

ఇక మా వాడికయితే... ఆయన చిరునవ్వు, శాంత స్వభావం అన్నింటికంటే... ఆయన వేసుకునే బంగారు నగలు (చైన్, బ్రాస్‌లెట్, ఉంగరాలు) అంటే భలే ఇష్టం (మా వాడికి కూడా కాస్త బంగారు నగల పిచ్చిలెండి). బస్సెక్కగానే ఆయన్ని పలకరించటం, దిగేటప్పుడు టాటా చెప్పి దిగటం వాడికి బాగా అలవాటు.

ఆ కండక్టర్‌ చేయి ఆరోజే కాదు, మరికొన్ని రోజుల దాకా కూడా బోసిగానే ఉంది. మెడలో చైన్లు కూడా మెల్లి, మెల్లిగా రెండు కాస్తా ఒకటైంది. ఒకరోజు మా వాడు బాధపడుతూ... పాపం ఏం కష్టమొచ్చిందో, ఏంటో కదమ్మా...! నగలను తాకట్టు పెట్టడమో, అమ్మటమో చేసి ఉంటాడాయన.. అన్నాడు.

అవును. కష్టాలు మనుషులకు కాక, మాన్లకు వస్తాయా చెప్పు... కష్టాలు ఎవరికైనా సహజమే.. ధర్మరాజు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు కదా నాన్నా అన్నాను. అది సరే అమ్మా..! ఆయన ఆర్థికంగా ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థమవుతోంది. అయినా కూడా ఆయనలోని నవ్వు ఏ మాత్రం మారలేదు కదమ్మా..! అంటూ ఆ కండక్టర్ వైపు ఆప్యాయంగా చూశాడు మావాడు.

అవును నాన్నా...! నగలు, డబ్బు, ఆస్తిపాస్తులు, సంపద అన్నీ ఈరోజు మన దగ్గర ఉంటాయి. రేపు మనతో ఉంటాయో, ఉండవో చెప్పలేము. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఏమోగానీ... ఎప్పటికీ మారని ఆభరణమూ, మనతో ఎల్లకాలాల్లోనూ అట్టిపెట్టుకుని ఉండేది మన నవ్వే కదా...! నిజంగా నవ్వును మించిన ఆభరణం మనిషికి మరొకటి అవసరమా అనిపిస్తుంది ఆయనను చూస్తే...!!