అలారం కూతతో నిద్రకు వీడ్కోలు
ఆవులింతలతో రోజుకు ఆహ్వానం
గోడపైన నవ్వుతూ చూస్తుండే
నామాల స్వామికి హాయ్ చెప్పింది మొదలు…
వంటింటి పాత్రలతో
మొదలవుతుంది
మొట్టమొదటి యుద్ధం
అసలు నడుస్తున్నామా
పరుగెడుతున్నామా
తెలియని అయోమయంలో
గింగిరాలు కొడుతూ…!
తమకంటే వేగంగా
ఆగకుండా పరుగెడుతున్న
గడియారం వైపు గుర్రుగా చూస్తూ…
తిన్నామనిపించి బయటపడతాం
ఇప్పుడిక మరో పోరాటం
సెకన్లు… నిమిషాలు…
వాటి కంటే వేగంగా అడుగులు
సిగ్నల్‌లో బస్సు… ఇటువైపు మనం
అందితే సంతోషం
అందకపోతే నిట్టూర్పు
మళ్లీ ఇంకో బస్సుకై ఆరాటం…!
గమ్యం చేరాక…
కార్యాలయం చేరేందుకు
ఇంకాస్త గాభరా…
అయినా రోడ్డుపైని గుంతలకు
మన గాభరా ఏం తెలుస్తుంది
హాయిగా స్వాగతం చెబుతాయిగానీ
గుంతల స్వాగతాన్నందుకుని
కుంటుతూ మెట్లకు హాయ్ చెప్పి
కార్యాలయంలోకి వెళ్తే…
అప్పుడే మొదలవుతుంది
అసలు సిసలైన యుద్ధం…!!
శిఖరం
20 hours ago
2 comments:
చాలా బాగా రాస్తున్నారు, వచనమైనా పద్యమైనా.
అభినందనలు
చాలా సంతోషం సర్...
Post a Comment